Monday, May 31, 2010

అయ్యా.....ఇదేమి తెలుగు మీడియా?

జర్నలిజంలో దాదాపు ముప్ఫై ఏళ్ళు పనిచేసి...బోధన వైపు మారాలనుకుంటున్న ఒక జర్నలిస్టును ఒక ఉద్యోగం నిమిత్తం ఈ రోజు ఇంటర్వ్యూ చేశాను. చక్కని ఇంగ్లిష్ మాట్లాడుతున్నారాయన. కోర్ జర్నలిజాన్ని ఇప్పటి మీడియా ఎలా మిస్ అవుతున్నదీ సోదాహరణంగా చెప్పారు. 

పలు విషయాలు మాట్లాడాక..."Whats your opinion on Telugu news channels?" అని అడిగాను. ఈ ప్రశ్నకు ఆయన తడుముకోకుండా చెప్పిన సమాధానం విని నవ్వాలో ఏడవాలో తెలియక నేను పెద్ద పెట్టున నవ్వాను. ఆ నవ్వుతున్నప్పుడు ఏదో ముల్లు గుచ్చినట్లు గుండెలో తెలియని బాధ ఫీల్ అయ్యాను. ఇంతకూ ఆయన చెప్పిన సమాధానం: 

"Thank God...these 18 Telugu channels are not in Kashmir. If that is the case, by now Kashmir would have been separated from our country." 
దీనికి అనువాదం ఏమిటంటే....."అదృష్టవశాత్తూ మన దగ్గర వున్న పద్దెనిమిది ఛానెల్స్ (లాంటివి) కాశ్మీర్లో లేవు. అక్కడే ఇవి వుండివుంటే...ఈ పాటికి కాశ్మీర్ మన దేశం నుంచి విడిపోయి వుండేది."


ఆయన చాలా సీరియస్ గా ఈ సమాధానం చెప్పారు. ఇంతకు మించి ఆయన కొనసాగింపుగా ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. ఆ ఇంటర్వ్యూ అయింది...లంచ్ ప్రాంతంలో. అయినా...ఈ పోస్ట్ రాసే వరకూ ఆ మాట నన్ను వెన్నాడుతూనే వుంది. 

ప్రొఫెషనలిజం లేని చెత్తగాళ్ళు, కులగజ్జి-రాజకీయతీట ఉన్న అవినీతిపరులు , నీతీ రీతీ లేని డబ్బు కక్కుర్తి వ్యాపారులు, దేశభక్తి-సమాజ హితం పట్టని నికృస్టులు....మీడియాను ఏలుతుంటే....వారు ప్రసారం చేసే చెత్త కథనాలు, జగడాలమారి వార్తలు వింటే....ఈ సీనియర్ జర్నలిస్టు మాట అక్షర సత్యం అని అనిపిస్తున్నది. మీరేమంటారు?

Sunday, May 30, 2010

e-తెలుగు రచయితల సదస్సు విజయవంతం

జర్నలిస్టుల కన్నా రచయితలు ఎక్కువ బద్ధకస్తులు కారని నిరూపితమయ్యింది. e-తెలుగు వారు ప్రత్యేకంగా తెలుగు రచయితల కోసం ఆదివారం నిర్వహించిన సమావేశం చాలా విజయవంతం అయ్యింది.
లక్డి-క-పూల్ లోని హనీ పాట్ సెంటర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో దాదాపు డెబ్భై మంది హాజరు కావడంతో నిర్వాహకులు మూడు వేర్వేరు గదుల్లో మీటింగ్స్ నిర్వహించాల్సి వచ్చింది. 

"మేము పడిన శ్రమ నెరవేరింది. చాలా మంది రావడం ఆనందం కలిగించింది. కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె శాంత సుందరి కూడా వచ్చారు," అని నిర్వాహకులలో ఒకరైన బీ.సుజాత గారు చెప్పారు.

'ఈనాడు' సిటీ ఎడిషన్లో నిన్న వచ్చిన వార్త, ఈ రోజు ఎంగేజ్మెంట్ కాలంలో వచ్చిన ప్రకటన బాగా ఉపయోగపడ్డాయని ఆమె తెలిపారు. 

e-తెలుగు పక్షాన శిరీష్ కుమార్ తుమ్మల (చదువరి), వీవెన్, సుజాత, సతీష్ యనమండ్ర, సత్యప్రసాద్ అరిపిరాల, రవిచంద్ర ఇనగంటి, శ్రీనివాస రాజు దాట్ల, శ్రీనివాస కుమార్ రచయితల అనుమానాలు తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరిస్తారండీ...ఈ-జ్ఞానం (సీ.డీ), మిత్రత్వం, చల్లని కూల్ డ్రింక్ నవ్వుతూ...ఉచితంగా!?

నేను జాన్ హైడ్ గారిని మాత్రం మిస్ అయ్యాను. మహేష్ కుమార్ కత్తి వంటి వారిని కలవడం ఆనందం కలిగించింది. నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రులు కలవడం, ఈ బ్లాగ్ గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించాయి. ఈ సతీష్ గారితో కలిసి కాసేపు బైటకు వెళ్ళడం వల్ల నేను...ఈ సమావేశం ఉపయోగం పై రచయితల వెర్షన్ తీసుకోలేకపోయాను. 
శిరీష్ కుమార్ అంజర్జాలంలో తెలుగులో వస్తున్న మార్పులు, తెలుగు వికీ పిడియ గురించి మాట్లాడగా... వీవెన్ తెలుగు సాఫ్ట్ వేర్లు, ఫాంట్లు, ఉపకరణాలు మొదలైన సాంకేతిక అంశాల గురించి వివరించారు. బ్లాగు ఎలా తయారు చేసుకోవాలి,  దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?...అన్న అంశాన్ని సత్యప్రసాద్ వివరించారు. రవిచంద్ర, శ్రీనివాస రాజు బ్లాగెలా తయారు చేసుకోవాలో ప్రత్యక్షంగా చూపించారు.
సమావేశానికి హాజరయిన వారిలో చాలా మంది ఆసక్తిగా తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. 

నిర్వాహకులు అందించిన జాబితా ప్రకారం...సదస్సుకు హాజరైన ప్రముఖ రచయితలు/త్రులు....శాంతసుందరి (కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె), మంత్రవాది మహేశ్వర్, కొండేపూడి నిర్మల, గోపరాజు రాధాకృష్ణ, ఇందూ రమణ, దాసరి వెంకట రమణ (ఈయన తో పాటు బాల సాహిత్య పరిషత్ సభ్యులు కూడా వచ్చారు), చొక్కాపు వెంకట రమణ.


"ఇంకా ఎవరైనా ప్రముఖులున్నారేమో, అందర్నీ ప్రత్యక్షంగా కలవడం కుదరలేదు. అంతే కాక, యువభారతి, వికాస ధాత్రి వంటి సాహితీ సంస్థల సభ్యులు కూడా వచ్చారు," అని నిర్వాహకులు తెలిపారు.
జర్నలిస్టుల కోసం నిర్వహించిన సమావేశం కంటే ఎక్కువమంది జర్నలిస్టులు ఈ రచయితల సదస్సుకు హాజరు కావడం విశేషం! ఆ మధ్యన జర్నలిస్టుల కోసం నిర్వహించిన సమావేశానికి పట్టుమని పది మందైనా రాలేదు.
Photo courtesy: Sujatha

Saturday, May 29, 2010

జర్నలిస్టులా??....రాజకీయ కార్యకర్తలా???

అలనాడెప్పుడో సత్యకాలంలో....ఎడిటర్లు జేబులో రాజీనామా లేఖలు పెట్టుకుని తిరిగేవారట. పత్రిక యజమాని...తమ సంపాదకీయ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తే...ఆ రాజీనామా మొహాన కొట్టి ఇంటికి వెళ్ళే వారట. నీతి, సత్యం కోసం....సుఖాన్ని, హోదాను వదులుకోవడానికి వెనుకాడని రోజులవి. 

ఇప్పుడు కాలం మారింది, జర్నలిజం రూల్స్ మారిపోయాయి. యజమానుల స్వరూపం మారిపోయింది. భూ ఆక్రమణదారుడు మూడు, నాలుగు ఛానెల్స్ పెట్టి....సంపాదకీయ సమావేశాలకు నిస్సిగ్గుగా అధ్యక్షత వహించి...'ఈ వార్త వాడండి...ఆ వార్త వాడండి...' అని తలపండిన జర్నలిస్టులకు ఆదేశాలు జారీచేసే దుర్మార్గపు రోజులు దాపురించాయి. 'సార్...మీ ఐడియా లు అమోఘం...మీది నిజంగా జర్నలిస్టు బుర్ర,' అని తెగ పొగిడి పదవి పదిలం చేయించుకునే...మహానుభావుల హవా నడుస్తున్న రోజులివి. అంతెందుకు--
ఇంతకు ముందు అనుకున్నట్లు...దావూద్ ఇబ్రహీం లేదా కసబ్...'ఒక వంద కోట్లతో ఛానల్ పెడదామని అనుకుంటున్నా...' అని ప్రకటన చేస్తే...మన సీనియర్ జర్నలిస్టులలో ఒక సెక్షన్ ఒకడికి తెలీకుండా ఒకడు వాళ్లకు మెయిల్స్ పంపుతుంది. అలాంటి ఆత్మలు చచ్చిన సీనియర్ జర్నలిస్టులు....బంజారా హిల్స్ లో బొచ్చడుమందని అబ్రకదబ్ర చెబుతాడు...నిజమో కాదో కానీ. 

హైదరాబాద్ లో మురికి కాల్వల మాదిరిగా ఎక్కడెక్కడి నుంచో పుట్టుకువచ్చిన పెట్టుబడుల ప్రవాహంతో పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ మీడియా అధిపతులు అవుతున్నారు. జర్నలిజాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారు. డబ్బు కోసం నానా గడ్డికరిచే, అడ్డదారులు తొక్కే నయా జర్నలిస్టు జాతి...పావలా డబ్బుకు వంద రూపాయల యాక్షన్ చేస్తుంటే...నికార్సైన జర్నలిస్టులు లోలోన కుమిలిపోవాల్సిన దుస్థితి దాపురించింది. 

'ఛీ..ఛీ...అనవసరంగా ఈ రొంపి లోకి దిగాం...తెలియక,' అనే జర్నలిస్టులు కోకొల్లలు. 'నా కూతురును కానీ...కొడుకును గానీ...పొరపాటునైనా జర్నలిస్టును చేయను,' అనే మిత్రులు ఈ ఫీల్డులో ఎక్కువ మంది వున్నారు.

నేను తురుంఖాన్ అని ఈ బ్లాగ్ లో చాలాసార్లు రాసిన ఒక సీనియర్ జర్నలిస్టు పిలిస్తే వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను ఆ మధ్య. ఉదయం పూట ఏదో ప్రోగ్రాం చేయమని అంటే...'ఇది తెలుగు దేశం ఛానెల్ కదా. మనకు స్వేచ్ఛ ఉంటుందా?' అని అడిగాను. 'ఇప్పుడు ఛానెల్స్ అన్నీ అలాగే వున్నాయి రామూ...మనం కొద్దిగా అడ్జెస్ట్ కావాలి. తప్పదు కదా,' అని సారు సెలవిచ్చారు. పాపం అతనిదీ నిస్సహాయ స్థితి. ఆత్మను అమ్మేయక తప్పలేదు. మీకు తెలుసా.....ఇప్పుడు కాంగ్రెస్ కు పక్కాగా నాలుగు ఛానెల్స్, తెలుగు దేశంకు మూడు వున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సమీకరణలు మారతాయి.

'ఆత్మలను అమ్ముకుంటున్న జర్నలిస్టులు' అనే శీర్షికన ఇంకా పంచ్ తో ఈ పోస్టు రాయాలని ఉంది. కానీ...నేను కూడా ఇరవై ఏళ్ళు ఇదే వ్యవస్థలో పనిచేసి బైటికి వచ్చాక సుద్దులు చెప్పడం...అసహజంగా ఉంటుందని భావించాను. 'ఈనాడు' లో ఉండగా ఆ పత్రిక చేసిన తెలుగు దేశం భజనలో లీడ్స్, హెడ్ లైన్స్ విషయంలో నా పాపం కూడా ఉండకపోదు. ఎవడో లైన్  చెబితే...కథనాన్ని గానీ, పేజ్ మేకప్ గానే నేను ఎప్పుడూ మార్చలేదు. 'మనం జిత్తులమారి చంద్ర బాబుకు ఎందుకు వత్తాసు పలకాలి?' అని రామోజీ రావు గారిని ఒక సమీక్ష సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా నిలదీసిన వారిలో నేను ఒకడిని. 'రాష్ట్ర శ్రేయస్సు కోసం...' అని ఆయన చెప్పినప్పుడు ఇక మనం ఏమి వాదిస్తాం? 

'ది హిందూ'లో అసలు ఈ పరిస్థితి ఉండదని చాలా మంది అనుకుంటారు గానీ...నేను ఇలాంటివి రెండు సందర్భాలు ఎదుర్కున్నాను. చైనా అనుకూల వైఖరి కనబరిచే ఆ పత్రిక కు దలైలామా అంటే పడదని అనుకుంటా. ఒక సారి దలైలామా...నాగార్జున సాగర్ వస్తే...చచ్చీ చెడి నేను, నా ఫోటోగ్రాఫర్ దాన్ని కవర్ చేసాం. ఆ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదని ఆదేశాలు వచ్చినప్పుడు...కొద్దిగా నొచ్చుకున్నాను. మర్నాడు ఆ వార్తకు లభించిన ప్రాధాన్యం చూస్తే....విషయం పూర్తిగా బోధపడింది.

మరొక సారి...ఒక పెద్ద సారు...కోకాకోలా కు అనుకూలంగా ఒక వార్త రాయమని ఆదేశం పంపారు. అది నాకు ఒక షాక్. జనాల నీటి హక్కును ఉల్లంఘిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఒక కంపనీ కి అనుకూలంగా ఒక జర్నలిస్టు అలా నాకు అసైన్ చేయడం నచ్చలేదు. మొహానే...'నో' అంటే బాగుండదని....ఆయన ఆదేశం మేరకు ఫీల్డ్ విజిట్ చేశాను. అక్కడ స్టోరీ లేదని చెప్పగానే మా మంచి సారు ఓకే అన్నారు. కుదరదు...రాయాల్సిందే అని ఆయన అంటే...నా పని ఏమయ్యేదో కదా! కోకకోలా పీ.ఆర్.ప్రతినిధి చేసినన్ని ఫోన్లు నాకు మానవ మాత్రుడు ఎవ్వడూ చేయలేదు. అయినా...మన ముందు...ఆ పాచికలు పారలేదు. 

నిన్న కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా లో జరప తలపెట్టిన యాత్ర, దాని తాలూకు రగడపై టీ.వీ.ఛానెల్స్ కవరేజ్ చూశాక...'వీళ్ళు జర్నలిస్టు లా...పొలిటికల్ యాక్టివిస్టులా?' అనిపించింది. గ్రౌండ్ రిపోర్ట్ ను కాంగ్రెస్ అనుకూల ఛానెల్స్ ఒక రకంగా...ఇతర ఛానెల్స్ ఒక రకంగా చూపాయి. 'సాక్షి' ఛానల్ ను, టీ.ఆర్.ఎస్. వారి 'రాజ్ ఛానల్' ను మార్చి మార్చి చూస్తే...ఫీల్డు మీద ఉన్న రిపోర్టర్లు, స్టూడియో లో ఉన్న యాంకర్లు, ప్రజెంటర్లు వాడిన పదజాలం, హావభావాలలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. మూడు నాలుగు ఛానెల్స్ మాత్రం 'గ్రౌండ్ రియాలిటీ' ప్రాతిపదికన వార్తలు అందించాయి.

కొందరు యాంకర్లు తమ యాజమాన్య విధానానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. విజువల్స్ చూపడంలో కూడా చాలా తేడా కనిపించింది. 'మనం...వాస్తవాలకు కట్టుబడి ఉండాలి,' అని జర్నలిస్టులు చెప్పాలని అనుకున్నా చెప్పలేని దుస్థితి. ఒక రకంగా పోవాలని సీనియర్లు ప్రయత్నించినా...కుదరదు. కెరీర్లో ఎదుగుదలే ముందు, నీతి తర్వాత...అని నూరిపోసి ఈ యాజమాన్యాలు కొత్త బ్యాచులను తయారు చేసుకున్నాయి. వారు ఏ పనికైనా సిద్ధంగా ఉంటారు. ఏటికి ఎదురీద్దాం...అనుకునే వారికన్నా...సుఖ జీవనం కోసం...ప్రవాహంలో జలకాలాడేద్దాం...అని భావించే వారు ఎక్కువయ్యారు.

మొన్నటి దాకా...తెలుగునాట జర్నలిజానికి జబ్బు చేసిందని అనుకున్నాం. ఇప్పుడు జబ్బు ముదిరి....జర్నలిజం మరణశయ్య మీదకు చేరింది. దీనికి చికిత్స కనుచూపు మేరలో లేదు. ఇది కాకులు, గద్దలకు పండగ కాలం. ఈ పాడు మేడిపండు ప్రజాస్వామ్యంలో పురుగులు, పరాన్నభుక్కులవి కాక రోజులు మరెవరివి?

Thursday, May 27, 2010

రచయితల కోసం ఆదివారం 'ఈ-తెలుగు' సమావేశం

అంతర్జాలం (వెబ్ ప్రపంచం) లో తెలుగు వ్యాప్తి కోసం నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్న సంస్థ ఈ-తెలుగు. ఈ సంస్థ వారు ఈ ఆదివారం (May 30) తెలుగు రచయితల కోసం ఒక ప్రత్యేక ఉచిత అవగాహనా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం లక్డి-క-పూల్ ప్రాంతంలో ఏ.సీ.గార్డ్స్ బస్ స్టాప్ ఎదురు సందులో ఉన్న హనీపాట్ కెరీర్ కాంపస్ అనే చోట జరుగుతుందని నిర్వాహకులలో ఒకరు, నిబద్ధత గల బ్లాగర్ బి.సుజాత గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది రచయితలకు బాగా ఉపయోగపడే సమావేశం. మనసులో భావాలు ఎంతో ఓపిగ్గా, ప్రేమతో రాసుకున్నాక....ఎవడు పబ్లిష్ చేస్తాడా అని కళ్ళు కాయలు కాసేలా చూడాల్సిన పనిలేకుండా మన వర్కుకు మనమే ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రచారం పొందవచ్చో 'ఈ-తెలుగు' వాళ్ళు సులువుగా అర్థమయ్యేలా చెబుతారు. 

ఈ మహదవకాశాన్ని కవులు, రచయితలు వాడుకోవడం చాలా లాభదాయకం. కాణీ ఖర్చు కాకుండా...టెక్నికల్ అంశాలు నేర్చుకోవడానికి, మంచి మిత్రమండలిని ఏర్పరుచుకోవడానికి ఇది వేదిక అని చెప్పగలను. రచయితలైన బ్లాగర్స్ ఈ అవకాశాన్ని వాడుకోవడం తో పాటు సాహిత్యాభిలాషులైన మీ మిత్రులను కూడా సమావేశానికి తెసుకురండి. 
పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9396533666

అనుక్షణం వెకిలి చూపుల దాడి: మహిళలకు రక్షణేదీ?

ఒక పాతికేళ్ళు టూ-వీలర్ మీద, మరొక పదేళ్ళు టూ-వీలర్ తో పాటు ఫోర్- వీలర్ మీద తిరిగి విసుగెత్తి...స్పాండిలిటిస్ తిరగబెడుతుందన్న భయంతో...ఈ మధ్య పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను విపరీతంగా వాడుతున్నాను. బస్సు, రైలు ఎక్కుతుంటే...చాలా మంది పరిచయం అవుతున్నారు, చాలా విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళ జీవితాలు, అభిప్రాయాలు, బతుకు పోరాటాలు చాలా ఆసక్తికరంగా, విచిత్రంగా ఉంటున్నాయి. 'సిటిజెన్ జర్నలిజం' పేరిట అవి రాయడానికి వేరే బ్లాగ్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 
అంతకన్నా ముందు...అన్ని బహిరంగ ప్రదేశాలలో రోజురోజుకు ఎక్కువవుతున్న ఒక పెద్ద బెడద గురించి ప్రస్తావించడం ఈ పోస్టు అసలు ఉద్దేశ్యం. ఇది పూర్తిగా ఈవ్ టీజింగ్ కాని ఈవ్ టీజింగ్, ఒక మానసిక దౌర్భల్యం, జబ్బు. ఒక సంస్కార రాహిత్యం లేదా కుసంస్కారం. మహా ఉన్మాదం.
 

ఈ బహిరంగ ప్రదేశాలలో...కనిపించిన ప్రతి అమ్మాయిని/మహిళను కొరుక్కు తినేట్లు చూసే మగ పిల్లలు, కాలేజ్ కుర్రోళ్ళు, పురుషపుంగవులు మరీ ఎక్కువయ్యారు. అసలీ అమ్మాయిలు ఎలా భరిస్తున్నారో కానీ...నాకైతే ఈ వారం లోనే రెండు మూడు సంఘటనలు ఒళ్ళు మండేలా చేసాయి. 


నిన్నటికి నిన్న ఒక బేవార్స్ గాడు రైల్వే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు చలాకీగా వెళ్ళిపోతున్న ఒక అమ్మాయిని చూసి నా పక్కన వుండి విజిల్ వేసి వెకిలిగా నవ్వాడు. దానికి ఆ చిట్టి తల్లి అపరాధం చేసిన దానిలాగా తలవంచుకుని వెళుతుంటే...బాధేసింది. వాడు, వాడి చుట్టూ ఒక ఆవారా మూక ఉంది. అందరూ వెకిలి వెధవలే. 'ఇదేమి పని...' అందామా? అంటే అది ఒక గొడవకు దారి తీసేట్టు ఉంది. అపుడు వాళ్ళతో ఫైట్ చేసే బలం, టైం నా దగ్గర లేవు.  బాధ్యతాయుత పౌరుడికి అదొక నిస్సహాయ పరిస్థితి.

మొన్నామధ్యన ఇంకొకడు...సీటు ఉన్నా నిలబడి పక్క సీట్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న అమ్మాయిని తదేకంగా తొంగి తొంగి చూస్తూ...వేరే సీట్లో ఉన్న ఫ్రెండ్ తో సైగలతో మాట్లాడుతూ వెకిలిగా నవ్వుకుంటున్నాడు. అది మానసికి రోగం కాక మరేమిటి? వాడికి మాత్రం నవ్వుతూనే..."ఏమన్నా...తన్నులు తినకుండా రైలు దిగేట్టు లేవు," అని అన్నాను. వాడు గప్చిప్ అయిపొయ్యాడు.


కాస్త శుభ్రంగా, అందంగా ఉన్న అమ్మాయిలు ముస్తాబై తమ పాటికి తాము రోడ్డుపక్కన పోతుంటే.....అదే పనిగా కళ్ళార్పకుండా గుచ్చినట్లు చూసే చిత్తకార్తె శునక సంతతిని ఏమి అనాలి? భార్యా బిడ్డలతో షాపింగ్ కు వెళ్ళినా, హోటల్స్ కు వెళ్ళినా మనం  గమనించవచ్చు...ఇలాంటి కుసంస్కారులను. అదే పనిగా...కింది నుంచి పైదాకా అమ్మాయిలను ఎగాదిగా చూస్తుంటారు. ఆ పరిస్థితి వికారంగా ఉంటుంది..అది చూసే సంస్కారవంతులకు.  కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు, కొందరు మధ్య వయస్కులు కూడా ఈ వెకిలి చూపులు చూస్తూ...ఆడ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. యాసిడ్ దాడి చేస్తేనే హింస అనుకునే స్థాయికి దిగజారాము మనం. ఇప్పుడు జులాయిల చూపులతో అమ్మాయిలు నిత్యం పడుతున్న హింస అంతకన్నా ప్రమాదకరమైనది. అబలలు ఎప్పటికీ నిస్సహాయులుగా, బాధితులుగా మిగిలిపోయి... మానసికంగా కుంగిపోయే దారుణం ఇది.


అందంగా ఉన్నవాళ్ళను చూడడం...చూసి వదిలెయ్యడం మానవ సహజం కానీ...కసిగా, కామంతో చూడడం మరీ ఎక్కువైపోతున్నది. నా చిన్నప్పుడు ఎవడైనా...మా అమ్మ వంక అలా చూస్తే...బలంగా వెళ్లి గట్టిగా తగలడమో, 'ఏం...బే...' అన్నట్లు గుర్రుగా చూడడమో చేసే వాడిని. కాస్త దిట్టంగా ఉండే క్రీడాకారుడిని కాబట్టి...అవతలి జులాయి చూపు మరల్చుకొని తనదారిన తాను వెళ్ళిపోయే వాడు.


కాలేజిలో అలా అమ్మాయిలను తదేకంగా సినిమా లెవల్లో చూసే వాళ్లకు నేను, రఫీ (వీడి పేరు నా కొడుకు పేరులో ఒక భాగం) కొద్దిగా పాఠాలు నేర్పేవాళ్ళం. అమ్మాయిల వంక మరీ వెర్రిగా చూస్తున్న ఒకడు నా దృష్టిలో పడడం, రఫీ వాడిని పక్కకు తీసుకువెళ్లి 'హితబోధ' చేయడం నాకు గుర్తు. మా వీధిలో ఒక అమ్మాయి మీద సరసంగా ఒక చిన్నరాయి విసిరిన ఒకడిని నేనూ...నా మిత్రుడు మోహన్ రావు పట్టుకోవడం, శిక్షగా మేము వాడి సైకిలును మురికి కాలవలోకి విసరడం, వాడు గూండాలతో మా ఇంటి మీదికి రావడం, విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం నాకు గుర్తుంటాయి. ఇలాంటి కోతులు, కామాంధుల విషయంలో బలప్రయోగం తప్పదేమో కదా!


ఈ వెకిలి చూపుల సమస్య మనందరికీ అనుభవమే అయి ఉంటుంది.  ఎందుకో గానీ ఇలాంటి కీలకమైన అసభ్య అంశాల గురించి మనం మాట్లాడుకోం. ఈ సమస్య పరిష్కారానికి నడుంబిగించం.  మన ఆడపిల్లలకు స్వేచ్ఛ లేని అభివృద్ధి అదేమి అభివృద్ధి? అదేమి సివిలిజేషన్? ఈ సంస్కృతి ప్రబలడానికి....ఈ దుర్మార్గపు సినిమా జనం ప్రధాన కారణం అని...అనిపిస్తున్నది. నీతీ జాతీ లేని ఈ డబ్బు పిచ్చిగాళ్ళు....సృజనాత్మకత ముసుగులో....సినిమాలలో ఈ దొంగ చూపుల సీన్లు బాగా పెడుతున్నారు. అది ఈ మూర్ఖపు యువత, చంచల స్వభావులు ఒంటపట్టించుకుంటున్నారు.  


అలాంటి సీన్లను....బుద్దితక్కువ టీ.వీ.చానెల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు. పైగా...ఈ తతంగాన్ని నిస్సిగ్గుగా గ్లామరైజ్ చేస్తున్నారు. ఈ పోకడను అనుకరించడానికి యువతరం పోటీ పడుతున్నది.  

ఈ బెడద మరీ వెర్రి తలలు వేస్తున్నట్లు నాకు బోధపడింది....పలువురు తెలిసిన అమ్మలక్కలతో మాట్లాడాక. మీరు ఒక్క క్షణం ఆలోచించండి లేదా మీ పక్కన ఉన్న మీ సతీమణినో, కూతురునో, తోబుట్టువునో అడిగి చూడండి....ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందో తెలుస్తుంది. ఇది నిజానికి ఆడ పిల్లలపై జరుగుతున్న కనిపించని అమానుష దాడి, చిత్ర హింస. దీనికి అర్జెంటుగా నివారణోపాయం చూడాలి. నాకు తోచిన సలహాలు ఒక ఐదు...చర్చ కోసం. 


1) సినిమా వాళ్ళు, టీ.వీ.వాళ్ళు కాస్త సంఘాన్ని, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఆడ పిల్లలను టీజ్ చేసే ప్రోగ్రామ్స్ ను నిలిపివేయాలి. అవి పరోక్షంగా స్త్రీలపై ప్రభావం చూపుతున్నాయని గమనించాలి.

2) వెకిలి చూపులతో హింసించే వారిపై అక్కడికక్కడ ఫిర్యాదు చేయడానికి ప్రతి ప్రధాన రహదారి పైనా ప్రత్యేక పోలిస్ పోస్టులు ఏర్పాటు చేయాలి. దీని కోసం ప్రత్యేక సిబ్బంది ఉండాలి.

3) రోడ్ల మీద జులాయి వెధవలు చూస్తున్నారు కదా...అని తాను అందగత్తెనో, అతిలోక సుందరినో అని అనుకోవడం ఈ ఆడపిల్లలు కూడా ఆపెయ్యాలి. ఇలాంటి దుర్భ్రమతో...జులాయిలను ఓర కంటచూడడం, తిక్క నవ్వులతో కవ్వించడం, వారిని పక్కనున్న ఫ్రెండ్స్ కు నవ్వుతూ చూపించడం ఆపాలి. జులాయిలను చూసి...మాటి మాటికీ పైట లేదా చున్నీ సర్దుకోవడం...ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి ఆక్వర్డ్ పరిస్థితిలో కాజువల్ గా ఉండడం అవసరం.

4) తల్లి దండ్రులు ఇళ్ళలో పిల్లలకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలి. అలా పదే పదే చూడడం తప్పని మగ పిల్లవాడికి నూరిపోయాలి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆడపిల్లలకు టిప్స్ ఇవ్వాలి.   


5) ఈవ్ టీజర్లను మన తోటి ప్రయాణికుడు/ప్రయాణీకురాలు ఒంటరిగా నివారిస్తుంటే లేదా అడ్డుకుంటూ వుంటే...అతనికి/ఆమెకు మనం మద్దతు పలకాలి. ఉమ్మడి గళం తో ఈ జబ్బును నివారించవచ్చు. 

అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగితే స్వరాజ్యం వచ్చినట్లు...అన్న ఆ పెద్దాయన మాట అలా వుంచండి...మన ఆడ పిల్లలు పగలే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కాదంటారా?
(Note: Image courtesy www.stumbleupon.com)

Wednesday, May 26, 2010

'బెస్ట్ యాంకర్స్'--రోజా, సౌజన్య, రజనీకాంత్

గత వారం మేము నిర్వహించిన 'బెస్ట్ యాంకర్/ప్రజెంటర్' సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ ముందుగా కృతఙ్ఞతలు. మీరు మెచ్చిన యాంకర్స్ ముగ్గురు:

1)  రోజా (ఐ-న్యూస్)

2) సౌజన్య (మహా టీవీ)
3) రజనీకాంత్ (TV-9)


ఈ సర్వేలో ఒక గమ్మత్తు జరిగింది. 'వరస్ట్ యాంకర్' ఎవరు? అన్న ప్రశ్నకు కూడా రజనీకాంత్ కే అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఏ ఒక్కరూ రోజా, సౌజన్య లను చెత్త యాంకర్ల జాబితాలో చేర్చకపోవడం విశేషం. 

శ్వేతా రెడ్డి (ఎన్-టీవీ), స్వప్న (సాక్షి), కొమ్మినేని (ఎన్-టీవీ) మాకు నచ్చని యాంకర్స్/ప్రజెంటర్స్ అని సర్వే లో పాల్గొన్న అత్యధికులు స్పష్టం చేశారు. విజేతలైన ఆ ముగ్గురు యాంకర్స్ పై సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇలా వున్నాయి. 

1) Roja (i-news): Sexy-voice modulation is superb-confident-spontaneity-beautiful- attitude-expressions are pretty

ఒకరైతే..రోజా గారి కోసమే తాను ఐ-న్యూస్ చూస్తానని రాసారు. కంగ్రాట్స్ రోజా గారూ. కీప్ ఇట్ అప్.

2) Soujanya (Maha-TV): Clarity-confident-sweet

3) Positive points of Rajanikanth (TV-9): straightforward-smile-హుందా-analytical skills-calm and composed

Negative points of Rajanikanth: Irrelevant questions-untimely smiles and laughter

'దీన్ని ఎలా చూడాలి?', 'దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?', 'దీనిపై మీరేమంటారు?', 'దీనిపై మీ వెర్షన్ చెప్పండి?',--ఇవి కాక రజని మరొక ప్రశ్న అడిగితే ఒట్టు....అని ఒకరు రాసారు. 

రజని తర్వాత, శ్వేతా రెడ్డి, కొమ్మినేని లు నచ్చని యాంకర్స్ జాబితాలో చోటు చేసుకున్నారు. తెలుగు కు తెగులు పట్టించిన యాంకర్ స్వప్న అని కొందరు రాసారు. అదే 'సాక్షి' ఛానల్ లో ఇటీవల చేరిన మురళీకృష్ణ గొంతులో స్పష్టత లేదని ఒకరు చెప్పారు. 

చక్కని విశ్లేషణకు కూడా ఒక ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం కానీ...ఒక్కరు కూడా సరిగా ఆ పనిచేసినట్లు కనిపించలేదు. మొత్తం మీద...ఈ సర్వే లో పాల్గొన్నందుకు అందరికీ థాంక్స్. విజేతలకు బహుమతులు పంపుతున్నాం. ఆ ముగ్గురి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చూస్తే...వారికి ఈ విషయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఉంటాయని తెలియజేస్తూ...సెలవ్... 

Tuesday, May 25, 2010

N-TV న్యూస్ లో 'ఉప్పర మీటింగ్' అనే పదం....

N-TV లో రాజాలు, మహారాజాలు-పులులు, బొబ్బిలి పులులు ఉంటారు/ ఉంటాయి. వారు/అవి నిరంతరం పనిచేస్తున్నట్లు జనాలకు కనిపిస్తారు/ కనిపిస్తాయి. అలాంటిది...ఈ రాత్రి ఎనిమిది గంటల వార్తలలో 'ఉప్పర మీటింగ్' అనే పదం వచ్చింది....ఆ ఛానెల్ లో. ఇది చాలా అభ్యంతరకరం. ఇది వాడినందుకు...N-TV క్షమాపణ చెబితే బాగుంటుంది. 

ఉద్యోగులు టైం కు ఆఫీసుకు రావడంలేదని, వచ్చినా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని ఈ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. అందులో...వాయిస్ ఓవర్ లో 'టైం కు రారు...వచ్చినా...సొల్లు కబుర్లు, ఉప్పర మీటింగులు,' అని చెప్పారు. ఇది ఒక లూజ్ కాపీ. అది ఒక కులాన్ని అవమానపరిచే పదం. ఇలా కులాలకు సంబంధించిన మాటలు, జాతీయాలు, సామెతలు, జానపదాలు...వాడేటప్పుడు విలేకరులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలి. 'ఛండాలం', 'ఛండాలుడు', 'మంగలి కత్తి', 'లంబాడి వ్యవహారం'...వంటి పదాలు మీడియాలోనే కాకుండా....వాడుకలో కూడా నిషేధించడం సముచితం. 

ఈ మధ్యన నేను ఇలాంటి తప్పే ఈ బ్లాగ్ లో ఒక పోస్టులో రాసి ఇరుక్కుని చెంపలు వేసుకున్నాను. విలేకర్లు...దొంగల్లా తయారయ్యారని చెబుతూ...'స్టూవర్టు పురం' దొంగలనో/బ్యాచులనో రాసేసాను. అది ముమ్మాటికీ నా తప్పే. ఒక మిత్రుడు అలర్ట్ చేస్తేగానీ...కరెక్టు గా ఈ విషయం గురించి మా గురువు గారు క్లాస్ రూం లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నాను. 

నా మీద అప్పటికే మంట మీద ఉన్న ఒక మిత్రుడు...ఒక బ్లాగ్ లో..."రామూ...స్టూవర్టుపురం అని వాడతావా?" అన్న అర్థం వచ్చేలా శీర్షికలో నా పేరు పెట్టి మరీ ఒక పోస్ట్ పెట్టి...నాకు లింకు పంపాడు. నేనైతే...నిర్మొహమాటంగా ఆ లింకు ఓపెన్ చేసి....అది చదివి...'అయ్యా...తప్పయ్యింది. ఇంకెప్పుడూ ఆ మాట అలా రాయను," అని ఒక కామెంట్ పెట్టి వచ్చాను. N-TV బాసులు కూడా సిగ్గూఎగ్గూలేకుండా...సారీ చెబితే బాగుంటుంది. ఇక వారిష్టం. 

Monday, May 24, 2010

ఫోటోగ్రాఫర్లకు బాగా పనికివచ్చే ఆన్ లైన్ ఫోటో మాగజీన్

దిన పత్రికలు, కాలిక పత్రికలు (పిరియాడికల్స్) అందంగా ముస్తాబై వస్తున్నాయంటే...అందులో ఫొటోగ్రాఫర్ల పాత్ర ఎంతైనా వుంటుంది. మన ఫోటోగ్రాఫర్లు నాణ్యత కోసం చేస్తున్న కృషి అభినందనీయం.

తెలుగు నాట పత్రికలకు ఫోటోలు అందిస్తున్న వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అందులో 'ది హిందూ' లో ఉన్న అందరు ఫోటోగ్రాఫర్లు నాకు నచ్చుతారు. 'ఈనాడు' లో ఉండే బషీర్ అనే ఫోటోగ్రాఫర్ ఫోటోలు, ఆయన వర్క్ నాకు బాగా నచ్చుతాయి. వంద మందికి పైగా మృత్యువాత పడిన వలిగొండ రైలు దుర్ఘటన కవర్ చేస్తున్నప్పుడు బషీర్ భాయ్ చేసిన వర్క్ నాకు ఎప్పుడూ గుర్తు వుంటుంది. దుర్ఘటన జరిగిన మర్నాటి నుంచి అంతా స్పాట్ కు రావడం ఆపేశారు కానీ...బషీర్ ఒక్కడే మూడు నాలుగు రోజులు వచ్చి ఆ దుర్గంధం మధ్య అక్కడే చాలా ఓపిగ్గా నిలుచుని ప్రత్యేకమైన ఫోటోలు ఇచ్చేవాడు.

ఏదో అభిమానం కొద్దీ రాస్తున్నాను కానీ....మిగిలిన ఫోటో గ్రాఫర్లు కూడా ఇంతే కష్టపడుతూ ఉంటారు. వారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. 'ది హిందూ' లో ఉండే నగర గోపాల్ అనే కుర్రవాడి ఫోటోలు కూడా బాగుంటాయి. తను నేను కలిసి నల్గొండ లో పనిచేసాము. కుర్రోడి ఉత్సాహం చూస్తే భలే ముచ్చటేస్తుంది. అతని కష్టపడే తత్త్వం చూసి బ్యూరో చీఫ్ గా ఉన్న సుసర్ల నగేష్ కుమార్ గారు గోపాల్ కు ఆ పత్రికలో పర్మినెంట్ జాబ్ ఇప్పించారు. అప్పటికే పత్రిక ఎడిటర్ ఎన్.రాం గారి దృష్టిలో గోపాల్ వర్క్ పడి
ఉన్నందున నగేష్ గారి పని సులువయ్యింది.

'ది హిందూ'లోనే విశాఖపట్నం లో పనిచేస్తున్న దీపక్ అనే ఫోటోగ్రాఫర్ రాష్ట్రం లోనే అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తి. అతని ఫోటోలు ఒకొక్కటి ఒక ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. ఈ మధ్య దీపక్ తీసిన ఐ.పీ.ఎల్. క్రికెట్ మ్యాచుల ఫోటోలు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో వున్నాయి.

ఈ విషయాలు చెప్పాల్సిరావడానికి కారణం....సీ.బీ.రావు గారు అమెరికా నుంచి పంపిన ఒక మెయిల్. ఆ మెయిల్ ఇదీ:

Aksgar is India’s first online fortnightly magazine exclusively dedicated to photojournalism.
It is committed to featuring exceptional photo essays from the South Asian region. To get in touch or to send your work more info at

http://aksgar.com/

Please go through website and write about it in your blog. Thanks.
-cbrao
Mountain View, CA, USA.

ఈ వెబ్ సైట్ మన ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నాకైతే నచ్చింది. ఈ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తప్ప ఏవీ పట్టించుకోరు కాబట్టి....ఇది చదివిన మీరు మీ దృష్టిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు దీన్ని మెయిల్ చేయండి, లేదా వారు ఈ పోస్ట్ చదివే ఏర్పాటు చేయండి
.

Saturday, May 22, 2010

Flash News: N-TV, I-News మధ్య ఒప్పందం?

దివాలా అంచున బేలగా నిలబడి ఉన్న i-news ను ఆదుకునేందుకు N-టీవీ రంగంలోకి దిగినట్లు మీడియాలో శనివారం పుకార్లు గుప్పుమన్నాయి.  కొందరైతే....నరేంద్రనాథ్ చౌదరి బంధువు ఒకరు i-news లో 49 శాతం వాటా కొన్నట్లు చెబుతున్నారు. 


N-TV కి చెందిన టెక్నికల్ టీం ఒకటి i-news లో పర్యటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే...i-news వ్యవహారాలు చూస్తున్న వాసు వర్మ N-TV అధిపతి నరేంద్రనాథ్ బృందం తో సమావేశమయినట్లు సమాచారం. ఈ డీల్ వెనుక...సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఈ 'ఘనా'పాటి నన్ను బురిడీ కొట్టించే పథకం పన్నాడు...

ఫ్రీగా వచ్చే సొమ్ము పావలా అయినా మనకు పడదని, పైగా అది తిరగబడి ఏదో ఒక రూపంలో ఒక రూపాయి ఖర్చు అయ్యేలా చేస్తుందని నేను ఒక నిర్ధారణకు వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ఇదే అంశం మీకు కూడా విన్నవించుకున్నాను--వివిధ పోస్టులలో. అలాంటిది...అబద్ధాల గురించి ఒక పోస్టు రాసి ఆఫీసుకు వచ్చి యాహూ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే...."Please attend to this matter urgently" అన్న టైటిల్ తో ఒక మెయిల్ కనిపించింది. 


మనకిది పంపింది...ఎవడా... అని చూస్తే ఏదో నోరు తిరగని పేరు కనిపించింది. ఆ మెయిల్ చదివి నేను డంగై పోయాను. ఎవడో ఘనా వాడు నాకు వల వేశాడు. ఇలాంటి మెయిల్స్ మీకు కూడా వచ్చి వుంటాయి. గతంలో వచ్చిన దొంగ మెయిల్స్ కు ఇది కాస్త భిన్నంగా కనిపించింది. ఇలాంటి వాటితో జాగ్రత్త. 

నాకున్న IPS మిత్రుల్లో ఒకరైన బాలు గారు ఇది చదివి ఈ ఘనా వాడి ఆట కట్టిస్తే...సంతోషం. లేదా...తెలివిగా ఆ డబ్బు వాడి నుంచి తెప్పించి కొంత ఇస్తే...సగం యోగేశ్వర్ రావు గారికి, సగం మల్లికార్జున్ గారికి ఇచ్చి దండం పెడతాను. ఆ ఘనా వాడి మెయిల్ మీ కోసం:

Hello
I got your contact during my search for a reliable, trust worthy and
honest person to execute this transfer project with. My name is Mr.
Owusu Kojo. I am the manager of the International Commercial Bank Ghana, First Light Branch Accra. I am a Ghanaian married with two kids.

I am writing to solicit your assistance in the noble transfer of
US$5.500.000.00. This fund is the excess of what my branch in which I am the manager made as profit during the last year. I have already submitted an approved End of the last Year report for the year 2009 and also submitted report of first quarter of this year 2010 to my Head Office here in Accra and they will never know of this Excess. I have since then, placed this amount of US$5.500.000.00 (Five Million Five hundred Thousand United States Dollars) on a SUSPENCE ACCOUNT without a beneficiary.

As an officer of the bank, I cannot be directly connected to this
money thus I am compelled to request for your assistance to receive
this money into your bank account. I intend to part 30% of this fund
to you while 70% shall be for me. I do need to stress that there are
practically no risk involved in this. It is going to be a bank-to-bank
transfer to your nominated bank account anywhere you feel safer.
All I need from you is to stand as the original depositor of this
fund. If you accept this offer, I will appreciate your timely response
to my email address ask4uowusukojo2009@gmail.com

Note that my main purpose of hatching this business is to invest my
own share of the money with you, after a successful transfer of the
money into your account.

With regards
Owusu Kojo

మీడియా బాసులూ...అబద్ధాన్ని సమాధి చేయరూ!?

ఏ విషయాన్నైనా వినోదాత్మకంగానే చెబుతూ అందులో సందేశాన్ని అమర్చి అందించవచ్చు. సందేశాత్మక వాక్యాలతో వినోదం కూడా అందించవచ్చు. ఒక సర్వే ఆధారంగా 'సాక్షి' ఛానల్ వారు శుక్రవారం రాత్రి 'అతడే ఒక అబద్ధం' శీర్షికతో ప్రసారం చేసిన షో సరిగా పండలేదు. ఒక అద్భుతమైన అంశాన్ని థీం గా ఎంచుకున్నారు గానీ డెలివరీ లో చాలా లోపాలు కనిపించాయి. కాపీ లో కొన్ని భాగాలు చాలా బాగున్నా....ప్రజెంటర్ కొంపలు మునిగిపోతున్నట్టు హడావుడిగా చదివి చెడగొట్టేసారు.

ఇది అబద్ధాలకు సంబంధించిన సర్వే పై ఒక కార్యక్రమం. 'Market Researchers OnePoll" (ఇదొక సంస్థ పేరేమో) వారు నిర్వహించిన సర్వే ప్రకారం...పురుషపుంగవులు అబద్ధాలు చెప్పడంలో ఫస్టని, ఏడాదికి 1,092 సార్లు బొంకుతారని, అదే స్త్రీలయితే 728 సార్లు అబద్ధాలు ఆడతారని 3,000 మందితో సర్వే జరిపి ఆ సంస్థ తెలిపింది. 

నిజానికి...అబద్ధం చెప్పగానే...మనసు  టక్కున 'ఇందేంటి రా..బేవార్స్ వెధవా! బుద్ధిలేదూ...అబద్ధామాడతావెం?' అని అడుగుతుంది--మానవ జన్మ ఎత్తిన ఎవ్వడికైనా. 'యెహ్...నేనంతే, నువ్వు మూసుకో,' అని కొందరు...'ఒక మంచి పనికోసం అబద్ధం ఆడుతుంటే...మధ్యలో నీ గొడవేమిటి?, 'విధి నిర్వహణలో భాగంగా తప్పదు తల్లీ',..అని మరికొందరు మనసు గొంతు నొక్కి పారేస్తారు. అబద్ధాలతో బతికేస్తారు. ఇలా అబద్ధాలు చెప్పగా చెప్పగా మనసు (conscience) చచ్చి ఊరుకుంటుంది...'పోరా పోరంబోకు...అబద్ధాలతో బతికెయ్....", అని. ఇక అప్పుడు ఆ సదరు మానవుడు అబద్ధాలు తప్ప ఒక్క నిజమైనా మాట్లాడడు. మన సోదర, సదరీమణులలో చాలా మంది ఈ కేటగిరీకి చెందిన వారు కాబట్టి మన సంబంధాలు ఇలా ఏడ్చాయి. ఈ పేరాకు సర్వేకు ఎలాంటి సంబంధం లేదు. అబద్ధాలు చెప్పకుండా, రాయకుండా బతుకుదాం.... సత్యం తేల్చుతుందో, ముంచుతుందో చూద్దామని చాలా ఏళ్ళుగా శోధిస్తున్న నా మాటలివి.


ఇక సర్వే లోకి వెళితే.....'అయ్యో...అబద్ధం చెప్పామే' అనే భావన పురుషులకన్నా....స్త్రీలలోనే అధికమని కూడా ఇప్పుడు తేల్చారు. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి అబద్ధం చెప్పినా ఫర్లేదని 75 శాతం మంది సర్వే లో చెప్పారట. దీని మీద కూడా నాకు అభ్యంతరం ఉంది. బాసు ఒక మాట చెప్పగానే...అది తప్పని మనసు చెబుతున్నా....బాసు గారిని సంతృప్తి పరిచేందుకు...'ఓకే సార్...అద్భుతం" అనడం కూడా తప్పు కదా? 'మీరన్నది బాగుంది కానీ...ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి పరిశీలించండి,' అని కిందిఉద్యోగి చెప్పాలి కదా. అలాగే....భార్యా భర్తల సంబంధాలలో అబద్ధాలు మహా దారుణం. ఏ పనిచేసినా...భాగస్వామికి చెబితే...అరమరికలు లేకుండా హాయిగా బతకొచ్చు. నీతి అనే ట్రాక్ తప్పి కక్కుర్తి తో ఎవరికి తెలీకుండా/ అబద్ధాలతో అందర్నీ తప్పుదోవ పట్టించి ఏదో చేసేద్దామని అనుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. అది తాత్కాలిక ఆనందం ఇచ్చినా...లాంగ్ టర్మ్ లో దెబ్బతీస్తుంది. ఎప్పుడూ నిజమే చెప్పడానికి perfect communication skills అవసరం. అసలు...దీని మీద ఒక కోర్సు నిర్వహించాలని ఉంది.

"I had no signal"
"I'm on my way"
"I'm stuck in traffic"
"Sorry, I missed your call"
"You've lost weight" 

"It's just what I've always wanted".
---ఈ పై కామన్ అబద్ధాలు పురుషులు ఎక్కువగా చెబుతారని సర్వే తేల్చింది. అలాగే....స్త్రీ లు చెప్పే అబద్ధాల లిస్టులో ఉన్న మాటలు ఇలా వున్నాయి.
  
"Nothing's wrong, I'm fine"
"I don't know where it is"
"I haven't touched it"
"It wasn't that expensive"
"I've got a headache" 


మిగిలిన ఛానెల్స్ ఈ సర్వే ను పట్టించుకున్నాయో లేదో కానీ...'సాక్షి' పట్టించుకుని మంచి స్టోరీ చేసే ప్రయత్నం చేసింది. కానీ..ఈ సర్వే ను అడ్డం పెట్టుకుని సినిమా పాటలు/మాటలు చూపడం పైనే దృష్టి పెట్టారు. కొన్ని వాక్యాలను చూస్తే...'అబద్ధం ఆడకుండా బతకడం కష్టం' అన్న అర్థం వచ్చేలా రాసారు. అందులో రచయిత ఒక మంచి జోక్ రాసారు. అది యాంకర్ గారి పుణ్యాన సమాధి అయిపోయింది. 'సాక్షి' మళ్ళీ మరో యాంకర్ తో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయాలని రామ్ రెడ్డి అన్నయ్యకు విజ్ఞప్తి.

నన్నడిగితే...అన్ని పత్రికలు/ ఛానెల్స్ CEO లు, MD లు (మన అన్నయ్య సహా) అబద్ధాలు చెప్పడం, చూపడం మాని...."అబద్ధాలు-మానవ సంబంధాలు" అనే కీలక అంశంపై రోజూ కార్యక్రమాలు చూపితే...సమాజం కాస్త బాగు పడుతుంది. మన వ్యవస్థను పట్టిపీడిస్తున్న వైరస్...అబద్ధం. అదొక పెను భూతం, రాక్షసి, సైతాన్, సునామీ. దీన్ని ఎవరికి వారు వ్యక్తి స్థాయిలో ఎదుర్కోవడం ఒక్కటే సుఖజీవనానికి పరిష్కారం.

ఆ మంచి కథలో చెప్పినట్లు...చెప్పిన ప్రతి అబద్ధానికి ఇంత చొప్పున ముక్కు పొడుగైతే బాగుంటుంది. ఆ ముక్కు సైజును బట్టి మనం ఆ మనిషితో జాగ్రత్తగా ఉండవచ్చు.
(Photo courtesy: www.moistworks.com)   

Thursday, May 20, 2010

ఈ 'లైలా' బీభత్సానికి కారణం.....'ఆంధ్రజ్యోతి', 'సాక్షి' పేపర్లా?

ఒక ఘోరం జరిగినా, ఒక మంచి జరిగినా ప్రకృతి వెంటనే స్పందిస్తుంది. హిరణ్యకశ్యపుడి ఛాతి చీల్చగానే ఉరుములు మెరుపులు వణికిస్తాయి. సీతారామ కల్యాణం కాగానే...ఆకాశం నుంచి పూలు పడతాయి. ఇలాంటి ఉదాహరణలు సినిమాలలో కోకొల్లలు. మొన్నటి దాకా వీపు పగిలిపోయే ఎండలు భగభగ లాడించగా...అంతలోనే 'లైలా' చల్లగా రావడం...కొంపలు కొల్లేరు చేయడం వెంటవెంటనే జరిగిపోయింది. దీనికి కారణం...తెలుగు నేల మీద ప్రభవించి దేదేప్యమానంగా వెలిగిపోతున్న రెండు ప్రధాన పత్రికలు. 

'ఈనాడు' కు పోటీగా తెలుగులో వెలిగిపోతున్న 'ఆంధ్రజ్యోతి' లో ఏప్రిల్ 24 న మన ఆదిత్య అలియాస్ వేమూరి రాధాకృష్ణ గారు ఒక 'కొత్తపలుకు' పలికారు. ఛీ...ఛీ..అసలీ మీడియా ఏమిటి ఇలా దరిద్రంగా, నీచ నికృష్టంగా అయిపోయింది? అని బాధపడుతూ వేమూరి మాంచి వ్యాసం రాసారు. అందులో ఆణిముత్యాలు ఇక్కడ నీలం రంగులో ఉన్నాయి.   


"సమాజాన్ని చదివినవారు, సామాజిక సమస్యలను ఆకళింపు చేసుకున్నవారు మాత్రమే ఉండవలసిన మీడియాలో వాణిజ్య దృక్పథం మాత్రమే కలిగిన వ్యక్తులు ప్రవేశించడం వల్ల పరిస్ధితులు మరింత వేగంగా క్షీణిస్తున్నాయి."
"మీడియా ఆరోపణలకు గురవుతున్న వారు తలదిన్చుకోవలసింది పోయి ఎదురు దాడికి దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇది దుష్ట సంస్కృతి..."
"మీడియాలో పరిణామాలు ఇలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది సమాజం-ప్రజలే. ఈ ముప్పును నివారించగలిగేది జర్నలిస్టులు మాత్రమే. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది...పరిస్ధితులు మరింత విషమిస్తే జర్నలిస్టులను అంతరించిపోతున్న జాతిగా గుర్తించవలసిన పరిస్ధితులు ఏర్పడడం తథ్యం"

కిందనుంచి చటుక్కున ఎదిగిపోయిన వేమూరి సారు ఇంతమంచి  మాటలు  చెబితే ప్రకృతి పులకరించక చస్తుందా? నిజానికి ఆ రోజే వాతావరణం  కాస్త చల్లబడింది. రోళ్ళు పగిలే ఎండాకాలంలో ఈ గాలులేమిటా...అని తర్కించుకొని ఆ గాలికి ఇంట్లో నుంచి కొట్టుకువచ్చి కాళ్ళకు తగిలిన 'ఆంధ్రజ్యోతి' లో ఎడిట్ పేజీ చూసి నాకు విషయం బోధపడింది. 

అంతేనా...ఆ వ్యాసానికి కొనసాగింపుగా మే ఫస్టు నుంచి 'మీడియా-ఆత్మశోధన' అనే కాలాన్ని ఆంధ్రజ్యోతి ఆరంభించింది. "మీడియాలో ఇంత చెడు ఎందుకొచ్చి చేరిందనేది అందరం ఆలోచించాల్సిన ప్రశ్న.." అని కూడా చెప్పిందీ పత్రిక. ఈ చర్చలో....వేమూరి గారికి ఇన్నాళ్ళు తెలియని చాలా విషయాలు బైటికి వచ్చాయి. అసలు...మీడియా ఎందుకు, ఎవరి వల్ల, ఎలా బ్రష్టు పట్టిందో ఆయనకు ఇన్నాళ్ళూ తెలియకనే కదా...'మీడియా--అత్మశోధన' అని పెట్టి ప్రజలను స్పందించమన్నారు. ఇది అద్భుతమైన మంచి విషయం కనుక ఇక ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి. అక్కడక్కడా జల్లులు మొదలయ్యాయి.

ఇంతలో...ఈ వారం ఒక రోజున...మళ్ళా ఇంట్లో నుంచి ఒక పేపర్ కొట్టుకు వచ్చి మెడకు చుట్టుకుంది. అది కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డి గారి 'సాక్షి' పేపర్. ఈ ఉపద్రవానికి కారణం ఏమిటా...అని ఎడిట్ పేజి తీసి చూస్తే...అక్కడ 'ఏది నిజం' అన్న కాలంలో ఒక పెద్ద స్టోరీ ఉంది. వేమూరి వారిది 'కొత్త పలుకు' అయితే...వై.ఎస్.జే.గారిది "ఏది నిజం?."

ఈ కాలంలో 'సాక్షి' చాలా మంచి విషయాలు స్పష్టం చేసింది. "కాంగ్రెస్ ను మా పేపర్ ఇప్పుడు ఉతికి ఆరెయ్యడమేమిటి?...అసలు వై.ఎస్.బతికి ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ ను తిడుతున్నాం...." అని ఆ పేపర్ చాటి చెప్పింది. ఆ వాదన నిజమని చెప్పుకోవడానికి కొన్ని పాత పేపర్ల క్లిప్పింగ్స్ కూడా ప్రచురించింది. అందులో చివరి వాక్యం ఏమి చెప్పిందంటే..."ఇప్పుడే కాదు...రేపు జగన్ ముఖ్యమంత్రి అయినా....మేము ప్రజల పక్షానే ఉండి ప్రశ్నిస్తాం..."

మీరు చెప్పండి...ఇంత మంచి విషయం చెబితే ప్రకృతి ఆగగలదా? ఈ నిజాలను ప్రకృతి తట్టుకోగలదా? దానివల్ల కాలేదు. ఎండ లేదు, గిండ లేదు అని...కాల ధర్మాన్ని పక్కనబెట్టి....ముందు చిరు జల్లుగా ఆరంభమై...చివరకు లైలా వరకు దారితీసింది. పేపర్లు మరీ ఇన్ని సత్యాలు చెబితే ఎలా? ప్రకృతి మాతా....పాపులను క్షమించి...శాంతించు తల్లీ!
   

రాణి ఎలిజబెత్ మరణించారని 'జోక్' చేసిన బీ.బీ.సీ. రేడియో డీ.జే.

టీ.వీ.స్టూడియోలలో యాంకర్లు-ప్రజెంటర్లు, రేడియో స్టేషన్లలో డిస్క్ జాకీ (డీ.జే.)లు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే...చాలా కష్టం. లైవ్ లో....ఆ టెన్షన్లో...హడావుడిలో, ఆ కెమెరా లైట్ల తిమ్మిరిలో మతి ఒక్కసారి భ్రమించినా...చెడు మాట నోరుజారినా ఇంతేసంగతులు. బీ.బీ.సీ.రేడియో జాకీ ఒకరు రాణి ఎలిజబెత్ మరణించారని లైవ్ షో లో కుళ్ళు జోకు వేసి 'రాయల్'గా ఇరుక్కున్నాడు. చివరకు ఉజ్జోగం పోగొట్టుకున్నాడు.
 


సోమవారం మద్యాహ్నం పూట వచ్చే ఒక హాస్యభరిత ప్రోగ్రాం లో డానీ కెల్లీ అనే 39 ఏళ్ళ డీ.జే. (పక్క ఫోటో, courtesy: bbc.co.uk) ఉన్నట్టుండి చేసిన ఒక ప్రకటన బ్రిటన్ లో సంచలనం కలిగించింది.  "Sorry to break this news, Queen Elizabeth has indeed died," అని డానీ చెప్పాడు. అంతటితో ఆగకుండా...సంతాప సూచకంగా అన్నట్లు వాళ్ళ జాతీయగీతాన్ని ప్లే చేసిపారేసాడు. అది విన్న జనం ఒక్క సారి కంగుతున్నారు. ఈ జనస్వామ్య వ్యవస్థలోనూ రాచరికపు సుగంధాన్ని ఆస్వాదిస్తున్న నవీన నాగరిక బ్రిటిష్ జనం కూడా ఈ వార్త నిజమా అని విస్తుపొయ్యారు. రేడియో రంగం లో పదేళ్ళ అనుభవం ఉన్న ఆ డానీ గారికి కావలిసింది అదే. ఛీప్ ట్రిక్. ఫక్తు అనైతిక జర్నలిజం. 

పాపం ఆ పక్కనే ఉన్న ప్రొడ్యూసర్ 'hey...you can't say that,' అని వారిస్తున్నా...మన నోటితీట డానీ పట్టించుకోలేదట. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీ.బీ.సీ.ఈ వెర్రి జోక్ వేసినందుకు చాలా సారీ లు చెప్పి 'చావు'తెలివితేటలు ప్రదర్శించినందుకు డానీని ఇంటికి సాగనంపింది. 
మర్నాడు డానీ స్థానంలో ఆ ప్రోగ్రాం చేయడానికి వచ్చిన మొల్లి గ్రీన్ బీ.బీ.సీ.తరఫున ప్రజలను క్షమాపణలు వేడుకున్నారు.

ఈ ఘోర తప్పిదం చేసిన డానీ ఈ వృత్తిలోకి రాకముందు పాతకార్లు అమ్మేవాడట, వంట మనిషిగా పనిచేసే వాడట. ఒక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లో ఉన్న మాటను మాత్రమే తాను ఉటంకిన్చానని డానీ చెప్పాడట. ఈ తప్పు మన సోదర సోదరీమణులకు ఒక గుణపాఠం కాగలదని ఆశిస్తూ...


(నోట్: We appreciate it if you can participate in the survey mentioned in the previous post)

Tuesday, May 18, 2010

బెస్ట్ యాంకర్/ప్రజెంటర్ సర్వే...తెల్చేద్దాం రండి...

మన తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ది బెస్ట్ యాంకర్/ప్రజెంటర్ వీరని నేను రాసిన పోస్టుకు మిశ్రమ స్పందన వచ్చింది. నేను పేర్కొన్న పేర్లకు చాలా మంది 'ఎస్...ఓ.కే.' అంటే....కొందరు 'ఛీ...ఛీ..' అన్నారు. మేము కొందరిని కించపరిచానని తెలియజేసారు. అలా బాధపడిన వారికి సారీలు. కులం లెన్సులు కళ్ళలో ఫిక్స్ అయివున్న ఒక మందమతి...సామాజిక వర్గాలు...అనే ప్రేలాపన చేశారు--ఈ యాంకర్ల కులగోత్రాలు సేకరించడం తప్ప మాకు ఇంకోపనిలేనట్లు. జర్నలిజంలో ఉంటూ కులంతీట ఉన్నవాడు...'పేడతొలుచు పురుగు, కష్మలంలో ఈగ' అని ఒక కవిమిత్రుడు చక్కగా సెలవిచ్చాడు. 

ఈ గొడవ ఎందుకని...వచ్చిన ఒక ఆలోచన ఇది. ఇది ఒక సర్వే. ది బెస్ట్ యాంకర్స్ ఎవరో మనమే తెల్చేద్దాం. బద్ధకం వదిలేసి...ఇది నిజంగా సవాలుగా స్వీకరించి..ఈ ప్రశ్న పత్రం నింపి కామెంట్స్ లో పెట్టండి. మీ పేరు రాస్తే మహా సంతోషం (తల్లిదండ్రులు అంత ఆనందంగా, వేడుకగా నామకరణ మహోత్సవం రోజు పెట్టిన పేరు రాసుకోకపోవడం నిజానికి నేరం, ఘోరం అంటారు), ఒకవేళ కారణాంతరాల వల్ల, అహంకారం అనుమతించకపోవడం వల్ల పేరు రాయలేని పరిస్థితి వస్తే...మీరు పనిచేసే ఛానల్ లేదా పత్రిక లేదా సంస్థ పేరైనా రాయండి. 

ఈ సర్వే ఆధారంగా 'ది బెస్ట్' యాంకర్ ను తెల్చేద్దాం. ఒకరు ఒక్కసారే ఇది నింపండి. మనమో, మన మిత్రుడో/ మిత్రురాలో గెలవాలని పది పేర్ల మీద పంపకండి. ఇక్కడ నైతికత ముఖ్యం, మీ మనసే మీకు సాక్షి. ఇది కేవలం న్యూస్ ఛానెల్స్ కు పరిమితం. మీడియా ఆఫీసుల్లో బాసులు కూడా ఈ బ్లాగ్ చూస్తున్నారని మాకు తెలుసు. వారిని కూడా సవినయంగా ఈ సర్వేకి ఆహ్వానిస్తున్నాం. వారి కామెంట్ చాలా విలువైనది. ఇలాంటి సర్వేలు నిజాయితీ తో చేస్తే...మనం కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లు అవుతుంది. ఒక స్పోర్టివ్ పనిగా ఉంటుంది.

జర్నలిస్టులం...కదా...'ఇది చేస్తే మరి మాకేంటి?' అన్న ప్రశ్న ఈ పాటికే ఉదయించి వుంటుంది..చాలా మందికి. డోంట్ వర్రీ. మీరు ఎంపిక చేసిన బెస్ట్ యాంకర్స్ ను మేము ప్రత్యేకంగా కలిసి సొంత ఖర్చుతో కొన్న బహుమానాలు ఇస్తాం. అదే విధంగా మూడు ది బెస్ట్ పరిశీలనలకు కూడా బహుమతులు ఉంటాయి. అయితే...రాయల్ గా పేరు, ఛానల్ పేరు, మెయిల్ ఐ.డీ.రాసిన వారిని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తెసుకుంటాం. ఇక ప్రశ్నావళి.....

1) తెలుగు న్యూస్ ఛానెల్స్ లో మీరు నచ్చే  యాంకర్?
2) ఎందుకు మీకు ఆమె/అతడు నచ్చింది/ నచ్చాడు?
3) మీకు నచ్చని యాంకర్ ఎవరు? కారణాలు?

వెరీ సింపుల్. ఇక మీదే ఆలస్యం. రిప్లై సంక్షిప్తంగా ఉండేట్టు చూడండి. ఈ పోస్టు చదివిన ప్రతి ఒక్కరు ఈ సర్వే లో పాల్గొంటే బాగుంటుంది. జర్నలిస్టులు మాత్రమే కాదు....బ్లాగర్స్, రీడర్స్ అంతా ఇందులో పాల్గొనవచ్చు. చెప్పాం కదా....మనసే సాక్షి. ఒక వారం తర్వాత ఫలితాలు ఇస్తాం.
Note: We have decided against publishing comments to protect the identity of the participants of the survey. We are withdrawing today's comments as we felt that these opinions may influence others. Please feel free to write your name and organisation you represent. This post will be the lead post till May 25. Thanks---Ramu & Hema 

Sunday, May 16, 2010

Jaya-టీవీలో ఖుష్బూ ప్రోగ్రాం 'జాక్పాట్' పై వేటు


రాజకీయ నేతలు లేదా వారి అనుయాయులు మీడియాను నిర్వహిస్తే పరిణామాలు ఎలావుంటాయో చెప్పడానికి ఇది మరొక మంచి ఉదాహరణ. DMK లో చేరినందుకు నటి ఖుష్బూ పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. 


తమ బద్ధ శత్రువు కరుణానిధికి శాలువా కప్పి DMK లో చేరినందుకు ప్రతీకారంగా....Jaya-TV ఖుష్బూ నిర్వహించే ఒక రియాలిటీ గేమ్ షో ను నిలిపి వేసింది. తొమ్మిదేళ్లుగా ఖుష్బూ నిర్వహిస్తున్న 'జాక్పాట్' అనే ఈ కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ ఉందని పీ.టీ.ఐ.వార్తా సంస్థ తెలిపింది. AIADMK అధినాయకురాలు జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువులు ఈ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. 

ఆదివారం రాత్రి గంట పాటు గమ్మత్తుగా కొనసాగే ఈ 'జాక్పాట్' ను తమిళులు విపరీతంగా ఆరాధిస్తున్నారు. DMK తో సంబంధం ఉన్న ఎవ్వరినీ తెర మీద చూపించకూడదన్న విధాన నిర్ణయం మేరకే ఈ ప్రోగ్రాం ను నిలిపివేసారట. కరుణానిధి ప్రమేయం ఉన్న ఏ సినిమానూ jaya-tv లో చూపించరు.

ఈ పరిణామం సహజంగానే ఖుష్బూ మనసును కష్టపెట్టింది. "వారు ఆ పనిచేస్తారని ముందే ఊహించాను. వ్యాపారాన్ని, రాజకీయాలను కలిపిచూడడం బాగోలేదు," అని ఆమె చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. శుక్రవారం నాడు ఆ నటి DMK లో చేరగానే ఆదివారం నాడు jaya-tv ఈ నిర్ణయం తీసుకుంది. DMK పార్టీ కి చెందిన Sun-TV లేదా Kalaignar-TV లలో 'జాక్పాట్' ను కొనసాగించే అంశంపై ఖుష్బూ ఒక నిర్ణయం తీసుకోలేదట.
(Photo courtesy:  bharatwaves.com)

రజనీకాంత్, కొమ్మినేని బెస్ట్ యాంకర్స్ అట!

వారమంతా హడావుడిగా ఉండే హైదరాబాద్ ఒక్కసారిగా అలిసిసొలసి పెద్ద వేప చెట్టు కింద సేదతీరినట్లు అయిపోతుంది...ఆదివారం పూట. రోడ్లు కాస్త ఖాళీగా కనిపిస్తాయి. జనం రిలాక్స్ గా కనిపిస్తారు. ఇళ్ళ నుంచి బిర్యానీ వాసన వస్తుంటుంది. అందుకే ఆదివారం ఉదయం వాకింగ్ మిగిలిన రోజులుకన్నా భిన్నమైనది.

ఈ ఆదివారం ఉదయం...వాకింగ్ చేసాక...దగ్గరిలోని టేబుల్ టెన్నిస్ హాల్లో మా వాడు ఎలా ఆడుతున్నాడో అని చూసేందుకు వెళ్ళాను. గతంలో రోజూ అందులోకి వెళ్ళేవాడిని కానీ....ఈ మధ్య వివిధ కారణాల వల్ల ఆ ఆట మీద మనసు కాస్త విరిగిపోయింది. వీడిని భారత్ తరఫున ఆడేవాడిగా చేయాలని ఎన్నో ఆశలు ఉండేవి. ఈ వ్యవస్థను, ఇందులో ఓవర్ ఏజ్ గొడవను, రాజకీయాలను, దేశభక్తి లేని అమాంబాపతు జనాలను చూశాక...మనం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నామేమో అని అనిపించింది. ఇది వేరే విషయం.


సరే..ఆ హాల్లోకి వెళ్ళాక ఇద్దరు ఐ.టీ.ప్రొఫెషనల్స్ ఆట మధ్యలో విశ్రాంతి సమయంలో మాట్లాడుకుంటూ కనిపించారు. చర్చ చాలా సీరియస్ గా సాగుతోంది. దేశంలో స్పోర్ట్స్ చంకనాకి పోవడానికి (అంటే..డెవలప్ కాకపోవడానికి. క్షమించాలి.) కారణాలు ఏమిటన్న దానిపై అర్నబ్ గోస్వామి 'టైమ్స్ నౌ' ఛానల్ లో జరిపిన చర్చ గురించి ముందు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చర్చ తెలుగు ఛానెల్స్ లో యాంకర్స్ మీదికి మళ్ళింది. 

అందులో ఒక పెద్ద మనిషి...TV-9 స్టార్ యాంకర్ రజనీకాంత్ (పక్క ఫోటో) కు వందకు వంద మార్కులు వేశారు. "అతను చాలా స్రూడ్. ప్రశ్నలు చాలా తెలివిగా ఉంటాయి. భయం లేకుండా ప్రశ్నలు అడుగుతాడు," అని ఆయన చెప్పారు. తాను చూసిన రజనీ ప్రోగ్రామ్స్ ను ఆయన వివరిస్తూ ఆ యాంకర్ గొప్పతనాన్ని వేనోళ్ళ కీర్తించారాయన. ఇక అటు పక్క ఉన్న ఐ.టీ.మనిషి విశ్లేషణ మొదలయ్యింది. 

"సార్...మీరు ఎన్నైనా చెప్పండి. కొమ్మినేని (N-TV చీఫ్ ఎడిటర్) శ్రీనివాస రావు (ఈ పక్క ఫోటో) ది బెస్ట్ యాంకర్. తడుముకోకుండా భలే మాట్లాడతాడాయన," అని ఆయన కితాబు నిచ్చారు. ఆయన జోక్ గా అంటున్నారేమో అనుకున్నా. కాని ఆయన సీరియస్ గా చెప్పిన మాట అది. ఆ విశ్లేషణ, సంభాషణ అలా చాలా సేపు సాగాయి. కొమ్మినేని గారు టీ.వీ.లో పత్రికా భాష మాట్లాడతారని, నవ్వకూడని చోట నవ్వుతారని నేను అనుకుంటాను. ఆయనకూ విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆయన చర్చకు ఎంచుకునే ప్యానల్ పకడ్బందీగా ఉంటుందని మిత్రులు అంటారు.

నామటుకు నాకు డైనమిక్ యాంకర్ గా అనిపించేది TV-9 CEO రవి ప్రకాష్. అతను కళ్ళతో, నవ్వుతో, స్పష్టమైన భాషతో ఆకట్టుకుంటాడు. ఆ ఛానల్ ఎదుగుదలకు అతని విగ్రహ పుష్టి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. 

రవి ప్రకాష్ తర్వాత చెప్పుకోవాల్సింది HM-TV లో కనిపించే బాలకృష్ణ అనే కుర్రవాడు. అతను సూపర్బ్ యాంకర్. ఆ స్వచ్ఛత, సమయోచిత మాటలు, నగుమోము బాగా నచ్చుతాయి మాకు. అతను కష్టపడి, పట్టుపట్టి మరీ యాంకర్ అయ్యాడట. ఒకసారి లైవ్ లో అతనితో కే.సీ.ఆర్. నోరు జారి మాట్లాడితే....నాకు ఒళ్ళు మండింది. ఈ లోపే ఆ అబ్బాయి...జాగ్రత్తగా మాట్లాడి...తమ ఛానల్ ఏ పక్షమూ వహించదని భలే కట్ చేశాడు. 

మొదట్లో బాగుండే స్వప్న గారు నానాటికీ దిగదుడుపులా అయిపోతున్నారు. కారణాలు ఏమిటో గానీ...ఆమె మొహం బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నది. మాటలు కూడా ముద్ద ముద్దగా వస్తున్నాయని నాకు అనిపిస్తున్నది. మూడు రోజుల కిందట ఆమె 'సాక్షి' ఛానల్ లో నిలబడి వార్తలు చదువుతుంటే...ఒకటే తడబాటు, అస్పష్టత. ప్రగతి అనే యాంకర్ గారు చదివితే కూడా బాగుండేది. 


సౌజన్య అనే చలాకీ యాంకర్ అప్పట్లో ఒక మెరుపు మెరిసారు. 'ఈ-టీ.వీ' తో అరంగేట్రం చేసిన ఆమె.. తర్వాత N-TV లో చేరారు. తర్వాత i-news లోకి దూకారు. అక్కడ కొన్ని రోజులు చేసి...Mahaa news లో చేరారు. తెలుగు టీ.వీ.కి దొరికిన మంచి ఆణిముత్యం ఈమె అనడంలో సందేహం లేదు. i-news లో ఉన్న రోజా గారు కూడా మంచి న్యూస్ రీడర్ కానీ...పిచ్చి డ్రస్సులు, ఓవర్ మేకప్, ఎబ్బెట్టు హెయిర్ స్టైల్ తో చూడడానికి ఎలానో అయిపోతున్నారామె. "ఆమె (రోజా) మా స్కూల్ (న్యూ ఇరా) ప్రిన్సిపాల్ గా ఉండే వారు," అని సెలవలకు ఖమ్మం నుంచి వచ్చిన మా అన్నయ్య కూతురు చెప్పింది.
N-TV లో ఉన్న శ్వేతా రెడ్డి, హిమబిందు కూడా నాట్ బ్యాడ్.

గోరంత విషయాన్ని కొండత చేసి పూటల కొద్దీ నడపడంలో దిట్ట సత్యనారాయణ మూర్తి. ABN-ఆంధ్రజ్యోతి స్టార్ యాంకర్, ప్రజెంటర్ అయిన మూర్తి మాదిరిగానే TV-5 యాంకర్ వెంకట క్రిష్ణ కూడా వండివార్చడంలో చతురుడు. బహు భార్యత్వం ఆరోపణలు, యాసిడ్ దాడితో చాలా కోల్పోయిన కరీం కు కూడా మంచి ఫాన్స్ ఉన్నారు. తనకు తెలియని విషయాన్ని అయినా సరే తెలివిగా కూలంకషంగా చర్చించడంలో అతను దిట్ట. 

కందుల రమేష్ గారు మంచి యాంకర్. ప్రస్తుతమున్న యాంకర్స్, ప్రజెంటర్స్ లో అందరికన్నా విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి ఆయన. TV-5 నుంచి వచ్చాక యాజమాన్య బాధ్యతలలో పడి తెరమీద కనిపించడం లేదు కందుల. తెరవెనుక ఎవ్వారాలు ఎక్కువైతే...తెర మీద పెర్ఫారం చేయడం ఎవరికైనా కష్టమే కదా!  

Saturday, May 15, 2010

సత్యం వధ--ధర్మం చెర: నీతికి పాతర--అవినీతి జాతర

నేను నిజాయితీపరుడినని ఎలుగెత్తి చాటండి. నేను అబద్ధాలు చెప్పనని ప్రకటించండి. మంచిని పెంచుదామని పిలుపునివ్వండి. దేశాన్ని ప్రేమించమనండి. 

ఒక బానపొట్ట అవినీతి మృగం వెంటనే మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక బండ వేస్తుంది. ఒక వికృతాకార అక్రమార్కుడు మీ పై శూలం విసురుతాడు. ఒక తెగ బలిసిన అబద్ధాల విషసర్పం మీ మీద బుస కొట్టి పడగ విప్పుతుంది. ఒక దుష్టగ్రహం మిమ్మల్ని సజీవ సమాధి చేస్తుంది. వారిలో ఒకరిద్దరు జట్టుకట్టి మిమ్మల్ని భూస్థాపితం చేసేవరకూ నిద్రపోరు.

అదే మీరు మేకవన్నె పులో, తడిగుడ్డతో గొంతు కోసే బాపతో, జనం డబ్బు ఇట్టే స్వాహా చేసే రకమో, అబద్ధాల ఇటుకలతో మేడకట్టే నేర్పరో అయితే! డోంట్ వర్రీ. జనం ఆదరిస్తారు. ఎర్ర తివాచీ పరుస్తారు. జేజేలు పలుకుతారు. పల్లకిలో ఊరేగిస్తారు. బ్రదర్, మనం పూర్తిగా బ్రష్టు పట్టిపోయాం. ఇక్కడ సత్యం వధించబడుతున్నది, ధర్మం చెర పెట్టబడుతున్నది. నీతికి పాతర వేస్తున్నారు, అవినీతి జాతర సాగుతున్నది. అబద్ధాలు, కులం, ప్రాంతం, మతం ఆయుధాలుగా నీతిపై నిత్యసమరం సాగుతున్నది. 'దేశభక్తి' అనేది ఒక సనాతన ఆలోచనగా మారింది.

"ధర్మం నా బాట..." అనే శీర్షికతో ఒక నిజాయితీపరుడైన పోలీసు అధికారి (సీ.ఐ.) పై 'ఈనాడు' పత్రిక రెండో పేజీలో ప్రచురించిన వార్త చదివాక ఈ మాటలు రాస్తున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా దాదాపు ఒక రెండు దశాబ్దాలు ఉజ్జోగం చేసి...అవినీతి మధ్య ఇమడలేక రిజైన్ చేసాడట జయచంద్ర రాజు అనే ఈయన. ఏ స్టేషన్ లో ఏనాడూ నాలుగు నెలలకు మించి పనిచేయనివ్వలేదట. చెడు ఉన్న చోట తాను ఉండలేనని, ఇది భరించలేక ఉద్యోగం వీడానని చెబుతున్న రాజు గారు నీతిలేని వారి మనసులు మారాలని ఎమ్మిగనూర్ నుంచి నెల్లూరు దాకా పాదయాత్ర చేస్తున్నారట. 

ఈ మాట మీ పక్కవాడికి చెప్పండి. 'భలే మంచి పని...ఇది సదాశయం,' అని వాడు అనడు..."ఆ...ముడుపుల దగ్గర తేడా వచ్చి...ఉజ్జోగం తీసేసే పరిస్థితి వస్తే వదిలేసి ఉంటాడు," అని వాడు ఒక భాష్యం ఇస్తాడు. పాపం...ఇన్ని రోజులు ఈ రాజు గారు ఎన్ని కష్టాలు పడి ఉంటాడో! పాజిటివ్ దృక్కోణం, నీతికి కనీసం బాసటగా అయినా నిలుద్దామన్న తలంపు మనకు శూన్యం. ఇది కలికాలపు మహిమా? పెద్ద జబ్బా?

చాలా మంది ఆలోచించరు గానీ...మనం అన్ని రంగాలలో బ్రష్టు పట్టిపోవడానికి కారణం ఒకే ఒక్కటి---'అబద్ధం'. దాని అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కుటుంబసభ్యులే అవినీతి, అక్రమం, దురాగతం, దోపిడీ, కపటత్వం, వంచన, దారుణం...వగైరా. నన్నడిగితే...ఈ దారుణ పరిస్థితిలో సమాజాన్ని రక్షించుకోవాలని భావించేవారు చేయాల్సింది ఒక్కటే...ధర్మ ప్రచారం. ఇకపై మేము అబద్ధం చెప్పం... అని భార్యా భర్త, కుటుంబం, స్నేహితుల సమూహం బాస చేస్తే...చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

తరచి చూస్తే...సత్యం అనే పునాదిపై మన మానవ సంబంధాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తలు, స్నేహితులు పరస్పరం దొంగమాటలు మాని నిజాలనే మాట్లాడితే అక్కడ స్వచ్ఛమైన ప్రేమ వెల్లివిరుస్తుంది. ఉద్యోగులు బల్ల కింద చెయ్యి పెట్టడం ఆపినా...దొంగ టీ.ఏ.బిల్లులు పెట్టకపోయినా...వారిలో తెలియని ధైర్యం దానంతట అదే వస్తుంది. అది నిజంగా పాజిటివ్ శక్తి. నిజానికి అన్ని మతాలూ దీన్నే ఘోషిస్తున్నాయి. అబద్ధం పాతకమని మతం/ దేవుళ్ళు చెబుతారు, అబద్ధం చెప్పవద్దని ప్రతి అమ్మా చెబుతుంది. అయినా ఇక్కడ అబద్ధం వెర్రితలలు వేస్తూ కరాళ నృత్యం చేస్తున్నది విభిన్న రూపాలలో. న్యాయవాదులు, నేతలు, జర్నలిస్టులు...ఇలా అన్ని రంగాల వారు అబద్ధాలను త్యజిస్తే...మెరుగైన సమాజం దానంతట అదే ఏర్పడుతుంది. అక్కడ మనం మనస్ఫూర్తిగా, పరస్పర నమ్మకంతో హాయిగా బతకవచ్చు.

నిజాయితీగా బతకాలని భావిస్తే సుఖం ఉండదు, అన్నీ కష్టాలే. అయినా ఆ తృప్తి చాలా గొప్పది. ఈ విషయంలో నేను కొన్నేళ్లుగా ఒక ప్రయోగం చేస్తున్నాను. నేను పూర్తిగా కన్వీన్స్ అయిన విషయం ఒకటి ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే...ధర్మం మనలను రక్షిస్తుంది. ఇది అందరికీ తెలిసిన పాత మాటే. దీని స్వగత దృష్టాంతాలను త్వరలో మీతో పంచుకుంటాను. అంతవరకూ అబద్ధాలు లేని ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించడం కొనసాగిస్తూ పోదాం.

Friday, May 14, 2010

i-news యాజమాన్యంపై SHRC కి జర్నలిస్టుల ఫిర్యాదు

తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఈ రోజు తెరలేచింది. హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా...నోరు మూసుకుని భరించే తెలుగు జర్నలిస్టు గళం ఎత్తడం మొదలుపెట్టాడు. అదీ....ఒంటరిగా కాదు...మూకుమ్మడిగా. గుడ్డికన్ను లాంటి జర్నలిస్టు సంఘంతో పనిలేదని నిర్ధారణకు వచ్చిన జర్నలిస్టులు విధిలేక ఐ-న్యూస్ యాజమాన్యంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

జర్నలిస్టులకు జీతాలు, భత్యాలు ఇవ్వకుండా i-news యాజమాన్యం నానా ఇబ్బందులు పెడుతున్నదని ఈ బ్లాగ్ లో మూడు పోస్టులు పెట్టిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కుటుంబ పోషణకు మరో మార్గాంతరం లేక వేరే ఛానెల్స్ లో చేరిన దాదాపు యాభై మంది జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ సుభాషణ్ రెడ్డి గారిని కలిసారు. i-news యాజమాన్యం తమను దారుణంగా ఇబ్బంది పెట్టిందని, ఇంతవరకూ బకాయిలు ఇవ్వలేదని వారు లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఫిర్యాదు చేశారు. 

i-news యాజమాన్యం PF కింద వసూలు చేసిన డబ్బు ఏమి చేసిందీ అర్ధంకావడం లేదని, ESI సౌకర్యం కూడా లేకుండా మోసం చేసారని బాధితులు వాపోయారు. యాజమాన్యం డబ్బులు ఉండీ ఇవ్వడంలేదని వారు ఫిర్యాదు చేశారు. తమకు వాసు వర్మ అండ్ కో ఇచ్చిన ఆఫర్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, ఐ.డీ.కార్డులు కూడా వారు SHRC కి సమర్పించారు. 

జూన్ 2 న హియరింగ్!
కేసును సావధానంగా విన్న సుభాషణ్ రెడ్డి గారు కార్మిక శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు పంపినట్లు సమాచారం. జూన్ రెండో తేదీన వచ్చి మళ్ళీ కలవాల్సిందిగా ఆయన ఆ బాధిత జర్నలిస్టులను కోరారు. N-TV, ABN-AJ, Raj, Studio-N లలో పనిచేస్తున్న మాజీ ఐ-న్యూస్ ఉద్యోగులు ఈ బృందం లో ఉన్నారు. అనంతరం తాము బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు సమర్పించినట్లు బాధితులు ఈ బ్లాగ్ కు ఫోన్ లో తెలిపారు. 
రాజశేఖర్, కందుల రమేష్ ల బాధ్యత ఎంత?

"TV-9 లో ఒక దొంగ వ్యవహారం లో ఉజ్జోగం కోల్పోయిన రాజశేఖర్ ను నమ్మి i-news లో చేరడం మేము చేసిన తప్పు. ఇది ఒక NRI ఛానల్ అని మమ్మల్ని నమ్మించాడు. మమ్మల్ని నట్టేట ముంచి తాను N-TV లో మంచి జీతం తో చేరాడు," అని ఒక బాధితుడు అన్నాడు.
ఆ తర్వాత TV-5 నుంచి వచ్చి చేరిన కందుల రమేష్ కూడా తమను మోసం చేసినట్లు ఒక వర్గం భావిస్తున్నది. "మేము సమ్మె కు దిగినప్పుడు, అంతకు ముందు సర్ది చెప్పిన కందుల రమేష్ కూడా కొందరిని నట్టేట ముంచి...తమ వాళ్ళ ఛానల్ అయిన studio-N లో చేరాడు," అని అన్నారు. తమను బాగా నమ్మించి వంచించిన సీనియర్లపై బాధితులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సొంత లాభం, సొంత పే ప్యాక్ తప్ప ఇతరుల బాధ పట్టని ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల వల్ల సాధారణ జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సీనియర్ల సొంత కాలిక్యులేషన్స్ వల్ల i-news యజమాని వంటి వాళ్ళు జర్నలిజాన్ని రోడ్డుపక్క పల్లీలు అమ్ముకునే వ్యవహారంగా భావిస్తున్నారు.

ఇది....భలే ఉపయోగకరమైన వెబ్ సైట్!

ఒకొక్కసారి మనకు అమూల్యమైనవి అనుకున్నవి పోతాయి. కొన్నిసార్లు ఒకరికి అమూల్యమైనవి మనకు దొరుకుతాయి. తమ వస్తువులు పోతే...పోలీసు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు బహు స్వల్పం. మన ఖర్మ ఇలా కాలింది...అనుకుని కిమ్మనకుండా ఉండేవారే ఎక్కువ.


మన వస్తువులు దొరికినవారు వాటిని వాడేసుకోవడం లేదా పనికిరానివని చెత్తలో పారెయ్యడం జరుగుతుందని మనకు అనిపిస్తుంది. అది అన్ని సందర్భాలలోనూ నిజం కాకపోవచ్చు. మన వస్తువులు దొరికినవారు మనకోసం వెతుకుతుండవచ్చు. పోయిన మన సర్టిఫికెట్స్, మెడికల్ రిపోర్ట్ మనకు ఇవ్వాలని ఆరాటపడే బుద్ధిజీవులూ ఉంటారు. మనలను పట్టుకునేందుకు వారు నానా తంటాలు పడుతూ ఉండవచ్చు.


ఇలా...వస్తువులు పోగొట్టుకున్నవారికి, అవి దొరికిన వారికి వారధిగా ఉండేలా ఒక వెబ్ సైట్ రూపొందిచారు మన నరసరావుపేట యువకుడు. ఆ విషయాన్ని 'ది హిందూ' గుంటూరు విలేఖరి సుసర్ల రమేష్ గారు రిపోర్ట్ చేశారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రమేష్ గారు ఈ వెబ్సైటు పై రాసిన వార్తను మీ కోసం ఈ పక్కన అందిస్తున్నాం.   ప్రజోపయోగం దృష్ట్యా...'ది హిందూ' వారి అనుమతి లేకుండానే వారి క్లిప్పింగ్ ను ఇక్కడ వాడుతున్నాం. థాంక్స్..రామ్ సార్.
ఇది చదివిన ఎడిటర్లు, రిపోర్టర్లు వీలయితే...మీ పత్రికలలో, ఛానెల్స్ లో దీని మీద మీరు ఒక వార్త చేయించండి. ప్రజలకు బాగా ఉపయోగంగా ఉంటుంది.

Thursday, May 13, 2010

పత్రికలు, ఛానెల్స్ లో పరిణామాల సమాహారం...


 సలీం ను పాట్నా పంపిన 'ఈనాడు' 
* 'ఈనాడు' మరొక సీనియర్ జర్నలిస్టు మీద ప్రతాపం చూపించింది. 'ఈనాడు జర్నలిజం స్కూల్' మొదటి బ్యాచ్ కు చెందిన సలీం అనే జర్నలిస్టును బీహార్ రాజధాని పాట్నా కు బదిలీ చేసింది యాజమాన్యం. ఇప్పటికే మల్లికార్జున్ అనే జర్నలిస్టును ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు బదిలీ చేసి ఆనందం పొందుతున్న రావు గోపాల్రావ్ బ్యాచ్ తాజాగా సలీం పై కక్ష గట్టడానికి కారణాలు తెలియరాలేదు. సలీం సిటీ డెస్క్ లో పనిచేసారు. మరి అక్కడి విష్ణుకు ఈయనకు బెడిసిందేమో తెలియదు. 
సలీం గారూ...నిజంగా పెద్ద తప్పులు చేసి వుంటే సరిదిద్దుకోండి. లేకపోతే...పాట్నా వెళ్లి హాయిగా పనిచేయండి. సత్యం జయిస్తుంది. ఇలా బదిలీ చేయగానే అలా బెదిరి రాజీనామా చేయడం పిరికివాళ్ళ లక్షణం. అల్ ది బెస్ట్.


'సాక్షి' కి నేమాని భాస్కర్ గుడ్ బై
*మరొక పెద్ద పక్షి N-TV గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధమయ్యింది. 'సాక్షి' ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ నేమాని భాస్కర్ మళ్ళీ ఆ ఛానల్ లోకి వెళ్లి పోబోతున్నారు. వై.ఎస్.ఆర్.కు ఆత్మీయ జర్నలిస్టులలో ఒకరైన భాస్కర్ ఉన్నట్టుండి చౌదరి గారి ఛానల్ వదిలి 'సాక్షి' లో చేరారు. వై.ఎస్. ఉన్నన్నినాళ్ళు ఆయన హవా బాగానే నడిచినా ఇప్పటి పరిణామాలు ఆయనకు మింగుడు పడడం లేదని సమాచారం. 
జీ-ఛానల్లో సుఖంగా ఉన్న బీ.టీ.గోవింద్ రెడ్డి అక్కడి నుంచి వచ్చి 'సాక్షి' లో అవుట్ పుట్ ఎడిటర్ గా చేరి అక్కడ పని చేయలేక ఒక రెండు నెలల కిందటే వెళ్ళిపోగా...ఇప్పుడు 'సాక్షి' ఇన్ పుట్ ఎడిటర్ కూడా సొంత గూటికి చేరుకున్నారు. ఇది ఆ జర్నలిస్టుల తప్పా? లేక రామ్ రెడ్డి-స్వప్నక్కల మహిమా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది.

నరేన్ చానెల్ లో మార్పులు
*పెద్ద తలకాయల ఛానల్ N-టీవీ లో సంస్థాగత మార్పులు జరుతున్నాయి. మన 'తెరచాటు వీరుడు' రాజశేఖర్ i-news నుంచి తెచ్చిన బృందం, N-TV పుట్టుక నుంచి ఉన్న టీం మధ్య అక్కడ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో నరేన్ చౌదరి గారు ఉపక్రమించారు. సీనియర్లను జాగ్రత్తగా వాడుకునేందుకు భారీ కసరత్తు చేసి బదిలీలకు రంగం సిద్ధం చేశారు. N-TV నుంచి TV-5 కు వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి సొంత గూటికి చేరుకున్న మహాత్మ కొడియార్ ను విశాఖపట్నం బ్యూరో కు బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అర్జంటుగా అక్కడ బ్యూరోను దృఢ పరుచుకోవాలని చౌదరి సార్ కు సలహాదార్లు చెప్పినట్లు తెలిసింది. 
చౌదరి గారూ....జర్నలిస్టులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా....ఎడిటోరియల్ మీటింగులను తమరు అడ్రెస్ చేయడం కొనసాగిస్తే....మన ఛానల్ ముందుకు పోవడం కష్టం సార్. అంత మంచి తలకాయలను అమ్ములపొదిలో ఉంచుకొని ఇంకా మీ ఆఫీసు పక్కనున్న TV-5 ను పడెయ్యలేకపోవడానికి మీరు, మన రావు బాబాయ్ కారణమని మీ జర్నలిస్టులు బైట చెప్పుకుంటున్నారు.

i-news నుంచి బైటికి వచ్చిన బుడన్
*i-news అవుట్ పుట్ ఎడిటర్ గా కందుల రమేష్ TV-5 నుంచి తెచ్చి పెట్టుకున్న బుడన్ ఆ ఛానల్ నుంచి బైటికి వచ్చాడు. రమేష్ చెప్పా పెట్టకుండా తనదారి తాను చూసుకోవడం, అక్కడి బ్యాచ్ తనపై యాజమాన్యానికి లేనిపోనివి చెప్పడం తో బుడన్ మనస్తాపంతో బైటికి వచ్చారని తెలుస్తోంది. 'ఈనాడు' పేపర్ లో, ఆ తర్వాత 'ఈ-టీవీ'లో పనిచేసిన బుడన్ ABN- ఆంధ్రజ్యోతి లో కొద్ది రోజులు పనిచేసి TV-5 కు వెళ్ళారు.

i-news లో ఎన్.ఆర్.ఐ.పెట్టుబడి?
*తీవ్ర ఆర్థిక సంక్షోభం లో ఉన్న i-news కు ఎట్టకేలకు ఒక పెట్టుబడిదారుడు దొరికినట్లు సమాచారం. ఒక ఎన్.ఆర్.ఐ. కి వాసు వర్మ బృందానికి మధ్య చర్చలు జరిగి ఒప్పందం కురినట్లు తెలుస్తున్నది. గతంలో 'ఈ-టీ.వీ'లో పనిచేసిన రమణ అనే జర్నలిస్టు ఆ ఎన్.ఆర్.ఐ.తరఫున రంగ ప్రవేశం చేసినట్లు చెబుతున్నారు.

TV-9 లో 'ఈనాడు' వేగు? 
*ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న రవి ప్రకాష్ అంటే 'ఈనాడు' గ్రూప్ కు భయం. రామోజీ సామ్రాజ్యాన్ని ఒక్క కుదుపు కుదిపిన జర్నలిస్టు ఎవడైనా ఉన్నాడంటే....అది రవిప్రకాష్. అలాంటి రవి దగ్గర చేరిన 'ఈనాడు' మాజీ ఒకరు ఇప్పటికీ 'ఈనాడు' యాజమాన్యానికి సన్నిహితంగా ఉంటూ బైట పనులు చేసిపెడుతున్నట్లు తెలిసింది. ఆ మాజీని  'ఈనాడు' యాజమాన్యం కులం కార్డు ద్వారా, పూర్వ పరిచయాల ద్వారా దగ్గర చేసుకుని పనులు చేయించుకున్నట్లు చెబుతున్నారు. 'మార్గదర్శి' గొడవల సందర్భంగా ఈ మాజీ ద్వారా 'ఈనాడు' కొన్ని డాక్యుమెంట్లు తెప్పించుకున్నట్లు భోగట్టా. విచిత్రం ఏమిటంటే...ఈ మాజీ 'ఈనాడు' సారు...అక్కడ మాయ మాటలతో రవిని కూడా బోల్తా కొట్టిస్తున్నారట.
'ఇది నిజమేనా...బ్రదరూ' అని అడిగితే ఆ ముదురు జర్నలిస్టు నుంచి వివరణ వచ్చే అవకాశం లేనందున ఆ ప్రయత్నం చేయలేదు.  

Wednesday, May 12, 2010

సాయిబాబాపై Mahaa-TV లో తలాతోకా లేని లైవ్ షో

Mahaa-TV లో ఈ రాత్రి పుట్టపర్తి సత్యసాయి బాబాపై... "వారసుడెవరు?" అన్న శీర్షికతో వచ్చిన లైవ్ షో తలాతోకా, అర్థంపర్థం లేకుండా సాగింది. ముందస్తు కసరత్తు, ప్రణాళిక లేకుండా లైవ్ షో చేస్తే ఎంత చెత్తగా ఉంటుందో ఈ కార్యక్రమం చూస్తే అర్ధం అవుతుంది. అసలీ....గోగినేని బాబు గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు ఎందుకు వెళ్లి అభాసుపాలవుతారో నాకు అర్థం కావడంలేదు. 

ఈ ప్రోగ్రాం శీర్షిక ప్రకారం....సాయిబాబా గారి వారసుడెవరు? అన్న అంశంపై చర్చ జరగాలి. ఇది మంచి సబ్జెక్టు. ఒక పదేళ్ళ కిందట ప్రశాంతి నిలయంలో కొన్ని రోజులు ఉన్నప్పుడు నాకు వచ్చిన సందేహం ఇది. హేమ తండ్రి గారు  పదవీ విరమణ అనంతరం స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆ వూరికి ఎప్పుడు వెళ్ళినా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది. ఇన్ సైడ్ ఏమైనా ఇస్తారేమో అని నేను ఆసక్తిగా చూస్తూ కూర్చుని టైం వేస్టు చేసుకున్నాను. ఇంత మంచి సబ్జెక్టును చెడగొట్టి పారేసారు.

ఈ చర్చకు బీ.జే.పీ. అధికార ప్రతినిధి ఎన్.వీ.ఎస్.ప్రభాకర్, శ్రీ సేవా ఫౌండేషన్ తరఫున మంజుల శ్రీ, అంతర్జాతీయ హేతువాద సంఘం అధ్యక్షుడు గోగినేని బాబు పాల్గొన్నారు. యాంకర్ గారు...ఆరంభంలో ఒక లీడ్ చెప్పి...చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చెందిన రంగ రాజన్ అనే అర్చకుడు ఫోన్ లైన్ లో...సాయి మహిమల గురించి మాట్లాడేసరికి డంగై పోయారు. "మేము ఇతర బాబాలతో సాయి బాబా ను పోల్చడం లేదు. ఆయన వారుసుల మధ్య జరుగుతున్న పోటీ గురించి చర్చ," అని యాంకర్ ప్రకటించారు.

నిజానికి ఆ చర్చ పెద్దగా జరగకుండా...మిగిలిన ఇద్దరు గోగినేని బాబు గారిని కార్నర్ చేసేలా షో సాగింది. మధ్యలో ఆ బీ.జే.పీ. ఆయన...బాబు గారిని ఉద్దేశించి..."మీరు 35 ఏళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్నారు," అని అన్నారు. ఇది దారుణం. ఆ యాంకర్ దీన్ని నివారించలేదు. ప్రభాకర్ మాటిమాటికీ బాబు గారిని ఎద్దేవా చేస్తూ...తాను నమ్మే.... కావలి అవధూత గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలీ యాంకర్లు ఇలాంటి దాడిని చాకచక్యంగా నిలువరించాలి. తన అభిప్రాయం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్న ఒక ప్రముఖ గెస్టు ను అలా మిగిలిన గెస్టు లు కించపరచడాన్ని అనుమతించకూడదు. 

ఈ కార్యక్రమం అంతా...'వారసుడి' సంగతి తేల్చకుండా సాగింది. ఒక దశలో...."మహా టీ.వీ. ఎడిటర్ నేను చెబితే వినాలి అని నాకు ఉంటుంది. అలా నేను అనుకుంటే...జరిగిపోతుందా?" అని మంజుల గారు ఒక వుదాహరణగా చెప్పారు. వారు...సాయి తదితరులను పొగడడం...బాబు గానిని ఖండించడం సాగిపోయింది. వారసుడి చర్చ నుంచి దారి తప్పాం...అన్న స్పృహ ఆ నలుగురికి కొరవడింది.

ఛానల్ వారు సాయి సేవా కార్యక్రమాలను అద్భుతంగా రికార్డు చేసి ..వారు చేస్తున్నది అద్భుతమైన సేవ అని అర్థం వచ్చేలా ప్రోగ్రాం నడిపారు. మధ్యలో సత్యసాయి ట్రస్టు కన్వీనర్ ఏ.పీ.రంగా రావు గారి బైట్ వాడారు. ఇలా ఛానల్ వారు భక్తిని ప్రమోట్ చేయదలుచుకున్నారా? అన్న సందేహం అడుగడుగునా కలిగింది. ఆ ట్రాప్ లో పడిపోయిన బాబు గారు...అమెరికా ప్రభుత్వం ఇచ్చిన 'ట్రావెల్ అడ్వైజరీ' గురించి, సాయి యూనివర్సిటీ లో చదువుల గురించి మాట్లాడారు. 


ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే....మధ్యలో చానెల్ వారు 'బ్రేకింగ్ న్యూస్' అంటూ పెద్ద మ్యూజిక్ తో వచ్చిపోయ్యే పెద్ద డబ్బాలో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వకుండా...సాయి బాబా వివరాలు, ట్రస్టు చేసిన పనులు, ఆయన ఎన్నేళ్ళు బతుకుతానని చెప్పిందీ....ప్రేక్షకులకు అక్షర రూపంలో అందించారు. ఇదొక తిక్క పనిగా నాకు అనిపించింది. 
అసలీ ప్రోగ్రాం కు పెట్టాల్సిన శీర్షిక "వారసుడెవరు?" అని కాదు. దీని శీర్షిక..."సాయిబాబాను తిట్టాలా? పొగడాలా??"

ఎం.ఎల్.సీ.గా సీనియర్ జర్నలిస్టు సయ్యద్ జాఫ్రి

డాక్టర్ కే.నాగేశ్వర్ తర్వాత మరొక జర్నలిస్టు కొత్త శాసన మండలిలో అడుగుపెట్టారు. ప్రముఖ జర్నలిస్టు సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రి ఎం.ఐ.ఎం.పక్షాన పెద్దల సభలో స్థానం సంపాదించారు.


పక్కా హైదరాబాది అయిన జాఫ్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1976-77 లో జర్నలిజం కోర్సు చేశారు. కెరీర్ ఆరంభంలో 'ప్లెడ్జ్' అనే ఆంగ్ల పత్రికలో కొద్దికాలం పనిచేసిన జాఫ్రి 'ఈనాడు' గ్రూప్ కు చెందిన ఆంగ్ల పత్రిక 'న్యూస్ టైం' లో అది మూతపడే వరకూ పనిచేసారు. మృదుస్వభావి గా పేరున్న ఆయన రాష్ట్ర భౌతిక, రాజకీయ అంశాలపై మంచి పట్టు సాధించారు.

ఆ తర్వాత డెక్కెన్ క్రానికల్ లో జాఫ్రి మంచి ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ రాసారు. తర్వాత బీ.బీ.సీ., రీడిఫ్ డాట్ కామ్ లకోసం పనిచేసారు. "జాఫ్రి ని ఎం.ఐ.ఎం. ఎంచుకోవడం మంచి పరిణామం. ఆయన ఏ రకంగా చూసినా అత్యంత ప్రతిభావంతుడు," అని ఆయన సహాధ్యాయి ఒకరు చెప్పారు. Jafri sir, we wish you all the best. 


కాంగ్రెస్ నేత కే.కేశవ రావు కూడా జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చారు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్దల సభలోకి అడుగుపెట్టారు. నిజానికి జర్నలిజం ప్రొఫెసర్ అయిన నాగేశ్వర్ గారు పలు ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాసారు. 'ఎనాలిసిస్' అనే సొంత పత్రికను నిర్వహించారు. వాగ్దాటితో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ బాటలోనే జాఫ్రి గారు పయనించి మంచి చర్చలకు తెర తీసి ప్రజలకు మేలు చేస్తారని ఆశిద్దాం.
(ఫోటో క్రెడిట్: thehindu.com)

Monday, May 10, 2010

సత్యమేవ జయతే....సత్యమేవ జయతే.


