ఎన్నడూ లేనిది ఈసారి ఈ ఈ-తెలుగు వారి వల్ల మాతృభాషా దినోత్సవానికి ఒక వారం పది రోజుల ముందు నుంచే మాతృభాష పై బెంగ మొదలయ్యింది నాకు. తెలుగు గురించి ఇంత తీవ్రంగా జన్మలో ఎప్పుడూ ఆలోచించలేదు.
నేనేమో ఇంగ్లిష్ మీడియం పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. నా ఇద్దరు పిల్లలను స్కూల్లో చచ్చినా తెలుగు మాట్లాడవద్దని తరచూ చెబుతూ ఉంటాను. పదో తరగతి చదివే కూతురు గుణించుకోకుండా ఒక రెండు తెలుగు వాక్యాలైనా గబగబా చదవలేదు. ఇలాంటి తప్పు పిల్లవాడి విషయంలో జరగకూడదని...ఐదో తరగతిలో తెలుగు ఐచ్ఛిక భాషగా చేసినందుకు వాడు నన్ను దెప్పుతున్నాడు. 'నేను సాంస్క్రిట్ (సంస్కృతం) తీసుకుంటా అంటే...ఈ తెలుగు తీసుకోమన్నావు,' అని రెండు మూడు సార్లు ఇప్పటికే అన్నాడు.
నాకేమో...ఎవడైనా...తెలుగులోనే మాట్లాడతానని ప్రతిజ్ఞ చేద్దాం...రమ్మంటే ఒళ్ళు మండుతుంది. ఒక తెలుగు పేపర్ ను నమ్ముకోబట్టి నా జీవితమంతా నాశనం అయ్యింది. అదే అప్పట్లోనే ఒక ఇంగ్లిష్ పేపర్లో చేరి వుంటే...ఇప్పటికి కనీసం ఎడిటర్ స్థాయికి వచ్చే వాడిని. 'అరె...ఇంగ్లిష్ తేలిగ్గా నేర్చుకోవడం ఎలానో చెప్పు. ఈ తెలుగు లో స్కోపు తక్కువ,' అని చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు. వారన్నది పచ్చి నిజం. పిడకలు అమ్ముకునే వారు, భూ దండాలతో తెగ బలిసిన వారు పేపర్లు/ఛానెల్స్ పెట్టాక...పాపం నా తెలుగు జర్నలిస్టు సోదరుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అదే గనక వీరు ఏదైనా ఇంగ్లిషు పేపర్లో చేరి వుంటే...మా రమణ అన్నయ్య లాగా అతని లాంటి ఇతరుల లాగా మరిన్ని అవకాశాలకు దగ్గర అయ్యేవారు.
ఈ పరిస్థితులలో...'తెలుగు కై నడక' అని ఒకటి పెట్టారు. శీర్షికలలో ఈ 'కై' అని పెడితే..."'కై...కుయ్' మని ఎవరంటారో తెలుసా? హాయిగా 'కోసం' అని ఏడవచ్చు కదా..!" అని గురువు గారు అన్నట్లు గుర్తు. సరే...HM-TV తో మీడియా భాగస్వామ్యం కోసమని ఉత్సాహవంతుడైన యువకుడు సతీషు, తెలుగు పట్ల మంచి మమకారం ఉన్న సుజాత గారు స్పందిస్తే...ఉడతా భక్తిగా తెరవెనుక కొంత కసరత్తు చేశాను.
"ఇకపై చచ్చినట్లు తెలుగులోనే మాట్లాడతాను, తెలుగే రాస్తాను," అని ప్రతిజ్ఞ పూనిస్తారేమో అని భయపడి 'తెలుగు కై నడక' ఎగ్గొడదామని ప్రయత్నం చేశాను. కానీ...ఇలాంటి విపత్తు వస్తే...తప్పించుకోవచ్చు...పైగా 'వేణువు' వేణు, అమెరికా శరత్, పూణే ఫణి బాబు గార్లకు వస్తా అని చెప్పా... కాబట్టి వెళ్లాను. HM-TV మానేజింగ్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు నిర్వాహకులు చెప్పిన ప్రకారం కచ్చితంగా ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి...వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక గంటకు ఆరంభమైన కార్యక్రమంలో ఆ ఛానల్ న్యూస్ ఎడిటర్, ఈ-తెలుగు ప్రచారం కోసం సతీష్ కు బాగా సహకరించిన చక్రపాణి గారు ఉన్నారు. నాకు ఆయనతో కాలక్షేపం అయ్యింది. ఇక బాబాయ్ ఫణి గారి బోసి నవ్వుల జోకులు సరేసరి. పెద్దగా ఇబ్బందికరం కాని ప్రతిజ్ఞ రాసి, చదివిన తాడేపల్లి గారిని కలుసుకున్నాను.
"భుక్తి కోసం ఆంగ్లం.." అన్న బ్యానర్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను నమ్మేది కూడా ఇదే. చదువుల సంగతి, ఉద్యోగాల సంగతి ఎలా వున్నా...మన పిల్లలు మన భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తే...ఎంతో భాషా సేవ చేసిన వాళ్ళం అవుతాం.
"భుక్తి కోసం ఆంగ్లం.." అన్న బ్యానర్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను నమ్మేది కూడా ఇదే. చదువుల సంగతి, ఉద్యోగాల సంగతి ఎలా వున్నా...మన పిల్లలు మన భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తే...ఎంతో భాషా సేవ చేసిన వాళ్ళం అవుతాం.
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం... అందరు బ్లాగర్లను కలుపుకు పోయి సమన్వయంతో ఈ-తెలుగు మరింత కృషి చేస్తుందని, తెలుగును బతికిస్తుందని ఆశిద్దాం.
గుడ్ లక్ ఈ-తెలుగు.
జై తెలుగు భాష.
జై తెలుగు తల్లి.