హైదరాబాద్ నగరంలో పొద్దున్నే లేచి బైటికి వెళ్లి... చూసే మనసు ఉండాలి గానీ... వింత అనుభవాలు ఎన్నో ఎదురు అవుతాయి. ఇవ్వాళ ఉదయం...మా వాడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్దామని 5.30 కు లేపితే కలత నిద్రలో లేచి... మగత నిద్రతో కారు బైటికి తీశాను.
కారు వెనక... చేతిలో ప్లాస్టిక్ సంచీతో ఒక వ్యక్తీ నిలబడి ఉన్నారు మసక చీకట్లో. తలకు మంకీ క్యాపు... స్వట్టరు ధరించిన ముదుసలి. అపార్టు మెంటు లోకి ఇంత పొద్దున్నే ఎలా వచ్చారా? అని అనుకున్నాను. బహుశా మా అపార్ట్ మెంట్ లో ఉండే వ్యక్తే అనుకుంటా. లేకపోతే.. అంత ధైర్యంగా ఎలా లోపలి వస్తారు? నన్ను చూసి ఒక క్షణం ఆగి... మళ్ళీ తన పని తాను కానిస్తున్నారాయన. ఇంతకూ ఆయన చేస్తున్న పని... పూలు కోయడం. సర్లే.. మనకెందుకు వచ్చిన గొడవని మా మానాన మేము లాల్ బహదూర్ స్టేడియం కు వెళ్ళాం.
వాళ్ళకేమి రోగమో గానీ... స్టేడియం ఉన్నట్టుండి మూస్తారు. నాకు మండుతుంది... కానీ ఏమి చేస్తాం? మూసుకుని ఇందిరా పార్క్ కు పోనిచ్చాను. అక్కడ పిల్లలు శాండ్ రన్నింగ్ చేస్తారు. వారంలో రెండు మూడు సార్లు అది చేయడం మంచిదని కోచ్ చెబుతారు. ఇందిరా పార్క్ లో పూలు, యోగాసనాలు చేసేవాళ్ళు, నాకన్నా ఉత్సాహంగా ఉల్లాసంగా నడిచే వృద్ధులు...మంచిగా అనిపిస్తారు. కాకపొతే... ఇందిరా పార్కు లోకి పోగానే నా బీ పీ నాకు తెలియకుండానే పెరుగుతుంది. కారణం.. సుసర్ల నగేష్. మొన్నీ మధ్యన ది హిందూ నుంచి దాదాపు గెంటివేతకు గురైన నగేష్.. వైద్యురాలైన భార్యతో కలిసి వాకింగ్ కు వస్తారు. 2007 డిసెంబర్ 25 న నా మీద అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అంటే నాకు పరమ చికాకు, అసహ్యం. పొద్దు పొద్దున్నే పూలను, నగేష్ ను ఒకే కళ్ళతో చూడడం ప్రారబ్ధం. నగేష్ ఎక్కడ కనిపిస్తారా? అని సంశయపడ్డాను...ఈ రోజుకు ఆయన రాకపోవడమో, ఆలస్యం కావడమో అయి నాకు ఆయన కనిపించలేదు.
సరే... మా వాడి బాగు మోస్తుండగా... గతంలో నేను ఈనాడు లో పనిచేసినప్పుడు ఉన్న ఒక సీనియర్ కనిపించారు. బాగానే పలకరించాడు. ఆ పక్కనున్న ఒక లాయర్ కు నన్ను పరిచయం చేస్తూ... "మీ సూరావజ్జుల రాము. మీ ఖమ్మం జిల్లా వాడే," అని చెప్పాడు. ఇదేమి పరిచయమో నాకు అర్థం కాలేదు. సరే కొద్దిగా మాటా మంచీ అయ్యాక.. 'ఏమి చేస్తున్నారు?' అని అడిగాను. ఎక్కడా పనిచేయకుండా... సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాననీ, అన్ని రకాల అభివృద్ధి నమూనాలను... విడవకుండా విమర్శిస్తానని... వారు చెప్పారు. ఇంత పెద్ద విషయాలు మనకెందుకని... వారి నించి సెలవు తీసుకుని... నేను ఒక మూలాన వాకింగ్ చేసాను.
కొద్ది సేపు ఆగిన తర్వాత... ఒంటి నిండా చెమటతో ఫిదెల్ వచ్చాడు. ఎందుకో తనకు నా మనసులో మాట చెప్పాలని అనిపించింది. "నాన్నా...ఈ పార్కు కు వస్తే... నా మనసు కకావికలం అవుతుంది," అని ఆరంభించాను. ఎందుకని తను ఆసక్తిగా అడిగితే... జర్నలిస్టుగా నేను ఎంత స్వచ్ఛంగా, నీతిగా బతికిందీ... అప్పటి నా బాస్ హోదాలో నగేష్ నా మీద చేసిన అవినీతి ఆరోపణలు.... వాటి వల్ల నేను పడిన మానసిక వేదన...'ది హిందూ' వదలడం ఉత్తమమని నేను అనుకోవడం... చివరకు అవమానకర పరిణామాల మధ్య నగేష్ ఆ పత్రిక నుంచి వెళ్లి పోవడం... వివరంగా చెప్పాను. కొద్దిగా మనసు తేలికై పార్కు నుంచి బైటికి వస్తుండగా..."ఇలాంటి వాళ్ళ గురించి బ్లాగులో రాయకు డాడీ.." అని 14 ఏళ్ళ కొడుకు హితవు చెప్పాడు.
తర్వాత... ఈ రోజు ఫిదెల్ కు ఇరానీ చాయ్ తాగించాలని అనిపించింది. నా ప్రతిపాదనకు తనూ ఉత్సాహం చూపించాడు. ఒకటి నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉంటుంది కానీ.. నిమ్స్ దగ్గర ఉన్న రెడ్ రోజ్ కు తీసుకు పోయాను. అక్కడ బైట కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడ ప్లేట్ల లో లుక్మీ చూస్తే ప్రాణం లేచివచ్చింది. 1992 లో నేను 'ఈనాడు' లో పనిచేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో ఈ లుక్మీ లేదా బ్రెడ్ టీ తో కలిపి తిని బ్రేక్ ఫాస్ట్ అయ్యిందని అనిపించే వాళ్ళం. అది ఖర్చు తక్కువ తిండి. మా వాడి కోసం లుక్మీ, టై బిస్కెట్, ఇరానీ చాయ్ ఆర్డర్ ఇచ్చాను. తను వాటిని ఆస్వాదిస్తే... మజా అనిపించింది. పూరీ ప్రియుడైన తనకు లుక్మీ నచ్చడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక...ఊదా రంగు పూలు కనిపించాయి. నేను వాటిని చూస్తూ ఉండగానే.... గోడ మీద నుంచి వాటిని కోస్తూ.. ఒక పండు ముదుసలి కనిపించారు. ఆయన ఒక పకడ్బందీ కవర్ లో ఆ వీధిలో రక రకాల పూలు కోస్తున్నారు. అది దొంగతనం అనలేం గానీ... పెద్ద మనుషులు వాకింగ్ చేస్తూ... పూలు లేపెయ్యడం... సరదాగా అనిపించింది. అది వారిని ఆనంద పరిచే అంశాల్లో ఒకటి. ప్రకృతి మనలను వివిధ రకాల రంగు రంగుల పూలతో, వివిధ రకాలుగా ఆనందింప చేస్తుంది కదా!