1990 ప్రాంతంలో మీడియా చాలా పరిమితంగా ఉండేది. 'ఈనాడు' కు గుండెకాయ అని రామోజీ రావు గారు చెప్పే జనరల్ డెస్క్ లో 1992 లో చేరాను. గిరీష్ సంఘీ గారి 'వార్త' పుట్టుకొచ్చే దాకా మాకు 'ఈనాడు' మాత్రమే గతి. వేరే ఆప్షన్ లేదు. ప్రమోషన్లు గట్రా లేకపోయినా... చాలా బాగా పనిచేసే వాళ్ళం. నెలకు 6400 వచ్చే నన్ను 'వార్త' కు రమ్మని, చీఫ్ సబ్ పోస్టు ఇస్తామని ఒక పెద్ద మనిషి ఒత్తిడి చేసారు. కనీసం పది వేలు ఇవ్వాలని అడిగాను కానీ ఆయన 8500 దాకా వచ్చాడు.
గిరీష్ సంఘీ తన ఫ్యాక్టరీ లో ఉద్యోగులను గూండాలతో కొట్టిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. మనకేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం... తప్పు అనుకున్నదాన్ని ఉన్నపళంగా ఖండించడం... పక్కవాడి సమస్యకు కూడా మనమే గళమెత్తడం అలవాటు. ఎందుకొచ్చిన గొడవలే... అని అక్కడ పనిచేసాను...మా బ్యాచ్మెట్లు అంతా వేరే వృత్తులలోకి వెళ్ళిపోయినా.
జర్నలిజంలో జంపింగ్ లు చేయకుండా...ఒకే సంస్థను నమ్ముకుని ఉండడం వృత్తి ఎదుగుదల రీత్యా తగదని కొందరు జాతీయ స్థాయి జర్నలిస్టులను చూస్తే అర్థమయినా...'ఈనాడు' లాంటి పరమ గొప్ప పత్రికను మనం వదలడం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అనుకునే వాళ్ళం. అలా...కుల-ప్రాంత-వ్యక్తి సంబంధ ద్వేషాలకు బలై ఒక్క ప్రమోషన్ అయినా లేకుండా దాదాపు పదేళ్ళు పనిచేసి 'ది హిందూ' లో చేరాను ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కోర్సు చలవ వల్ల.
కానీ... ఈ రోజుల్లో జర్నలిస్టులను చూస్తే జాలేస్తుంది, భయమేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జంపింగుల మీద జంపింగులు చేస్తున్నారు. భారత దేశంలో రాజకీయ పార్టీల మాదిరిగా తెలుగుదేశంలో టీవీ ఛానెల్స్ తామర తంపరగా పుట్టుకు రావడం ఒక రకంగా వారికి వరమయ్యింది. అందుకే ఒకప్పుడు ప్రింట్ లో ఉన్న జర్నలిస్టులు టీవీ ఛానల్స్ లోకి దూకి... ఒక నాలుగైదు చానల్స్ మారారు... మార్కెట్ వేటలో.
నాకు తెలిసిన ఒక డొక్కశుద్ధి, సరుకున్న జర్నలిస్టు... కాలేజ్ కాగానే ముందుగా.. 'ఈనాడు' లో చేరారు. యాజమాన్య సమస్యతో 'ఆంధ్రప్రభ' కు మారారు. తర్వాత 'వార్త'.. 'అంధ్రభూమి' కవర్ చేసుకుని... 'డెక్కన్ క్రానికల్' ద్వారా ఆంగ్ల జర్నలిజం లోకి అడుగు పెట్టారు. అక్కడి నుంచి 'హిందూ' లో ఒక ప్రయత్నం చేసి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో చేరారు.
అక్కడి నుంచి టీవీ నైన్ ద్వారా ఇడియట్ బాక్స్ జర్నలిజం లో అడుగు పెట్టారు. అక్కడ మంచి స్టోరీలు చేస్తూనే...ఒక బంపర్ ఆఫర్ తో 'సాక్షి' లో చేరారు. వైఎస్ పోయాక... పరిస్థితులు చూసి 'జెమిని' లో చేరి... ఆనక 'సీ వీ ఆర్' సరసన చేరారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక ఛానల్ లో శుభ్రంగా సెటిల్ అయ్యారు. ఈ జంపింగ్ జపాంగ్... మంచిదా కాదా అంటే... దానికి సమాధానం లేదు. ఒక మంచి జర్నలిస్టుకు మీడియా నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళను నిత్య సంచలన శీలురని అనుకుందాము మర్యాద కోసం.
