Sunday, June 2, 2013

'ఈనాడు' లో ప్రమోషన్ల హడావుడి

'ఈనాడు' పేపర్లో గత నాలుగు రోజులుగా ప్రమోషన్ల హడావుడి నడుస్తున్నది. యాభై మందికి పైగా రిపోర్టర్లు, సబ్బులకు పదోన్నతులు ఇవ్వడంతో ఉద్యోగుల్లో దీనికి సంబంధించిన చర్చే జరుగుతున్నది. ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం--72 మందికి పదోన్నతి లభించింది. కంగ్రాట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 

ఆ అదృష్టం లభించిన వాళ్ళు ఆనంద పడడం, కలగని వారు కుంగిపోవడం మామూలే కానీ... ఉద్యోగుల పని తీరును సరిగా అంచనా వేసే యంత్రాంగం లేకుండానే ఒకరిద్దరు పవర్ సెంటర్ల మాటలు విని ప్రమోషన్లు ఇవ్వడం 'ఈనాడు' లో రివాజు గా మారిందని అంటున్నారు. "ఒక ఐదేళ్లుగా నేనేమి చేస్తున్నానో ఎవ్వరూ చూడలేదు, అడగలేదు. ప్రమోషన్ల లిస్టులో నా పేరు లేదు," అని ఒక జర్నలిస్టు వాపోగా...."డీ ఎన్ గారి మనుషులకు మాత్రమే పెద్ద పీట వేసారు. ఇది దారుణం," అని మరొకరు చెప్పారు. 

గ్రూపిజం, కులం, ప్రాంతం ఆధారంగా 'ఈనాడు' లో ప్రమోషన్లు ఇస్తున్నారని ఒకరిద్దరు నిజమే అనిపించే ఉదాహరణలు ఇచ్చినా వాటిని ఇక్కడ ప్రస్తావించడం భావ్యంగా అనిపించడం లేదు. ప్రమోషన్ల విషయంలో ఒక జర్నలిస్టు ఒకరు తన ఆవేదనను నాతో పంచుకుంటే అక్కడ పనిచేసినప్పటి రోజులు మరొకసారి గుర్తుకు వచ్చాయి. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  క్రీం మీరంటూ ఇసికేల ఉదయ్, రెంటాల జయదేవ,  సత్య కుమార్, పమిడికాల్వ మధుసూదన్ లతో పాటు నన్ను అక్కడ సంస్థకు గుండె కాయగా భావించే జనరల్ డెస్క్ లో వేసారు. మేము ఇరగబడి పనిచేశాం. మేమంతా ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా బైటికి వచ్చాం. అందరి కన్నా ఎక్కువగా నేను మాత్రమే ఆ సంస్థలో 9.5 సంవత్సరాలు పనిచేశాను. 'ఈనాడు' మొదటి పేజీలో వార్తలు రాసే వాడిని, మంచి శీర్షికలు కూడా పెట్టేవాడిని, పేజీలు  సక్రమంగా పెట్టించే వాడిని అన్న పేరు నాకుంది. అయినా ఒక్క ప్రమోషనైనా లేకుండా తీవ్ర నిరాశతో బైటికి వచ్చాను. అప్పటికే ఉస్మానియా లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జే) చేశాను, జర్నలిజం లో రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.  

'వార్త' పేపర్ వచ్చినప్పుడు మాత్రం ఒక లెటర్ ఇచ్చి నాతో పాటు ఒక పది మందికి 300 రూపాయల చొప్పున జీతం పెంచారు. అప్పటి 'న్యూస్ టుడే' ఎం డీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ సేవ చేసి తరిస్తున్న రమేష్ బాబు అనే సారు వల్ల నాకు ప్రమోషన్ రాలేదని చెప్పేవారు సీనియర్లు. ప్రమోషన్ రావాలంటే 'నేను మీ మనిషినే' అని రమేష్ బాబు గారికి  అర్థమయ్యేలా చేయాలి.... అని సీనియర్లు చెబితే... ఆయన ఛాంబర్లోకి వెళ్లి కూర్చొని ఎలా పొగడాలో తెలియక నానా ఇబ్బంది పడి... ఛీ పాడు బతుకు... జీవితానికి ప్రమోషన్ అంత ముఖ్యమా... అని మనసులో అనుకుని బైటికి వచ్చిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. అప్పటికే మాకు బూదరాజు గారి శిష్యులమన్న ముద్ర ఉంది. దానివల్ల కొంత సమస్య ఉండేది... మా ప్రమేయం లేకుండానే. 'ది హిందూ' లో చేరాక...ఏడేళ్ళలో రెండు ప్రమోషన్లు వచ్చి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయ్యాను. 'మెయిల్ టుడే' లో స్పెషల్ కరస్పాండెంట్ గా కథ ముగించాను. 

ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే... 'ఈనాడు' లో జూనియర్లు చాలా అదృష్ట వంతులని. ఈ రోజుల్లో క్రమం తప్పకుండా ప్రమోషన్లు ఇస్తున్నారు. పనికి గుర్తింపు లేకపోతే ఎలా? 'క్విడ్ ప్రో కో' నో, తాటి మట్టోగానీ 'సాక్షి' పత్రిక రాకపోతే రోజులు ఇంకా మా అప్పటి లాగానే ఉండేవి. లిఫ్టు బాయ్ లతో పత్రిక నడుపుతా అని యాజమాన్యం  కావరంతో విర్రవీగిన పరిస్థితి పోయి, జర్నలిస్టుల బతుకులు బాగు కావడానికి 'సాక్షి' దోహదపడిన వైనం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే అర్థమవుతుంది.          

4 comments:

knmurthy said...

well said

vinod said...

Yes Sakshi ravatam valana Journos ki financial ga chala manchi jarigindi
kapothe vallu pamplate preparation job ne journalist job anukovali..

Kishor said...

"'క్విడ్ ప్రో కో' నో, తాటి మట్టోగానీ 'సాక్షి' పత్రిక రాకపోతే రోజులు ఇంకా మా అప్పటి లాగానే ఉండేవి. లిఫ్టు బాయ్ లతో పత్రిక నడుపుతా అని యాజమాన్యం కావరంతో విర్రవీగిన పరిస్థితి పోయి, జర్నలిస్టుల బతుకులు బాగు కావడానికి 'సాక్షి' దోహదపడిన వైనం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. "
శభాష్!!
( చిన్న కరెక్షన్.. ఆ స్టేట్ మెంట్ లో లిప్టు బాయ్స్ మాత్రమే కాదు. కారు డ్రైవర్లు కూడా లిస్టులో ఉన్నారని వినికిడి.)

Unknown said...

100%true brother..s

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి