Saturday, October 22, 2022
మునుగోడులో 5 W, 1 H లెక్కే వేరు షా...మీ!
మిత్రులారా... నమస్తే,
నేను ఈ నెల 8 వ తేదీ నుంచి 'ఆరామ్ సే' పేరులో వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, క్రీడాంశాలపై క్విక్ ఎడిట్స్ శీర్షికన కామెంటరీ రాస్తున్నాను. ఒక నిమిషంలో చదివేలా సంక్షిప్తంగా, సూటిగా, నిష్పాక్షికంగా ఉండడం దాని ప్రత్యేకత.
సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయోగం ఇది. ఇకపై వాటిని మీతో ఈ బ్లాగ్ లో కూడా పంచుకుంటాను.
రాము
Saturday, October 1, 2022
ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: 'వీక్షణం' ఎడిటర్ ఎన్.వేణుగోపాల్
కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్నినింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ మీడియాగా ప్రఖ్యాతి పొందిన 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు.
మార్క్సిస్టు భావజాల వ్యాప్తి ధ్యేయంగా పెట్టుకున్న 'దారిదీపం' మాసపత్రికను శనివారం (అక్టోబర్ 1, 2022) సాయంత్రం జూమ్ సమావేశంలో వేణుగోపాల్ ఆవిష్కరించి ప్రసంగించారు. 'పత్రికలు-సామాజిక చైతన్యం' అనే అంశంపై అయన మాట్లాడుతూ ఈ శీర్షికలో ఉన్న రెండు పదాలూ (పత్రికలూ, సామాజిక చైతన్యం) దుష్ట సమాసంగా, విరోధ భాసలా ఇప్పుడున్నాయని అయనఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే అని స్పష్టం చేశారు.
1984లో తను జర్నలిజం లోకి అడుగుపెట్టినప్పుడు 'ఆబ్జెక్టివ్ న్యూట్రాలిటీ' ముఖ్యమని జర్నలిజం మొదటి క్లాసులో హితవుగా చెప్పేవారని, ఇప్పుడు అది ఆవిరైపోయింది వేణుగోపాల్ చెప్పారు. వార్త లో ఉండాల్సిన 5 డబ్ల్యూ, 1 హెచ్ సూత్రంలో ముఖ్యమైన 'ఎందుకు' అన్న ప్రశ్నకు తావులేకుండా పత్రికలు వార్తలు నింపుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 1955 ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన తెలుగు పత్రికల వైఖరి చూసి 'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు-పత్రికలు' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని అయన గుర్తుచేశారు. 1960 నుంచి 80 వరకూ సామాజిక చైతన్యం కొద్దోగొప్పో ఉన్నా, 1990 నుంచి మూడు దశాబ్దాలుగా తిరోగమన పథంలో పత్రికలు పయనిస్తున్నాయని చెప్పారు.
ప్రపంచీకరణ తర్వాత తిరోగమనంలో పత్రికల ప్రయాణం సాగుతున్నదని, ప్రగతిశీలభావాలు ఉండడం చాదస్తం గా పరిగణింపబడుతున్నదని చెప్పారు. 'న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, నాట్ ఏ సోషల్ సర్వీస్' అని వక్కాణించిన తాను పనిచేసిన పత్రిక యజమాని మాటలు ఉటంకిస్తూ-రెండు రాష్ట్రాల్లో తెలుగు పత్రికల ధోరణులను ప్రస్తావించారు. "ఏదైనా ఒక పత్రిక చదివితే వాస్తవం తెలియదు. ప్రతి ఒక్కరు రెండో మూడో పత్రికలు చదివి బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల కొందరు పత్రికలు చదవడం మానేశారు," అని వేణుగోపాల్ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ ఒక 'మాదక ద్రవ్యం' అనీ, తర్వాత విజృంభించిన సాంకేతిక పరిజ్ఞానం మేలు-కీడుల కలయిక అన్నారు. "టెక్నాలజీ వచ్చి రచనను ప్రజాస్వామీకరించి మేలు చేసింది. కానీ అనియంత్రింత వ్యక్తీకరణ వల్ల కీడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వెబ్ లో అబద్ధాలపై బాగా వెచ్చిస్తూ పెద్ద పెద్ద కార్యాలయాలను నెలకొల్పడంతో మహా సముద్రంలో గుక్కెడు మంచినీళ్లు దొరకని నావికుడికిలా పాఠకుడయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నిరంతర వార్తా స్రవంతిలో మొత్తం మురికినీరేనన్నారు.
రెండు దశాబ్దాలుగా తాము ఎన్నో ఒడిదొడుకుల మధ్య నిర్వహిస్తున్న 'వీక్షణం' పత్రికకు ఉన్న మూడు లక్ష్యాలను (1. ప్రధాన వార్తా స్రవంతి లో వస్తున్న వార్తల వెనుక ప్రజా కోణాలు ప్రస్తావించడం 2. ప్రచార సాధనాల మౌనం వహిస్తున్న, విస్మరిస్తున్న ప్రజాకోణాలు చర్చించడం 3) సామాజిక ఘటనలను అర్థం చేసుకోనేలా ప్రజలకు దృక్పథం ఇవ్వడం) వివరించారు. “A good newspaper is a nation talking to itself” అన్న Arthur Miller ను కోట్ చేస్తూ- తప్పుడు చైతన్యాన్ని ప్రతిఘటించడం ఎలా? అన్నది సత్యానంతర యుగంలో పెద్ద సవాలన్నారు.
యాజమాన్యపు కేంద్రీకరణ దుష్ప్రభావాన్ని వివరిస్తూ--90 శాతం మీడియా కేవలంనలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతిలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. విష విద్వేష భావజాలాన్ని పెంచుతున్న, పంచుతున్న సంఘ్ పరివార్ కమ్మేస్తున్న కారుచీకటిలో 'దారిదీపం' వెలుగు దివ్వె కావాలన్న అభిలాషను వెలిబుచ్చారు.
Karl Marx ఫ్రీ ప్రెస్ గురించి చెప్పిన ఈ కింది ఒక మంచి మాటతో వేణుగోపాల్ ప్రసంగం ముగిసింది.
‘‘The free Press is the ubiquitous vigilant eye of a people’s soul, the embodiment of a people’s faith in itself, the eloquent link that connects the individual with the State and the world, the embodied culture that transforms material struggles into intellectual struggles and idealises their crude material form. It is a people’s frank confession to itself… It is the spiritual mirror in which a people can see itself… It is the spirit of the State, which can be delivered into every cottage, cheaper than coal gas. It is all-sided, ubiquitous, omniscient.”
విశాలాంధ్ర ఎడిటర్, ఆర్వీ రామారావు మాట్లాడుతూ సమాచారానికి, వ్యాఖ్యకు మధ్య రేఖ చెరిగిపోయింది చెప్పారు. గతంలో 'జాతీయ స్ఫూర్తి' అనే పత్రికను విజయవంతంగా నడిపి, ఇప్పుడు 'దారిదీపం' సంపాదకుడిగా ఉన్న డీవీవీఎస్ వర్మ ప్రసంగించారు.
లక్ష్మణ మూర్తి సార్ కు అశ్రు-అక్షర నివాళి
అది 1989 వ సంవత్సరం.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ మూడో లైన్.
వీధి ఆరంభంలో మేము అద్దెకు ఉండేవాళ్ళం.
వీధి చివర్లో ఉన్న ఇంట్లో లక్ష్మణ మూర్తి గారు ఉండేవారు.
వారు ప్రభుత్వ లెక్చరర్. ఇంగ్లీష్ బాగా చెప్పేవారు.
ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా మాట్లాడేవారు.
ప్రతి పదం స్పష్టంగా, విషయం విశదీకరించి మాట్లాడడం వారి ప్రత్యేకత.
ఎవరినైనా ఇంటి పేరుతో సహా నోరారా పిలిచేవారు.
లక్ష్మణ మూర్తి గారి కుటుంబం ప్రత్యేకమైనది.
సార్ బాల్యం కష్టాలతో కూడినందనుకుంటా.
ఆ కష్టం ఎవ్వరికి వచ్చినా అండగా నిలబడేవారు.
వారిని నేను ఎప్పుడూ సార్ అనే అనేవాడ్ని.
మా అన్నయ్య, తమ్ముడు మామయ్య గారు అనేవారు.
దానికి ఒక కారణం ఉంది. చివర్లో చెబుతాను.
సార్ సతీమణి భారతి అత్తయ్య గారు గొప్ప మనసున్న మనిషి.
వీధిలో ఉండే దాదాపు డజను మంది పిల్లలను సొంత పిల్లల్లా చూసుకునేవారు.
వారి వంటిల్లు ఎవరి కోసమైనా తెరిచి ఉండేది.
గట్టు గోపాలకృష్ణ గారనే కమ్యూనిస్టు యోధుడి కూతురు.
నిజంగా మహా తల్లి. చేతులెత్తి దండం పెట్టవచ్చు.
నవ్వుతూ గలగలా మాట్లాడడం ఆమెఅలవాటు.
అమాయకత్వం, భోళాతనం కలబోత.
సార్, అత్తయ్య గారు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉండేది.
ఎంత పరాచికంగా, హాస్యంగా మాట్లాడేవారో!
చిలకాగోరింకల్లా ఉండేవారు.
సార్ కాస్త తగ్గినట్లు నటించి మాట్లాడేవారు.
ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు.
అందరికీ వారు ఆప్యాయత, ప్రేమలు మాత్రమే పంచారు.
వారి ఇల్లు మా అందిరికీ ఒక పెద్ద అడ్డా, ఒక కోలాహలం.
అక్కడ ట్యూషన్ చదువుకోడానికి చాలామంది వచ్చేవారు.
తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫణి కుమార్ ను ఇంట్లో ఉంచుకున్నారు.
కన్న కొడుకులా చూసుకున్నారు, కల్మషం లేకుండా.
గోపాల కృష్ణ గారి మనమడూ అక్కడే చదువుకున్నాడు.
ఎవరెవరికో ఆశ్రయం ఇచ్చేవారా దంపతులు.
పిల్లలూ వారితో తోబుట్టువుల్లా ఉండేవారు.
ఎవరైనా వచ్చి మేము ఇక్కడ ఉంటామంటే వారిద్దరూవద్దనలేరు.
ఈ రోజుల్లో ఇది కనీసం ఊహించగలమా?
సార్ ప్రేమ పంచిన శిష్యులుపెద్ద సంఖ్యలో ఉన్నారు.
వారి పెద్దబ్బాయి మూర్తి. సింగరేణిలో అధికారి.
మేధావి లక్షణాలు బాగా ఉండేవి.
రెండో అమ్మాయి ఝాన్సీ. ప్రభుత్వ టీచర్.
అక్క ఒక ప్రేమ మూర్తి. నవ్వుమొహం.
మూడో అబ్బాయి శీనన్న. ప్రయివేట్ ఉద్యోగం.
అన్న సంఘ జీవి, మాకు చాలా ఆప్తుడు.
మా అన్నయ్యకు క్లాస్ మెట్, ధారాళంగా మాట్లాడతాడు.
నాలుగో అమ్మాయి సుధారాణి. అడ్వొకేట్.
తల్లిగారిలా గలగలా మాట్లాడే మనిషి.
ఐదో అబ్భాయి రాజు, ఐటీ ఫీల్డు.
ఆటపాటలతో హాయిగా గడిపేవాడు.
అందరికీ సార్ స్వాతంత్య్రం ఇచ్చారు.
వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఎదగనిచ్చారు.
మా అమ్మా, నాన్నలకు ఎంతో ఇష్టమైన కుటుంబం వారిది.
అమ్మ-అత్తయ్య గారు, అమ్మ-శీనన్న మాట్లాడుకుంటుంటే చూడాలి.
ఈ అద్భుతమైన కుటుంబం మాకు ఒక తీపి జ్ఞాపకం.
మాకే కాదు వారిని కలిసిన ఎవ్వరికైనా ఇదే అనిపిస్తుంది.
ఒక మింగలేని చేదు నిజం-సార్ ఇప్పుడు భౌతికంగా వెళ్లిపోవడం.
విధివశాత్తూ ఆ పెద్దదిక్కు పోయారు, సెప్టెంబర్ 19 న.
అత్తయ్య గారు ఎంత డీలా పడ్డారో కదా!
ఈ పదిరోజుల్లో సార్ గుర్తుకురాని రోజు లేదు.
అమృతప్రాయమైన పెద్దాయనను పాడు షుగర్ ఇబ్బంది పెట్టింది.
మళ్ళిన వయస్సును మరింత కుంగదీసి దెబ్బతీసింది.
అనివార్యమైన కారణాల వల్ల నేను అంతిమ దర్శనం చేసుకోలేకపోయా.
29 నాడు శ్రద్ధాంజలి ఘటించి వద్దామంటే ఒక ఆటంకం వచ్చింది.
నాకు జీవితంలో వెలితి మిగిల్చే అంశాల్లోఇది ఒకటి.
వారు నాకు సార్, డిగ్రీలో ఏడాదికి దాదాపు నెల చొప్పున ఇంగ్లిష్ చెప్పారు.
భయం కలిగించే భాషను అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు.
ఉదయం 5 గంటలకే లేచి టీ తాగుతూ ప్రేమగా చెప్పారు.
ఇంగ్లిష్ పట్ల భయం లేకుండా చేసింది సారే.
ఒక మంచిస్నేహితుడిలాగా ఆత్మస్థైర్యం ఇచ్చేవారు.
'యూ కెన్,' అంటూ ప్రోత్సహించేవారు.
ఇదంతా ఫ్రీగానే, ప్రేమతోనే.
అదీ లక్ష్మణ మూర్తి సార్ ప్రత్యేకత.
ఆఖరుగా ఒక మూడు నెల్ల కిందట ఖమ్మంలో కలిసాను.
అదొక ఫంక్షన్, హడావుడిగా ఉంది.
సార్ లో ఓపిక ఏ మాత్రం తగ్గలేదు.
హాస్య సంభాషణ, మాట చతురత అంతే ఉన్నాయి.
సార్, అత్తయ్య గారు ఇద్దరూ ఎంతో ప్రేమగా మాట్లాడారు.
వారిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి నేను భోజనం తెచ్చాను.
దగ్గరుండి వారికి అడిగి వడ్డించాను.
వారు ఆనందించారు, చాలా మందికి ఇది చెప్పారు.
వారిద్దరినీ కలిసుండగా అదే చూడడం.
సదా నవ్వుతూ మాట్లాడే సార్ ను వారింట్లో ఒక విషాదం కుంగతీసింది.
అయినా, ఝాన్సీ అక్కకు వెన్నంటి ఉండి అండనిచ్చారు.
అక్క కొడుకు మహంత్ గురించి బాగా తపనపడేవారు.
సార్ నాకొక విషయం చెప్పి కంట తడిపెట్టారు. నా గుండె తరుక్కుపోయింది.
వారిని నేను ఏమని ఓదార్చను? అన్నీ సర్దుకుంటాయని చెప్పాను.
పని అయిపోయిందని అంటే... అట్లా అనకండని వారించాను.
మధ్యలో సార్ ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నదని శీనన్న చెప్పాడు.
సార్ అందరినీ విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఎనభై ఏళ్ల పెద్ద మనిషి...
ఒక అద్భుతమైన టీచర్...
ఒకగొప్ప మనిషి...
ఒక అద్భుతమైన కష్టజీవి...
ఒక సంఘ ప్రేమికుడు...
ఒక ప్రేమ మూర్తి...
లక్ష్మణ మూర్తి సార్ ఇక లేరు-ఇది జీర్ణించుకోలేని సత్యం.
సార్ కు నేను ఎప్పుడూ రుణ పడి ఉంటాను.
ఒకటి, ఇంగ్లిష్ చెప్పినందుకు.
వారి కారణంగా ఇంగ్లిష్ వచ్చింది, నాకు వృత్తిలో లాభించింది.
రెండు, కాలనీలో సిఫార్సు చేసి ఇల్లు ఇప్పించినందుకు.
వారి కారణంగా ఇల్లు దొరికింది, అందులోనే నా జీవిత భాగస్వామి లభించింది.
నోరారా పిలిచే సార్ లేకపోవడం పెద్ద వెలితి.
కాలపురుషుడి కాఠిన్యం ఎవరికైనా తప్పదు కదా!
నా బాధ అత్తయ్య గారి గురించి. అయ్యో... పాపం.
లక్ష్మణ మూర్తి సార్ కు వినయపూర్వక అశ్రు-అక్షర నివాళి. ఓం శాంతి.
Dear Sir, Love you అండ్ Miss you.
May God give strength to Attayya garu and the family to cope with the tragedy.