Sunday, June 19, 2011

నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం (ఫాదర్స్ డే ప్రత్యేకం)

డియర్ ఫ్రెండ్స్,
మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
"వాలెంటైన్స్ డే"ను జనాలకు పరిచయం చేసినవాడికన్నా..."ఫాదర్స్ డే" ను ప్రవేశపెట్టిన వాడంటే నాకు గౌరవం. ఎందుకంటే...కుటుంబం కోసం అష్టకష్టాలు పడే తండ్రి మన సమాజంలో ఎక్కువగా అపార్థానికి గురవుతున్నాడని నా నమ్మకం. జీవితంలో అమ్మ పాత్ర అమ్మదే, నాన్న పాత్ర నాన్నదే. తన నిర్ణయాలు కొన్ని నాకు నచ్చకపోయినా...ఇట్లా కాకుండే ఆయన అట్లా చేసి ఉంటే బాగుండేది అనిపించినా... మా నాన్నంటే నాకు చాలా ప్రేమ. ఇంత దయార్ధ్ర హృదయుడైన గొప్ప వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక గమ్మత్తు జరిగింది. 

నేను...నా కూతురు మైత్రేయితో కలిసి ఒక ఆదివారం నాడు నారాయణ సేవ (అన్నార్తులకు భోజనం ప్యాకెట్లు పంచడం) చేస్తుండగా...చాలా ఏళ్ల తర్వాత ఒక మిత్రుడు రోడ్డు మీద కలిశాడు. ఈ మిత్రుడు మర్నాడు నాకు ఒక మెయిల్ పంపాడు..."నీ లోని మనిషికి నమస్తే...." అంటూ. ఆ మెయిల్ చూస్తే నాకు మా నాన్న జీవితం అంతా మరొక సారి గుర్తుకు వచ్చింది. మా నాన్న చిన్నతనంలో పేదరికం కారణంగా భోజనం కోసం పడిన బాధ...దాని గురించి ఆయన నాకు చెప్పిన విషయాలు...కొన్ని రోజులైనా కొందరైనా క్షుద్బాధ అనుభవించకుండా ఉండటానికి మన వంతు కృషిచేయాలని నేను, నా కుటుంబం గట్టిగా సంకల్పించుకోవడానికి ఆయన చెప్పిన మాటల ప్రభావం...గుర్తుకు వచ్చాయి. 
మా నాన్న గారి గురించి...నేను గత ఏడాది పోస్టు చేసిన వ్యాసాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. చదవి మీ అభిప్రాయం రాయండి. ఈ రోజున మీ తండ్రి గారిని గుర్తుకు తెచ్చుకుని...ఆయనకు  తప్పకుండా మీ ప్రేమను తెలియజేయండి. మీ అందరికీ మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు...రాము
********************************************************* 

పెద్ద పేద కుటుంబంలో పుట్టి...బాల్యంలో అష్టకష్టాలు పడి పదేళ్ళ లోపు వయసులో తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా విద్యార్జన కోసం పట్నానికి పయనమైన బాలుడు. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవన సమరం ఎలా చేయాలో నాకు నేర్పాడు.

*     *     *     *     *     *     *     *     *     *
ఆ పట్నంలో ఆర్థిక ఇబ్బందులతో..ఆ ఇంట్లో ఈ ఇంట్లో వారాలు చేసుకుని తింటూ...సంస్కృతం నేర్చుకుని, ఈ చదువుతో భవిష్యత్తులో లాభం లేదని ఎవరో చెబితే...ఒక పంతులు గారికి శుశ్రూష చేసి ABCD లు నేర్చుకుని, ఆ మరుసటి సంవత్సరమే...మెట్రిక్యులేషన్ పరీక్ష రాసిన విద్యార్థి. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...ఏ పనైనా చిత్తశుద్ధితో చేస్తే సాధించ వచ్చని నాకు అమూల్యమైన పాఠం నేర్పాడు.
*     *     *     *     *      *     *     *     *     *
వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో...మూగ జీవాలకు సేవ చేసుకుంటూ...ఎంతో సంతృప్తి పొందిన ఉద్యోగి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విధినిర్వహణలో బద్ధకం పనికిరాదని, చిత్తశుద్ధితో విధి నిర్వర్తించాలని నేర్పారాయన. 
*     *     *     *     *      *     *     *     *     *
వృత్తికి దగ్గరి వ్యాపారం కదా అని...కోళ్ళఫారం పెట్టి లక్షల్లో చేతులు కాల్చుకుని ఆర్థికంగా బాగా నలిగిపోయిన వ్యక్తి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవితంలో ఓటమిని ఎలా స్వీకరించాలో చెప్పకనే చెప్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
వూర్లో ఆరో తరగతిలో ఉన్న కొడుకు ఒక స్నేహితుడితో కలిసి బీడీలు, సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి...కొట్టకుండా, తిట్టకుండా...వేరే ఊరికి తీసుకెళ్ళి ఏకాంతంలో రోడ్డు పక్క నడుస్తూ కౌన్సిలింగ్ ఇచ్చిన తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...పిల్లల్లో  పరివర్తనకు మార్గం దండన కాదని రుజువు చేసారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ఇంటర్మీడియేట్ చదువుతున్న కొడుకు ఇంటి ఓనర్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నాని....చెబితే...."ఒకే...ముందు చదువు సంగతి చూడు...తర్వాత పెళ్లి సంగతి...." అని మళ్ళీ కౌన్సిలింగ్, మనోస్థైర్యం ఇచ్చి...కొడుకు స్థిరపడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం...ఎలాంటి కొర్రి పెట్టకుండా, రాద్ధాంతం చేయకుండా, ఆ అమ్మాయితోనే కొడుకు పెళ్లి అయ్యేలా చూసి పెద్దరికం నిలుపుకున్న తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....జీవితంలో ఎంతో కీలకమైన విషయాలను ఓపికతో, ప్రాక్టికల్ గా పరిష్కరించడం నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
కట్నం తీసుకోవడం ఇష్టం లేదని కొడుకు స్పష్టం చేస్తే...అప్పుచేసి మరీ...తన సొంత వూర్లో కొడుకు పెళ్లి చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....ఇతరులు పెట్టుకున్న సిద్ధాంతాన్ని, నిబంధనలను గౌరవించడం ఎలానో ఆచరించి చూపారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
సొంత తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే...తాను కష్టపడి కూడగట్టి...ఆదుకున్న మంచి అన్న. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...అనుబంధం, ఆప్యాయతల ముందు డబ్బు గడ్డిపోచతో సమానమని నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ముగ్గురు కొడుకులను చదివించి....ఇన్నాళ్ళూ...పెద్దగా సంపాదించింది ఏమీ లేకపోయినా...తృప్తిగా ఉద్యోగ విరమణ చేసి ఆరోగ్యం కోసం వ్యవసాయం, ఆత్మానందం కోసం భక్తి పుస్తక రచన చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...గడిచిన దాని గురించి వగచకుండా...శేషజీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నేర్పుతున్నారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
అరవై ఆరేళ్ళ వయస్సులో...మొన్ననే...'మన వూర్లో ఒక వృద్ధాశ్రమం పెడితే ఎలా వుంటుంది?' అని ప్రశ్నించిన ఆ మనీషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విపరిణామాలకు బెదరకుండా....సేవా తత్పరత ఎలా కొనసాగించాలో చెబుతున్నారాయన.


---ఆ బాలుడు, ఆ విద్యార్ధి, ఆ ఉద్యోగి, ఆ పెద్ద మనిషి, ఆ తండ్రి, ఆ అన్న, ఆ మనీషి....ఆయనే మా నాన్న..వెంకటేశ్వర్లు గారు. ఆయన నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఏ తండ్రి జీవితం అయినా...కొడుకులు, కూతుళ్ళకు ఒక పెద్ద సందేశం. తల్లి ప్రేమను, ఫుడ్ ను పంచి పెంచితే...నాన్న మౌనంగా జీవన పోరాటం, ఒడిదొడుకులను ఎదుర్కునే...శక్తి సామర్ధ్యం ఇస్తాడు. మా నాన్న కూడా అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువే. అన్యాయం, దారుణంపై నిర్మొహమాటంగా గొంతెత్తడం, నిష్టురమైనా, ఎందరు నొచ్చుకున్నా...నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం...ఆయన నుంచి అబ్బిన లక్షణాలు. ఈ కింది ఫోటోలో ఎడమ వైపున ఉన్నది మా నాన్న, కుడి వైపున ఉన్నది హేమ నాన్న, మధ్యలో ఉన్నది నా పుత్రరత్నం ఫిదెల్.

రెక్కలు వచ్చి గూడు వదిలి రావడానికి ముందు నేను, తమ్ముడు, అన్నయ్య, నాన్న...కొన్నేళ్ళ పాటు ఇంటి ముందో, పక్కనో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఆ రోజులు తడి ఆరని తీపి గుర్తులు. జీవితం లో నాకు ఒక దాని వెంట ఒకటి విజయాలు లభించినప్పుడు...ఆ సమాచారం తెలుసుకునేటప్పుడు మా నాన్న కళ్ళలో వెలుగు, పెదాలపై నవ్వు కోట్ల పెట్టు. అలాగే...వివిధ గ్రంథాల సారాన్ని, తన అనుభవాలను కలిపి తాను రూపొందించిన "ఆత్మ శోధన--యోగ సాధన" పుస్తకాన్ని నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లో పండితుల చేతుల మీదుగా ఆవిష్కరించినప్పుడు కూడా ఆయన పడిన ఆనందం ఎంతో తృప్తినిచ్చేది. నేను, నాన్న, ఫిదెల్, తమ్ముడు కలిసి కూచొని క్రికెట్ లేదా ఫుట్ బాల్ మ్యాచ్ టీ.వీ.లో చూడడం నాకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి.

తల్లులను తక్కువ చేయడం కాదు కానీ...జీవితం లో తండ్రి పంచే వాత్సల్యం, నేర్పే జీవిత పాఠాలు అమూల్యం, అద్భుతం. తల్లి ప్రేమకు గానీ తండ్రి వాత్సల్యానికి గానీ సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. మన తల్లిదండ్రులు నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని, వారికి దగ్గరుండి సేవ చేసుకునే బుద్ధి, శక్తి సామర్ధ్యాలు పుత్రులలో పెరగాలని ఆశిస్తూ..... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

10 comments:

Vinay Datta said...

Your last year's post is very much fresh in my mind. Happy Father's Day.

madhuri.

కిరణ్ కుమార్ కే said...

You showed me 'Father' in a very different angle which was I never seen before or thought of. Thanks a lot for a good writing. From a year being a father now I clearly see what a Father is about in a kids life, and your post helped me to show me a path about how to be a father to my kid. Thanks again.

జాన్‌హైడ్ కనుమూరి said...

This post taken to Naanna sankalam
best wishes
John Hyde

Afsar said...

రాము గారు: చాలా బాగుంది. మీకూ మీ నాన్నగారిలోని మహితాత్మకు నమస్సులు!

వంశీ కృష్ణ said...

రామూగారు, బావుంధి. చక్కగా రాసారు. అభినందనలు.

Pavani said...

Good post from you..after a long gap.

GuppeduManasu said...

రాము గారు.. మా నాన్నను గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన జ్ఞాపకం మాత్రమే మిగిలింది. నాన్న పెద్దకొడుకైన నాకోసం ఎంత చేశారో తలచుకుంటే.. కన్నీరుబుకుతోంది. మానాన్న లారీ డ్రైవర్‌‌గా ఉంటూ.అప్పట్లో అంటే 1988.. నన్ను పాలిటెక్నికల్ చదివించారు. ఒక డ్రైవర్ కొడుకు పాలిటెక్నికల్ చదువుకుంటున్నారని ఊరంతా చెప్పుకునేవారు. ఏలూరు‌లో హాస్టల్‌‌లో ఉంచి ఆ రోజుల్లో నేను పాలిటెక్నికల్ చదివడానికి నా గురించి నాన్న ఎంత కష్టపడ్డారో(శ్రమపడ్డారో)...చెప్పలేను. అందుకే నాన్నకు జేజేలు.. మా నాన్నకు నివాళులు

chinnodimata said...

రాము గారూ నాన్నగురించి చాలా బాగా రాసారు. ఏ విషయంపైనా అప్ డేట్ గా బ్లాగులో రాసే మీరు.. జయశంకర్ లాంటి వ్యక్తం చనిపోతే కనీసం..కండొలెన్స్ అయినా పెట్టకపోవడం బాధాకరం. మీకు బిజీగా ఉండి రాయలేదా.. లేదంటే కావాలని విస్మరించారా.. మాకు తెలియదు. ఏదేమైనా దీని గురించి మీరు తెలియజేస్తే సంతోషిస్తాము...

Srinivas Kusumanchi Journalist said...

Dear Ramu, we all love our parents. But we don't find words to express them. You proved that it was not a big task..

KSR

sree said...

రామూగారూ... నిజంగా నాన్న పుస్తకాన్ని మీరు ఏ అక్షరం వదలకుండా చదివినట్టు కనిపిస్తుంది. అంతేకాదు చదివింది తూచ తప్పకుండా పాటిస్తున్నట్లు కూడ కనిపిస్తున్నారు. మీరిచ్చిన లాస్ట్ ఇయర్ పోస్ట్ మాకూ ఓ మనసుందని గుర్తు చేసింది. దాన్ని కదిలింపజేసింది. నాన్న మాకు దూరమై పదేళ్ళు గడచినా మనసులోని జ్ఞాపకాలను మీ అక్షర 'బాణా' లతో వెలికి తీశారు. నాన్నకు కన్నీటి నివాళులర్పించేలా చేశారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి