జర్నలిజంలోకి ఇష్టపూర్వకంగా వచ్చి కష్టాలూ నష్టాలూ ఎన్ని ఎదురైనా...తట్టుకుని ఈ వృత్తినే అంటిపెట్టుకుని ఉండే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇది ఉత్తమమైన మొదటి కోవ. ఈ వృత్తిలోకి వచ్చాక...దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని అనుకుని నైతికతతో రాజీపడి కులం ప్రాంతాలను అడ్డం పెట్టుకుని విలువలను గాలికొదిలే సార్లకు, తోటి జర్నలిస్టులను వుజ్జోగాల నుంచి తప్పించడానికి ఏ మాత్రం వెనుకాడని మూర్ఖులకు, యజమాని చెప్పిందే వేదమని నమ్మి ప్రచారం చేసే బ్యాచులకు ఖైరతాబాద్, జూబిలీహిల్స్ లలో కొదవే లేదు. ఇందులో మొదటి కోవకు చెందిన జర్నలిస్టు రెంటాల జయదేవ. ఉత్తమ సినీ విమర్శకు గానూ జయదేవ కు నంది అవార్డు వచ్చింది.
నాకు సన్నిహిత మిత్రుడు అని చెప్పడం కాదు కానీ...జయదేవలో పాతతరం జర్నలిస్టులకు ఉండాల్సిన సద్గుణాలు చాలా ఉన్నాయి. "ఎందుకులే బాబూ...మమ్మల్ని ఇలా బతకనివ్వండి.." అనుకుంటూ తన పని తాను చేసుకుపోయేగడసరి. ఇచ్చిన పనికి పూర్తి న్యాయం చేయాలని తపిస్తూ...నాణ్యతకు పెద్దపీట వేసే మనిషి. తాను దగ్గరి మనుషులు అనుకుంటే తప్ప మనసులో భావాలను, గుండెలో చిందులు వేసే చిలిపి తనాన్ని వెలికి తీయని మంచి మిత్రుడు. తనకు జరిగినా, ఇతరులకు జరిగినా అన్యాయాలను నిశితంగా విమర్శించే స్వభావం ఉన్నవాడు. అందుకే తానంటే...మా బ్యాచులో దాదాపు అందరికీ చాలా ఇష్టం.
'ఈనాడు జర్నలిజం స్కూల్' లో మేమంతా కలసి చదువుకున్నాం 1992 లో. ఈనాడు కు గుండెకాయ లాంటి జనరల్ డెస్క్ లో కలిసి పనిచేశాం. "ఈ అబ్బాయి గ్రాంథీక భాష రాస్తున్నాడండీ..." అని అప్పట్లో ఈనాడు జనరల్ డెస్క్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఒక మానసిక వికలాంగుడు రామోజీ రావు గారికి తప్పుడు రిపోర్ట్ ఇస్తే...జయదేవ ఎంతగానో నొచ్చుకుని 'ఈనాడు' నుంచి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఒక పత్రికకు 'ఎడిటర్' గా ఉండి...అక్కడి జర్నలిస్టులను నంజుకు తింటున్న ఆ 'మా.వి.' గాడిని ఒక రోజు కోపంతో పక్కకు తీసుకు వెళ్లి అడిగాను...."గుండె మీద చేయి వేసుకుని చెప్పండి....మీరు జయదేవ మీద చేసిన ఫిర్యాదులో నిజమెంత..." అని. అప్పట్లో న్యూస్ టుడే ఏం.డీ.గా ఉండి (ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న) ఒకడి వల్ల, మరొక ఇన్ చార్జ్ ప్రోద్బలం తో తానూ అలా తప్పుడు నివేదిక ఇచ్చానని 'మా.వి.' ఒప్పుకున్నాడు. మా ప్రిన్సిపాల్ బూదరాజు రాధాకృష్ణ గారి మీద కోపం తో వీళ్ళు జయదేవను టార్గెట్ చేసారు. ఇలా....అర్థంతరంగా ఈనాడు నుంచి వెళ్ళిన జయదేవ 'ఇండియా టుడే' లో చేరి ఇప్పుడు అసోసియేట్ కాపీ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. తెలుగు నేలకు దూరంగా...వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. స్వర్గస్థులైన వారి నాన్న గారు, బహు గ్రంథకర్త రెంటాల గోపాల కృష్ణ గారు ఎంతో సంతోషించే మంచి వార్త ఇది.
నేను తర్వాత ఐదేళ్లకు 'ఈనాడు' వదిలి చెన్నై లోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చేరినప్పుడు జయదేవను కలిసేవాడిని. నవ్వుతూ...తుళ్ళుతూ మాట్లాడే జయదేవ నాకు మంచి స్నేహశీలి గా అనిపించేవాడు. మంచి ఆలోచనలను ప్రోత్సహించేవాడు. తరచి తరచి అడిగితె తప్ప సలహాలు ఇవ్వడు. మా బ్యాచులో మొదటి పీ.హెచ్ డీ అతనిదే. తెలుగులో చేసాడు. జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. తాను ప్రమాదకరం అనుకున్న వ్యక్తులతో ఆచితూచి మాట్లాడడం, అంటీ ముట్టనట్లు ఉండడం వల్ల తనను అపార్థం చేసుకునే వారూ కొందరు నాకు తారస పడ్డారు. అది ఆయా వ్యక్తులకు సంబంధించిన విషయం. జయదేవకు నంది అవార్డు రావడం మాత్రం నాకు నా మిత్ర బృందానికి ఎంతో ఆనందం కలిగించింది.
మా వాడు ఎంతటి...మొహమాటస్తుడో తెలుసా మీకు? తాను రెండేళ్లుగా నడుపుతున్న బ్లాగు "ఇష్టపది" గురించి కనీసం మాట మాత్రమైనా నా లాంటి మిత్రుడికైనా చెప్పలేదు. నాకిది ఈ పోస్టు రాసే ముందు తారసపడింది. ఇదేం పోయే కాలం అంటే...."ఎందుకులే బాబు...మా బాధ మమ్మల్ని పడనివ్వండి..." అని ఒక నవ్వు నవ్వుతాడు. "జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది" అని బ్లాగు స్క్రోల్ లో ప్రకటించిన జయదేవ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.