జాతి యావత్తూ ఒక్కతాటి మీదకు వచ్చి ఆనంద పడడమో, ఏడవడమో చేసే సంఘటనలు అరుదుగా వుంటాయి. ఎందుకంటె, ఇక్కడ ఎవడి అంతస్తు వాడిది, ఎవడి మతం గొడవ వాడిది, ఎవడి కులం గొడవ వాడిది, ఎవడి బతుకు పోరు వాడిది. దీనికి భిన్నంగా భారతీయులలో క్రీడాప్రేమికులంతా గుండెలనిండా ఆనంద పడే సంఘటన నిన్న రాత్రి జరిగింది. అదే... మొహాలీలో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో దాయాది పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడం. జనం ఇంతలా ఆనందపడడం, దాన్ని రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో జరగలేదు. నేను, క్రికెట్ పిచ్చి బాగానే పట్టిన నా పదేళ్ళ కొడుకు ఫిదేల్ మ్యాచును ఆద్యంతం ఆస్వాదించాం...వేరు వేరు ప్రదేశాలలో కూర్చుని.
చిన్నప్పుడు...మా నాన్నతో కలిసి రేడియోలో క్రికెట్ కామెంటరీ వినడం, మ్యాచులు టీవీ లలో చూడడం భలే మజాగా అనిపించేవి. బాధలు, ఇబ్బందులు, చదువులు, ఉద్యోగ బాధ్యతలు అన్నీ మరిచిపోయి మైమరచి క్రికెట్ లో లీనమై బైటకురావడం ఒక వింత అనుభూతి. ఆ మాటకొస్తే...ఆటలు, సంగీతం, నృత్యం వంటి కళలన్నీ మనలను వేరే లోకంలోకి తీసుకెళ్ళి సాంత్వన చేకూర్చేవే కదా! అందుకే...బుధవారం పొద్దున్న లేవగానే...ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూడాలని ప్లాన్ చేసుకున్నాను.
టేబుల్ టెన్నిస్ ఆటగాడైన ఫిదేల్ కు దొరికిన ఒక స్పాన్సరర్ కోరిన మీదట తన ప్రొఫైల్ తయారీ కోసం, ఇతరత్రా చిన్న పనులు చక్కబెట్టుకునేందుకు ఆఫీసుకు వెళ్లాను. తొందరగా అన్నీ పనులు తెముల్చుకుని లంచ్ టైం కు ఇంటికి రావాలన్నది ప్లాన్. కానీ అక్కడ పనుల్లో బిజీ అయి రెండైనా ఇంటికి చేరలేకపోయాను. లాభం లేదనుకుని...ఆఫీసులోనే తిని...హెచ్.ఎం.-టీ.వీ.ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు వరదాచారి గారితో కలిసి పెద్ద తెర మీద క్రికెట్ చూసాను. మూర్తి గారు ప్రతి బంతినీ ఆస్వాదించారు. ఆట మీద మంచి విశ్లేషణ చేసారు. తానూ హైదరాబాద్ న్యూ సైన్సు కాలేజీలో, నల్లకుంట గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన రోజులను మూర్తి గారు గుర్తుకు తెచ్చుకున్నారు.
సెహ్వాగ్ ఊపును ఇతరులు కొనసాగించకపోవడం మా అందరికీ చికాకు కలిగించింది. యువరాజ్ అలా డకౌట్ కావడం ఆశ్చర్యం కలిగించిది. మ్యాచ్ ఫిక్స్ అయిందన్న అనుమానం బలపడేలా మన వాళ్ళు ఆడారు. 'సార్...నాకొక ట్రాక్ రికార్డ్ వుంది. నేను కీన్ గా చూసిన ఏ మ్యాచూ ఇండియా గెలవదు,' అని నేను చెప్పినప్పుడు...'ఇవ్వాల్టికి మరి ఏదైనా పని వుంటే పోయి చూసుకోరాదూ...' అని మూర్తి గారు అన్నారు. భారత్ గెలవాలన్న సంకల్పం అందరిదీ. సచిన్ కు ఇన్ని లైఫ్ లు రావడం నా జన్మలో ఎప్పుడూ నేను చూడలేదు. ఒక లైఫ్ వచ్చాక తను జాగ్రత్తగా ఆడతాడు. నిన్న ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఇండియా అదృష్టం బాగుంది..తను సెంచరీ చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే అనిపించింది...హమ్మయ్య మనం గెలుస్తాం...అని.
మ్యాచుకు ముందే...నా సన్నిహిత మిత్రుడు షణ్ముఖేశ్వర రావు గారు ఫోన్ చేసి..తన ఎనిమిదేళ్ళ పిల్లవాడు విష్ణుతో పాటు ఫిదేల్ ను, రోహన్ ను జల విహార్ లో పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ చూపే చోటికి తీసుకెళ్తున్నానని చెప్పారు. వీళ్ళు ముగ్గురూ టీ.టీ.ప్లేయర్స్, ఫ్రెండ్స్. అంత ఎండలో...అయన ఇంటికి వచ్చి పిల్లలను తీసుకుని జలవిహార్ కు వెళ్ళారు. అంటే...నేను, వాడూ ఒక చోట కూర్చొని చూడలేకపోయాం. బుధవారం నాడు 'రామ్ బాణం' కాలం ప్రూఫు చూసుకోవడానికి...భారత్ బ్యాటింగ్ ముగియగానే...ది సండే ఇండియన్ ఆఫీసుకు బయలుదేరాను. మధ్యలో నల్గొండ నుంచి మరొక టీ.టీ.క్రీడాకారిణి తండ్రి శంకర్ ఫోన్ చేసి...'ఏంది సార్... ఇట్లయ్యింది' అని ఆవేదన చెందాడు. 'సచినే బంతిని కొట్టడానికి అంత ఇబ్బంది పడ్డాడంటే...వికెట్ లో ఏదో తేడా వుంది. డోంట్ వర్రీ,' అని మూర్తి గారి ప్రెడిక్షన్ ను శంకర్ కు చెప్పాను. తీరా పొతే...ది సండే ఇండియన్ ఆఫీసులో టీ.వీ.లేదు. ఒక కంప్యూటర్ లో వాయిస్ లేకుండా వాళ్ళు టీ.వీ.చూస్తున్నారు. నాకు పరమ చికాకు కలిగినా తప్పలేదు.
సాహిత్యం గురించి, తన మనసుదోచిన మహిళల గురించి తన్మయత్వంతో చెప్పే/ రాసే మిత్రుడు నరేష్ గారు కూడా క్రికెట్ పట్ల చాలా ఆసక్తి కనబరచడం నన్ను అబ్బురపరిచింది. అక్కడ పనిచేసే రవి అనే టైపిస్టు గారు...బ్రహ్మం గారి లాగా...కచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుంది అని ముందే చెప్పారు. ఇండియా గెలవడం ఖాయం....అని నేను పది బీరు బాటిల్స్ బెట్ పెట్టాను..నరేష్ గారితో. పది గంటలకు 'ఈనాడు' వెనక ఉన్న క్షేత్ర అనే హోటల్ కు వెళ్ళాం. అక్కడ ఒక్క కష్టమరైనా లేదు. హోటల్ సిబ్బంది అంటా ఒక గదిలో కూర్చొని టీ.వీ.చూస్తున్నారు. భారత్ క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు నేను కూడా కాసేపు అక్కడ కుక్స్, వెయిటర్స్, మానేజర్స్ తో కలిసి ఆట చూసి ఆనందించాను. అఫ్రిది అవుట్ కావడంతో మన విజయం ఖాయమని నాకు ఖాయమైంది. అందుకే అక్కడ ఖుబానీ కా మీఠా కూడా ఆర్డర్ ఇచ్చాను.
మళ్ళీ..ది సండే ఇండియన్ ఆఫీసుకు వచ్చి....తెచ్చుకున్నవి తింటూ...భారత్ విజయాన్ని ప్రత్యక్షంగా చూసాం. మధ్యలో ఇంటికి ఫోన్ చేసి..మీరూ చూడండి..అని ఆటల పట్ల పెద్దగా ఆసక్తి లేని నా భార్యామణి కి చెప్పాను. మిస్బా చెలరేగి పోయి ఆడుతుంటే...కొద్దిగా భయమేసినా...భారత్ గెలుపు ఖాయం కావడంలో ఖుబానీ కా మీఠా మరింత ఆస్వాదించాం. అక్కడ జల విహార్లో ఉన్న ఫిదేల్ కు ఫోన్ చేసి...'ఇండియా జిందాబాద్' అని ఇద్దరం ఫోన్ లో నినాదాలు చేసాం. ఇలా బారత్ ఇన్నింగ్స్ ఒక ఎడిటర్ గారితో, పాక్ ఇన్నింగ్స్ ఇంకొక ఎడిటర్ గారితో కలిసి చూసి...రోడ్ల మీద జనం విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే...చూసి ఆనందించి....అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించా. ఓడినా అద్భుతంగా ఆడిన పాకిస్తాన్ కూడా నాకు నచ్చింది. కొట్టుకుచచ్చే రెండు దేశాల ప్రధానులను ఒక దగ్గరికి తెచ్చిన ఆట గొప్పతనం నాకు నచ్చింది. జీవితంలో దొరికే పసందైన రోజులలో కచ్చితంగా ఇదీ ఒకటే.
చివరకు మరో మాట. ఆ పది బీర్లు లాగించడం...మన మనవల్ల అయ్యే పని కాదు. వాటా కావలసిన వారు....నన్ను కలవవచ్చు. సేం ప్లేస్ (సార్వి హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా)...ఎనీ టైం ఇన్ ది ఈవినింగ్. అంతవరకూ చీర్స్.