మార్చి 31 వ తేదీన...తారా చౌదరి అనే మహిళ గురించి HM TV ఒక మారథాన్ కథనాన్ని ప్రసారం చేసింది. మాయలేడి తారా చౌదరి చేతిలో మోస పోయిన ఒక అమాయకపు అమ్మాయి ధైర్యంగా స్టూడియోకి వచ్చి గుట్టు విప్పడంతో పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. ఇంత మంచి మసాలా దినుసులున్న కథనాన్ని అదే వేరే ఛానల్ అయి ఉంటే బూతు జోడించి రక్తి కట్టించి ఉండేది. టూ దీ పాయింట్ రిపోర్టింగ్ చేసి ఒక దారుణమైన వ్యవహారాన్ని బట్టబయలు చేసినందుకు HM TV ని అభినందించాల్సిందే.
అయితే...ఈ హడావుడి, కంగారులో యాంకర్ అన్వయం లేని మాటలు చాలా మాట్టాడి విసిగించడం సంగతి అలా ఉంచితే..."దుర్భాషలాడారు"కు, "దోబూచులాడారు"కు మధ్య తేడా తెలియని ఒక రిపోర్టర్ జనాలను గందరగోళ పరిచారు. HM TV ప్రసారం చేసిన కథనంతో పోలీస్ స్టేషన్ కు రాకతప్పని తారమ్మ సదరు ఛానల్ రిపోర్టర్, కెమెరామ్యాన్ లపై రంకెలేసిందన్నది విషయం. దానికి లైవ్ లో ఆదరాబాదరా మాట్లాడుతూ..."తారా చౌదరి రిపోర్టర్లతో దోబూచులాడింది..." అని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు రిపోర్టర్ అనడం నేను విన్నాను. దుర్భాషలాడారని చెప్పడానికి బదులు రిపోర్టర్ ఆ పదం వాడుతున్నారని కాంటెక్స్ట్ ను బట్టి అర్ధమయింది. తెలిచ్చావక కొన్నిసార్లు, హడావుడిలో కొన్నిసార్లు ఇలాంటి తప్పులు దొర్లుతాయి. ఉచ్ఛారణ సరిగా ఉండకపోయినా మనకు అలా వినిపించిందేమో చూడాలి.
మా తమ్ముడి ఐ.టి. కంపెనీలో ఆ మధ్యన ఎప్పుడో ఒక తెలుగు వాడు చేరాడట. ఢిల్లీలో పుట్టిపెరిగి ఇంట్లో తెలుగు నేర్చుకుని...ఒక ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాడు. తనకు తెలుగులో మాట్లాడాలని ఒకటే తపన. అలాంటి ఆయన ఏదో ఒక విషయం మీద తన సీనియర్ కలీగ్ అయిన అమ్మాయితో డిస్కస్ చేయాల్సి వచ్చింది. మనవాడు ఆమె ఛాంబర్ కు వెళ్లాడు, డిస్కస్ చేశాడు, వచ్చాడు. "హమ్మయ్య...ఆమెను సంపర్కించాక...సందేహం తీరిపోయింది..." అని అంటూ ఉత్సాహంగా వచ్చి తన బాసైన మా తమ్ముడికి చెప్పాడట. నవ్వాలో ఏడ్వాలో తెలియక ఇబ్బంది పడటం మా వాడి వంతయింది.
"బాబూ...నువ్వు ఆ ఛాంబర్ లో ఇంతసేపూ ఏమి చేసావో కాస్త ఇంగ్లిషులో చెప్పి పుణ్యం కట్టుకో..." అని తమ్ముడు అడిగినప్పుడు...."డిస్కషన్...అదే తెలుగులో సంపర్కించడం అంటాం గదా" అన్నాడట అమాయకంగా. హిందీలో సంపర్క్ అనే పదాన్ని తెలుగులో యథాతథంగా ప్రయోగించాడేమో...మనకు తెలియదు.
ఇదిలావుండగా, చాలా ఏళ్ల తర్వాత కలిసిన మా మామయ్య (తెలుగు టీచర్) ఒకాయన...హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన మా బంధువుల ఏడేళ్ల అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాడు: "మీ బడి పేరు చెప్పు...." అని. చాలా చురుకైన, చలాకీ అయిన ఆ అమ్మాయి..."ఏమిటీ..." అని అడిగి...తన పేరు మాత్రం చెప్పి వెళ్లి పోయింది. "బడి" అనే పదానికి అర్ధం తెలియకపోవడం వల్ల ఇది జరిగింది మరి.
"పద్దెనిమిది", "పందొమ్మిది" వంటి మాటలు ఎవరైనా వాడితే...మన వైపు తిరిగి..."అంటే..." అంటూ ఇంగ్లిషులో చెప్పమని బేలగా అడిగే పిల్లలను చూస్తే భయమేస్తుంది. పిల్లలకు తెలుగు నేర్పడానికి ఈ ఎండాకాలానికి మించిన సమయం లేదు గదా!
6 comments:
దేవనాగరిని (లిపి) దేవనగిరి అని - కనీసం సంధర్భోచితంగా కూడా అర్థం చేసుకోలేని ఉచ్ఛారణలు కూడా షరా మామూలే - మీడియాలో. ఇక సంపర్కం ఎంత?
రామూ గారూ.. హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసే నిపుణులు చాలామంది హిందీ క్రియాపదాలకు తెలుగు ప్రత్యయాలు జోడించి అనువాదాలు చేసేయడం చాలా సందర్భాల్లో గమనించాను. చలాయించు, గుసాయించు, బైటాయించు లాంటి పదాలు తెలంగాణ, హైదరాబాద్ పరిసరాల్లో అలవాటుగా ఉన్నప్పటికీ, ఇదే పరిస్థితిని కర్ణాటక, తమిళనాడులో ముఖ్యంగా బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. కన్నడ, తమిళపదాలకు తెలుగు ప్రత్యయాలు జోడించి అదే తెలుగనుకుంటూ మాట్లాడేవారు, రాసేవారు భాషావేత్తల స్థాయిలో ఉన్నారు. చెన్నై, బెంగళూరుల్లో ఉన్న తెలుగుపత్రికల స్థానిక ఎడిషన్లో మోతాదుకు మించి కనిపించిన ఇలాంటి పదాలతో నాకు కళ్ళు తిరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ వ్యాసం చదివాక నాకివన్నీ గుర్తుకొచ్చి మీతో పంచుకోవాలనిపించింది.
thanks sir. you are right.
ramu
అయ్యా మీరు తెలుగు గురించి ఎవరో మాట్లాడారని అంటున్నారు... మన అచ్చ తెలుగు ఛానళ్ల వాళ్లు తెలుగుకు ఎప్పుడో తెగులు పట్టించేశారు. తెలుగులోని వర్తమాన కాలాన్ని (అదే ఆంగ్లంలోని present continuous tense) అనే దాన్ని మనవాళ్లు ఎప్పుడో మర్చిపోయారు. ఇటీవల ఒక నిరంతర వార్తాస్రవంతిలో వచ్చిన ఒక కథనానమే ఒక ఉదాహరణ... "జగన్ అక్రమార్జన కేసులో విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి 90 రోజులకు ఇంకా ఎంతో కాలం లేకపోవడంతో చార్జిషీటు దాఖలు చేసేందుకు సీబీఐ సన్నద్ధమవుతుంది"
ఇక్కడ "సన్నద్ధమవుతోంది"కి "సన్నద్ధమవుతుంది"కి మన రిపోర్టరుకు తేడా తెలీదు. అంతెందుకు మన పక్కనుండే వాళ్లలో ఎంతమంది "చందమామ"ను "చెందమామ" అని, "చాప"ను "చేప" అని పలకకుండా ఉంటారో చూసుకుంటే చాలు... తెలుగుకు ఎంతటి "మహర్దశ" పట్టిందో తెలుస్తుంది.
దాదాపు 27 ఏళ్ల పాటు తెలుగు నేల మీద పెరిగిన ఒక అమ్మాయి... so called తెలుగు మీడియంలో చదివి... ఒక నాలుగేళ్ల క్రితం యూఎస్ వచ్చింది. ఇక్కడే నాతో పాటు పనిచేస్తుంది. సరే ఒకరోజు ఏదో మాటల్లో నీకు అక్షరమాల రాయడం వచ్చా అంటే బెంబేలెత్తి నావంక అదోరకంగా చూసింది. అ ఆలు రాయడం వచ్చా అని అడిగితే కానీ సదరు అమ్మడికి అర్థం కాలేదు. చివరకు ఎలాగోలా ముక్కీ మూలిగి అ ఆ లను రాసింది. ఎలా రాసిందన్నది చూశాక నేను అ ఆలను మర్చిపోయాను.
ఇక ఇందాక నేను చెప్పిన చేప, చెందమామల స్పెషలిస్టు ఆమె. అదే విషయం ఆమెకు చెప్పి... నేను ఆమెకు (ఇక్కడ తెలుగులో రాసే వీలు లేక రాయలేకపోతున్నాను క్షమించండి ఆ అక్షరాలకు ఉనికి కూడా లేకుండా చేయడం నిజంగా మన దౌర్భాగ్యం) చిన్నప్పుడు నేను పెద్దబాలశిక్షలో నేర్చుకున్న చ చ (చావడి చకారం) ఛ లను రాసి చూపిస్తే... "నువ్వు లేనిపోని అక్షరాల్ని కనిపెట్టక" అని ఆమె నిష్టూరాలాడింది. అది మన దౌర్భాగ్యం సర్. కాబట్టి... ఎక్కడో ఢిల్లీలో పెరిగినవాడు తెలుగు తప్పుగా ఉచ్ఛరించడం పెద్ద తప్పేం కాదనిపించింది. నిజంగా నాకు ఒకటే అనిపిస్తుంది.. మన పక్కరాష్ట్రాలవారి చంకనాకితే కానీ మనకు సిగ్గురాదేమో అని. తమిళులు, కన్నడిగుల బాషాభిమానం మనకు ఎంత మాత్రం లేదు. ఎంత సేపటికి సినిమాల్లో తెలంగాణ యాసను వాడారా... లేదా కోస్తా యాసలో మాట్లాడారా అని టీవీల్లో వెధవ చర్చలు తప్పించి... ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారు.
"తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స !!" అన్న మాట ఈ తరానికి పనికిరాదేమో.... సర్ !!!
నా బెంగాలీ మిత్రుడు "I met with her" అని అన్నాడు, కాని "met" అనే మాట "mate" లా అనిపించడంతో, ఒక్క సారి ఆలోచించవలసి వచ్చింది, ఇతను ఏమి చెప్పదలుచుకున్నాడు అని.
కొన్ని భాషల్లో "idiosyncrasies" అటు వంటివి.
అయితే, ఇతని తెలుగు భాషాభిమనమునకు మేము మిక్కిలి సంతసించితిమి :)
ఛానల్లలో తెలుగు మాత్రం పూర్తిగా బ్రష్టు పట్టేసిందనటానికి మాత్రం ఏ మాత్రం సందేహ పడవలసిన అవసరం లేదు.
మితి మీరిన ఏక వచన ప్రయోగం కూడా దీనిలో ఒకటి. ఏ మధ్య ఏదో కార్యక్రమంలో, "వచ్చాడు , అన్నది" వంటి మాటలు ఎక్కువగా వినిపించి, మన "standards" ఎంతగా పడిపోయాయో అర్ధం అయ్యింది.
నేను మీ బ్లాగ్ ని చాల రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, కాని ప్రతి రోజు కాకా, తీరిక ఉన్నప్పుడు ఇటువంటి తెలుగు బ్లాగ్ లను చదివి, కొంత సంతృప్తి చెందుతూ ఉంటాను. కామెంట్ రాయటం ఇదే మొదటిసారి.
@శ్రీనివాసకుమార్:
ఖబుర్లు చెప్పడం, మద్దతు ఇవ్వడం, వాకబు చేయడం లాంటి వందలాది పదాలు ఉరుదూ నుండి తెలుగు లోకి వచ్చాయి. కాలక్రమేణ అవి తెలుగులో పూర్తిగా కలిసిపోయాయి.
ఈ ప్రక్రియ అన్ని ప్రాంతాలలో అన్ని భాషలలో అన్ని కాలాలలో జరుగుతూనే ఉంటుంది. ఇది భాష వికాసంలో భాగమని మనం భావించాలి.
ఇకపోతే రాము గారు రాసింది తప్పుడు వాడకం గురించి. దాని కారణం కూడా ఆయనే చెప్పారు. సంస్కృతం నుండి వచ్చిన పదాలు వేర్వేరు భాషలలో వేర్వేరు అర్థాలు సంక్రమించుకున్నాయి. (ఉ. ఉపన్యాసం= speech vs. उपन्यास= novel; విచారం= regret vs. विचार= investigation; ఆగ్రహం= anger vs. आग्रह= request).
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి