Saturday, March 2, 2019

మితిమీరిన రోషం...కుతితీరిన తెలకపల్లి ద్వేషం!.

'వామపక్షం... ఒక నమ్మకం' అన్న శీర్షికతో 'చెవిలో చిన్నమాట' అన్న కాలమ్ లో ఆంధ్రజ్యోతి లో ఫిబ్రవరి 24 న, ఆదివారం, కృ.తి. (కృష్ణమూర్తి తిగుళ్ల అనుకుంటా) రాసిన వ్యాసం కమ్యూనిస్టుల చెవి మెలేసి, చెంప పగలగొట్టి, గూబ గుయ్యుమనిపించేట్లు కఠినంగా ఉంది. అభిప్రాయాలను వెల్లడించే, వాదించే కాలమ్ అయినా... కమ్యూనిస్టులకు అది మింగుడు పడడం కష్టమే. అందుకే దానికి ముఖాముఖి ఖండనగా  ప్రముఖ ఎడిటర్, రాజకీయ విశ్లేషణా నిపుణుడు తెలకపల్లి రవి గారు 'నవ తెలంగాణా' లో ఒక స్పందన ప్రచురించారు.  దానికి 'కుతి తీరని ద్వేషం... మతిమాలిన హాస్యం!' అని శీర్షిక పెట్టారు.   

నిజానికి కమ్యూనిజం ఒక అద్భుతమైన సిద్ధాంతం. కార్మిక, కర్షక, బడుగు బలహీన, రైతు కూలీల కోసం పోరాటం, సమసమాజం కోసం ఆరాటం దానికి ఆలంబనలు.... సూక్ష్మంగా చెప్పుకోవాలంటే.   ప్రపంచ చరిత్రలో, అంత దాకా ఎందుకు... తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం లో, కమ్యూనిస్టుల పాత్ర మహోన్నతమైనది. ఈ సిద్దాంతం ఎందరినో ఉత్తేజ పరిచి... పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసకాండను, ధనిక బూర్జువా స్వామ్యపు నరహంతక దౌర్జన్యకాండలను, పెట్టుబడి దారుల పంచన రాజ్య వ్యవస్థ సాగించే విశృంఖల దమన నీతిని ఎదిరించి... బడుగుల కోసం, సామాన్యుడి కోసం పోరాడేలా చేసింది. కమ్యూనిజం అనేదే లేకపోతే... యావత్ ప్రపంచంలో సామాజిక ఆర్థిక సమతుల్యం దెబ్బతిని హింస పెరిగి యావత్ మానవజాతి కొన్ని శతాబ్దాలు వెనక్కు వెళ్ళేది. క్యూబా వంటి దేశాలు కమ్యూనిజం ఛత్రఛాయలో గణనీయమైన పురోగతినే సాధించాయి. అయితే... మార్కెట్ శక్తుల మహోధృత హోరులో కొట్టుకుపోయే తరం కమ్యూనిజానికి ఛీకొడతారన్నది, కొన్నేళ్ల తర్వాత ఈ వ్యవస్థపై ఈసడింపు, ఏవగింపు పెరిగి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పవనాలు వీస్తాయన్నది సిద్ధాంతంలో భాగమైన అవగాహన.    

అయితే... ఎలక్ట్రోరల్ పాలిటిక్స్  విషవలయంలో, కులం కంపులో,  ఇతరేతర జాడ్యాల రొచ్చులో పడి  తెలుగు నేల మీద కమ్యూనిస్టులు అభాసుపాలయ్యారన్నది అక్షరసత్యం. బెంగాల్, కేరళలల్లో ఎర్ర ప్రభుత్వాలు తెలుగు కామ్రేడ్ల ఛాతీ ఉబ్బేట్లు చేశాయి. బెంగాల్ లో చావుదెబ్బ తిన్నదరిమిలా సమాంతరంగా మనదగ్గర కామ్రేడ్స్ ప్రభ తగ్గడం మొదలయ్యింది. కమ్యూనిజం సిద్ధాంతాల కోసం జీవితాలను, ఆస్థులను త్యాగం చేసిన ఎందరో మహానుభావుల వారసులు కూడా మార్కెట్ శక్తుల సుడిలో చిక్కి, సంపద సృష్టి కి పిచ్చిపిచ్చి మార్గాలు ఎంచుకుంటూ  మంచి సిద్ధాంతాన్ని పలచన చేశారు. చట్టసభల్లో నాలుగైదు సీట్ల కోసం ఒక సారి ఒక పార్టీ తో, మరొక సారి మరో పార్టీతో అంటకాగి, జనాల్లో ఓటు కు పెరిగిన రేటు డిమాండ్ తట్టుకోలేక... ఇప్పుడు కమ్యూనిస్టులు చిక్కిశల్యమయ్యారు. ఇక్కడ టీ ఆర్ ఎస్ హవా కు ఎర్ర చొక్కాలు గులాబీ రూపు దాల్చాయి. 

ఈ నేపథ్యంలో అనుకుంటా... కృ.తి. కమ్యూనిస్టులను కడిగేసాడు. శబరిమల పరిణామాలు, పుల్వామా దాడి పై కామ్రేడ్స్ తీరు, సీపీఎమ్ లో వర్గపోరు, మన దగ్గర 10 టీవీ విషయంలో కామ్రేడ్స్ ధోరణి, బత్తిన సోదరుల చేప మందుపై వారి శైలి... వంటి కీలక అంశాలను అందులో ప్రస్తావించి... లెఫ్టిస్టుల గందరగోళాన్ని ఒక జోక్ రూపంలో ఏకేసి ముగించారు. 
దీనిపై తెలకపల్లి రవి గారి లాంటి పుస్తక రచయిత స్పందన తార్కికంగా ఉంటే బాగుండేది. ఆయన భాష మొరటుగా ఉండడం, అక్కసు అక్షరాల రూపంలో బైట పడడం అలా ఉంచితే... 10 టీవీ గురించి ఆయన తప్పులో కాలేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. 

"టీవీ పెట్టింది... పాలక వర్గాల కుటిల రాజకీయాలు, కార్పొరేట్ దోపిళ్లపై పోరాడడానికి, ఈ పని ఐదేళ్ల పాటు బాగానే సాగింది. ఎవ్వరికీ తాకట్టు పడి తప్పుడు కథనాలు ఇవ్వలేదు," అని రవి గారు శలవిచ్చారు. రిపోర్టర్స్ కు యాడ్స్ బాధ్యతలు ఇవ్వడం తాకట్టు పడడం కాదా?  ఏ కార్పొరేట్ దోపిడీపై మీరు పోరాడారు సారూ? 

వేరే విషయాలు ఎందుకు గానీ, వందల మంది జర్నలిస్టులను ఈ కార్పొరేట్ మీడియా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మీ ఛానెల్ లో, పేపర్లో ఎన్ని వార్తలు ఇచ్చారు స్వామీ? పైగా, కాస్ట్ కటింగ్ పేరిట మీరూ, జర్నలిజం ఓనమాలు తెలియని వేణుగోపాల్ రావు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించి వీధులపాలు చేశారు? 
పదాల పటాటోపంతో ఇష్టమొచ్చినట్లు చెలరేగడం రవి గారి లాంటి  విజ్ఞులకు తగదు. 

(Note: A piece in muchhata.com prompted us to write this since we missed the development.) 

Friday, March 1, 2019

మీడియా మానియా ను ఉతికి ఆరేసిన అరుంధతీ రాయ్

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కగానే...శత్రుదేశం చేతిలో బందీగా ఉన్న ఆయన భద్రతకు భంగం వాటిల్లే కథనాలు ప్రసారం చేయడానికి వీల్లేదని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలవద్దని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించి ఉంటే ఎలా ఉండేది? ఇట్లా అని ఒక ప్రకటన చేసి, టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ఫోరమ్స్ దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అని చెక్ చేసి ఉంటే ఎలా ఉండేది?
Photo courtesy: The Hindu 

వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు దెబ్బతగిలిందని ఛానెల్స్, నెటిజన్స్ గగ్గోలు పెట్టేవారా? లేకపోతే... నిజమేకదా... అని అంతా సంయమనం పాటించే వారా? ఏది ఏమైనా... జర్నలిస్టులను, జనాలను క్రమశిక్షణలో పెట్టేందుకు, అత్యంత కీలక సమయాల్లో వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  అందివచ్చిన ఒక మంచి అవకాశం కోల్పోయినట్లు అయ్యింది. ఒక పక్కా కమ్యూనికేషన్ వ్యూహం తో ఈ పనిచేస్తే మీడియాలో మహాద్విగ్న ఉన్మత్త పెను పోకడను కొద్దిగానైనా కట్టడి చేసినట్లు అయ్యేదని మేము భావిస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి కావలసింది కూడా... ఈ రకమైన హడావుడే, వచ్చే ఎన్నికల దృష్ట్యా అని సీనియర్ ఎడిటర్లు, రచయితలూ పలువురు భావిస్తున్నారు.

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ రోజు హఫింగ్టన్ పోస్ట్ లో రాసిన ఒక వ్యాసంలో...రానున్నది కొట్టుకుచచ్చే, తలోవైపు లాగే అస్థిర సంకీర్ణ ప్రభుత్వమైనా పర్వాలేదు... కానీ... బాలాకోట్ మీద దాడితో కాశ్మీర్ ను అంతర్జాతీయ అంశం గా చేసిన ఈ మోడీ ప్రభుత్వం పోవాల్సిందే  గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసంలో ఆమె మీడియాను కుమ్మేసారు.

పుల్వామా దాడి తర్వాత మిన్నకున్న మోడీ బాలాకోట్ మీద బాంబింగ్ తర్వాత...అర్జంటుగా టీవీ తెరపై ప్రత్యక్షమై... తానే స్వయంగా యుద్ధ విమానాలు నడుపుతూ వెళ్లి స్వహస్తాలతో బాంబులు వేసినట్లు బిల్డప్ ఇవ్వగా, ఆ వెంటనే... దాదాపు నాలుగొందల 24/7 ఛానెల్స్ (అందులో చాలా వరకు నిస్సిగ్గుగా ప్రభుత్వ బాకా ఊదేవి) ఆయన (మోడీ) సామర్ద్య ప్రదర్శనను తమ సొంత 'ఇన్పుట్స్' పేరుతో భూతద్దంలో చూపాయని అరుంధతీ రాయ్ అభిప్రాయపడ్డారు.
      
"పాత వీడియోలు, అభూతకల్పనలతో, గొంతు చించుకుంటూ వాళ్ళ యాంకర్స్ ఫ్రంట్ లైన్ కమెండో ల మాదిరిగా పోజు కొడుతూ... ఉన్మత్తమైన, విజయోన్మాద జాతీయవాదాన్ని ప్రదర్శించారు. ఈ వైమానిక దాడుల్లో జైష్-ఏ-మొహమ్మద్ 'టెర్రర్ కర్మాగారం' ధ్వంసం అయ్యిందని, మూడు వందలకు పైగా 'తీవ్రవాదులు' హతమయ్యారని వాళ్ళు చెప్పుకొచ్చారు. చాలా పద్ధతైన జాతీయ వార్తాపత్రికలు హాస్యాస్పదమైన, జుగుప్సాకరమైన శీర్షికలతో వారిని అనుసరించాయి," అని ఆమె రాశారు. ఈ దాడిలో చెట్లు, గుట్టలు ధ్వంసం అయ్యాయని, ఒక గ్రామస్థుడికి మాత్రం గాయాలు అయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ, దాదాపుగా అలాంటి వార్తనే అసోసియేట్ ప్రెస్ అనే మరో వార్తా సంస్థ నివేదించినా  దాన్ని ఈ మీడియా పట్టించుకోలేదని ఆమె చెప్పారు. 

భారతీయ మీడియాకు పాకిస్థాన్ 'థాంక్స్'

అది.... పాకిస్థాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. వాతావరణం గంభీరంగా ఉంది. భారతీయ వింగ్ కమాండర్ ను పాక్ మిలిటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికే భారత్, పాక్ సరిహద్దులో యుధ్ధ మేఘాలు కమ్ముకున్నందున వాతావరణం చాలా వేడిగా ఉంది. పైగా, పాక్ భూభాగంలో కూలిపోయిన విమానం నుంచి పారాచూట్ సహాయంతో ప్రాణాలతో బయటపడిన వింగ్ కమాండర్... తన దగ్గర రహస్యాలు శత్రు దేశం చేతికి చిక్కకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు మింగేసి... కొన్ని దగ్గర్లోని నీళ్లలో నాన్చేచి పిప్పి పిప్పి చేశారు. 
ఇంటరాగేషన్ కు రంగం సిద్ధమయ్యింది. 

పాక్  ఆర్మీ అధికారి: నీ పేరేమిటి?
భారత వింగ్ కమాండర్: అభినందన్
పాక్ ఆర్మీ అధికారి: మీది ఏ ప్రాంతం?
భారత వింగ్ కమాండర్: డౌన్ సౌత్

పాక్ ఆర్మీ అధికారి: అంటే ఎక్కడ?  మీ కుటుంబ వివరాలు చెప్పండి?
భారత వింగ్ కమాండర్: నేను ఆ వివరాలు అందించలేను.
(ఇంతలో ఒక సైనిక అధికారి పక్క రూంలోకి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు)

పాక్ ఆర్మీ అధికారి: మిస్టర్ వర్ధమాన్ అభినందన్. మీది తమిళనాడు. మీ తాత, నాన్న, భార్య అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. మీ పితాజీ రిటైర్డ్ ఎయిర్ మార్షల్.... హ్హ హ్హ హ్హా.... 
(పేర్లతో సహా తమ వాళ్ళ గురించి పాక్ అధికారి చెప్పేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.)    పాక్  ఆర్మీ అధికారి: మీరు నడుపుతున్న విమానం ఏమిటి?  
భారత వింగ్ కమాండర్: సారీ,  ఐ కెన్ నాట్ టెల్ యూ... ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు టెల్ యు. 
 (ఇంతలోఇందాక  పక్క రూంలోకి వెళ్లి వచ్చిన ఆయనే మరో సారి ఇప్పుడే వస్తానని బైటికి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు)
పాక్  ఆర్మీ అధికారి: హ్హ హ్హ హ్హా.... మిగ్ 21 బైసన్ కదా... హై నా... హ్హ హ్హ హ్హా.... 
(కాలిపోయినకాఫ్టర్ గురించి తాను చెప్పకపోయినా వాళ్ళకు తెలిసేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.)
ఇట్లా ఆ పాకిస్థాన్ ఆర్మీ అధికారి అడగడం, భారతీయ వింగ్ కమాండర్ ప్రాణం పోయినా చెప్పానని మొండికేయడం, పక్క రూంలోకి వెళ్లి వస్తున్న అధికారి అన్ని వివరాలతో రావడం, ఇంటరాగేట్ చేస్తున్న అధికారి...  హ్హా హ్హ హ్హా అని విజయోత్సాహంతో నవ్వుతూ వివరాలు వెల్లడించడం తేలిగ్గా జరిగిపోయాయి. 
ఇంతకూ పక్కరూం లో ఏముందో తెలుసా?
పది భారతీయ టెలివిజన్ ఛానెల్స్ ఆన్ చేసి ఉన్నాయి. అన్నీ లైవ్ లో పోటాపోటీగా అభినందన్ వివరాలు పొల్లుపోకుండా చెబుతున్నాయ్!!!
మేరా మీడియా మహాన్.....సారీ అభినందన్.