Monday, October 3, 2011

రమేష్, నగేష్, రాజేష్, నరేష్...

రమేష్, నగేష్, రాజేష్, నరేష్
రమేష్=రమేష్ బాబు ('ఈనాడు' లో నేను పనిచేసినప్పుడు న్యూస్ టుడే మానేజింగ్ డైరెక్టర్)
నగేష్=సుసర్ల నగేష్ ('ది హిందూ' లో నేను పనిచేసినప్పుడు, ఇప్పుడు బ్యూరో చీఫ్)
రాజేష్=రాజేష్ రామచంద్రన్ ('మెయిల్ టుడే' లో నేను పనిచేసినప్పుడు, ఇప్పుడు నేషనల్ బ్యూరో చీఫ్)
నరేష్=నరేష్ నున్న (మొన్నటి దాకా నేను పార్ట్ టైం రిపోర్టర్ గా పనిచేసిన 'ది సండే ఇండియన్' సీనియర్ ఎడిటర్)

నా పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో గానీ జర్నలిజం లో ఉన్నన్ని రోజులూ "ష్" అనే అక్షరంతో ముగిసే పేర్లున్న వారి ఆధ్వర్యంలో పనిచేసాను. ఇది నాకు విచిత్రంగా తోచే అంశాలలో ఒకటి. 

సూర్యదేవర శ్రీకాంత్ అనే ఒక చురుకైన జర్నలిస్టు ప్రోత్సాహం వల్ల 1988 చివర్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో నా మజిలీ ప్రారంభమయ్యింది. అప్పటికే షటిల్ బాడ్మింటన్ లో కాకతీయ యూనివెర్సిటీ లెవెల్లో ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో మొట్టమొదటి సారి మా రామచంద్రా కాలేజ్ కి విన్నర్ షీల్డ్ తెచ్చిన టీం లో ఉన్న నేను స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ గా చేరాను 'ఈనాడు' యాజమాన్యం మినీలు పెట్టిన కొత్తల్లో. కాలేజి వెళ్ళడం, సాయంత్రం మైదానాల చుట్టూ తిరిగి స్పోర్ట్స్ వార్తలు రాయడం, రాత్రికి ఇండోర్ లో మనం సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న షటిల్ కాక్ లతో పడి పడి షటిల్ ఆడడం...ఇదీ దినచర్య. అప్పుడే కొత్తగూడెం లో పెట్టిన ఆలిండియా రేడియోలో క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా కూడా పనిచేసేవాడిని. అక్కడి ప్రోగ్రామ్స్ హెడ్ సుమనస్పత రెడ్డి గారు చాలా బాగా ప్రోత్సహించేవారు. నేను విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో తను అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేందుకు వస్తున్నారాయన.   

శ్రీకాంత్ గారు జిల్లా రిపోర్టర్ గా ఖమ్మం వెళ్ళిపోవడం తో నాకు ఒక చిక్కు వచ్చి పడింది 'ఈనాడు' లో. ఆయన స్థానంలో వచ్చిన శివ రామకృష్ణ అనే రిపోర్టర్ నంజుకు తినడం మొదలు పెట్టాడు. బాసు అన్న వాడి మీద అసహ్యం మితిమీరి పగ పెరగడం మొదలయ్యింది తనను చూశాకే. ఒకటి రెండు సార్లు తన బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయించుకు రమ్మంటే...ఆ పనిచేసాను. నన్ను ఇబ్బంది పెట్టాలని...నేను కవర్ చేసిన స్పోర్ట్స్ స్టోరీ ని నేను కాలేజ్ నుంచి వచ్చే లోపు టెలిప్రింటర్లో పంపేవాడు. తన ఆగడాలు భరించలేక...తాను పెడుతున్న అవమానాలతో ఒక పది పేజీల కంప్లైంట్ రాసి చుట్టుపక్కల కంట్రిబ్యూటర్ల తో కూడా సంతకాలు పెట్టించి యాజమాన్యానికి పంపాను. నేను కష్టపడి పనిచేసే జర్నలిస్టు నని అందరూ చేరదీసే వారు. స్పోర్ట్స్ లోనే చిత్ర విచిత్రమైన కథనాలు రాస్తూ..చాలా మంది కంట్రిబ్యూటర్ల కన్నా ఎక్కువ సంపాదించే వాడిని. 

