భారత గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో రైతుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రభుత్వానికి మీడియాకు మధ్య మరొకమారు ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.
జనవరి 26 న ప్రదర్శనలో పాల్గొన్న ఒక రైతు మరణిస్తే... ఆయన పోలీసు కాల్పుల్లో బులెట్ కు బలయ్యారని ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ సహా కొందరు జర్నలిస్టులు ట్విట్టర్లలో, వార్తల్లో ప్రసారం చేయగా... ఇందుకు సంబంధించి ట్రాక్టర్ బోల్తా పడడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వాదించారు. ఒక వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.
ఈ లోపు ఇండియా టుడే యాజమాన్యం రాజదీప్ ను ఒక రెండు వారాల పాటు తెరమీద కనిపించకుండా చేయడంతో పాటు గా ఒక నెల జీతం కోత విధించినట్లు ప్రకటించింది. దీంతో ఈ సీనియర్ ఎడిటర్ తప్పు చేసినట్లు యాజమాన్యం నిర్ధారణకు వచ్చినట్లు అనిపించింది. అయితే దీని మీద సర్దేశాయ్ స్పందించినట్లు లేదు. తెరవెనుక ఒత్తిడి వల్లనే ఇండియా టుడే యాజమాన్యం ఈ ప్రకటన చేసిందన్న వాదన ఉంది.
ఈ లోపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులపై (వారు: మృణాల్ పాండే, రాజదీప్ సర్దేశాయ్, వినోద్ జోస్, జాఫర్ అఘా, పరేష్ నాథ్, అనంత్ నాథ్) లపై పోలీసులు దేశద్రోహం వంటి సీరియస్ అభియోగాలతో కేసులు నమోదుచేశారనే సమాచారం సంచలనం సృష్టించింది . రైతుల ర్యాలీ సందర్భంగా విధ్వంసం జరగడానికి కారణం వీళ్ళ డిజిటల్ బ్రాడ్ కాస్ట్ లు, సోషల్ మీడియా పోస్టులంటూ ఒక స్థానికుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులుస్పందించి ఈ చర్య తీసుకున్నారట!.
ఈ చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. జర్నలిస్టులపై కక్ష గట్టి ఇలా వెంటాడుతున్నారని, ఒక ఉద్విగ్న వాతావరణం ఏర్పడిన గందరగోళ వాతావరణంలో పలు వైపులా నుంచి వచ్చే అన్ని వివరాలను రిపోర్ట్ చేయడం జర్నలిజంలో సంప్రదాయంగా వస్తున్న విషయమేనని స్పష్టంచేసింది. ఎడిటర్స్ గిల్డ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటన ఇది: