Tuesday, April 30, 2013

రోజుకో స్టోరీ... నాణ్యత హరీ!

జర్నలిజంలో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడానికి కారణం... రిపోర్టర్ల పై స్టోరీ ల కోసం ఉండే ఒత్తిడి. జర్నలిస్టులను పిండుకోవడమే నిర్వహణా సామర్ధ్యానికి నిదర్శనమని నమ్మి సీనియర్లు రిపోర్టర్ల ను వేయించుకు తినడం అంతకంతకూ అధికమవుతున్నది. ఇప్పుడు మీడియాలో (పత్రికలైన, ఛానెల్స్ అయినా) జరుగుతున్న తంతు ఇలా ఉంది. 

రిపోర్టింగ్ బ్యూరో లో ఉండే వాళ్ళు తమ బీట్ (కేటాయించిన శాఖ లేదా రాజకీయ పార్టీ) కు సంబంధించి స్టోరీ ఐడియా ఇవ్వాలి. దాన్ని బాసు గారు నోట్ చేసుకుని కోర్ కమిటీ (రోజూ ఏమి ప్రచురించాలి/ ప్రసారం చేయాలి అన్న దాన్ని నిర్ణయించే మేధావుల యంత్రాంగం) లో సమర్పిస్తారు. అక్కడ అప్రూవల్ పొందాక... రిపోర్టర్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. స్టోరీ ఎంత లోతుదైనా రిపోర్టర్ ఎలాగోలా సాయంత్రం కల్లా దాన్ని ఫైల్ చేయాలి. ఈ లోపు... పని ఎంత దాకా వచ్చిందో తెలుసుకునే యంత్రాంగం వాళ్ళు ఫోన్ లు చేసి సతాయించి చంపుతారు. మధ్యలో ఏదైనా ప్రమాదమో, గొడవలో జరిగితే ఈ రిపోర్టర్ల నే వెళ్లి కవర్ చేయమంటారు. పైగా స్టోరీ సోర్సులు సరిగా స్పందించవు. వందలాది రిపోర్టర్లు ఎగాబడుతూ ఉండటాన సోర్సులకు ఇది నిత్య తద్దినం అయిపోయి స్పందించడం మానేస్తారు. ఈ క్రమంలో... జర్నలిజానికి ఎంతో ముఖ్యమైన అధ్యయనం, విశ్లేషణ గాల్లో కలిసిపోతున్నాయి. 24/7 వ్యవహారం కాబట్టి... బండి నడపాలి కాబట్టి స్టూడియోలలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడతారు, మాట్లాడిస్తారు. ఆడతారు, ఆడిస్తారు. టీవీ, రిమోట్ ఉన్న పాపానికి మనం వాటిని ఆహో...ఒహొ..అని చూడాలి.  

స్టోరీ ఐడియా ఇచ్చిన పాపానికి, హడావుడి గా ఫైల్ చేయాల్సిన దురవస్థకు గానూ రిపోర్టర్లు చాలా సార్లు స్టోరీ లను వండి వారుస్తారు. అంటే, కొటేషన్లను అల్లుతారు. ఒక అంశం లో అన్ని యాంగిల్స్ స్పృశించరు. ఎందుకంటే దానికి టైం సరిపోదు. అందుకే చాలా వార్తలు, కథనాలు అసమగ్రంగా వస్తున్నాయి. ఈ పధ్ధతి మారాలి. జర్నలిజం అంటే చరిత్ర చిత్తు ప్రతే కాదు, చర్విత చర్వణం అయ్యే చరిత్ర. ప్రతి రోజూ కొత్త విషయాలు పుట్టుకు రావు. 

ఈ నేపథ్యంలో బాసుల మైండ్ సెట్ మారాలి. రోజుకో స్టోరీ ఇవ్వడం అసాధ్యమని గుర్తించాలి. తాము రిపోర్టర్లు గా ఉండగా... నిత్యమొక స్టోరీ అడిగిన బాసును... గాడిద కొడుకని తిట్టిన వాళ్ళే బాసులయ్యాక యాసులు గా మారి రోజుకో స్టోరీ స్కీం ను అమలు చేయాలని అనుకోవడం, రిపోర్టర్ల ను విసిగించి చంపడం విచిత్రం. 

గంగి గోవు పాలు.. గరిటడైనను చాలు... కుండెడయిన నేమి ఖరము పాలు.... అన్న పద్యాన్ని వీళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలి. 'ఇచ్చే స్టోరీ సమగ్రంగా ఉండాలి. కావాలంటే రెండు మూడు రోజులు తీసుకోనైనా బాగా చెయ్యండి,' అని రిపోర్టర్ లను ప్రోత్సహించాలి. జర్నలిస్టులు వారానికి ఒక మూడు, నాలుగు మంచి స్టోరీ లు ఇస్తే అంతకంటే ఏమి కావాలి! విలేకరులు కూడా... ఇచ్చిన టైం ను వృధా చేయకుండా స్టోరీ లకు సమగ్రత, కొత్త కోణం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఈ భావన రానంత వరకూ అమామ్ బాపతు సొల్లు స్టోరీలను తెలుగు జనం భరించాల్సిందే. 

Sunday, April 28, 2013

మీడియా ఓవర్ యాక్షన్ పై 'తీన్మార్' విసుర్లు

రాత్రి తొమ్మిదిన్నరకు V 6 ఛానెల్ లో వచ్చే 'తీన్మార్' వార్తలు చూడడం ఇప్పుడు నాకు అలవాటుగా మారింది. ఆ వార్తలు చదివే రచ్చ రాములమ్మ (అసలు పేరు రమ్య కృష్ణ) లాంటి వాక్సుద్ధి, ఎనర్జీ ఉన్న యాంకర్ ప్రస్తుతం ఏ ఛానెల్ లో లేరని నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను. ఇలా కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నందుకు ఆ ఛానెల్ సూత్రధారి అంకం రవి గారిని అభినందించాలి. ఒక నాలుగు రోజుల కిందట 'తీన్మార్' వార్తల్లో మీడియా మీద ఒక బిట్ వచ్చింది. నాకు ఆ కాపీ నచ్చింది. 
అంకం రవి గారి ఫోన్ నంబర్ సంపాదించి వారికి రెండు ఎస్ ఎం ఎస్ లు ఇచ్చాను ఒక సదుద్దేశంతో. మీడియా మీద రాసిన ఆ కాపీ పంపితే నేను బ్లాగులో పబ్లిష్ చేస్తా బ్రదర్... అని. రెండేళ్ళ కిందట కర్నూలులో విలేకరుల ల్యాండ్ డీలింగ్ పై నేనీ బ్లాగులో రాసినదానికి నొచ్చుకుని ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడిన రవి గారు నా ఎస్ ఎం ఎస్ లకు స్పందించలేదు. అలా అందరి కాల్స్ కు, ఎస్ ఎం ఎస్ లకు స్పందిస్తే  ఛానల్ హెడ్ ఎలా అవుతారులే... అని నేను అనుకుంటూ ఉండగానే...ఆదివారం రాత్రి ఆ బిట్ మళ్ళీ వచ్చింది. అది బాగుంది. 

ఈ బిట్ లో మీడియా వాళ్ళ అతిని ఉతికి ఆరేసారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి సామెత వాడి...దంచుకున్నారు. ఒక కిడ్నాప్ కేసు, ఎం ఎల్ ఏ ఈలి నాని గారి అమ్మాయి ప్రేమ పెళ్లి ని నేపథ్యం గా చేసుకుని... కుటుంబ సమస్యలను ప్రపంచ సమస్యగా మీడియా ఎలా చిత్రీకరిస్తుందో చురకలు వేస్తూ వివరించారు. అదీ సంగతి. స్వీయ నియంత్రణ లేకపోయినా... స్వీయ విమర్శ అయినా చేసుకువాలి మీడియా. 

Thursday, April 25, 2013

ప్రేమ వ్యామోహమా?: N TV లో చెత్త "ఫోకస్"

N TV లో "ప్రేమ బంధమా? పేగు బంధమా?" అన్న శీర్షికతో ఈ రోజు ఉదయం 'ఫోకస్' అనే కార్యక్రమం వచ్చింది. ఇది నాకు నచ్చలేదు. కని ఇరవై ఏళ్ళు పెంచిన తండ్రి హృదయాన్ని... నిన్న కాక మొన్న పరిచయం అయిన వాడికోసం గాయపరచడం భావ్యమా? అన్న పిచ్చి వాదన దాని సారాంశం. 

కాలేజ్ లో ఆరేళ్ళు ప్రేమించి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకున్న వాడిగానే కాకుండా ఒక జర్నలిస్టుగా నేను ఈ స్టోరీ లో వాడిన కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ ను హర్షించలేక పోతున్నాను. ఇంత సీరియస్ చర్చలో సినిమా క్లిప్స్ వేసి పలచన/చులకన చేయడం కూడా నాకు మంచిగా అనిపించలేదు. టీ వీ జర్నలిజం బుద్ధి పోదుకదా! ప్రేమ అనే అద్భుతమైన అంశాన్ని డీల్ చేసే పధ్ధతి ఇదా? ఎం ఎల్ ఏ ఈలి నాని గారిని ఊరడించడానికి చేసిన ప్రయత్నం గా ఇది ఉంది. 

నిజమైన ప్రేమ వ్యవహారాన్ని సమాజం సరిగా డీల్ చేయడం లేదు (ఎన్ టీవీ వాళ్ళ లాగా). ప్రేమ మధురం అంటారు కానీ... నిజానికి, జీవితాంతం కలిసి ఉండాలనుకునే రెండు లేత హృదయాలు పడే ఘర్షణ, మూగ వేదన అది. ప్రేమికులు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం, లవ్ లెటర్స్ రాసుకోవడం, పార్కుల్లో తిరగడాన్ని ఎక్కువగా హై లైట్ చేస్తారు గానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు పడే తపనను అర్థం చేసుకోరు. ప్రేమికులు కూర్చొని గంటల తరబడి మాట్లాడే దాంట్లో ఏమి ఉంటుందో ఎవరూ పట్టించుకోరు. 
"పెద్దలను ఒప్పించడం ఎలా?" అన్న అంశమే వాళ్ళ చర్చల్లో సింహభాగంగా ఉంటుంది. ఎన్ టీవీ వాళ్ళు అనుకుంటున్నట్లు కంటి రెప్పలు కంటిని కాటేయ్యాలని అనుకోవు, నిజమైన ప్రేమికులు గడప దాటి తల్లి దండ్రుల గుండెల్లో గునపాలు గుచ్చాలి అనుకోరు, వారిని రాక్షసులు అనుకోరు. తండ్రి గుండె కోతకు అంతెక్కడ? అని ఎన్ టీవీ ప్రశ్నించింది. ప్రేమించిన పాపానికి... పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత కూడా తండ్రి పెట్టిన నిర్బంధం లో ఉన్న ఆ అమ్మాయి గుండె కోత గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. 

పెద్దలను ఎలా డీల్ చేయాలో తెలియక, అందుకు కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, ధైర్యం చాలక ప్రేమికులు ఇబ్బంది పడతారు.  తమ జీవన యానంలో కన్నవారిని తోడుగా తీసుకుపోవాలని వారు పడే తపన ఎవరికీ అర్థం కాదు. ప్రేమ వ్యామోహం, ఒక స్వార్థం, తండ్రిని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటే నష్టం అనుకోవడం పూర్తిగా తప్పు, అవగాహనా రాహిత్యం. ఒక వైపు ప్రేమికుడు, మరొక వైపు కని పెంచిన తల్లి దండ్రుల మధ్య బాగా నలిగేది ప్రేమికురాలే. ప్రేమికులకు పేరెంట్స్ కు మధ్య ఉద్విగ్న పరిస్థితి, ఘర్షణ వాతావరణం మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అందుకు కావలసిన చారిత్రిక సాక్ష్యాలు బోలెడు ఉన్నాయి. తల్లి దండ్రుల మూర్ఖత్వానికి బలైన అమర ప్రేమికులకు, పేగు బంధాన్ని తృప్తి పరచడానికి మనసు పడిన వాడిని వదులుకుని రాజీపడి పెళ్లి చేసుకుని బతుకుతున్న వారికీ కొదవ లేదు. అలాగని అందరిదీస్వచ్ఛమైన ప్రేమ అనడం గానీ, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మంచివి కావని అనడం కానీ నా ఉద్దేశం కాదు. వాస్తవాలను మరిచి వన్ సైడెడ్ స్టోరీలు ప్రసారం చేయడం, సమస్య ను అన్ని కోణాలలో నుంచి చూడకపోవడం తప్పంటాను.    

సినిమాలు, టీవీ సీరియళ్ళు, సోషల్ నెట్ వర్క్ లు జీవితాలు శాసించే ఒక దిక్కుమాలిన యుగం లో మనం బొర్లుతున్నాం. ఇక్కడ ఎలా బతకాలో మన పిల్లలకు నేర్పడం వినా మనకు వేరొక దిక్కు లేదు. మంచి ప్రేమికుడిని/ప్రేమికురాలిని ఎంచుకునే శక్తి సామర్ధ్యాలు, సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని మన పిల్లలకు అందించడం మినహా మనమేమే చేయలేము. అది సాధ్యం కాదు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు కాకుండా... అయ్య చెప్పినట్లు వినకపోతే చచ్చి ఊరుకుంటారని బోడి సలహాలు ఇవ్వడం మంచిది కాదు. 

ఈలి నాని చేసిన బుద్ధితక్కువ పని...  

టీ వీ వాళ్ళ లైవ్ షోలకు రావడం ఎం ఎల్ ఏ ఈలి నాని చేసిన పెద్ద తప్పిదం, బుద్ధి తక్కువ పని. నిన్న సాయంత్రం TV 9 లో దీప్తి వాజ్ పేయ్ ఒక పక్క ఆయన్ను మరొక పక్క ప్రేమికులు కం నవ దంపతులను చూపి అర్థ గంటకు పైగా ప్రత్యక్ష ప్రసారం కానిచ్చారు. తండ్రీ కూతుళ్ళను కలపాలన్న తాపత్రయం దీప్తి గారిలో కనిపించింది కానీ ఆమె వేసిన ప్రశ్నలు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు ను పెంచేవిగా అనిపించాయి. ఇలా లైవ్ లో కాకుండా...వాళ్ళను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి సముదాయిస్తే సమస్య పరిష్కారం అయ్యేదేమో అనిపించింది. 

తండ్రి పరువు కాపాడాలన్న తాపత్రయం నాని గారి కూతురిలో స్పష్టంగా కనిపించింది. లైవ్ షో లో నోటికొచ్చింది మాట్లాడి నాని తన అక్కసు వెళ్లగక్కుకున్నారు. అమాయకంగా ఆయన చేసిన ప్రకటనలు చూస్తే..అయ్యో పాపం అని కూడా అనిపించింది. లైవ్ షో లకు ఒప్పుకుంటే... గోరుతో పోయేది గండ్ర గొడ్డళ్ళు పెట్టినా పోదన్న సత్యాన్ని ప్రజలు గుర్తించాలి. ఐదేళ్ళు ప్రియుడు కోసం ఎదురుచూసి చివరకు అంత పవర్ ఫుల్ తండ్రిని ఎదిరించి అనుకున్నది సాధించిన నాని గారి కూతురుకు ఈ పోస్టు అంకితం. ఈ జంటకు కావాలంటే మనో బలాన్ని, న్యాయ సహాయాన్ని, జన బలాన్ని అందించడానికి ఈ బ్లాగు సిద్ధంగా ఉంది. 
నిజమైన, నిస్వార్ధమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. 

Tuesday, April 23, 2013

డ్యూటీ మైండెడ్ జర్నలిస్టులు!!!

అప్పటికప్పుడు అనుకుని శనివారం రాత్రి మేము తిరుపతి బయలు దేరాము బస్సులో. ఆదివారం ఉదయం నాలుగు గంటలయ్యింది. బస్సు ఎక్కడకు చేరిందో తెలియదు కానీ, నాకు మెలకువ వచ్చింది. ఒక ముగ్గురు యువకులు  బస్సు ఎక్కారు. వారిలో ఒకరి దగ్గర ఒక బకెట్ ఉంది. ఎందుకో నేను నా సీటు లో కూర్చొనే బకెట్ లో ఏమి ఉందో తొంగి చూసాను. ఒక పెద్ద వేట కొడవలి, నాలుగైదు కత్తులు, రెండు పెద్ద స్క్రూ డ్రైవర్స్ కనిపించాయి. అప్పటి దాకా గుర్రుపెట్టి నిద్రపోయిన నాలోని జర్నలిస్టు ఒక్క సారిగా జూలు విదిల్చి నిద్రలేచాడు. 
  ముగ్గురిలో ఇద్దరు నా వెనక సీట్లో సెటిల్ అయ్యారు. ఆ బకెట్ పక్కన పెట్టుకున్నారు. ఎందుకో కానీ ముగ్గురూ నా వైపు గుచ్చి గుచ్చి చూసారు. అందులో ఒకరి కళ్ళలో నేను అప్రయత్నంగా కళ్ళు పెట్టి చూసాను. నా మనసు కీడు శంకించింది. ఇది ఎప్పుడూ తప్పుడు సంకేతాలు ఇవ్వదు. ఏమి మాట్లాడుకుంటారోనని చెవుల సైజు పెంచి విన్నాను. అది హిందీ భాషే కానీ, హైదరాబాద్ హిందీ లాగా లేదు. గుంటూరు సాయిబుల హిందీ లాగా ఉంది కానీ అందులో తెలుగు పదాలు లేవు. మొబైల్ ఫోన్ బైటికి తీశాను. సంభాషణ రికార్డ్ చేయాలని, వీలయితే వారి ఫొటోస్ తీయాలన్న ఉబలాటం పెరిగింది. వచ్చే పోలిస్ స్టేషన్ దగ్గర బస్సు ఆపించి వారిని తనిఖీ చేయించాలని కూడా అనిపించింది. నాకు తెలిసిన ఒక ఐ పీ ఎస్ అధికారికి ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకున్నాను కానీ తియ్యగా మాట్లాడే ఆ సారు ఇలాంటి మాట సహాయం చేసే రకం కాదని అనిపించి ఊరుకున్నాను. 

ఒక వేళ ముగ్గురూ కలిసి బస్సు దోపిడీ చేస్తే నేను ఎలా స్పందించాలో ఒక ప్లాన్ వేసాను కానీ దాని ప్రకారం రక్తపాతం తప్పేట్లు లేదు. అయినా అదొక అనుభవం అనిపించింది. నన్ను పొడిచినా సరే అందులో ఒక్కడినైనా పట్టుకోవాలని నిశ్చయించాను. ఈ స్టోరీ కి 'ఈనాడు' ఏమి శీర్షిక ఇస్తుందో, అసలీ వార్త వాళ్ళు వేస్తారో చెత్తబుట్టలో వేస్తారో అన్న చెత్త ఊహ కూడా వచ్చింది. 

ఇలా ఒక గంట పాటు నా బుర్ర వాయువేగంతో చావు ఆలోచనలు చేస్తుండగానే వాళ్ళు ముగ్గురూ లేచారు. ఇప్పుడు ఏదో జరగబోతున్నది. పౌరులే తమను తాము రక్షించుకోవాలి, తప్పదు మరి. ఇక నేను ఆగలేకపోయాను. చాలా కరుకైన గొంతుతో... "తూ లోగ్ కిదర్ జానా?" అని అడిగాను... ఫోన్ ను వీడియో మోడ్ లోకి తెచ్చి చాలా విసురుగా. వాళ్ళలో ఒకడు ఏదో ఊరి పేరు చెప్పి నేరుగా డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. బస్సు ఆగింది ఒకస్టాప్ లో. నేను అలర్ట్ అయ్యాను. వాళ్ళు కత్తులు తీయగానే పైనున్న ఒక స్ట్రాంగ్ బాగ్ వాళ్ళ మీదకు విసిరి గొడవ చేసి నిద్రపోతున్న జనాలను లేపాలన్నది పథకంలో మొదటి మెట్టు. ఇంతలో బస్సు ఆగింది, ముగ్గురూ దిగారు. నేను వాళ్ళను వాళ్ళ బకెట్ ను చిత్రీకరించాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ క్లిప్ చూస్తే కటిక చీకటి, బ్లూ బకెట్ తప్ప ఏమీ రాలేదు. ఈ ఎవ్వారం వల్ల  ఒక రెండు గంటల నిద్ర దొబ్బింది. 
తొక్కలో నిద్రదేముంది... చెన్ యింగ్ సాహస కృత్యం తో పోలిస్తే? ఈ నెల ఇరవై న సిచువాన్ ప్రావిన్స్ లో యాన్ అనే ప్రాంతంలో ఈ చైనా టీ వీ రిపోర్టర్ పెళ్లి. మేకప్, పెళ్లి దుస్తుల ధారణ జరిగాయి. ఇంతలో అక్కడ భూకంపం వచ్చింది. చెన్ ఇంగ్ లో రిపోర్టర్ కార్యోన్ముఖు రాలయ్యింది. పెళ్ళీ గిళ్ళీ పక్కన పెట్టి గొట్టం (లోగో) అందుకుని కెమెరా మెన్ తో వీధిలోకి పరుగు పెట్టింది. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన, ఇల్లు కూలిపోయి బీభత్సం జరిగిన ఈ ఘటనను ఆమె రిపోర్టర్ చేసింది. తర్వాతనే పెళ్లి తంతు కానిచ్చింది. ఈ జర్నలిజం బతికి ఉందంటే రామ్ లు, చెన్ యింగ్ (పై ఫోటో) ల వల్లనే అంటే కాస్త అతి అవుతుంది కదా!  
(టైం మాగజీన్ సౌజన్యంతో)

Friday, April 12, 2013

మా టీవీ పై దాడి చెడ్డ పని

డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్టిస్టులు మా టీ వీ కార్యాలయం మీద దాడి చేయడం దారుణం. ఇలాంటి దాడులు సమస్యలను పరిష్కరించవు, సరికదా జటిలం చేస్తాయి. 

నిజానికి ఇలాంటి డిమాండ్స్ విషయంలో ఒక పరిష్కారానికి రావడం కుదరదు. డబ్బింగ్ సీరియల్స్ వల్ల మా జీవితాలు దెబ్బతింటున్నాయి అని ఆర్టిస్టులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి వాదన వింటే అదే సబబని అనిపిస్తుంది. సీరియల్స్ కొనుగోలు చేస్తున్న వారి వాదనా వ్యాపార పరంగా సరైనదే అనిపిస్తుంది.  

మన పరిశ్రమ, మన వాళ్ళు, మన భాష అనే విశాల దృక్పథం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎవరికి వారు నాలుగు డబ్బులు సంపాదించడం మీదనే ధ్యాస పెట్టి బరితెగించి  రెచ్చిపోతుంటారు. తెలుగు సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉంది. వాళ్ళలో కొందరు టెలివిజన్ రంగాన్నీ శాసిస్తున్నారు. ఇది మన ఖర్మ. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకాలని కోరుకుందాం. అప్పటిదాకా ఇరుపక్షాలూ సంయమనం పాటిస్తే మంచిది. 

Monday, April 8, 2013

యూనివర్శిటీ చదువులపై మీడియా హౌజుల ఏడుపు

శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో  జర్నలిజానికి సంబంధించి ఆసక్తికరమైన  కార్యక్రమాలు జరిగాయి. అందులో ఒకటి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ కలిసి "న్యూస్ ఛానళ్ళు: నైతికత-వాస్తవికత" అనే అంశంపై జరిపిన రెండు రోజుల జాతీయ సెమినార్, 'ది హిందూ' పత్రిక "Reporting Terror:How Sensitive is the Media?"అనే అంశంపై సాలార్ జంగ్ మ్యూజియంలో  నిర్వహించిన సింపోజియం. రెంటినీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరంభించి ప్రసంగించారు. 

కట్జూ ప్రసంగం వినాలని శనివారం ఉదయం పది గంటలకల్లా నేను, మా అమ్మాయి మైత్రేయి తెలుగు విశ్వ విద్యాలయం చేరుకున్నాం. అప్పటికి అక్కడ ఒక్కస్వాగత తోరణం (ఫ్లెక్సి) కూడా లేదు. కట్జూ సాయంత్రం వస్తారని తెలిసి, ఇంటికొచ్చి తిని లేచి ఎర్రటి ఎండలో వెళ్లాను. ఎం ఎల్ సీ నాగేశ్వర్ గారిని కలిసి కాసేపు మాట్లాడి, కట్జూ ప్రసంగం విన్నాను. ఎప్పటి లాగానే కట్జూ దేశంలో ఉన్న ఫూల్స్ సంఖ్యను సాధికారికంగా శాతాల్లో (పర్సంటేజీ) చెప్పారు. ఎందుకోగానీ (బహుశా ఉజ్జాయింపు కావచ్చు) దేశంలో ఫూల్స్ శాతాన్ని ఎప్పుడూ ఈ పెద్దాయన 90 శాతం గా చెబుతారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను నమ్మడం తెలివితక్కువతనమని (జ్యోతిష్యం పై చాలా ఏళ్ళుగా ఒక కోర్సు దిగ్విజయంగా నడుపుతున్న తెలుగు యూనివెర్సిటీలో వైస్ చాన్సలర్ సాక్షిగా) ఆయన చెప్పారు. అందరికీ అర్థమయ్యేలా ఆయన చక్కని ఇంగ్లిష్ లో మాట్లాడారు. 

ఇక రెండో రోజు (ఆదివారం) పది గంటల కల్లా సాలార్ జంగ్ మ్యూజియం వెళ్లి సింపోజియం లో పాల్గొన్నాము నేను, మా అమ్మాయి. పలువురు మాజీ సహచరులను కలిసే అవకాశం కలిగింది. 'ది హిందూ' ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ మోడరేటర్ పాత్ర పోషించారు. ఇక్కడ మాట్లాడిన కట్జూ 80 శాతం మంది హిందూ, ముస్లింలు మతోన్మాదులు అని లెక్క చెప్పారు. టెర్రరిజం చరిత్ర చక్కగా చెప్పిన కట్జూ టెర్రర్ కవరేజ్ విషయంలో మీడియా ప్రవర్తన గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఉద్యోగం లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమో లేక ఎవడో ఇచ్చిన డబ్బులు తీసుకుని టెర్రరిజానికి పాల్పడడమో చేస్తారని, మనుషులకు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని కట్జూ సెలవిచ్చారు. నాకు ఇది నచ్చలేదు. ఇదేమి వితండ వాదన!

'ది హిందూ' ఎడిటర్ గారు కట్జూ వాదనను ఖండించడం గానీ, కాస్త టాపిక్ గురించి మాట్లాడమని అడగడం గానీ చేయలేదు. కట్జూ తో తలగోక్కోవడం ఎందుకని అంతా అనుకున్నట్లు ఉన్నారు. తెలుగు వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి గారు, జర్నలిజం డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ కే సుధీర్ కుమార్ గార్ల ప్రోత్సాహంతో సాయంత్రం "Live Coverage in News Channels Vs Journalistic Values" అనే అంశం మీద నేను కూడా ఒక పేపర్ సమర్పించాను. TV-5 వాళ్ళు వై ఎస్ ఆర్ మృతిపై ఒక రష్యన్ వెబ్సైట్ కథనాన్ని తీసుకుని 2010 జనవరి ఏడున దాదాపు నాలుగు గంటల పాటు లైవ్ లో వేడి పుట్టించిన దుర్మార్గాన్ని ఒక కేస్ స్టడీ గా వివరించాను. 

జర్నలిస్టులకు విద్యార్హత విషయంలో ఒక కమిటీ వేసిన కట్జూ ఈ టూర్ సందర్భంగా ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు ఎందుకో? దాని మీద ఆయన మాట్లాడాలని నేను కోరుకున్నాను. సెమినార్ కు హాజరైన మీడియా పెద్దలు కొందరు యూనివెర్సిటీ జర్నలిజం కోర్సులు మారాలని సలహా ఇచ్చారు. ఇక్కడ చరిత్ర ఎక్కువ బోధిస్తారని, ప్రాక్టికల్ ట్రైనింగ్ పెద్దగా ఉండదని వారు అభిప్రాయపడ్డారు. రీసెర్చ్ మెథడ్స్ జర్నలిస్టులకు ఎందుకన్నట్లు మాట్లాడారు. ఇలాంటి వారు బావిలో కప్పలు, వారిది తెలివి తక్కువ, అనాగరిక వాదన. తమ జర్నలిజం స్కూల్స్  పెద్దలు వర్శిటీ విద్యను ఎప్పుడూ చులకన చేస్తారు. రామోజీ గారికైతే వర్శిటీ డిగ్రీ హోల్డర్ల పట్ల భయంకరమైన చిన్న చూపు ఉంది. ఈ అంశంపై నా వాదనను మరొక పోస్టులో రాస్తాను.   

Saturday, April 6, 2013

ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూను బఫూన్ ను చేస్తున్న మీడియా!

ఎవరినైనా ఆకాశానికి ఎత్తడానికైనా,  పాతాళంలోకి తొక్కడానికైనా మీడియాకు కనిపించని, అలిఖిత ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఎవరినైనా హీరో ను చేసే లేదా విలన్ ను చేసే లేదా బఫూన్ గా  చిత్రీకరించే సామర్ధ్యం మీడియాకు ఉంది. ఇది తెలియక చాలా మంది హీరోనో, విలనో, బఫూనో అవుతుంటారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం మీడియాకు దొరికిన బకరా... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీ సీ ఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ. ఇలానే మీడియా విష వలయం లో పడి నలిగి నుజ్జై కార్నర్ అయిన ప్రముఖుల్లో ఎలెక్షన్ కమిషన్ మాజీ చైర్మన్ టీ ఎన్ శేషన్ ఉండేవారు. మీడియా వేతనాలపై సిఫార్సు చేయడానికి నియమించిన బోర్డుకు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజథియ పైనా మీడియా కత్తి కట్టి నానా రచ్చ చేసింది కానీ ఆయన నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మెలిగి బఫూన్ కాకుండా బతికిపోయారు. ఇలాంటి వీళ్ళను మీడియా బఫూన్లుగా చిత్రీకరించడంలో ఒక పాటర్న్ ఉంది. 


కట్జూ విషయాన్నే తీసుకోండి. వచ్చీ రాగానే ఆయన నానా హడావుడి చేసారు. మీడియా అపసవ్య పోకడలకు వ్యతిరేకంగా చాలా ప్రకటనలు చేసారు. దీని మీద మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత కట్జూ మాట్లాడిన ప్రతిదీ ఒక సంచలనం అవుతూ వస్తున్నది. ఆ పబ్లిసిటీ ఎలాంటిదో బేరీజు వేసుకోకుండా, తన ముక్కుసూటితనం, గొప్పతనం, మేధావితనం వల్ల ఇంత మంచి పేరు వస్తుందన్న పిచ్చి భ్రమలో కట్జూ పడిపోయారు. భారత దేశంలో తన మాటకు, అభిప్రాయానికి చాలా గొప్ప విలువ వున్నట్లు మీడియా భ్రమింపజేస్తే కట్జూ ఎకాయికి ఆ వలలో చిక్కుకున్నారు. తనకు సంబంధం లేని అంశాలపై ముఖ్య మంత్రులకు లేఖలు రాయడం, కొందరు నాయకుల మీద స్వీపింగ్ కామెంట్స్ చేయడం, సంజయ్ దత్ ను వదిలేయమనడం, అందులో భాగంగా ఇంగ్లిష్ ఛానెల్స్ డిబేట్లలో వితండవాదం చేయడం, జర్నలిస్టులు బుర్రతక్కువ సన్నాసులని బహిరంగంగా అనడం, జనాలు కులాల ప్రాతిపదిక ఓట్లు వేసే గొర్రెలు అన్నట్లు, తాను ఇవన్నీ 'కామన్ మాన్' హోదాలో చెబుతున్న మాటలని  మాట్లాడడం ఇందుకు ఉదాహరణలు. 

 ఈ సమాజంతో ఉన్న ఒక గొప్ప చిక్కును నాలాగానే కట్జూ అర్థం చేసుకోలేకపోతున్నారు. జర్నలిస్టులలో సరైన విద్యార్హతలు, వృత్తి నిబద్ధత  లేని పుచ్చు దోసకాయలు ఎక్కువని, జనాలు బీరు-బిర్యాని తీసుకుని ఓట్లు వేస్తారని చాలా మందికి తెలుసు. ఎంత సత్యమైతే మాత్రం... అంత ఓపెన్ గా అలాంటి ప్రకటనలు చేయకూడదన్న మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని ఆయన మరిచిపోతున్నారు. జర్నలిస్టులు అంతా మహా మేధావులని, ఈ మహనీయులు లేకపోతే దేశం వెంటనే కుప్పకూలిపోతుందని, ఓటర్లు ప్రజాస్వామ్య విధాతలని చెప్పాలి బైటకు. అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే మీడియా కావాలనుకుంటే హీరో ను చేస్తుంది, లేదంటే జనాలను ఎగదోసి పిచ్చి కుక్క అనే ముద్ర వేస్తుంది. కట్జూ లాంటి న్యాయ కోవిదుడికి ఈ సింపుల్ సూత్రం ఎప్పుడు ఆర్థం అవుతుందో కదా!  
Photo courtesy: The Hindu

Monday, April 1, 2013

'ప్రజాశక్తి' కి డాక్టర్ రెంటాల జయదేవ

హైదరాబాద్ లో 'ఈనాడు' లో, చెన్నై లో 'ఇండియా టుడే' లో రెండు దశాబ్దాల పాటు పనిచేసిన డాక్టర్ రెంటాల జయదేవ మొన్నీ మధ్యన 'ప్రజాశక్తి' లో చేరారు. ఆయన 'ప్రజాశక్తి' లో ఫీచర్స్ ఎడిటర్ గా నియమితులయ్యారు. 
పనిలో పనిగా 10 టీవీ, వారి పబ్లిషింగ్ హౌస్ పనులూ కొన్ని తను పంచుకోవాల్సి ఉంటుందని అనుకుంటా.

'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో మా బ్యాచ్ లో మాతో పాటు చదువుకున్న జయదేవ ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి కుమారుడు. ఈ మధ్యనే జయదేవ సినిమా సమీక్షలకు నంది అవార్డు వచ్చింది. మా వాడు మళ్ళీ హైదరాబాద్ రావడం ఈనాడు లో పనిచేసిన మిత్రులకు చాలా ఆనందం కలిగించింది. ఆ మదరాసు లో ఎన్ని రోజుల్రా నాయనా? అని జయదేవను సతాయించిన వారిలో నేనూ ఒకడిని. మన పిల్లలు బాల్యంలో హాయిగా మన నేల మీద పెరగాలని, పెద్ద చదువుల కోసమో, రెక్కలొచ్చాకనో  అవకాశాల కోసం రాష్ట్రం, దేశం దాటడంలో తప్పులేదని నాకు అనిపిస్తుంది. 

తెలకపల్లి రవి గారు సంపాదక బాధ్యతలు స్వీకరించాక 'ప్రజాశక్తి' లో మార్పులు బాగా జరుగుతున్నాయి. నాణ్యత పెంచే క్రమంలో భాగంగా పెద్ద జీతాలు ఇచ్చి అయినా సరే సరుకున్న జర్నలిస్టులను నియమించాలని కామ్రేడ్లు భావిస్తున్నారు. 

గోపాల రమేష్ 

జీ 24 గంటలు ఛానెల్ హెడ్ శైలేష్ రెడ్డి సేన లో ప్రముఖుడైన గోపాల రమేష్ ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరాడని సమాచారం. కష్టపడి చదువుకుని ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్ లోనో, ఎకానమిక్స్ లోనో గోల్డ్ మెడల్ సాధించి జర్నలిజం లోకి వచ్చిన రమేష్ 'ఈ టీవీ' లో పనిచేసాడు. జీ టీవీ లో కీలక బాధ్యతలు పోషించాడు. జీ ని సత్తిబాబు కొన్నాక రమేష్ లాంటి జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు. స్పార్క్ ఉన్న జర్నలిస్టులలో రమేష్ ఒకడు. 

వల్లూరి రాఘవరావు

మా బ్యాచు లో చదువుకున్న వల్లూరి రాఘవరావు కూడా ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరాడట. 'ఈనాడు' నుంచి వెళ్లి ఎడిటర్ అయిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో ఒకడు రాఘవ. 'ఈనాడు' లో కంట్రిబ్యూటర్ గా జీవితం ఆరంభించి  సాహిత్యం లో దిట్టగా మారి 'ఆంద్ర ప్రభ'కు రాఘవ ఎడిటర్ అయ్యాడు. తర్వాత ఎన్ టీవీ లో, స్టూడియో ఎన్ లో పనిచేశాడు. సమకాలీన తెలుగు జర్నలిజం లో బెస్ట్ పెన్నులలో రాఘవది ఒకటి. 

బాలభాస్కర్ 

'ఈనాడు' వదిలి వెళ్లి బైర్రాజు ఫౌండేషన్ లో కీలక బాధ్యతలు పోషించిన జర్నలిస్టు పిల్లలమఱ్ఱి బాలభాస్కర్. ఈనాడు లో వసుంధర పేజీని ఒక స్థాయికి తెచ్చిన జర్నలిస్టులలో తను ఒకడు. సత్యం కంపెనీ లో విపరిణామాల నేపథ్యం లో ఆ ఫౌండేషన్ వదిలి ఎన్ టీవీ లో కొంతకాలం, ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో కొంతకాలం పనిచేసాడు. ఏబీఎన్ లో భాస్కర్  డిజైన్ చేసిన 'కాఫీ విత్ కాంతం' నాకు కొద్దిగా నచ్చేది. తను మళ్ళీ 'ఈనాడు' వారి నెట్ ఎడిషన్ లో చేరినట్లు సమాచారం. 

తను ఈశ్వర్ 

నిన్న 10 టీవీ కి సంబంధించి నాకు గుర్తు రాని యాంకర్ పేరు 'ఈశ్వర్'. తను జీ 24 గంటలు లో ఉండే వారు. మొదట్లో ఆయన్ను చూసి ఈయన యాంకరా? అని అనుకున్నాను. ప్రతిభను పెంచుకుంటూ తనకు మంచి యాంకర్ గా ఎదిగారు. ఇలా ఇష్టపడిన ఫీల్డులో కష్టపడి పైకి వచ్చిన వారు మార్గదర్శకులు. 

నోట్: మిత్రులారా... పత్రికలూ ఛానెల్స్ లో మార్పులు చేర్పులు గురించి మరి కొన్ని పోస్టులు రాయబోతున్నాను. మీ మిత్రులకు సంబంధించిన లేదా జంపింగ్స్ గురించి మీకు తెలిసిన సమాచారం ఉంటే దయచేసి నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి: srsethicalmedia@gmail.com