ని.సం.శీ.లు మీడియాలో ఈ మధ్యన ఎక్కువయ్యారు. మా రాజశేఖర్ మాత్రం మరీ ఇలా చేయడం లేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ తర్వాత.. ఈ టీవీ, టీవీ నైన్, ఐ న్యూస్, ఇప్పుడు ఎన్ టీవీ. అయన త్వరలో హెచ్ ఎం టీవీ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. బిజినెస్ సూత్రాలు చేతిలో పట్టుకుని.... బుర్ర నిండా పదునైన ఆలోచనలతో ఉండే ఇలాంటి మిత్రులకు పర్వాలేదు కానీ... సాధారణ జర్నలిస్టులకు మాత్రం ఇది మంచికన్నా చేటే చేస్తుంది. జర్నలిజం లోకి వచ్చి.... సిగ్గూ, ఎగ్గూ లేకుండా...అబద్ధాలు చెప్పైనా బతకాలని అనుకోవడం మంచిదా కాదా అనేది వ్యక్తిగతమైన విషయం కదా! అబద్ధాలే పరమావధిగా బతకడం...యాజమాన్యాలకు తప్పుడు సలహాలు ఇచ్చి బూతును ప్రోత్సహించడం...పాపం... పొట్ట కూటి కోసం వారి చేతగానితనం.
జర్నలిస్టుల జీవితాల్లో మరీ అంత అనిశ్చితి మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇలా అనిశ్చితి ఉంటే... చేతిలో గొట్టం ఉన్నప్పుడే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలన్న ధోరణి ప్రబలుతుంది. ఈ వెర్రి ఆలోచనతో జర్నలిజం మరింత పలచన అవుతుంది. వృత్తి విలువలు మంట గలుస్తాయి.
5 comments:
పైస్థాయి లో సరేనండి
క్రిందస్తాయిలో రిపోర్టర్ల పరిస్థితి మరీ అధ్వాన్నం. యాడ్లు సేకరించే పనే ప్రధానమైపోయింది. వయస్సంతా వీళ్లకు గొడ్డుచాకిరీ చేసినా భవిష్యత్తు లేదని అర్థమవుతుండటంతో కొత్తగా వ్యక్తిత్వం ఉన్నవాల్లు రావటం తగ్గుతున్నది. ఆస్తానంలో కులమతాలనైనా అడ్దం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి పొట్టపోసుకునే బాచ్ లు దిగుతున్నాయి ఈ రంగంలోకి. రాబోయే రోజులలో ఇది ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుంది సమాజానికి
ఇలా ఉద్యోగాలు మారటం సరే! మారుతూ మారుతూ ఉన్న ప్రజ్ఞకు, భాషకు కాస్తయినా పదును పెట్టుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారంటారు? ముఖ్య్మగా ఎలక్ట్రానిక్ మీడియాలో భాష పట్ల ఏ మాత్రం పట్టింపు లేదు. అవగాహన అంతకంటే లేదు. ప్రతి ఒక్క న్యూస్ యాంకరూ "లక్ష వత్తుల నోము" పట్టాల్సిన వాళ్ళే! ఒక్క ఒత్తు పలకదు. ఉన్నవాటికి తీసేస్తారు, లేని వాటికి తగిలిస్తుంటారు.
భాద, ఘ్రందాలయం, విఝావాడ (విజయవాడ), ఇలా ... చెప్పుకుంటూ పోతే కోట్ల పదాలు! ఇక సమైఖ్యాంద్ర అన్న పదం అదే సరైనదిగా నిఘంటువులో సైతం ఎక్కుతుందేమో అని భయమేస్తోంది!
కనీసం స్క్రోలింగ్ లో వచ్చే వార్తల్లో సైతం జాగ్రత్తలు తీసుకోరు. అన్నీ బూతులే, అక్షర దోషాలే!
ఎడిటర్లకు, ఫీడ్ బాక్ ఈ మెయిల్ ఐడీలకు ఎన్ని మెయిల్స్ రాసినా ప్రయోజనం లేదు! అయినా సరే, అసలు రాయక పోతే ఆ తప్పులే ఒప్పులనేసుకుని అలాగే కంటిన్యూ అవుతారేమో అని నేనైతే రాస్తూనే ఉంటాను.
మీరు జర్నలిస్టుల ఉద్యోగ విషయాలు యూనియన్ కబుర్లు కాకుండా ఇలాటి విషయాల మీద కూడా రాస్తే బాగుంటుంది రాము గారూ!
@Sujata
లక్ష వత్తుల నోము" పట్టాల్సిన వాళ్ళే excellent pun.
nice blog
- BSN Moorty
no..raja will not joins hm ..if it happens only before elections afterwards..no significant effect in news dais ..so..if the news if real..he will otherwise it will remains as gossip only..the new gossip is hm is going to recruit mr. sivaramprasad as Chief..as he is not corrupted,well mannered person..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి