Sunday, May 11, 2014

అయ్యో పాపం... కోనపురి రాములు

అది- 2007 వ సంవత్సరం, జూన్ నెల మొదటి వారం. 
నల్గొండ లో 'ది హిందూ' పత్రికకు ప్రతినిధిగా పనిచేస్తున్న రోజులు. 
రాత్రి పది, పదకొండు అయ్యింది. అప్పుడు లాండ్ లైన్ కు ఒక ఫోన్ వచ్చింది. అపరిచితుడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తనొక పేరు మోసిన నక్సలైటు. రిపోర్టర్ గా తన పూర్తి బాక్ గ్రౌండ్, చేసిన నేరాలు అన్నీ తను చెప్పకుండానే నాకు పూర్తిగా తెలుసు.

సీ పీ ఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి కోనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు తను. అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ ఎందుకు అడవి బాట పట్టారేమిటా? అన్న ప్రశ్నతో వాళ్ళ ఊరైన వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం వెళ్లి అప్పటికే ఒక పెద్ద స్టోరీ రాసాను, డిసెంబర్ 8, 2002 లో. 
నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్న నా సహకారంతో లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలవాలని ఉందని, సహకరించాల్సిందిగా రాములు కోరాడు. "మీరు నిజాయితీపరుడైన జర్నలిస్టు. నేను అందుకే మిమ్మల్ని నమ్మి సాయం కోరుతున్నాను. నాకు ప్రాణ భయం ఉంది," అని చెప్పాడు. అప్పటికే ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నది.  అయినప్పటికీ... ఇలాంటి విషయంలో తలదూరిస్తే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. నేను వెంటనే... హైదరాబాద్ లోని మా ఆఫీసు లో నమ్మదగ్గ ఒక సీనియర్ (చీఫ్ ఆఫ్ బ్యూరో సుసర్ల నగేష్ కుమార్ కాదు) తో మాట్లాడి సలహా అడిగాను. తను మంచి సలహా ఇచ్చారు.

లొంగి పోవడానికి వచ్చిన నక్సల్స్ ను ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు చంపేస్తే...మధ్యవర్తిగా ఉన్న మన మీద నక్సల్స్ కు అనుమానం వస్తుంది. నక్సల్స్ తో వీడికేంటి పని? అని పోలీసులూ అనుమానిస్తారు. అందుకని...ఒక రిపోర్టర్ కన్నా పొలిటీషియన్ ద్వారా లొంగిపోవాలని రాములుకు సూచించాను. మరొక గంటాగి ఫోన్ చేసి... ఒక ఫోన్ నంబర్ కావాలని అడిగాడు.  
ఆ తర్వాత ఒక వారం లోపే... హైదరాబాద్ లో నాటకీయ పరిణామాల మధ్య అప్పటి నల్గొండ ఎం పీ సురవరం సుధాకర్ రెడ్డి గారి  సహకారంతో రాములు లొంగి పోయాడు. 
కొన్నాళ్ళకు కోర్టు కేసు మీద నల్గొండ వచ్చినప్పుడు ఆఫీసుకు వచ్చి నన్ను కలిశాడు. చాలా సేపు నాతో ఉన్నాడు.  
ఉద్యమం గురించి నాకున్న అనేకానేక సందేహాలను అడిగాను. ఓపిగ్గా నివృత్తి చేసాడు. సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న యువకుడు. అలా చేయడానికి వ్యవస్థ లో కొందరు వ్యక్తులు, శక్తులు అడ్డం వస్తాయని, అందుకే తుపాకీ ఒక మార్గమని చెప్పాడు. ఇంత నిర్బంధం మధ్య... జీవితాలను ఫణంగా పెట్టి, హింసా కాండ సృష్టించడం ఒక్కటేనా పరిష్కారం? అని అడిగాను. పోలీసులను టార్గెట్ చేయడం ఎందుకు... వాళ్ళు కూడా సాధారణ ప్రజలే కదా? కేవలం ఖాకీ దుస్తులు వేసుకున్నందున వాళ్ళు వర్గ శత్రువులు అవుతారా? అని అడిగాను. రాములు తను చెప్ప దల్చుకున్నది చెప్పాడు.

ప్రత్యేకించి... నల్గొండ జిల్లాలో ఒక తెలుగు దేశం స్థానిక నేతను ఘోరంగా చంపిన ఘటనపై అతని వివరణ అడిగాను. "అన్నా... తనను చంపింది నేనే. వాడు ఊళ్ళో సృష్టించని బీభత్సం లేదు. ఎంత మంది స్త్రీల మానాలను హరించాడో నా దగ్గర లెక్క ఉంది. పోలీసుల సహకారంతో, ప్రభుత్వం అండతో అన్ని పాపాలను చేసే వాడిని బతకనిస్తే సాధారణ జనం బతికేదెలా..." అని అన్నాడు. ఒక ఇద్దరు సహచరుల సహకారంతో.. 11 మంది గన్ మెన్ ను బెదిరించి ధైర్యంగా ఆ నేతను ఎలా కాల్చి చంపిందీ... ఆ తర్వాత పోలీసుకు కూంబింగ్ చేస్తున్నా... స్థానిక మహిళలు ఆనందం తో పంపిన భోజనం తింటూ ఎన్ని రోజులు ఆ గ్రామం లో ఉన్నదీ చెప్పాడు. 

నయా నక్సల్స్ ఫిలాసఫీ....అడవి జీవితం గురించి అర్థం చేసుకోడానికి ఎందరినో ఇంటర్ వ్యూ చేశాను. కానీ, రాములు మాదిరిగా విశ్లేషణతో, తర్కంతో మాట్లాడిన యువకుడ్ని నేను చూడలేదు. తనతో మాట్లాడాక... నేను కొంత గందరగోళానికి గురయ్యాను. లా అబైడింగ్ సిటిజెన్ గా నా లాంటి జర్నలిస్టు... నేరుగా నక్సల్స్ తో మాట్లాడి లొంగుబాటు కోసం ఏమిచేయాలో చెప్పడం సరైనది కాదని నాకు ఆ రోజున అనిపించిందని చెప్పాను. 

మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత... రాములు, తన భార్య (మాజీ నక్సల్) ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ నక్సల్ నయీం నుంచి ఉన్న ప్రాణ హాని గురించి చెప్పారు. తమకు రక్షణ కావాలని కోరారు. మాజీ నక్సల్స్ లా దందాలకు దిగడం మంచిది కాదని... ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కొత్త జీవితం ఆరంభించడమో... ప్రాణ హాని ఉంటే వేరే ప్రాంతానికి వెళ్లడమో చేయాలని సలహా ఇచ్చాను. "లేదన్నా... ఇది ఎటూ వెళ్ళలేని పరిస్థితి. నేను వేరే చోటికి వెళ్లి బతికితే... ఎక్కడ నక్సల్ విధ్వంసం జరిగినా నన్నే అనుమానిస్తారు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను చిత్ర హింసలు చేస్తారు. చావు తప్పదు, ఇక్కడ బతక్కా తప్పదు," అని రాములు చెప్పాడు. అప్పటికే తను మృత్యువుతో సహజీవనం చేస్తున్నాడు. 

ఆ తర్వాత 2008 లో ఫిబ్రవరి రెండో వారం లో సాంబశివుడు లొంగి పోవడానికి ఒక పావు గంట ముందు...రాములు ఫోన్ చేసి సంగతి చెప్పిన జర్నలిస్టు లలో హేమ ఒకరు. 'మరి కొద్ది నిమిషాల్లో హైదరాబాద్ లో మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు లొంగి పోతున్నాడు," అని ఒక ఫోన్ ఇన్ లో ప్రపంచానికి మొట్టమొదట చాటింది హేమ... ఎన్ టీవీ లో. అదొక సంచలన వార్త. ఇది నిజంగా కన్ఫర్మ్డ్ న్యూస్ యేనా? అని అప్పటి బ్యూరో చీఫ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో అడిగారు. 

ఆ తర్వాత మా ఎప్పుడో ఒక సారి రాములు హెచ్ ఎం టీవీ లో కలిసాడు. అప్పటికే సాంబశివుడు ను దుండగులు ఘోరంగా చంపారు. తను టీ ఆర్ ఎస్ లో చేరినట్లు, ప్రాణ భయం అలాగే ఉన్నట్లు చెప్పాడు. మళ్ళీ... ఈ రోజు ఉదయం టీవీ ల ద్వారా తెలిసింది... రాములు నల్గొండ లో హత్యకు గురయ్యాడని. లొంగి పోయాక రాములు ఏమి చేసాడో, ఎలా గడిపాడో తెలియదు కానీ... చాలా మందిలో లేని దేశభక్తి రాములు కు ఉందని అప్పట్లో తన మాటల ద్వారా నాకు అర్థమయ్యింది. ఏదో ఒక రోజు ఘోరంగా హత్యకు గురవుతాడని రాములు కే కాదు, మా అందరికీ తెలుసు. 
ఆ రోజున నా స్టోరీ కోసం నేను ఇంటర్ వ్యూ చేసిన రాములు తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. ప్రజా సేవకని అడవి బాట పట్టిన ఇద్దరు బిడ్డలు లొంగిపొయాక కళ్ళ ముందు ఘోరంగా హత్యకు గురి కావడంతో వారి గుండె కోత ఎలా ఉంటుందో కదా... అని బాధేసింది. పాపం...రాములు.   
(పై ఫోటో... రాములు లొంగి పోయిన రోజు 'ది హిందూ' లో వచ్చింది.) 

6 comments:

venu madhav said...

nice story but sad ending

Ravi said...

>>వాడు ఊళ్ళో సృష్టించని బీభత్సం లేదు. ఎంత మంది స్త్రీల మానాలను హరించాడో నా దగ్గర లెక్క ఉంది

ఎలిమినేటి మాధవరెడ్డి ఇంత క్రూరుడని నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. అనుకున్న పని సాధించడానికి ఎంతకైనా తెగించే *అన్నలు* ఈయన్ను తప్పుదారి పట్టించి ఉండరని నమ్మకం ఏంటి?

Sitaram said...

Sorry, he was not Madhava Reddy. Hence I mentioned that the TDP leader was a local leader.

Ravi said...

Then I have to say sorry. I wrongly interpreted your post. :-)

venu madhav said...

madhvareddy not shot dead

suresh kumar kondapalli said...

Informative......

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి