Saturday, October 22, 2022
మునుగోడులో 5 W, 1 H లెక్కే వేరు షా...మీ!
మిత్రులారా... నమస్తే,
నేను ఈ నెల 8 వ తేదీ నుంచి 'ఆరామ్ సే' పేరులో వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, క్రీడాంశాలపై క్విక్ ఎడిట్స్ శీర్షికన కామెంటరీ రాస్తున్నాను. ఒక నిమిషంలో చదివేలా సంక్షిప్తంగా, సూటిగా, నిష్పాక్షికంగా ఉండడం దాని ప్రత్యేకత.
సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయోగం ఇది. ఇకపై వాటిని మీతో ఈ బ్లాగ్ లో కూడా పంచుకుంటాను.
రాము
Saturday, October 1, 2022
ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: 'వీక్షణం' ఎడిటర్ ఎన్.వేణుగోపాల్
కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్నినింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ మీడియాగా ప్రఖ్యాతి పొందిన 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు.
మార్క్సిస్టు భావజాల వ్యాప్తి ధ్యేయంగా పెట్టుకున్న 'దారిదీపం' మాసపత్రికను శనివారం (అక్టోబర్ 1, 2022) సాయంత్రం జూమ్ సమావేశంలో వేణుగోపాల్ ఆవిష్కరించి ప్రసంగించారు. 'పత్రికలు-సామాజిక చైతన్యం' అనే అంశంపై అయన మాట్లాడుతూ ఈ శీర్షికలో ఉన్న రెండు పదాలూ (పత్రికలూ, సామాజిక చైతన్యం) దుష్ట సమాసంగా, విరోధ భాసలా ఇప్పుడున్నాయని అయనఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే అని స్పష్టం చేశారు.
1984లో తను జర్నలిజం లోకి అడుగుపెట్టినప్పుడు 'ఆబ్జెక్టివ్ న్యూట్రాలిటీ' ముఖ్యమని జర్నలిజం మొదటి క్లాసులో హితవుగా చెప్పేవారని, ఇప్పుడు అది ఆవిరైపోయింది వేణుగోపాల్ చెప్పారు. వార్త లో ఉండాల్సిన 5 డబ్ల్యూ, 1 హెచ్ సూత్రంలో ముఖ్యమైన 'ఎందుకు' అన్న ప్రశ్నకు తావులేకుండా పత్రికలు వార్తలు నింపుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 1955 ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన తెలుగు పత్రికల వైఖరి చూసి 'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు-పత్రికలు' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని అయన గుర్తుచేశారు. 1960 నుంచి 80 వరకూ సామాజిక చైతన్యం కొద్దోగొప్పో ఉన్నా, 1990 నుంచి మూడు దశాబ్దాలుగా తిరోగమన పథంలో పత్రికలు పయనిస్తున్నాయని చెప్పారు.
ప్రపంచీకరణ తర్వాత తిరోగమనంలో పత్రికల ప్రయాణం సాగుతున్నదని, ప్రగతిశీలభావాలు ఉండడం చాదస్తం గా పరిగణింపబడుతున్నదని చెప్పారు. 'న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, నాట్ ఏ సోషల్ సర్వీస్' అని వక్కాణించిన తాను పనిచేసిన పత్రిక యజమాని మాటలు ఉటంకిస్తూ-రెండు రాష్ట్రాల్లో తెలుగు పత్రికల ధోరణులను ప్రస్తావించారు. "ఏదైనా ఒక పత్రిక చదివితే వాస్తవం తెలియదు. ప్రతి ఒక్కరు రెండో మూడో పత్రికలు చదివి బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల కొందరు పత్రికలు చదవడం మానేశారు," అని వేణుగోపాల్ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ ఒక 'మాదక ద్రవ్యం' అనీ, తర్వాత విజృంభించిన సాంకేతిక పరిజ్ఞానం మేలు-కీడుల కలయిక అన్నారు. "టెక్నాలజీ వచ్చి రచనను ప్రజాస్వామీకరించి మేలు చేసింది. కానీ అనియంత్రింత వ్యక్తీకరణ వల్ల కీడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వెబ్ లో అబద్ధాలపై బాగా వెచ్చిస్తూ పెద్ద పెద్ద కార్యాలయాలను నెలకొల్పడంతో మహా సముద్రంలో గుక్కెడు మంచినీళ్లు దొరకని నావికుడికిలా పాఠకుడయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నిరంతర వార్తా స్రవంతిలో మొత్తం మురికినీరేనన్నారు.
రెండు దశాబ్దాలుగా తాము ఎన్నో ఒడిదొడుకుల మధ్య నిర్వహిస్తున్న 'వీక్షణం' పత్రికకు ఉన్న మూడు లక్ష్యాలను (1. ప్రధాన వార్తా స్రవంతి లో వస్తున్న వార్తల వెనుక ప్రజా కోణాలు ప్రస్తావించడం 2. ప్రచార సాధనాల మౌనం వహిస్తున్న, విస్మరిస్తున్న ప్రజాకోణాలు చర్చించడం 3) సామాజిక ఘటనలను అర్థం చేసుకోనేలా ప్రజలకు దృక్పథం ఇవ్వడం) వివరించారు. “A good newspaper is a nation talking to itself” అన్న Arthur Miller ను కోట్ చేస్తూ- తప్పుడు చైతన్యాన్ని ప్రతిఘటించడం ఎలా? అన్నది సత్యానంతర యుగంలో పెద్ద సవాలన్నారు.
యాజమాన్యపు కేంద్రీకరణ దుష్ప్రభావాన్ని వివరిస్తూ--90 శాతం మీడియా కేవలంనలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతిలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. విష విద్వేష భావజాలాన్ని పెంచుతున్న, పంచుతున్న సంఘ్ పరివార్ కమ్మేస్తున్న కారుచీకటిలో 'దారిదీపం' వెలుగు దివ్వె కావాలన్న అభిలాషను వెలిబుచ్చారు.
Karl Marx ఫ్రీ ప్రెస్ గురించి చెప్పిన ఈ కింది ఒక మంచి మాటతో వేణుగోపాల్ ప్రసంగం ముగిసింది.
‘‘The free Press is the ubiquitous vigilant eye of a people’s soul, the embodiment of a people’s faith in itself, the eloquent link that connects the individual with the State and the world, the embodied culture that transforms material struggles into intellectual struggles and idealises their crude material form. It is a people’s frank confession to itself… It is the spiritual mirror in which a people can see itself… It is the spirit of the State, which can be delivered into every cottage, cheaper than coal gas. It is all-sided, ubiquitous, omniscient.”
విశాలాంధ్ర ఎడిటర్, ఆర్వీ రామారావు మాట్లాడుతూ సమాచారానికి, వ్యాఖ్యకు మధ్య రేఖ చెరిగిపోయింది చెప్పారు. గతంలో 'జాతీయ స్ఫూర్తి' అనే పత్రికను విజయవంతంగా నడిపి, ఇప్పుడు 'దారిదీపం' సంపాదకుడిగా ఉన్న డీవీవీఎస్ వర్మ ప్రసంగించారు.
లక్ష్మణ మూర్తి సార్ కు అశ్రు-అక్షర నివాళి
అది 1989 వ సంవత్సరం.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ మూడో లైన్.
వీధి ఆరంభంలో మేము అద్దెకు ఉండేవాళ్ళం.
వీధి చివర్లో ఉన్న ఇంట్లో లక్ష్మణ మూర్తి గారు ఉండేవారు.
వారు ప్రభుత్వ లెక్చరర్. ఇంగ్లీష్ బాగా చెప్పేవారు.
ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా మాట్లాడేవారు.
ప్రతి పదం స్పష్టంగా, విషయం విశదీకరించి మాట్లాడడం వారి ప్రత్యేకత.
ఎవరినైనా ఇంటి పేరుతో సహా నోరారా పిలిచేవారు.
లక్ష్మణ మూర్తి గారి కుటుంబం ప్రత్యేకమైనది.
సార్ బాల్యం కష్టాలతో కూడినందనుకుంటా.
ఆ కష్టం ఎవ్వరికి వచ్చినా అండగా నిలబడేవారు.
వారిని నేను ఎప్పుడూ సార్ అనే అనేవాడ్ని.
మా అన్నయ్య, తమ్ముడు మామయ్య గారు అనేవారు.
దానికి ఒక కారణం ఉంది. చివర్లో చెబుతాను.
సార్ సతీమణి భారతి అత్తయ్య గారు గొప్ప మనసున్న మనిషి.
వీధిలో ఉండే దాదాపు డజను మంది పిల్లలను సొంత పిల్లల్లా చూసుకునేవారు.
వారి వంటిల్లు ఎవరి కోసమైనా తెరిచి ఉండేది.
గట్టు గోపాలకృష్ణ గారనే కమ్యూనిస్టు యోధుడి కూతురు.
నిజంగా మహా తల్లి. చేతులెత్తి దండం పెట్టవచ్చు.
నవ్వుతూ గలగలా మాట్లాడడం ఆమెఅలవాటు.
అమాయకత్వం, భోళాతనం కలబోత.
సార్, అత్తయ్య గారు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉండేది.
ఎంత పరాచికంగా, హాస్యంగా మాట్లాడేవారో!
చిలకాగోరింకల్లా ఉండేవారు.
