"ది హిందూ' బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్ గా శ్రీనివాస రెడ్డి
'ది హిందూ' పత్రిక కోసం హైదరాబాద్ లో చాలా కాలంగా పనిచేస్తున్న కె.శ్రీనివాస రెడ్డి గారిని ఆ పత్రిక యాజమాన్యం బెంగళూరు కు రెసిడెంట్ ఎడిటర్ గా పంపింది. క్రైమ్ రిపోర్టింగ్ లో దిగ్గజం లాంటి శ్రీనివాస రెడ్డి చాలా కాలంగా హైదరాబాద్ లో సిటీ ఎడిటర్ గా ఉన్నారు. బెంగళూరు ఎడిషన్ ను చక్కబెట్టే బాధ్యతను ఆయనకు యాజమాన్యం అప్పగించింది. ఎంతో సమర్ధుడు, మృదు స్వభావి అయిన శ్రీనివాస రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఘన విజయం సాధిస్తారని ఆశిద్దాం. అదే సమయంలో హైదరాబాద్ బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ కు కూడా రెసిడెంట్ ఎడిటర్ హోదా ఇచ్చారు. నగేష్ రిటైర్ అయ్యాక మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్ వస్తారా? లేక ఇక్కడ ప్రమోషన్ లైన్ లో ఉన్న వెంకటేశ్వర్లు గారికి పదోన్నతి ఇస్తారా? అన్న అంశాలపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
'మెట్రో ఇండియా' ఎడిటర్ గా ఎ.శ్రీనివాస రావు
'నమస్తే తెలంగాణా' పత్రిక అధిపతి రాజం గారు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక (మెట్రో ఇండియా) ను తే బోతున్నారు. అందుకు సిబ్బంది నియామకం జరుగుతున్నది. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే లలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఏ. శ్రీనివాస రావు గారు ఎడిటోరియల్ అధిపతి గా నియమించారు. నేను మెయిల్ టుడే లో ఒక ఆరు నెలలు పనిచేసి వదిలేసి అమెరికా వెళ్ళే ముందు శ్రీనివాస రావు గారు ఆ పత్రికలో చేరారు. ఆయన అక్కడ సమర్ధంగా పనిచేసారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన చావులపై ఆయన రాసిన పరిశోధనాత్మక కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, ది హిందూ, ది హన్స్ ఇండియా, పోస్ట్ నూన్ లలో పనిచేసి సొంతగా ఒకటి రెండు వెబ్ సైట్స్ నడుపుతున్న కాకలు తీరిన జర్నలిస్టు సాయ శేఖర్ ను, టైమ్స్ ఆఫ్ ఇండియా, టీ వీ నైన్ గ్రూప్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసిన అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ లతో కూడా రాజం గారు చర్చలు జరిపాక... రావు గారిని ఎంచుకున్నారు.
రావు గారితో పాటు బీ ఎస్ రామకృష్ణ గారు కూడా మెట్రో ఇండియా లో చేరారు. డెక్కన్ పోస్ట్ అనే పత్రికకు మంచి పేరు రావడంలో వీరిద్దరి పాత్ర చెప్పుకోదగినది. స్పోర్ట్స్ ఎడిటర్ పోస్ట్ ఇస్తే వీరితో పనిచేస్తే బాగని గట్టిగా అనుకుని నేను భంగపడ్డాను. మొత్తం మీద మెట్రో టీం కు మేలు జరుగుగాక!
ఐ-న్యూస్ లో చేరిన రామ్ కరణ్
హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంతకు ముందు ఏమి చేసారో తెలియదు. తర్వాత టీ వీ నైన్ గ్రూప్ లో, రీసెంట్ గా ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. నేను ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నప్పుడు రామ్ కరణ్ గారిని 'ది హన్స్' కు ఆహ్వానించాలని మా సారు అనుమతితో అడిగాను కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఆయన రాలేదు. రామ్ కరణ్ గారి లాంటి మంచి ఎడిటర్ ను ఇంగ్లిష్ జర్నలిజం కోల్పోవడం బాధాకరం.
'ది హన్స్ ఇండియా' టాబ్లాయిడ్
కపిల్ గ్రూప్ వారి 'ది హన్స్ ఇండియా' ఈ మధ్యన హైదరాబాద్ వార్తలకోసం ఒక టాబ్లాయిడ్ ను ముద్రించడం ఆరంభించింది. 'హైదరాబాద్ హన్స్' అని దీనికి నామకరణం చేసారు. హన్స్ ఎడిటర్ (ఒకప్పటి డీ సీ వీరుడు) పీ ఎన్ వీ నాయర్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ది హన్స్ మెయిన్ పేజీలను గల్ఫ్ పేపర్లలో పనిచేసి వచ్చిన మధుసూదన రావు గారు చూస్తున్నారు. నిజానికి ది హన్స్ ఇండియా ను టాబ్లాయిడ్ రూపం లో తేవాలని ముందుగా భావించారు కానీ అది కుదరలేదు.
కందుల రమేష్ సారధ్యంలో ఇంగ్లిష్ ఛానెల్
సీ వీ ఆర్ సంస్థ వారి న్యూస్ ఛానెల్, వైద్యం చానల్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. తెలుగు ఛానెల్స్ విప్లవం ఆరంభమయ్యాక టీ వీ-5, ఐ -న్యూస్, స్టూడియో ఎన్ లలో పనిచేసిన కందుల రమేష్ గారు సీ వీ ఆర్ న్యూస్ లో చేరారు మొదట్లోనే. మొదట్లో ప్రింట్ లో ఉండి, అందరి కన్నా ముందు ఆన్ లైన్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టు ఆయన సారధ్యంలో సీ వీ ఆర్ గ్రూపు ఒక ఇంగ్లిష్ ఛానెల్ తేబోతున్నది. దాని బాధ్యతలను యాజమాన్యం కందుల రమేష్ గారికి పూర్తిగా అప్పగించినట్లు సమాచారం. గతంలో ఎన్ డీ టీ వీ, టైమ్స్ నౌ ఆంగ్ల చానెల్స్ కోసం పనిచేసిన సునీల్ పాటిల్ కూడా ఆ పని మీదనే ఉన్నారు.