నాకు ఇప్పుడున్న ఇద్దరు పిల్లలు కాక... ఒక ఐదారుగురు పిల్లలు, అందునా మొగ వెధవలు, ఉంటే బాగుంటుందని అనిపిస్తున్నదీ మధ్యన. ఇప్పుడు ఉన్న ఇద్దరినీ టేబుల్ టెన్నిస్ లో కాకుండా క్రికెట్లో పెట్టి ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తున్నది. ఇదంతా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐ పీ ఎల్) మహత్యం. ఈ ఆటకు జనంలో ఉన్న క్రేజ్, మోజు, మీడియా ఇస్తున్న కవరేజి, ఆటగాళ్లకు వస్తున్న డబ్బులు చూస్తుంటే నాలాగానే చాలా మంది తల్లి దండ్రులకు అనిపిస్తూ ఉండవచ్చు. ఇందుకు సాక్ష్యం ఎల్ బీ స్టేడియం.
మా 12 ఏళ్ళ పిల్లవాడిని దాదాపుగా స్టేడియం కు తీసుకు పోతాను ఫిట్ నెస్ కోసం. అక్కడ ఒక ఐదారు రౌండ్లు పరిగెత్తి, ఏవో ఎక్సర్ సైజులు చేసుకుని ఇంటికి వచ్చి మా అకాడమీ లో ఆడుకుంటాడు. ఆ పనిలో భాగంగా స్టేడియం కు వెళితే ఇసుక వేస్తే రాలనంత మంది తెల్ల డ్రస్సు పిల్లలు కనిపిస్తున్నారీ మధ్యన. వీళ్ళంతా ఎండా కాలం శిక్షణా శిబిరం లో భాగంగా చేరి శిక్షణ పొందుతున్న వారు. అందులో చాలా మంది బాగా ఆడుతున్నారు. వాళ్ళను చూసి నేనూ టెంప్ట్ అవుతుంటాను.
ఇంతలోనే శ్రీశాంత్ బ్యాచ్ చేసిన నిర్వాకం చూసి... ఎందుకొచ్చిన గొడవరా నాయనా... క్రేజ్, కవరేజ్ లేకపోయినా బుద్ధిగా ఉంటాడు... ఈ టేబుల్ టెన్నిసే నయం అని డిసైడ్ అయ్యాను. సెలవల్లో పిచ్చి పట్టిన వాడిలాగా క్రికెట్ మ్యాచులు చూస్తున్న నన్ను ఒక రెండు విషయాలు తొలుస్తున్నాయి.
ఒకటి) చీర్ గర్ల్స్ ను చూస్తే బాధ వేస్తున్నది, తిక్క లేస్తోంది. తెల్లతోలు అమ్మాయిలకు కురచ దుస్తులు వేసి... జపాంగ్..జపాంగ్... గిలిగిలిగా అనే బోడి ట్యూన్ కు అనుగుణంగా ఎగిరిస్తుంటే...ఊళ్ళల్లో రికార్డింగ్ డాన్స్ లు గుర్తుకువస్తున్నాయి. పిల్లలతో కలిసి క్రికెట్ చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, కన్ను కొట్టడం, దాన్ని సోనీ ఛానెల్ వాడు క్లోజ్ అప్ లో కింది నుంచి పై నుంచి చూపించడం, లైవ్ షో లలో తిక్క కామెంట్లు.... కంపరం ఎత్తిస్తున్నాయి.
అందులో ఒకమ్మాయి వయ్యారం, ఒంపు సొంపులు పదే పదే చూసి చూసి నాలుగు పదులు దాటిన మా కుటుంబ రావు అబ్రకదబ్ర కే రోజూ తిక్కతిక్కగా ఉండి శారీరక మనో వికారాలు కలుగుతుంటే కాలేజి కుర్రకారు పరిస్థితి ఏమిటా అనిపిస్తున్నది. మీకు ఎలా ఉందో కానీ... వాళ్ళను చూస్తే నాకూ వినోదంలో భాగం అనిపించడం లేదు సార్. ఈ మాసం ముద్దలు ఫ్రీగా దొరికాయి కాబట్ట్టి... అన్ని పేపర్లు, ఛానెల్స్ వారి ఫోటోల మీద ప్రధానంగా దృష్టి పెట్టి పండగ చేసుకుంటున్నాయి. అమ్మాయిల పట్ల అదోలాంటి అభిప్రాయం కలిగించే ప్రసార మాధ్యమాలు ఉన్న మన దేశం లో, ఆడ పిల్లల మీద ఎలాంటి క్రైమ్ అయినా చేయవచ్చని అనుకుని చెలరేగే తిక్క వెధవలు ఉన్న మన దేశంలో ఈ జపాంగ్.... సంస్కృతి బాగో లేదని నా అభిప్రాయం.
అదేమి విడ్డూరమో కానీ ఈ "ఛీ"ర్ గర్ల్స్ కల్చర్కు వ్యతిరేకంగా ఒక్క సంధ్య అక్కైనా ధర్నా చేయలేదు. ఒక్కడైనా పిటిషన్ వేయలేదు. వచ్చే సీజన్ లో నేను ఊరుకోను. కచ్చితంగా కోర్టుకెక్కుతా.
రెండు) ఈ ఆటలో కోట్లల్లో కచ్చితంగా బెట్టింగ్ ఉంటుందని తెలుసు. కానీ డ్రగ్స్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బంతిని ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు ఆటగాళ్లను చూస్తే నాకైతే భయంకరమైన అనుమానంగా ఉంది. ఇక్కడ డోప్ టెస్టు ఉందో లేదో తెలియదు కానీ దొరికే దాకా అంతా దొరలే.
మొత్తం మీద ఇక్కడ మందు (లిక్కర్ కంపనీ లు) ఉంది, మగువా (చీర్ గర్ల్స్ అండ్ గ్లామర్ గర్ల్స్) ఉంది, సిల్మా (నటులు నటీ మణులు) ఉంది, క్రైమూ (బెట్టింగ్, అండర్ వరల్డ్) ఉంది. మన సొగసైన సగటు భారతీయుడికి ఇంకేమి కావాలి? జై ఐ పీ ఎల్.