సార్ కాస్త తగ్గినట్లు నటించి మాట్లాడేవారు.
ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు.
అందరికీ వారు ఆప్యాయత, ప్రేమలు మాత్రమే పంచారు.
వారి ఇల్లు మా అందిరికీ ఒక పెద్ద అడ్డా, ఒక కోలాహలం.
అక్కడ ట్యూషన్ చదువుకోడానికి చాలామంది వచ్చేవారు.
తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫణి కుమార్ ను ఇంట్లో ఉంచుకున్నారు.
కన్న కొడుకులా చూసుకున్నారు, కల్మషం లేకుండా.
గోపాల కృష్ణ గారి మనమడూ అక్కడే చదువుకున్నాడు.
ఎవరెవరికో ఆశ్రయం ఇచ్చేవారా దంపతులు.
పిల్లలూ వారితో తోబుట్టువుల్లా ఉండేవారు.
ఎవరైనా వచ్చి మేము ఇక్కడ ఉంటామంటే వారిద్దరూవద్దనలేరు.
ఈ రోజుల్లో ఇది కనీసం ఊహించగలమా?
సార్ ప్రేమ పంచిన శిష్యులుపెద్ద సంఖ్యలో ఉన్నారు.
వారి పెద్దబ్బాయి మూర్తి. సింగరేణిలో అధికారి.
మేధావి లక్షణాలు బాగా ఉండేవి.
రెండో అమ్మాయి ఝాన్సీ. ప్రభుత్వ టీచర్.
అక్క ఒక ప్రేమ మూర్తి. నవ్వుమొహం.
మూడో అబ్బాయి శీనన్న. ప్రయివేట్ ఉద్యోగం.
అన్న సంఘ జీవి, మాకు చాలా ఆప్తుడు.
మా అన్నయ్యకు క్లాస్ మెట్, ధారాళంగా మాట్లాడతాడు.
నాలుగో అమ్మాయి సుధారాణి. అడ్వొకేట్.
తల్లిగారిలా గలగలా మాట్లాడే మనిషి.
ఐదో అబ్భాయి రాజు, ఐటీ ఫీల్డు.
ఆటపాటలతో హాయిగా గడిపేవాడు.
అందరికీ సార్ స్వాతంత్య్రం ఇచ్చారు.
వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఎదగనిచ్చారు.
మా అమ్మా, నాన్నలకు ఎంతో ఇష్టమైన కుటుంబం వారిది.
అమ్మ-అత్తయ్య గారు, అమ్మ-శీనన్న మాట్లాడుకుంటుంటే చూడాలి.
ఈ అద్భుతమైన కుటుంబం మాకు ఒక తీపి జ్ఞాపకం.
మాకే కాదు వారిని కలిసిన ఎవ్వరికైనా ఇదే అనిపిస్తుంది.
ఒక మింగలేని చేదు నిజం-సార్ ఇప్పుడు భౌతికంగా వెళ్లిపోవడం.
విధివశాత్తూ ఆ పెద్దదిక్కు పోయారు, సెప్టెంబర్ 19 న.
అత్తయ్య గారు ఎంత డీలా పడ్డారో కదా!
ఈ పదిరోజుల్లో సార్ గుర్తుకురాని రోజు లేదు.
అమృతప్రాయమైన పెద్దాయనను పాడు షుగర్ ఇబ్బంది పెట్టింది.
మళ్ళిన వయస్సును మరింత కుంగదీసి దెబ్బతీసింది.
అనివార్యమైన కారణాల వల్ల నేను అంతిమ దర్శనం చేసుకోలేకపోయా.
29 నాడు శ్రద్ధాంజలి ఘటించి వద్దామంటే ఒక ఆటంకం వచ్చింది.
నాకు జీవితంలో వెలితి మిగిల్చే అంశాల్లోఇది ఒకటి.
వారు నాకు సార్, డిగ్రీలో ఏడాదికి దాదాపు నెల చొప్పున ఇంగ్లిష్ చెప్పారు.
భయం కలిగించే భాషను అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు.
ఉదయం 5 గంటలకే లేచి టీ తాగుతూ ప్రేమగా చెప్పారు.
ఇంగ్లిష్ పట్ల భయం లేకుండా చేసింది సారే.
ఒక మంచిస్నేహితుడిలాగా ఆత్మస్థైర్యం ఇచ్చేవారు.
'యూ కెన్,' అంటూ ప్రోత్సహించేవారు.
ఇదంతా ఫ్రీగానే, ప్రేమతోనే.
అదీ లక్ష్మణ మూర్తి సార్ ప్రత్యేకత.
ఆఖరుగా ఒక మూడు నెల్ల కిందట ఖమ్మంలో కలిసాను.
అదొక ఫంక్షన్, హడావుడిగా ఉంది.
సార్ లో ఓపిక ఏ మాత్రం తగ్గలేదు.
హాస్య సంభాషణ, మాట చతురత అంతే ఉన్నాయి.
సార్, అత్తయ్య గారు ఇద్దరూ ఎంతో ప్రేమగా మాట్లాడారు.
వారిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి నేను భోజనం తెచ్చాను.
దగ్గరుండి వారికి అడిగి వడ్డించాను.
వారు ఆనందించారు, చాలా మందికి ఇది చెప్పారు.
వారిద్దరినీ కలిసుండగా అదే చూడడం.
సదా నవ్వుతూ మాట్లాడే సార్ ను వారింట్లో ఒక విషాదం కుంగతీసింది.
అయినా, ఝాన్సీ అక్కకు వెన్నంటి ఉండి అండనిచ్చారు.
అక్క కొడుకు మహంత్ గురించి బాగా తపనపడేవారు.
సార్ నాకొక విషయం చెప్పి కంట తడిపెట్టారు. నా గుండె తరుక్కుపోయింది.
వారిని నేను ఏమని ఓదార్చను? అన్నీ సర్దుకుంటాయని చెప్పాను.
పని అయిపోయిందని అంటే... అట్లా అనకండని వారించాను.
మధ్యలో సార్ ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నదని శీనన్న చెప్పాడు.
సార్ అందరినీ విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఎనభై ఏళ్ల పెద్ద మనిషి...
ఒక అద్భుతమైన టీచర్...
ఒకగొప్ప మనిషి...
ఒక అద్భుతమైన కష్టజీవి...
ఒక సంఘ ప్రేమికుడు...
ఒక ప్రేమ మూర్తి...
లక్ష్మణ మూర్తి సార్ ఇక లేరు-ఇది జీర్ణించుకోలేని సత్యం.
సార్ కు నేను ఎప్పుడూ రుణ పడి ఉంటాను.
ఒకటి, ఇంగ్లిష్ చెప్పినందుకు.
వారి కారణంగా ఇంగ్లిష్ వచ్చింది, నాకు వృత్తిలో లాభించింది.
రెండు, కాలనీలో సిఫార్సు చేసి ఇల్లు ఇప్పించినందుకు.
వారి కారణంగా ఇల్లు దొరికింది, అందులోనే నా జీవిత భాగస్వామి లభించింది.
నోరారా పిలిచే సార్ లేకపోవడం పెద్ద వెలితి.
కాలపురుషుడి కాఠిన్యం ఎవరికైనా తప్పదు కదా!
నా బాధ అత్తయ్య గారి గురించి. అయ్యో... పాపం.
లక్ష్మణ మూర్తి సార్ కు వినయపూర్వక అశ్రు-అక్షర నివాళి. ఓం శాంతి.
Dear Sir, Love you అండ్ Miss you.
May God give strength to Attayya garu and the family to cope with the tragedy.
Saturday, May 7, 2022
ప్రొఫెసర్ బాలస్వామి... అమర్ హై !
Monday, January 17, 2022
'మా' తో TUOWJ చర్చలు: చెత్త థంబ్ నెయిల్స్ పై ఉమ్మడి కార్యాచరణ
కొందరు వెర్రిమొర్రి, బాధ్యతారహిత నెటిజెన్ల శునకానందానికి సెలిబ్రెటీస్-ముఖ్యంగా సినిమా యాక్టర్లు-బలవుతుంటారు. మంచీచెడూ లేకుండా కేవలం క్లిక్స్ పెంచుకునేందుకు ఘోరంగా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ పెట్టి వినోదం ముసుగులో చాలా మంది చెలరేగిపోతున్నారు. ఈ పెడధోరణి సీరియస్ రీడర్స్, వ్యూయర్స్ కు చాలా ఇబ్బంది కలిగిస్తుండగా, బాధితులకు చెప్పలేని మనోవేదన కలిగిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా సీరియస్ జర్నలిజం చేసేవారికి ఇలాంటి అన్ ప్రొఫెషనల్ ఎలిమెంట్స్ తో చాలా ఇబ్బంది కలుగుతున్నది.
సముద్రం లాంటి సోషల్ మీడియాలో ఎవడి చావు వాడు చస్తాడని అనుకోకుండా, మంచి ప్రాక్టీస్ ను పోషించేలా, వృత్తికి తలవంపులు తెచ్చేవారిని దారిలోకి తెచ్చేలా చొరవచూపుతున్నది సీనియర్ జర్నలిస్టు బీ ఎస్ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUOWJ). డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు.. సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది. సినీ ఆర్టిస్టుల ప్రధాన వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)తో ఈ రోజు (జనవరి 17, 2022) భేటీ అయ్యింది. 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ తో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది.
మంచు విష్ణు తో బీ ఎస్ |
డిజిటల్ మీడియా యూనియన్ గా తాము కూడా స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించుకుని స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, కలిసి పని చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు బీ ఎస్ తెలిపారు. మరో సారి పూర్తి స్థాయిలో సమావేశమై విషయాలు చర్చించుకోవాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి సకారాత్మక చర్యలు సఫలం కావడానికి యూ ట్యూబర్స్, ఆన్ లైన్ జర్నలిస్టులు సహకరిస్తే బాగుంటుంది. ఈ విషయంలో పిచ్చి రాజకీయాలకు, కుళ్ళుబోతు వ్యవహారాలకు తావ్వివకుండా అంతా కలిసిపనిచేయాలని ఆశిద్దాం.
Monday, January 3, 2022
'పరిశోధన' శూన్యం...'ఆత్మ' మిథ్య... 'జర్నలిజం' మాయం...
'పరిశోధనాత్మక జర్నలిజం' అంటే ఎవరో స్వప్రయోజనం కోసం దాచిపెట్టాలని లేదా సమాధిచేయాలని ప్రయత్నించే విలువైన సమాచారాన్ని తెలివిగా బట్టబయలు చేసి నిజాన్ని జనాల ముందుకు తెచ్చి బతికించే పని. ఇది సాహసోపేతమైన పనే కాక, సామాజిక విహిత కర్తవ్య నిర్వహణ కూడా. ఇన్వెస్టిగేషన్ కన్నా అద్భుతమైన పనేమీ ఉండదనీ, జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరిస్తే ఇలాంటి మంచి పనులు బోలెడు చేసి ప్రజాసేవ నిర్వర్తించవచ్చునని నమ్మి జర్నలిజం లోకి వచ్చేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాలానుగుణంగా మీడియా స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పుల వల్ల, ఇతరేతర వివిధ కారణాల వల్ల ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం దాదాపుగా కనుమరుగు అయిపోయింది. అందుకే, గతంలో లాగా మీడియా ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం చేయడంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు గత నెలలో హైదరాబాద్ లో మా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద శ్రమించి, పరిశోధించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా ముఖచిత్రం నుంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనుమరుగుకావడం దురదృష్టకరమని అయన చెప్పారు.
'ఈనాడు' లో గతంలో కొద్దికాలం పనిచేసి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న జస్టిస్ రమణ గారు మినహా పరిశోధనాత్మక జర్నలిజం మీద ఈ మధ్య కాలంలో మాట్లాడినవారే లేకపోయారు. వారిలా మీడియాను దగ్గరి నుంచి చూసిన వారితో గానీ, ఇప్పుడు పనిచేస్తూ ఈ పవిత్ర వృత్తిలో తలపండిన జర్నలిస్టులతో గానీ మాట్లాడితే మీడియా పరిస్థితిలో వచ్చిన మార్పునకు కారణాలు తెలుస్తాయి. నేను 'ఈనాడు' లో పార్ట్ టైం విలేకరిగా చేరిన 1989-90 లో నాకు తారసపడిన సీనియర్లకు, 2002-2009 ప్రాంతంలో 'ది హిందూ' లో పనిచేసినప్పటి సీనియర్లకు మధ్య పోలికే లేదు. చిత్రా సుబ్రహ్మణ్యం, ఎన్ రామ్ బట్టబయలు చేసిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం రేపిన దుమారాన్ని చూసి పెన్ను పడితే అక్రమార్కులను వణికించవచ్చని గట్టి నమ్మకంతో పనిచేశాం అప్పట్లో. 1992 లో బయటపడిన హర్షద్ మెహతా గారి సెక్యూరిటీస్ స్కాం వల్ల సిరా చుక్క భూకంపాలు తెప్పిస్తుందని నమ్మి పనిచేశాం.
అప్పట్లో అయితే 'ఆధారాలు' గట్టిగా ఉన్నాయా? కథనంలో అందరి వెర్షన్స్ ఉన్నాయా? అని చూసుకుని పరిశోధనాత్మక కథనాలు ఎంతో ఉత్సాహంతో ప్రచురించేవారు. మొత్తం కెరీర్ లో పరిశోధించి ప్రచురించే వార్తలు ఒక ఐదారు ఉంటే గొప్పే. శోధించి వార్తలు రాసే జర్నలిస్టుకు మంచి క్రేజ్ ఉండేది. వ్యవస్థలో మార్పు కోసం తపించే వారు (విజిల్ బ్లోయర్స్) వచ్చి సమాచారం ఇచ్చేవారు. ఒక్కోసారి సిరీస్ (వరస కథనాలు) ప్రచురించి పత్రికలూ అవినీతిపరుల అంతు తేల్చేవి. వాటికి ప్రభుత్వం స్పందించేది. అప్పుడు మా ఘనకార్యం ప్రభావం ఇదని కాలర్ ఎగరేసి ఇంకో వార్త ప్రచురించేవారు. పథకాల్లో అవకతవకల మీద, అధికారుల డబ్బు కక్కుర్తి మీద, నాయకుల అన్యాయాల మీద, కలప స్మగ్లింగ్ మీద, బ్లాక్ మార్కెటింగ్ వంటి ప్రజోపయోగమైన అంశాల మీద పసందైన కథనాలు వచ్చేవి. సాధారణ ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల, స్పీచ్ ల వార్తలకు భిన్నంగా ఈ కథనాల్లో సమాచారం అబ్బురపరిచేది.
క్రమంగా పరిస్థితి మారింది. మన విలేకరి ఎవరికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాడో వాడు తమ వాడేనా (కులం, ప్రాంతం వగైరా) ? అని చూడ్డం, వారి మనిషి అయితే చూసీ చూడనట్టు పోవడం మొదలయ్యింది. కొన్ని పత్రికలు సదరు అవినీతి పరుడి నిజస్వరూపాన్ని బైటపెట్టేలా విలేకరి తెచ్చిన సాక్ష్యాలు, సేకరించిన ఆధారాలు (డాక్యుమెంట్లు) చూపించి అందినకాడికి దండుకోవడం కూడా బాగానే సాగింది. పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ముకాయడం మితిమీరి పెరిగాక ఇన్వెస్టిగేషన్ అస్త్రాన్ని తమ కులస్థుల వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీయడం మాత్రమే మొదలయ్యింది. కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద, టెండర్లలో గోల్ మాల్ మీద తెలుగుదేశం అనుకూల పత్రికల్లో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. పొలిటికల్ బాసు, పత్రిక అధిపతి ముందుగా ప్లాన్ చేసేవారు కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు ముందురోజో, అవి కొనసాగుతున్నప్పుడో ఇన్వెస్టిగేటివ్ కథనాలు బాంబుల్లా పేలేవి. ఆ కథనాల మీద చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టి విచారణకు ఆదేశించేలా చేయడమో, ఇంకేదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి చేయడమో జరిగేది. పరిశోధన ను పూర్తిగా వదలకుండా... కొన్ని పత్రికలు ప్రభుత్వం నొచ్చుకోని విధంగా సుతిమెత్తని పరిశోధనాత్మక కథనాలు ప్రచురిస్తున్నాయి.... అప్పుడప్పుడూ.
ప్రభుత్వాధినేతలు సొంత మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ మీడియా యజమానుల మెడలు వంచే పద్ధతులు పాటిస్తుండడంలో మీడియా సంస్థలు జీ హుజూర్ జర్నలిజం చేస్తున్నాయి. దీంతో, ఇప్పుడు పరిశోధన శూన్యం, ఆత్మ సున్నా, జర్నలిజం జీరో అయిపోయిన దుస్థితి. అప్పట్లో డెక్కన్ క్రానికల్ పత్రిక ఇన్వెస్టిగేటివ్ వార్తలకు ప్రాధ్యాన్యం ఇచ్చేది. నాయర్ గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు వెలువడిన కొన్ని కథనాలు జర్నలిస్టులకు మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. పుట్టపర్తి లో సత్యసాయి ప్రాంగణంలో జరిగిన హత్యల మీద వచ్చిన కథనాలు కంపనాలు సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతి పత్రిక, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్) గా ఉన్న సుధాకర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు దమ్మున్న ఇంగ్లిష్ జర్నలిస్టులు అప్పుడప్పుడు కథనాలు రాస్తున్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకించి దమ్ము, ధైర్యం, బుర్ర, రచనా సామర్ధ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టులను నియమించనైనా నియమించడంలేదాయె. ఇలా పలు కారణాల రీత్యా క్రిటికల్ వార్తలు రాసి ప్రభుత్వం స్పందించేలా చేసే జర్నలిస్టులు కనుమరుగయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారే కాకుండా సదాలోచన పరులు, ప్రజాస్వామ్య హితైషులు పరిశోధనాత్మక జర్నలిజం లేకుండా పోయిందే... అని ఆవేదన చెందడానికి కారణమైన ఐదు అంశాలు ఏమిటంటే...
1) యాజమాన్య ధోరణులు 2) దమ్మున్న ఎడిటర్లు/ సీఓబీ లు లేకపోవడం 3) పరిశోధనాత్మక జర్నలిస్టులకు సముచిత గౌరవం, ప్రోత్సాహకాలు లేకపోవడం 4) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు దన్నుగా నిలబడే వారు కరువవడం 5) పరిశోధనాత్మక జర్నలిజం లో శిక్షణ లేకపోవడం.
ఒక పత్రిక సత్య ప్రమాణకంగా పరిశోధించి వ్యాసం రాసినా దాన్ని తిప్పికొడుతూ వైరి పత్రిక వ్యాసం (రిజాయిండర్) రాసే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కారణం, పైన మనం అనుకున్న యాజమాన్య ధోరణులు. మీడియా ఓనర్లకు పలు వ్యాపారాలు ఉండడం తో వాళ్ళ పిలక ప్రభుత్వం చేతిలో ఉంటున్నది. మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాసాలు ప్రచురించే పత్రికల ఆర్ధిక మూలాలపై కోలుకోలేని దెబ్బకొట్టే విద్వేషపూరిత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. ఇండిపెండెంట్ మీడియా అనేది లేకపోతే పరిశోధనకు అవకాశమే లేదు.
పగ్గాలు విడిస్తే పరిశోధించి అక్రమార్కుల భరతం పట్టే జర్నలిస్టులకు కొదవులేదు. కానీ అందుకు ఎడిటర్ల, చీఫ్ ఆఫ్ బ్యూరోల సంపూర్ణ మద్దతు అవసరం. నేను నా కెరీర్ లో ఒక వింత పరిస్థితి ఎదుర్కొన్నా ఒక చవట చీఫ్ ఆఫ్ బ్యూరో మూలంగా. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఒక అధికారి బినామీ పేర్లతో చీప్ రేటుకు వందల ఎకరాలు ఎలా కొన్నదీ నిరూపిస్తూ నేను డాక్యుమెంట్లు తెస్తే... అభినందించాల్సింది పోయి నా బాస్ అయిన ఈ సీనియర్ ఒక సిల్లీ ప్రశ్న వేశాడు- "ఇది మనం ప్రచురిస్తే కోర్టు కేసు అవుతుందా?' అని. కేసు కావచ్చు, కాకపోవచ్చు అనగానే... 'వద్దులే' అని కొట్టిపారేశాడు... ఆ డాక్యుమెంట్లను చూడకుండానే, నా శ్రమను అభినందించకుండానే. తాను ప్రపంచంలోనే గొప్ప జర్నలిస్టునని, చక్కని రాత గాడినని అందరితో మిడిసిపాటుతో వ్యవహరించి చివర్లో దారుణంగా భంగపడిన ఈ సీనియర్ లాంటి వాళ్ళ వల్ల కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడున్న తెలుగు పత్రికల ఎడిటర్లలో దూకుడు స్వభావం లేకుండా మన్నుతిన్న పాముల్లాంటి వాళ్ళే ఎక్కువ. ఇప్పటి ఎడిటర్లలో తమ జీవితంలో ఎవరు ఎన్ని పరిశోధనాత్మక కథనాలు రాసారో, ఎవరు ఎన్ని ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసి సంచలనం సృష్టించారో లెక్కతీస్తే ఉస్సూరుమంటాం. యాజమాన్యాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన వారికి కాకుండా వేరే కొలబద్దలను బట్టి తమ మనుషులకు ఎడిటర్లుగా పట్టంకట్టినంత కాలం పరిస్థితి మారదు. పరిశోధన చేసి ఏదైనా కథనం రాయాలంటే వృత్తిపట్ల కట్టుబాటు ఉండాలి, గుండె నిండా సాహసం ఉండాలి, నీతి విషయంలో నిబద్ధత ఉండాలి కదా!
ప్రాణాలకు తెగించి, ఎన్నో అవరోధాలను అధిగమించి పరిశోధనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులకు వెన్నుదన్నుగా ఉండే వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి. . ఇలాంటి సిన్సియర్ జర్నలిస్టులు ఇబ్బందుల్లో పడితే మీడియా మానేజ్మెంట్స్ పక్కకు తప్పుకుంటాయి. ఎడిటర్లు బండలు వేస్తారు. శ్రమించి సాధించిన జర్నలిస్టులను వారి మానాన వారిని వదిలేసి, మీ కేసు మీరే చూసుకోండని అంటే కష్టమై పోతుంది. పరిశోధనాత్మక జర్నలిజం బతకాలంటే ప్రోత్సాహకాలు భారీగా ఉండాలి. ప్రతి ఏడాదీ ఒక అత్యుత్తమమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పనితనాన్ని గుర్తించి మెచ్చుకుని ఒక బహుమానం ఇస్తే ఎంత బాగుంటుంది! ఒకటి రెండు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి జాతీయ పత్రికలు ఇలాంటి నికార్సైన జర్నలిస్టుల కోసం ఒక బహుమతి ఇచ్చి గౌరవిస్తున్నాయి. ప్రతి ఏడాదీ ప్రభుత్వమే చిత్తశుద్ధితో మంచి జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలి. అయినా, మీడియా బిజినెస్ మీద బాగా సంపాదించిన 'ఈనాడు' లాంటి పత్రికలు ఒక పదో, పాతికో లక్షలు ఏడాదికి ఒకరిద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు ప్రోత్సాహకంగా ఇవ్వవచ్చు కదా! జర్నలిజంలో అద్భుతమైన శిక్షణ పొంది, రచనలే శ్వాసగా చేసుకుని అర్ధంతరంగా చనువుచాలించిన సుమన్ పేరిట ఒక వార్షిక అవార్డు నెలకొల్పి ఉంటే ఒక సత్సంప్రదాయానికి తెర ఎత్తినట్లు అయ్యేది.
అమెరికాలో ఉన్నట్లు పులిజర్ అవార్డుల్లాంటివి మన దగ్గర లేవన్న స్పృహ మనోళ్లకు లేకపోవడం బాధాకరం. ఈ అంశాన్ని అటు వ్యవస్థ గానీ, సంస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ పట్టించుకోవడం లేదు. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పుడు అక్కడి యాజమాన్యానికి ఇందుకు సంబంధించిన ఒక ప్రతిపాదన చేశాను గానీ అది వారికి వంటపట్టలేదు. ఇది ప్రచురించే సమయానికి సుప్రసిద్ధ జర్నలిస్టు అరుణ్ సాగర్ గారి స్మృత్యర్థం నెలకొల్పిన అవార్డుల ప్రధానం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నది. ఇలాంటి అవార్డులు మరెన్నో నెలకొల్పి అర్హులైన జర్నలిస్టులకు ప్రదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక విశ్వవిద్యాలయాల్లో 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం' ఒక సీరియస్ అంశంగా చెబుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాల్లో ఇది నిల్లు. జర్నలిస్టులు నడుపుతున్న ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో మాకు ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్ శిక్షణ ఇచ్చి ఒక ప్రాజెక్టు చేసేలా ప్రోత్సహించేవారు. నేను ప్రింట్ జర్నలిజం ఆరంభించడానికి సహకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఈ తరహా జర్నలిజం మీద క్లాసులు తీసుకుని, ఒక అసైన్మెంట్ ఇచ్చేవాడిని. ఈ పనిచేయాలంటే బోధకులకు ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. దాన్ని పట్టించుకునే వారు ఇప్పుడు లేరు.
ఈ ఐదు అంశాల సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియా వచ్చాక ఇన్వెస్టిగేషన్ మీద కొద్దిగా ఫోకస్ ఉన్నట్లు కనిపించింది. రెండు మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ ఇలా ఆశలు రేకెత్తించాయి. అందులో ఒకటైన క్యూ న్యూస్ నాకు నచ్చేది. దాని ఆరంభకుడు తీన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ కు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆ కారణంగానే 30కి పైగా కేసులు పడ్డాయి అతని మీద. ఇంతలో కారణాంతరాల వల్ల బీజేపీ తీర్థం స్వీకరించి మల్లన్న ఇండిపెండెంట్ జర్నలిజం అన్న మాటకు అనర్హుడయ్యాడు. తొలి వెలుగు లో రఘు అనే అబ్బాయి బాగానే చేస్తున్నాడు కానీ... ఇది శృతి మించిన కారణంగా క్రమంగా సీరియస్ నెస్ కోల్పోతున్నట్లున్నది.
ప్రజాస్వామ్యం మనగలగాలంటే జర్నలిజం, ముఖ్యంగా పరిశోధనాత్మక జర్నలిజం, బతికి బట్టకట్టే పరిస్థితులు సమాజం, వ్యవస్థలు సృష్టించాలి. సిన్సియర్ జర్నలిస్టులు ఇండిపెండెంట్ గా నైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని స్వీకరించి సోషల్ మీడియా వేదికగా ప్రోత్సహిస్తే మంచిది. చీఫ్ జస్టిస్ గారు అభిలషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ (ప్రధాన మీడియాలో) లో రాణించి ప్రజాస్వామ్యానికి జవజీవాలు ఇస్తుందని ఆశిద్దాం. జస్టిస్ రమణ గారి ఆవేదనకు స్పందిస్తూ సుప్రసిద్ధ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక వ్యాసంలో పేర్కొన్నట్లు సీరియస్ జర్నలిజం చేసే జర్నలిస్టులకు న్యాయ స్థానాలు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుందాం.
I published the same in Adarshini, edited by senior journalist Mr Mini Suresh Pillai.
Here is the link
https://adarsini.com/dr-s-ramu-feature-article-on-investigative-journalism/