మసాజ్ పేరిట సెక్స్ సేవ అందించే వారిది బతుకు పోరాటం కావచ్చు.
మసాజ్ చేయించుకునే వారిది కండరాల నొప్పో, తీటో, ఒళ్ళు బలుపో కావచ్చు.మరి...నీలి మసాజ్ సెంటర్లపై ప్రత్యేక స్టోరీ పేరుతో బూతు క్లిప్పులు, తిక్క బాక్ గ్రౌండ్ పాటలు, అమానుషపు బొమ్మలు చూపే ఛానల్ ను ఏమనాలి?
పసుపు రంగు ఛానల్ చేసిన నీలి రంగు జర్నలిజం ఇది. అదే...స్టూడియో-ఎన్ ఛానల్. అది ఈ రాత్రి 'ఫోకస్' పేరిట 'మసాజా? మజాకా?' అనే శీర్షికతో ప్రసారం చేసిన కార్యక్రమం ఫక్తు బాధ్యతారహిత జర్నలిజం. ఆ మిషతో...కుటుంబంతో కలిసి కూర్చొని చూడడానికి వీలు లేని బూతు బొమ్మలు చూపడం...ఒక వికారపు పని, మానసిక వైకల్యం, టీ.ఆర్.పీ. వేటలో చేసిన ఒక నీచ ప్రయత్నం.
పోలీసోడికి...రాంగ్ రూట్ లో పోతున్న అర్భకుడు దొరికినట్లు ఈ మధ్యన ఈ టీ.వీ.ఛానెల్స్ కు మసాజ్ కేంద్రాలు దొరుకుతున్నాయి. మీరు గమనించారో లేదో... పుట్టగొడుగుల్లా ఈ ఛానెల్స్ పుట్టుకొచ్చాక పోలీసులు, ఛానెల్స్ కలివిడిగా, విడివిడిగా ఈ మసాజ్ కేంద్రాలను ఒక పెద్ద సబ్జెక్టుగా తెరమీదికి తెస్తున్నాయి...క్రమం తప్పకుండా. ప్రజల మానసిక బలహీనతను సొమ్ము చేసుకునే దారుణ ప్రయత్నమిది. ప్రతి పదిహేను రోజులకొకసారి....మసాజ్ సెంటర్లపై దాడులు, వార్తలు! ముఖం కనిపించకుండా కప్పుకుని ఆ గృహాల నుంచి మహిళలు వస్తుండడం, వారిని కెమెరా వీరులు వెంటాడి షూట్ చేయడం...దాన్ని నిస్సిగ్గుగా గంటల తరబడి చూపించడం....రెగ్యులర్ ఫీచర్ అయ్యింది.
ఈ ఛానెల్స్ నిజంగానే సామాజిక ఉద్ధరణకు నడుం బిగించాయి...సాంస్కృతిక పోలీసింగ్ కు పాల్పడుతున్నాయి...అనుకోవడానికి వీల్లేదు. వార్తను వార్తలా కాకుండా...మసాలా దట్టించి ఈ కథనాలు పసారం చేస్తున్నాయి. దాడులు జరిపి ఆ అభాగినులను పట్టుకున్న ప్రతిసారి...బూతు క్లిప్స్ చూపించి ఛానెల్స్ హడావుడి చేస్తున్నాయి.
ఇది ఛానల్ బాసులకున్న చిత్తకార్తె కక్కుర్తి వ్యవహారం...మనమేమీ చేయలేం...అనుకుందామా? ఆ పరిధులను కూడా మించి ఈ రాత్రి స్టూడియో-ఎన్ ఈ 'ఫోకస్' ను ప్రసారం చేసింది. ఇందులో...ఒక పురుషుడి మీద కూర్చున్న ఒక మహిళ వివస్త్ర కావడం, మరొక ఆమె సెక్సీగా ఒకడికి మసాజ్ చేయడం...వంటి తీవ్ర అసభ్య క్లిప్స్ పదే పదే చూపారు. దానికి తోడు..."యహ...యమ డూపు...యమ డూపు...ఎం.-టీ.వీ సుబ్బలక్ష్మిదే..." అంటూ ఒక దరిద్రపుగొట్టు బూతు సాంగు...బాక్ గ్రౌండ్ లో.
సాధ్యమైనంత ఎక్కువ బూతు చూపడానికే మొత్తం కథనాన్ని సాగ తీసి కంపు కంపు చేశారు. టీ.ఆర్.పీ. రేటింగ్ సరిగా రాక నిస్పృహలో ఉన్న బాసులు మరీ ఇంతగా దిగజారారు. ఇది విచారకరం. బాసులూ...మీ తల్లి, మీ కూతురు, మీ కొడుకు, మీ పేరెంట్స్ కూచొని చూస్తున్నప్పుడు ఇదే బూతు మీ టీ.వీ.లో వస్తే....మీరు చూపితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. మరీ...బరితెగించవద్దు. కాస్త సభ్యతతో ఉండవచ్చేమో చూడండి.
ఈ బూతు వ్యవహారానికి మహిళా సంఘం నాయకురాలు సంధ్యక్క బైట్ ఒకటి. ఛానల్ చూపాల్సిన బూతు వివిధ యాంగిల్స్ లో, వివిధ ఎఫెక్ట్స్ తో చూపాక....ఆమె తెర మీదికి వచ్చి...'ఇది (మసాజ్ సెంటర్లలో చీకటి పనుల నిర్వహణ)దారుణం, ఘోరం, పాశవికం,' అని దంచుకున్నారు...సహజ శైలిలో. ఛానల్ వాళ్ళు గొట్టం నోటి దగ్గర పెట్టగానే ఉపన్యాసాలు దంచడం కాదు...వారు చేసే నీలి అకృత్యాన్ని కాస్త గమనించి....ఆ దారుణంపై ఉద్యమించి...మమ్మాదుకో...మహా తల్లీ. బూతు పని చేస్తున్నది...ఆ ఆడ తల్లులు కాదమ్మా....ఈ బ్లూ ఛానెల్స్.