నిజం మాట్లాడాలంటే...మన ఆంధ్ర దేశంలో జర్నలిజం ఒక వృత్తిగా స్థిరపడలేదు. ఇక్కడ ప్రొఫెషనలిజం కొరవడింది. ఇది రొడ్డకొట్టుడు జర్నలిజం. మన యజమాని కి రాజకీయ తీట ఉన్నా, ఏదైనా పదవి మీద ఆశ ఉన్నా, వ్యాపార ప్రయోజనాలు ఉన్నా....ఆయన అభిరుచికి అనుగుణంగా...అయన అవసరం తీరే విధంగా మన వార్తా సేకరణను, రాత తీరును మార్చుకుంటాం. స్టోరీ యాంగిల్ మొత్తం యజమాని అభిరుచిని బట్టి మారిపోతుంది. ఇది తప్పని జర్నలిస్టులు చెప్పలేని పరిస్థితి. యూనియన్ నేతలు వేరే పనుల్లో ఉండబట్టి...ఆదుకునే వాళ్ళు లేక నిజమైన జర్నలిస్టులు కుళ్ళి చస్తున్నారు. క్రమేణా తెలుగు జర్నలిజం లో తాలు సరుకు వచ్చి చేరుతున్నది.
తెలివిగల ఈ యజమానులు పథకం ప్రకారం ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చారు. యాజమాన్యాలు ఎప్పుడూ 'మన పాలసీ' ఏమిటో డైరెక్ట్ గా చెప్పవు. మనసు అర్థంచేసుకుని మెలిగే జర్నలిస్టులకు అర్హతతో నిమిత్తం లేకుండా ఉన్నత పదవులు ఇచ్చి పనులు చేయించుకుంటారు. తాము నిజంగా ప్రతిభావంతులమని భ్రమించి ఆ జర్నలిస్టులు యజమానికి సేవకుల్లా మారతారు....వృత్తి నిబద్ధత ను పక్కనపెట్టి. లేకపోతే...చదువు సంస్కారం లేని వాళ్ళు ఎడిటర్లు, సీ.ఈ.ఓ.లు కావడం ఏమిటండీ?
ఇప్పుడు 'సాక్షి' లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టును నేనీ మధ్యన అదే ఛానెల్ లో చూశాను. బాగా ఒళ్ళు చేశాడు. సాక్షి రిపోర్టర్ పై కేసుకు వ్యతిరేకంగా తను స్పీచ్ ఇస్తున్నాడు. నేను ది హిందూ లో ఉన్నప్పుడు ఒక తెలుగు పత్రికలో పనిచేసే వాడు. కులాన్ని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని కాబోలు ఇప్పుడు హైదరాబాద్ సాక్షికి ఒక పెద్ద పదవిలో వచ్చాడు. నల్గొండ లో ఆ అబ్బాయి ది డామినేంట్ కాస్ట్. లోకల్ గా వ్యాపార ప్రకటనలు సేకరించే పని కూడా తను చేసే వాడు...కులం సాయంతో. నాకు తెలియక తన బండి మీద ఒకటి రెండు సార్లు ఎక్కి కలెక్టరేట్ కు పోయాను. ఒక సీనియర్ అధికారి నన్ను పిలిచి ఆ జర్నలిస్టు గురించి చెబితే అసలు విషయం తెలిసింది. తన కాపీ గానీ, మాట్లాడే విధానం గానీ జర్నలిజానికి అతకనివి.
ఇలాంటి జర్నలిస్టులను కాస్ట్ లాయల్టీ ఆధారంగా నియమిస్తే...జర్నలిజానికి మచ్చ వస్తుంది. ఆత్మస్థైర్యం, సత్యం పట్ల విశ్వాసం, వృత్తి నిబద్ధత లేని ఈ తరహా జర్నలిస్టులు...లోకల్ గా తమ కులస్థులైన రాజకీయ నేతలను, అధికారులను, పోలీసులను, గూండాలను, కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకుని వృత్తిని బ్రష్టు పట్టిస్తారు. ఇది నా కళ్ళ ముందు నిజంగా జరిగింది. ఈ జర్నలిస్టు అందరు సొంత కుల ఎం.ఎల్.ఏ.లను బుట్టలో వేసుకునే వాడు. ఒక యువ ఎం.ఎల్.ఏ.వీడు చెప్పినట్లు చేసేవాడు. ఆ జర్నలిస్టు పత్రిక యజమాని గుడ్ బుక్స్ లో ఉండే లా చూసుకునే వారు ఈ రింగులోని వివిధ రంగాల వారు. యజమానులకు కావలసింది వ్యాపార ప్రకటనలు. రిపోర్టర్ టార్గెట్ ను ఈ రింగు పూనుకుని పూర్తి చేసేది. దానివల్ల ఈ రిపోర్టర్ కు హైదరాబాద్ లో మంచి పేరు వుండేది. మంచి వార్తలు రాస్తాడన్న పేరు కాదు...పత్రికకు కావలసిన ప్రకటనలు ఇప్పిస్తాడన్న పేరు. ఇలాంటి తుక్కుగాళ్ళకు అండగా...స్వ కులానికి చెందిన జర్నలిస్టు నేతలు! ఇది ఈ జర్నలిస్టు తప్పు కాదు. ఏదో బతకాలి కాబట్టి, జేబులు కొట్టడం నేరం కాబట్టి జర్నలిజం లో చేరాడు. ఎంగిలి మెతుకులతో పెళ్ళాం బిడ్డలను పోషిస్తున్నామని, అది తగని పని అని ఇలాంటి వాళ్ళు అనుకోలేరు.
జర్నలిజాన్ని బాధ్యతా యుతమైన వృత్తిగా తీర్చి దిద్దడంలో యాజమాన్యాల అసమర్ధత వల్ల ఇది జరుగుతున్నది.
ఈ పధ్ధతి వల్ల సమాజానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇక్కడ నీతికి విలువ లేదు. నీతి గురించి మాట్లాడే వారికి ప్రమోషన్లు రావు. బాకా బాబులు, కాకా రాయుళ్ళ స్వర్ణ యుగమిది. మొన్నీ మధ్యన టీ.వీ.-నైన్ జర్నలిస్టు ఒకరు ఆవేదనతో నాకు ఫోన్ చేశారు. కంట్రిబ్యూటర్లు బాగా సంపాదిస్తున్నారని...దీన్ని ఆపలేమా? అని ఆమె ఆవేదన చెందారు. యాజమాన్యాలే ప్రభుత్వాల నుంచి భూముల రూపంలో వేల కోట్లు సంపాదిస్తుంటే....కింది స్థాయి ఉద్యోగులు సత్య హరిచంద్రుల్లా ఉంటారా? వారూ...సందట్లో సడేమియాలాగా వ్యాపారం చేస్తారు. కొందరు మంచి జర్నలిస్టులు ఉన్నా...వారి సంఖ్య స్వల్పం. అలాంటి వారు కంపు భరించలేక వేరే వృత్తి వ్యాపకాలకు మరలుతున్నారు. తెలుగు జర్నలిజం ప్రమాదంలో ఉంది. తెల్ల దొరలకు వ్యతిరేకంగా భారత ప్రజలను చైతన్య పరచిన బాధ్యతాయుత మీడియా ఇప్పుడు అదే ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నది.
మీడియా నియంత్రణకు ప్రభుత్వం చట్టం తెచ్చే పనిలో ఉంది. కానీ...జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆ పని కానివ్వరు. అందుకే..ప్రభుత్వం జర్నలిస్టుల నియామకానికి గట్టి నిబంధనలు తయారు చెయ్యాలి. ప్రతి అమాంబాపతు గాడు జర్నలిస్టు కాకుండా చర్యలు తీసుకోవాలి. మీడియా హౌజులు నడిపే జర్నలిజం స్కూల్స్ ను రద్దు చేయాలి, యూనివెర్సిటీ లలో జర్నలిజం విద్యను మెరుగు పరిచి...నైతిక జర్నలిజం పాఠాలు నూరిపోసి ఆ డిగ్రీ ల ఆధారంగా నియామకాలు ఉండాలని నిబంధన విధించాలి. లేకపోతే...ప్రజాభిప్రాయ రూపకల్పనకు ముఖ్య సాధనమైన మీడియా మరింత నీచానికి దిగజారి ప్రజాస్వామ్యాన్ని మరింత బ్రష్టు పట్టిస్తుంది.