ఈ దారుణ పరిస్థితులకు ఇంకాస్త ముందుగానే తెలుగునేల మీద మాజీ
ఐ ఏ ఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ గారి నేతృత్వంలో ఆరంభమైన లోక్ సత్తా ఉద్యమం ఆశాజీవులకు ఎంతో ఊరట ఇచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా... 'ప్రజలే ప్రభువులు' అన్న నినాదంతో అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని చూరగొన్న లోక్ సత్తా నిజంగానే అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఎదిగి... ప్రధాన రాజకీయ పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. ఉద్యమం నుంచి రాజకీయ పార్టీ గా మారిన తర్వాత లోక్ సత్తా ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయింది.
దాదాపుగా లోక్ సత్తా లాంటి లక్ష్యాలతో... అవినీతిపై సమర శంఖం మోగిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )... దేశ రాజధానిలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఒక ఏడాదిలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో... సహజంగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జయప్రకాశ్ నారాయణ్ ల వ్యవహార శైలి మధ్య సారూప్యాలపై చర్చ జరుగుతున్నది. మా విశ్లేషణ ప్రకారం... ఇద్దరి మధ్య, ఈ మాజీ సివిల్ సర్వీస్ అధికారుల నేతృత్వంలోని పార్టీల మధ్య ఈ కింది తేడాలు ఉన్నాయి.
ఒకటి) క్షేత్ర స్థాయి యంత్రాంగం: ఉద్యమ కాలంలో... అవినీతిపై యమ కసితో ఉన్న ప్రజల మనసులను చూరగొన్న లోక్ సత్తా ఒక ప్రభావశీలమైన క్షేత్ర స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధి తో పనిచేసిన కార్యకర్తలను ఎన్నికల సమయానికి కాపాడుకోలేకపోవడం ఒక పెద్ద తప్పిదం. దాని మీద విశ్లేషణ లేకపోవడం కూడా నష్టం చేసింది. దీనికి భిన్నంగా ఆప్ నాయకులు గ్రౌండ్ లెవల్ కార్యకర్తలను సమకూర్చుకున్నారు... సందర్భానుసార విశ్లేషణలు, దిద్దిబాటు చర్యలతో. పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్నా... అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయి యంత్రాంగం ఏర్పడి ఆప్ కు అండగా నిలిచింది.
రెండు) విద్యాధికుల మద్దతు: ఆప్ కార్యకర్తల్లో ప్రధానంగా విద్యాధికులు (లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు వగైరా) ఉన్నారు. వారు చిత్తశుద్ధి తో పార్టీని సొంతంగా భావించి పనిచేసారు. ఇలాంటి ప్రభంజనాన్ని లోక్ సత్తా సృష్టించలేక పోయింది. దీనికి కారణం... కొందరు నేతల దురహంకార ధోరణి అన్న విమర్శ ఉంది. విద్యాధికులు 'ఒపీనియన్ లీడర్స్' అని, వారి ప్రభావం సాధారణ ఓటర్ల పై ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని మనిషి కాదు జేపీ గారు. మనల్ను చూసి జనం వస్తార్లే అనుకుంటే కుదరదు.
మూడు) నేతల ధోరణి: ఆప్ నేత ఏకే, లోక్ సత్తా నేత జేపీ ల వస్త్ర ధారణ,పదాల పొందిక, హావ భావాలు విశ్లేషించి చూడండి. ఏ మాత్రం నలగని ఇస్త్రీ బట్టలతో, శుభ్రంగా టక్ చేసి జేపీ దొరబాబు లాగా కనిపిస్తారు. అదేమీ తప్పు కాదు. కానీ, సార్, భారత రాజకీయ వ్యవస్థలో బట్టలు, హావభావాలు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. మహాత్మా గాంధీనే కాక లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు ఇందుకు మంచి ఉదాహరణలు. పేద, మధ్య తరగతి వర్గాలకు దగ్గరిగా ఉండేలా... నేతల ధోరణి, శైలి ఉండాలి. ఒక మఫ్లర్ చుట్టుకుని...తన గురించి తాను పట్టించుకోని నేతగా అరవింద్ కలర్ ఇవ్వగలిగారు. అలాగే.. జేపీ గారు రెండో వాక్యంలో ఏమి చెబుతారో ఊహించడం కష్టం కాదు. ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆయన హావభావాలు ఏ మాత్రం ఉత్తేజం ఇవ్వవు.
నాలుగు) సమాచార ప్రసారం: ఏకే మాట్లాడుతుంటే... మన అన్నయ్యో, తమ్ముడో ఒక విషయం గురించి విపులీకరిస్తున్నట్లు ఉంటుంది. సామాన్యుల భాషలో ఆయన భావ ప్రసారం ఉంటుంది. అదే జేపీ మాట్లాడుతుంటే... సుద్దులు వల్లిస్తున్నట్లు, ప్రబోధలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'ప్రజలారా... మీరు మూర్ఖపు వెధవలు, తెలివి లేని సన్నాసులు. మిమ్మల్ని రక్షించడానికి ఎంతో విజ్ఞానవంతుడినైన నేను వచ్చాను. నేను చెప్పేది విని తెలివి తెచ్చుకుని నాకు ఓటువేస్తే మీకే మంచిది..." అన్నట్లు ఉంటుంది జేపీ ధోరణి. జేపీ పదాల ఎంపిక, భాష, హావభావాలు... ప్రజలను ఆకట్టుకొనేలా అస్సలు ఉండవు. అదే విషయాన్ని సరళంగా చెప్పడం ఎలాగో నేర్చుకోకపోవడం ఒక లోపం.
ఐదు) మీడియా డీలింగ్: మీడియా ఒక భస్మాసుర హస్తం లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో కేజ్రీవాల్ కు బాగా తెలుసు. జేపీ గారికి అస్సలు తెలియదు. ఒక దశలో.. 'టైమ్స్ నౌ' ఛానెల్ తీవ్రవాద జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి అరిచి గీపెట్టినా అరవింద్ ఆ ఛానెల్ షోలకు వెళ్ళలేదు. అది ఒక మంచి నిర్ణయం. అదే... మన జేపీ, వారి అనుచరుడు కటారి శ్రీనివాస రావు గారు...రోజూ మీడియాలో కనిపించడం, నాసిరకం చర్చల్లో పాల్గొనడం కనిపిస్తారు. పాతిక చానెల్స్ లో ఏదో ఒక దాంట్లో రోజూ కనిపించడం ఒక చెత్త ప్లాన్. నిజానికి... జేపీ గారిని చూడగానే మీడియా పక్షి అనిపిస్తుంది. మీడియా విషయంలో లోక్ సత్తా ప్లానింగ్ ఒక ఫ్లాప్.
ఆరు) కుల వలయం: జేపీ గారు కులాభిమానానికి అతీతం అని ఎవ్వరూ చెప్పలేరు. కమ్మ పార్టీల పట్ల మెతక వైఖరి తో పాటు, అదే కులానికి చెందిన వాళ్ళను దగ్గర పెట్టుకున్నారన్న అపప్రద వచ్చింది. అది పూర్తిగా నిజం కాకపోయినా... ఈ విషయంలో ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తే జేపీ గారికి బాగుండేది. దేశ రాజధానిలో అరవింద్... ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. అయితే... కులాన్ని తీసుకునే విషయంలో దేశ రాజధాని ఓటర్లు తెసుకునే దానికి, మన ఓటర్లు చూసే దానికి తేడా ఉంది. అయినా... ఈ కీలక విషయంలో జేపీ జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.
అంతేకాక, ప్రతి ప్రసంగంలో సారాయి... డబ్బు కట్టలు... అంటూ పదేపదే లోక్ సత్తా ఊదర కొట్టింది. వివిధ కీలక అంశాల్లో విధాన నిర్ణయాలను అది విస్పష్టంగా ప్రకటించలేదని అనడం తప్పు కానీ...ఎప్పుడూ ఓటర్ చేసే పాపాల గురించి మాట్లాడడం తెలివితక్కువ తనం. 'నీ బతుకు చెడ... తాగి, తిని ఓట్లు వేస్తార్రా... చవటల్లారా..." అన్నట్లు ఉండకూడదు మాటల ధోరణి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రపంచ బ్యాంకు, నూతన ఆర్ధిక వ్యవస్థ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేయాల్సిన మార్పులు వంటి అంశాల గురించి చెప్పడం కాదు... స్థానికంగా ఏమి చేస్తామో స్థానికుల భాషలో చెప్పాలి. ఒక పక్కన అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి.. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలివిగా వ్యవహరించడంలో జేపీ బృందం విఫలమయ్యిందని చెప్పక తప్పదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే... తన కోసం పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయాలని అయన ఆశగా ఎదురుచూసే దుస్థితి రావడం అత్యంత జుగుప్స కలిగించే విషయం.
నిజానికి జేపీ గారి కృషి వృధా పోకూడదు. అలాంటి మేధావుల వైఫల్యం ఏ సమాజానికీ మంచిది కాదన్న ఉద్దేశ్యంతో, ఏదో ఒక రోజు ఆయన ముఖ్య మంత్రి పదవి చేపట్టే అవకాశం రావాలన్న సంకల్పంతో ఇది రాస్తున్నాం. పైన పేర్కొన్న విషయాల విషయాలను నెగిటివ్ గా చూడకుండా, వాదనలకు దిగకుండా ఉంటే కమ్యూనికేషన్స్ నిపుణుల బృందంగా లోక్ సత్తాకు సహకరించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధంగా ఉంది.