"అస్సల మీరు (మీడియా) సెట్ అయితే అంతా సెట్ అవ్వుద్ది"---మంత్రి బొత్స సత్యనారాయణ
"మీడియా మాకు రక్షణ వలయంగా పనిచేసింది"--గాయకుడు గద్దర్
"మీడియా కూడా సంయమనం పాటించాలి. ప్రొఫెషేనల్ రిస్క్ తీసుకోవడం మీ ఇష్టం"--ఇన్ స్పెక్టర్ జనరల్ అనూరాధ
-----ఇలా ఎందరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేసినా...తాజా ప్రత్యేక తెలంగాణా పోరాటంలో మీడియా కీలక పాత్ర పోషించింది. పదికి పైగా టీ.వీ.ఛానెల్స్, అర డజనుకు పైగా పెద్ద తెలుగు పత్రికలు ఉద్యమానికి విపరీతమైన కవరేజ్ ఇచ్చాయి.
పెద్దగా ప్రొఫెషనలిజం లేని ఆంధ్ర ప్రాంతపు పెట్టుబడిదారుల చేతుల్లోనే ప్రధాన మీడియా హౌస్ లు ఉన్నప్పటికీ...ఉద్యమానికి ఇంత విస్తృత కవరేజి లభించడం విశేషం. తాజా సమాచారం కోసం ప్రజలు పత్రికల మీద కన్నా...టీ.వీ.ఛానెల్స్ మీదనే ఎక్కువ ఆధారపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా..తెలంగాణపై చర్చ జరగడానికి మీడియా కవరేజ్ దోహదపడింది.
కవరేజ్ విషయంలో ఎక్కువ సందర్భాలలో ఎలాంటి పక్షపాతం లేకుండా...సంఘటన/ పరిణామం ప్రజలకు అందివ్వడానికి ఛానెల్స్ కృషి చేసాయంటే...వాటిని నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ జర్నలిస్టులే కారణం.
ఉద్యమానికి చాలా అనుకూలంగా పనిచేసిన లేదా విస్తృత కవరేజ్ ఇచ్చిన ఛానెల్స్ ఏవి అంటే...HM-టీవీ, Zee- 24 gantalu అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
హెచ్.ఎం.--టీ.వీ. లో తెర మీద సీనియర్ జర్నలిస్టులు పెద్దగా కనిపించకపోయినా...కుర్ర జర్నలిస్టులు చాలా ఉత్సాహంగా పనిచేసారు. వారిలో ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. కనిపిస్తున్న సంఘటనల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చి వారు వ్యవహరించారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయం సంఘటనలను కవర్ చేసిన ఒక మహిళా జర్నలిస్టు అరుణ గారు..."ఏ.పీ.బర్ఖా దత్" అనిపించారు. బుర్ర లేకపోయినా...అందం, వయసు ఉన్న ఆడపిల్లలు దొరికితే చాలు...వారిని జర్నలిస్టులను చేయవచ్చు అన్న తప్పుడు అభిప్రాయం ఉన్న ఇతర ఛానెల్స్ సీ.ఈ.ఓ.లకు ఆమె ఒక చెంపపెట్టు.
H.M.-TV కి సారధ్యం వహిస్తున్న రామచంద్ర మూర్తి గారు కూడా ఎలాంటి ఉద్వేగాలు లేకుండా...చక్కని చర్చలు నిర్వహించారు. సరళమైన ప్రశ్నలు అడిగారు. సమస్య పరిష్కారం కోసం ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి గా ముందుకు కదలటం అభినందనీయం. ఈ ఛానల్ లో కిరణ్ యాంకర్లు అన్ని ఛానెల్స్ కు చాలా మిన్నగా వ్యవహరించారు.
రెండు, మూడు జిల్లాలను కుదిపిన వరదల విషయంలో, సినిమా వాళ్ళతో కలిసి ర్యాలీలు నిర్వహించడంలో, విరాళాలు వసూలు చేయడంలో బహు ప్రసంశనీయంగా వ్యవహరించిన TV-9 సారధి రవి ప్రకాష్ రాష్ట్రం రగిలిపోతున్నప్పటికీ పెద్దగా చప్పిడి చేయలేదు. నిజానికి ఇలాంటి అంశాలపై స్పందించే గుణం రవికి వుంది. 'సై ఆంధ్ర' అన్న చర్చలో జరిగిన రచ్చను రవి ప్రకాష్ మర్నాడు జరిపిన ఒక చర్చలో సవరించారు. తెలంగాణా ప్రజల ఉద్యమానికి మద్దతు కూడా ప్రకటించారు.
ఖమ్మంలో కే.సీ.ఆర్.పళ్ళరసం (ఆ పార్టీ భాషలో రంగునీల్లు) తాగగానే...ఆ విజువల్ ను పదేపదే చూపడం, పలు రకాల ప్రశ్నలతో వెంటనే గద్దర్ ను రంగంలోకి దింపడం...ఉద్యమానికి TV-9 చేసిన మేలుగా చెప్పుకోవాలి. నిమ్స్ లో పరిణామాలను కవర్ చేసిన TV-9 విలేకరి చైతన్య, వారి వరంగల్ విలేకరి రమేష్ లకు ఈ ఉద్యమం ఒక అనుభూతి ఇచ్చి ఉంటుంది.
తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న Zee- 24 gantalu కూడా ఉద్యమానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. పోలీసుల అతిని తీవ్రంగా దుయ్యబట్టిన ఛానెల్స్ లో ఇది ప్రముఖమైనది. ఈ ఛానల్ విజువల్స్ లో నాణ్యత కొరవడినా...కంటెంట్ ఆలోచింపజేసేదిగా ఉంది. శైలేష్ తో పాటు, కృష్ణ చక్కని విశ్లేషణలను అందించారు. కృష్ణకు ఢిల్లీ లో పనిచేసిన అనుభవం పనికివచ్చింది.
తెలుగులో చాలా రోజులు హవా కొనసాగించిన ఈ-టీ.వీ. 'మ్యాటర్ అఫ్ ఫ్యాక్ట్' రిపోర్టింగ్ కు పరిమితం అయ్యింది. ఇది చాలా సున్నితమైన విషయం అని కాబోలు...దీనిపై పెద్దగా చర్చలు, హడావుడి చేయలేదు. ఉద్యమంపై ఈ మీడియా గ్రూపు ఒక స్టాండ్ తీసుకోకుండా...నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు యత్నించింది. అలాగని...ఛానల్ ప్రధాన ఘట్టాలను మిస్ కాలేదు.
'ABN-ఆంధ్రజ్యోతి' ఉద్యమాన్ని ఎలా కవర్ చేసిందీ తెలియరాలేదు. "సాక్షి" ఛానల్ పూర్తిగా విధ్వంసకాండ పై దృష్టి పెట్టిందేమో అని నాకు అనిపించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు మరణించిన 100 రోజుల లోపు కే.సీ.ఆర్. కేంద్రం మెడలు వంచారు. అయినా...ఆ దుగ్ధ కనిపించకుండా...'సాక్షి' ప్రతి సంఘటననూ ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అందించింది. ఈ ఛానల్ లో మేథోపరమైన చర్చలు పెద్దగా కనిపించలేదు. అలాగని అద్భుతమైన రిపోర్టింగ్ లేదు.
ఇక...దక్షిణ తెలంగాణా అయిన ఖమ్మం జిల్లా కు చెందిన నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV కూడా కొంత సంయమనం పాటించింది. అక్కడ పెద్ద పదవులలో ఉన్న జర్నలిస్టులలో చాలా మంది భౌగోళికంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారైనా...వారు ప్రొఫెషనల్స్. పదకొండు రోజుల కవరేజ్ చూస్తే...వారి గోడ మీది పిల్లి వాటం ధోరణి కనిపిస్తుంది. ఉద్యమానికి వ్యతిరేకంగా..రెండు మూడు రోజులు కొన్ని కథనాలు కనిపించినా...తర్వాత..ఆచి తూచి వ్యవహరించింది ఆ ఛానల్. ఈ ఛానల్ బ్యూరో చీఫ్ గా ఉన్న "వాడి వేడి ప్రశ్నల వీరుడు" డి.రామచంద్ర ఈ ఉద్యమం అందించిన ఒక అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారేమో! చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆలోచింపజేసే చర్చలు నిర్వహించి ఆ లోటును కొంత పూడ్చారు.
TV-5 లో వెంకట కృష్ణ, i-news రవి లు స్టూడియో లకు పరిమితం అయినా...చర్చల నిర్వహణలో పరిణతి కనబరిచారు. సంగప్ప, క్రాంతి, రమ తదితరులు ఐ-న్యూస్ లో ఫీల్డు నుంచి విశ్లేషణలు అందించారు. Maha-TV లో ఐ.వెంకట్రావు గారు తన అనుభవంతో మంచి చర్చలు జరిపారు. i-news లో ఈ మధ్యనే చేరిన కందుల రమేష్ ఇంకా తెర మీదికి రావడం లేడు. ఉద్యమ సమయంలో ఆయన చర్చలలో కనిపిస్తారనుకున్నా అది నిజం కాలేదు.
ఈ ఛానెల్స్ ఢిల్లీ రిపోర్టర్లు కూడా తమ సత్తా చాటారు. మొత్తం మీద...గద్దర్, ఘంట చక్రపాణి, ప్రకాష్, వసంత నాగేశ్వర రావు, శ్రీనివాస రావు, టీ.జీ.వెంకటేష్, పొత్తూరి వెంకటేశ్వర రావు గార్లు రోజూ బుల్లి తెర మీద కనిపించారు.
ఆంగ్ల పత్రికలలో...'ది హిందూ' సహజ శైలిలో జాగ్రత్తగా వ్యవహరిస్తే..రూల్స్ గీల్స్ ఏమీ లేని పేపర్ గా అపకీర్తి మూటగట్టుకున్న 'టైమ్స్ అఫ్ ఇండియా' చెత్త జర్నలిజానికి పాల్పడిందన్న ఆరోపణ వినిపించింది. "రెసిడెంట్ ఎడిటర్ గారి పిచ్చి పిచ్చి ఊహలు, తిక్క తిక్క విశ్లేషణలు ఉద్యమ వార్తలలో చోటు చేసుకున్నాయి," అని ఒక పాత్రికేయుడు చెప్పాడు.
తెలంగాణా ఉద్యమంతో పాటు, ఆంధ్ర వాసుల గళం కూడా వినిపించి...ప్రజలు ఒక అభిప్రాయానికి రావడానికి తోడ్పడిన జర్నలిస్టులు, పోలీసుల లాఠీలకు వెరవకుండా...ధైర్యంగా బాధ్యతలు నిర్వహించిన కెమెరామెన్ ఎంతైనా అభినందనీయులు. ఇప్పుడు ఊపు అందుకున్న ఆంధ్రా, రాయలసీమ ఉద్యమాన్ని కావాలని తొక్కిపట్టకుండా...మీడియా అంతే బాధ్యతాయుతంగా...అక్కడి ప్రజల మనోభావాలను సైతం వినిపించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిరూపించుకోవాలని ఆశిద్దాం.