Sunday, October 16, 2011

స్టూడియో- ఎన్ యాజమాన్యానికి లీగల్ నోటీస్

నాలుగు డబ్బులున్న ప్రతి ఒక్కడూ...బ్లాక్ ను వైట్ చేసుకోవడానికో, రాజకీయ తీటతోనో, ఇతర వ్యాపారాలకు రక్షణ కవచంగానో చానల్స్ పెట్టడంతో తెలుగు నేల మీద తీవ్రమైన దారుణం జరుగుతున్నది. దీనివల్ల జర్నలిస్టులకు విలువ లేకుండా పోవడం అలా ఉంచితే...ఈ వికృత క్రీడలో సమిధలవుతున్నది...సాధారణ జర్నలిస్టులు. గత రెండేళ్లలో కనీసం ఐదొందల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉండవచ్చన్నది కనీస అంచనా. జర్నలిస్టులను ఆదుకోవాల్సిన యూనియన్ నాయకులు టీ.వీ.స్టూడియోలలో, ప్రెస్ క్లబ్ లో, పైరవీ ప్రాంతాలలో తప్ప ఎక్కడా కనిపించరని జర్నలిస్టులు మొత్తుకుంటున్నారు. ఇదొక అరణ్యరోదన.     

చానల్స్ లో దారుణానికి ఒక పాట్రన్ ఉంది. ఈ యజమానులు...తమ గురించి తాము పెద్ద సినిమా ఊహించుకొని ఛానల్ పెడతారు. భారీగా ఉద్యోగులను తీసుకుంటారు. అప్పటికప్పుడు నాలుగు ఎక్కువ డబ్బులు వచ్చేసరికి కొందరు సీనియర్లు వీరి పంచన చేరి వీరికి బాకా కొడుతూ...చిన్నా చితకా జర్నలిస్టులను, టెక్నీషియన్లను చానెల్ లో చేరేలా పురికొల్పుతారు. బకరా జర్నలిస్టులు పోలో మంటూ ఛానల్ లో చేరతారు. ఏడాది బాగానే వుంటుంది. తర్వాత వారికి సినిమా కష్టాలు మొదలవుతాయి. యజమాని గాడు ముందు సీనియర్లను, తర్వాత వారు తెచ్చిన జూనియర్లను ఉద్యోగాల నుంచి పీకడం ఆరభిస్తాడు. ముదుర్లైన ఈ సీనియర్లు....ముందే వాసన పసిగట్టి వేరే ఛానల్ లో జంప్ చేస్తారు కానీ...జూనియర్లు, అంతకన్నా కొద్ది పెద్ద స్థాయి ఉన్నవారు బాగా ఇబ్బంది పడతారు. యజమాని ...ఫోను చిప్, ఐ.డీ.కార్డు పీక్కొని రేపటి నుంచి రావద్దని మెడపట్టి గెంటుతున్నాడు. మెజారిటీ జర్నలిస్టులు దీన్ని భరిస్తున్నారు...గుండెలు పగిలే మౌనంతో.   

చిక్కు ఎక్కడ వచ్చిందంటే....జనాలకు జరిగే అన్యాయాల గురించి తెగ స్టోరీలు చేసే జర్నలిస్టులు తమకు అన్యాయం జరిగితే...నోరు మూసుకుని భరిస్తారు. ఇక్కడ గొంతు ఎత్తితే...వేరే చానల్ లో ఉద్యోగం రాదనేది వారి భయం. అది కొంతవరకు నిజమైనా....మరీ నోరు మెదపకుండా...ఉద్యోగంపై వేటు పడగానే వెళ్ళిపోవడం దారుణం. కొందరైతే...తాము అంతవరకూ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ గురించి కూడా పట్టించుకోరు. మన ఖర్మ ఇలా కాలిందని కుమిలిపోతారు.

జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి పీకడంలో ఏ చానెల్ తక్కువ తినలేదు. బైటి ప్రపంచానికి గొప్ప ఎడిటర్లు గా కనిపించే వారు సైతం...ఉద్యోగులను తీసేయడంలో నిర్దాక్షిణ్యంగా ఉంటున్నారు. ఇలా చేసిన వాళ్ళు...ఆరోగ్య సమస్యలతోనో, కుటుంబ ఇబ్బందులతోనో నరకం చూస్తున్నారనడానికి నా దగ్గర కేస్ స్టడీ లు వున్నాయి. అవన్నీ....ఎప్పటికైనా...ఒక పుస్తక రూపం పొందుతాయి.   

అసలు విషయానికి వస్తే...చంద్రబాబు నాయుడు గారి స్టూడియో- ఎన్ చానెల్   జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేయడంలో చాలా ముందు ఉందని ఇంతకు ముందు పోస్టులలో చెప్పాను. ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులు...వారి ఆఫీసు దగ్గర టెంట్ వేసారు, మానవ హక్కుల సంఘాన్ని కలిసారు. అయినా...ఏమీ జరగలేదు. ఈ చానెల్ వారు ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. నార్నే శ్రీనివాస రావు అనే ఆయన యాజమాన్యం వేరట...ఆయన అల్లుడు నారా లోకేష్ బాబు వేరట. ఇప్పుడు యాజమాన్యం మారిందని చెప్పి...చాలా మందిని ఇంటికి పంపారు. కొందరికైతే...జీతాలైనా ఇవ్వలేదు. వాడి పాపం వాడిది...అని కొందరు సీనియర్లు వేరే చానల్స్ లో చేరగా... కొండబోలు లక్ష్మీ ప్రసన్న కుమార్ అనే యువ జర్నలిస్టు దీన్ని సీరియస్ గా తీసుకుని యాజమాన్యానికి లీగల్ నోటీస్ పంపాడు.

తనకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకపోతే...ఊరుకోనని కుమార్ అంటున్నాడు. సమాచార హక్కు చట్టాన్ని సమర్ధంగా వినియోగించి సమాచారం సేకరించిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో ఒకరైన కుమార్...గతంలో జీ-టీ.వీ.లో చేసినప్పుడు నాకు తెలుసు. 

ఉద్యోగాలు పోయిన జర్నలిస్టు మిత్రులారా....ముందుగా మీ హక్కులు మీరు తెలుసుకోండి. యాజమాన్యాలను అంత తేలిగ్గా వదలకండి. మీ హక్కులు పరిరక్షించుకోలేని మీరు జనం హక్కులు ఎక్కడ రక్షిస్తారు? కుమార్ లాగా...న్యాయ పోరాటం చేయండి. దానికి సీనియర్లు సహకారం తీసుకోండి. కావాలంటే...మీ కోసం ఒక సదస్సు ఏర్పాటు చేయడానికి ఈ బ్లాగు సిద్ధంగా ఉంది. మీ బాధలు వివరంగా నాకు రాయండి.

కుమార్ పంపిన లీగల్ నోటీసు ఇక్కడ చదవండి.

3 comments:

Saahitya Abhimaani said...

Good attempt Ramu garu. But differentiate between those who knowingly joined "chamcha" channels and normal journalists who are eking out their livelihood, by writing like a true journalist.

అయితగాని జనార్ధన్ said...

గత రెండేళ్లుగా స్టూడియో ఎన్ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. మీలాంటి వాళ్లు వాటిని ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్లున్నా.. ఎక్కడ వేసిన కండువా అక్కడే ఉంది. జర్నలిస్టులంతా ఒక్కటై వాణ్ణి నిలదీస్తే బాగనే కోరిక ఉన్నా... పీతల రాజ్యంలో అది అత్యాశే కావచ్చు..

Vinay Datta said...

Please collect information ( and publish ) about the boy, a reporter's son, who went to Kerala for treatment.

madhuri.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి