గత ఏడాదే దాదాపు మూత పడే పరిస్థితికి వచ్చి బొత్స వారి వల్ల బతికి పోయిన జీ 24 గంటలు తెలుగు ఛానెల్ తాజాగా మూత పడడానికి దాపు రంగం సిద్ధమయ్యింది. సుభాష్ చంద్రకు చెందిన జీ గ్రూప్ తో రెండేళ్ళ ఒప్పందం మీద బొత్స ఫామిలీ ఛానెల్ ను నడుపుతున్నది. ఉద్యోగులను తొలగించి, వినూత్నత్వం కోసం ప్రయత్నం చేసి.. అప్పటి డీ జీ పీ దినేష్ రెడ్డి మీద స్టోరీ ప్రసారం చేసి ఇరుక్కుని ఈ ఛానెల్ నానా రకాల తలనొప్పుల మధ్య ఉన్నది. డబ్బు పరంగా కూడా ఇబ్బందులు చుట్టు ముట్టాయని అంటున్నారు.
ఈ నేపథ్యం లో ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇచ్చి... దుకాణం బంద్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే... పలువురు జర్నలిస్టులు, టెక్నీషియన్లు, యాంకర్లు ఇబ్బంది పడతారు. పాపం వారి పరిస్థితి ఊహిస్తే బాధగా ఉంది. తెలుగులో ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి కానీ... ఎక్కడి కక్కడ ఎవరి సామ్రాజ్యం వారు నిర్మించుకున్నారు. ఇక్కడ నాణ్యమైన జర్నలిస్టుల కన్నా... కులపోళ్ళు, గులాం చేసే వాళ్ళకే పోజిషన్లు.. పెద్ద జీతాలు.
ఇప్పుడు జీ 24 గంటలు నడుస్తున్న బిల్డింగ్ ఓనర్లకు కూడా జీ యాజమాన్యం మొన్నీ మధ్యన మూసేస్తున్న సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరుకు, సరంజామా అన్నీ ఉన్న బిల్డింగ్ లో ఎవరైనా ఛానెల్ పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి... అలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని బిల్డింగ్ ఓనర్లు కూడా వెతుకుతున్నారు.