సంపాదకీయాలు రాయడం (ఎడిటోరియల్ రైటింగ్) అనేది ఒక కళ. విశ్లేషణ, వ్యాఖ్య, విమర్శ, మార్గనిర్దేశం అన్నీ పాఠకుల మనసును ఆకట్టుకునేలా, ప్రభావశీలంగా కొన్ని పదాల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన...వాక్యాలను చిత్రికపట్టే కార్యక్రమం కాబట్టే.. కొందరు కొమ్ములుతిరిగిన పూర్వ ఎడిటర్లు తాము ఎడిట్ రాస్తున్నప్పుడు గది బైట ఎర్ర బల్బు వెలిగే ఏర్పాటు చేసుకునేవారు. ఎడిట్స్ రాసేవారిని 'లీడర్ రైటర్స్' అంటారు. పత్రిక లీడర్ తరఫున రాసేది కాబట్టి అది రాసేవారిలో 'డర్' సహజంగానే ఉంటుంది. లీడర్ రైటర్స్ అన్నా పత్రికలో మిగిలిన ఉద్యోగులకు డర్ ఉంటుంది... వారి మేధోశక్తి, భాషా పటిమ, ముఖ్యంగా లీడర్ (అధిపతి)తో నిత్యం టచ్ లో ఉంటారనే సత్యం కారణంగా.
'ఈనాడు' దినపత్రిక మొత్తం గుండుగుత్తగా తనదే అయినా... సంపాదకీయపు పేజీ (ఎడిట్ పేజ్) అనేది ఆ పత్రిక అధిపతి రామోజీరావు గారి గుండెకు దగ్గరగా ఉంటుంది. పత్రిక దృష్టికోణాన్ని, అభిప్రాయాన్ని చెప్పే సంపాదకీయం ఆ రోజున దీనిమీద రాయాలి? ఆయా పరిణామాలపై పత్రిక యాంగిల్ ఏమిటి? వంటివి అంత వయసు మీదపడినా ఇప్పటికీ రోజూ రామోజీరావు గారు ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్ణయిస్తారు.ఈ కసరత్తులో ఆయనకు తృప్తి అమితంగా ఉన్నట్లు చెబుతారు.
|
ఫొటోలో కుడివైపున మూర్తి గారు, ఎడమవైపున బాలు గారు... రామోజీ రావు గారితో.... (Photo courtesy: Mr.Balu's FaceBook wall)
|
'ఈనాడు' ఎడిట్ పేజీ (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు- సీఈబీ) లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు- మూర్తి, బాలు గార్లు- నిత్యం రామోజీ గారితో అనుసంధానమై ఉంటారు... ఈ పేజీ పని నిమిత్తం.పెద్దాయన మనసెరిగి, అంటే రాయాల్సిన అంశం ఎంపిక జరిగాక, ఈ ఇద్దరిలో ఒకరు ఆ రోజు సంపాదకీయాన్ని రాస్తారు. ఆ రాయడానికి, అద్భుతంగా ఏర్పాటుచేసుకున్న సంస్థాగత గ్రంథాలయం నుంచి వచ్చే ఫైల్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. అందులో పాత క్లిప్పింగ్స్ ఉంటాయి. కొత్త పరిణామాలకు అనుగుణంగా, అదనంగా... పదేళ్ల కిందటి ఎడిటోరియల్ లో నుంచి ఒక పేరా, అదే టాపిక్ పై ఐదేళ్ల కిందట ప్రచురించిన దాన్నుంచి ఒక పేరా, అలా తెలివిగా అమర్చుకుంటూ పోతే చాలు.... గంటలో ఎడిట్ సిద్ధమవుతుందని అనుకునే చుప్పనాతులు కూడా ఉంటారు. అది నిజమే అనిచెప్పడం మరీ అన్యాయం.
