మార్చ్ 31, 2010
ప్రియమైన...విజిటర్స్ కు.... బ్లాగర్ల్ కు...
నమస్తే...
నేను గతంలో పంపిన రెండు లేఖలకు మీ నుంచి వచ్చిన స్పందనకు ఆనందంగా ఉంది. వాటి మీద మంచి చర్చ జరిగింది. ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చేందుకు మీకు ఈ లేఖ అర్జెంటుగా రాస్తున్నాను. మీరు వెంటనే స్పందించకపోతే....ఈ లౌకిక సమాజానికి ఎంతో నష్టం. ఇప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే...మత కలహాలు మీ ఇంటి దగ్గరకు వస్తాయి, మీ కుటుంబీకులనో, స్నేహితులనో హరిస్తాయి.
మీకు తెలుసు....మూడు రోజులుగా హైదరాబాద్ పాతబస్తీ...రగిలిపోతున్నది. మత కలహాలు ఇంకా చల్లారలేదు. రెండు మతాల వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఎవరిది తప్పు?...అని దోష నిర్ధారణ చేసే సమయం కాదు ఇది. ఎందుకంటే...తప్పు చేసిన వాడు, తప్పు చెయ్యని వాడు ఈ విషయానికి మతం రంగు పులిమి...పాత గాయాలను రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకు మంచిది కాదు. పట్టపగలు కత్తిపోట్లు, బీభత్సంగా రాళ్ళు రువ్వుకోవడం దుష్పరిణామానికి సంకేతాలు.
ఈ పరిస్థితులలో....సంయమనం పాటించాల్సిన కొన్ని తెలుగు ఛానళ్ళు ఈ దారుణాన్ని ప్రసారం చేస్తున్నాయి. పరిస్థితిని మరింతగా రెచ్చగొడుతున్నాయి. TV-9, N-TV, Saakshi, ABN-AndhraJyothi చానళ్ళు నిన్న మత కలహాల దృశ్యాలను ప్రసారం చేసాయి. ఇది అనైతికమని...గతంలో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసినా...ఈ ఛానెల్స్ కు పట్టడంలేదు. ఇలాంటి గైడ్ లైన్స్ ఉన్నట్లు...ఈ ఛానెల్స్ లో పని చేసే బాసులకు తెలియదని అనిపిస్తున్నది.
ఇప్పుడు నాకొక అనుమానం వచ్చింది. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకు...ఎవరైనా...ఈ కల్లోలాన్ని ఛానెల్స్ ద్వారా ప్రసారం చేయించి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్నారా?...అని. ఆ గొడవ మనకు ఎందుకు? డబ్బు కోసం గడ్డి కరిచే కుసంస్కారపు ఛానల్ యాజమాన్యాలు, హెడ్లు ఉన్నంత కాలం ఏదైనా సాధ్యమే. కాబట్టి...ఈ మీడియా వల్ల... మత కలహాలు పెచ్చరిల్లకుండా, చివరకు ఈ అల్లర్లు మన ఇంటి దరిచేరకుండా ఉండేందుకు మనమే ప్రయత్నించాలి. పౌరులే స్పందించాలి.
ఎక్కడో అల్లర్లు జరిగితే మనకేమిటి?....అనుకోకండి. ఇవి మీ ఊరి దాకా పాకి రెండు మతాల వారి మధ్య చిచ్చు పెడతాయి. ఆకతాయిలు దీన్ని అనుకూలంగా చేసుకుని చెలరేగుతారు. మీ ఊళ్ళో శాంతి నాశనం అవుతుంది. మీడియా మహిమ వల్ల ఈ అల్లర్లు వికృత రూపం దాల్చే అవకాశం ఉందని మీరు గ్రహించండి.
మత కలహాలకు ఆజ్యం పోసే ఛానెల్స్ ను మీరు నిలువరించవచ్చు. వాటికి మీ నిరసన తెలియజేయవచ్చు. అది ఎలాగంటే.....
1) ఛానెల్స్ ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చెయ్యండి. ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్స్ ప్రసారం చేయవద్దని గట్టిగా బుద్ధి చెప్పండి
2) అలాంటి ఛానెల్స్ చూడకండి. మీ వీధిలో ఒక సమావేశం పెట్టి....ఆ ఛానెల్స్ చూడబోమని ప్రతిజ్ఞ చేయించండి. తీర్మానాలు చేయండి
3) ఈ ఛానెల్స్ రోజూ లైవ్ ఫోన్ ఇన్ లు నిర్వహిస్తాయి. దేశభక్తులైన మీరు...దీన్ని అవకాశంగా తీసుకోండి. లైవ్ లో రెండు మాటలు...ఆ కార్యక్రమానికి సంబంధించినవి మాట్లాడి...ఆ తర్వాత...మత కలహాలు ప్రోత్సహిస్తున్నందుకు....ఆ ఛానల్ హెడ్ ను ఆగకుండా బండ బూతులు తిట్టండి. బుద్దిలేదా? అని అడగండి. మన లైన్ కట్ చేసే వరకూ....తిట్ల దండకం ఆపకండి
4) పదవీ విరమణ చేసినవారు, ధైర్యం ఉన్న వారు....కోర్టులలో పిటిషన్లు వెయ్యండి. ప్రెస్ కౌన్సిల్, సుప్రీంకోర్ట్, యూ.ఎన్. వంటి సంస్థలకు లేఖలు రాయండి. వాటికి ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదులు పంపవచ్చు.
5) ఈ ఛానెల్స్ హెడ్లకు, బడ్లకు బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు జరపండి.
పౌరులారా....దీన్ని తేలికగా తీసుకోకండి. ఈ బాధ్యతారహిత ఛానెల్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ మీడియాను ప్రభుత్వం నియంత్రించలేదు. రాజకీయ లబ్ధి కోసమో, టీ.ఆర్.పీ. పిచ్చితోనో ఇవి మన జీవితాలు ఛిద్రం చేస్తాయి. ప్రమాదం ముంచుకు వచ్చింది.
ఇప్పుడు కావలసింది...పౌర స్పందన. ఇది మీ ఇంటి నుంచి, మీ నుంచి ప్రారంభం కావాలి. నేనేదో ఆవేశంతో రాస్తున్నా అని అనుకోకండి...సమస్య సున్నితత్వాన్ని గ్రహించండి. ఆలస్యం చేయకుండా...ఉపక్రమించండి.
జై హింద్
ఆవేదనతో...మీ
అబ్రకదబ్ర
ఫిలింనగర్
హైదరాబాద్