Monday, December 22, 2014

పారి: రూరల్ జర్నలిజానికి జీవం పోసిన పాలగుమ్మి సాయినాథ్


ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభాన్నంటూ రోజూ గొప్పలు చెబుతూ... రాయితీలు పొందుతూ... నిస్సిగ్గుగా... పచ్చిగా...  మేథోవ్యభిచారానికి పాల్పడుతూ... ధనార్జనే ధ్యేయంగా... మార్కెట్ శక్తుల మోచేతి నీళ్ళు తాగుతూ...విలువల్లేని సమాజం-నపుంసక రాజకీయ వ్యవస్థ వర్ధిల్లడానికి సహకరిస్తున్న సమకాలీన మీడియాకు  ఒక ప్రత్యామ్నాయం వచ్చింది ఇన్నాళ్ళకు. 'ది హిందూ' రూరల్ అఫైర్స్ మాజీ ఎడిటర్, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్... భారత దేశానికి పట్టుకొమ్మ అయిన గ్రామీణ ప్రాంత వార్తలు, కథనాలు, విశ్లేషణలకు వేదికగా నిలిచే ఒక  ప్రయత్నం ఆరంభించారు. దానిపేరే... పీపుల్స్ ఆర్ఖైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా... పారి. 
మీరు పాశ్చాత్య బురద వరదలో కొట్టుకుపోనివారైతే....భారతీయ  గ్రామీణ సమాజంతో మానసిక సంబంధం కలవారైతే... పచ్చని పొలాల... పంచె వన్నెల అమాయకపు గ్రామీణ భారతం సర్వనాశనం అవుతున్న తీరు చూసి బాధపడేవారైతే... ఈ పోర్టల్ http://www.ruralindiaonline.org/ తప్పక దర్శించండి. మీరు కూడా మీ వంతుగా కదీనికి థనాలు అందించవచ్చు. ఇదొక అపూర్వ అవకాశం. ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ... సాయినాథ్ గ్రామీణ భారతం గురించి ఇలా రాశారు. 
Rural India is in many ways the most diverse part of the planet. Its 833 million people include distinct societies speaking well over 700 languages, some of them thousands of years old. The People’s Linguistic Survey of India tells us the country as a whole speaks some 780 languages and uses 86 different scripts. But in terms of provision for schooling up to the 7th standard, just four per cent of those 780 are covered. 

ఈ నేపథ్యంలో... గ్రామీణ ప్రాంతాల గురించి పెద్దగా పట్టని మీడియాకు నిజమైన ప్రత్యామ్నాయంగా "కౌంటర్ మీడియా ట్రస్టు" ఈ సైట్ ను నిర్వహిస్తుంది. ఇందులో ఈ ఈ విభాగాల కింద అద్భుతమైన కథనాలు చదవచ్చు. 
THINGS WE DO
TONGUES
GETTING HERE
WE ARETHINGS WE MAKE
FOOTSOLDIERS OF FREEDOM
FARM CRISIS
MUSAFIR.   వీటితో పాటు గ్రామీణ ప్రజలు, పర్యావరణం, వృత్తులను ప్రతిబింబించే ఛాయాచిత్రాల కోసం PHOTOZONE  కూడా ఏర్పాటు చేసారు. ఈ పోర్టల్... విధాన రూపకర్తలకు ఒక కరదీపక కావాలని ఆశిస్తూ... ఈ బ్లాగ్ బృందం సాయినాథ్ గారి అద్భుత చొరవకు, కృషికి సలామ్ చేస్తోంది.

Sunday, December 21, 2014

'ఎక్స్ ప్రెస్ న్యూస్' కు దినేష్...'ది హన్స్' కు భాస్కర్

టీవీ-9 ఛానెల్ లో చాలాకాలం పనిచేసిన దినేష్ ఆకుల ఎక్స్ ప్రెస్ న్యూస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ మధ్యన చేరారు. అదేవిధంగా, మెట్రో ఇండియా ఇంగ్లీష్ పత్రిక లో న్యూస్ ఎడిటర్ గా ఉన్నతాటికొండ భాస్కర్ రావు తాను గతంలో పనిచేసిన 'ది హన్స్ ఇండియా' కు వెళ్ళిపోయారు. 
జర్నలిస్టుగా మాంచి ప్రొఫైల్ ఉన్న దినేష్ టీవీ-9 ఎక్సిక్యూటివ్ ఎడిటర్ పదవి నుంచి కొత్తదైన ఎక్స్ ప్రెస్ న్యూస్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్) గా చేరి వారి వెబ్ సైట్ల నిర్వహణ బాధ్యత కూడా చూస్తున్నారు. ఈ నియామకం నేపథ్యంలో అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్న నేమాని భాస్కర్ పరిస్థితి ఏమిటో తెలియరాలేదు. ఆయన.... మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చే అవకాశం లేకపోలేదట. 

ఇక... రామచంద్ర మూర్తి అండ్ నాయర్ ల నేతృత్వంలో 'హన్స్ ఇండియా' లో పనిచేసిన భాస్కర్ గారు అప్పరసు శ్రీనివాసరావు (ఎక్సి క్యూటివ్ ఎడిటర్) గారి ఆధ్వర్యంలోని 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికలో ఆరంభం నుంచి పనిచేసారు. హన్స్ డిజైన్ దారుణంగా ఉన్నదని భావిస్తున్న దాని ఎడిటర్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్... భాస్కర్ పునరాగమనం లో కీలక పాత్ర పోషించారట. అయితే... మెట్రో త్రిమూర్తులుగా పేరుపొందిన ఏఎస్ రావ్, ఎస్ ఆర్కే, భాస్కర్ లలో చివరి ఇద్దరూ తనను, ఆ పత్రిక ను వీడి వెళ్ళిపోవడం తో రావు గారు ఒంటరి అయ్యారు. అ పత్రికలో పనిచేస్తున్న ఉత్తరా వర్మ గారికి యజమాని సీ ఎల్ రాజం పదోన్నతి కల్పించి న్యూస్ ఎడిటర్ చేశారు.  

ఎక్స్ ప్రెస్ న్యూస్ లో ఇంతకాలం పనిచేసిన సీనియర్ జర్నలిస్టు పత్రి వాసుదేవన్ కూడా మెట్రో ఇండియా లో కార్పోరేట్ అఫైర్స్ రిపోర్టర్ గా చెరినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... ఎన్ టీవీ నుంచి వెళ్లి 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా చేరిన వడ్డే వెంకటేశ్వర రావు గారు సీ పీ ఎం నేత తమ్మినేని వీరభద్రం గారి ఆశీస్సులతో అక్కడ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. 

Tuesday, December 16, 2014

ఓరి దేవుడా .... ఇదేమి అఘాయిత్యం రా?

పొరుగునున్న పాకిస్థాన్ లోని పెషావర్ లో మిలిటరీ స్కూల్ లో చొరబడిన తాలిబాన్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధంలో దాదాపు వంద మంది విద్యార్థులు మరణించడం, పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడడం తీవ్రంగా కలచివేస్తోంది. ఇంతకన్నా పైశాచిక చర్య మరొకటి ఉండదు. 

మత పిచ్చి, రాజకీయ వెర్ర్రి ఉంటే ఉండవచ్చు గాక! దీన్నంతా చిన్నారి భావి పౌరుల మీద చూపించడం దుర్మార్గం, హేయం. వీళ్ళకు ఇదేమి పోయే కాలం?

"మేము అప్పుడు పరీక్ష గదిలో ఉన్నాం. అప్పుడే ఉన్నట్టుండి ఫైరింగ్ మొదలయ్యింది. నిశ్శబ్దంగా నేల మీద పడుకోండని టీచర్లు చెప్పారు. ఒక గంట పాటు బిక్కుబిక్కున అలాగే ఉన్నాం. సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించింది,"  అని ఒక విద్యార్థి చెప్పారు.  ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి.... తర్వాత ఏరికోరి ఎంపిక చేసిన చిన్నారులను ఈ నికృస్టులు కాల్చి చంపారట. చాలా మంది పిల్లలను బందీలుగా చేసుకున్నారట. 
"మా ఆత్మాహుతి దళం స్కూల్లోకి వెళ్ళింది. పిల్లలకు హాని చేయవద్దని, సైనికులను లక్ష్యంగా చేసుకోండని ఆదేశాలు ఇచ్చాం. ఉత్తర వజీరిస్థాన్ లో సైనిక చర్యకు ప్రతీకారంగా ఈ దాడి చేశాం," అని తాలిబాన్ ప్రతినిధి ఒకడు ప్రకటించాడు. 
దేశాల మధ్య విద్వేషాలను వదిలి, ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అన్ని దేశాల అధినేతలు ఈ మతిలేని తీవ్రవాదాన్ని ఖండించి పాకిస్తాన్ కు అండగా ఉండాల్సిన తరుణమిది. 

Monday, December 15, 2014

వామన రావు కు వై.రా. బై....బై

తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న వై.రాజశేఖర్ (వై.రా.) హెచ్ఎం-టీవీ వీడారు. హైదరాబాద్ మీడియా హౌస్ మానేజింగ్ డైరెక్టర్ పదవికి ఈ రోజు (డిసెంబర్ 15, 2014) న వదిలేసారు. "ఇక్కడ ట్యూన్ కాలేకపోయాను. ఇవ్వాళే ఇక్కడ ఆఖరి రోజు," అని హెడ్స్ సమావేశంలో ఈ రోజు సాయంత్రం వై.రా. ప్రకటించి వెళ్లిపోయారని ఆ సంస్థ వర్గాలు దృవీకరించాయి.  

బంగారు బాతు లాంటి వామన రావు గారి హైదరాబాద్ మీడియా హౌస్ ని రాజశేఖర్ వీడుతున్నట్లు   
ఈ బ్లాగు బృందం నవంబర్ 26, 2014 న "హెచ్ ఎం టీవీ వీడి... మళ్ళీ ఎన్-టీవీ గూటికి రాజశేఖర్" అన్న శీర్షికతో ఒక పోస్టు ప్రచురించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. 

ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని,  డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని రాశాం. ఇందులో ఫస్టు పార్టు నిజమయ్యింది. రెండో పార్టు  కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. "రాజశేఖర్ గారు ఎన్-టీవీ కి వెళ్ళ డం లో అనుమానం ఎవ్వరికీ లేదు. వైట్ అండ్ వాచ్," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. 

Thursday, December 11, 2014

''ది గార్డియన్' ఎడిటర్ పదవి వీడనున్న అలెన్ రస్ బ్రిడ్జర్

అద్భుతమైన, నాణ్యమైన 'ది గార్డియన్' ఆంగ్ల పత్రిక ఎడిటర్-ఇన్-ఛీఫ్ గా రెండు దశాబ్దాల పాటు సేవలందించిన అలెన్ రస్ బ్రిడ్జర్ (Alan Rusbridger) ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వేసవిలో ఈ పదవి నుంచి వైదొలిగి... గార్డియన్ మీడియా గ్రూప్ ను నిర్వహించే 'స్కాట్ ట్రస్ట్' చైర్మన్ గా 2016 లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన అలెన్ 'కేంబ్రిడ్జ్ ఈవ్నింగ్ న్యూస్' లో పనిచేస్తూ 1979 లో గార్డియన్ లో చేరారు.  అది వదిలి 'అబ్సర్వర్' పత్రిక లో టెలివిజన్ విమర్శకుడిగా, ఆ తర్వాత 'లండన్ డైలీ న్యూస్' వాషింగ్టన్ ఎడిటర్ గా కొద్దికాలం పనిచేసారు. కొద్ది కాలంలోనే మళ్ళీ 'గార్డియన్' లో చేరిన ఆయన  1995 లో పీటర్ ప్రెస్టన్ తర్వాత ఎడిటర్ బాధ్యతలు స్వీకరించారు. 'మాంచెస్టర్ గార్డియన్' గా 1821 లో మొదలైన  గార్డియన్ కు అలెన్ పదో సంపాదకుడిగా ఉన్నారు.  

అలెన్ నుంచి తెలుగు మీడియా ఓనర్లు నేర్చుకోవాల్సినవి: 1) పెట్టుబడి పెట్ట చేతనైన ప్రతి వెధవా ఎడిటర్ పదవి ఆక్రమించుకోకుండా నిజమైన జర్నలిస్టులకు ఆ  బాధ్యత ఇస్తే బాగుండదు. 2) సీనియర్ జర్నలిస్టుల ను ఉద్యోగాల నుంచి పీకడం దీర్ఘ కాలంలో నాణ్యత పై ప్రభావం చూపుతుంది. 3) నాణ్యమైన జర్నలిస్టులను నమ్మి  పదవులు ఇస్తే మంచి పేరు (దాంతో పాటు డబ్బు) సంపాదించి పెడతారు. 
పదవీ విరమణ సందర్భంగా తన సహోద్యోగులకు అలెన్ బుధవారం నాడు రాసిన లేఖ ఇది:
Dear all,
This is to let you know that next summer I will be stepping down as editor-in-chief of the Guardian before succeeding Liz Forgan as chair of the Scott Trust when she reaches the end of her term in 2016.
In February I’ll have been editor for 20 years. It’s been quite an extraordinary period in the life of the Guardian. In February 1995 newspaper websites were, if they existed at all, exotic things: we were still four years off launching Guardian Unlimited. Since 1999 we’ve grown to overtake all others to become the most-read serious English language digital newspaper in the world.
When I assumed the editorship in 1995, the senior team at the Guardian was debating whether we should switch to using colour photography in the paper. (There were quite a few distinguished voices believing black and white was the proper métier for news.) Today we are doing our journalism in words, (colour!) pictures, video, data, animation, audio; on mobile and other platforms and in social … and every possible combination of the above.
The past two decades have been marked out by wonderful Guardian writing, photography, innovation and editing. There have been gruelling court battles, dogged campaigns and tough investigations. The Guardian – always the outsider – has won a global reputation for its willingness to fight for the right causes. We have strong future leaders in place with unparalleled news and digital experience. We have built up – and banked – a considerable financial endowment to secure future innovation and build on our quality journalism. The GMG Board is prepared to invest significantly in what we do because of the extraordinarily strong global position for which we (editorial, commercial and digital together) have fought and won.
Each editor is told – this is literally the only instruction – to carry the Guardian on “as heretofore”. That means understanding the spirit, culture and purpose of the paper and interpreting it for the present. All that is only possible because of the unique Scott Trust, set up in 1936 to ensure the Guardian survives in perpetuity.
Since 1936 the Trust has always appointed a chair from within – in every case a member of the Scott family or a former Guardian journalist or editor. I’ve felt very lucky to have Hugo Young and Liz Forgan beside me and/or guarding my back. The Trust is one of the most important liberal institutions in the world and I was very honoured to be asked to succeed Liz as chair when she steps down in 2016.
But the best thing about working here – the thing I’ll miss most – are my colleagues. We are a team and the strongest of communities – one which includes our readers. The community includes people from all areas, in and outside editorial. The Guardian and the Observer are bursting with extraordinarily bright, talented, brave, kind, knowledgeable, resourceful, imaginative, thoughtful and delightful people. I know our journalism – and our “perpetuity” – will be in the best possible hands.
I am currently visiting the Guardian Australia team in Sydney, Melbourne and Canberra – another amazing Guardian success story – but I will be back in Kings Place on Monday and will talk to you then.
ఫోటో కర్టసీ: బీబీసీ డాట్ కామ్

'ద కారవాన్' పత్రికలో రామోజీ మీద

సూక్ష్మంలో మోక్షం చూపించడం జర్నలిజం సూత్రమైన ఈ రోజుల్లో సుదీర్ఘ (లాంగ్ ఫామ్) జర్నలిజంతో సంచలనం సృష్టిస్తున్న 'ద కారవాన్' అనే పత్రికను జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవారు కొనుక్కుని ఉంచుకోవచ్చు. 

ప్రముఖ ఎడిటర్ శేఖర్ గుప్తా కవర్ పేజీ వ్యాసం (ఆయన జీవిత చరిత్ర పై నిశిత విమర్శనాత్మక కథనం)గా ఉన్న డిసెంబర్ సంచికలో 'ఈనాడు' వ్యవస్థాపకుడు, మీడియా రారాజు రామోజీ రావు పైన "చైర్మన్ రావ్" అన్న శీర్షికతో ఒక వ్యాసం ఉంది. "How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh" అన్న డెక్ తో ఉన్న ఈ వ్యాసాన్ని ప్రవీణ్ దొంతి అనే జర్నలిస్టు రాసారు.

Tuesday, December 9, 2014

ఈ కుల జాడ్యం, కుల గజ్జి పోయేవేనా?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) అనే సంస్థ భారత దేశంలో కులం మీద జరిపిన తాజా సర్వే ఫలితాలు సంచలనం కలిగిస్తున్నాయి. భారత రాజ్యాంగం 64 ఏళ్ళ కిందటే అస్పృస్యతను రద్దు చేసినా...భారతీయుల్లో పావు సగానికి పైగా జనం తాము ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నట్లు తేలింది. కులాన్ని బట్టి ఇతరులను ముట్టుకోకూడదని అనుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండడం బాధాకరం. "ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వంటింట్లో కి రానిస్తారా? మీ పాత్రలు ముట్టుకోనిస్తారా?"  అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఈ కింది బొమ్మల్లో చూడవచ్చు (మూలం:  India Human Development Survey (IHDS-2) 
బ్రాహ్మణులు, ఓ బీ సీ లు అస్పృస్యతను ఎక్కువగా పాటిస్తున్నారని... ముస్లింలు, ఎస్సీ లు, ఎస్టీలలో కూడా ఇది ఉందని సర్వే లో తేలింది. 


యూనివెర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మద్దతుతో వివిధ రాష్ట్రాల్లో 42 వేల ఇళ్ళలో ఈ సర్వే చేసారు.  పూర్తి సర్వే ఫలితాలు 2015 లో విడుదలవుతాయి. 
అస్పృస్యత జాడ్యం ఎక్కువగా హిందీ హార్ట్ లాండ్ లో ఉందని  ఇందులో తేలింది. మధ్యప్రదేశ్ (53 శాతం), హిమాచల్ ప్రదేశ్ (50), చత్తీస్ గడ్  (48), రాజస్థాన్, బీహార్ (47), ఉత్తర ప్రదేశ్ (43), ఉత్తరాఖండ్ (40) ఈ జాబితాలో ముందువున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఒక్క శాతం మంది అస్పృస్యతను పాటిస్తున్నట్లు సర్వే లో తేలింది. కేరళ (2 శాతం), మహారాష్ట్ర (4), ఈశాన్యం (7), ఆంధ్రప్రదేశ్ (10) ఆ తర్వాతి స్థానాన్నిపొందాయి. 
"ఒక కోటీశ్వరుడైన ఎస్సీ ని వంటింట్లోకి రానిస్తారా? ఆయనతో కరచాలనం చేయడానికి ఇష్టపడరా?" అని కూడా జనాలను అడగాలి. భారతీయ సమాజంలో జనాలు కులం విషయంలో ఫక్తు స్వార్ధం తో బతుకున్నారు. డబ్బు, అధికారం ఉన్న నిమ్న కులస్థులను అహో ఓహో అని ఆలింగనం చేసుకోవడానికి, ఇంటికి ఆహ్వానించి వంటింట్లో కలిసి తినడానికి ఏ సో కాల్డ్ అగ్రవర్ణాల వారూ ఎవ్వరూవెనుకాడరు. అదే... రోజు కూలీ తో పొట్ట పోసుకుని చిరిగిపోయిన బట్టలతో ఉండే ఎస్సీ ని అగ్ర కులాల వాళ్ళే కాదు... అదే సామాజిక వర్గానికి చెందిన ధనిక స్వాములు సైతం ఇంట్లోకి రానివ్వరు. ఇక్కడ ముఖ్యం సోషల్ స్టేటస్, పర్స్. అదే సమయంలో....అవసరాన్ని బట్టి, కలగచేసే మేలును బట్టి కులం కార్డును అంతా నిస్సిగ్గుగా వాడుకుంటారు. తరచి చూస్తే... ఇప్పుడు ఏర్పడినవి రెండే కులాలు: ఉన్నోళ్ళు, లేనోళ్ళు... అని అనిపిస్తుంది.  ఈ విషయంలో వాదోపవాదాలు ఎలా ఉన్నా.... కులం ప్రాతిపదికన సాటి మనిషిని ఇంట్లోకి రానివ్వకపోవడం, తాకకుండా ఉండడం,  మనిషిగా చూడలేకపోవడం పరమ ఘోరం. కుల గజ్జి ఈ స్థాయిలో పెట్టుకుని మనం ఎంత అభివృద్ధి సాధించినా అది సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి కాదు, కాబోదు. 

Monday, December 8, 2014

జర్నలిస్టు బతుకులు

సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు డిసెంబర్ 2 న  ఫేస్ బుక్ పేజీలో 

పెట్టిన "అంతరంగాలు" ఇది.
 
జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. 
ఈ బతుకు తప్పేది.
జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది.
 వీడి జీవితం నా వల్లే పాడైంది.

జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి 
స్థిమితమైన జీవితం లేదు కదా.
జర్నలిస్టు భార్య: పెళ్ళికి ఒప్పుకునే 
ముందు కొంచెం ఆలోచించాల్సింది. 
అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
జర్నలిస్టుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ
 జర్నలిస్టుకు పిల్లనివ్వకూడదు.
జర్నలిస్టు పిల్లలు : నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే సాయంత్రాలు
 హాయిగా ఆడుకుని వుండేవాళ్ళం.
జర్నలిస్టు బాసు: ఏమీ చదవకుండా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు. 
ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
జర్నలిస్టు ఇంటి ఓనరు: జన్మలో జర్నలిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.
"నా పిల్లలను జర్నలిస్టు కానివ్వ ను...." అని జర్నలిస్టు  భార్యలు 
అనుకుంటారన్న విషయాన్ని కూడా రాయమని కూర్మనాధ్ గారి సతీమణి
చెప్పారట. దీనికి ఓ 170 లైకులు, యాభై కి పైగా కామెంట్లు వచ్చాయి. 

Monday, December 1, 2014

'సాక్షి టీవీ'లో కూడా ఉద్యోగుల తొలగింపు కసరత్తు?

'సాక్షి టీవీ' నుంచి మా బృందానికి వచ్చిన ఒక లేఖ ఇది: 
మిత్రమా,
'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం కానుంది. ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగించాలని, రెండు రాష్ట్రాల్లో కలిపి 23 జిల్లాలకు గాను 8 మంది స్టాఫర్లను మాత్రమే ఉంచి మిగిలిన వారిని తీసేయాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆదేశాలు జారీ చేశారు. అందరు హెచ్ వోడీలను పిలిచి తీసేసేవారి లిస్టు ఇవ్వమన్నారు. దాదాపు 150 మందిని అన్నిశాఖల్లో తగ్గించాలని, లేకుంటే ఖర్చులు భరించలేమని యాజమాన్యం చెబుతోంది. 
మరో వైపు హెచ్ వోడీలు మాత్రం ఇది అన్యాయం అంటూ వాదిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకంటే ఎక్కువగా పనిచేసి, భార్యా బిడ్డలను వదిలి నెలలకు నెలలు ఓదార్పు, పాదయాత్రలు చేసి...ఎన్నికల్లో ఇతర సమయాల్లో టీడీపీ వారితో తిట్లు, తన్నులు తిన్న వారిని...అన్ని చానళ్ల వారికంటే ఇచ్చే జీతం కంటే మూడు రెట్లు వాళ్లతో పనిచేయించుకుని ఈ రోజు రోడ్డున నిలబెట్టడం భావ్యంకాదని చెబుతున్నారట. కానీ నెలకు కోటి రూపాయల లాస్ వస్తోంది ఏం చేయమంటారు? అంటూ యాజమాన్యం చెప్తోంది. దీంతో జిల్లాల్లోని ఉద్యోగులతో సహా అందరూ గత నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా బాధ పడుతున్నారు. ఇప్పటికే డిఎస్ ఎన్జీలు, డ్రైవర్లు, ఇంజనీర్లను తొలగించేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 
చానల్ మొత్తాన్ని పేపర్ ఆధీనంలోకి తెచ్చి...రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక టీవీ రిపోర్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రిపోర్టర్ లేని చోట పేపర్ వాళ్లే టీవీ బాధ్యతలు చూస్తారట. మొత్తం మీద ఆటలో అరటిపండులా వాడుకుని వదిలేసేందుకు సిద్ధపడ్డారు.

Wednesday, November 26, 2014

హెచ్ ఎం టీవీ వీడి... మళ్ళీ ఎన్-టీవీ గూటికి రాజశేఖర్?

తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న రాజశేఖర్ కపిల్ గ్రూప్ వారి హెచ్ ఎం టీవీ ని వీడి నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ లోకి పునఃప్రవేశం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చౌదరి గారు ఆయనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలి. 

ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని,  డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని తెలిసింది.
రాజశేఖర్ సంగతి ఎలా ఉన్నా... కపిల్ గ్రూపు వామన రావు గారి ని చూస్తే... అయ్యో అనిపిస్తున్నది. గుండె నిండా నమ్మిన రామచంద్ర మూర్తి గారు ఆ ఛానల్ ను, 'ది హిందూ' స్థాయిలో నడపాలని ఆయన మొదలు పెట్టిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రికను వదిలి వెళ్లి పోయారు. అంతకుముందు, ఆ తర్వాత మీడియా దేవుడు గా, ఆపద్భాందవుడిగా తానూ భావించిన రాజశేఖర్ విరాట్ స్వరూపం ఆయనకు తెలిసి వచ్చింది. 
బాక్ అప్ చర్యల్లో భాగంగా 6 టీవీ నుంచి వెంకట కృష్ణ ను తెచ్చుకోవడం గుడ్డిలో మెల్ల. "గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక జరుగుతున్న 'ఆపరేషన్స్' విష్ణు సిమెంట్స్, పీ వీ పీ సాక్షిగా వామనుడికి తెలిసిపోయాయట. బాబూ... ఇన్ని చిలిపి చేష్టలు చేసే నిన్ను నమ్మడం ఎలా?," అని అడిగారని అబ్రకదబ్ర ఇచ్చిన సమాచారం. అంత సాత్వికుడైన వామన రావు గారికి... జర్నలిజం మీద, ఎడిటర్ల మీద, మనుషుల మీద పరమ అసహ్యం కలిగే పరిస్థితి ఏర్పడిన్దన్నది నగ్న సత్యం. వామనుడికి చేదైనది... నరేంద్రుడికి తీపి కావడమే ఆథ్యాత్మిక పరమ రహస్యం. అదే రాజశేఖర్ గొప్పతనం.
అయితే, బ్రదర్... మీరు ఎన్ టీవీ కి వెళుతున్నట్లు తెలిసింది. నిజమేనా? అని అడిగితే... లేదని రాజశేఖర్ మెయిల్ లో సమాధానమిచ్చారు. వామన రావు గారికి, రాజశేఖర్ గారికి, నరేంద్ర నాథ్ చౌదరి గారికి మేలు జరుగు గాక!   

Wednesday, November 19, 2014

ఒక "ఐ-న్యూస్" ఉద్యోగి ఆవేదన

మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు.  అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది.  రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు. 

అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
  A -6:00 am to 3:00 pm
  B -2:00 pm to 11:00 pm
  C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు. 
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు.  ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను. 

(నోట్: యాజమాన్యం ప్రతినిధులు దీనిపై వివరణ ఇస్తే ప్రచురించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధం) 

Tuesday, November 11, 2014

ప్రొ.నాగేశ్వర్ చేతికి 'ది హన్స్ ఇండియా' పగ్గాలు-నాయర్ నిష్క్రమణ?

ప్రస్తుత ఎం ఎల్ సీ, ప్రముఖ వార్తా విశ్లేషకుడు, సూపర్ వక్త, కరెంట్ అఫైర్స్ బ్లాగర్, సివిల్ సర్వీస్ శిక్షకుడు, ఉస్మానియా యూనివెర్సిటీలో జర్నలిజం బోధకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (ఈ పక్క ఫోటో) కు కపిల్ గ్రూప్ యాజమాన్యం 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక సంస్కరణ బాధ్యతను అప్పగించింది. ఈ నిర్ణయం తో సంబంధం ఉందో లేదో కానీ... నాలుగేళ్ళుగా ఆ పత్రిక ఎడిటర్ గా ఉన్న పీ విశ్వనాథ్ నాయర్ పదవికి రాజీనామా  సమాచారం. ఒక కన్సల్టెంట్ గా హన్స్ బాధ్యతలు తీసుకున్న నాగేశ్వర్ గారు ఇప్పుడు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కరెంట్ అఫైర్స్ అనే బ్లాగ్ (http://thekntv.blogspot.in/) నడుపుతున్నారు, ప్రజల డబ్బుతో నడుస్తున్న 10 టీవీ కి గౌరవ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు.  

సీనియర్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మస్తిష్కం లో ఒక టాబ్లాయిడ్ గా  పురుడుపోసుకున్న హన్స్ ఇండియా... ప్రింటింగ్ ఇబ్బందులు, మార్కెటింగ్ వసతులు వగైరాల రీత్యా బ్రాడ్ షీట్ పేపర్ గా కొనసాగింది. తెలుగు పేపర్ల మాదిరిగానే ఇంగ్లిష్ పేపర్ ను నడిపేయవచ్చన్న దుర్భ్రమ, ఇంగ్లిష్ పేపర్ల డిజైన్ పట్ల అవగాహనారాహిత్యం, పాత నమ్మకస్తులను అకామిడేట్ చేసుకోవాలన్న ఆత్రం, పొగిడే వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహాలు పాటించే తత్త్వం, మార్కెటింగ్ వ్యూహం లో తప్పిదాల వల్ల హంస కాస్తా కాకై కూర్చుంది. ఇది కపిల్ బొక్కసానికి పెద్ద బొక్క పెట్టాక... అనివార్య కారణాల వల్ల మూర్తి గారు బైటికి వచ్చారు. 

మూర్తి గారు వీడిన శిధిల సామ్రాజ్యం చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరమ సాత్వికజీవి కపిల్ యజమాని వామన రావు గారికి విష్ణుమూర్తి లాగా కనిపించారు... తెలుగు ఛానెల్స్ దశ-దిశ మార్చే దమ్మున్న ఏకైక మొగాడు రాజశేఖర్. భారీ ప్యాకేజ్ తో రాజా ని తీసుకున్నాక కొన్నాళ్ళకు వామనుడికి అర్థమయ్యింది మూడో కాలు నెత్తి మీదికి వచ్చేస్తోందని... అని ఒక మిత్రుడు చమత్కారంగా అన్నారు. ఇంగ్లిష్ జర్నలిజంలో శిక్షణ, ప్రవేశం ఏ మాత్రం లేనివారికి పగ్గాలు ఇస్తే హింసకు గురికాక తప్పదన్న కనీస జ్ఞానంలేని వామన రావు గారిని అనక తప్పదు. వామనరావు గారిని ఒకరిద్దరు మిత్రులు కలిసి కొంపకొల్లేరు అవుతుందని చెబితే... నీట ముంచినా... పాల ముంచినా ఆ మూర్తి గారిదే భారమని చెప్పారట. కానీ అది జరగలేదు.   

ఈ పరిణామాల మధ్య... హన్స్ కు జవజీవాలు పోసే పనిలో భాగంగావామన రావు గారు హన్స్ సంస్కరణ బాధ్యతలను నాగేశ్వర్ గారికి అప్పగించారని సమాచారం. ఈ నేపథ్యంలో... డెక్కన్ క్రానికల్ ఎదుగుదల లో కీలక భూమిక పోషించిన నాయర్ గారు ఎడిటర్ షిప్ వదిలేసి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. 

"నాయర్ గారు వెళ్ళడం పక్కా. రాజశేఖర్ గారు కూడా డిసెంబర్ ఐదో తేదీన వెళ్ళిపోతారట. సాక్షి ఛానెల్ లో పని కుదిరిందట. మళ్ళీ మా ఛానెల్ లో పత్రికలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం," అని ఒక ఇన్సైడర్ చెప్పారు. అది నిజమో కాదో కాలమే తేల్చాలి. All the best...prof.Nageswar.             

Sunday, November 9, 2014

మీడియా కబుర్లు... అవీ-ఇవీ-అన్నీ

"జై తెలంగాణ": టీవీ-9 వస్తోంది.....  
* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం. 
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!

ఎన్నాళ్ళు వేమూరి గారికి సంకెళ్ళు? 
*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు. 
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. 

 హెచ్ ఎం: రాజశేఖర్ వర్సెస్ వెంకటకృష్ణ!!!
*ఈ నిషేధాలు-భేషజాలు ఇలా ఉండగా... కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ లో పరిణామాలు ఆసక్తి గా ఉన్నాయి. సినిమాల్లో మల్లికా షరావత్, దీపికా పదుకొనెల మాదిరిగా తెలుగు ఛానెల్స్ లో ఒక వెలుగులాంటి రాజశేఖర్ ప్రభ అక్కడ తగ్గిందన్న ప్రచారం ఆయన వ్యతిరేకులు/బాధితులు ప్రచారం చేస్తున్నారు. "రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి... పీ ఎన్ వీ నాయర్ తో కలిసి ఒక్క హన్స్ ఇండియా ను చూసుకోమన్నారట.
వెంకటకృష్ణ (పెద్దబొమ్మ)... రాజశేఖర్ (చిన్న బొమ్మ) 
 డిసెంబర్ లో రాజశేఖర్ అక్కడి నుంచి చెక్కెస్తాడట..." అని ఆయన ఆగమనంతో ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు ఒక 20 రోజులుగా చెబుతున్నారు ఈ బ్లాగు బృందానికి. కానీ మేము నమ్మడం లేదు. రాజశేఖర్ వెన్నుచూపి పారిపోయే రకం కాదు. అయితే...ఈనాడు లో జర్నలిజం మొదలెట్టి... ఈ టీవీ లో అద్భుతంగా రాణించి... టీవీ 5 అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించి.. 6టీవీకి జీవం ఇచ్చిన వెంకట కృష్ణ  హంస టెలివిజన్ కు రావడం గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాజశేఖర్ ఆశీస్సులతో వచ్చాడని కొందరు... కపిల్ యజమాని వామన రావు గారి చాయిస్ అదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వీకే యమ వీజీ గా చర్చలు జరుపుతూ దుమ్ములేపుతున్నాడు. రాజశేఖర్ కు లేనిది...వీకే కు ఉన్నది అదే. రాజశేఖర్ తెర వెనుక ఇరగదీయగలడు, వీకే తెర మీద చింపగలడు. నిజానికి... రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతలు చూపవద్దని అనడం...మల్లికా షారావత్ ను డాన్స్ చేయవద్దని ఆంక్ష పెట్టడం తో సమానం. అది కుదరని పని. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

'ఈనాడు' ఓనర్లకు తిట్లు... శాపనార్థాలు   
*'ఈనాడు' లో ఇప్పుడు అంతా యాజమాన్యాన్ని బండ బూతులు తిడుతున్నారు. బూతులంటే... మామూలు బూతులు కాదు. ఒకొక్క మిత్రుడు అదనంగా నాలుగు గంటలపాటు ప్రయాణం చేసి ఫిల్మ్ సిటీ కి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వస్తున్నారు. "నడుములు పోతున్నాయి సార్. వీళ్ళకు ఇదేమి పోయే కాలమో! రామోజీ ని ఆయన కొడుకును తిట్టని ఉద్యోగి లేడంటే నమ్మండి. ఇంకా ఎక్కడా ఉద్యోగాలు లేక మూసుకుని పనిచేస్తున్నాం..." అని జర్నలిస్టులు మొత్తుకుంటున్నారు. కుటుంబ సభ్యులైతే శాపనార్థాలు పెడుతున్నారు. నగరం జడిబొడ్డున ఖైరతాబాద్ లో ఆఫీసును ఊరిబైట ఉన్న ఫిల్మ్ సిటీ కి తరలించడంతో 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని, మనసు పెట్టి ఉద్యోగాలు చేయలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. 

యు... టూ... 'ది హిందూ' 
*ఎప్పుడూ ఉద్యోగులకు దసరా నాటికి దళసరి బోనస్ ఇచ్చే 'ది హిందూ' ఈ సారి ఉద్యోగులకు మొండి చేయి చూపింది. ఇవ్వాలని రూల్ లేకున్నా ఇన్నీళ్ళు ఇస్తూ వచ్చామని, ఆర్ధిక ఇబ్బందుల రీత్యా ఈ ఏడాది ఇవ్వలేకపోవదాన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఒక లేఖ కూడా పంపింది యాజమాన్యం. అంతే కాకుండా... ఇక మీదట పర్మినెంట్ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకోవాలని నిర్ణయించారు. ఇకప్పుడు... ఉద్యోగ భద్రతకు మారు పేరైన 'ది హిందూ' లో ఈ దుస్థితి రావడం తో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

నరేంద్ర చౌదరీ... నమో నమః 
*అసలు మాన్ ఆఫ్ ది మీడియా.... ఎన్-టీవీ నరేంద్ర నాథ్ చౌదరి గారు. భక్తి ఛానెల్ ఒకటి పెట్టి, ఆథ్యాత్మిక సేవ చేసుకుంటూ ఏదో తరిస్తున్న ఆయన... కార్తీక మాసం సందర్భంగా ఎన్ టీ ఆర్ స్టేడియం లో గత పద్నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న "కోటి దీపోత్సవం" సూపర్ గా క్లిక్ అయ్యింది. ఏమి జనం... ఏమి ప్రవచనాలు!!! కాషాయ స్వాములు, రాజకీయ వేత్తలు, సాధారణ జనం, భక్తులు అంతా సాయంత్రం కాగానే ఆ ప్రోగ్రాం కు వెళ్లడమో, ఇళ్ళళ్ళో కూర్చుని టీవీ లో చూడడమో చేస్తున్నారు. వత్తులు, నూనె, కొవ్వొత్తి, ప్రమిదలు, అగ్గిపెట్టె కూడా చౌదరి గారే సమకూరుస్తూ భక్తులను పరవశులను చేస్తున్నారు. స్వామి కార్యం... స్వ కార్యం అంటే ఇదే మరి. నువ్వు ఛానెల్ ఎలా పెట్టవన్నది కాదు బ్రదర్... ఎలా మార్కెట్ చేస్తున్నవన్నది ముఖ్యం. 

Wednesday, November 5, 2014

ఈజేఎస్ 1996-97 బ్యాచ్ మిత్రుల సమాగమం

ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) లో 1996-97 లో జర్నలిజం అభ్యసించి వృత్తిలో నిలబడిన మిత్రులు ఈ ఏడాది కూడా సమావేశమయ్యారు. గత సంవత్సరం జులై రెండో వారంలో హైదరాబాద్ లో కలిసిన ఈ బ్యాచ్ సభ్యులు... ఈ సారి నెల్లూరులో కలిసారు. తెలుగు మీడియా ప్రపంచం చాలా గడ్డుకాలంలో ఉన్న ఈపరిస్థితుల్లో వీళ్ళంతా జమకావడం, రెండు రోజుల పాటు గడిపి మంచీ చెడూ మాట్లాడుకోవడం ముదావహం. నిజానికి ఇది సరైన సమయంలో జరిగిన మంచి మీటింగ్. 
ఈ సందర్భంగా, తమకు జర్నలిజం బోధించిన డాక్టర్. బూదరాజు రాధాకృష్ణ గారికి పుష్పాంజలి ఘటించారు. "రెండు రోజుల పాటు అన్నింటినీ మరచి అపూర్వంగా ఆనందంగా గడిపాం. గురువుగారు బూదరాజు గారికి నివాళులు అర్పించాం. మేమంతా ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన మా గురువులు శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, శ్రీ పోరంకి దక్షిణామూర్తి, శ్రీమతి భారతీలక్ష్మి గార్లను మననం చేసుకున్నాం," అని ఈ బృందంలో ఒకరైన కోవెల సంతోష్ మాకు పంపిన మెయిల్ లో రాసారు. ఈయన పంపిన ఫోటోలు ఇవి. 




వీళ్ళంతా కలిసి... కృష్ణపట్నం పోర్టు ను, శ్రీహరి కోటను సందర్శించారు. "జీవితంలో మరపురాని ట్రిప్ ఇది.ఎంతరాసుకున్నా అనుభూతికి అందని భావోద్వేగం అది. 18 సంవత్సరాలైనా చెరగని స్నేహం జర్నలిస్ట్ లలో ఉండటానికి మా బ్యాచ్ తప్ప మరే ఉదాహరణ కనిపించదు. తెలుగునాట సగర్వంగా చెప్పుకునే స్నేహ కుటుంబం మాది," అని ఆయన చెప్పుకొచ్చారు. 
"We passed a resolution to build up good communicate network within the group with an aim to help each other in the event of financial, health or any other problems. Also we decided to celebrate our 20th year of journalism in a befitting way and the venue is Konaseema tentatively," అని సంతోష్ రాసారు. ఈ ఆపత్సమయంలో ఇలాంటి సమాగామాలు కొంత ఊరట ఇస్తాయండంలో సందేహం లేదు.

Saturday, October 4, 2014

'ఈనాడు' మెషిన్ సెక్షన్ కార్మికుల సమ్మె బాట!

ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ కార్మికులు శనివారం నాడు సమ్మె బాట పట్టారు. జీతాలు పెంచకుండా... తమను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేందుకు యాజమాన్యం కుతంత్రం పన్నుతోందని ఆరోపిస్తూ... కొన్ని యూనిట్లలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగినట్లు సమాచారం. నోటీసు గట్రా ఏమీ లేకపోయినా... పని చేయకుండా తమ నిరసన తెలుపుతున్నట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన (గురువారం) ఒక మూడు యూనిట్లట్లో నిరసన గళం వినిపించిన కార్మికులు... దసరా పండగ సందర్భంగా ఆఫీసుకు శలవు కాబట్టి...మర్నాడైన (శనివారం) నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. 

తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని, రేపు మీ గతి కూడా ఇంతేనని మిషన్ సెక్షన్ కార్మికులు 'ఈనాడు'లో వివిధ సెక్షన్ల ఉద్యోగులను అభ్యర్ధిస్తున్నారు. అయితే, మిగతా జనాల హక్కుల గురించి వీర విప్లవ సాహిత్యంలో కాపీ కొట్టిన పదాలతో అందమైన శీర్షికలు, లీడ్ లు రాసే జర్నలిస్టులు చాలా మంది అంటీ ముట్టకుండా ఉన్నారని సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. కానీ, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కరీంనగర్ లలో ఉద్యోగులు కొందరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. 

తమ పని గంటలను ఎనిమిది నుంచి ఐదుకు తగ్గించిన యాజమాన్యం... అలవెన్సులపై కోత వేసిందని, కాంట్రాక్టు లేబర్ గా తమను మార్చేందుకు కుయుక్తులు పన్నుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ రోజుకు మెషిన్స్ ఆన్ చేయబోమని కార్మికులు ప్రకటించగా... వారితో యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. 

తెలుగు జర్నలిజం లో ఒక అద్భుతమైన సంచలనం గా చెప్పుకోదగ్గ 'ఈనాడు' లో పరిస్థితులు సత్వరం సద్దుమణిగి... ప్రజల పక్షాన పోరాడే పత్రికగా అది వెలుగొందాలని కోరుకుందాం. 

నగరం నడిబొడ్డు నుంచి ఫిల్మ్ సిటీకి తరలిన "ఈనాడు"

హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ లో ఒక లాండ్ మార్క్ గా నిలిచిన 'ఈనాడు' పత్రిక ఆఫీసు విజయ దశమి నాటికి దాదాపు ఖాళీ అయ్యింది. కొందరు రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది తప్ప జర్నలిస్టులు అంతా యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా ఫిలిం సిటీ కి తరలివెళ్ళారు. ఈ రోజు నుంచి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది... కనీసం మూడు గంటలు రాకపోకలకే చెల్లించాల్సి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లోకి, అక్కడి నుంచి సిటీ కి యాజమాన్యం ఏర్పాటు చేసే బస్సు టైమింగ్ కు అనుగుణంగా...జర్నలిస్టులు, ఇతర సిబ్బంది తమ జీవన గమనాన్ని, విధానాన్ని మార్చుకోవాలి.    

"యాజమాన్యం నిర్ణయం మా ప్రాణం మీదికి వచ్చింది. ఇన్నాళ్ళూ 'ఈనాడు' అంటే పర్మినెంట్ జాబ్ అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు... ఒక అవకాశం వస్తే ఎప్పుడు బైట పడదామా? అనిపిస్తోంది," అని దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఒక జర్నలిస్టు చెప్పారు. జర్నలిస్టులలో నిరాశ, నిస్పృహ పెరగడానికి కారణాలు ఇలా ఉన్నాయి. 