తెలుగు మీడియాకు సంబంధించిన పలు విషయాలు, అనుభవాలు, జర్నలిస్టుల బాధలు, వృత్తిలో ఇబ్బందులు ఇన్నాళ్ళూ రాసిన నాకు ఒక అనామిక  'బహిరంగలేఖ' పేరిట పంపిన కామెంట్ ను మీతో పంచుకోవడానికి ఇది రాస్తున్నాను. 

ఆ లేఖలో చాలా విద్వేష పూరిత వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ పూర్తి అబద్ధాలు వ్యక్తిత్వాన్ని హత్య చేసేలా ఉండి చాలా వెగటు కలిగించాయి. నవ్వు తెప్పించాయి. ఆ దొంగ లేఖకు విస్తృత వ్యాప్తి కలిగించే ప్రయత్నం చేసిన అనామకుడికి శుభం కలుగుగాక!

'పిల్లి గడ్డం రాము....' తో ఆరంభించాడు. అన్నయ్యా....ఇప్పుడు పిల్లిగడ్డం లేదు. తీసేశాను. నువ్వు రాసింది ఒక్కటీ నిజం కాదు. ఇలాంటి ప్రయత్నాలు మానుకో. అనామికతో నీ గారడీ నీ విజయం కాదు. అపజయం.

'సత్య శోధకుడి' పేరు మీద రాహులకు వచ్చిన లేఖ నేను రాసినట్లు ఈ మిత్రుడు భావించినట్లు ఉన్నాడు. బాబూ...అది నిజం కాదు. ఆత్మవంచన కన్నా...ఆత్మహత్య నయం అని నమ్మే వాడిని నేను. ఒక్క సారి కూడా ఇలా అనామిక లేఖలు అంటే నీ లాంటి దొంగ లేఖలు రాయను. నీలా దమ్ము ధైర్యం, విలువలు లేనివాడిని కాదు. జర్నలిస్టుగా వర్క్ ప్లేసులో ఒక్క మచ్చైనా లేకుండా, ఒక్క అవినీతి పనికైనా పాల్పడకుండా పనిచేశానని గర్వంగా చెప్పుకోగలను.     

నేను నిన్ను లొకేట్ చేయడం పెద్ద పనికాదు కానీ...ఆ పని నేను చేయను. నిజంగా 'సత్యం' అనే మాటకు మహిమ వుంటే...నువ్వే త్వరలో మారతావు. మారాలని...తప్పుడు ప్రచారం నీకు మంచిది కాదని...అది నీకు తాత్కాలిక ఆనందం కలిగించినా...కనిపించకుండా చాలా హానిచేస్తుందని చెప్పడం నా ఉద్దేశ్యం. నీకు  నాతో సమస్య/ఇబ్బంది ఉంటే...ఉస్మానియా యూనివెర్సిటీ జర్నలిజం శాఖలో నన్ను కలుసుకోవచ్చు... ఎప్పుడైనా. We can settle things over a lemon tea. కాదంటే...మీ ఛానల్ ఆఫీసు మా ఇంటి పక్కనే. రమ్మంటే...నేనే వస్తా.

అన్నయ్యా...నేను జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించింది...సత్యాన్ని నమ్ముకుని. నిష్ఠగా దానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి అబద్ధం ఏదోలా మనలను చుట్టుకుంటుంది. నేను నమ్మింది నీకు చెప్పదలుచు కున్నాను....సత్యమేవజయతే.

Friday, May 7, 2010

'ఈనాడు' పత్రికలో భారీగా బదిలీలు--విష్ణుకు స్థానచలనం

'ఈనాడు' యాజమాన్యం ఎడిటోరియల్ విభాగంలో ఈరోజు భారీగా బదిలీలు చేసింది. దాదాపు 150 మందిని బదిలీచేసినట్లు అనధికార సమాచారం.

ఈ బదిలీలలో చాలా ముఖ్యమైనది...హైదరాబాద్ సిటీ డెస్క్ ఇంచార్జ్ గా పనిచేస్తున్న విష్ణువర్ధన్ ను అక్కడి నుంచి తప్పించడం. అతని స్థానంలో కరీంనగర్ లేదా వరంగల్ డెస్క్ ఇంచార్జ్ ను తీసుకు వస్తున్నారు. విష్ణు దాదాపు పన్నెండు ఏళ్ళుగా సిటీ డెస్క్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఆ డెస్కులో ఉన్న వెంకూ అనే సీనియర్ జర్నలిస్టుకు కాకుండా...బైటి నుంచి తేవడం 'ఈనాడు' వర్గాలలో చర్చనియాంశం అయింది.

విష్ణును రీజనల్ డెస్క్ కు బదిలీ చేశారు.  విష్ణు సతీమణి కృష్ణవేణి గారు సండే అనుబంధం బాధ్యతలు  చూస్తున్నారు. ఇద్దరి పనివేళలు వేరు వేరు కావడం వల్ల కుటుంబ పరంగా ఎంతో కోల్పోయిన వీరికి తాజా బదిలీలు మేలు చేయాలని ఆశిద్దాం. 

మారెన్న  వ్యవహారం నేపథ్యంలో విష్ణు బదిలీ జరిగిందా....లేక తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్న ఆయనకు రెస్ట్ ఇవ్వాలని కోర్ కమిటీ భావించిందా అన్నది తెలియరాలేదు. నిజానికి సిటీ డెస్కులో పనిచేయడం అంటే బీ.పీ. కొని తెచ్చుకోవడమే. అప్పటి రఘు బాబు, గడ్డం నరసింహ రావు, ఇప్పుడు విష్ణు ఇందుకు ఉదాహరణలు.

నిజానికి...ఇప్పుడు 'ఈనాడు జర్నలిజం స్కూల్' చూస్తున్న మానుకొండ నాగేశ్వర్ రావు ను కరీంనగర్ నుంచి తెచ్చిన యాజమాన్యం ఆయన సేవలు ఎడిటోరియల్ లో వాడుకోకుండా తప్పిదానికి పాల్పడింది. పేజీల నిర్వహణలో ఎంతో అనుభవం, కొత్తదనం తేవాలన్న ఉత్సాహం ఉన్న ఆయనను కొత్త బ్యాచులు తయారుచేసే పనికి వాడుకున్నారు. ఏ మాత్రం అర్హతలు, అనుభవం లేని బోధనలో ఆయనను వాడుకుంటూ 'ఈనాడు'లో నాణ్యతను  యాజమాన్యం చేతులారా దెబ్బతీసుకుంతున్నది. 

"ఈనాడు లో ఎం.ఎన్.ఆర్. శిష్యులు చాలా మంది నాణ్యతపై, ప్రతిభ మెరుగుపరుచుకోవడం పై కన్నా ఇతరేతర అంశాలపై  దృష్టి పెడుతున్నారు. దానివల్ల ఓవర్ అల్ గా నాణ్యత దెబ్బతిన్నది. అది యాజమాన్యం గమనించాలి," అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు.

అయినా...ప్రతిభ అన్వేషణ, ప్రతిభకు పట్టం కట్టడంలో 'ఈనాడు' లో చాలా సమస్యలు ఉన్నాయి. కిరణ్ గారు ఈ మౌలిక అంశాలు పట్టించుకోకుండా...ఎన్ని బదిలీలు చేసినా ప్రయోజనం ఉండదనేది నిష్టుర సత్యం. 'సాక్షి' ని నిలువరించాలంటే 'ఈనాడు' చేయాల్సిన కసరత్తు ఎంతో ఉంది.  'ఈనాడు' సేవలు సమాజానికి అవసరం.

Thursday, May 6, 2010

'ఈనాడు' రాహుల్ కుమార్ కు 'సత్యశోధకుడి' లేఖ


'ఈనాడు'లో పొలిటికల్  రిపోర్టర్ గా కెరీర్ ఆరంభించి...ఇప్పుడు జనరల్ డెస్క్ ను నిర్వహిస్తున్న కీలక జర్నలిస్టు ఎన్.రాహుల్ కుమార్. గుంభనంగా వ్యవహరిస్తూ...మృదు స్వభావిగా పేరున్న రాహుల్... చేతిలో లావుపాటి ఇంగ్లిష్ పుస్తకాలతో కనిపిస్తారు. వాటిలో పలు విషయాలను నా బోటి సన్నిహితులతో పంచుకుంటారు. 'ఈనాడు' లో ఇతర పవర్ సెంటర్స్ అప్పుడే వేళ్ళూనుకుంటున్న సమయంలో యాజమాన్యం రిపోర్టింగ్ నుంచి జనరల్ డెస్క్ కు మార్చింది తనను. 

రాహుల్ అంటే పలు విషయాలలో ఇప్పటికీ చాలా మంచి అభిప్రాయం ఉంది. పైకి తియ్యగా మాట్లాడుతూ...ఎర్ర మాటలు చెబుతూ...అత్మీయుడిగా మెలుగుతూ...గోతులు తీసే మేకవన్నె పులుల కన్నా రాహుల్ వంద రెట్లు నయం. జర్నలిస్టు కాలనీ లో తనది కాని మంచి స్థలంలో తను ఇల్లు కట్టేసుకున్నాడని తెలిసి నేను విస్మయం చెందాను. అది వేరే విషయం. 

'ఈనాడు' లో రాహుల్ అంత ఎదుగుదల....ప్రాంతం వల్లనా? కులం వల్లనా? బధుత్వం వల్లనా? వంటి పిచ్చి వాదాలు చాలా మంది చేస్తారు. కానీ...నాకు తెలిసినంత వరకూ రాహుల్ విషయాన్ని బట్టి పొయ్యేవాడు, బాధితుల పక్షాన ఉండేవాడు, లౌకిక వాది---ఒక పది పన్నెండు ఏళ్ళ కిందట. ఇప్పటి సంగతి గురించి నేను చెప్పలేను. ఒక జర్నలిస్టు మారెన్న విషయంలో రాహుల్ మౌనం, జరిగిన తప్పు బాధ్యతను స్వీకరించకపోవడం కూడా నాకు విస్మయం కలిగించింది. ఈ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి సత్యశోధకుడి పేరు మీద రాహుల్ కు పంపిన లెటర్ ను దిగువ ఇస్తున్నాను.

కొన్ని కీలక అంశాలు ఇందులో ఉండడంతో ఇది ప్రచురించాల్సి వచ్చింది. రాహుల్...దీనిపై మీరు బహిరంగంగా స్పందిస్తే సంతోషం. లేకపోయనా...అనామిక గా అయినా మీ వివరణ ఇచ్చుకోవచ్చు. ఇన్నాళ్ళూ తెలుగు జర్నలిజం లో గుట్టుగా ఉన్న విషయాలపై చర్చ జరపడం ఈ బ్లాగ్ ఉద్దేశం. ఎవ్వరినీ కించపరచడం, కక్ష తీర్చుకోవడం కాదు. ఒక మంచి చర్చ కోసం....తప్పుగా అనుకోకుండా మీరూ ఈ చర్చలో పాల్గొనండి.--రాము 
------------------------------------------------------------------------

Mr Rahul…
You seem to be trying to act smart. But this is a different fora not your robotic general desk to listen to the tunes that you compose blindly. You must learn somethings dear… Choosing not to choose is, in fact, a choice. With choice comes the responsibility to stand behind it. Your ability to stand behind an unpopular choice or legal conflict of interest that you feel is ethically justified requires courage and character. But you are lost… that too shamefully. 


In Marenna’s episode as a self proclaimed intellectual, all your duplicity as come up awkwardly. As you yourself agreed in your comment… deffinetly you are not an inspiring leader. To that extent I appreciate your boldness. But the story not ends there. You wanted to trade your boldness for ‘humanist’. How ridiculous it is! Acknowledging a wrong choice and accepting responsibility needs great courage and humility.

As a trained professional by doing some wrong… Marenna is sure in the culprits list. I agree. But what about you? In the early stages of your career… you submitted countless number of reports to the management preaching and aspiring ideals and fairness in the profession. Now you never seem to be the man of what you preached. What happened? You corrupted by the power or you basically a corrupt?


I am asking you this because… Recently you published Merk companies vaccine advertisement as a banner story. Whose interests you can prove involved in that? What public interest you find in that? After somedays of the publication of the story… Government of India banned the vaccine itself. Has it come to your notice? Have you ever felt the moral responsibility to publish a ‘savarana’? You misrepresented a fact and deliberately guided lakhs and lakhs of innocent women towards the poisonous vaccine. But for what all this? Some say this is all for money! You have to speak. If not openly atleast to your heart. If your conscience kicks you… better leave the profession for gods sake!

Exercising prudent judgment is the ultimate skill in living the journliast career. Doing the right thing, in the right way, at the right time, for the right reason is all about journalism. Immature individuals like you have not integrated what life teaches, and remain focused on apparent goods instead of the true goods that the phenomenon of existence offers. That is why you are living a disordered life. A life not of integrity. Fortunately, there are always two sides to one coin. And I’d rather contemplate the side of integrity; the side that every human being should aspire to. The side that makes one feel so strong and solid inside that nothing will rock or chip that foundation built on the best human traits and qualities.

You seems to be lesser mortal. Blaming others, claiming victimhood, or passing the buck may solve short-term crises, but refusal to take responsibility erodes respect. From your present standards… I believe you will never realize this basic moral. In Marennas case, you bluntly tried to escape from the responsibility for the fault as an incharge you have committed. In the exercise of your authority as an incharge you revealed that the degree of disorder in your soul. Is not it Dear Rahul?


Answer your heart! If you cannot answer this crucial question with a resounding ‘yes’, it is time for you to have an honest look at your foundations. You may have allowed them to crumble but it is never too late to do some repairs.
Get Well Soon… Good Luck!!!
SATYA SHODHAK

Tuesday, May 4, 2010

వుమెన్ జర్నలిస్టులు ఉన్నత స్థాయికి వెళ్ళలేరా?

ఇప్పుడు మీడియాలో పనిచేసే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. కానీ...దురదృష్టవశాత్తూ వారికి తగిన విలువ లభించడంలేదు. లైంగిక వేధింపులు, వివక్ష వంటి ఇబ్బందులు ఎదుర్కుంటూ పనిచేస్తున్నా....వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించడంలేదు. బాగా రాయగలిగేవాళ్ళు ఉన్నా...మగ పురుషులకన్నా వారు తెలివిగలవారైనా... ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు. ఉదాహరణకు....'ఈనాడు'లో 'వసుంధర'ను ఈ స్థాయికి తీసుకురావడంలో అహరహం కృషిచేసిన పద్మశ్రీ ని వ్యవస్థ సరిగా గుర్తించలేదు. ఆమెకు ఎప్పుడో అవార్డు ప్రకటించి ఇంతవరకూ నగదు బహుమతి ఇవ్వలేదు. అయినా ఎవ్వరూ పట్టించుకోరు.... మహిళా జర్నలిస్టులు సహా. కనిపించకుండా లింగ వివక్ష పేరుకుపోయిన రంగం మీడియా అనడంలో సందేహంలేదు. ఈ దుస్థితికి కారణం ఏమిటి? అన్న అంశంపై మా రిపోర్టర్ దీప (అసలు పేరు కాదు) స్వానుభవంతో రాసిన వ్యాసం...మీ కోసం...
-----------------------------------------------------------------

నేను జర్నలిజంలో చేరిన కొత్తలో 'జర్నలిజంలో రాణిస్తున్న మహిళామణులు' అనే లిస్టులాంటిది దొరుకుతుందేమోనని తెగ వెతికేదాన్ని. అటువంటిది లేప్పోతే నేనే తయారుచేసేద్దామన్నంత వెర్రి ఉండేది. ఆ వెర్రి పూర్తిగా కుదరక ముందే అసలే పత్రికలోనైనా మహిళా ఇన్‌ఛార్జులు, ఎడిటర్లూ ఉన్నారా... అని మరొక అన్వేషణ సాగించాను. 'డెక్కన్ క్రానికల్‌' జయంతి, 'డెక్కన్ హెరాల్డ్‌' అఖిలేశ్వరి, 'ది వీక్‌' లలితా అయ్యర్‌ తప్ప, తెలుగులో ఎవరూ కనపడరే! 

అప్పట్లో కంటికి కనిపించింది కేవలం వసుంధర ఇంఛార్జ్‌ వీణగారే. ప్రస్తుతానికి కాకపోయినా, యాభై, అరవయ్యేళ్ల తెలుగు వార్తాపత్రికల చరిత్రనూ, పదిహేనేళ్ల ఎలక్ట్రానిక్‌ మీడియా చరిత్రనూ పరిశీలించినప్పుడు కూడా ప్రభావశీలమైన (ఇన్‌ఫ్లుయెన్షియల్‌) మహిళా రత్నాల పేర్లు ఒకటీరెండు కూడా కనిపించకపోవడం బాధాకరం. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా వచ్చిన బుల్లితెరలు, వాటిలో తెలుగు వచ్చీరానట్టుగా పలికే చిలకపలుకుల యాంకరమ్మల సంగతి కాదు నేను మాట్లాడుతున్నది. మగవాళ్లతో సమానంగా, ఆ మాటకొస్తే రెండడుగులు ముందుకేసి మరీ బైట్లు సంపాదించడంలో అష్టకష్టాలు పడుతున్న టీవీ రిపోర్టర్ల గురించి కూడా పూర్తిగా కాదు. యాభయ్యేళ్లుగా అభివృద్ధి పథంలో నిలకడగా ప్రయాణిస్తున్న పత్రికారంగంలో మహిళలకున్న అవకాశాల గురించి. దీనికి కారణాలేమిటి?

చెబుతూ పోతే, ఒకటీ రెండూమూడూ... కాదు నూరో అంతకన్నా ఎక్కువగానో తేలతాయి. వాటిలో మొదటిది, ముఖ్యమైనది - మనలో పేరుకుపోయిన మూసధోరణి. డెభ్బైలూ ఎనభైల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో కుర్తాపైజామా, భుజానికో గుడ్డ సంచీ, కళ్లద్దాలూ, డొక్కు లూనా..మగవాళ్లయితే మాసిన గడ్డం.. ఇదీ జర్నలిస్టు వేషం. వాళ్లు విలన్‌లకెదురుపడి 'నీ గుట్టు తెలిసిందిరా, రేపటితో నీ ఆటకట్టు' అని వాళ్ల మొహమ్మీదే అనేవారు. విలన్లు ఇప్పటిలా 'నీ మొహంలే, చేతనయింది రాస్కో, నాకు నీ బాస్‌ తెలుసు..' అనకుండా వెంటనే వీళ్లేం రాస్తారోనని బయపడిపోయేసి సదరు జర్నలిస్టుగారు మగాడయితే హత్య, ఆడదయితే రేపూ చేసిపడేసేవారు. చెప్పొచ్చేదేమంటే నేను మా చుట్టాలింట్లో బారసాలకి చక్కగా పట్టుచీరకట్టుకుని ఇంత బొట్టూ అన్ని పూలూ పెట్టుకుని వెళితే, ఒకమ్మాయి వచ్చి 'మీరు జర్నలిస్టని చెప్పిందే మా అమ్మా... మీరలా కనిపించడంలేదు...' అంటూ సణిగింది. ఆ పిల్లే కాదు, అలా ఆశ్చర్యపోయేవాళ్లు నాకు చాలామంది కనిపిస్తుంటారు. నేను జర్నలిస్టునని నిరూపించుకోవాలంటే నా పెళ్లిక్కూడా నేను కుర్తా, జీన్సూ వేసుకుని వెళ్లాలో ఏమిటో! ఈ మూసధోరణి కేవలం 'అటైర్‌'లోనే కాదు, ఆలోచనల్లో కూడా ఎంతో పేరుకుపోయింది. అందువల్లనే జర్నలిజంలోకి తమ అమ్మాయిలను ప్రోత్సహించడం కనిపించదు. 


ఈమధ్యే ఒక మూర్ఖుడు 'సినిమా, టీవీ, కాల్‌సెంటర్‌లలో పనిచేస్తున్న ఆడపిల్లలంటేనే ఇంత.. మీడియాలో ప్రతివాడికీ ఓ రేటుంటుంది' అని వాగాడు. ఏం సమాధానం చెప్పాలి  ఆ ప్రబుద్ధుడికి? జర్నలిజంలోకి వచ్చారంటేనే వాళ్లు చాలా 'డేరింగ్‌ డాషింగ్‌' అనుకుని దేనికైనా రెడీ అనుకుంటే ఎలా?

ఇదిగో, సరిగ్గా ఈ మనస్తత్వమే మీడియాలో స్త్రీలను ఎదగనివ్వకుండా అడ్డుపడుతోంది. అసలు జర్నలిజంలో చేరడమే సమాజాన్నెదిరించడం మొన్నమొన్నటివరకూ. ఎలాగోలా చేరాక మొదలవుతుంది హింస. అయితే స్త్రీల పేజీ లేదంటే ఫీచర్స్‌ డెస్కూ. పొలిటికల్‌, క్రైమ్‌ బీట్లు, రిపోర్టింగ్‌ చెయ్యాలనే ఆసక్తి, శక్తి ఉన్న అమ్మాయిలకు కూడా డెస్కు పనులే ఇస్తారు. వాటిలో అర్థరాత్రీ అపరాత్రీ అయినా ఇంటికెళ్లేందుకు డ్రాపింగ్‌ సదుపాయం ఒక్కటంటే ఒక్క పత్రికలోనూ లేదు. ఒకవేళ రిపోర్టింగ్‌ చేస్తున్నా మిగిలినవాళ్లు దిగలాగడంలో ముందుంటారు. 'ఆమెకి ఫలానా బ్యూరో హెడ్‌తో ఇదుంది- అదుంది'లాంటి స్కాండల్స్‌ ప్రచారంలోకి తీసుకొస్తారు. ఇంట్లోనూ బయటా ఎన్నో అవాంతరాలను దాటుకొని ఒక్కడుగు ముందుకు వేసిందంటే చాలు, ఆమె ప్రవర్తన మీద సవాలక్ష సందేహాలు పుట్టుకొచ్చేస్తాయి.


విచిత్రమేమంటే తమతో పనిచేస్తున్న ఆమెది 'అటువంటి ప్రవర్తన  కాదు' అని గట్టిగా ఒక్కరూ నోరువిప్పి చెప్పకుండా నిశ్శబ్దంగా ఎంజాయ్‌ చెయ్యడం! ఆడవాళ్లకు సంబంధించి 'సెక్సిజం' ఎంత దారుణంగా ఉంటుందో నేనిక్కడ ఉదాహరణలు చెప్పనవసరం లేదు. డబ్బూపేరూ అన్నీ పుష్కలంగా ఉన్న సునందాపుష్కర్‌ వంటివారికే ఈ బాధ తప్పలేదు. మొన్నటి ఐపీఎల్‌ వ్యవహారంలో మీడియా ఆమెపట్ల దారుణంగా వ్యవహరించిన  తీరు అందరికీ తెలిసిందే. అమానుషంగా అనిపించే  అంశం ఏమంటే తోటి స్త్రీలే ఇలాంటి పుకార్లకు ఆజ్యంపోయడం, కెరీర్‌లో తోటివాళ్లు ఎదగకుండా జాగ్రత్త పడటం. 

ఎప్పుడెక్కడ నుంచి వచ్చిపడతాయో తెలియని లైంగిక వేధింపులు ఉండనే ఉంటాయి. వీటన్నిటికి తోడు ఇంటి పని, ఇంట్లో ఆరళ్లు చిన్నవోపెద్దవో తప్పనిసరిగా ఉంటాయి. వాటిని అధిగమించడం, ఇంటినీ పనినీ బ్యాలెన్స్‌ చెయ్యడం ఎవరికైనా కత్తిమీద సామే. మొత్తానికి అమ్మాయిలు మీడియాలో ముఖ్యంగా ప్రింట్‌లోకి ఎక్కువగా రాకపోవడానికి, వచ్చినా ఎదగలేకపోవడానికి సెక్సిజమే ప్రధాన కారణం. 

రెండోది 'ఆడదానికి నేను రిపోర్ట్‌ చెయ్యడమా' అన్న అహంకారం ఇప్పటికీ చాలామంది పాత్రికేయుల్లో ఉంది. అసలు ఆడవాళ్ల పేజీల్లో/కార్యక్రమాల్లో పనిచెయ్యడమే నామోషీగా భావిస్తారు ఎక్కువమంది. 'ఈనాడు' వసుంధరకు తనను బదిలీ చెయ్యడాన్ని నిరసిస్తూ ఒకాయన కొన్నేళ్లక్రితం 'ఈనాడు' మానేశారు. పైగా ఆమె తమకన్నా వయసులో చిన్నదయితే ఇబ్బంది మరీ ఎక్కువ.
దీనికి మరో కోణం కూడా ఉంది.
1. ఎలాగోలా జర్నలిజంలోకి వస్తున్న అమ్మాయిల్లో కూడా ఎక్కువమంది దీన్ని కేవలం ఒక ఉద్యోగంగా చూస్తారు తప్పితే ఒక కెరీర్‌గా చూడరు. 2. రిజర్వేషన్‌ క్లర్కుల్లాగా యాంత్రికంగా చేస్తున్న పనినే గానుగెద్దులా చెయ్యడానికి ఇష్టపడతారు తప్ప డైనమిగ్గా వ్యవహరించ రు. 3. ఎక్కువమంది చేరినప్పటినుంచి పదేళ్లకు నేర్చుకునేవి సిల్లీ ఆఫీసు రాజకీయాలే తప్ప, కెరీర్‌లో తమకంటూ ఉపయోగపడే ఒక్కటంటే ఒక్కటి కొత్త అంశాన్ని నేర్చుకోరు. 4. ఏదోక రంగంలో పట్టు సాధించాలన్న తపన చాలా తక్కువ. అంతేతప్ప వాళ్లు ప్రొఫెషనల్‌గా వ్యవహరించరు. 5. భాష, శైలి, పని ఇలాంటి వాటిలో తమదైన ముద్ర కనిపించాలనుకునే తత్వమే అరుదు. 6. మగ జర్నలిస్టుల్లో కనిపించే సంఘీభావం, స్నేహం వారిలో కనిపించవు.


అన్నీ సమస్యలే ఏకరువు పెట్టేననుకోకండి. ఇలాంటివన్నిటినీ ఎదుర్కొంటూనే పత్రికల్లో మహిళలు పనిచేస్తున్నారు. తామున్న పరిధిలో మంచి పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఆ రాశి, వాసి మగవారితో సమానంగా పెరగాలనే నా కోరిక.
- దీప

Monday, May 3, 2010

తప్పు ఒకరిది --శిక్ష మరొకరికి: ఇదీ 'ఈనాడు' మార్కు న్యాయం

సహజ న్యాయసూత్రాలు, నైతిక విలువలు పెద్దగా పట్టని 'ఈనాడు' యాజమాన్యం ఒక వార్తలో దొర్లిన తప్పునకు ఒక సాధారణ రిపోర్టర్ ను బలిచేసింది. న్యూస్ ఎడిటర్ హోదాలో ఉన్న రాహుల్ కుమార్ పాస్ చేసి జనరల్ పేజీలో వాడిన ఒక వార్త విషయంలో సిటీ రిపోర్టర్ వడ్డే మారెన్నను మాయమాటలు చెప్పి రాజీనామా చేయించింది. 'ఈనాడు'లో ఆటవిక న్యాయానికి మచ్చుతునకగా చెప్పుకోదగ్గ ఈ కేసు పూర్వాపరాలు తెలిస్తే సంస్థ ఛైర్మన్ రామోజీ రావు గారే ముక్కున వేలేసుకుంటారనడంలో సందేహం అక్కరలేదు. 

2005 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో ఫోటోగ్రఫి లో శిక్షణ పొందిన మారెన్న ప్రస్తుతం 'ఈనాడు' సిటీ రిపోర్టర్. ఆయన భార్య పద్మ కూడా 'ఈనాడు' లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 26 రాత్రి పది గంటల ప్రాంతంలో యుధ్ వీర్ అవార్డులకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ఒక జర్నలిస్టుకు మెయిల్ రూపంలో వచ్చింది. దాన్ని ఒక వార్తగా రాసే బాధ్యతను మారెన్నకు అప్పగించారు. అది మూడు పేజీల ప్రెస్ నోటు. 

అందులో మొదటి పేజీలో...అవార్డు కు సంబంధించిన పరిచయం (introduction), రెండో పేజీలో ఈ ఏడాది అవార్డు గ్రహీత (సుబానీ) గురించి, మూడో పేజీలో 1991 నుంచి ఈ అవార్డులు పొందిన వారి వివరాలు ఉన్నాయి. 

ఆ అవార్డుల లిస్టు మొత్తం ఇస్తే నిడివి పెరుగుతుందని భావించి మూడో పేజీని సిటీ కంట్రి బ్యుటర్ కు ఇచ్చారు. మారెన్న ఇంట్రో కొద్దిగా టైప్ చేయగానే తన భార్య నుంచి ఒక ఫోన్ వచ్చింది. డ్యూటీ ముగించుకుని వెళుతున్న తన ద్విచక్ర వాహనం పంక్చర్ అయినందువల్ల తాను రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిందని, తనను పికప్ చేసుకోవాలని పద్మ గారు మారెన్న ను కోరారు. అంత రాత్రి వేళ భార్య ఆ బండితో ఇబ్బంది పడుతుందని, సెక్యూరిటీ పరంగా కూడా మంచిది కాదని మరెన్న తన పనిని అక్కడే ఆపేసి....ఆ ప్రెస్ నోట్ ను, రాసిన కొద్దిపాటి బిట్ ను తిరిగి డెస్క్ వారికి అప్పగించి వెళ్ళిపొయ్యాడు. 

ఇలా ప్రాణావసరాలు ఉంటే పక్కనున్న వారికి పని అప్పగించి వెళ్ళడం కొత్తేమీ కాదు. అది నేరమూ కాదు. అప్పుడు డెస్క్ లో ఏమయ్యిందో కానీ...మారెన్న రాసిన ఇంట్రో ను, సిటీ కంట్రిబ్యుటర్ రాసిన పాత అవార్డు గ్రహీతల లిస్టును కలిపి ఒక వార్తగా చేశారు...సిటీ డెస్క్ వారు. ప్రాధాన్యత దృష్ట్యా...దాన్ని జనరల్ డెస్క్ (అంటే...పెద్ద పీజీ) కు పంపారు. మధ్యలో ఈ ఏడాది అవార్డు గ్రహీత గురించిన వివరాలు లేకుండా 11 గంటలు దాటాక ఆ వార్త జనరల్ డెస్క్ కు చేరింది. 

ఆ వార్త జనరల్ డెస్కులో ఒక సీనియర్ సబ్-ఎడిటర్ చేతికి వెళ్ళింది. "వార్తలో లోపాన్ని కనిపెట్టిన ఆ జర్నలిస్టు వెంటనే ఆ డెస్క్ హెడ్ (ఒక సాధారణ రిపోర్టర్ నుంచి అనూహ్య ఎత్తులకు ఎదిగిన) రాహుల్ కుమార్ దగ్గరకు వెళ్ళాడు. ప్రధానికి, రామోజీకి ఈ అవార్డు గతంలోనే వచ్చిందని, మళ్ళీ ఈ వార్తలో కొత్తగా వారికి ఇస్తున్నట్లు ఉన్నదని, ఇదేదో ఇబ్బందిగా ఉందని  గుర్తుచేశాడు," అని విశ్వసనీయ వర్గాల సమాచారం. "ఏమయ్యా....రెండో సారి అవార్డు ఇవ్వకూడదన్న రూలు ఏమైనా ఉందా?," అని రాహుల్ గారు వ్యాఖ్యానించినట్లు సమాచారం. (మంచి చదవరి, నాకు మిత్రుడైన రాహుల్...ఈ మాట అన్నారంటే నమ్మబుద్ధికావడం లేదు కానీ....'ఈనాడు' వర్గాలు దీన్ని దృవీకరిస్తున్నాయి. రాహుల్ ను సంప్రదించే అవకాశం లేకపోయింది. ఆయన వివరణను స్వాగతిస్తున్నాం.)


ఈ పరిణామం మధ్య మొత్తం మీద..."ప్రధానికి యుధ్ వీర్ పురస్కారం" అన్న శీర్షికతో..."రామోజీ రావు, జీపీ లకూ అవార్డు--30 న హైదరాబాద్ లో ప్రదానం" అన్న డెక్కులతో 27 వ తేదీన వార్త ప్రచురితమయ్యింది. "ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రఖ్యాత యుధ్ వీర్ పురస్కారాన్ని ప్రకటించారు," అన్న మొదటి వాక్యంతో ఆరంభమైన ఈ వార్త లో..."జర్నలిజం, వ్యాపార నిర్వహణలో విశిష్ట సేవలకు గానూ రామోజీరావుకు, లోక్ సత్తా ద్వారా అవినీతిపై పోరాటానికి గానూ జయప్రకాశ్ నారాయణకు యుధ్ వీర్ పురస్కారం ఇవ్వనున్నారు," అన్న మాట కూడా ఉంది. ప్రెస్ నోటులో రెండో పేజీ మిస్ కావడంతో మూడో పేజిలో ఉన్న గత గ్రహీతలను ఇక్కడి పెద్ద బుర్రలు తాజా గ్రహీతలు గా భావించాయి. ఘోర తప్పిదం జరిగిపోయింది. 


ఇలాంటి విషయాలను రామోజీ సహించరు. ఆయన అగ్గిమీద గుగ్గిలమై... దీనికి కారణమైన వాడిని తీసిపారేయ్యమని ఆదేశించారు. 'ఈనాడు' పధ్ధతి ప్రకారం April 28 సంచికలో అదే పదమూడో పేజీలో సవరణ వేసింది. ఓపిగ్గా...ఇంత చదివారు కదా...దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలో, ఎవరికి వీరతాడు వెయ్యాలో మీరు చెప్పండి?
 

అత్యున్నత పదవిలో ఉండి...యుధ్ వీర్ అవార్డు గురించి కనీస జ్ఞానం లేకపోయిన, చెక్ చేసుకోవాలన్న స్పృహలేకపోయిన  రాహుల్ కుమార్ ఈ ఘోర తప్పిదానికి నైతిక బాధ్యత వహించాలి కదా! ఈ వార్త జనరల్ డెస్క్ కు పాస్ చేసిన సిటీ డెస్క్ ఇంచార్జ్ కు ఈ పాపంలో భాగం లేదా? మారెన్న వెళ్ళాక...బాధ్యతారహితంగా వ్యవహరించి గందరగోళానికి దారితీసిన రిపోర్టర్ సంగతేమిటి? 

శిక్షపడితే ఈ ముగ్గురికీ పడాలి కానీ...భార్యను అర్ధరాత్రి ఆదుకునే హడావుడిలో, ఆత్రుతలో పనిని సహచరుడికి అప్పగించి వెళ్ళిన మారెన్న నుంచి మాయ మాటలు చెప్పి రాజీనామా లేఖ తీసుకోవడం ఏమి సమంజసం? బుర్రపెట్టి వార్త చదివి...రాహుల్ కుమార్ ను అలర్ట్ చేసి భంగపడిన సీనియర్ సబ్-ఎడిటర్ కు ఇంక్రిమెంట్ లేదా పదోన్నతి ఇవ్వాల్సిన అవసరం లేదా? 

("తప్పు నీది కాదు...నీ ఉద్యోగం పోదు...ఒట్టొట్టి రాజీనామానే....ఆ రాజీనామాను అనుమతించరు.....," అని మభ్యపెట్టి బలవంతంగా మారెన్న నుంచి రాజీనామా లేఖను రాయించుకుని, తర్వాత దాన్ని ఆమోదించిన ఇద్దరు యాజమాన్యం ఏజెంట్ల దారుణ వైనంపై కథనం మరొక పోస్ట్ లో)