ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ కార్మికులు శనివారం నాడు సమ్మె బాట పట్టారు. జీతాలు పెంచకుండా... తమను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేందుకు యాజమాన్యం కుతంత్రం పన్నుతోందని ఆరోపిస్తూ... కొన్ని యూనిట్లలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగినట్లు సమాచారం. నోటీసు గట్రా ఏమీ లేకపోయినా... పని చేయకుండా తమ నిరసన తెలుపుతున్నట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన (గురువారం) ఒక మూడు యూనిట్లట్లో నిరసన గళం వినిపించిన కార్మికులు... దసరా పండగ సందర్భంగా ఆఫీసుకు శలవు కాబట్టి...మర్నాడైన (శనివారం) నాడు ఈ కార్యక్రమం చేపట్టారు.
తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని, రేపు మీ గతి కూడా ఇంతేనని మిషన్ సెక్షన్ కార్మికులు 'ఈనాడు'లో వివిధ సెక్షన్ల ఉద్యోగులను అభ్యర్ధిస్తున్నారు. అయితే, మిగతా జనాల హక్కుల గురించి వీర విప్లవ సాహిత్యంలో కాపీ కొట్టిన పదాలతో అందమైన శీర్షికలు, లీడ్ లు రాసే జర్నలిస్టులు చాలా మంది అంటీ ముట్టకుండా ఉన్నారని సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. కానీ, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కరీంనగర్ లలో ఉద్యోగులు కొందరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.
తమ పని గంటలను ఎనిమిది నుంచి ఐదుకు తగ్గించిన యాజమాన్యం... అలవెన్సులపై కోత వేసిందని, కాంట్రాక్టు లేబర్ గా తమను మార్చేందుకు కుయుక్తులు పన్నుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ రోజుకు మెషిన్స్ ఆన్ చేయబోమని కార్మికులు ప్రకటించగా... వారితో యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు జర్నలిజం లో ఒక అద్భుతమైన సంచలనం గా చెప్పుకోదగ్గ 'ఈనాడు' లో పరిస్థితులు సత్వరం సద్దుమణిగి... ప్రజల పక్షాన పోరాడే పత్రికగా అది వెలుగొందాలని కోరుకుందాం.