1) విధి నిర్వహణ కోసం అదనపు ప్రయాణం చేయాల్సిరావడం, దానివల్ల అదనపు గంటలు వెచ్చించాల్సి రావడం 

2) వేతన సంఘం సిఫార్సు లకు అనుగుణంగా అంటూ... జీతాలు పెంచినా....సీనియర్లకు పావలా, నలభై పైసలు మాత్రమే పెరగడం. (2005 తర్వాత జాయిన్ అయిన వారికి మాత్రమే ఓకే ఐదు వేల దాకా పెరిగాయి) 

3) దసరా పండక్కు బోనస్ ఇస్తూనే... పెట్టిన ఒక ఫిటింగ్. 'ఒక వేళ పాత బకాయిలు గానీ, భవిష్యత్ బకాయిలు గానీ చెల్లించాల్సివస్తే... ఈ బోనస్ ను అందులోంచి  మినహాయిస్తా'మని యాజమాన్యం లిఖితపూర్వకంగా తెలియజేయడం

4) ఆదుకుంటుందని అనుకున్న తెలంగాణా రాష్ట్ర కార్మిక శాఖ అనుమాన పడిన ప్రకారం... మౌనం పాటించడం 

5) ఉద్యోగ అభద్రత మున్నెన్నడూ లేనంతగా పెరగడం

6) వేజ్ బోర్డ్ పెంచిన భారానికి విరుగుడుగా... పర్మినెంట్ ఉజ్జోగాలకు మంగళం పాడుతూ...అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తారన్న ప్రచారం

7) తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, 'ఈనాడు' కు మధ్య ఒక అవగాహన కుదిరిందన్న ప్రచారం.

'ఈనాడు' ను ఉన్నపళంగా ఫిలిం సిటీ కి ఎందుకు మార్చారు? ఖైరతాబాద్  నుంచి ఇప్పుడు ఖాళీ చేస్తున్న ఆఫీసును రిలయన్స్ కు బదలాయిస్తున్నారా? అన్నవి తేలాల్సి ఉంది. 

Monday, September 22, 2014

జర్నలిస్టుల దుస్థితిపై ఒక మిత్రుడి లేఖ

సర్... 
"తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ద్వారా....యాజమాన్యాల చేతిలో నలిగిపోతున్న జర్నలిస్టుల బాధలను బైటి ప్రపంచానికి తెలియజేస్తూ...  అండగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మీ పోస్టులను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాము. 


జర్నలిస్టులు మరియు ఇతర ఉద్యోగులను తొలగించడం, ఉద్యోగులను మానసికంగా హింసించడం కేవలం 'ఈనాడు'లోనే కాదు.. ఈ-టీవీలోనూ పరాకాష్ఠకు చేరింది. ప్రతి చిన్న విషయానికీ...  "ఉంటే ఉండండి లేకుండే వెళ్లిపోండి"... అంటూ యాజమాన్యాలు ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చీటికి మాటికి సూటిపోటి మాటలు, జీతభత్యాల్లో తేడాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా గుర్తింపు ఇవ్వడం, నచ్చనివారికి కనీసం సెలవులు ఇవ్వకుండా మానసికంగా హింసించడం... ఈటీవీలో రోజూ జరిగే తంతు. 

ఇందుకు మంచి ఉదాహరణ ఇటీవల ఎన్నికలకు ముందు జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను మీ ముందుకు తెస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన మా సాటి జర్నలిస్టు యాజమాన్య హింసలకు తట్టుకోలేక.. మానసికంగా ఒత్తిడికి గురై రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ-టీవీ ఛానల్ ఆఫీసులో చనిపోయాడు. కొడుకు మొదటి పుట్టినరోజు కోసం బంగారపు రింగ్, బట్టలు కొనుక్కొని, డ్యూటీ పూర్తి చేసుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని వచ్చిన ఆయన.. మానసికంగా క్షోభకు గురై ఆఫీసులోనే కుప్పకూలాడు. ఈ విషయాన్ని బైటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న యాజమాన్యం, అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లను రంగంలోకి దింపింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయినట్లు పోలీసులను నమ్మించారు అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లు. ఆయన మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి హయత్ నగర్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పెద్దలు వారిని ఉద్యోగులతో మాట్లాడనివ్వలేదు. తోటి ఉద్యోగి చనిపోయి గంట కూడా కాకముందే ఏమీ జరగనట్లు కడుపునిండిన కొంత మంది జర్నలిస్టులు పనిచేసుకుంటూ పోయారు. 

మిగతా వారు బాధను కడుపులో దిగమింగుకొని కుటుంబ పోషణ కోసం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంత మంది ఉద్యోగులు... చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా కాస్తయినా సాయపడటానికి ఒక్కరోజు జీతం ఇవ్వడానికి ముందుకు వస్తే సీనియర్లు, యాజమాన్యం అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఉద్యోగి చనిపోవడానికి ఆరోగ్య సమస్యల ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ, మాకు తెలిసినంత వరకూ ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. అందరితో కలిసి సరదాగా ఉండేవారు. కానీ ఆయనది ఒకరికి గులాంగిరీ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయనపై ఛానల్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులు చిన్నచూపు చూపించ సాగారు. ఇంక్రిమెంట్లలోనూ తక్కువ వేశారు. కనీసం కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు సెలవులు అడిగితే వెంటనే మంజూరు చేయకుండా మానసికంగా వేధించారు. పరోక్షంగా పనిభారంతో ఇబ్బంది పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటిస్తూ ఓ తోటి ఉద్యోగి నోటీసు బోర్డుపై పేపర్ అంటిస్తే... ఇది అవసరమా అంటూ సదరు ఉద్యోగిపై మండిపడ్డారు. 

ఇదంతా ఎన్నికలకు పది రోజుల మందు ఈ-టీవీ ఆఫీసులో జరిగిన సంఘటన. ఇక ఇప్పుడు కూడా వారి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నచ్చిన వారికి సెలవులు ఇవ్వడం, నచ్చని వారికి అత్యవసర అవసరాలకు కూడా సెలవులు ఇవ్వకుండా హింసించడం ఈ-టీవీలో రోజూ సర్వసాధారణం అయ్యాయి. అన్ని అవకాశాలు చేజారిపోయి ఇప్పుడు ఏ దారి వెతుక్కోలేక పాపం ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిలోనూ చాలా మందిని పీకేయడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ... మిగతా వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడిన వారిపై అతివాదులను ముద్రవేసి తొక్కిపడేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఈ-టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలు చాంతాడంత ఉన్నాయి. 

ఈ విషయంతో పాటు వేలాది మంది పనిచేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యవసర చికిత్సకు అవసరమైన అంబులెన్సు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేని విషయాన్ని మీరు మీ బ్లాగు ద్వారా ప్రభుత్వం, ప్రజల దృష్టికి తేగలరని నా మనవి. 
తోటి జర్నలిస్టు.... 
(Note: This is a letter from a journalist and the veracity of it is being verified. We wish to encourage views in support of it or against to it.)

Friday, September 19, 2014

ఉసురు తీసిన బలవంతపు రాజీనామా?


Thursday, September 18, 2014

'ఈనాడు' యాజమాన్యానికి లేబర్ కమిషన్ తాఖీదు

ఉద్యోగుల నుంచి బలవంతానా రాజీనామాలు చేయిస్తే పారిశ్రామిక వివాదాల చట్టం-1947 తదితర చట్టాల కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని 'ఈనాడు' పత్రిక వ్యవస్థాపకుడు సీ హెచ్ రామోజీరావు కుమారుడు, మానేజింగ్ డైరెక్టర్ సీ హెచ్ కిరణ్ ను తెలంగాణ కార్మిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను లేబర్ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్ గారు కిరణ్ కు పంపించారు. 

ఈ నెల పన్నెండో తేదీన బాధిత ఉద్యోగులు-యాజమాన్య ప్రతినిధులతో జరిగిన కీలకమైన మీటింగ్ ను ప్రస్తావిస్తూ..."సుదీర్ఘ చర్చల్లో... ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసారన్న దాన్ని స్పష్టంచేయలేకపోయింది. అదే సమయంలో సమస్య కు సంబంధించిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేక పోయింది,"  అని కమిషనర్ గారు స్పష్టం చేసారు. 
ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసిఉంటారన్న దాన్ని నమ్మే పరిస్థితి లేదని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో... ఈనాడు ప్రచురుణ సంస్థలో "పారిశ్రామిక శాంతి" ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా డాక్టర్ అశోక్ గారు ఒక ఐదు పాయింట్లు "అడ్వైజ్" పేరిటనే యాజమాన్యానికి స్పష్టం చేసారు.

కొత్త వేతన సంఘం సిఫార్సులను కూడా అమలు చేయాలని ఇందులో సూచించారు కానీ దానికి కాలపరిమితి విధించలేదు. బహుశా ఇప్పటికే...  'ఈనాడు' కోర్టు ధిక్కారానికి పాల్పడిందని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయే దమ్మున్న మనిషులకే వదిలేసినట్లు ఉంది.    

1)To treat all the resignations of all your non-journalist employees, submitted during the past 30 days (particularly all those dated 30-8-2014) as null, void, invalid and non-existent, as the employees  themselves have openly declared that the said resignations were coerced but not their voluntary acts. Consequently not to act upon any such resignation. 

2) In case the management intends to offer any Voluntary Retirement Scheme to its employees, it is at full liberty to do so, by adhering to prescribed procedure which requires, first communicating in writing the each and every detail of the proposed Scheme to each and every employee supposed to be covered by the Scheme, followed by extensive open discussions about the pros and cons therein, so as to give sufficient opportunity to the employees to freely think and act, if opting for the Scheme would really benefit him. Any element of force against the employees, to opt for VRS, would render the Scheme as expression of unfair labour practice;

3) To maintain all the postings of the employees as they exist as on 12-9-2014 and any sort of transfers or physical movements from the existing placement, at this juncture, would be liable to be treated as victimization of the employees;

4) To implement the Majathia Wage Board Award to all the eligible employees of the establishment, strictly adhering to the schedule fixed by the Hon'ble Supreme Court through its orders dated 7-2-201,

5) To note that any deviation from the above will render the management liable for action under the Industrial Disputes Act, 1947 and other laws, as many applicable.  
ఈ పై అంశాలు తెలుగులో సంక్షిప్తంగా... 

1) గత నెలరోజుల్లోని అన్ని రాజీనామాలు చెల్లవు. అవి స్వచ్ఛందం కావు.
2) స్వచ్ఛంద పదవీ విరమణపై అందరికీ ముందస్తు సమాచారం ఇవ్వాలి.
3) 12.9.2014 తరువాత జరిగే బదిలీలన్నింటినీ ఉద్యోగులపై కక్షసాధింపుగా పరిగణించాల్సి ఉంటుంది.
4) 7.2.2014 సుప్రీం తీర్పు ప్రకారం మజీతియా వేజ్ బోర్డు అవార్డు అమలు చేయాలి.
5) వీటిల్లో ఏది ఉల్లంఘించినా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును. 

(నోట్: ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్ గారు ఆ మూడు పేజీలు  పంపబట్టి ఈ పోస్టు రాయడానికి వీలు ఏర్పడింది. 'ఈనాడు' ఉద్యోగులు ఇప్పటికైనా బైటి ప్రపంచానికి సమాచారం ఇస్తే బాగుంటుంది.) 

Friday, September 12, 2014

'ఈనాడు'కు గట్టి షాక్-ఉద్యోగులకు పెద్ద ఊరట

*రంగంలోకి దిగిన తెలంగాణ లేబర్ కమిషన్ 
*బలవంతపు రాజీనామాలు చెల్లవని స్పష్టీకరణ
*వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాల్సిందేనని ఆదేశం

*బలవంతపు రాజీనామాలు నేరమని హెచ్చరిక
*70 మంది బాధిత ఉద్యోగుల సాక్ష్యం  
*"రామోజీ చేయమంటే ఇలా చేస్తున్నారా?" అని ప్రశ్న 

మీడియా చేతిలో ఉంది కదాని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకిపారేయవచ్చని అనుకున్న 'ఈనాడు' యాజమాన్యానికి తెలంగాణా ప్రభుత్వం పరోక్షంగా గట్టి షాక్ ఇచ్చింది. తమను ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా బలవంతంగా పీకేసారని హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి గారికి ప్రాసెస్ సెక్షన్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ లేబర్ కమిషనర్ శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశంలో 'ఈనాడు' కు చుక్కెదురు అయ్యింది.

'ఈనాడు' చరిత్రలోనే మొట్టమొదట సారిగా... దాదాపు 70 మంది పదవీచ్యుత ఉద్యోగులు లేబర్ కమిషనర్ ముందు హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పారావు గారు సహా ఐదుగురు యాజమాన్య ప్రతినిధుల సమక్షంలో ఈ పంచాయితీ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు ఈ సమావేశం ఆసక్తికరంగా జరిగింది. పిచ్చ పిచ్చ కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి పీకేస్తే దద్దమ్మల్లాగా ఏడుస్తూ ఇంకో ఉద్యోగం చేసుకోవడం, చస్తూ బతకడం అలవాటైన తెలుగు జర్నలిస్టులకు ఈ శ్రామిక జీవులు ఎంతో స్ఫూర్తినిచ్చారు.    

"జనాలకు నీతులు చెప్పే వాళ్ళే ఇలా బెదిరించి రాజీనామాలు తీసుకుంటారా?" అని కమిషనర్ మానేజ్మెంట్ ప్రతినిధులను ప్రశ్నించినట్లు సమాచారం. వివిధ జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగులు తమను ఎలా వుద్యోగం నుంచి తొలగించినదీ చెప్పారు. ఈ బలవంతపు రాజీనామాలు చెల్లవని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రశ్నకు సమాధానంగా... "ఇలా రాజీనామాలు తీసుకోవాలని మాకు మానేజ్ మెంట్ చెప్పింది," అని అప్పారావు బృందం చెప్పినట్లు తెలుస్తోంది. 'మానేజ్ మెంట్ అంటే రామోజీ రావు గారా? అని కూడా అడిగారు. "దానికి సమాధానంగా... మానేజ్ మెంట్ అని మాత్రమే చెప్పి తప్పించుకున్నారు," అని సాక్షుల్లో ఒకరు ఈ బ్లాగుకు చెప్పారు.

'ఈ రాజీనామాలు చెల్లవు. ఇలా హెరాస్ చేస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు," అని కూడా కమిషనర్ చెప్పారట. సాధ్యమైనంత త్వరగా వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాలని, ఆ తర్వాతనే 'గోల్డెన్ హ్యాండ్ షేక్' (స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ప్రతిపాదించాలని కూడా హితవు పలికారు.
ఉద్యోగులు ఎక్కువైనందునే తొలగించాల్సి వస్తుందని అప్పారావు బృందం చెప్పినపుడు... అలాంటప్పుడు డిప్యుటేషన్ కింద వివిధ ప్రాంతాల నుంచి ఎందుకు తెచ్చారన్న ప్రశ్న కూడా ఎదురయ్యిందట. మెషిన్, ప్రాసెస్, పాకింగ్, సెక్యూరిటీ విభాగాల నుంచి దాదాపు ఏడువందల మందిని బలవంతంగా తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' లో శ్మశాన వైరాగ్యం నెలకొంది. సీనియర్లు తీరని మనోవేదన అనుభవిస్తూ పనిచేస్తున్నారు... గత నెలన్నరగా.  
"ఇది ఒక అద్భుత విజయం. ఇప్పుడు జర్నలిస్టులను, ముఖ్యంగా సీనియర్లను, పెద్ద ఎత్తున ఇళ్ళకు పంపాలన్న యాజమాన్యం ప్లాన్ కు గండి పడినట్లే. అయితే... చట్టాలను ధిక్కరించే వారి ఎత్తుగడలు ఎలాగైనా ఉండవచ్చు, ఎవరినైనా మానేజ్ చేసే సత్తా వారికి ఉంది" అని ఒక బాధిత ఉద్యోగి అన్నారు. అది నిజమే. 
ఉద్యోగాలు పోతాయని, పోతే ఎలా? ఇదేమి దారుణం? అని ఇంటా బైటా ఏడ్చిమొత్తుకునే ఉద్యోగులు... ఎవరో తోడు వస్తారని... ఏదో మేలు చేస్తారని... భ్రమలు పెట్టుకోకుండా... అర్జెంటుగా ఏకం కావాలి. హక్కులు తెలుసుకోవడం, వాటికోసం పోరాడటం తక్షణావసరమని గ్రహించాలి. ఈ కార్మికుల ఐక్యతకు ఇంతకు మించిన అవకాశం రాదని 'ఈనాడు' ఉద్యోగులు గ్రహించి సంఘటితం అయితే వాళ్ళకే మంచిది.

చేసింది చాలు-నిషేధం ఎత్తేస్తే మేలు

మీడియా అంటే స్టూడియోలో కూర్చొని నోటికొచ్చింది వాగడం అనుకునే అర్ణబ్ గోస్వామి అరిచి గీపెడుతున్నారని, ప్రతి దానికీ ప్రత్రికా స్వేచ్చకీ ముడిపెట్టే వేమూరి రాధాకృష్ణ గొంతు చించుకుంటున్నారని కాదుగానీ, టీవీ 9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ మీద ఇకనైనా నిషేధం ఎత్తివేయడం తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి మంచిది. తెగేదాకా లాగడం సభ్యత కాదని తెలుగు మీడియా కబుర్లు భావిస్తోంది.    

ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం. ఆ మాటకొస్తే...ఏ ఛానెల్ ను, పత్రికను మూసినా జనంలో విప్లవం వస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, జనం జర్నలిజాన్ని అసహ్యించుకుంటున్నారు. జనమే కాదు... నికార్సైన జర్నలిస్టులూ ఛీ కొడుతున్నారు. ఏ సామాజిక వర్గమైతే.... తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి, మీడియా పవర్ ను జనాలకు రుచి చూపిందో... అదే సామాజిక వర్గం కుల-రాజకీయ-వ్యాపార విస్తరణ కోసం మరీ హద్దుమీరి బరితెగించి విష సంస్కృతిని (ఒక ఫ్రెండ్ అన్నట్లు డిజిటల్ టెర్రరిజాన్ని) ప్రేరేపించి... జర్నలిజం అంటే జనాల్లో అసహ్య భావన కలిగేలా చేసింది. జర్నలిస్టులను రాళ్ళతో కొట్టే రోజు వచ్చింది.... ఈ మహానుభావుల పుణ్యాన. నిర్దయతో యాజమాన్యాలు జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతుంటే... పట్టని గోస్వాములు, వేరాలకు పత్రికా స్వేఛ్చ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? పత్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు సార్. ఇవి ఇప్పుడు ఎవ్వడికీ పట్టని అంశాలు.  
తెలంగాణా ఉద్యమం స్వరూప స్వభావాలు, కష్టనష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు... మీడియా నిర్వర్తించిన భూమిక ఏమిటో. 
రెండు ఛానెల్స్ మీద కేబుల్ ఆపరేటర్ల సహాయంతో నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదు. ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగింది. ఈ నిషేధం తర్వాత న్యూస్ రూం లలో తెపరితనం గణనీయంగా తగ్గింది. సెటైర్ పేరు మీద చౌకబారు చెత్త ప్రోగ్రాంలు చేసే జర్నలిస్టులు పదాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొన్ని ఛానెల్స్ వాళ్ళు (అప)హాస్యపు ప్రోగ్రాం లకు బ్రేక్ ఇచ్చారు. తెలుగు ఛానెల్స్ వాళ్లకి ఇలా ముకుతాడు పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామం. 

ముఖ్యమంత్రి గారూ...ఇక ఇది చాలు. వందల మంది జర్నలిస్టుల జీవితాలతో ముడి పడి ఉన్న సమస్య ఇది. ఇంకా కొనసాగించడం భావ్యం కాదు. ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. పోయిపోయి రొచ్చులో దూకినట్లుంది. కచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు. 

తెలంగాణలో పుట్టిన పాపానికి అనేక మంది ప్రతిభావంతులైన జర్నలిస్టుల జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళను ఎదగనివ్వలేదు. ఆ లెక్కకొస్తే... ఇప్పుడు వీధిన పడిన జర్నలిస్టులలో అధిక శాతం ఈ ప్రాంతం వాళ్ళే. మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు. సాల్యూట్ కొట్టాలని అనడం అభ్యంతరకరంగా ఉంది. ఇక్కడి జర్నలిస్టుల కోసమైనా....ఇక నిషేధాలు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు తాను ఏకైక పెద్ద ప్రతినిధినని చేరా విశ్వవ్యాప్తంగా చాటుకోవడాన్ని అర్జెంటుగా అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి అవసరం. 

కేబుల్ ఆపరేటర్లతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి... తమ నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా ఉంది కాబట్టి ఈ ఛానెల్స్ కార్యక్రమాలు పునరుద్ధరిస్తున్నామని ప్రకటింపజేయాలి. అదే సమయంలో ఒక నిపుణుల కమిటీ (మళ్ళీ అదే అన్ ప్రొఫెషనల్ గ్యాంగ్ కాకుండా) వేసి..... మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలి. జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి. 
నోట్: నోట్: ముందుగా పెట్టిన "సీఎం కే సీ ఆర్ గారూ.... ఇంక చాలు నిషేధం ఎత్తేయరూ..." అన్న నాసిరకం శీర్షికను మిత్రుల అమూల్య అభిప్రాయం మేరకు మార్చాం. వారి సూచనే కరెక్టు. వారికి థాంక్స్. 

Friday, September 5, 2014

టీచర్స్ డే శుభాకాంక్షలు...

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ... అని మనవాళ్ళు గురువుగారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్శిటీలలో పరిణామాలు చూస్తే... ఇలాంటి సన్నాసి రకాలకా... మనం ప్రాముఖ్యం ఇవ్వాల్సింది... అన్న బాధ కలుగుతుంది చాలాసార్లు. బహు తక్కువ మంది తప్ప టీచర్లు, ప్రొఫెసర్లు అంతా ఈ కేటగిరీ వాళ్ళే! దేశంలో క్రమశిక్షణ లేకపోవడానికి, నేరాలు పెరగడానికి, మానవీయ సంబంధాలు సవ్యంగా లేకపోవడానికి పరోక్ష బాధ్యత గురువులది కూడా ఉంటుందని వీళ్ళు గుర్తెరగకపోవడం బాధాకరం. 

భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామన్న గురుతర ఫీలింగ్ లేకపోవడం, ఇళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించడం, దండన పేరుతో గూండాల్లా దాడి చేయడం, అమానుష-పైశాచిక ప్రవర్తన, చదువుకోడానికి వచ్చిన ఆడపిల్లల మీద కన్నేసి పవిత్రమైన వృత్తికే మచ్చ తెచ్చే పిచ్చిపనులు చేయడం... టీచర్ల గురించి రోజూ పేపర్లలో వస్తున్నవే. అంతా అలా చేస్తారని కాకపోయినా... కొందరు చేసినా మొత్తం వృత్తికి చుట్టుకుంటుంది. ఈ వార్తలు చాలా బాధ కలిగిస్తాయి. గతంలో ప్రభుత్వ టీచర్లు... కొంత రహస్యంగా ఇళ్ళలో ట్యూషన్స్ నడిపి అదనపు ఆదాయం (అ ఆ) గడించేవారు. ఇప్పుడు చాలా మంది... అ ఆ కోసం చిట్టీ వ్యాపారాల్లో తలదూర్చారు. ఇది తప్పేలా అవుతుందని అంటే దానికి సమాధానం లేదు. పిల్లలు తమను అనుకరిస్తారనీ, తమ ప్రవర్తన, చర్యల ప్రభావం పసి హృదయాలపై కచ్చితంగా ఉంటుందని  అర్థం చేసుకోవాలి. 

యూనివర్శిటీలలో స్థితిగతులు దగ్గరి నుంచి చూశాక అర్థమయ్యింది ఏమిటంటే... చాలా మంది ప్రొఫెసర్లు (అసిస్టెంట్ ప్రొ  కావచ్చు, అసోసియేట్ ప్రొ కావచ్చు) పైరవీల మీద ఎంపికై విశ్వవిద్యాలయాల్లో దూరుతున్నారు. అక్కడి ఎంపికలు ఒక ఫార్సు వ్యవహారం, నిస్సందేహంగా. "ఆమె ఒక రోజు వంకాయలు కొనుక్కుంటూ మార్కెట్ లో కనిపించింది. ఏంటమ్మా... పీజీ తో ఆపావు.. పీ హెచ్ డీ చెయ్యి అని నేనే చెప్పి చేయించాను. ఏదో అవకాశం వచ్చి ఒక యూనివెర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వేయించా," అని ఒక పెద్ద సారు ఒకసారి పబ్లిగ్గా చెబితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలా ఎంపికైన మహాతల్లి...వృత్తిలో ప్రొఫెషనల్ గా ఉంటుందా? నో వే. తన చర్మాన్ని రక్షించుకునేందుకు నానా డ్రామాలు చేస్తుంది, నానా గడ్డి కరుస్తుంది. ఒక మహిళను ప్రోత్సహించి పీ హెచ్ డీ చేయించవచ్చు గానీ...పైరవీ తో నియామకాలు జరిపితే? ఇలాంటి వాటివల్ల కనిపించకుండా దారుణంగా దెబ్బతినేది భావితరాల విద్యార్ధులు. 

ఇక స్కూళ్ళలో, యూనివర్శిటీ లలో ఘోరంగా కులగజ్జి పెరుగింది. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. అగ్ర కులాలు, ముఖ్యంగా సో కాల్డ్ బ్రాహ్మణులు, ఎస్సీల మధ్య ఘోరమైన ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. చాలా ఏళ్ళ కిందట విశ్వవిద్యాలయాల్లో చేరిన బ్రాహ్మణులు డీన్ లుగా, వీసీ లుగా ఎదిగారు. ఇందులో పలువురు నిజంగానే కులం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుని అంతేవాసులకు ఆశ్రయం (లక్షలు తెచ్చే ఉద్యోగాలు) ఇచ్చి, కులపు పిల్లలకు చేయూతనిస్తూ వచ్చారన్నది ప్రధాన ఆరోపణ. సొంత ప్రతిభతో గానీ, రిజర్వేషన్ల మూలంగా గానీ ఈ సంస్థల్లో పెద్ద సంఖ్యలో  చేరిన సో కాల్డ్ అణగారిన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ లు, ఈ అన్యాయాన్ని ఎదిరించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జట్టు కట్టారు. ఇది అనేక విశ్వవిద్యాలయాల్లో, డిపార్ట్మెంట్ లలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వాడు చేసాడని వీడు, వీడు చేయట్లేదా.. అని వాడు! బలయ్యేది పిల్లలు, దేశం. 

నాణ్యత కాకుండా.... ఇతరేతర సమీకరణాలను పరిగణలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా... అది ఎవరు తీసుకున్నా తప్పే. ఏ కులాల వాళ్ళు ఆ కులపు బోధకులతో జట్టు కట్టడం, కుట్రలు చేయడం, అ కులపు విద్యార్ధులను మాత్రమే వారంతా ప్రోత్సహించడం...దారుణం, దేశద్రోహం. గురువులారా...మీది ఏ కులమైనా కావచ్చు. దాన్ని ఇంట్లో చక్కగా పాటించుకోండి, వ్యాపింపజేసుకోండి. ఈ పిచ్చి రాజకీయాలు, కుల పిచ్చి పక్కనబెట్టి అద్భుతమైన ఈ భారత దేశాన్ని అగ్రరాజ్యంగా మలచడంలో మీ భూమిక ఏమిటో తెలుసుకోండి. వ్యవస్థలను పటిష్ట పరిచే పనులు చేయండి, దేశ దిశానిర్దేశానికి మీ కార్తవ్యం ఏమిటో ఆలోచించండి. ఈ దేశ నిర్మాణంలో నిజమైన పాత్రధారులు, సూత్రధారులు కండి. గురువు... దేముడని మనసావాచా కర్మణా నమ్మే ఈ దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్.. ప్లీజ్. 

(నోట్: ఈ వ్యాసంలో వాక్యాలను బ్లాంకెట్ స్టేట్మెంట్ గా తీసుకోకండి. స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్శిటీ లలో మనం పైన చూసిన చెత్త అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా... అత్యుత్తమ బోధనే ధ్యేయంగా భావి తరానికి స్ఫూర్తినిచ్చే మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరికీ పాదాభివందనాలు, శుభాకాంక్షలు).    

Wednesday, September 3, 2014

'సాక్షి' లో చేరనున్న కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెంటిలో తనదైన ముద్రవేసిన సీనియర్ మోస్ట్ సంపాదకుడు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'సాక్షి' పత్రికలో చేరబోతున్నారు. దీన్ని ఆయన 'తెలుగు మీడియా కబుర్లు' కు దృవీకరించారు... బుధవారం.  ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయన 'సాక్షి' లో గురువారం చేరతారు. 

నిజానికి 'సాక్షి' పత్రిక ఆరంభించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు... అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆహ్వానించినప్పటికీ మూర్తి గారు ఎడిటర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పతంజలి గారు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణానంతరం వర్ధెల్లి మురళి గారు ఎడిటర్ అయ్యారు. సజ్జల రామ కృష్ణా రెడ్డిగారు మానేజింగ్ ఎడిటర్ గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ విఫలం కావడం, ఈ లోపు అనూహ్య పరిణామాల మధ్య మూర్తి గారు 'ద హన్స్ ఇండియా', హెచ్ ఎం టీవీ ల నుంచి బైటికి రావడం తెలిసిందే. 
'సాక్షి' పాత్రపై కూడా ఆ సంస్థలో అంతర్మథనం జరుగుతున్న నేపథ్యంలో... యాజమాన్యం ఒక పెద్ద దిక్కు కోసం ఎదురుచూస్తూ... మూర్తి గారిని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రింట్ జర్నలిజం లో అద్భుతమైన ఎడిటర్ మూర్తి గారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. వార్త, ఆంధ్ర జ్యోతి ఎదుగుదలలో మూర్తి గారి పాత్ర ఎక్కువే. 

ఆయన అంధ్ర జ్యోతిలో సంపాదక బాధ్యతలు స్వీకరిస్తుండగా.. కపిల్ గ్రూప్ యాజమాన్యం ఏరికోరి మూర్తి గారికి కొత్త ఛానల్ ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. 'దశ-దిశ' వంటి చారిత్రక ప్రోగ్రామ్స్, అంబుడ్స్మన్ నియామకం  వంటి వినూత్న చొరవ తీసుకుంటూ నైతిక జర్నలిజం అనే మాటను బహిరంగంగా అనగలిగే అరుదైన ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నారు. హంస టీవీ సూపర్ గా నడుస్తున్నప్పుడు... 'ద హన్స్ ఇండియా' అనే ఆంగ్ల పత్రిక ఆరంభించి...ఎక్కడో తెరమరుగైన నాయర్ అనే సీనియర్ ఎడిటర్ ను పట్టుకొచ్చి... తనూ ధారాళంగా రాసారు. దీనివల్ల మూర్తి గారు చేతులు కాల్చుకున్నారని చెప్పకతప్పదు. కాలమానపరిస్థితులు, సుడి బాగోలేక అనూహ్య పరిస్థితుల మధ్య ఇటీవలనే బైటికి వచ్చారాయన. ఆయన ను నమ్ముకున్న 20-30 మంది సీనియర్ జర్నలిస్టులను హెచ్ ఎం టీవీ కొత్త యాజమాన్యం పీకిపారేసిన నేపథ్యంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న మూర్తి గారికి... అల్ ద బెస్ట్. 
Photo courtesy: The Hindu 

Monday, September 1, 2014

బాపు గారి పై భమిడిపాటి ఫణిబాబు గారి వ్యాసం

తెలుగు భాష మీద అమితమైన గౌరవంతో, సాహిత్యాభిమానంతో, మానవత్వంతో, నైతికతతో, మనస్ఫూర్తిగా రచనలు చేసే బ్లాగర్లలో భమిడిపాటి ఫణిబాబు గారు (harephala.wordpress.com) ముఖ్యులు. బాపు గారు మనకిక లేరు... అన్న వార్త తెలియగానే... నాకీ పెద్దాయన గుర్తుకు వచ్చారు. పాపం... ఈయన ఎంతగా నొచ్చుకుని ఉంటారో కదా! అనిపించింది. బాపు గారి మీద ఫణిబాబు గారు ఏమి రాస్తారో చూడాలని అనుకున్నాను. ఆ నిజమైన నివాళి కోసం ఎదురుచూస్తున్నాను. బాపు గారితో సహా తేట తెలుగు ప్రముఖులను కలిసి భాష, సంస్కృతుల తియ్యందనాలను ఆస్వాదించి, బ్లాగులో మనకు పంచడమనే మంచి పనిని పూణే లో నివసిస్తున్న ఫణిబాబు గారు చేస్తూ స్పూర్తినిస్తారు. 

బాపు గారు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న రోజున-- గత ఏడాది డిసెంబర్ 14 న--ఫణిబాబు గారు బాపు గారి గురించి రాసిన సింపుల్ వ్యాసం నాకు నచ్చిన వ్యాసాల్లో ఒకటి.   "తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు..." అనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ తో ఆ వ్యాసం ఆరంభమవుతుంది. 
"ఇలాటి జన్మదినాలు ఎన్నో...ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…శ్రీ బాపు గారికి.. హృదయపూర్వక శుభాకాంక్షలు"  అని ఫణిబాబు ముగించారు. కానీ విధివశాత్తూ శ్రీ బాపు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. 

ఈ సందర్భంగా ఫణిబాబు గారు రాసిన వ్యాసం ('బాపు'రే... ఎక్కణ్ణించి వస్తాయో ఆ ఆలోచనలు)  మీ కోసం దిగువన ఇస్తున్నాను. బాపు గారి గురించి అంత అద్భుతంగా మనసుకు హతుకునేలా రాసే శక్తి సామర్ధ్యాలు, అర్హతలు మాకు లేక... ఫణిబాబు గారి వ్యాసం తస్కరించి ఇస్తున్నాం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం.  ఫణిబాబు గారికి కృతఙ్ఞతలు. 

తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు. అసలు ఆయన వేసే కార్టూన్లు చూడ్డంతోటే నవ్వొచ్చేస్తుంది. ఇంక వాటికి వ్రాసిన కాప్షన్లైతే మరీనూ. ఆ బుర్రలోకి అలాటి ఆలోచనలు ఎలా వచ్చికూర్చుంటాయో తెలియదు. ఈ టపాలో పెట్టిన ఫొటో ఎప్పుడో “హంస” పత్రిక కి ముఖచిత్రంగా వేశారు. మరి దానికి సంబంధించిన వ్యాసం కూడా చదివేయండి..మన బాపు
    తెలుగు ఆడబడుచుకి నిర్వచనం చెప్పి, తెలుగమ్మాయి ఎలాఉండాలో చూపించిన ఘనత ఆయనదే. ఓ అమ్మాయి అంటే ఓ benchmark సృష్టించి అమ్మాయంటే ఇలాగుండాలీ అని ఓ ఆర్డరు పాస్ చేసేశారు.తెలుగు ఆడబడుచుకి ముగ్ధమనోహరరూపం సృష్టించింది “ఆంధ్రసచిత్రవారపత్రిక” కి ” ముఖపత్రచిత్రం వెనక కథ ఏమిటో కూడా చదివి ఆనందించండి.
ముఖపత్ర చిత్రం
    ఆరోజుల్లో శ్రీబాపు గారు “తెలుగువెలుగు” శీర్షికతో పాటు కొన్ని కథలు చిన్నపిల్లలకోసం వ్రాసేవారు. మచ్చుకి ఓ జపనీస్ కథ ఆధారంగా వ్రాసిన కథ కూడా చదవొద్దూ మరి..అమ్మ బొమ్మ– శ్రీ బాపు
    అసలు తాము తీసిన సినిమాలమీద వ్యంగ్యాస్త్రాలు వేయడం ఎప్పుడైనా విన్నామా? మరి అదే శ్రీ బాపు గారి ఖలేజా..మా సినిమాలు-బాపు( This link may take some time to open.. please bear with me. Be patient..its worth the delay)
    అసలు ఎన్నో ఎన్నెన్నో వ్రాయాలనుకున్నాను. కానీ ఆయన గురించి వ్రాయడానికి మనకి ఓ అర్హత కూడా ఉండాలిగా. అది లేకే ఇంకెవరెవరో వ్రాసినవి మీ అందరితోనూ పంచుకుంటున్నాను.ఈ సందర్భంలోనే , శ్రీ బాపు గారి “గొప్ప మనసు” గురించి, తన అనుభవాన్ని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారి అక్షరరూపంలో ఉంచారు. చదవండి.satamanam
    అఛ్ఛా Also ran.. అని ఎప్పుడంటారో విన్నారా? ఇదిగో ఇలాటప్పుడు– ప్రముఖులకి సంబంధించిన విషయాలలో ఇంకో అర్భకుడి గురించి చెప్పాల్సొస్తే, ఇలా Also ran.. అని అంటూంటారు.ఇక్కడ ఆ అర్భకుడికి ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు ఏదో ఓ ఒక్క విషయంలో తప్పించి..అదిగో అలాటి సందర్భంలోనే నేను కూడా Also ran. గురువుగారు డిశంబరు 15 న ఎనభైయ్యో సంవత్సరం పూర్తి చేసికుంటూంటే నేను డెభైయ్యో పడిలోకి అడుగెడుతున్నాను, అది నేను చేసికున్న అదృష్టం.
    ఇలాటి జన్మదినాలు ఎన్నో..ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…
     శ్రీ బాపు గారికి
     హృదయపూర్వక శుభాకాంక్షలు

Sunday, August 31, 2014

తేట తెలుగు కుంచె...అకటా విశ్రమించె...


                                          సత్తిరాజు లక్ష్మీనారాయణ డిసెంబర్ 15, 1933- ఆగస్టు 31, 2014
బొమ్మకు, తేట తెలుగుకు, మంచికి, మానవత్వానికి, మిత్రత్వానికి, వినమ్రతకు మారుపేరు...బాపూ... మీకిదే మా అశ్రునివాళి... హేమ, రాము 

Wednesday, August 27, 2014

నా పాకిస్థాన్ మిత్రురాలు-స్నేహిత్ -ఒక అనుభూతి

సుందరమైన ప్రకృతి కాక సృష్టిలో అత్యంత అద్భుతమైనది ఏమైనా ఉందా అంటే...అమ్మ ప్రేమ తర్వాత నిస్సందేహంగా స్నేహానుబంధమే. ఫ్రెండ్స్ గా కలిసిన మేము (రాము, హేమ) ఇద్దరు పిల్లలకూ ఫ్రెండ్ షిప్ అర్థం వచ్చేలా... మైత్రేయి, స్నేహిత్ అని పెట్టాం. మన చాదస్తం కొద్దీ... మా వాడి పేరులో మరొక రెండు పేర్లు (ఫిదెల్ రఫీక్) కూడా తగిలించి సన్నిహిత మిత్రులతో తిట్లు తింటూ ఉంటానన్నమాట! 
నేను 'ది హిందూ' వదిలి... 'మెయిల్ టుడే' అనే ఒక అడ్డగోలు పత్రికలో చేరి... ఏ క్షణాన జర్నలిజం వీడి పారిపోదామా అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఇచ్చిన వరం... అమెరికా వెళ్ళే అవకాశం. 2009 లో ఒక ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ యూనివెర్సిటీ, జిమ్ కెల్లీ- ఇండియానా యూనివెర్సిటీ)వచ్చి ఉస్మానియాలో జర్నలిస్టుల కోసమని ఒక వర్క్ షాప్ పెట్టి... ఒక సైన్స్ రిపోర్టింగ్ లో భాగంగా ఒక స్టోరీ రాయమంటే... దంచి కొట్టాను. నా స్టోరీ బాగుందని చెప్పి.. అమెరికా వెళ్ళాక... అక్కడ ఫ్రీగా 21 రోజులు ఉండడానికి టికెట్స్ పంపారు... పాస్ పోర్ట్ అవీ చూసుకుని. ఇండియా నుంచి నేను, ఒక గుజరాతీ రాజేష్ గుప్తా; పాకిస్తాన్ నుంచి అఫ్షాన్ ఖాన్, అయేషా సదన్; శ్రీలంక నుంచి మిలింద రాజపక్ష, దాసున్ ఎదిరిసింఘే ; కెన్యా నుంచి జాకోబ్ ఒటీనో, లూసియానే లిమో ఆ టూర్ కు సెలెక్ట్ అయ్యాము.

2009 ఏప్రిల్-మేలో జరిగినదది. ఆ టూర్ లో చాలా నేర్చుకున్నాం. ఒక్క ఇండియా వాడు తప్ప... మిగిలిన ఆరుగురూ నాకు మంచి మిత్రులయ్యారు. మేము వచ్చేటప్పుడు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలుక్కున్నాం. ఈ పక్క ఫోటో లో ఏడుగురుం ఉన్నాం... కెన్యాలో ఫోటో ఎడిటర్ అయిన జాకోబ్ ఫోటో తియ్యడం వల్ల మిస్సయ్యాడు. సరే.. మా మధ్యన ఫేస్ బుక్ ద్వారా మంచీ చెడూ మాట్లాడుకోవడం జరుగుతున్నది. 
మా వాడు ఫిదెల్ దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ పోటీలలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఆగస్టు 20 న ఇస్లామాబాద్ వెళతాడని ఒక నెల ముందు తెలియగానే చాలా ఆనందం అనిపించింది. మిత్రురాలు అఫ్షాన్ గారి కోసమని నేను మా కోచ్ సోమనాధ్ ఘోష్ భార్య, మిత్రుడు శంకర్ కలిసి షాపింగ్ చేసి ఒక మంచి ముత్యాల కంఠహారం కొన్నాం. దాన్ని భద్రంగా పాక్ చేసి.. అఫ్షాన్ గారికి ఇవ్వమని ఫిదెల్ కు చెప్పాము నేను, హేమ. 


ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు, అక్కడి రాజకీయ పరిణామాలు కల్పించిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల టూర్ ఉండదేమో అని ఒక దశలో అనుకున్నాం. ఎందుకొచ్చిన గొడవలే... పోకపోతేనే మేలని వాస్తవానికి నాకనిపించింది. కానీ ఇస్లామాబాద్ లో గొడవలు 'రెడ్ జోన్' అన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమని, అంతగా భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. 
మొత్తం మీద ఆదివారం (ఆగస్టు 24) నేను ఊళ్ళో లేని కారణంగా... మా వాడిని హేమ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశ రాజధాని విమానం ఎక్కించగా (ఈ పక్క ఫోటో) మర్నాడు భారత జట్టుతో కలిసి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు. అప్పటికే భారత బృందం ఇస్లామాబాద్ లో విడిది చేసే బస, క్రీడా ప్రాంగణం వివరాలు అఫ్షాన్ గారు (ది న్యూస్ అనే ఆంగ్ల పత్రికలో ఆమె సీనియర్ జర్నలిస్ట్) తెలుసుకుని సిద్ధంగా ఉన్నారు. 
నిన్న ఉదయం (ఆగస్టు 26) అఫ్షాన్ గారి భర్త స్నేహిత్ ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియం కు వెళ్ళారు, తనతో మాట్లాడి వచ్చారు. సాయంత్రం మేడం.. తన కుమారుడు ఐజాజ్ తో కలిసి వెళ్లి పలకరించి వచ్చారు. కింది ఫోటోను ఆమె వెంటనే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఇది మాకు ఎంతో ఆనందం కలిగించింది. అక్కడకు హైదరాబాద్ నుంచి వెళ్ళిన మరొక క్రీడాకారిణి శ్రీజ, కోచ్ ఇబ్రహీం ఖాన్ లను కూడా కలవమని చెప్పాను. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ, జిమ్ కెల్లీ-ఇండియానా) చాలా ఆనందించారు.  

ఐదేళ్ళ కిందట నేను దేశం కాని దేశంలో కలిసిన ఒక పాకిస్థానీ మిత్రురాలిని, వారి కుటుంబాన్ని నా సన్ కలవడం.. ఒక గొప్ప అనుభూతి. నేను పంపిన నెక్లెస్ ఆమె కు బాగా నచ్చింది. హేమ కోసమని తను ఒక గిఫ్ట్ స్నేహిత్ కు ఇవ్వడమే కాకుండా... ఆటలు అయ్యాక... తనను ఇంటికి ఆహ్వానించారు. 
స్నేహిత్ ను కలిసాక... ఆమె నాకు పంపిన సందేశం: 

Thankyou so much for a wonderful gift Ramu ...Im highly obliged and honoured by your lovely gift. Give my big thanks to hema too because I know she must have chosen it for me. I have also given a small token for Hema I hope she likes it .. my husband shiraz also met Fidel and he said that hes very innocent Mashallah ..All the best for his championship ...take care..my son will see all the matches tomorrow

ఫ్రెండ్ షిప్ తో పాటు క్రీడల గొప్పతనం ఇదే. ఎక్కడి మనుషులను, మనసులను కలుపుతాయి. ఆనందాన్ని పంచుతాయి. అదీ సంగతి!