సరే, ఏదో ఒకలా తయారయిన సంపాదకీయాన్ని... పరస్పరం చదువుకుని పెద్దాయనకు ఆమోదముద్ర కోసం పంపేవారు... వీరిద్దరూ, అప్పట్లోనైతే. రామోజీ గారు దాన్ని ఒకసారి చూసి, సరే కానివ్వండి...అన్నాక అది సంపాదకీయ స్థలం (ఎడమవైపు బారుగా ఉంటుంది) లోకి పోయి కూచుంటుంది. ఈ ఎడిట్ పేజీలో పెద్దా, చిన్నా కొన్ని వ్యాసాలు తెప్పించుకుని, అవసరమైతే అనువాదం చేయించుకుని, తప్పులురాకుండా చూసుకుని ప్రచురించే ప్లానింగ్ బాధ్యత మూర్తి, బాలు గార్లు సమష్టిగా చూస్తారు. తెర ముందు మూర్తి గారు, తెర వెనుక బాలు గారు కథ నడుపుతుండగా, వారికి సహకరించే సబ్ ఎడిటర్లు ఒక ముగ్గురు నలుగురు ఎడిట్ పేజ్ డెస్క్ లో ఉంటారు.
రామోజీ గారి కనుసన్నల్లో ఉన్న సీఈబీ లో దాదాపు రెండేళ్లు పనిచేసే మంచి అవకాశం కలిగినపుడు నా బాసుగా మూర్తి గారు ఉండేవారు. అయన ఇంటిపేరు పర్వతం అనుకుంటా, మరిచిపోయాను. అయన మాత్రం బక్క పలచగా, బారుగా, నగుమోముతో ఉంటారు. పరమ సాత్వికుడు, మృదుభాషి, హాస్య ప్రియుడు. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మేము ఆ వారం ప్రచురించాల్సిన వ్యాసాల పై మేధోమదనం చేసేటప్పుడు అయన ఆధ్వర్యంలో చర్చలు చాలా బాగుండేవి. "అది కాదు రా... నాన్నా...." అంటూ తన వాదన చెప్పేవారు. ఆ డెస్కులోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ గారు, సమాజం గురించి విధిగా బాధపడే మా జీవీ అన్న (ఇప్పుడు నమస్తే తెలంగాణా ఎడిట్ పేజీ), మంచి సైన్స్ వ్యాసాలు రాసే ఉడుముల సుధాకర్ రెడ్డి గారు (ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధనల ఎడిటర్) కూడా పనిచేసేవారు. ఈ ముగ్గురూ మంచి మిత్రులుగా మిగిలిపోయారు.
బాలు గారి గుండ్రటి అక్షరాలు మాత్రమే ఆయనకు సంబంధించి నాకు బాగా గుర్తున్నది. కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడే ఆయనకు నేను దూరంగా మెలిగేవాడిని. అలాగని అమర్యాదకరమైన మనిషి కారాయన. ఆయన తీరు అదీ. మెంటారింగ్ అనే కళ మూర్తి గారికి తెలిసినట్లు బాలు గారికి తెలియదు. తన పనేదో తాను చేసుకుపోయేవారు... ఆర్ ఆర్ జీ ఫైల్స్ లో మునిగితేలుతూ. పని విభజనలో భాగంగా కావచ్చు మూర్తి గారే మాతో డీల్ చేసేవారు. వారిద్దరి మధ్యన సమన్వయం నిజంగా అద్భుతం. (నేను 'ఈనాడు' ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న జనరల్ డెస్క్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న సీఈబీ లో పడిన విధం గురించి చివర్లో విడిగా రాశాను, వీలుంటే చదవండి).
దాదాపు 30 సంవత్సరాల పాటు 'ఈనాడు' లో పనిచేసిన మూర్తి గారికి అక్కడ ఈ రోజు ఆఖరి రోజు అని తెలిసి ఇవన్నీ రాస్తున్నాను. మూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తి తో, చేసిన దిశానిర్దేశంతో...అనేక వ్యాసాలు నేను రాశాను. అందులో, సర్వమత సమ్మేళనం సందర్భంగా, 2000 ఒలింపిక్స్ అప్ప్పుడూ రాసిన వ్యాసాలు నాకు చాలా తృప్తినిచ్చాయి. నిత్యం ఎడిట్ పేజ్ పనిలో మాత్రమే ఉంచకుండా, కొంత ప్రపంచం చూసే, మంచి సెమినార్లలో పాల్గొనే, అధ్యయనం చేసే అవకాశం ఉంటే మూర్తి గారు ఇంకా బాగా ఎడిట్స్ రాయగలిగేవారని నాకుఅనిపించేది. మేధో వికాసానికి ప్రయత్నాలు చేయకుండా ఎడిట్స్ రాయకూడదు, రాసినా పండవు. ఎవరు ఎడిట్స్ రాసినా రోజూ అద్భుతంగా ఎలా ఉంటాయి? మూర్తి గారు తనదైన శైలి, పదజాలంతో వేలాది సంపాదకీయాలు రాసి మన్ననలు పొందారు.
సహచరులను, కింది ఉద్యోగులను ఉన్మాదంతో పీక్కుతిని, రాచిరంపానపెట్టి, రాక్షసానందం పొందే వారికి భిన్నంగా, తనకున్న శక్తిమేరకు సలహాలు ఇస్తూ, నవ్వుతూ పనిచేస్తూ, సాధ్యమైన మేర నిష్పాక్షికంగా వ్యవహరించే మూర్తి గారిలాంటి ప్రొఫెషనల్స్ సంఖ్య మరీ తగ్గిపోతున్నది. ఇది బాధాకరం. అన్నేళ్ల పాటు ఎడిట్ పేజీకి అకింతమై సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అవిరళ సేవతో అలిసిపోయిన ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం.
All the best...Murthy jee.
(POST SCRIPT: మూర్తి గారి పూర్తిపేరు 'పర్వతం శ్రీరామచంద్ర మూర్తి (పీ ఎస్ ఆర్ సీ మూర్తి)'. పదవీవిరమణ అయ్యాక కూడా కొనసాగాలని రామోజీ కోరినా... అయన వద్దనుకున్నారట. ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. బాదరబందీలు లేనపుడు 1986 నుంచీ చేస్తున్న అదే పని చేయడం కన్నా కాస్త సేద తీరదామని మూర్తి గారు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట).
ఇంక మన సొంత సొద...నేను ఎడిట్ పేజీలో చేరిన వైనం...
చెప్పానుకదా, ఇరవై ఏళ్లకు పూర్వం నేను 'ఈనాడు'లో దాదాపు పదేళ్లు పనిచేశాను. అంతకుముందు డిగ్రీ చదువుతూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కంట్రి బ్యూటర్ గా మూడేళ్లు కలుపుకుంటే ఒక పుష్కర కాలం పాటు అక్కడఉన్నట్టు లెక్క. ఒక ఎనిమిదిన్నరేళ్ళు నేను పనిచేసిన జనరల్ డెస్క్ లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఏర్పడింది. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మంచి వేదిక. ఎందుకోగానీ, 'ఈనాడు' లో మంచి మంచి సంపాదకీయాలు, సరళభాషలో రాయాలన్న కుతూహలం నాకు అప్పుడు జాస్తిగా ఉండేది. డ్యూటీ సాయంత్రం అయితే ఉదయాన్నే వచ్చి లైబ్రరీలో కూర్చొని శాంపిల్ ఎడిట్స్ రాసి గప్ చిప్ గా రామోజీ గారికి కవర్లో పంపాను రెండు మూడు సార్లు. ఎవరైనా ఆయనకు లేఖలు పంపే వెసులుబాటు ఉండేది. మన ఉత్సాహం గమనించి ఒకసారి పిలిచి... "ఇంకా కృషిచేయి... నీకు అవకాశం ఇస్తా"నని అయన అన్న రోజు, ఆ తర్వాత రెండు రోజులు నేను నిద్రపోలేదు. నేనేదో ఒక వార్త రాస్తే 'తెలుగంటే ఇలా ఉండాలి' అని అయన అంతకు ముందు ఎర్ర స్కెచ్ తో చేసిన వ్యాఖ్యతో ఉత్తేజం పొంది నేను ఎడిట్స్ సాహసం చేసాను.
ఈ లోపు నేను రామకృష్ణా మఠ్ కు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి, ఉస్మానియాలో జర్నలిజం చేయడానికి నాదైన సమయంలో పోతుంటే 'న్యూస్ టుడే ' ఎండీ గా పనిచేసి ఒక ఏడెనిమిదేళ్ళ కిందట కాలం చేసిన రమేష్ బాబు కుమ్మేయడం ఆరంభించాడు. ఆయన చల్లనిచూపుల్లో ఎందుకోగానీ నేను పడలేక ఇమడలేక ఇబ్బందిపడ్డాను. కుంగతీసేలా మాటలు అనేవాడు. మనిషిలో ఉన్న మానసిక స్థైర్యాన్ని కరకు మాటలతో, అబద్ధాలతో చివరిచుక్కతో సహా ఎలా తొలగించాలో తెలిసిన ఒకరిద్దరు మానసిక వికలాంగులు అక్కడ ఇన్ ఛార్జ్ లుగా ఉండేవారు... ఆ మహానుభావుడికి తానతందానగా. ఒక సారి జ్వరం వచ్చి సెలవు పెడితే... నన్ను ఇబ్బంది పెట్టారు. సెలవునుంచి వచ్చాక రమేష్ బాబు నన్ను నేను ఉద్యోగం చేసే స్థలంలో కాకుండా... సెక్యూరిటీలో కూర్చోపెట్టాడు. ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో తెలియజేయగానే రామోజీ గారు, అపుడపుడే బాధ్యతలు చేపట్టిన కిరణ్ గారు నాతో చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ఎడిట్ పేజీలో వేశారు. అద్గదీ.... అలా నేను మూర్తి గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ఐక్యరాజ్యసమితి మీద నేనుప్రచురించిన రెండో వ్యాసం నచ్చి, పిలిపించి... 'నువ్వు నా మూడో కొడుకువీ రోజు నుంచి..' అని రామోజీగారు అన్న రోజు కూడా నిద్రపట్టి చావలేదు. అయన అలా ప్రేమగా పలువురిని కొడుకుల్ని చేసుకున్నట్లు ఈ మధ్యన తెలిసింది. అయినా.... అది గొప్పే కదా! అయన అంటే నాకు గౌరవభావం ఇప్పటికీ ఉండడానికి పలు స్వీయ అనుభవాలు కారణం.
అప్పటికే ఉస్మానియా జర్నలిజంలో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చిన ఊపుతో ఇంగ్లిష్ జర్నలిజంలోకి పోవాలని అనుకోవడం మూలంగా 2000 లో ఈనాడు వదిలి బైటికొచ్చి ఏషియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో చేరి తర్వాత 'ది హిందూ' లో చేరడం జరిగింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న రామోజీ గారికి నేను ఏసీజే నుంచి రాగానే ఒక లేఖ రాశాను... 'అయ్యా, ఇప్పుడు నేను మరింత బాగా ఉపయోగపడగలను. మీరు పనిస్తే చేస్తా,' అని. రమేష్ బాబు తదితరుల పుణ్యాన అనుకుంటా నాకు తిరుగు టపా రాలేదు. ఎదురుచూసి నేను 'ది హిందూ' లో చేరాను. అక్కడ పన్నెండేళ్ళు పనిచేసినా ఒక్క ప్రమోషనైనా రాకుండా, చివరకు గ్రాట్యుటీ కూడా రాకుండా చేశారే అనే బాధ ఉన్నా.... 'ఈనాడు' చదవకపోతే రోజు గడవని వారిలో నేనూ ఒకడ్ని. జర్నలిస్టుగా నిలదొక్కుకునేలా పునాది వేసిన 'ఈనాడు' ఒక తీపి గుర్తే.
విచిత్రమేమిటంటే, నన్ను, నాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి అబద్ధాలతో కెరీర్ లు ఖూనీ చేసిన రమేష్ బాబు నిజ స్వరూపం తెలిసి యాజమాన్యం వదిలించుకుంది. అయన తరువాత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరి, పాపం అకాల మరణం పొందారు. వాడో నరరూప రాక్షసుడని జర్నలిస్టులు ముక్తకంఠతో చెప్పే ఆ ఇన్ ఛార్జ్ కూడా పంపబడ్డాడు.
మొత్తంమీద ఇప్పటికీ 'ఈనాడు' ఎడిట్స్ చూసినా.. అయ్యో అనిపిస్తుంది. సరళంగా చెప్పేదాన్ని పలుగురాళ్లతో నలుగుపెట్టి తమదైన శైలిలో చెబుతారు. ఎంత కీలకమైన స్పేస్ అది! ఒక స్టయిల్ ఏర్పడిన తర్వాత మార్చడం కష్టమే కదా!
--ది ఎండ్--