Tuesday, May 27, 2014

టీ ఆర్ ఎస్ చేతికి "నమస్తే తెలంగాణా" పత్రిక!

జూన్ ఆరో తేదీన పుట్టిన రోజు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న "నమస్తే తెలంగాణా" పత్రిక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి ఆధీనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణా, ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణా, ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణా అంటూ ఏర్పడిన ఈ పత్రిక అల్లం నారాయణ గారి నేతృత్వంలో, కట్టా శేఖర్ రెడ్డి గారి సారధ్యంలో అనుకున్నది సాధించడంలో కీలక భూమిక పోషించింది.  ప్రముఖ సివిల్ ఇంజినీరు, పారిశ్రామిక వేత్త సీ ఎల్ రాజం దీనికి అధిపతి.

కమ్మ, రెడ్డి యాజమాన్యాలు జర్నలిజాన్ని పచ్చడి పచ్చడి చేస్తున్న దశలో నాలుగేళ్ల కిందట పుట్టిన ఈ పత్రిక తెలంగాణా జర్నలిస్టులను ఆదుకున్నదని చెప్పడానికి సంశయించాల్సిన అవసరం లేదు.  

ప్రభుత్వం ఏర్పడగానే... ఒక పత్రిక అవసరం గుర్తెరిగిన కే సీ ఆర్ బృందం నష్టాల్లో ఉన్న 'నమస్తే తెలంగాణా' ను తీసుకునే దిశగా పావులు కదిపిందట. బ్రాహ్మణ సామాజిక వర్గం తరఫున రాజం గారికి ఎం ఎల్ సీ ఇస్తామని కే సీ ఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో...కే టీ ఆర్ రెండు మూడు రోజుల కిందట రాజం గారితో ఈ విషయం మీద సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. "కే టీ ఆర్ మా ఆఫీసుకు వచ్చి మా యజమాని తో చర్చలు జరిపారు. దాదాపు డీల్ ఖరారు అయినట్లే. ఎడిటర్, సీ ఈ ఓ మారకపోవచ్చు కానీ తెలంగాణా నిర్మాణంలో పత్రిక సేవలు మరింత క్రియాశీలంగా వాడుకునే అవకాశం ఉంది," అని అక్కడి జర్నలిస్టు ఒకరు చెప్పారు. 

ఇప్పటికే... టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో టీ-న్యూస్ అనే ఛానెల్ నడుస్తున్నది. అధికారంలోకి రావాలన్నా... అధికారంలో ఉన్నా మీడియా అవసరం ఎంతైనా ఉందని తెలుగు నేల మీద అన్ని పార్టీలు గుర్తించాయి. తెలుగు దేశం కోసం అహరహం తపించి... ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ పాత్ర పోషించి... ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన 'ఈనాడు' మీడియా సంస్థల యజమాని చెరుకూరి రామోజీ రావు నిన్న ప్రత్యేక అతిధి హోదాలో మోడీ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయిన విషయం.... మీరు టీవీ లో చూసే ఉంటారు. మరది మీడియా పవర్ అంటే!

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన "మెట్రో ఇండియా" అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా...లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్.... ముగ్గురు... కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

3 comments:

telangana mama said...

cl rajam has
rajyasabha member

telangana mama said...

cl rajam mlc kadhu...mp(rajya sabha)istannani kcr hami icharu

Sitaram said...

తెలంగాణా మామ గారు చెప్పింది కరెక్టు. రాజం గారికి రాజ్యసభ టికెట్ ఇస్తామని కే సీ ఆర్ చెప్పారు. సారీ...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి