Thursday, April 28, 2011

జర్నలిస్టు సొసైటీలో అక్రమాలపై అజ్ఞాత వ్యక్తి లేఖ

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు పొందడం కోసం ఏర్పడిన జవహర్లాల్ నెహ్రు  సొసైటీ లో ఏదో అక్రమం జరుగుతున్నదన్న అభిప్రాయం జర్నలిస్టులలో వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారంపై ఒక అజ్ఞాత వ్యక్తి, బహుశా బాధిత జర్నలిస్టు అయివుంటారు, ఒక లేఖ పంపారు. కరప్ట్ ఏపీ మీడియా పేరు మీద అది పంపారు. ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. నిజంగానే ఇందులో అంశాలు నిజమని నమ్మే జర్నలిస్టులు ముందే మేల్కొని...స్థలాల కేటాయింపులో అక్రమాలను అడ్డుకోవాలి. ఏదో చిన్నా చితక పత్రికలో పనిచేస్తూ తెర వెనుక మంత్రాంగం నడిపి జర్నలిస్టుల నోళ్ళు కొట్టే దరిద్రులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి...నిజమైన జర్నలిస్టులు...పూనుకుని స్థలాలు దక్కించుకోవాలని కోరుతున్నాను...రాము
----------------------------------------------


Dear Mr. Ramu,

You might be well aware of the latest Supreme Court's clearance to allotment of housing plots to judges, IAS, IPS and Journos. It will be a great and happiest moment in the lives of many journos in AP, particularly in Hyderabad. Because, there are number of people in media houses working under humiliating conditions and leading the life with a hope on this once in a life time favour from the Govt. But there are journalists who are spoiling the chances of fellow colleagues for their own favoritism and selfish ends.

There are number of irregularities in identifying the beneficiaries of plots under the latest society (Jawaharlal Nehru Society). The newly formed Jawaharlal Nehru Society has identified beneficiaries some time back. The was no transparency in the entire selection process.

They are sending SMSs to selective people and maintaining secrecy of affairs. They did not disclose the selection criteria to anybody and never put the relevant certificates to scrutiny. They never displayed the seniority list and at least convene a meeting to inform the other colleagues about the selection process. They sent messages to some people to pay Rs, 1 Lakh as DD and whoever got SMSs have done that. What about others? Does that mean all others are not beneficiaries? All these are happening very discreetly through SMSs and phone calls which is highly unwarranted.

There were number of people who have submitted fake experience certificates. I personally knew 2 persons from Eenadu who have submitted fake experience certificates and entered into list of beneficiaries. There must be good number of fake people of this sort in the list. This trend of journalists cheating their colleagues is highly disheartening to many genuine people. I do not know whether the Jawaharlal Nehru Society again select the beneficiaries or stick to the earlier list. They have collected Rs. 1 lakh from each member and returned some time back. Everybody thought that whoever paid Rs. 1 lakh at that time are going to be allotted a plot. I request you to please inquire into this for the benefit of genuine people nd build pressure on the so called leaders at society to protect interests of genuine journalists.

I am one of the losers because of these malpractices by fellow colleagues. I just thought of bringing this to the notice of all colleagues at other media houses.


Thanks and Regards
----------------------------------------------
అప్ డేట్: ఈ లేఖకు, నా పోస్టునకు ఈ సొసైటీ బాధ్యుడిగా ఉన్న జర్నలిస్టు మిత్రుడు స్పందించి నాకు ఫోన్ చేసారు ఈ సాయంత్రం.  ఈ లేఖకన్నా నా ఇంట్రో తనకు నచ్చలేదని, ఏదో గోల్ మాల్ జరుగుతున్నదన్న భావన వచ్చేట్లు రాసానని నిందించాడు. అయితే...సొసైటీ లో అక్రమాలు ఏవీ లేవని, తాము ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నామని, డిస్ క్వాలిఫయ్ అయిన ఎవరో ఈ లేఖ రాసి ఉంటారని ఆయన చెప్పారు. అక్రమాలు ఏవి వున్నా...తమ దృష్టికి తేవచ్చని ఆయన చెప్పారు. సొసైటీ కి సంబంధించి మీకు అనుమానాలు వుంటే...ఈ బ్లాగు దృష్టికి తెండి. నేను ఈ సొసైటీ బాద్యుల దృష్టికి డైరెక్ట్ గా తీసుకుపోతాను. నికార్సైన, అర్హతలున్న జర్నలిస్టులకే స్థలాలు వచ్చేట్లు చూద్దాం....రాము

Saturday, April 23, 2011

మంచి మాటల-చేతల సాయికి దీర్ఘాయుష్మాన్భవ

ఏ ప్రముఖుడైనా...వీ.వీ.ఐ.పీ అయినా ఎప్పుడు ఏమి చేస్తాడా...ఎవరిని ప్రేమిస్తాడా...ఎవరితో లేచిపోతాడా...ఏ తగాదాలో లేదా స్కాంలో ఇరుక్కుంటాడా  అని తెలుగు మీడియా వేయికళ్ళతో ఎదురుచూస్తూ వుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సత్య సాయిబాబా అనారోగ్యం విషయంలో తెలుగు పత్రికలూ, ఛానళ్ళు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే...ఆయన ఎప్పుడు పోతాడా....అని ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తున్నది. భక్తులలో అంత గందరగోళం, వేదన కలిగించడం అవసరమా...అనిపిస్తున్నది. ఏ విషయంలో ఎలా ఏడ్చినా....మనిషి తుది ఘడియల విషయంలో అయినా మీడియా కాస్త సంయమనం పాటిస్తే మంచిది. మీడియాను డీల్ చేయడంలో ఆ ట్రస్టు వాళ్ళు కూడా సరిగా వ్యవహరించడంలేదని అనిపిస్తున్నది.

ఇదిలావుండగా....సాయి ఉండరన్న భావన ఎందుకోగానీ చివుక్కుమనిపిస్తున్నది. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు, చుట్టూ వుండే స్నేహితులు, సహోద్యోగులు, చుట్టాలు పక్కాలలో కనీసం పదిమంది మనసులైనా గెలుచుకోలేక సగటు మనిషి స్వార్థంతో కొట్టుకు చస్తుంటే...బాబా శాంతిని బోధించడం, ప్రేమను పంచడం, సేవ చేసి చూపడం నాకు ఆనందం కలిగిస్తుంది. కోట్ల మందిని ఆయన ఆకర్షించడం నాకు ఒక అద్భుతమని అనిపిస్తుంది. దొంగ మాటలు చెప్పి ఇంత మందిని ప్రభావితం చేయడం, ఇంత సేవా సామ్రాజ్యాన్ని నిర్మించడం ముమ్మాటికీ కష్టం.

నేను సాయి భక్తురాలితో బతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనను గురువుగా, దైవంగా భావిస్తూ వస్తున్నది. ఆయన బోధనల వల్ల...పుట్టుకతో వచ్చిన విశ్వమానవ భావన వల్ల ఆమె నాకు ఒక గొప్ప మనిషిగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. మానవత్వం అంటే...ఏమిటో చేతల ద్వారా నిరూపించింది. ఇది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయి బోధనల వల్ల జరిగిన పని.

సహజంగా పూజలకు, విగ్రహారాధనకు వ్యతిరేకంగా బతికిన నన్ను సాయి విషయంలో కన్వీన్స్ చేయాలని తానూ ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను ఇంటర్ చదువుతున్నపుడు వాళ్ళ ఇంట్లో భజన చేస్తుంటే...నేను వెర్రితనంతో విపరీతంగా నవ్వుకున్నాను. వీళ్ళేమి పిచ్చిజనం...ఒక బతికి ఉన్న వ్యక్తిని పూజిస్తున్నారని ఎగతాళి చేసాను. కానీ...హేమ నమ్ముతున్న విషయం అంటే...దాన్ని తేలిగ్గా తీసివేయలేమని అనుకున్నాను. ఒకటి రెండు సార్లు పుట్టపర్తి వెళ్లి వచ్చాక....సాయి తత్త్వం అర్థమయ్యింది. పదవీ విరమణ తర్వాత హేమ నాన్న గారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు...ఒక పదిహేను పదహారేళ్ళ కిందట. నేను భజనకు వెళ్లి కూర్చున్నాను చాలా సార్లు. అక్కడ ఏదో ప్రశాంతత వుంది. ఎప్పుడు బాబా ప్రసంగం విన్నా...సర్వమత సారం వున్నట్లు అనిపించేది. కులం, గోత్రం, రంగు, ప్రాంతం వంటివి పక్కన పెట్టి తోటి మానవుడిని ప్రేమించమని సాయి చెబుతుంటే....అంతకన్నా ఏమి కావాలి? ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఒకొక్కసారి కుంగతీసినా...అవి నిజమేమో...మనం గుడ్డిగా నమ్ముతున్నామేమో అని అనిపించినా...పుట్టపర్తి ప్రశాంతత, సేవా తత్పరత నాకు బాగా నచ్చాయి. డబ్బు వచ్చిపడే చోట, పలుకుబడి ప్రతిష్ఠ లతో ముడిపడివున్న విషయాల చుట్టూ వివాదాలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి. ఇలా ఆరోపణలు వచ్చిన వారిని తొలగించుకుంటూపోతే మనమేమీ చేయలేము, పైగా మనసులో అశాంతి. అందుకే స్వామి చేసిన మంచి పనుల ఆధారంగా, ఆచరించి చూపినవి చూసి ఆయనకు ఒక దండం పెట్టి వదిలేసాను. 

ఆయన దేముడో కాదో కానీ...ఒక అద్భుతమైన మహా మనీషి, దివ్య పురుషుడు. ఆయన బోధించిన ప్రేమ, సేవ, త్యాగం ప్రతి మనిషికి, ప్రతి తరానికి ఆచరణీయం. స్వార్ధం, ఈర్ష్య, కుళ్ళు, కుట్రలతో తంటాలు పడుతున్న సర్వ మత మానవాళికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. ఆయన భౌతిక కాయంతో సంబంధం లేకుండా...ఆయన బోధనలను అమలు చేయడం...ఆయన భక్తులే కాకుండా మనిషన్న వాడు ప్రతి ఒక్కడు చేయాల్సిన పని.      
నా అబ్బాయి పదేళ్ళ కిందట అక్కడి ఆసుపత్రిలో పుట్టాడు. ఆ సందర్భంగా నేను చవి చూసిన ఒక అనుభవాన్ని త్వరలో నేను మీతో పంచుకుంటాను. 
అంతవరకూ....పేద ప్రజలకు సేవ చేస్తూ...మానవాళికి ప్రేమ పంచుతున్న మనీషి స్వామి కోలుకుని మరి కొన్ని ఏళ్ళు సేవను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Tuesday, April 19, 2011

TV-9 లో అజ్ఞాత (ఇన్ సైడర్) లేఖ సృష్టిస్తున్న సంచలనం.....

తెలుగు నేల మీద పెను సంచలనం సృష్టిస్తున్న TV-9 లో ఒక అజ్ఞాత లేఖ సంచలనానికి కారణమయినట్లు తెలుస్తున్నది. "టీ వీ 9 సిఈఓ రవిబాబుకి బహిరంగ లేఖ" అన్న శీర్షికతో ఉన్న ఆ లేఖను ఆ అజ్ఞాత రచయిత నాకు కూడా పోస్టు చేసారు. అందుకు ఆయన/ఆమెకు కృతజ్ఞత తెలియజేయకుండా ఉండలేను. "కామ్రేడ్ రవిబాబు అలియాస్ రవిప్రకాష్ కి...." అన్న సంబోధనతో అది ఆరంభమయ్యింది. ఆ చానెల్ లో పనిచేస్తున్నా...తన ఎదుట పడి వాదించే ఓపికలేక ఇలా లేఖ రాస్తున్నట్లు రచయిత స్పష్టంచేసారు. కొందరు వ్యక్తుల గురించి ఉన్నందున...ఆ లేఖను యథాతథంగా ఇవ్వలేకపోతున్నప్పటికీ....అందుకో విషయాలు మీకు తెలియజేస్తాను. 

సతీష్ బాబు...అనే జర్నలిస్టును జర్నలిస్టు డైరీ కోసం రవి తీసుకోవడం లేఖకుడికి ఏమాత్రం నచ్చలేదు. అరుణ్ సాగర్ ను 'టార్గెట్' చేసుకుని అవినీతిపరుడైన సతీష్ బాబు ను సంస్థలో చేర్చుకున్నట్లు ఆరోపించారు. సతీష్ బాబు చరిత్రను ఈ లేఖలో ఆవిష్కరించారు. డబ్బు వసూళ్లు, లైంగిక వేధింపులు వంటి విషయాలు రాసారు. రవి డ్రీం టీం ను ప్రస్తావిస్తూ కరీం, ఆలపాటి సురేష్, ఆకుల దినేష్, శ్రీనివాస రెడ్డి, శశాంక మోహన్, జాఫర్ ల గురించి ఆరోపణలు చేసారు. మురళి (ప్రస్తుతం సాక్షి), సాయి (జెమిని) ఎందుకు ఈ చానెల్ నుంచి వెళ్లి పోయారని ప్రశ్నించారు. "మన సంస్థ నుంచి మంచి వాళ్ళు వెళ్లి పోయారు" అని బాధపడుతూ లేఖకుడు ఒక జాబితా ఇచ్చారు.
అరుణ్ సాగర్ ను వెళ్ళగొట్టడానికి రవి రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నట్లు రాసుకొచ్చారు. సాగర్ వెళ్లిపోతాడని....రవి మనుషులే ప్రతి నెలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎంతమంది సతీష్ బాబులు వచ్చినా...సాగర్ కు సాటి రారని స్పష్టంచేసారు. 
సతీష్ బాబు ను ఈ లేఖలో ఎక్కడా అలా రాయకుండా...'చతీచ్ బాబు' అని రాయడాన్ని బట్టిచూస్తే...గతంలో రవి ఛానల్ లో పనిచేసి ఇప్పుడే చెన్నై వాళ్ళ చానెల్ ఒక దాంట్లో పనిచేస్తున్న ఒక మాజీ "ఈనాడు" సీనియర్ జర్నలిస్టు హస్తం ఈ లేఖ వెనుక వున్నదని నాకు ఎందుకో అనిపించింది. నా అభిప్రాయం తప్పయినా కావచ్చు. 
"ఒక ఆదర్శవాది అవినీతిపరుడిగా మారితే అరాచకం ఏ స్థాయిలో వుంటుందో అర్థమవుతోంది. ఇకనైనా..మెరుగైన మనిషిగా మారి మెరుగైన సమాజమన్న నీ పగటి కల సాధ్యం చేసుకుంటావన్న ఆశతో....పేరు కూడా ధైర్యంగా రాయలేని...ఇన్ సైడర్..." తో లేఖ ముగిసింది. 
చివర్లో ఒక గమనిక ఇలా వుంది. "రవిబాబు మారాలన్న ఆశతో మాత్రమే ఈ లేఖ"
ఈ లేఖ ప్రతులు ఆ చానెల్ లోని పలువురు జర్నలిస్టులకు అందాయని ఒక మిత్రుడు చెప్పాడు. మొత్తంమీద...ఈ లేఖ రవి కో, అరుణ్ సాగర్ కో ఉపకరిస్తే మంచిదే. నిజంగానే....ఉద్యోగానికి వచ్చే ఆడ పిల్లలను ఉద్యోగం, హోదా అడ్డం పెట్టుకుని శారీరక సుఖం అనుభవించే గజ్జి కుక్కలకు దరిచేరనివ్వడం రవి కే కాదు...ఎవ్వరికైనా...తగనిపని.

Friday, April 15, 2011

అన్నా హజారే దీక్ష పై....ఈ పక్షం "రామ్ బాణం..."

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన దీక్ష దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. అవినీతి రాజకీయ నేతల పట్ల ప్రజలకు ఉన్న ఏవగింపు, ఆయనకు లభించిన మద్దతు అద్భుతమనిపించాయి. బీరుకు, బిర్యానీకి ఓటు అమ్ముకునే జనం, మనసు చంపుకుని నేతలకు కొమ్ముకాసే పోలీసులు- అధికారులు, పోలింగ్ రోజు సెలవను ఓటు వేయడానికి కాకుండా మరే పనికో వాడుకునే ఉద్యోగులు, నిమ్మకు నీరెత్తినట్లు ఉండే మేధావులు, న్యాయాన్ని తెగనమ్ముకుంటున్న న్యాయమూర్తులు, ప్రకటనల కోసం...డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారే మీడియా అధిపతులు, జర్నలిస్టులు...ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేట్లు ప్రవర్తిస్తున్న రోజుల్లో హజారేజీ దీక్ష సదాలోచనపరులకు, దేశభక్తులకు గుండెధైర్యాన్ని ఇచ్చింది.  
అబద్ధాలు ఆడటం, అవినీతి పనులకు పాల్పడటం..వంటి పనులు మానుకుని సత్యనిష్ఠతో అందరం ఉంటే....సగం సమస్యలు తొలగిపోతాయని నా అభిప్రాయం. హజారే దీక్ష నేపథ్యంలో ది సండే ఇండియన్ పక్ష పత్రికలో నేను రాసిన కాలమ్..."అయ్య  'బాపు'రే...అన్నా హజారే..." మీ కోసం దిగువనిస్తున్నాను. హజారేకు కోటి రూపాయల అవార్డు ప్రకటించిన ఈ పత్రిక అధిపతి ఆరిందమ్ చౌదరి ఈ సారి హజారే మీద కవర్ స్టోరీ చేశారు. అందులో కొన్ని మంచి కథనాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ది సండే ఇండియన్ కాపీ కొనుక్కోండి...


Thursday, April 7, 2011

మిత్రులారా...అన్నా హజారే కు మద్దతు పలకండి...

అవినీతికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న అన్నా హజారే కు జేజేలు, పాదాభివందనాలు. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము నుంచి క్రమశిక్షణతో కడుతున్న పన్నులు,  ప్రభుత్వ సేవలకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్న బిల్లులు ప్రభుత్వ ఖజానాకు వెళుతుండగా...ఈ అవినీతి పంది కొక్కులు మేసి తెగ బలుస్తున్నాయి. పైగా ఈ నక్కలు, కుక్కలు, తోడేళ్ళే రాజకీయ నేతల వేషం కట్టి జనాలను మభ్యపెట్టి చట్ట సభలకు వెళ్లి నానా యాగీ చేస్తున్నాయి. సభలలో దూషణలకు, ముష్టిఘాతాలకు తెగపడి...జనాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి. భారత దేశ పరువును పంచనామా చేస్తున్నాయి. వేల కోట్ల కుంభకోణాలు ఒక దాని వెంట ఒకటి బద్దలవుతుంటే...జనం వార్తల్లో వాటి గురించి విని నిట్టూర్పులు విడవడం, ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరా? దేశం కోసం, జన సంక్షేమం కోసం ఆలోచించే సదాలోచనపరులకు అన్నా హజారే గుండె ధైర్యం ఇచ్చారు, గొంతుక ఇచ్చారు. ఇదొక శుభ తరుణం, మంచి అవకాశం.
మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పట్టణంలో...ఈ దీక్షకు అనుకూలంగా ఏదో ఒక కార్యక్రమం చేయడం అవసరం. ప్రజలకు అవినీతి మీద కసి, కోపం, అసహనం ఉన్నాయి. ప్రజలంతా అవినీతి బాధితులే. వారికి ఒక వేదిక ను  ఏర్పాటు చేసే బాధ్యతను బ్లాగర్లు తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఏదో ఒక కార్యక్రమం నిర్మించండి. దేశభక్తుల మద్దతు తీసుకోండి. మీరే దీక్షకు కూర్చుని మార్గ నిర్దేశం చేయండి. ప్రతి బృహత్ కార్యక్రమానికి నాంది తొలి చిన్న ప్రయత్నమే. ఆ అడుగు మీదే కావాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని....తిరుగు లేదని విర్రవీగుతున్న అవినీతి పరులకు గట్టి సంకేతం ఇవ్వండి. జై..హజారే...జై...జై..భారత్
-------------------------------------------------
నోట్: హైదరాబాద్ లో కూడా ఒక కార్యక్రమం తలపెట్టాలని కొందరు మిత్రులు ముందుకు వచ్చారు. కానీ...నేను కొందరు విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్నాను. సోమవారం గానీ తిరిగిరాను. దీన్ని రద్దు చేసుకునే పరిస్థితి లేదు. ఈ లోపు ఎవరైనా చొరవ తీసుకుని కనీసం ఆదివారం నాడైనా రాష్ట్ర రాజధానిలో ఒక ప్రోగ్రాం చేయండి. నాకు ఫోన్ చేస్తే..నేను కొందరు మిత్రులను కలుపుతాను. డామ్భీకాలకు, ఆహంకారాలకు పోకుండా...అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. చేయి చేయి కలుపుదాం...       

Sunday, April 3, 2011

వావ్...ఏమి విజయం..ఏమి ఘనత...

ఇది అలాంటి ఇలాంటి విజయం కాదు. సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న యావత్ జాతి మదిని పులకింపజేసిన అద్భుత ఘనవిజయం. ధోనీ సేన చెప్పి సాధించిన విజయం, లిటిల్ మాస్టర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన విజయం. భారతీయులందరూ జీవితకాలం గుర్తుఉంచుకునే గ్రేటెస్ట్ సాటర్ డే...మధురానుభూతిని మిగిల్చే శనివారం. ఆ తర్వాత వచ్చిన ఆదివారాన్ని, మర్నాడు వచ్చే ఉగాదిని మరింత మధురం చేసిన శుభదినం.

అందుకే...ఫైనల్ లో భారత్ గెలిచాక...కూకట్ పల్లి నుంచి ఖైరతాబాద్ రావడానికి నాకు చాలా సమయం పట్టింది.

విజయం మత్తులో వూగుతున్న ఎంతమందికి హై-ఫైవ్ ఇచ్చానో, ఎంతమంది తో కార్లో కూర్చొనే కరచాలనం చేసానో  లెక్కేలేదు. 
జెండాలు చేబూని విజయ నినాదాలు చేస్తూ వెళుతున్న వారు కొందరు, కారుకు అడ్డంగా వచ్చి తానేదో వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలవుతూ నినాదాలు చేసిన వారు కొందరు. మామూలు రోజుల్లో...ఎవడ్రా వీడు..అని మనం అనుకునే వాడు ఆ రాత్రికి మన వాడు...మనం మాట్లాడాల్సిన వాడుగా అనిపించాడు.

ధోనీ సేన టాస్ ఓడిపోగానే...నాకు కీడు శంకించింది. తెలుగు చానల్స్ లో జ్యోతిష్యులు భారత్ విజయం గురించి చెబుతున్నది ఒట్టిమాటేనా? సచిన్ కల నేరవేరదా? భారత్ ఇంకా ఎన్ని ఏళ్ళు ఆ శుభ ఘడియల కోసం ఆగాలి? అని అనిపించింది. భారతీయులు యాగాలు చేసారు. పూజలు చేసారు. మా మిత్రుడు...సెలవైనా ఆఫీసుకు వచ్చి...తాను భారత్-పాక్ సెమీస్ మాచ్ జరిగినప్పుడు కూర్చున్న ప్రాంతంలోనే కూర్చుని ఫైనల్స్  చూసాడు. జనం ఎవరి సెంటిమెంట్ వారు పాటించారు.
నాకు ఏదైనా శుభం జరగాలనుకున్న రోజు లేదా ముఖ్యమైన రోజున నల్ల దుస్తులు ధరించబుద్ధికాదు నాకు. స్నానం చేసి వచ్చాక చూస్తే ఈ రోజు వేసుకోవాల్సిన అండర్వేర్ జాకీ బ్లాక్ ది వుంది.  పొరపాటున ఇది భారత్ కు అశుభ సూచికమేమో అన్న పిచ్చి లెక్కతో ఈ రోజుకు వేరే కలర్ ది చూజ్ చేసుకున్నాను. ఇది ఒక వెర్రి వ్యవహారంగా అనిపించవచ్చు కానీ...భారత్ విశ్వ విజేత కావాలన్న ఒక పిచ్చి క్రీడాభిమాని మనోభీష్టానికి ఇది ఒక నిదర్శనం మాత్రమె. ఇలా ఎవరి సెంటిమెంట్స్ వారు పాటించారు, భారత్ ను గెలిపించారు. 
నిజంగా ధోనీ ఆడిన ఆట, ఒత్తిడిలో నిబ్బరంగా ఆడిన గౌతమ్ గంభీర్, సింహంలా అనిపించే యువరాజ్ సింగ్...భారతీయులకు ఒక మధురానుభూతిని మిగిల్చారు.  ధోనీ సేనకు అభినందనలు. జయ హో ఇండియా..జయహో...
Photo courtesy: PTI (From The Hindu)