Saturday, May 31, 2014

తెలుగు మీడియాలో తాజా పరిణామాలు.....

హైదరాబాద్ మీడియా హౌస్ బాస్ రాజశేఖర్ 

తెలుగు జర్నలిజంలో హైదరాబాద్ మీడియా హౌజ్ కు ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటుచేసిన కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు అక్కడి నుంచి నిష్క్రమించి అప్పుడే పక్షం కావస్తోంది. ఆయన స్థానంలో నియమితుడైన రాజశేఖర్ రెండు లేదా ఐదో తేదీన అధికారికంగా పగ్గాలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే హెచ్ ఎం టీవీ ఛానెల్ లో పెద్ద తలకాయలు, ది హన్స్ ఇండియా ఎడిటర్ లతో టచ్ లో ఉన్న రాజశేఖర్ సంస్థ ఆపరేషన్స్ మొదలు పెట్టినట్లు సమాచారం. 

సంస్కరణలలో భాగంగా... మూర్తిగారి మనుషులని అనుకున్నవాళ్ళను పక్కన పెట్టడమో, ఇంటికి పంపడమో చేసే పనిని చురుగ్గా చేపట్టినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ది హన్స్ ఇండియా బ్యూరో చీఫ్ గా ఉన్న చంద్రభాస్కర్ (ఒకప్పటి ఖమ్మం 'ది హిందూ' రిపోర్టర్) ను కాదని, మాజీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ రామూ  శర్మ గారికి ఆ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ది హన్స్ కో-ఆర్డినేషన్ కోసమని మూర్తి గారు ఛానెల్ నుంచి పట్టుకొచ్చి పెట్టిన ఇద్దరు జర్నలిస్టులతో పటు ఆయన సమీప బంధువు ఒకరి మీద పగ పట్టినట్లు చెబుతున్నారు. ఓరి నాయనలారా... జర్నలిస్టుల పొట్టలు కొట్టకండి!

ఇకపోతే... ఇప్పుడు మీడియా ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం పొందుతున్న జర్నలిస్టు గా రాజశేఖర్ చరిత్ర సృష్టిస్తున్నారు. "మా యజమాని వామన రావు గారు మీడియా హౌస్ లో రాజశేఖర్ కు వాటా ఇచ్చారని అనడం తప్పు. కానీ, కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని నెలకో పది, పదకొండు లక్షల జీతం ఇస్తున్నట్లు చెబుతున్నారు," అని ఒక ఉద్యోగి చెప్పారు.  


ఈ-టీవీ చర్చల్లో పసునూరి శ్రీధర్ బాబు 

'ఇండియా టుడే' ద్వారా తెలుగు రీడర్స్, హెచ్ ఎం టీవీ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన పసునూరి శ్రీధర్ బాబు ఇప్పుడు ఈ-టీవీ ఆంధ్రప్రదేశ్ చర్చల్లో కనిపిస్తున్నారు. మూర్తి గారి ప్రోత్సాహంతో హంస టీవీ కి వచ్చి... వద్దయ్యా బాబూ... అన్నా వినకుండా పోయి వీ6 లో చేరి భంగపడిన శ్రీధర్ మళ్ళా హెచ్ ఎం టీవీ లో చేరారు. 
తదనంతర పరిణామాల మధ్య అక్కడి నుంచి బైట పడి... కొద్దికాలం ఉద్యోగాన్వేషణ చేసి, కొద్దికాలం రెస్టు తీసుకున్న శ్రీధర్ ఈ-టీవీ చర్చల్లో కనిపించడం అయన మిత్రులకు ఆనందం కలిగించడం... ఆయన పట్ల అనవసర ద్వేషం పెంచుకున్న వారికి చెంపపెట్టులా అనిపించడం మామూలే. 
10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా వడ్డే వెంకటేశ్వర రావు  

ఖమ్మం జిల్లా కారేపల్లి లో 'ఈనాడు' కంట్రీ బ్యూటర్' గా జర్నలిజం జీవితం ఆరంభించిన వడ్డే వెంకటేశ్వర రావు గారు ఇప్పుడు 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా నియమితులయ్యారు. జీ టీవీ లో పనిచేసిన సతీష్ కమల్ (అసలు పేరు సత్యనారాయణ అట) స్థానంలో వడ్డే నియమితులయ్యారు. ఇప్పుడు సతీష్ ఏమి చేస్తారో తెలియదు. 

తిరుపతి లో ఉండగా 'ఈనాడు' వదిలి టెలివిజన్ రంగ ప్రవేశం చేసిన వడ్డే తుమ్మల నరేంద్ర నాథ్ చౌదరి గారి ఎన్-టీవీ లో పనిచేసారు. 
సీ పీ ఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆహ్వానం మేరకు ఎన్నికలకు ముందు 10 టీవీ లో చేరి పరిస్థితులు అవగతం చేసుకున్న వడ్డే ఎన్నికలు కాగానే  పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసారు. ఈ పరిణామం కన్నా ముందు 10 టీవీ లో చేరిన మాజీ టీవీ 9 జర్నలిస్టులు మళ్ళీ ఆ ఛానెల్ కు వెళ్ళిపోవడం, డైనమిజం లోపించడం తో 10 టీవీ అనుకున్న మేర రాణించలేక పోతున్నది. ఇది...యాజమాన్యంలో కీలక భూమిక పోషిస్తున్న కామ్రేడ్ల కన్నెర్ర కు కారణమయ్యింది. 

జనం డబ్బుతో మొదలైన 10 టీవీ ఇలా వెలాతెలా పోవడానికి కారణాలపై ఫీడ్ బ్యాక్ ను, దానికి సంబంధించి సన్నిహితులు ఇచ్చిన నివేదికను పరిశీలించి తమ్మినేని బృందం ఛానెల్ లో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు చానెళ్ళలో రోజూ చర్చల్లో పాల్గొంటున్న ఈ చానెల్ చైర్మన్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, సీ ఈ ఓ అరుణ్ సాగర్, ఇన్ పుట్ ఎడిటర్ వీ వీ రావ్ అలియాస్ వడ్డేల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

'ఈనాడు' ఉద్యోగుల ఆశపై ఐసు నీళ్ళు!  

సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినందున వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ నెలలో పెరిగిన జీతాలు అందుకోవచ్చని అనుకున్న 'ఈనాడు' ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ను కూడా సవాలు చేసేందుకు చట్టంలో ఉన్న వెసులుబాటు ను యాజమాన్యం ఉపయోగించుకోవడం తో ప్రస్తుతానికి జీతాలు పెరగవని జర్నలిస్టులు ఒక నిర్ధారణకు వచ్చి మానసికంగా కుంగిపోతున్నారు. "వాస్తవానికి గత నెలలోనే జీతాలు పెంచి....పెంచి పంచిన విషయాన్ని ఈ నెల ఏడులోగా సుప్రీం కోర్టుకు తెలియజేయాల్సి ఉంది. అయినా... అలాంటిది జరపకుండా... క్యురేటివ్ పిటిషన్ వేశారని చెబుతున్నారు.," అని సంస్థ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. 
కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రావడం, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి రావడం, మోడీ ప్రభుత్వం తో చంద్రబాబు దోస్తానా.. ఇవన్నీ 'ఈనాడు' ఉద్యోగులకు భయం కలిగిస్తున్నాయి. "మా సుడి బాగోలేక ఉన్నట్టుండి ఈ రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ద్వారా మా యజమాని... మోడీ మీద ఒత్తిడి తెచ్చి వేతన సంఘం సిఫార్సులను తుంగలోకి తొక్కే అవకాశం లేకపోలేదు," అని ఒక 'ఈనాడు' మిత్రుడు ఆవేదనతో చెప్పారు. 
ఇప్పటికే... పీ టీ ఐ వంటి వార్తా సంస్థలు, 'ది హిందూ' లాంటి పత్రికలు సుప్రీం కోర్టు ఆర్డర్ కు అనుగుణంగా జీతాలు పెంచాయి, బకాయిలు (లక్షల్లో ఉన్నాయి) చెల్లించే పనిలో ఉన్నాయి. 

సీ ఎల్ రాజం ఇచ్చారా? కే సీ ఆర్ గుంజుకున్నారా?? 

"నమస్తే తెలంగాణా" పత్రిక ను టీ ఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీసుకున్న వార్త నిజమేనని పత్రిక పెద్ద తలకాయలు దృవీకరించాయి. అయితే... ఈ టేక్ ఓవర్ "నమస్తే తెలంగాణా" అధిపతి సీ ఎల్ రాజం అభీష్టానికి వ్యతిరేకంగా జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక రాజ్యసభ సీటిచ్చి... ఇంత పెట్టుబడి పెట్టిన పత్రికను తీసుకోవడం పట్ల ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. 

ఆ సంస్థ లో పనిచేసే ఒక సీనియర్ నుంచి మాకు వచ్చిన ఈ సందేశం చూడండి.
"FYI. KCR forcibly acquired NT, much against Rajam sir wishes."

Tuesday, May 27, 2014

టీ ఆర్ ఎస్ చేతికి "నమస్తే తెలంగాణా" పత్రిక!

జూన్ ఆరో తేదీన పుట్టిన రోజు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న "నమస్తే తెలంగాణా" పత్రిక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి ఆధీనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణా, ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణా, ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణా అంటూ ఏర్పడిన ఈ పత్రిక అల్లం నారాయణ గారి నేతృత్వంలో, కట్టా శేఖర్ రెడ్డి గారి సారధ్యంలో అనుకున్నది సాధించడంలో కీలక భూమిక పోషించింది.  ప్రముఖ సివిల్ ఇంజినీరు, పారిశ్రామిక వేత్త సీ ఎల్ రాజం దీనికి అధిపతి.

కమ్మ, రెడ్డి యాజమాన్యాలు జర్నలిజాన్ని పచ్చడి పచ్చడి చేస్తున్న దశలో నాలుగేళ్ల కిందట పుట్టిన ఈ పత్రిక తెలంగాణా జర్నలిస్టులను ఆదుకున్నదని చెప్పడానికి సంశయించాల్సిన అవసరం లేదు.  

ప్రభుత్వం ఏర్పడగానే... ఒక పత్రిక అవసరం గుర్తెరిగిన కే సీ ఆర్ బృందం నష్టాల్లో ఉన్న 'నమస్తే తెలంగాణా' ను తీసుకునే దిశగా పావులు కదిపిందట. బ్రాహ్మణ సామాజిక వర్గం తరఫున రాజం గారికి ఎం ఎల్ సీ ఇస్తామని కే సీ ఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో...కే టీ ఆర్ రెండు మూడు రోజుల కిందట రాజం గారితో ఈ విషయం మీద సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. "కే టీ ఆర్ మా ఆఫీసుకు వచ్చి మా యజమాని తో చర్చలు జరిపారు. దాదాపు డీల్ ఖరారు అయినట్లే. ఎడిటర్, సీ ఈ ఓ మారకపోవచ్చు కానీ తెలంగాణా నిర్మాణంలో పత్రిక సేవలు మరింత క్రియాశీలంగా వాడుకునే అవకాశం ఉంది," అని అక్కడి జర్నలిస్టు ఒకరు చెప్పారు. 

ఇప్పటికే... టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో టీ-న్యూస్ అనే ఛానెల్ నడుస్తున్నది. అధికారంలోకి రావాలన్నా... అధికారంలో ఉన్నా మీడియా అవసరం ఎంతైనా ఉందని తెలుగు నేల మీద అన్ని పార్టీలు గుర్తించాయి. తెలుగు దేశం కోసం అహరహం తపించి... ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ పాత్ర పోషించి... ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన 'ఈనాడు' మీడియా సంస్థల యజమాని చెరుకూరి రామోజీ రావు నిన్న ప్రత్యేక అతిధి హోదాలో మోడీ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయిన విషయం.... మీరు టీవీ లో చూసే ఉంటారు. మరది మీడియా పవర్ అంటే!

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన "మెట్రో ఇండియా" అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా...లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్.... ముగ్గురు... కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

Tuesday, May 20, 2014

ఇద్దరు ఉద్దండ యోధుల నిష్క్రమణం...

ఈ మే నెలలో... సార్వత్రిక ఎన్నికల అనంతరం సంభవించిన ఒక రెండు పరిణామాలు నిశిత పరిశీలకులకు మనసు చివుక్కుమనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయమైనా... ఇక్కడ పరిణామం అనే పదం వాడడానికి ఒక కారణం ఉంది. శక్తులైన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పలు పోలికలున్నాయి. అందివచ్చిన అధ్బుత అవకాశాలను చేతబుచ్చుకుని ఒక వెలుగు వెలిగి.... చరమాంకంలో వెక్కిరిస్తున్న అపజయాన్ని దిగమింగుకుని తలవంచుకుని వెళ్ళిపోతున్నారు.  
వారిద్దరూ...తలపండిన యోధులు. ఎంతో సౌమ్యులు. మంచివారిగా పేరున్న వారు. చిత్తశుద్ధితో తమ పని తాము చేసుకు పోయే వారు. వృత్తి నిబద్ధత లో తిరుగులేని వారు. విద్యావంతులు, సంస్కారవంతులు. బాగా పనిచేయాలన్న తపన ఉంది. కష్టపడే తత్త్వం వారిది. ఇద్దరికీ డాక్టరేట్ ఉంది.


ఇద్దరికీ మంచి అవకాశాలు బంగారు పళ్ళెంలో అంది వచ్చాయి. ఇంటికెళ్ళి పోదామనుకుంటూ ఉండగానే... మన్మోహన్ ను పిలిచి మరీ సోనియా గాంధీ ప్రధాని పదవి ఇచ్చారు... అత్యున్నత లక్ష్యంతో. సరిగ్గా అలాగే...వేమూరి రాధాకృష్ణ కొలువులో కొనసాగుతున్న తరుణంలో కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి కపిల్ గ్రూప్ అధిపతి వామన రావు గారు ఏరి కోరి మరీ హెచ్ ఎం-టీవీ పగ్గాలు అందించారు... సదుద్దేశంతో. పీవీ నరసింహా రావు అమలు చేసిన సంస్కరణలకు ఊపు ఇవ్వాలని అనుకున్నారు సింగ్ గారు. వినూత్నత్వంతో నీళ్ళను నీళ్ళలా... పాలను పాల లా బుల్లి తెరమీద చూపాలనుకున్నారు మూర్తి గారు.  
అయితే... పదేళ్ళు పాలించి...దారుణమైన ఆర్ధిక వ్యవస్థ దివాలాకోరుతనానికి  కారణమై... చివరకు పగ్గాలు గుజరాత్ అల్లర్లకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ కి అప్పగించి మన్మోహన్ ఇప్పటికే నిష్క్రమించారు. ఆరేళ్ళ పాటు... హెచ్ ఎం టీవీ కి, తర్వాత ది హన్స్ ఇండియా అనే పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించి...కపిల్ గ్రూప్ మింగలేని కక్కలేని నష్టాలకు బాధ్యుడన్న అపవాదు మూటగట్టుకుని... పగ్గాలను... తెలుగు టెలివిజన్ లో కలెక్షన్ కింగ్ గా పేరున్న రాజశేఖర్ కు అప్పగించి నిష్క్రమిస్తున్నారు.... రామచంద్ర మూర్తి గారు. బుధవారం నాడు అయన కోసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇది నిజంగా ఇద్దరు యోధుల మహాభినిష్క్రమణం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత అద్భుతమైన వ్యక్తులైనా...వారిద్దరూ చివరకు ఒక శిధిల సామ్రాజ్యాన్ని వదిలి నిష్క్రమిస్తుస్తుండడం విధి విచిత్రం. తమ చేతిలో లేని వివిధ అంశాలు ఈ దుస్థితికి కారణమైనా....మనసు గాయపరిచే ఒక పీడకల వారిని వెంటాడబోతుండడం తప్పించుకోలేని కఠోర వాస్తవం.  

ఏది ఏమైనా....భారత రాజకీయ చరిత్రలో సింగు గారికి, ఆంధ్ర ప్రదేశ్ జర్నలిజం చరిత్రలో మూర్తి గారికి ప్రత్యేక అధ్యాయాలు ఉంటాయన్నది నగ్నసత్యం. దొంగలు, ధూర్తులు అసలే మసలే ఈ లోకంలో...మన్మోహన్, మూర్తి గారి లాంటి అత్యుత్తమ సౌమ్యులు రాజకీయ పరంగా, ఆర్ధిక పరంగా (ఆ వరసలో) క్లిక్ కాకపోయినా...ఆయా రంగాల్లో వారి ముద్ర శాశ్వతంగా ఉండి తీరుతుంది. వారిని పొగిడి బుట్టలో వేసుకుని పలు ప్రయోజనాలు పొందిన వారు, పదవివశాత్తూ పాటించక తప్పని వారి మౌనం వల్ల, ఆడక తప్పని వారి అబద్ధాల వల్ల భంగపడిన వాళ్ళు...ఈ మహోన్నత వ్యక్తులను తప్పక స్మరించుకుంటారు. అవకాశాలు అందివచ్చినా... పరిస్థితులు అనుకూలించకపోతే ఏమీ చేయలేమనడానికి ఈ ఇద్దరు సజీవ సాక్ష్యంగా ఉంటారు. వీరిద్దరి శేష జీవితాలు ఆరోగ్యంగా, అద్భుతంగా సాగాలని.... అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ రాజశేఖర్ రాణించి పరిస్థితులు చక్కబర్చాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఫోర్. 

(నోట్: ఇందులో 'కలెక్షన్ కింగ్' అన్న మాటను దురర్ధంలో తీసుకోవద్దని మనవి. ప్రేక్షకుల అభిరుచులు స్పష్టంగా తెలిసి, అదే సమయంలో వ్యాపార ప్రకటనలు రాబట్టడంలో అద్భుతమైన చిట్కాలు ఎరిగిన జర్నలిస్టులలో రాజశేఖర్ ముందుంటారు. కులం, గోత్రం కలవకపోయినా...గాడ్ ఫాదర్స్ లేకపోయినా... తెలుగు జర్నలిజం లో తనకంటూ ఒక సంచలనమైన అధ్యాయం ఏర్పాటు చేసుకుని చిన్న వయసులో పెద్ద పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఆధ్వర్యంలో హెచ్ ఎం టీవీ, ది హన్స్ ఇండియా కచ్చితంగా గాడిలో పడతాయని ఈ బ్లాగ్ బృందం గట్టిగా విశ్వసిస్తోంది.) 

Friday, May 16, 2014

గెలిచింది... బుర్ర ఉన్న తెలుగు ఓటరు!!!

రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నట్లు ఈ ఎన్నికల్లో తెలుగు నెల మీద ఏ పవనలూ, పవన్ కళ్యాణ్ లో లేవు. ఈ ఫలితాలు... స్పష్టంగా నిరూపించింది ఒక్కటే: తెలుగు ఓటరు బుర్రున్నోడు. అలోచించి తీర్పు ఇచ్చాడు. హాట్సాఫ్. 

తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం నిజానికి తమ జీవితాలు భయంకరంగా మార్చే విషయం కాదని నిరూపిస్తూ.... ఆ వాదాన్ని సమర్ధించిన తెలుగు దేశానికి పట్టం కట్టడమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రం విషయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలతో తమ ఆత్మాభిమానాన్ని కించపరిచిన కాంగ్రెస్ నేతలకు కొర్రు కాల్చి వాతపెట్టి తగిన గుణపాఠం చెప్పారు ఆంద్ర ప్రదేశ్ ఓటర్లు. జనం గొర్రెలని అనుకున్న మహామహులైన నేతలంతా మట్టి కరిచి కాంగ్రెస్ మట్టి కొట్టుకు పోయింది అటు పక్కన.  
  
చచ్చిపోయిన పాము... తెలుగు దేశం... అని అంతా అనుకున్నా... అంధ్ర ప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు కు పట్టంకట్టడం, అంతగా మోడీ ప్రభంజనం ఉన్నా... తెలంగాణా రాష్ట్ర సమితి ని ఆదరించి తెలంగాణా లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెద్ద పీట వేయడం... దేనికి సూచిక? తమ తమ రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఎవరు అవసరమో జనం స్పష్టంగా చూజ్ చేసుకున్నారు. 


ఇప్పుడున్న పరిస్థితుల్లో అటుపక్కన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడం నిజంగా కనిపించని ఒక పెద్ద సవాలు. ఈ విషయంలో జనం చంద్ర బాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయనైతే... సమర్ధంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని నమ్మినట్లున్నారు ఓటర్లు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా... బటన్ ఒత్తే సమయానికి తమ జీవితాల గురించి, రాష్ట్ర భవిత గురించి ఆలోచించినట్లున్నారు. లేకపోతే... తెలంగాణా రావడానికి సహకరించి.... 'రెండు కళ్ళు' అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి? సమైక్య నినాదంతో భయంకరమైన హడావుడి చేసిన జగన్ పార్టీ నడ్డి మీద వెనక నుంచి లాగిపెట్టి తన్నడమేంటి? డబ్బులు తీసుకున్నా... అమాయకంగా నటించినా... ఓటరు విజ్ఞత కనబరిచాడు.    

మరొక పక్కన... తెలంగాణా ఓటరు ప్రదర్శించిన పరిణతి ఇంకా అద్భుతమైనది. తెలంగాణా తెచ్చింది.. తామేనని ఒక పక్కన కాంగ్రెస్ లీడర్లు ఘాటుగా ప్రచారం చేసుకున్నా... ఓటర్లు వారిని కాదు పొమ్మన్నారు. మోడీ ప్రభంజనం వీచినా... ఒక క్షణం ఆలోచించి... తమకు సుపరిపాలన ఇచ్చే సామర్ధ్యం కే సీ ఆర్ కు ఉందని గట్టిగా నమ్మినట్లున్నారు. ఆయన మీద, ఆయన కుటుంబం పోటుగాళ్ళు ఎన్ని సినిమా డైలాగులు వేసినా...తెలంగాణా ఉద్యమ నేతనే కాకుండా... అయన కుటుంబ సభ్యులను ఘనంగా గెలిపించారు. ఆయనను గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభ సీట్లలో, కొడుకు, మేనల్లుడును అసెంబ్లీ సీట్లలో, కూతురు కవితను నిజామాబాద్ పార్లమెంటు సీటులో గెలిపించారు. ఇదంతా ముక్కు పంతులు గారి మీద తెలంగాణా ఓటర్లకు ఉన్న నమ్మకం. ఉద్యమ వీరుడు ఆయనేనని జనం నమ్మిన ఫలితం. 

తెలంగాణా తెచ్చింది.. మేమే కాబట్టి..ఇక విజయం తమదేనని విర్రవీగిన కాంగ్రెస్ నేతల నెత్తిన తెలంగాణా ఓటర్లు తెల్లగుడ్డ పరిచారు. మాట్లాడితే...ప్రత్యేక తెలంగాణా అని నినదించిన.. మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, వీ హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజ నరసింహ తో పాటు గోడ మీద పిల్లి వాటం మేధావులు జైపాల్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, జనం గొర్రెలని, దాదాగిరీ తో అనుకున్నది చేయవచ్చని అనుకున్న దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, జగ్గారెడ్డి లాంటి వాళ్ళ కథ కంచికి చేరింది. వేళ్ళలో చాలా మందికి రాజకీయాల మీద విరక్తి రావడం ఖాయం. 

ఇప్పుడు ముఖ్యమంత్రులు కాబోతున్న ఇద్దరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ కీలక సమయంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాల గురించి చెప్పుకోక తప్పదు. తెలంగాణా రాగానే టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి, ప్రచారం చేసిన కే సీ ఆర్ ఆ పనిచేయకపోవడం మంచిదయ్యింది. అలాగే...కే సీ ఆర్ తో బీజేపీ కలవకుండా చేసి, చివరి క్షణంలో తను వెళ్లి మోడీ సరసన చేరడం చంద్రబాబు రాజకీయ పరిణతి కి నిదర్శనం. బాబు కన్నా పార్టీ కాడర్ ఉంది. ఆయన లాగానే సందట్లో సడే మియాలాగా...ఒక పెద్ద పార్టీ పెడుతున్నట్లు పోజు కొట్టి... అదే ఊపుతో మోడీ ని కలిసి ఆయన మన్ననలు పొంది ఆయనతో, బాబుతో వేదికలు పంచుకుని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి మూవ్ వేసారు. 

అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి... మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు... అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం... అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద... ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా... మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్! 

ఇక... బాధ కలిగించే విషయం ఏమిటంటే... ఇద్దరు మేధావులు--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్, ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్ కే. నాగేశ్వర్--అనవసరంగా మల్కాజ్ గిరిలో ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇద్దరూ ఓడిపోవడం. ఆంధ్రా కుమారుడు అయిన జే పీ సీమాంధ్రలో, తెలంగాణా బిడ్డ నాగేశ్వర్ తెలంగాణా వాదంతో మొఖమాటం లేకుండా పోటీ చేసినా గెలిచే వాళ్ళు. పాపం. రాష్ట్ర విభజన ఆగదని స్పష్టమైన...ఒక్క సీటైనా రాదని తెలిసినా...పోరాడి పోరాడి ఓడిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సందర్భంగా స్మరణీయుడే కదా!  

ఎల్లెడలా మోడీ హోరు: ఇక్కడ సైకిల్ జోరు, కారు షికారు

ఒక ఐదారేళ్ళ కిందట... ఎవరైనా వచ్చి... "అన్నా... ఒక సలహా కావాలి. ఏ పార్టీలో చేరితే బాగుంటుంది?" అని అడిగితే... "కళ్ళు మూసుకుని బీ జే పీ లో చేరు. భవిష్యత్తు ఆ పార్టీ దే," అని చెప్పేవాళ్ళం. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రభంజనం లేకపోయినా...హిందుత్వ పార్టీ పట్ల జనంలో  రూపుదిద్దుకుంటున్న సానుకూల అభిప్రాయం అలాంటిది. దానికి తోడు, సోనియా గాంధీ రిమోట్ తో పనిచేసిన మేధావి మన్మోహన్ సింగ్, ప్రభావం లేని రాహుల్ గాంధీ కమల వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. 
కౌంటింగ్ జరుగుతున్న ఈ రోజు (మే నెల 16, 2014) ఉదయం పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం... బీ జే పీ ప్రభంజనం కనిపిస్తున్నది దేశవ్యాప్తంగా. మోడీ ప్రధాని కావడం ఖాయం. 

ఆంధ్ర ప్రదేశ్ లో మా మిత్రులు జనం నాడిని పసిగట్టడం లో దెబ్బ తిన్నారు. రాజకీయ చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నెల రోజుల వ్యవధిలో  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  కలలు కల్లలు చేసారు. 
అనుకున్న ప్రకారం... తెలంగాణా లో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు దూసుకు పొయారు. 
దేశ రాజధానిలో మోడీ, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర్ రావు అధికారం లోకి రాబోతున్నారు. వాళ్లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.  

Thursday, May 15, 2014

మత కల్లోలాలప్పుడు లీడ్ రైటింగ్ లో జాగ్రత్త

మతానికి సంబంధించి గొడవలు, కల్లోలాలు ఏర్పడినప్పుడు విలేకరులు కాపీలను జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రెస్ కౌన్సిల్ తదితర వృత్తిపరమైన సంస్థలు చెప్పిన దాని ప్రకారం... గొడవ పడిన మతాల పేర్లు గానీ, మృతులు లేదా క్షతగాత్రుల పేర్లు గానీ మతాన్ని సూచించేవి అయితే రాయకూడదు. హిందూ-ముస్లిం ల గొడవలైతే సరే గానీ... హిందువులకు-సిక్కుల మధ్య గానీ, సిక్కులకు- ముస్లిం లకు మధ్య గానీ గొడవలైతే మతాల పేర్లు రాయాలా? వద్దా? అన్న సమస్య వస్తుంది. 
మత కల్లోలాలు అనగానే... హిందూ-ముస్లిం ల మధ్య ఘర్షణ అన్నది సాధారణ అభిప్రాయం. కానీ వేరే మతస్థుల మధ్య గొడవల ను రిపోర్ట్ చేయడం విలేకరులకు, సబ్ ఎడిటర్లకు కత్తి మీద సామే. 
నిన్న హైదరాబాదులో జరిగిన అల్లర్లపై వివిధ పత్రికలు ఇచ్చిన లీడ్ (వార్తలో మొదటి పేరా) ఇలా ఉన్నాయి. 

"ది హిందూ':
Indefinite curfew was imposed in Rajendranagar police station area under Cyberabad Commissionerate in Hyderabad on Wednesday, following communal clashes and death of three persons in police firing.
Trouble broke out near Sikh Chawni near Bahadurpura, adjacent to the Old City, after miscreants burnt a religious flag in the early hours of Wednesday. Tension gripped the area as members of a community attacked two youths blaming them for the flag burning incident.

"ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్":
Three persons were killed Wednesday in police firing as communal clashes erupted following the alleged burning of a religious flag at Kishanbagh in the Old City.
Indefinite curfew was clamped in the area after the police brought the situation under control. Over 20 persons, including several policemen, were injured in heavy stone-pelting while seven others suffered bullet wounds.  According to police and eye-witnesses, trouble broke out around 6 a.m. when two persons of a community spotted a burnt flag and a scrap dealer who burns scrap everyday.

"డెక్కన్ క్రానికల్"
Three people were killed and 19 injured at Kishanbagh in Hyderabad's Old City early today when officers of the Border Security Force opened fire on clashing groups.
The firing took place in Cyberabad police commissionarate limits on Wednesday morning to control mobs that turned on each other after a religious flag was burnt late last night. The situation was brought under control by afternoon.
"హన్స్ ఇండియా":
Three people were shot dead and eight injured Wednesday when police opened fire to disperse two clashing groups in Hyderabad, officials said.
 
An indefinite curfew was imposed to bring the situation under control in Sikh Chowni in Kishan Bagh, a part of Cyberabad police commissionerate.

"మెట్రో ఇండియా":
Three people were killed and 17 injured in police firing following clashes between two communities after a religious flag was burnt by miscreants in Sikh Chawni of Kishanbagh area on Wednesday. Police clamped curfew till 10 am on Thursday in Kishanbagh under Rajendranagar police station limits after communal riots left several people injured with at least 10 police personnel suffering serious injuries in heavy stone pelting.

"మెయిల్ టుడే":
THREE men were killed in police firing after communal clashes erupted in Old Hyderabad on Wednesday when residents of the Sikh Chawni locality found out that suspected miscreants, of the adjacent Muslim neighbourhood, had burnt a religious flag of the Sikh community.
Warring groups from both communities gathered after two Muslim youth were attacked in retaliation for burning the flag. Though the police arrived, they were initially unable to pacify the two sides.

"ఈనాడు": 
రాజధాని శివారు లో రాజేంద్ర నగర్ ఠాణా పరిధిలో మీర్ మహ్మద్ పహాడీ సిక్ చావనీ లో బుధవారం రెండు వర్గాల మధ్య తెలెత్తిన స్వల్ప వివాదం చివరకు పోలీసు కాల్పులకూ దారితీసింది. దీంతో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో పది మందికి గాయాలయ్యాయి.  

"సాక్షి":
రాష్ట్ర రాజధాని పాతబస్తీ సిక్ చావ్నీలో ఒక జెండా విషయమై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. వాగ్వాదం నుంచి మొదలై రాళ్లు, కత్తులతో దాడుల వరకూ వెళ్లింది. రెచ్చిపోయిన అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, ఇళ్లనూ తగులబెట్టాయి. పరిస్థితులు పూర్తిగా విషమిస్తుండడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి.

Sunday, May 11, 2014

అయ్యో పాపం... కోనపురి రాములు

అది- 2007 వ సంవత్సరం, జూన్ నెల మొదటి వారం. 
నల్గొండ లో 'ది హిందూ' పత్రికకు ప్రతినిధిగా పనిచేస్తున్న రోజులు. 
రాత్రి పది, పదకొండు అయ్యింది. అప్పుడు లాండ్ లైన్ కు ఒక ఫోన్ వచ్చింది. అపరిచితుడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తనొక పేరు మోసిన నక్సలైటు. రిపోర్టర్ గా తన పూర్తి బాక్ గ్రౌండ్, చేసిన నేరాలు అన్నీ తను చెప్పకుండానే నాకు పూర్తిగా తెలుసు.

సీ పీ ఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి కోనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు తను. అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ ఎందుకు అడవి బాట పట్టారేమిటా? అన్న ప్రశ్నతో వాళ్ళ ఊరైన వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం వెళ్లి అప్పటికే ఒక పెద్ద స్టోరీ రాసాను, డిసెంబర్ 8, 2002 లో. 
నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్న నా సహకారంతో లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలవాలని ఉందని, సహకరించాల్సిందిగా రాములు కోరాడు. "మీరు నిజాయితీపరుడైన జర్నలిస్టు. నేను అందుకే మిమ్మల్ని నమ్మి సాయం కోరుతున్నాను. నాకు ప్రాణ భయం ఉంది," అని చెప్పాడు. అప్పటికే ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నది.  అయినప్పటికీ... ఇలాంటి విషయంలో తలదూరిస్తే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. నేను వెంటనే... హైదరాబాద్ లోని మా ఆఫీసు లో నమ్మదగ్గ ఒక సీనియర్ (చీఫ్ ఆఫ్ బ్యూరో సుసర్ల నగేష్ కుమార్ కాదు) తో మాట్లాడి సలహా అడిగాను. తను మంచి సలహా ఇచ్చారు.

లొంగి పోవడానికి వచ్చిన నక్సల్స్ ను ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు చంపేస్తే...మధ్యవర్తిగా ఉన్న మన మీద నక్సల్స్ కు అనుమానం వస్తుంది. నక్సల్స్ తో వీడికేంటి పని? అని పోలీసులూ అనుమానిస్తారు. అందుకని...ఒక రిపోర్టర్ కన్నా పొలిటీషియన్ ద్వారా లొంగిపోవాలని రాములుకు సూచించాను. మరొక గంటాగి ఫోన్ చేసి... ఒక ఫోన్ నంబర్ కావాలని అడిగాడు.  
ఆ తర్వాత ఒక వారం లోపే... హైదరాబాద్ లో నాటకీయ పరిణామాల మధ్య అప్పటి నల్గొండ ఎం పీ సురవరం సుధాకర్ రెడ్డి గారి  సహకారంతో రాములు లొంగి పోయాడు. 
కొన్నాళ్ళకు కోర్టు కేసు మీద నల్గొండ వచ్చినప్పుడు ఆఫీసుకు వచ్చి నన్ను కలిశాడు. చాలా సేపు నాతో ఉన్నాడు.  
ఉద్యమం గురించి నాకున్న అనేకానేక సందేహాలను అడిగాను. ఓపిగ్గా నివృత్తి చేసాడు. సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న యువకుడు. అలా చేయడానికి వ్యవస్థ లో కొందరు వ్యక్తులు, శక్తులు అడ్డం వస్తాయని, అందుకే తుపాకీ ఒక మార్గమని చెప్పాడు. ఇంత నిర్బంధం మధ్య... జీవితాలను ఫణంగా పెట్టి, హింసా కాండ సృష్టించడం ఒక్కటేనా పరిష్కారం? అని అడిగాను. పోలీసులను టార్గెట్ చేయడం ఎందుకు... వాళ్ళు కూడా సాధారణ ప్రజలే కదా? కేవలం ఖాకీ దుస్తులు వేసుకున్నందున వాళ్ళు వర్గ శత్రువులు అవుతారా? అని అడిగాను. రాములు తను చెప్ప దల్చుకున్నది చెప్పాడు.

ప్రత్యేకించి... నల్గొండ జిల్లాలో ఒక తెలుగు దేశం స్థానిక నేతను ఘోరంగా చంపిన ఘటనపై అతని వివరణ అడిగాను. "అన్నా... తనను చంపింది నేనే. వాడు ఊళ్ళో సృష్టించని బీభత్సం లేదు. ఎంత మంది స్త్రీల మానాలను హరించాడో నా దగ్గర లెక్క ఉంది. పోలీసుల సహకారంతో, ప్రభుత్వం అండతో అన్ని పాపాలను చేసే వాడిని బతకనిస్తే సాధారణ జనం బతికేదెలా..." అని అన్నాడు. ఒక ఇద్దరు సహచరుల సహకారంతో.. 11 మంది గన్ మెన్ ను బెదిరించి ధైర్యంగా ఆ నేతను ఎలా కాల్చి చంపిందీ... ఆ తర్వాత పోలీసుకు కూంబింగ్ చేస్తున్నా... స్థానిక మహిళలు ఆనందం తో పంపిన భోజనం తింటూ ఎన్ని రోజులు ఆ గ్రామం లో ఉన్నదీ చెప్పాడు. 

నయా నక్సల్స్ ఫిలాసఫీ....అడవి జీవితం గురించి అర్థం చేసుకోడానికి ఎందరినో ఇంటర్ వ్యూ చేశాను. కానీ, రాములు మాదిరిగా విశ్లేషణతో, తర్కంతో మాట్లాడిన యువకుడ్ని నేను చూడలేదు. తనతో మాట్లాడాక... నేను కొంత గందరగోళానికి గురయ్యాను. లా అబైడింగ్ సిటిజెన్ గా నా లాంటి జర్నలిస్టు... నేరుగా నక్సల్స్ తో మాట్లాడి లొంగుబాటు కోసం ఏమిచేయాలో చెప్పడం సరైనది కాదని నాకు ఆ రోజున అనిపించిందని చెప్పాను. 

మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత... రాములు, తన భార్య (మాజీ నక్సల్) ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ నక్సల్ నయీం నుంచి ఉన్న ప్రాణ హాని గురించి చెప్పారు. తమకు రక్షణ కావాలని కోరారు. మాజీ నక్సల్స్ లా దందాలకు దిగడం మంచిది కాదని... ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కొత్త జీవితం ఆరంభించడమో... ప్రాణ హాని ఉంటే వేరే ప్రాంతానికి వెళ్లడమో చేయాలని సలహా ఇచ్చాను. "లేదన్నా... ఇది ఎటూ వెళ్ళలేని పరిస్థితి. నేను వేరే చోటికి వెళ్లి బతికితే... ఎక్కడ నక్సల్ విధ్వంసం జరిగినా నన్నే అనుమానిస్తారు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను చిత్ర హింసలు చేస్తారు. చావు తప్పదు, ఇక్కడ బతక్కా తప్పదు," అని రాములు చెప్పాడు. అప్పటికే తను మృత్యువుతో సహజీవనం చేస్తున్నాడు. 

ఆ తర్వాత 2008 లో ఫిబ్రవరి రెండో వారం లో సాంబశివుడు లొంగి పోవడానికి ఒక పావు గంట ముందు...రాములు ఫోన్ చేసి సంగతి చెప్పిన జర్నలిస్టు లలో హేమ ఒకరు. 'మరి కొద్ది నిమిషాల్లో హైదరాబాద్ లో మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు లొంగి పోతున్నాడు," అని ఒక ఫోన్ ఇన్ లో ప్రపంచానికి మొట్టమొదట చాటింది హేమ... ఎన్ టీవీ లో. అదొక సంచలన వార్త. ఇది నిజంగా కన్ఫర్మ్డ్ న్యూస్ యేనా? అని అప్పటి బ్యూరో చీఫ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో అడిగారు. 

ఆ తర్వాత మా ఎప్పుడో ఒక సారి రాములు హెచ్ ఎం టీవీ లో కలిసాడు. అప్పటికే సాంబశివుడు ను దుండగులు ఘోరంగా చంపారు. తను టీ ఆర్ ఎస్ లో చేరినట్లు, ప్రాణ భయం అలాగే ఉన్నట్లు చెప్పాడు. మళ్ళీ... ఈ రోజు ఉదయం టీవీ ల ద్వారా తెలిసింది... రాములు నల్గొండ లో హత్యకు గురయ్యాడని. లొంగి పోయాక రాములు ఏమి చేసాడో, ఎలా గడిపాడో తెలియదు కానీ... చాలా మందిలో లేని దేశభక్తి రాములు కు ఉందని అప్పట్లో తన మాటల ద్వారా నాకు అర్థమయ్యింది. ఏదో ఒక రోజు ఘోరంగా హత్యకు గురవుతాడని రాములు కే కాదు, మా అందరికీ తెలుసు. 
ఆ రోజున నా స్టోరీ కోసం నేను ఇంటర్ వ్యూ చేసిన రాములు తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. ప్రజా సేవకని అడవి బాట పట్టిన ఇద్దరు బిడ్డలు లొంగిపొయాక కళ్ళ ముందు ఘోరంగా హత్యకు గురి కావడంతో వారి గుండె కోత ఎలా ఉంటుందో కదా... అని బాధేసింది. పాపం...రాములు.   
(పై ఫోటో... రాములు లొంగి పోయిన రోజు 'ది హిందూ' లో వచ్చింది.) 

Friday, May 9, 2014

ఈ ఎన్నికల్లో తేలబోతున్న ఆరు అంశాలు ఏమిటి?

ఒకటి) చంద్రబాబు భవితవ్యం: 
రాజకీయ చాణక్యుడు చంద్రబాబు పని ఖతం... అని అంతా అనుకున్నారు... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న దశలో. అటూ (సీమాంధ్ర) ఇటూ (తెలంగాణా) కాకుండా పోతాడన్న ప్రచారం బాగా జరిగింది. తెలంగాణా కు గతంలోనే తలూపి, మళ్ళీ... విభజనకు వ్యతిరేకంగా జగన్ తో పోటా పోటీ గా దేశం లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి హడావుడి చేసిన బాబు చటక్కున మోడీ తో చేతులు కలిపారు. తన స్థాయికి సరిపోని పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోవాల్సి రావడం నిజానికి ఆయన రాజకీయ ఓటమే. అయినా...తను ముఖ్యమంత్రి కావాలని అహరహం శ్రమించే ముఖ్యమైన మీడియా హౌజుల అండదండలతో, విదేశాల్లో ఉన్న స్వకులస్థుల దన్నుతో బాబు మళ్ళీ స్టేజ్ మీద ఒక మెరపు మెరిసారు. రిలీజ్ కాదనుకున్న సినిమా ఆడుతుంది. 

వ్యతిరేక పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పెద్ద బామ్మర్ది కి చేయిచ్చి, జూ ఎన్టీర్ ఊసు లేకుండా, కొడుకు ను వారసుడిగా పార్టీ శ్రేణులతో అంగీకరింపచేసుకున్న బాబు చతురతను అభినందించాల్సిందే. పచ్చ మీడియా ఊదిన పెద్ద బెలూన్ తుస్సుమంటే.. బాబు భవిత గోవిందా.... అవుతుంది. అయినా... ఆయనకు పోయేదేమీ లేదని చెప్పుకోక తప్పదు. బ్యాక్ అప్ గా తాను పెట్టుకున్న లోకేష్ వచ్చే ఐదేళ్ళలో పార్టీ ని పైకి తేవచ్చు. తెలుగు దేశం తమదని, దాని అవసరం చరిత్రాత్మకమని కమ్మ కులస్థులు  భావిస్తున్నంత కాలం... నారా వారికి, వారి కుటుంబానికి డోకా లేదు. 

రెండు) పవన్ జనబలం:
విప్లవ వీరుడు చే గువేరా లాగా తానో కింగ్ మేకర్ నని, బుసలు కొట్టే ఆవేశంతో జనాలను ఉత్తేజితులను చేయవచ్చని తలచే పవన్ కళ్యాణ్ కు నిజంగా ప్రజా బలం ఉందో లేదో తేలిపోతుంది. బాబు తో జత కట్టబట్టి... పచ్చ మీడియా సారును ఇంతలా ఎత్తుతోంది కానీ ప్రజల్లో పవన్ కు బలం ఉందని నమ్మడం కష్టం. కానీ...ఒక సామాజిక వర్గానికి ఎక్కడలేని ఆశలు పెట్టి, ఎత్తి కుదేసి...తాను తిట్టిపోసిన కాంగ్రెస్ లో చేరి పదవి పొందిన చిరంజీవి కి భిన్నమైన వాడు పవన్ అని మాత్రం పేరొచ్చింది. కన్ఫ్యూజన్ లో ఉన్న కాపు ఓట్లను, ముఖ్యంగా యువతను, పవన్ ప్రభావితం చేశాడని అంటున్నారు. చూడాలి. ఒక పధ్ధతి ప్రకారం... హైప్ సృష్టించి, ఎన్నికలకు ముందు హడావుడిగా పార్టీ పెట్టి, మోడిని కలిసి, మోడీ-బాబు సరసన చేరిన పవన్ కు తెర వెనుక నుంచి డైరెక్ట్ చేస్తున్న వారిని కచ్చితంగా అభినందించాలి.  
అటు జగన్, ఇటు కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అయితే... ఈ గబ్బర్ సింగ్ పరిస్థితి ఎలా ఉంటుందా? అన్నది ఆసక్తి కరం. జగన్ ను, కే సీ ఆర్ ఫ్యామిలీ ని పవన్ తిట్టినట్లు ఎవ్వరూ తిట్టే సాహసం చేయలేదు. ముక్కు దొరగారిని తిట్టి పోయడంలో జగ్గారెడ్డి ఫస్టు, పవన్ సెకండ్!

మూడు) జగన్ కెరీర్:
ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేసినా, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసినా... జగన్ మోహన్ రెడ్డి లాగా రాజకీయ పోరాటం చేసి జనంలో నిలబడిన జగమొండి నేత ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కానరారు. వై ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి ప్రచారం మిన్నంటుతున్న సమయంలో ఎంతో ముందస్తు చూపుతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు జగన్. దానికి డబ్బు 'క్విడ్ ప్రో కో' ది కావచ్చు లేదా జనం నుంచి దోచుకున్నదో కావచ్చు... సాక్షి పేపర్, టీవీ ఛానల్ లేకపోతే...జగన్ ను రాజకీయంగా ఇప్పటికే సమాధి చేసేవాళ్ళు. 
నిజానికి... జగన్ ఈ ఎన్నికల్లో ఇప్పటికే గెలిచారు. ఎన్నికలకు కొద్దిగా ముందు జైలు నుంచి బైటికి వచ్చి... కాస్త రెస్ట్ తీసుకుని జగన్ చెలరేగిన తీరు ఆశ్చర్యకరం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా పెద్ద నష్టం లేదు.  ఇప్పుడు, ఉప్పుడు కాకపోతే వచ్చే ఐదేళ్ళలో జగన్ పార్టీ వైపు జాతీయ పార్టీలు చూడక తప్పని పరిస్థితి. 
పెద్దగా పేరున్న రెడ్డి గారు రాష్ట్రంలో లేకపోవడం, తండ్రి ప్రసాదించిన తెగువ, తెరువు జగన్ బలాలు.  

నాలుగు) కే సీ ఆర్ పరివార్:
నేతలు ఊహించనివి కూడా రాజకీయాల్లో జరుగుతాయి. తెలంగాణా కోసం అహరహం కృషి చేసిన కే సీ ఆర్ తో పాటు ముందుగా మేనల్లుడు హరీష్, తర్వాత కొడుకు రామ్, ఆనక కూతురు కవిత కదం తొక్కారు. నిజానికి... తెలంగాణా వస్తదో రాదో, ఎన్ని రోజులు కష్టపడాలో తెలియని పరిస్థితిలో ఫ్యామిలీ అంతా ఉద్యమం లోకి దూకింది. ఈ రోజు విప్లవ స్ఫూర్తి తో అన్నా... అన్నా అన్న అనేకమంది... మర్నాడు ప్రెస్సు కెక్కి 'దొరోడు.... దొంగోడు' అని కే సీ ఆర్ ను తిట్టారు. ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు చాలా మంది (ఆయన చర్యలు నచ్చకో, నిజంగా ఇబ్బంది పడో, నిజ స్వరూపం తెలుసుకునో) కే సీ ఆర్ కు దూరమయ్యారు. రాజకీయ వైరాగ్యం వచ్చే పరిస్థితులు ఎన్నో ఎదురైనా... కే సీ ఆర్ తెలంగాణా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించారు. వై ఎస్ ఆర్ పోకపోయినా, కే సీ ఆర్ లేకపోయినా తెలంగాణా ఇప్పట్లో వచ్చేడిది కాదనేది కాదనలేని సత్యం. 
మరి తెలంగాణా రాష్ట్రం లో అధికారంలోకి వచ్చాక... కుటుంబ పాలన అన్న ముద్ర ఎలా తొలగించుకుని ఆయన ముందుకు పోతారన్నది తేలనున్నది. 

ఐదు) లోక్ సత్తా పరిస్థితి:
గత దశాబ్ద కాలంలో దేశానికి ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన ఒక పాజిటివ్ స్ఫూర్తి... లోక్ సత్తా. హైదరాబాద్ డిల్లీ కాదు కాబట్టి... లోక్ సత్తా పార్టీ ఆమ్ ఆద్మీ లాగా వెలగలేక పోయింది కానీ అరవింద్ కేజ్రీవాల్ కన్నా గొప్ప మేథావి, నిదాన పరుడు జయప్రకాశ్ నారాయణ్. ఆమ్ ఆద్మీ కన్నా అద్భుతమైన ఆలోచనలు, కార్యకర్తలు లోక్ సత్తా కున్నారు. ఉద్యమాన్ని హడావుడి గా అప్పటి ఎన్నికలకు ముందు జే పీ పార్టీ గా మార్చారు. అప్పట్లో కొద్దిగా వేచి చూసి ఈ ఎన్నికల నాటికి బరిలోకి వచ్చి, మోడీ జత కట్టినా కట్టక పోయినా ఫలితాలు అత్యద్భుతంగా ఉండేవి. అప్పటి తొందరపాటు నిర్ణయం వల్ల ఒక అద్భతమైన మహోద్యమం... నీరు కారిందన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళింది. 
అప్పట్లో కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం గెలిచిన జే పీ గారు ఇప్పుడు మల్కాజ్ గిరి లో నెగ్గుకొచ్చే వాతావరణం లేదు. ఈ విజయాలతో, అపజయాలతో సంబంధం లేకుండా... తన మీదున్న కులజాడ్యం మచ్చను తొలగించుకుని, వచ్చే ఎన్నికల వరకూ రెండు వైపులా మంచి ప్రజోద్యమాలను లోక్ సత్తా నిర్మించడం చారిత్రక ఆవసరం. కచ్చితంగా ఒక దశలో ప్రజలు ఈ సత్తా ను గుర్తించక తప్పదు. 

ఆరు) ఎర్ర పక్షాల తలరాత:  
విద్యార్థి రాజకీయాల్లో తిరిగిన ఎవరికైనా... ఇప్పుడు లెఫ్ట్ పార్టీ లను చూస్తే జాలి గానీ అసహ్యం గానీ వేస్తుంది. అధ్బుతమైన విద్యార్ధి, యువజన,  మహిళా,కార్మిక కాడర్ ఉన్న ఈ పార్టీలు ఎన్నికల దగ్గర చేసే విన్యాసాలు ఛీ అనిపిస్తాయి. వచ్చే ఒకటి రెండు సీట్ల కోసం... జగన్ పార్టీ తోనో, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తోనో కలవడం... అవసరమా? రాష్ట్రంలో రెండు, మూడు ప్రాంతాలకు పరిమితమైన వామ పక్షాల భవిత ఏమిటో కూడా తేలిపోతుంది ఈ ఎన్నికల్లో. కమ్యూనిస్టుల ఖిల్లా లైన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నుంచైనా ఒక్క ఎర్ర చొక్కా అయినా అసెంబ్లీలకు వస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. 

లెక్క ప్రకారం... కోరలు సాచే కాపిటలిజం భూతం, మితిమీరిన వస్తు వినియోగ సంస్కృతి, ఆర్ధిక అంతరాలు, సామాజిక కల్లోలాలు... కమ్యూనిజం పరిఢవిల్లడానికి ప్రాతిపదిక. ఆ స్థితిగతులు ఉన్నా...ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పట్టు కోసం పిల్లి మొగ్గలు వేయడం కామ్రేడ్లు ఉద్యమానికి చేస్తున్న పెద్ద ద్రోహం. అది అవునో, కాదో కూడా ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 

Thursday, May 8, 2014

కొత్త ఫ్యానా? పాత సైకిలా??: గెలుపెవరిది?


ఫేస్ బుక్ లో ఒక చోటి నుంచి ఈ పై బొమ్మ లేపెసాం. జోస్యం చెప్పడం, అంచనా వేయడం...లో భలే మజా ఉంటుంది. ఇప్పుడు మీడియా మీద, వ్యవస్థ మీద ఇంకా అసహ్యం పుట్టని వాళ్ళు, ప్రజాస్వామ్య హితైషులు, పొద్దుపోని వాళ్ళు లెక్కల మీద లెక్కలు కడుతున్నారు. ఇది ఆక్టోపస్ ల కాలం. దేని అంచనాలు దానివి. 

అందరు అధినేతలు తమ పార్టీదే విజయం అని బల్ల గుద్ది మరీ ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా నవ్వులు కురిపిస్తున్న చంద్రబాబు కూడా ధీమాతో ఉండగా, పెదాన మంత్రి వోడైనా... మన కాడికి రాల్సిందే...అని జగన్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

రాష్ట్ర విభజన ఆగుతుందని... గట్టిగా నమ్ముతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఆ మాట అనట్లేదు.  102 దేశం పార్టీ కి, 62 జగన్ పార్టీకి వస్తాయని ఒకరు, అది 75 (బాబు) -95(జగన్) అని ఇంకొకరు, 69- 105 కాకపోతే చూడండి.... అని మరొకరు అంటున్నారు. 
"అన్నా... జగన్ క్లీన్ స్వీప్. 115 సీట్లు ఖాయమ్. రాసి పెట్టుకో.." అని సీమాంధ్ర లో చాప కింద నీరులా సర్వే చేస్తున్న ఒక మిత్రుడు ఘంటాపథం గా వాదిస్తున్నాడు. కానీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి మాత్రం దేశం వైపే పవనం ఉన్నట్లు చెప్పారు. 

ఒక ప్రఖ్యాత మానేజ్మెంట్ సంస్థ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాత్రం రెండు చోట్లా 'క్లీన్ సీప్స్' ఉండవని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఉంటుందని, దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నదని కూడా తానూ అనుకోవడం లేదని చెప్పారు. చూద్దాం. 
మాకు మాత్రం.... అక్కడ జగన్, ఇక్కడ వాళ్ళను లాగి... వీళ్ళను లాగి కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అవుతారని అనిపిస్తున్నది. 

Monday, May 5, 2014

వేజ్ బోర్డు అమలు కోసం 'ఈనాడు' జర్నలిస్టుల ఎదురుచూపు

సుప్రీం కోర్టు ప్రమేయంతో... ముందుగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీ టీ ఐ), ఆ తర్వాత 'ది హిందూ' యాజమాన్యాలు మజితియ వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేస్తూ ఏప్రిల్ నెల నుంచి జీతం పెరగడంతో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో ఆశలు చిగురెత్తాయి. 

ముఖ్యంగా 'ఈనాడు' మిత్రులు ఇదే విషయం గురించి మాటి మాటికీ చర్చించుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారం ఏప్రిల్ నెల జీతంతో పాటు పెరుగుదల ఉండాలి. మరి 'ఈనాడు' ఉద్యోగుల జీతాలు ఏప్రిల్ నెల 30 న పడిపోయాయి. కానీ కాణీ పెరగలేదు. ఇది అక్కడి ఉద్యోగుల్లో అశాంతి కి కారణం అయ్యింది. నిజానికి కులపోళ్ళు, ప్రాంతపోళ్ళు, గోత్రపోళ్లకు ఆయా యాజమాన్యాలు ప్రతిభ, ప్రయోజనాలతో సంబంధం లేకుండా  ఇప్పటికే పెంచాయి. 

"మరి ఇప్పుడేమి జరుగుతున్నదో అన్న ఆసక్తి, ఉత్కంఠ మా సంస్థలో పెరిగాయి. దీనిపై యాజమాన్యం ఏడో తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు," అని 'ఈనాడు' మిత్రుడొకరు చెప్పారు. సాక్షి, ఆంధ్ర జ్యోతి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వీళ్ళంతా... గతంలో మాదిరిగా.. 'మాకు జీతాలు పెంచవద్దు..." అని రాయించుకుని జర్నలిస్టుల నోళ్ళు కొట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. 

వేతనాలు పెంచుతూ వేజ్ బోర్డు చేసిన సిఫార్సులను నిలువరించడానికి పత్రికల యాజమాన్యాలు కలివిడిగా, విడివిడిగా పోరాడి సుప్రీం ను చేరాయి. కానీ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో జర్నలిస్టులకు అదనపు జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 
జర్నలిస్టు మిత్రులారా... మీకు మేలు జరగాలని కోరుకుంటున్నాం.   

ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం...

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిరి ధన ప్రవాహం మరే రాష్ట్రంలోనూ జరగలేదు. పార్టీ ఏదైనా... డబ్బు బలం లేనిదే గెలవలేమని అభ్యర్ధులు నమ్మారు. డబ్బు అనగానే అతిశయోక్తి తో ప్రచారం చేయడం సహజమే అయినా... మన దగ్గర 150 నుంచి 200 కోట్లు అధికారికంగా పట్టుక్కున్నట్లు, ఇది దేశంలో ఎన్నికల సందర్భంగా పట్టుకున్న మొత్తంలో నలభై శాతమని అంటున్నారు. ఇది ప్రమాద సూచిక. 

ఏ పార్టీ చూసినా.... అభ్యర్థుల ఎంపికలో డబ్బు ను ఒక కారకంగా చూసిందే. జాతి పిత మహాత్మా గాంధీ గారు వచ్చినా... నాలుగు డబ్బులు ఖర్చు చేయనిదే గెలవలేని పరిస్థితి. డబ్బు ను బట్టి జనం ఓట్లు వేస్తారా? నేను నమ్మను... అని అనడం అమాయకత్వం. ప్రచారంలో హడావుడి చేయడానికి, ప్రజాదరణ గల నాయకుడహో... అని మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి, ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కోవడానికి కరెన్సీ నోట్లే కీలకం. మన జనంలో అధికులు నోటును బట్టే ఓటు వేస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. 500 వందలకు కక్కుర్తి పడేది ఏమిటనో, ఇతరులకు తెలిస్తే పరువు తక్కువనో... కొద్దిగా మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఆగుతారేమో గానీ... నాయకులు పధ్ధతి ప్రకారం కాలనీల్లో తయారు చేసుకునే ఓటర్లకు ఎన్నికలు ఒక పండగ కాలం. నాయకుల పుణ్యాన ఈ దుస్థితి.  

ఖైరతాబాద్ లో పార్టీలు ఎడాపెడా మార్చి... మార్చినప్పుడల్లా అధినేతను పొగిడి నేగ్గుకొచ్చే ఒక నాయకుడు... మా చుట్టుపక్కల కాలనీల్లో వాళ్లకు చేతినిండా పని కల్పించారు. "ప్రచారానికి రోజుకు 300, కాక బిర్యాని," అని మా పని అమ్మాయి చెప్పగా... కరెంటు రిపేర్ పనిమీద వచ్చిన ఎలక్ట్రీషియన్ దృవీకరించారు. అన్న ప్రకారం డబ్బు ఇవ్వడం లేదని, ట్రీట్ మెంట్ సరిగా లేదని మా పని అమ్మాయి ఫ్రెండ్స్ మధ్యలో ప్రచారం ఆపి వచ్చారు. కానీ  ఎలక్ట్రీషియన్ వారి భార్యను పంపారు. "వాడిది మోసం సార్. అన్న ప్రకారం డబ్బులు ఇవ్వలేదు ఈ సారి. ఓడి పోతడు," అన్నది మా పక్క కాలనీలో అరుగు మీద కూర్చొని కాలక్షేపపు కబుర్లు చెప్పే ఒక పెద్దమనిషి కథనమ్. పదవి లో ఉండగా పోగేసింది... ఎన్నికల్లో దానం చేసేయడం!

ఉస్మానియాలో మా జర్నలిజం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ బరిలో ఉన్న మల్కాజ్ గిరిలో వీళ్ళిద్దరూ పెద్దగా ఖర్చుపెట్టలేదని అంటున్నారు. నిజమో కాదో తెలియదు. చివరకు...అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారి నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటున్న మాజీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా డబ్బు తరలిస్తున్న ఆరోపణపై బుక్కయ్యారు.

ఓటర్లతో పాటు... డబ్బు పంపిణీలో సింహభాగం పొందుతున్నది.... మీడియానే. దాదాపు అన్ని ఛానెల్స్ విలేకరులకు యాడ్ టార్గెట్ ఫిక్స్ చేసాయి. ఉన్నత ఆశయంతో ఏర్పడిన హెచ్ ఎం టీవీ, ప్రజల డబ్బు తో ఏర్పడిన 10 టీవీ వంటి ఛానెల్స్ కూడా విలేకరులకు కమిషన్ ఆశ చూపడం చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఒక పత్రిక అధిపతి ఒక నెల కిందట స్వయంగా విలేకరులతో మీటింగ్స్ పెట్టి జిల్లాకు రెండు కోట్ల రూపాయల వరకు యాడ్ తేవాలని... అందులో పది శాతం విలేకర్లు తీసుకోవచ్చని చెప్పారు. విలేకరులు దీన్ని... 'గోల్డెన్ చాన్స్' అనుకుని రెచ్చిపోయి యాడ్స్ కలెక్ట్ చేస్తారా? లీక్ ఇలా యాడ్స్ తేక తప్పని చోట పనిచేయడం ఇష్టం లేక వేరే చోటికి మారతారా? చెప్పడం పెద్ద కష్టం కాదు. 

మా ఖమ్మం లో ఒక పార్లమెంటరీ అభ్యర్ధి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని సమాచారం. "డబ్బు నీల్లలాగా ఖర్చు పెట్టారు. విలేకరులకు కూడా బాగానే ముట్టాయి," అని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పగా విన్నాను. నల్గొండ లో 'ది హిందూ' విలేకరిగా ఉన్నప్పుడు... కనీసం ఇద్దరు అభ్యర్ధులు ఇంటికి నోట్ల కట్టలు పంపారు. వాటిని తిరస్కరించడం... అందువల్ల లోకల్ రిపోర్టర్స్ కు శత్రుఫు కావడం...డబ్బు తీసుకోలేదని చివరకు నిరూపించుకోవాల్సి రావడం సిన్సియర్ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అప్పట్లో నల్గొండ లో ఒక తెలుగు పత్రికలో ఉండి విలేకరిగా, రాజకీయ సలహాదారుగా బాగా సంపాదించిన ఒక జర్నలిస్టు ఇప్పుడు హైదరాబాద్ చేరి రెండు చేతులా సంపాదించి స్థితిమంతుడిగా ఎదగడం పెద్దగా అబ్బురపడకూడని విషయం. 

భవిష్యత్ సంపాదన కోసం ఈ ఎన్నికల్లో నాలుగు డబ్బుకు ఖర్చు పెట్టడం తప్పు కాదని రాజకీయ నేతలు, సంపాదనకు ఎన్నికలు ఉత్తమ మార్గమని మీడియా యాజమాన్యాలు-జర్నలిస్టులు నమ్ముతుంటే... ఆర్థికంగా లేమితనంతో ఉన్నవారిని ఈ ఎన్నికల సదర్భంగా తప్పుపట్టడం తప్పే కదా!

Saturday, May 3, 2014

ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ రోజు రెండు విధాలుగా ఎంతో ముఖ్యమైనది.
ఒకటి) జర్నలిజంలో ఎందరికో అక్షరాభ్యాసం చేసి స్ఫూర్తి నింపిన మహనీయుడు, యదార్థవాది, మా గురువు గారు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి 82 వ జయంతి ఈ రోజు. రెండేళ్ళ కిందటి లాగా ఆయనకు ఘన నివాళి అర్పించాలని ఆరాటపడ్డాను. ఈ సందర్భంగా ఒక సభ ప్లాన్ చేసి, ముఖ్యులు అనుకున్న ఇద్దరు ముగ్గురికి ఫోన్లు చేసి, ప్రెస్ క్లబ్ లో గది-భోజనాలు బుక్ చేసి స్పందన సరిగా లేక నిన్న సాయంత్రం ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. జనం నిజంగానే బిజీగా ఉన్నారు. అది గురువు గారు అర్థం చేసుకుంటారు. ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్. 

రెండు) ఈ రోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, తెలుగులో  ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. దురదృష్టవశాత్తూ... ఇలాంటి రోజులు జరుపుకుని... వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన... ఇబ్బంది పడిన జర్నలిస్టుల గురించి గుర్తు చేసుకునే సంస్కృతి, సంస్కారం మన తెలుగు జర్నలిజం లో లేవు. ఎడిటర్లు...ఆ స్థాయి వ్యక్తులు పెద్దగా విద్యార్హతలు, చిత్తశుద్ధి  లేని పప్పుశుద్ధలు. జర్నలిజం
స్కూళ్ళ ప్రిన్సిపాళ్లు యాజమాన్యాలు గీసే గీత దాటని తాబేదార్లు. యాజమాన్యాలు డబ్బు కక్కుర్తితో అహరహం రగిలే స్వార్థపరులు. 
జర్నలిస్టుల మేలు కోసం పాటు పడాల్సిన జర్నలిస్టు సంఘాల పెద్దలకు అంత తీరికా, ఓపికా లేవు. ఉద్యోగాలు ఊడి వందల కొద్దీ జర్నలిస్టులు వీధిన పడినా... యావత్ జర్నలిజం రాజకీయ రంగు పులుముకుని పత్రికా స్వేఛ్చ యాజమాన్య స్వేచ్ఛగా మారి...వారి వ్యాపార-రాజకీయ-కుల ప్రయోజనాలకు ఒక మంచి సాధనంగా మారినా... ఒక్క గొంతూ ఇక్కడ వినిపించలేదు. 

బ్రదర్స్, సిస్టర్స్... ఇప్పుడు జర్నలిజం మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన పత్రికా స్వేఛ్చ ఇప్పుడు ఎండమావి అయ్యింది. జర్నలిజం ప్రమాదంలో ఉంది. "రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్" వారు 180 దేశాల్లో పత్రికా స్వేఛ్చ ను లెక్క కట్టి భారత్ ది 140 వ స్థానంగా నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
ఈ సందర్భంగా.... వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే కు సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ కోసం.  
World Press Freedom Day is observed annually on 3 May to remind countries and people all around the world, that freedom of the press and freedom of speech and expression are fundamental human rights
This day is often held to remember many journalists who have died or faced jail in order to bring news to the public.
In Observance of the World Press Freedom Day 2014, here are the most important facts that we must take note of. 
1. The World Press Freedom Day was established by the General Assembly of the United Nations in December 1993 as an outgrowth of the 'Windhoek Declaration' adopted in 1991 in Namibia for promoting independent and pluralistic African Press. 
2. The World Press Freedom Day is celebrated on 3 May, the date on which the Windhoek Declaration was adopted which emphasized the need of a free press for developing and maintaining democracy and for economic development. 
3. Article 19 of the 1948 Universal Declaration on Human Rights (considered as an important stepping stone to the freedom of press) states that everyone "has the right to freedom of opinion and expression, this right includes freedom to hold opinions without interference and to see, receive and impart information and ideas through any media and regardless of frontiers."
 4. Every year the UNESCO/Guillermo Cano World Press Freedom Prize is awarded to different journalist or individuals, especially those who have risked their lives in promotion of the freedom of expression. The 2014 winner of the prize was the Turkish instigative journalist Ahmet Sik, who was reportedly arrested in 2011 on charges of being linked to an alleged terrorist organization. 
5. According to the Press Emblem Campaign (PEC), 35 journalists have been killed in 2014 so far. And in 2013 70 journalists were killed, while the year 2012 saw one of the highest numbers of such deaths with 141 journalists reported dead. 
6. According to the Committee to Protect Journalists, the five 'deadliest' countries for journalists are Syria, Iraq, Egypt, Pakistan and Somalia. India is in 6th place. 
7. In 2011-2012, the countries where press was the most free were Finland, Norway and Germany, followed by Estonia, Netherlands, Austria, Iceland, and Luxembourg.
 8. The country with the least degree of press freedom was Eritrea, followed by North Korea, Turkmenistan, Syria, Iran and China
9. According to Reporters Without Borders, more than a third of the world's population live in countries where there is no press freedom or where there is no system of democracy or where there are serious deficiencies in the democratic process. 
10. Regions closed to foreign reporters include Chechnya, Russia; Ogaden, Ethiopia; Jammu & Kashmir, India; Waziristan, Pakistan; Agadez, Niger; North Korea and Syria.
(Courtesy: International Business Times)