శ్రీకాంత్ పలుకుబడి కూడా పనిచేసి శివ రామకృష్ణ ను బదిలీ చేసారు. నరకాసుర వధ జరిగినంత సంబరం చేసుకున్నారు...కంట్రిబ్యూటర్ లు. ఏ మాటకామాటే...అతను తెలుగులో భలే ప్రతిభావంతుడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు బదిలీ మీద వచ్చి నాతో పాటు హైదరాబాద్ లో జనరల్ డెస్క్ లో అనువాదంతో సతమతమవుతూ పనిచేసాడు. అప్పటికే జనరల్ డెస్క్ లో నేను మంచి ఊపులో వున్నాను కాబట్టి...అతను నాతో చాలా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. నేను కూడా...పాత విషయాలు మరిచిపోయి సాధ్యమైనంత కలుపుకుపోయే వాడిని. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో సీటు పొంది బూదరాజు గారి పుణ్యాన కొన్ని అక్షరం ముక్కలు నేర్చుకుని జనరల్ డెస్క్ లో చేరాను. అప్పటి వరకూ ఒక్క పుస్తకం చదివితే ఒట్టు. హమ్మయ్య..ఉద్యోగం దొరికింది...ఇక హేమను జీవిత భాగస్వామిని చేసుకోవడానికి ఇబ్బందులు ఉండవని సంబర పడ్డాను. 
బాగా పుస్తకాలు చదవాలి..అనే కోరికతో...సాయంత్రం ఉద్యోగం ఉంటే...ఉదయమంతా 'ఈనాడు' వారి గ్రంథాలయం ఆర్.ఆర్.జీ.లో వుండే వాడిని. ఈ లోపు... ఇంచార్జ్ గా ఉన్న శర్మ నరకం అంటే ఎలా ఉంటుందో చూపనారంభించారు. నన్నే కాదు...సీనియర్లను...వివిధ సెక్షన్ల ఉద్యోగులను పదునైన మాటలతో చంపేవాడు. ఆ బాధ భరించలేక...తనతో ఒక్క మాటైనా పడకూడదని పుస్తకాలు చదవడం ఆపేసి...అనువాదాల్లో ఆరితేరడానికి నానా కుస్తీలు పట్టేవాడిని. ఖమ్మం జిల్లా వాళ్ళంటే..."బుర్ర మోకాలులో కాదు..అరికాలులో ఉంటంది ...." అని మనసా వాచా నమ్మే మా ఎం.డీ.రమేష్ బాబు తన ప్రతాపం తాను చూపేవాడు. శర్మను, రమేష్ ను చూసాక...'ఈనాడు' లో ఉద్యోగం గ్యారెంటీ లేదని అర్థమై....ముందుగా రామకృష్ణా మఠం లో ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్స్ లో చేరాను. రాత్రంతా డ్యూటీ చేసి నిద్ర సరిగా లేక...ఉదయాన్నే లేచి అప్పట్లో బస్సు సౌకర్యం పెద్దగా లేనందున లిబర్టీ నుంచి ఇందిరా పార్క్ వరకూ నడిచి ఇంగ్లిష్ క్లాసులు విని వచ్చే వాడిని. అది భలే మంచి కోర్సు. నాకు చాలా ఉపకరించింది. యూనివెర్సిటీ డిగ్రీ ఉండకపోతే ఎట్లా అని ఉస్మానియా జర్నలిజం లో చేరి రెండు గోల్డ్ మెడల్స్ కొట్టాక బతుకు మీద భరోసా వచ్చింది. 

సరే...హేమ, తమ్ముడు మూర్తి ఇచ్చిన మనోధైర్యంతో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కు వెళ్లి కోర్సు పూర్తి చేసి నల్గొండ లో 'ది హిందూ' పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. నన్ను నిజానికి విశాఖపట్నం డెస్క్ లో వేసారు కానీ...తెలంగాణా జిల్లాలలో రిపోర్టింగ్ చేయాలన్న ఆసక్తితో అప్పటి ఎడిటర్ మాలినీ పార్థసారథి మేడం దగ్గర పట్టుబట్టి మరీ రిపోర్టింగ్ లో చేరాను. 'ది హిందూ' లో అప్పటి మా బ్యూరో చీఫ్ దాసు కేశవరావు గారు మనిషి రూపం లో ఉన్న దేవుడు. ఒక అద్భుతమైన మనిషి. బాసులు ఒట్టి యాసులు (గాడిద కొడుకులు) అని అనుకునే నేను...కేశవరావు గారిని చూసి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇంతలో ఆయన రిటైర్ అయి...సుసర్ల నగేష్ కుమార్ అనే ఆయన బ్యూరో చీఫ్ అయ్యారు. కేశవరావు గారు ఒక్కరే మినహాయిపు...నా పూర్వాభిప్రాయంలో తప్పులేదని అనుకున్నాను. ఇప్పుడు ఆ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ లను ఎవ్వరిని అడిగినా ఇదే మాట చెబుతారు. 

నగేష్ December 25, 2007 న ఫోన్ లో నా మీద అవినీతి ఆరోపణలు చేసారు. నల్గొండ లో ఎథికల్ జర్నలిజం ఇనిషియేటివ్ ప్రారంభించిన నేను ఆ మాటలు తట్టుకోలేక...తనెన్నిరోజులు ఆ పదవిలో ఉంటాడని కనుక్కున్నాను. కనీసం పదేళ్ళు ఉంటాడని తెలిసి నా ప్రయత్నాలు నేను ఆరంభించాను.  ఇంతలో ఫిదేల్ టీ.టీ.కోచింగ్, పెండింగ్ లో పడిన పీ.హెచ్.డీ.ల కోసం హైదరాబాద్ రావాలని ప్రయత్నాలు చేస్తే...'అవుట్ లుక్' లో 'మెయిల్ టుడే' లో వచ్చాయి. ఈ రెండో పేపర్ టాబ్లాయిడ్ అని తెలియక...చేరాను. అక్కడి బాసు పేరు...రాజేష్ రామచంద్రన్. తానో పనికిమాలిన జర్నలిస్టు అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టలేదు. దేశ రాజధానిలో కూర్చుని ఇక్కడి స్టోరీలకు యాంగిల్ ఇచ్చేవాడు. తన సోర్సుల ప్రకారం నన్ను వార్తలు రాయమనే వాడు. తనను 'సార్' అని పిలవాలని ఒక రోజు చెప్పాడు. అప్పటికే వాడితో, టాబ్లాయిడ్ తరహా జర్నలిజం తో విసిగిపోయి...ఒక చిన్న అవకాశం వస్తే...అమెరికా వెళ్లి వచ్చి...జర్నలిజం పాఠాలు చెప్పడం ఆరంభించాను. టీచింగ్ లో రాణిస్తానని చిన్నప్పటి నుంచి నాకుండేది. 

రాత తీట తీర్చుకోవడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుంది...అని అనుకుంటున్న సమయంలో నరేష్ నున్న తో పరిచయం అయ్యింది. వారి దగ్గర పార్ట్ టైం రిపోర్టర్ గా పనిచేయడం ఆరంభించాను. నేను అడగ్గాన్నే 'రాం బాణం' అనే పేరుతొ ఒక కాలం రాయడానికి ఆయన అంగీకరించి ప్రోత్సహించారు. అక్కడ రిపోర్టింగ్ వరకూ బాగానే ఉంది కానీ...అర్థరాత్రి అనువాదాల ఫిటింగ్ మొదలయ్యింది. నేను నిద్ర అస్సలు కాయలేను. 'ది సండే ఇండియన్' ఇంగ్లిష్ పత్రికకు నేను రాసిన పాపా లాల్ స్టొరీ, ఒక రెండు మూడు 'రాం బాణం' కాలమ్స్ తప్ప అక్కడ నాకు పెద్దగా తృప్తి అనిపించలేదు. ఇంతలో తుది దశకు చేరుకున్న పీ.హెచ్.డీ., రాయాలనుకున్న పుస్తకం పని ఉంచుకుని...డబ్బు కక్కుర్తి తో అరకొరగా పనిచేయడం భావ్యం కాదని చెప్పి మరొకరిని నా స్థానంలో చూసుకోమని నరేష్ కు చెప్పాను. ఆయన మొన్ననే దిగ్విజయంగా ఆ పనిచేసినట్లు తెలిపారు. ఇంతటితో అక్కడ కథ ముగిసింది.

రమేష్, నగేష్, రాజేష్ ల సరసన నరేష్ పేరు పెట్టడం నిజానికి తప్పు. ఏదో ప్రాస కలిసిందని పెట్టానంతే.  నరేష్  చాలా సాత్వికుడు, తనతో పనిచేసే వారికి విపరీతమైన స్వేఛ్చ ఇచ్చే ప్రజాస్వామిక వాది. పైగా కవి. "ఇండియన్ ఎక్స్ ప్రెస్" యాజమాన్యంపై హక్కుల కోసం పోరాడిన జర్నలిస్టు కనక నాకు ఆయనంటే ఒక గౌరవం ఉంది. 
తనతో కొన్నాళ్ళు ఉంటే...కవితా తపన, స్త్రీ సౌందర్య  ఆరాధనా భావం ("జాడ్యం" అని నేనంటాను)  పెరుగుతాయని చెప్పవచ్చు. ఆఫీసుకు వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా 'హాయ్' అని పలకరించే నరేష్ లో నేను గమనించిన వివిధ కోణాల గురించి మరొక పోస్టులో రాస్తాను. 

5 comments:

కంది శంకరయ్య said...

ఆ పేర్లను రమేశ్, నగేశ్, రాజేశ్, నరేశ్ అని వ్రాయాలి. చాలామంది (తెలుగులో మంచి పాండిత్యం ఉన్నవారు కూడా) తరచుగా చేసే పొరపాటు!

Sitaram said...

శంకరయ్య గారూ...
నిజమే సార్, కానీ ఆ పేరు పెట్టుకున్న వాళ్లే..'శ్' బదులు 'ష్' అని రాస్తుంటే...దాన్ని పాటించకపోవడం బాగుండదేమో అని అలా రాశాను.
మీ కామెంటుకు థాంక్స్.
రాము

అయితగాని జనార్ధన్ said...

సార్ మీది ఖమ్మమా.. ఇంతకీ ఇప్పుడెక్కడ పనిచేస్తున్నారో తెలియలేదు.. ఇన్ని అభ్యుదయ బావాలున్న మీకు జర్నలిజంలో అన్ని రకాల వ్యక్తులు తారసపడి ఉంటారు. మీ పోస్టింగ్ లన్నీ ప్రతి జర్నిలస్టుకు ఏదో ఒక రోజు అనుభవం అయినవే.
---జనార్దన్.ఎ,(హెచ్ఎంటీవీ)

పూర్ణప్రజ్ఞాభారతి said...

నరేశ్ నున్నా ప్రజాస్వామికవాది కాడు.. మిత్రవాది. కనిపించే ప్రతి వ్యక్తిని మిత్రునిగా భావించే సహృదయుడు. అతని భాషాశైలి ఈమధ్య కాలంలో మరెక్కడా కనిపించదు. ప్రవాహశీలమైన భావాలు, విశృంఖలంగా విహరించే భాష అతని స్వంతం. నాకున్న నలుగురైదుగురు మిత్రుల్లో నున్నా పేరు మొదటి వరుసలో ఉందని చెప్పడానికి సంకోచించను.

Surya said...

Ramu garu... mee sunday indian udyoga vishayam ippude telusukunnanu... neenu kooda koddi roojulu Naresh gaari daggara pani chesanu... ayana vishayamloo mee maate naa maata kooda... Naresh gaarini Mainstream journalism chaala miss avutondi... :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి