Monday, April 12, 2010

కోర్టులలో మాతృభాషలో వాదన...బహు భేష్!

భాషాపాండిత్యం వేరు, బుర్ర (అంటే- పదునైన ఆలోచనలు) కలిగివుండడం వేరు. బ్రిటిషోడి పుణ్యాన...మన దేశంలో ఒక దురాచారం ప్రబలింది. తేనె లాంటి మాతృభాష వదిలి ఆంగ్లంలో మాట్లాడడం గొప్ప. సంస్కారానికి, మేధావి తనానికి ఈ ఇంగ్లిపీసు ఒక చిహ్నం అన్న దురభిప్రాయం మన నరాలలో జీర్ణించుకుపోయింది. అన్ని భాషలూ ముఖ్యమే...మన సొంత భాష అంతకన్నా ముఖ్యం...అన్న భావన ఆవిరైపోతున్నది.

'డాడీ...ట్వెంటీ సిక్స్ అంటే?..." అని కొడుకో, కూతురో అమాయకంగా అడిగితే భలే బాధ కలుగుతుంది. హై స్కూల్ స్థాయికి వచ్చిన వీళ్ళు నిజంగా తెలియక అడుగుతారా?  లేక పరాచకానికి అడుగుతారా? అన్న సంశయం కలుగుతుంది. తెలుగు మాట్లాడే, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా...ఇంగ్లిష్ లో మాట్లాడాల్సిన పనిలేదు. భాషను స్టేటస్ సింబల్ గా భావించే వాళ్ళను ఒక నొక్కు నొక్కాల్సిందే. వీళ్ళు జాతి ద్రోహుల కింద లెక్క.


ఈ సానియా పెళ్లి ముచ్చట్లు, మావోయిస్టుల దాడి, రంభ పెళ్లి-విందు వంటి విషయాల మధ్య మన మీడియా ఒక మంచి వార్తకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ ఉదయం 'ది హిందుస్థాన్ టైమ్స్' చదివే దాకా ఆ విషయం నాకు తెలియలేదు. 'बहुत खूब!' అన్న హిందీ శీర్షికను ఆ పత్రిక 'కామెంట్' పేజీలో చదివి...నాకు ఆనందం అనిపించింది. 

ఢిల్లీ హైకోర్టు... మొట్టమొదటి సారిగా...ఒక న్యాయవాది హిందీ లో వాదించే అవకాశం ఇచ్చిందట. ఇది చాలా ఊరట ఇచ్చే అంశం. మన తెలుగు నాడులో న్యాయమూర్తులు కూడా ఆ పనిని అమలు చేసి, పోషిస్తే బాగుంటుంది. మన దగ్గర ఏ కోర్టులో అయినా....తెలుగు అనుమతిస్తున్నారో లేదో నాకు తెలియదు. 


నేను కలిసిన చాలా మంది న్యాయవాదులు తెలుగులో చక్కని వాదన, విశ్లేషణ చేస్తారు. కోర్టు హాలులో బ్రోకెన్ ఇంగ్లిష్ తో వాదించడానికి నరకయాతన పడతారు. పైగా బూజుపట్టిన పాత చింతకాయ పచ్చడి పదజాలం ఒకటి. వలసవాద సంబోధనలు, విన్నపాలు! ఈ క్రమంలో తమ వాదన సరిగా వినిపించలేక వీళ్ళు ఒకొక్క సారి...కేసులో దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. 

నాకు తెలిసిన ఒక పెద్ద లాయర్...తనకు ఒక మోస్తరు బుర్ర వున్నప్పటికీ...కాన్వెంట్ స్కూల్ ఇంగ్లిష్ ను కోర్టుహాల్ లో దడదడ లాడించి కేసులు గెలుస్తున్నాడు. భేష్ అనిపించుకుంటూ ఉన్నాడు. అంతకన్నా భేషైన వాదన చేయగలిగి, ఇంగ్లిష్ సరిగా రాని లాయర్లు రాణించలేక పోతున్నారు. ఆత్మ న్యూనతతో చచ్చిపోతున్నారు. 'భాష'పై 'విషయాని'ది పై చేయి కావాలి. 

నిజానికి ఈ కోర్టుల్లో చాలా వాదనలు... వాది, ప్రతివాదులకు తెలియని భాషలో సాగడం దారుణమే కాదు, పెద్ద అన్యాయం. చిన్న పదాల  మార్పుచేర్పులతో అర్థం మారిపోతుంది కదా!. కోర్టులో ఏమి జరిగేది...లాయర్ ఏమి వాదించేది...తెలియకుండానే....లాయర్ చెప్పిందే గుడ్డిగా వేదంగా నమ్మే కోర్టు పక్షులు చాలా మంది కనిపిస్తారు. ఈ పరిస్థితి మారాలి.

'సత్యం' రామలింగ రాజు స్కాం కావరేజ్ లో భాగంగా నేను కొన్ని కోర్టు విచారణలకు హాజరయ్యాను. అంతకు మునుపు కొన్ని హత్య, దొమ్మే కేసులను కోర్టులకు వెళ్లి కవర్ చేశాను. లాయర్స్ communication skills నన్ను ఎప్పుడూ నిరాశ పరిచాయి. నల్గొండ లో ఒక లాయర్ టెన్స్ లను ఖూనీ చేస్తూ ఇంగ్లిష్ లో వాదన దంచెయ్యడం...దానిని న్యాయమూర్తి గారు అర్ధమయినట్లు మధ్య మధ్యలో తలూపి శ్రద్ధగా రాసుకోవడం...ఇదంతా..గ్రీకు, లాటిన్ మాదిరిగా అనిపించి బోనులో ఉన్నవాడు బిత్తరి చూపులు చూడడం నన్ను బాధించాయి. మనకు మనం మూర్ఖుల్లా ప్రవర్తించడం, వ్యవస్థను బ్రష్టుపట్టించడం మానాలి. 


మీడియా కూడా ఇంగ్లిష్ పై మితిమీరిన మమకారం వదిలి మాతృభాషను ప్రోత్సహించాలి. ముప్పావు భాగం ఇంగ్లిష్ లోనే మాట్లాడే...ఈ కాన్వెంట్ భామలను యాంకరింగ్ నుంచి తొలగించి....అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వారిని నియమించాలి. హిందూస్తాన్ టైమ్స్ ఇచ్చినట్లు ఇలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే...మన తియ్యని తెలుగు పది కాలాలు బతికి బట్టకట్టి నలుగురి నోళ్ళలో నానుతుంది. అరవోడికి తెలిసినట్లు తెలుగోడికి తెలియడం లేదు కానీ...తెలుగు భాష చాలా ప్రమాదంలో ఉంది.
 

10 comments:

Saahitya Abhimaani said...

కోర్టుల్లో వాదన దకా వెళ్ళారు, ముందు మన శాసన సభలో స్పీకరును (దీనికి తెలుగేమిటి) తెలుగులో మాత్రమే మాట్లాడేట్టు చెయ్యండి. ఆ తరువాత శాసన సభ్యులు. అలా అలా పాలకులు చేస్తే, ప్రజలు వాళ్ళను అనుసరిస్తారు. అయినా భాషాభిమానం ఉండాలిగాని, చెప్తే చేస్తారా.

Anonymous said...

చాలా మంచి వ్యాసం రాసారు. ధన్యవాదాలు.ఆంగ్లం లో నన్ను నేను సరిగ్గా వ్యక్తపరుచుకోలేను.
అదే తెలుగు లో ఐతే బాగా చెప్పగలుగుతాను.
-S.S

సుజాత వేల్పూరి said...

టౌన్లలో , జిల్లా కేంద్రాల్లో ఉన్నన్ కోర్టుల్లో కూడా ఇంగ్లీష్ లోనే సాగుతాయంటారా వాదనలు? హైకోర్టుల్లో ఆయా రాష్ట్ర భాషల్లోనే వాదనలకు అనుమతిస్తే ఎంతో బావుంటుంది.లాయర్ల వాదనలు వాదులకు, ప్రతి వాదులకు అర్థం అయి తీరాలి కదా!అలా కాని పక్షంలో అని అన్యాయమే!

మీడియా గురించి మీ కోరికలు తీరేవి కాదు లెండి:-)). వార్తలు చదివే యాంకర్లు "తల్లి దండ్రులు"అనే మాట మర్చిపోయి చాలా చాలా రోజులైంది. ఎప్పుడూ "పేరెంట్సే"! స్కూళ్ల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్తూ నిన్న NTV స్క్రోలింగ్ లో "పేరెంట్స్ కి సూచన" అని వేశారు.

సగం ఇంగ్లీష్, పూర్తి తెలుగు.. నాశనం కావడానికి బోలెడు బాధ్యత మీడియా ఛానెళ్ళు తీసుకోవాలి. తెలుగు వార్తల్లో సగానికి సగం చచ్చు, నికృష్ట, బ్రోకెన్ ఇంగ్లీషే! ఇక వీటికి తెలుగు వార్తలని పేరెందుకు?

Anonymous said...

సహకారరంగంలో పత్రిక సంగతి ఏం చేసారు?

Ruth said...

అదేంటండీ అలా అంటారు? మన సినీమాల్లో ఎంత అద్భుతం గా చూపిస్తారీ కొర్టు సీన్లన్నీ??? అబ్బా అలా దడదడా తెలుగులో వాదించేస్తూ ఉంటే నాకెంత ముచ్చటెసేదో! ఐతే అదంతా నిజం కాదా? అవి చూసి లాయర్ అవ్వాలని కలలు కనేదాన్ని చిన్నప్పుడు (షరా: లాయర్ ఐతే చాలా అబద్ధాలు చెప్పాలి మనకు వద్దులేమా అని మా డాడీ నా ఆశల్ని నీరుగార్చేసారనుకోండి)

ఆ.సౌమ్య said...

బాగా చెప్పారు.

ఇదే విషయం మీద నేను ఒక టపా రాసాను చూడండి

http://vivaha-bhojanambu.blogspot.com/

Anonymous said...

న్యాయవాది తెలుగులో వాదించి నట్లు, న్యాయమూర్తి తెలుగులో తీర్పు ఇచ్చినట్లు ఈనాడులో వార్తలు వచ్చాయి.

నేను ఒకసారి(2006) డిల్లీలో కోర్టుకు వెళ్ళాను. జడ్జ్ లాయర్ అవసరం లేని ఆ కేసులో నన్ను అన్ని ప్రశ్నలు హిందీలోనే అడిగాడు.

Vinay Datta said...

TV9 recently had broadcast an exclusive programme about the importance of Telugu, the way it is being neglected, why Bengali is ahead of Telugu and how English has taken the 2nd position, hoe Telugu has come down from 2nd to 4th. That was a real joke.

Keep aside the news. I don't like to watch cookery programmes where both the anchor and the guest overtake each other in using english.

water add chesukovaali....mix chesukovali...cook cheyyaali...grate cheyyali....cut cheyyaali...garnish chesukovaali...serve cheyyaali...mmmm...yammiiiiiiiiiiiiiigaa undi......I wish I could have the gits to break the IDIOT box. The print media was better earlier. Off late they've also started using the TV language. SAHAVAASA DOSHAM...NAAKU AAVESHAM.

Vinay Datta said...

@ sowmya:
I've just seen your 'pichcha pichchagaa'. Very true and funny. Please note one more point. All the participants and anchors and judjes and mentors are no more using the word 'paata'. Long back it got replaced by 'song'. Even a very good anchor like Suma is doing that. Hemachandra talks only English with occassional expressions in Telugu for a change.

Please don't ask me why I don't write Telugu. Typing English itself is difficult for me. But shall try to type in Telugu in the near future.

Let me be frank with you. I don't like typing. Be it Eng, Tel or any other language. I always WRITE.

Anonymous said...

ఇంకా నయం "పేరేంట్లు" అని రాయలెదు అందుకు సంతోషించాలేమొ :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి