(నేడు జాతీయ పౌర సంబంధాల దినోత్సవం)
ఈ మధ్యనే ఒక హిందీ సినిమా చూశాను. పేరు గుర్తు లేదు. మందు కొట్టకుండా...శీలం కోల్పోకుండా...మోడలింగ్ రంగంలో రాణించాలని అనుకునే ఒక ముద్దుగుమ్మకు కారులో పోతూ లిప్ స్టిక్ రాసుకుంటూ ఒక సీనియర్ మోడల్ అద్భుతమైన విషయం చెబుతుంది. వెయిట్ ఫర్...సహీ వఖ్త్...సహీ ఆద్మీ...సహీ పీ.ఆర్.
ఆ డైలాగ్ వినగానే...ఆణిముత్యంలా అనిపించి ఆ మాటలను, సినిమా పేరును ఒక పేపర్ మీద రాసుకున్నాగానీ అది ఎక్కడో పోయింది. ఇందులో మొదటిది (సహీ వఖ్త్) మనకున్న అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నసీబ్ బాగోలేకపోతే...ఎంత బాగా పనిచేసినా విలన్లమయిపోతాం. మనకు జీవితంలో చాలా సార్లు చేదే ఎదురవడానికి ఈ వఖ్తే కారణం. అందుకే...ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ ఓన్ డే అనీ...ఉందిలే మంచి కాలమ్ ముందు ముందున...అంటుంటారు ఆశాజీవులు. మనుషులుగా మన టైం కోసం మనం ఎదురుచూడటం తప్ప మనమేమీ చేయలేం. అంతదాకా...టైం బాగోలేదు బ్రదర్...అని నలుగురికి చెబుతూ బతకడమే. నాకు కూడా ఒక వారం రోజుల నుంచీ టైం బాగోలేదు.
ఇక రెండోది సహీ ఆద్మీ. ఇక్కడ మనం తెలివిగా వ్యవహరించాలి. ప్రతొక్కడితో గొడవలు పెట్టుకుంటే పనికిరాకుండా పోతాం. ఎవడు ఎలా ఎదుగుతాడో, ఎవడికి ఎంత పలుకుబడి ఉంటుందో చెప్పలేం గదా. నేను పనిచేస్తున్న వ్యవస్థలో ఒకే ఒక ఆద్మీ తనను పొగిడేవాళ్లను, తన ప్రతిభను చాటేవాళ్లను, తనకు ఇతరుల మీద పితూరీలు చెప్పేవాళ్లను ఎన్ని తీరాలకు తీసుకుపోతున్నాడో చూస్తే ఆశ్చర్యమేస్తున్నది. పొగిడేవాళ్లు, బాకా ఊదేవాళ్లు, చాడీలు చెప్పేవాళ్లను నమ్మకూడదన్న కనీస భావం కూడా మన సారుకు లేకపోవడం నిజంగా వింతే. నిజానికి ఏవడో ఒక ఆద్మీని నమ్ముకుని బతకడం ఆత్మాభిమానం ఉన్నవాళ్లకు కష్టమైన పని. వాడు చేసే ప్రతి చెత్త పనినీ ఎలా ఆమోదిస్తాం...చెప్పండి. ఆ ఆద్మీ చేసే సవాలక్ష తుక్కు పనులను ఆహో...ఓహో...అని పొగడాలంటే ఆత్మ ఉండకూడదు. ఇలాంటి అమాం బాపతుగాళ్లు అన్ని రంగాల్లో కన్నా జర్నలిజంలో ఎక్కువగా ఉంటున్నారు.
ఇక మూడోది సహీ పబ్లిక్ రిలేషన్. చాలా మంది ఉద్యోగులు రోజూ కుంగిపోవడానికి ప్రధానంగా ఇదే కారణం. పి.ఆర్. ఒక అద్భుత విద్య, కళ. పండగలూ, బర్త్ డేలూ, చావులూ, పెళ్లిళ్లూ...ఒకటేమిటి పీ.ఆర్. జీవికి ప్రతి సందర్భమూ ఒక వరమే. పీ.ఆర్. లో భాగంగా వాటిని వాడుకుని బాసును పట్టేయవచ్చు. నేను ఈనాడులో ఉండగా...ఒక జూనియర్ ఒకనాడు బియ్యపు గింజపై రామోజీరావు అనే పేరు చెక్కించి తెచ్చి చూపించాడు. ఇది మన లెక్క ప్రకారం కాకాపట్టడం కిందకు వస్తుంది. అలాంటివి మనం చేయం. కానీ...ఆ రోజు రామోజీరావు బర్త్ డే అని తెలుసుకుని వాడు అది తెచ్చి...సమయం చూసుకుని ఫిఫ్త్ ఫ్లోర్ కు వెళ్లి ఆయన్ను కలిసి అది ప్రజెంట్ చేసి వచ్చాడు. మరీ అద్భుతమైన బుర్రలేకపోయినా...సదరు జర్నలిస్టు ఆ తర్వాత ఈ టీవీలో మంచి పొజిషన్ కు పోయి...కాస్త కష్టపడి ఒక ఇంగ్లిషు న్యూస్ పేపర్లోకి వెళ్లి...తర్వాత సొంత జిల్లాలో ఒక ప్రముఖ దిన పత్రికలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
ఎక్కడ పనిచేసినా...మనసులో అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పడం... దురద కొనితెచ్చుకోవడం మా సోదరులకు చాలా మందికి అలవాటు. ఇది చూసి మంచి పాఠాలు నేర్చుకుని రెండేళ్ల నుంచి నేను కూడా పండగలకు ఎస్ ఎం ఎస్ లు ఇవ్వడం, బాగోలేకపోయినా మీ ఆర్టికల్ బాగుందని పొగడటం లాంటి చీప్ ట్రిక్స్ చేయాలనుకుంటున్నా గానీ చాలా సార్లు మనసొప్పక ఆగిపోతున్నా. పది మంది పొట్టకొడుతూ బైటి ప్రపంచానికి అద్భుతమైన జర్నలిస్టులమని పోజిచ్చే వారి భజన ఎలా చేయగలం, చెత్త జర్నలిజం చేస్తూ గ్రూపులు పోషిస్తూ ఇతరులను పనికిరానివారిగా ముద్రవేసే వారిని ఎలా ఆకాశానికి ఎత్తగలం అన్న సందేహం చాలా మందిని పీడిస్తున్నది. ఇలాంటి సందేహ జీవులు జీవితాంతం నానా తంటాలు పడుతూనే ఉంటారు. అలాంటి సోదరులను ఓదార్చడానికి నా భుజం ఎప్పుడూ సిద్ధమే.
ఇలాంటి సందేహాల గురించి మదనపడటానికి, తీరిగ్గా కూర్చుని పీ.ఆర్. విషయంలో ఒక వ్యూహం పన్నుకోవడానికే ఈ రోజు పౌర సంబంధాల దినోత్సవం జరుపుకుంటున్నారు. మీరు కూడా...గతాన్ని మరిచిపోయి మనశ్శాంతి కోసం, సొంత ప్రయోజనాల కోసం, పొట్ట కూటి కోసం, కుటుంబం కోసం, మంచి భవిష్యత్తు కోసం పీ.ఆర్. చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేం తప్పు కాదు. బాసులు నికార్సయిన యాస్ (గాడిద) లు. ఈ గాడిదల ముందుకు పోతే...మనకు తల పొగరనుకుంటాయి, వెనక ఉంటే కాలుతో తంతాయి. అందుకే...బాసులతో పెట్టుకోకుండా వారిని యాస్ లుగానే మనసులో ఊహించుకుంటూ మంచి ఎత్తుగడలతో బుట్టలో వేసుకుంటూ....అద్భుతమైన పీ.ఆర్.తో మీరంతా వెలుగొందాలని, సుఖశాంతులతో బతకాలని కోరుకుంటూ...హ్యాపీ నేషనల్ పీ.ఆర్. డే.