Friday, May 21, 2021

ఆనందయ్య గారి వైద్యం ఆపడం ఎందుకయ్యా!

(పర్వతాల శరభయ్య) 

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు భారత దేశ ప్రత్యేకతల్లో ఒకటి. దేవుడి మహిమలు ఆయన్ను నమ్మేవారికి మాత్రమే తెలిసినట్లు, ఈ వైద్యం ప్రభావం దాన్ని అనుసరించి అనుభవించే వారికే తెలుస్తుంది... శాస్త్రీయతా, హేతుబద్ధతా.. భంగు...భోషాణం అనే వారి ఏడుపులు ఎట్లావున్నా. శాస్త్రీయ దృక్పథం పెంచాలని రాజ్యాంగంలో రాసుకున్నా... మానవ జీవితంలో చాలా విషయాలు సైన్స్ కు అందకుండానే ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిటికి లాజిక్ ఉండదని చాలా మందికి అనుభవాలు నేర్పిన పాఠం. దీని మీద సిద్ధాంత రాద్ధాంతాలు నిష్ఫలం.   

మారణహోమం సృష్టిస్తున్న కొవిడ్ కట్టడికి మందు కనిపెట్టే బృహత్ పనిలో ఆధునిక వైద్యం, అవకాశాన్ని అందిపుచ్చుకుని చచ్చేలా లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వాలు, ఏ మందు సరిగా పనిచేస్తుందో తెలిచ్చావక కొందరు డాక్టర్లు, మిడిమిడి జ్ఞానంతో మరికొందరు వైద్యులు జనాలను చంపేస్తుంటే....చావుకబుర్లను ఆపేలా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి ఒక శుభవార్త  వచ్చింది. బొనిగే ఆనందయ్య గారు వివిధ దినుసులతో ఉడికించి తయారుచేసిన మూడు రకాల మందులు పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు హనుమాన్ వెళ్లి లక్ష్మణుడికోసం సంజీవినిని తెచ్చినట్లయ్యింది.  

సాదాసీదాగా ఉన్న ఆ పెద్దాయన పెద్దమనసుతో సొంత డబ్బులు పెట్టి అయన పనేదో ఆయన చేసుకున్నాడు... నిన్నటిదాకా. ఊళ్ళో వాళ్లకు గురి కుదిరింది. అక్కడ కేసులు లేవట. చావులు కూడా నిల్లని అంటున్నారు. కొవిడ్ తగ్గిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో పాటు స్థానిక రాజకీయులు రంగప్రవేశం చేయడంలో మొత్తం వ్యవహారం కంపై కూర్చుంది. స్థానిక అధికారపార్టీ ఎం ఎల్ ఏ గారు అనవసరంగా... ఈ రోజు (శుక్రవారం) నుంచి పంపిణీ చేసేస్తామని గొప్పగా ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ఒక ప్రభుత్వ కమిటీ దాని మీద ఒక నివేదిక కూడా మందుకు చాలావరకు అనుకూలంగా ఇవ్వడంతో ఇక కొవిడ్, కార్పొరేట్ బాధితుల్లో ప్రాణం లేచివచ్చింది.  హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నరకయాతన పడుతున్న వాళ్ళు అంబులెన్స్ లలో  కృష్ణపట్నం దారిపట్టారు. నెల్లూరు జిల్లాలో కిక్కిరిసిన ఆసుపత్రులలో రద్దీ తగ్గడం, నిన్నటిదాకా దొరకని బెడ్లు క్రమంగా ఖాళీ కావడం మొదలయ్యిందట.  

పాపం... ఆనందయ్య గారు ఏదీ దాచుకోకుండా... ఏ ఏ దినుసులతో మందు తయారుచేస్తున్నదీ చెప్పారు. ప్రభుత్వానికి చేరిన నివేదికలో ఇది స్పష్టంగా ఉంది. అయినా.... ఈ రోజు ఒక మూడు నాలుగు వేల మందికి మందిచ్చే అవకాశం ఉన్నా ఆపడం, ఆయన్ను పోలీస్టేషన్ కు తీసుకుపోవడం అస్సలు బాగోలేదు. చాలా మంది చావుబతుకుల మధ్య అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి చేరిన వారికైనా మందు ఇవ్వనివ్వాలి. ప్రతిదాన్నీ సైన్స్ కు ముడిపెట్టి చూసే సైన్టిఫిక్ మూర్ఖుల అభ్యంతరాలు చూసి, ఎవరో వచ్చి ఏదో చేసి సర్టిఫికెట్ ఇచ్చేదాకా ఆగుదామంటే కుదరదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 

అయ్యా...ఆనందయ్య గారు జనాలను మంటల్లో వేస్తున్నాడో, చెంపలు వాయిస్తున్నాడో, అశుద్ధం తినమంటున్నాడో అంటే మనకు అర్జంటుగా అభ్యంతరం ఉండాలి. దినుసులేంటో చెప్పినాక కూడా వైద్యం ఆపడం ఎందుకు? సైన్స్ బాబాలు చెబుతున్న మందులు, స్టెరాయిడ్లు వంద శాతం పనిచేస్తున్నాయని మీ దగ్గర ఒక సాక్ష్యం ఉంటే అది వేరే సంగతి. అపుడు కృష్ణపట్నం పోనివ్వద్దు. ఇక్కడ సరైన వైద్యం తెలియక పిట్టల్లా జనాలు రాలుతున్నారు. భయంతో జనం గుండెలు మిగులుతున్నాయి. ఆధునిక వైద్యుల చేతిలో రోగులు గినియా పిగ్స్ అయి...నరాల్లో స్టెరాయిడ్స్ ఏరులై...చివరకు రోగులు ఒక్క పూటలోనే శవాలై... అనాధల్లా దహనమై పోతున్నారు. డబ్బుకు డబ్బు వదులుతున్నది. ప్రాణాలకు ప్రాణాలు పోతున్నాయి. ఏంట్రా బాబూ ఇదని అడిగితే... మ్యూటేషన్, గిటేషన్ అని సొల్లు చెబుతున్నారు. ఒక్కళ్ళ దగ్గరా ఒక్క చావు గురించీ సైన్టిఫిక్ వెర్షన్ లేదు. హార్ట్ ఫెయిల్ అన్నది కామన్ సానుగుడయ్యింది. అడిగేవాడే లేని హత్యాకాండ అయ్యింది. 

టీకాలు వేసుకున్నాక కూడా కొవిడ్ సోకుతుంది. పోయేవాళ్లు పోతున్నారు. టీకాలు వేయకముందు బాగుండి ... వేశాక గుటుక్కుమన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది టీకాను తప్పుబట్టడం కాదు. భయంకరమైన అనిశ్చితి గురించి చెప్పడం మాత్రమే. తీవ్రమైన అనిశ్చితి  సృష్టిస్తున్న వైరస్ మూలంగా మనం తీవ్రాతితీవ్రమైన గందరగోళంలో ఉన్నాం. తరచిచూస్తే ఇప్పుడు ట్రయిల్ అండ్ ఎర్రర్ యవ్వారం నడుస్తోంది. ఇవ్వాళ్ళ ప్రాణ ప్రదాత అనే ఇంజెక్షన్ రేపు 'నో నో' అయిపోతున్నది. క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరైడ్, రెండిసీవిర్... అన్నింటి గురించి రోజుకో మాట చెప్పారే. ఖండితంగా వర్కవుట్ అయిన ఒక్క ప్రోటోకాల్ అయినా తయారు కాలేదే! మందు లేని జబ్బుకు... లక్షలు గుంజుతున్నారే! ఈ స్థితిలో కృష్ణపట్నం స్వామిని కట్టేయడం ఏమి భావ్యం? 

ఇంకో మాట... ఆనందయ్య గారి వైద్యం పనికిరాని చెత్తే అనుకుందాం. అది తేలనివ్వండి. అప్పుడు చూద్దాం. అయినా సరే నమ్మకంతో జనం ఉన్నారు కాబట్టి... చాలా మందికి తగ్గిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి.... ప్రస్తుతానికి కానివ్వండి. శాస్త్రీయులు నమ్మే ప్లాసిబో ప్రభావం అనే పరమ శాస్త్రీయ సిద్ధాంతానికి కట్టుబడైనా సరే  అయన పని ఆయన్ను చేయనివ్వండి. తర్వాత సంగతి తర్వాత!

Tuesday, May 11, 2021

అమ్మలారా...అయ్యలారా.... పది రోజులు పదిలంగా ఉండరా...

కొవిడ్-1 అపుడు ఉన్న ఊపు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కనిపించడంలేదు... వైరస్ సృష్టించిన పెను ఉత్పాతం కారణంగా. రెండో తరంగం ప్రతి ఇంటినీ పట్టికుదుపుతూ మరణ మృదంగం వినిపిస్తుంటే ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లభించక, మందులు సకాలంలో దొరక్క,  మన దగ్గర తయారైన టీకాలు మనకే అందుబాటులో లేక అగమ్యగోచరమై... యావత్ భారతం వణికిపోతుంటే....పాలకులు పాలిటిక్స్ మీద దృష్టిపెట్టి పరిస్థితిని భ్రష్టుపట్టించారు. బతికుంటే చాల్రా నాయనా... అని సామాన్యులు బిక్కుబిక్కున బతుకుతున్నారు.  

భారత్ లో బాధితుల ఆక్రందనలు విని చలించి... 'లాక్ డౌన్ విధించండి... తాత్కాలిక ప్రాతిపదికన ఆసుపత్రులు తెరవండి... సైన్యం సాయం తీసుకోండ'ని విదేశీ నిపుణులు సైతం మొత్తుకుంటున్నా కేంద్రప్రభుత్వం స్పందించకుండా రాష్ట్రాలకే నిర్ణయం అప్పగించింది. పరిస్థితి విషమించడంతో కోర్టులు సైతం బెత్తం పట్టుకోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ముందే స్పందించగా.. మొత్తమ్మీద తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు భోజనాలయ్యాక లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించింది. 

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం (మే 12, 2021) ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైమళ్ళీ 20న కేబినెట్‌ సమావేశమై పరిస్థితి సమీక్షించి  నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నడవనున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్ డౌన్ ప్రకటన వచ్చిందో లేదో జనం రోడ్ల మీద పడ్డారు. పెట్రోల్ బంకులు సర్లే గానీ... మందుషాపుల ముందు బారులు తీరి ఉన్నారు. అక్కడ భౌతిక దూరం గట్రా ఏమీ లేకుండా... స్కైలాబ్ పడుతుందన్నట్లు... ఈ మందు లేకపోతె చస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది దారుణం. ఒరేయ్ నాయనా....చస్తార్రా బాబూ... కొద్దిగా సోయిలోకి రండి. 

ఇది ప్రజలు బాధ్యతతో మెలగాల్సిన సమయం. వచ్చే పది రోజులు కాస్త కఠినంగా క్రమశిక్షణతో ఉంటే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయి. ఈ లోపు ఏ పొడులో, మాత్రలో వస్తాయి మనల్ను ఆదుకోవడానికి.  ప్రతి ఒక్కరూ పెద్ద యుద్ధం చేస్తున్న సైనికుల్లా వ్యవహరించకపోతే మరిన్ని మరణాలు చూడాల్సివస్తుంది. బీ కేర్ఫుల్. 

Monday, May 10, 2021

ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా....

పొద్దున్నేఆరు గంటల లోపు ఫ్రెష్ గా  లేవడం...
ఊళ్ళో ఉన్న అమ్మతో ఫోన్ లో మాట్లాడడం.... 
గోడ ఆసరా గట్రా లేకుండా శీర్షాసనం వేయడం.... 
ఆయనెవరో కరోనా-1 టైం లో చెప్పిన చప్పట్ల కసరత్తు చేయడం... 
టీనో, తేనే నిమ్మరసమో తాగడం... 
భార్యతో కలిసి కబుర్లాడుతూ పార్కులో ఒక ఐదు రౌండ్లు నడవడం... 
మరో ఐదు రౌండ్లు స్లో రన్నింగ్, తర్వాత శ్వాస సంబంధ ఎక్సర్సైజ్లు చేయడం...
వచ్చాక పేపర్ చూస్తూ ఒక కప్పు కాఫీనో, టీనో తాగి కూరలు లేదా సరుకులు తేవడం...  
స్నానానంతరం టిఫిన్ బిగించి జర్నలిజం పిల్లలకు ఆన్లైన్ క్లాసు ఆనందంగా చెప్పడం...  
భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుతూ మంచి భోజనం చేయడం.... 
ఫోనులో వీడియోలు చూస్తూ నిద్రలోకి జారి ఒక గంటకు పైగా కునుకు తీయడం...
సాయంత్రం ఒక టీ తాగి రేపటి క్లాసుకో, రాయాల్సిన వ్యాసం కోసమో చదవడం... 
మధ్యలో ఆర్కే కు ఫోన్ చేసి ఒక అర్థగంటకు పైగా కబుర్లాడడం... 
ఎనిమిది గంటలకల్లా డిన్నర్ తినడం....
నాన్నతో ఫోన్ లో మాట్టాడడం...  
భార్యా పిల్లలతో కలిసి కాసేపు సినిమా చూడడం....
తొమ్మిది, పది గంటలకల్లా నిద్రలోకి వెళ్లిపోవడం...
గుర్రుకొట్టి నిద్రపోవడం.... 

-కరోనా కుమ్మేయకముందు రోజులు అటూ ఇటుగా ఇట్లానే గడిచాయి. ఇప్పుడు కథ మారింది, వ్యధ మిగిలింది. 

ఏడు గంటలకు బద్ధకంగా లేవడం... అమ్మ ఫోన్ తో... 
బైటికి పోతే గాల్లో తేలే కరోనా కళ్ళగుండా వస్తుందని గుర్తుచేసుకోవడం...
కళ్ళు మండుతుండగా... బ్రష్ చేసి... 
మూడుంటే శీర్షాసనం వేసి... ఎక్సర్ సైజ్ మ్యాట్ మీద కాళ్ళూ చేతులూ కదల్చడం.... 
బైట పడి ఉన్న పేపర్ల కట్ట మీద కరోనా ఉందన్న భయంతో చూస్తూ టీ తాగడం .... 
టిఫినీ తినడం.... తెల్లారగట్టా పీడకల వచ్చినందువల్ల మరో కునుకు తీయడం.... 
జర్నలిజం క్లాసు చెప్పడం... 
ఏ దుర్వార్తా లేకపోతే పొట్టనిండా లంచ్ చేయడం.... (మే 5 నుంచి రోజూ ఒక మిత్రుడు పోయారు). 
పేస్ బుక్కు లో వార్తలు లేదా నివాళులు చూస్తూ నిద్రపోవడం... 
లేచి ఎవరితో మాట్లాడాలా (ఆర్కే ని కబళించింది) అని చూసి ఎవ్వరితో మాట్లాడకపోవడం... 
లెస్సన్ ప్రిపేర్ కావడం, లేదా వ్యాసం రాయడం... 
ఈ రోజు పోయిన మిత్రుడి గురించి మనసు స్పందిస్తే బ్లాగడం.... 
ఈ లోపు ఇంట్లో ఎవరికీ తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా... ఉలిక్కిపడడం.... 
తొమ్మిది గంటలకు రెండు మెతుకులు తినడం.... 
కాసేపు టీవీ (వార్తలు కాదు) చూడడం... 
మళ్ళీ ఫోన్ చూస్తూ కూర్చోవడం....
ఆ రోజు పోయిన మనిషి గురించి మాట్లాడుకోవడం....
మారిన కరోనా ఉత్పరివర్తనంపై కథనాలు చూడడం.... 
స్పెయిన్ లో ఉన్న కుమారుడితో మాట్లాడడం...  
భారంగా 12 గంటల ప్రాంతంలో నిద్రపోవడం...   

ఇట్లానే ఒకటి రెండు నెలలు అయితే... లంగ్స్ లోకి దూరి కరోనానే చెప్పక్కర్లేదు రాజా.... 
బైటికి కదలకుండా, స్వేచ్ఛగా గాలిపీల్చకుండా కొంపలోనే మగ్గుతూ ఛస్తే...చచ్చి ఊరుకుంటాం. 
మొదటి ఫేసు లో ఇంతలా చావులు లేవుకాబట్టి... ఇంటికి పరిమితం కావడం కొత్తకాబట్టి బాగానే గడిచింది. ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. మన అనుకున్న ఎందరినో పట్టుకుని పీడించింది... పీడిస్తోంది. 

ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా.... 
చాలు స్వామీ... ఇక ఆపేయ్! 

Wednesday, May 5, 2021

సూపర్ జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే)కు అశ్రు నివాళి!

తెలుగు జర్నలిజంలో బాగా రాసేవారు (only writing-committed to the profession)... బాగా మేసేవారు (only corruption-as much as possible), బాగా కూసేవారు (Only talking-in studios)...బాగా చేసేవారు (Only recommendations-for everything)...  బాగా నాకే వారు (Only praising-the government) ఉన్నారు. ఇందులో మొదటి రకం పక్కా ప్రొఫెషనల్స్ కొరత ఎంతో ఉంది. ఇది కాక... నాణ్యత పెంచడానికి వృత్తినిబద్ధతతో ప్రయత్నంచేసే వారు బహు అరుదు. 

వృత్తి సంబంధ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే... తాను నేర్చిన విద్యను నలుగురికి పంచడం బాధ్యతగా భావిస్తూ... అందులో తృప్తిని వెతుక్కున్న జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే). కరోనా పై పోరాడుతూ అయన ఈ ఉదయం గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన వయస్సు 54 సంవత్సరాలు. భార్య వందన, కూతురు శ్రీలాస్య ఉన్నారు. 

విజయనగరం జిల్లా బొబ్బిలిలో 29-08-1967న  విద్యాధికుల కుటుంబంలో జన్మించిన ఆర్కే (పాలొలికే బుగ్గలతో ఉంటాడు కాబట్టి 'పాలబాబు' అని ఇంట్లో ముద్దుగా పిలుస్తారు) ఎం ఎస్సీ-ఫిజిక్స్ చదివాడు. ఆంగ్ల బోధకుడైన తండ్రి నుంచి వారసత్వంగా సాహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన జర్నలిజంపై మక్కువతో 1991-92 లో "ఈనాడు" కంట్రిబ్యూటర్ గా చేరాడు. "ఈనాడు జర్నలిజం స్కూల్" లో 1993లో చేరి బ్యాచ్ ఫస్టు వచ్చారు. సంస్థ గుండెకాయగా భావించే జనరల్ డెస్క్ లో చేరి తెలుగు, ఇంగ్లిష్ భాషా సామర్ధ్యం మెండుగా ఉండడం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే జర్నలిజం స్కూల్ పిల్లలకు క్లాసులు తీసుకునేవాడు. డెస్కులో చేరిన కొత్త వారికి నిలదొక్కుకోవడానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 



'సార్... ఎన్టీఆర్ ను కాదని మనం చంద్రబాబును ఎందుకు సమర్ధించాలి?' అని ఒక సంస్థాగత మీటింగులో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారిని ఆనాడు అమాయకంగానైనా సూటిగా అడిగి ఒక 30 నిమిషాల పాటు పెద్దాయన వివరణ ఇచ్చేలా చేసిన మొనగాడు... ఆర్కే. పదవులు రావనో... తొక్కేస్తారనో తను ఎన్నడూ భయపడలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో, రాయడంలో  భయమెందుకు? అన్నదే ఏకైన సూత్రం. ఇది చేసిన నష్టం భారీగానే ఉన్నా... రాజీ పడకుండా ఇబ్బందిపడుతూనైనా బండి నడిపాడు. 

ఆర్కే ప్రతిభను గమనించి ఈనాడు యాజమాన్యం... అప్పుడే కొత్తగా వస్తున్న మాధ్యమం ఈ-టీవీ కి పంపింది. అక్కడా తనదైన ముద్రవేశాడు. ఎందరో మెరికలను తయారుచేశాడు. తర్వాత ఎన్-టీవీ, ఐ-న్యూస్ ఛానల్స్ లో పనిచేసి ప్రింట్ జర్నలిజం వైపు మారాడు. డెక్కన్ క్రానికల్, హన్స్ ఇండియా లలో పనిచేసిన ఆర్కే చివరకు ఆంధ్రజ్యోతిలో చేరాడు. "నాణ్యత కోసం నేను పడిన తాపత్రయాన్ని పొగరుగానో మారేదనో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఛానెల్స్ లో నాకు మంచి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు," అని ఆర్కే అన్నాడు. వ్యాస రచయిత రాము, రామకృష్ణ ఈనాడు రోజుల్లో దిగిన ఫోటో ఈ పైన ఉంది. 
 
ఆర్కే శివైక్యం చెందిన సందర్భంగా ఈ రోజు రాసిన లేఖ ఇదీ:::::


పాలబాబూ.... 
రెండు రోజుల్లో కోలుకుంటావని అందరం అనుకుంటే... ఏంటి బ్రదర్ 54 ఏళ్లకే ఇలా వెళ్లిపోయావ్? 
మూడు నాలుగు నెల్లుగా దాదాపు రోజూ గంట చొప్పున మాట్లాడుకున్నాం. ఎన్నోటి విషయాలు చర్చించుకున్నాం! జర్నలిజం, ప్రపంచ విశేషాలు, లోకల్ రాజకీయాలు, భోజనాలు, జనాలు...ఎన్నని విశ్లేషించాం! అవే నాకు మధురానుభూతిగా మిగిల్చి పోయావ్. నిజానికి, నీతో ఈనాడు లో జనరల్ డెస్క్ లో పోటీపడి రాసిన బ్యానర్లు, నువ్వు పడిపడినవ్విన బోలెడన్ని హెడ్డింగులు ఎప్పటికీ గుర్తుంటాయి. వీటితో పాటు, చింతల్ బస్తీ మెస్ లో మనం తిన్న ములంగ కాడలు, వస్తూ వస్తూ వేసుకున్న స్వీట్ పాన్లు, పండిన నోటితో చిద్విలాసంగా నువ్వు  నడిచి వస్తుంటే... 'అయ్యా.... ఆర్కే..' అని ఒక డెస్క్ ఇంచార్జ్ చేసిన వ్యాఖ్యలు.... ఎప్పుడూ మరచిపోను. డ్యూటీ అయ్యాక నిమ్స్ ప్రాంగణంలో తాగిన టీలు, తిన్న మిర్చి బజ్జీలు.... 
దీంతో పాటు నా 'సావిర్జినిటి', నీ ' వర్జీనియా వూల్ఫ్'  నా మదిలో ఆనందంగా నిలిచిపోతాయి. ఎంత బనాయించావురా... 'రాజకీయ ఆర్తి-భంగపడ్డ మూర్తి' శీర్షికను! నీ హాస్య ప్రియత్వం, సంభాషణా చతురత, సునిశిత విశ్లేషణా సామర్థ్యం ఎల్లకాలం గుర్తుండి పోతాయి. 

నేను ఏప్రిల్ లో రెండు రోజులు వరసగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసి వస్తే... కొవిడ్ ను పట్టించుకోకుండా ఏంటిదని మందలించావే! ఎన్ని జాగ్రత్తలు చెప్పావ్! చూడరా అన్నా... ఈ పాడు కోవిడ్ కనీసం నిన్ను కలవకుండా...చేసింది. నీకో దండ వేసి దండం పెడదామని నేను, హేమ సిద్ధమవుతుంటే...ఆ జీ హెచ్ ఎం సీ వాళ్ళు అంబర్ పేట కు ఆల్రెడీ తీసుకుపోతున్నారని చెప్పారు. పంచభూతాల్లో నీవు లీనమయ్యే లోపే ఇది రాయాలనుకున్నా. దుఃఖం ఆగడం లేదురా అన్నా. నువ్వు ఆసుపత్రిలో చేరాక... మాట్లాడాల్సింది. నీకు అది డిస్ట్రబెన్స్ అవుతుందనుకున్నారా అన్నా. ఘోరమైన తప్పు జరిగిపోయిందే!
 
ఎందుకురా.... నువ్వు నీ మరణం గురించి నాతో అంత లోతుగా చర్చించావ్? ఈ మధ్యనే రెండు మూడు సార్లు ఇదే ప్రస్తావించావ్.  ఇప్పుడు అర్థమయ్యింది ఆర్కే. 'నాకు ఏదైనా అయితే వీళ్లకు (వందన గారికి, లాస్యకు) అండగా ఉండాలి," అని నువ్వు మాటిమాటికీ చెబితే నేను నిన్ను తిట్టా... పిచ్చివాగుడు ఆపాలని. నువ్వు మాట ఇవ్వాలని పట్టుపట్టినప్పుడు నాకు అర్థంకాలేదు అన్నా. బహుశా నువ్వు ఊహించినట్లే దాటిపోయావ్ మా అందరినీ వదిలేసి. నేను మాటకు కట్టుబడి ఉంటారా... అన్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వాళ్ళిద్దరికీ నేను, నా కుటుంబం బాసటగా ఉంటాం. ఈ రోజు నేను చేస్తున్న పునరుద్ఘాటనరా ఇది. 
  
అన్నా... నువ్వు.. అద్భుతమైన ప్రతిభావంతుడివి. నిన్ను నిన్నుగా నేచురల్గా ఎదగనివ్వని, అవకాశాలకు అడ్డంపడిన వెధవ ఎవ్వడూ నీలా ఒక్క పేరా అయినా రాయలేడు. కొన్ని లెక్కలు కలిసొచ్చాయి వారికంతే. నిన్ను ఇంగ్లిష్ జర్నలిజంలో చేర్చాలని... మనం ఈనాడు లో ఉండగానే నిన్ను ఒక ది హిందూ జర్నలిస్టు దగ్గరికి తీసుకుపోయాం. కానీ ఈ లోపు ఈ-టీవీ లో వచ్చి దేశ రాజధానికి వెళ్లిపోయావ్. తర్వాత మనం దూరమైనా... హేమ ఎన్-టీవీ లో చేరాక వారానికి ఒక సారి మాట్లాడుకున్నాం. అవన్నీ మధుర అనుభూతులే. మధ్యలో చాలా అంతరం వచ్చినా.... గత ఏప్రిల్  ఇబ్బంది నుంచి నువ్వు బైటపడ్డాక... నేను రోజూ మాట్లాడాలని పెట్టుకుని మాట్లాడాను...  నువ్వు వేగంగా కోలుకుని హాయిగా ఉండాలని. ఈ నెల్లో అహోబిలం సహా కొన్ని ప్రాంతాలకు, మా ఊరికి వెళ్లాలని అనుకుంటే... అకస్మాత్తుగా వెళ్లిపోయావ్ మిత్రమా. 
నీ జీవితంలో, మరణంలో రెంటిలోనూ వ్యవస్థ వైఫల్యం, యాజమాన్యాల కర్కశత్వం, అపోహలతో కక్షగా మెలిగిన కొందరి రాక్షసత్వం ఉన్నాయి. మనం వాటిని కూలంకషంగా మాట్లాడుకున్నాం... నాకు అవన్నీ గుర్తు ఉంటాయి. వదిలేద్దాం. 
ఏడాదికి పైగా నువ్వు ఇంటి నుంచే పనిచేయడానికి సహకరించిన ఆంధ్ర జ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ గారికి, సీనియర్ మిత్రుడు వక్కలంక రమణకు నీ తరఫున ఈ రోజున ధన్యవాదాలు. నిన్ను మామూలు మనిషిగా చూడాలని గట్టిగా అనుకున్న ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా గత వారం అయన మీ ఇంటికి వచ్చి మందులిచ్చి, అర్థగంట ఉండడమే కాదు... నీ ప్రాణాలు కాపాడేందుకు కొన్ని గంటల పాటు ఫోన్లో ఆయన అందుబాటులో ఉన్నారు. రేగళ్ల సంతోష్ నీ గురించి ఎంతో తపన పడ్డాడు. పాపం ఎన్ని ఫోన్ కాల్స్ టంచనుగా తీసుకుని తనకు చేతనైన సాయం చేశాడో! ఇతర మిత్రుల ప్రయత్నాలు, ప్రేయర్స్ వర్కవుట్ కాలేదు. మేము దురదృష్టవంతులం...అన్నా. 

నీతో పనిచేసిన, నీ నుంచి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందిన అనేక మంది నాతో మాట్లాడారు. ఏమ్వోయ్, బ్రదర్, సోదరా... అని నువ్వు పిలిచిన వారూ కుమిలిపోతున్నారు. 
ఆర్కే... మేమంతా నీ ఆత్మకు శాంతి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తాం. అంతకు మించి మేమేమి చేయగలం. 

పాలబాబూ.... ఇక సెలవ్... 
నీ 'బోసమ్' ఫ్రెండ్'
రాము

Tuesday, May 4, 2021

మరో 'ఈనాడు' జర్నలిస్టుకు జగన్ సర్కార్ పదవి

'ఈనాడు' సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గా నియమించింది. ఆయనతో పాటు కాకర్ల చెన్నారెడ్డి కి కూడా పోస్టు దక్కింది.  

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపినట్లు ఒక ప్రకటన వెలువడింది. 

హరిప్రసాద్‌ రెడ్డి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌నుంచి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నారు. అయన భారత రాజ్యాంగ, సామాజిక, ఆర్థిక విషయాలపై ఈనాడు సంపాదకీయపు పేజీలో వేలాది వ్యాసాలు ప్రచురించారు. తన పూర్తి పేరుతోనే కాకుండా, ఇందిరా గోపాల్, శ్రీదీప్తి వంటి కలం పేర్లతో కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాసాలు అందించారు. హోదాలతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడే మృదుభాషిగా హరి ప్రసాద్ పేరు పొందారు. 


ఉత్తమ పాత్రికేయుడిగా నారద సమ్మాన్ అవార్డు, సృజన ఎక్సలెన్స్ అవార్డు వంటి పలు పురస్కారాలు అయన పొందారు. సమాచారాన్ని పారదర్శకంగా సామాన్యునికి చేరువ చేయడంలో, ప్రజలకు ప్రభుత్వ విభాగాలను మరింత జవాబుదారీగా ఉంచే విషయంలో సమాచార శాఖ కమిషనర్ గా తనదైన ముద్రవేసే సత్తా ఉన్న జర్నలిస్టు ఆయన. 

అయితే.... ఈనాడు సీఈబీ లో పనిచేసిన లేదా పనిచేస్తున్న వారికి జగన్ ప్రభుత్వంలో పదవి లభించడం ఇది రెండో సారి. ఇక్కడే పనిచేసిన జీవీడీ కృష్ణ మోహన్ 'సాక్షి' పెట్టిన కొత్తల్లోనే అందులో చేరారు. సాక్షిపై 'ఈనాడు' దాడిని పాయింట్ బై పాయింట్ తిప్పికొడుతూ 'ఏది నిజం' పేరుతో రాసిన అయన వ్యాసాలు సంచలనం సృష్టించాయి. తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా నియమితులై అద్భుతమైన సేవలు అందిస్తున్నారాయన.  

కృష్ణ మోహన్ తో కలిసి పనిచేసిన హరిప్రసాద్ కు ఇప్పుడు పదవి లభించింది. నిజానికి, పాఠకులకు సరిగా అర్థంకాని భాషలో సంపాదకీయాలు రాస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్న సీఈబీ ని సంస్కరించేలా సూచనలు ఇచ్ఛే బాధ్యతను రామోజీ రావు గారు ఈ ద్వయానికి అప్పట్లో అప్పగించారు. చాలా శ్రమించి వారిచ్చిన నివేదిక పూర్తిగా కార్యరూపం ధరించినట్లు లేదు!

Sunday, May 2, 2021

చెప్పి మరీ కొట్టిన ప్రశాంత్ కిషోర్... నిజ్జంగా మగాడ్రా బుజ్జీ

చేతిలో యావత్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, జేబులో దండిగా వనరులు, పుష్కలంగా రాజకీయ రచనా దురంధరులు, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉన్నా... పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ చేతిలో కమలనాథులు, ముఖ్యంగా నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం- దెబ్బతినడానికి ముఖ్య కారణం... ఆమె సాహసోపేత రాజకీయ పోరాటంతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పకడ్బందీ వ్యూహరచన, శాస్త్రీయ సాంకేతిక ప్రచార భేరి. 

దాదాపు ఒక ఏడాది నుంచీ వందల మంది సైనికుల లాంటి యువతీ యువకులతో కూడిన ఐ-పాక్ బృందం పీకే నేతృత్వంలో బీజేపీని ఆఫ్ లైన్, ఆన్ లైన్ దీటుగా ఎదుర్కొని నిలబడి విజయహాసం చేసింది. మోదీ, షా తో పాటు కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో, సభల్లో పాల్గొని మమత ఖేల్ ఖతం అని చెప్పినా... బీజేపీ కి రెండంకెలను మించి సీట్లు రాబోవని పీకే ధీమాగా చెబుతూ వచ్చారు. ఆయన ట్వీట్స్ గానీ, టీవీ ఇంటర్వ్యూలు గానీ అర్థవంతంగా, ఆకట్టుకొనేవిగా ఉన్నాయి. 

డిసెంబర్ 21. 2020 నాడు పీకే ఎక్కడలేని ధీమతో చేసిన ఈ కింది ట్వీట్ ఇప్పటిదాకా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సమకాలీన భారతీయ ఎన్నికల చరిత్రలో ఇది ఒక మరిచిపోలేని అంశంగా నిలిచిపోతుంది. బీజేపీ ఎంత హడావుడి చేసినా వచ్చేవి వంద లోపేననీ, అంతకు మించి వస్తే తానుచేసే ఈ పని (స్పేస్) నుంచి వైదొలుగుతానని, మరిచిపోకుండా ఉండడానికి ఈ ట్వీట్ ను దాచుకోండని కూడా తను చెప్పాడు. కమలనాథుల కనుసన్నల్లో ఉన్న నేషనల్ మీడియా గుచ్చినా, కుళ్ళ బొడిచినా తను ఈ విషయంలో ఆయన వెనక్కుపోలేదు. నిజానికి ఇంత ధైర్యంగా ఈ ప్రకటన దేశ ముదుర్లయిన బీజేపీ నేతలకు బహిరంగ సవాల్. అయినా... పీకే తప్పని నిరూపించకపోయిన నాయకమణ్యులు ఆయన్ను లోలోపలైనా అభినందించకుండా ఉండలేరు. 


సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుని, మమతను ఒక్కదాన్ని ఒంటరి చేసి ఆమెనే లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు విమర్శలు సంధించడం, ఎన్నికల సంఘం వీరికి అనుకూలంగా ఎనిమిది దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకపోవడం, నందిగ్రామ్ లో మమతపై దాడి జరగడం, రెండు రోజుల పాటు ఆమె ప్రచారం చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇప్పించడం... వంటి తప్పులకు కమలనాథులు మూల్యం చెల్లించాల్సివచ్చింది. బెంగాల్ లో ముఖ్యమైన విజయాన్ని సాధించలేక మోదీ-షా బృందం చతికిల పడింది. అయినా... అలనాటి కమ్యూనిస్టుల కోటలో, మేథావులు గడ్డపైన బీజేపీ ఇప్పుడు సాధించిన ప్రతిపక్ష హోదా తక్కువేమీ కాదు. కాకపోతే.... దశాబ్దాల తరబడి బెంగాల్ ను ఏలిన కామ్రేడ్లు పూర్తిగా జీరోలు కావడం ఒక విషాదం!

అనుకున్నట్లు తృణమూల్ ను గెలిపించినా... తాను ఈ స్పేస్ నుంచివైదొలుగుతున్నానని, ఐ ప్యాక్ నాయకత్వం ఇకపై ఈ బాధ్యతలు చూసుకుంటుందని పీకే తృణమూల్ విజయోత్సవాల మధ్యన  ప్రకటించడం కొసమెరుపు. కొద్దికాలం పాటు భార్యా బిడ్డలతో గడిపి... తర్వాత సంగతి తర్వాత చూస్తానన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించింది. పదవీభాగ్యం కలిగించే ఇలాంటి రాజకీయ మాంత్రికుడిని వదులుకోవడానికి మన భారత నాయకులు అమాయకులు కాదు, పేదలూ కాదు. 

Saturday, May 1, 2021

రోహిత్ సర్దానా మృతి: 'ఆజ్ తక్' ఓవర్ యాక్షన్

ప్రసిద్ధ హిందీ టెలివిజన్ జర్నలిస్టు రోహిత్ సర్దానా (41) శుక్రవారం నాడు ఏప్రిల్ 30, 2021 న కోవిడ్ పై పోరాడుతూ తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. 

వర్తమాన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ఆయన 'ఆజ్ తక్' ఛానల్ లో నిర్వహించే 'దంగల్' అనే కార్యక్రమానికి విశేషమైన ఆదరణ ఉంది. 2017 లో ఆజ్ తక్ లో చేరడానికి ముందు జీ న్యూస్ లో పనిచేశారు. అక్కడ రోహిత్ నిర్వహించిన చర్చా కార్యక్రమం "తాల్ థోక్  కే" కూడా విశేష ఆదరణ ఉండేది. 1979 సెప్టెంబర్ 22న జన్మించిన రోహిత్ బీ ఏ సైకాలజీ చదివాక... గురు జంభేశ్వర్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. 2003లో సహారా సమయ్ లో పనిచేసిన ఆయన 2004లో జీ న్యూస్ లో చేరి యాంకర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 


రోహిత్ ఈ-టీవీ నెట్ వర్క్ లో కూడా పనిచేశారని అంటున్నారు. భారత రాష్ట్రపతి ఇచ్చే గణేష్ విద్యార్థి పురస్కార్ ను 2018 లో రోహిత్ కు ప్రదానం చేసారు. ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి తో పాటు అనేక మంది ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

అయితే...రోహిత్ మృతి వార్తను ఆజ్ తక్ రోతగా టెలికాస్ట్ చేసింది. రోహిత్ సహచరులైన మహిళా యాంకర్లు బాధాతప్త హృదయంతో ఏడుస్తూ ఆ వార్తను, రోహిత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పంచుకోవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పై ఫోటో చూడండి వార్తలు చదివే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తున్నదో! చుట్టూ మరణాలతో, అసహాయతతో దేశం అంతా విషాదంలో ఉండగా ఎంతో ప్రజాదరణ ఉన్న ఈ ఛానెల్ ఇలా యాంకర్లను స్టూడియోలో   ఏడిపించి జనాల గుండెలు పిండేయడం అస్సలు బాగోలేదు. ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉండేలా చేయడం మంచిది కాదు. 

టీ ఆర్ పీ ని దృష్టిలో ఉంచుకుని ఈ పనిచేసి ఉంటే మాత్రం ఇది దారుణం. 

మంత్రి ఈటెలపై 'నమస్తే తెలంగాణ' పెను ఎదురుదాడి

ఈ కింద ఫోటో ఈ రోజు (మే 1, 2021) నమస్తే తెలంగాణ మొదటి పేజీ. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి పోషిస్తున్న ఈటల రాజేంద్ర పై మొదటి పేజీలోనే కాకుండా లోపల కూడా తీవ్రమైన పదజాలంతో వార్తలు, బొమ్మలుప్రచురించారు. కోళ్లఫారం కోసం అసైన్డ్ భూములు కొట్టేశారన్న ఆరోపణను, ఈటెల వివరణను మిగిలిన పత్రికలకన్నా మిన్నగా ఇచ్చారు. ఈటల తప్పు ఒప్పేసుకున్నట్లు కూడా ఒక వార్త ఉంది. 

ఈ కవరేజ్ ద్వారాకొన్ని విషయాలు అర్థమవుతాయి. 1) ఈటలను పొమ్మనమని చెప్పకనే చెబుతూ పెట్టిన ఈ పొగ ఇది. 2) మర్యాదగా అయన ఆ పని చేయకపోతే వేటు పడేలా ఉంది. 3) ఇంత  పనిచేసిన మంత్రినే కాదు పొమ్మన్న ముఖ్యమంత్రి ఎంత గొప్ప? అని జనం అనుకుంటారు. 4)  రేపు జనంలోకి కారాలు మిరియాలతో వెళ్లే ఈటలకు ముందరికాళ్ల బంధం ఇది 5) టీ ఆర్ ఎస్ రాజకీయాలు మస్తు మజా గా ఉండబోతున్నాయి. అవినీతి ఆరోపణల బాణాలతో గాయపడ్డ ఈటలను భారతీయ జనతా పార్టీ తురుఫు ముక్కగా వాడుకోవచ్చు 6) రాజకీయ పార్టీల చేతిలో  మీడియా ఉంటే ప్రయోజనం ఏమిటో మరోసారి నిరూపితమయ్యింది.