Sunday, January 14, 2018

మా ఊరు పిలుస్తోంది....

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 


ఈ ఫోటోలో ఉన్నది (ఎడమ నుంచి కుడికి) మా నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, మామయ్య (వదిన తండ్రి). వీళ్లంతా... మా ఊరు గొల్లపూడి లో మా ఇంట్లో  భోగి మంట దగ్గర కూర్చుని ఈ ఉదయం దిగిన ఫోటో ఇది. మా నాన్న, మామయ్యా పదవీవిరమణ తర్వాత ఈ ఊళ్ళో ఉంటున్నారు. పెద్దమ్మాయిని అమెరికాకు, రెండో అమ్మాయిని చైనా కు మూడో అమ్మాయిని హైదరాబాద్ కు చదువుల నిమిత్తం పంపిన అన్నయ్య, వదిన కూడా (ఖమ్మంలో ఇల్లు ఉన్నా) ఊళ్ళో ఉంటున్నారు. ఇంతకన్నా అదృష్టం ఏమి ఉంటుంది, చెప్పండి.

సరిగ్గా ఈ భోగి మంట పక్కన ఉన్న ఈ ఇంట్లోనే మా జీవిత ప్రస్థానం మొదలయ్యింది. పదవీ విరమణ కన్నా ముందే...అంటే మరో ఐదేళ్లలోపు.... ఈ ఊరికే చేరుకొని ఆ పక్క గ్రామాల్లో ఉన్న ఐదారు స్కూళ్ళలో... చిన్నప్పుడు మాకు టీచర్లు నేర్పలేకపోయినవి కొన్ని ఉచితంగా నేర్పాలని గట్టిగా ఉంది. ఈ దిక్కుమాలిన దౌర్భాగ్య నగరంలో,  కాలుష్యాన్ని పీలుస్తూ-తాగుతూ-తింటూ... రోగాల బారిన పడుతూ... భయంకరమైన ట్రాఫిక్ లో ఎప్పుడు యాక్సిడెంట్ అయి చస్తామో తెలియక.... నక్కలు, తోడేళ్ళ లాంటి మనుషులతోటి ... డబ్బు పిచ్చి తప్ప మంచీ మానవత్వం లేని మహా నాగరికులు మధ్యన  బిక్కుబిక్కున బతకడం కంటే... హాయిగా ఊరికి పోయి.... ఉన్నదాంతో తృప్తి పడుతూ.... నిజమైన మనుషుల మధ్య... స్వచ్ఛంగా, స్వేచ్ఛగా... చేతనైన వరకూ నలుగురికి  మేలు చేస్తూ నికార్సుగా బతకాలని ఉంది. తథాస్తు!