Thursday, July 28, 2011

పాలగుమ్మి సాయినాథ్ గారిని కలిసిన వేళ....

"ది హిందూ" పత్రిక రూరల్ అఫైర్స్ ఎడిటర్ గా పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ గారి గురించి వినని జర్నలిస్టు ఉండరు. ఆయనను ఆరాధించని జర్నలిస్టులూ కనిపించరు. జర్నలిజం ఇంత నీచమైన పేరు తెచ్చుకుంటున్న రోజుల్లోనూ గ్రామీణ ప్రాంతాల సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించి...పాలకులు కదిలేట్టు చేయడంలో ఆయన దిట్ట. ఆయనను "ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం" కు పిలవాలని, ఒక సెమినార్ ఏర్పాటుచేయాలని అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే...ఆయన అంత తొందరగా దొరికే మనిషి కాదు.

అలాంటింది..ఈ మధ్యన యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. కన్వర్జెన్స్ ఆఫ్ మీడియా మీద చక్కగా మాట్టాడారు. సమాజాన్ని శాసిస్తున్న వర్గాలు మీడియాను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నదీ విశదీకరించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మీడియా సంస్థలు ఏ పాటి బిజినెస్ జర్నలిజాన్ని చేస్తాయో అర్థంచేసుకోవచ్చని చెబుతూనే...మీడియా అంటే జర్నలిజమని అపోహపడవద్దని అన్నారు. ABCD of media ను "Advertising", "Bollywood", "Cricket" and "Developers" గా చెప్పారు. ఆయన ప్రసంగం మొత్తం చమక్కులతో చక్కగా సాగింది.
 

ప్రసంగం అయ్యాక ఆయనను కలిసే అవకాశం నాకు వచ్చింది. నేను "ది హిందూ"లో నల్గొండలో రిపోర్టర్ గా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం గురించి రాయడానికి వచ్చినప్పుడు రెండు రోజులు ఆయనతో కలిసి తిరిగాను. రైతులు అప్పులపాలు కావడానికి కారణమైన బోరు బావుల గురించి, బోరు తవ్వడానికి వారు అవంభించే పురాతన విధానాల గురించి పరిశోధన చేసి నేను రాసిన ఒక వ్యాసానికి ఆయన ముచ్చటపడి తాను మర్నాడు రాసిన వ్యాసంలో ఏకంగా నా పేరును ప్రస్తావించారు. అది నాకు మరిచిపోలేని అనుభవం. ది హిందూ నేషనల్ పేజీలలో వచ్చిన సాయినాథ్ గారి వ్యాసంలో మనపేరు ప్రస్తావించడం...నిజానికి అది గొప్పే.
యూనివర్శిటీలో కలిసినప్పుడు....నేను ఫలానా అని పరిచయం చేసుకోగానే..."అఫ్కోర్స్...ఐ నో యూ...వేర్ ఆర్ యూ నౌ," అని చక్కగా మాట్లాడారు. ఒకటి రెండు మాటలయ్యాక...వెళ్లిపోతున్నప్పుడు..."బై రామూ...సీ యూ..." అని చెప్పినప్పుడు అక్కడ గుమికూడిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లు ఒక రెండు నిమిషాల పాటు మనల్ను గౌరవంగా చూడడాన్ని మనం గమనించకపోలేదు. బ్లాగులో పడిఉంటాయి కదా అని...నా శిష్యుడొకరు తీసిన ఫొటోలను ఇక్కడ పెడుతున్నాను. అదీ సంగతి.



Wednesday, July 13, 2011

"ది హన్స్ ఇండియా" ప్రారంభోత్సవం ఈ నెల 15 న

‌హెచ్.ఎం.టీవీ చీఫ్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారి సారథ్యంలో, సంచలనాత్మక ఎడిటర్ నాయర్ గారి సంపాదకత్వంలో ఆంగ్ల దినపత్రిక "ది హన్స్ ఇండియా" ఈ నెల 15 న మార్కెట్ లోకి విడుదల కాబోతున్నది. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమైతే...అవినీతిపై సమరం చేస్తున్న అన్నా హజారే ఈ పత్రికను ప్రారంభించాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారైందీ లేనిదీ తెలియరాలేదు.

ఇప్పటికే ఈ పత్రిక డమ్మీలు తేవడం ఆరంభించింది. మిగిలిన ఆంగ్ల దినపత్రికలకు భిన్నంగా, వినూత్నంగా, ఆకర్షణీయంగా తేవడానికి నాయర్ గారి బృందం కష్టపడి పనిచేస్తున్నది. వీరికి హెచ్.ఎం.టీవీ సీనియర్లు కూడా సహకరిస్తున్నారు. "ది హన్స్ ఇండియా" కోసమని నాయర్ గారు ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు, "ది హిందూ" లో పనిచేసి మానేసిన సాయ శేఖర్ ఒక వారం కిందట  సిటీ ఎడిటర్ పదవిని వదిలి త్వరలో రాబోయే మధ్యాహ్న ఆంగ్ల పత్రిక "నూన్ పోస్ట్" లో అసోసియేట్ ఎడిటర్ గా చేరారు. భారీ స్థాయిలో రాబోతున్న "నూన్ పోస్ట్" ను ఈ నెల 14 న ఆరంభిస్తారని చెబుతున్నారు. గతంలో డీ.ఎన్.ఏ. పత్రికలో బెంగళూరు లో పనిచేసిన ఒకరు దీనికి సంపాకుడిగా వ్యవహరిస్తున్నారు.

Saturday, July 9, 2011

మన్మోహన్, సోనియా దొందూ దొందే: రామ్ బాణం

Thursday, July 7, 2011

మల్లికార్జున శర్మను ఈటానగర్ బదిలీ చేసిన 'ఈనాడు'

హక్కుల గురించి నోరు తెరిచి అడిగిన ఉద్యోగులపై కత్తి కట్టే 'ఈనాడు' సంస్థ మరొక దారుణానికి పాల్పడింది. జర్నలిస్టుగా తన హక్కుల గురించి, న్యాయంగా రావలసిన పదోన్నతి గురించి అడిగిన పాపానికి ఇప్పటికే ఒరిస్సా రాజధానికి బదిలీ చేసిన సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున శర్మను 'ఈనాడు' నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఈటానగర్ బదిలీ చేసింది. మర్నాడే (అంటే ఈ రోజు) రిలీవ్ అయి ఈ నెల పద్నాలుగో తేదీన అక్కడ జాయిన్ కావాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.
కిందటి నెల పదిహేను రోజులకే జీతం ఇచ్చి ఇబ్బంది పెట్టడంపై మల్లికార్జున్ లేబర్ శాఖ కు ఫిర్యాదు చేయడం, ఈ నెల పందొమ్మిదవ తేదీన శ్రీకాకుళం లో అసిస్టంట్ లేబర్ కమిషనర్ ముందు జాయింట్ మీటింగ్ ఉండడం  తో శర్మను మానసికంగా దెబ్బ తీయడానికే ఈ బదిలీ చేసినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు. 

"పిల్లల విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక ఇలా బదిలీ చేయడం దారుణం.  తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా ఈనాడు యజమానులు ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. దీనికి వారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు," అని ఒక మిత్రుడు కాస్త పరుషంగా అన్నారు. 


"న్యూస్ టుడే" అనే సంస్థను నెలకొల్పి దాని నుంచి 'ఈనాడు' వార్తలను కొనుక్కుంటూ పత్రిక నడుపుతున్నట్లు.... లోకానికి పొద్దున్న లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే రామోజీ రావు, ఆయన కొడుకు పేపర్ల మీద చూపించారు. ఇదీ కాక జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం రావలసిన జీతాలు ఇవ్వకుండా 'ఈనాడు' దోచుకోవడాన్ని మల్లికార్జున్ కోర్టులలో ప్రశ్నించారు. 

దానికి ప్రతీకారంగా ఈ బదిలీ వేటు వేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ లోని  ఆర్.టీ.ఐ. అధికార్లకు, ఈనాడు యాజమాన్య ప్రతినిధులకు, మల్లికార్జున్ కు మధ్య  వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కొద్ది సేపట్లోనే ఈ జర్నలిస్టు పై బదిలీ వేటు వేసారని సమాచారం. 

మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మల్లికార్జున్ ను దెబ్బతీస్తున్న 'ఈనాడు' చర్యను ప్రతి జర్నలిస్టు ఖండించాలి. 'ఈనాడు' పై న్యాయ పోరాటం చేస్తున్న మల్లికార్జున్ కు ఆర్ధిక సాయం చేయడంలో భాగంగా ఈ బ్లాగ్ తరఫున రెండు వేల రూపాయలను ప్రకటిస్తున్నాం. ఈ డబ్బు అతని ఖాతాలోకి వెళ్ళే ఏర్పాటు చేస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన తన ఒక్కడి కోసం కాకుండా జర్నలిస్టులు అందరికీ మేలు జరగాలని పోరాడుతున్నారు. మల్లికార్జున్ కు ఏళ్ళ తరబడి జరుగుతున్నది అన్యాయమని భావించిన వారు, 'ఈనాడు' బాధితులు స్పందించి అతనికి అండ దండలు అందించాల్సిందిగా కోరుతున్నాం. జర్నలిస్టులను పూచిక పుల్లలను చూసినట్లు చూసే యాజమాన్యాలకు మల్లికార్జున్ ఒక గట్టి గుణపాఠం నేర్పాలని ఆశిద్దాం.     

Monday, July 4, 2011

చిరంజీవి ఛానల్ కు స్వప్న- తులసి సీడ్స్ వారి ఛానల్ త్వరలో

టీవీ నైన్ వ్యవస్థాపక బృందంలో కీలక భూమిక పోషించి, తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక స్థానం పొందన స్వప్న ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రారంభించబోయే ఛానల్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లేదా ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా వెళ్లి పనిచేయడం ఆరంభించారని చాలా ఆలస్యంగా నాకు అందిన సమాచారం. "ఇప్పుడు అడుగుతున్నవేమన్నా...రామ్ వెళ్ళిపోయిన కొన్నాళ్లకే ఆమె కూడా వెళ్లిపోయింది గదా..".అని సాక్షి సంస్థలో ఉద్యోగి ఒకరు సోమవారం సాయంత్రం నాతో చెప్పారు. కొద్దిగా ట్రాక్ చేయడం ఆపితే చాలు...ఈ తెలుగు ఛానల్స్ లో విషయాలు తెలియకుండా పోతాయి.

నిండుగా చీర కట్టుకుని కట్టూబొట్టూతో తీరుగా ఉండే వారు బుల్లితెరను ఏలుతున్న రోజుల్లో రంగప్రవేశం చేసిన స్వప్న టీవీ నైన్ ద్వారా అనతికాలంలోనే వినుతికెక్కారు. అమెరికాలో చదువుకుని వచ్చి, సంగీత పరిజ్ఞానం ఉన్న ఆమె యాంకరింగ్ తో సంచలనం సృష్టించారు. ఆమె నవ్వు మాత్రం భలే ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆడవారి విషయంలో బాగా బద్నాం అయిన కరీం అనే యాంకర్, స్వప్న అటూ ఇటుగా ఒకరి తర్వాత ఒకరు టీవీ నైన్ ను వదిలారు. ఒక అమ్మాయి తండ్రి, బ్రదర్ జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి కరీం కోలుకుంటుండగా, స్వప్న రేడియో వైపు దృష్టిమరల్చారు. తర్వాత సాక్షి ఛానల్ లో చేరారు కానీ అక్కడ అప్పటికే పాతకుపోయిన ప్రియదర్శిని రామ్ తో తనకు పడలేదని చెబుతారు. ఒక దశలో రామ్ మీద జగన్మోహన్ రెడ్డి భార్యకు స్నప్న ఫిర్యాదు చేశారని కూడా ధృవపరుచుకోడానికి వీలులేని వార్తలను బట్టి తెలుస్తున్నది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భజన బృందంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులలో ఒకరైన స్వప్న...చిరంజీవి ఛానల్ లో చేరారు...ఒక మంచి పే ప్యాకేజీకి ఆకర్షితురాలై.
బడుగుల బాగుకోసమంటూ ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఎన్నికలలో బొక్కబోర్లా పడగానే...ఇక లాభంలేదని అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చిరంజీవిని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్న స్వప్న కల సాకారమవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఒక మీడియా సంస్థ అంటూ లేకపోవడం వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్న చిరంజీవి బృందం స్వప్నపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

ఇదిలావుండగా...తులసి సీడ్స్ అనే సంస్థ త్వరలో ఒక ఇరవై నాలుగు గంటల ఛానల్ తేబోతున్నదట. ఈ ఛానల్ నిర్వహణ బాధ్యతలను తోట భావ నారాయణ అనే సీనియర్ జర్నలిస్టుకు అప్పగించారట. ఆ ఛానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నదని చెబుతున్నారు. మా టీవీ, జెమిని టీవీలలో ఉన్నత పదవుల్లో పనిచేసిన భావ నారాయణ...ఎలక్ట్రానిక్ మీడియా మీద ఒక పుస్తకం కూడా రాశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.టీవీ లో పనిచేసిన భావ నారాయణ ఆ తర్వాత దాన్ని వదిలేశారు.