జనాభిమానం ప్రాతిపదికన నడిచే రెండు కీలక రంగాలైన రాజకీయాలు, సినిమాల్లో దురదృష్టవశాత్తూ ఒక ట్రెండ్ నడుస్తోంది. పాలిటిక్స్, ఫిలిమ్స్ లో స్థిరపడిన నాయకులు, నటుల సంతానం- ముఖ్యంగా మగ పిల్లలు- వారసత్వంగా ఆ రంగాల్లోకి దిగిపోతున్నారు. వారి విజయం కోసమే అన్నట్లు, వారు మినహా మరొకరు లేనట్లు రెండు రంగాలూ ప్రవర్తించడంతో ప్రతిభ ఖూనీ అవుతోంది. అయ్యలకు ఉన్న పలుకుబడి కారణంగా వ్యవస్థ పూర్తిగా వారి పిల్లలకు సహకరించి పెంచి, పోషించి, పెద్దచేస్తున్నది. ఆరంభంలో వైఫల్యాలను తట్టుకునే మెత్తని కుషన్, విజయాలు సాధించి నిలదొక్కుకునేదాకా కొనసాగే ఛాన్స్ ఈ అయ్య చాటు బిడ్డలకు బాగా ఉంటుంది. ఈ క్రమంలో వారు ప్రతిభను మెరుగులు దిద్దుకుని రాటుదేలటం పెద్దకష్టం కాదు. ఇలా స్టార్ డం సాధించిన వారసులు పట్టు బిగించేందుకు వారి "స్వయం కృషి" తో పాటు వారి కుటుంబాలు చాలా సహాయపడతాయి. ఈ క్రమంలో, బైటి (అంటే... ఈ కుటుంబాలకు చెందని) వారు ఈ రంగాలలోకి రావడానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. అట్లాగని వారికి ప్రతిభ లేదని కాదు గానీ, ఈ యువ నేతలు, నటులతో పోటీపడి నిలబడడం, సత్తా చూపడం మామూలు విషయం కాదు! అది దాదాపుగా సంభవమైన విషయం.
ఇట్లా....వారసత్వాలను కాదని సొంత ప్రతిభతో ప్రయత్నాలు ఆరంభించి, ఆటుపోట్లను ఎదుర్కుకి, తమదైన రోజు కోసం ఓపిగ్గా ఎదురుచూసి దూసుకొచ్చిన ఇద్దరు నవీన్ లు ఎంతైనా ప్రశంశనీయులు, స్ఫూర్తిప్రదాతలు. వారు 'జాతి రత్నాలు' సినిమా తో దడలాడించిన నవీన్ పోలిశెట్టి, పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ బరిలో గడగడలాడించిన చింతపండు నవీన్.
సినిమా మీద మక్కువతో... కుటుంబం నుంచి పెద్దగా సహకారం లేకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా రంగస్థలాన్ని నమ్ముకుని 1500 ఆడిషన్స్ చేసి తాజా రెండు సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న న.పొ. గురించి ఎంత చెప్పినా తక్కువే. వారసత్వ నటులు ఒక్కరికైనా రంగస్థలం గురించి తెలిసే అవకాశం లేదు. గోల్డెన్ స్పూన్, రెడ్ కార్పెట్ వారికి ఉంటాయి. పైగా ఇక్కడ వైఫల్యం పొందినా పోయేదేమీ లేదు బాబు గార్లకు. దానికి భిన్నంగా... నవీన్ ముంబయి లో ఉంటూ నానా కష్టాలు పడుతూ ఏదో సాధిస్తానన్న నమ్మకంతో పుష్కర కాలంగా చేసిన ప్రయత్నాలు, ఓర్చుకున్న త్యాగాలు, భరించిన అవమానాలు సమాజానికి-- ముఖ్యంగా పేద, మధ్య తరగతి యువతకు-- ఎంతో ఉత్తేజం కలిగిస్తాయి. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలు మూడింటిలో మన నట పుత్రరత్నాలకు లేని అద్భుతమైన పట్టు నవీన్ కు ఉంది. అంతకన్నా ముఖ్యంగా... ఏటికి ఎదురు ఇదే ఓపిక, సత్తా ఉన్న నిజమైన యోధుడు తను. ఎంతో కష్టపడి పైకి వచ్చిన మరో... స్టార్ ఫామిలీ కి చెందని విజయ్ దేవరకొండ బాధ్యతగా భావించి నవీన్ సినిమాకు ఇతోధికంగా తోడ్పాడు అందించడం ఆనందదాయకం. ప్రభాస్ కూడా చేయూతనివ్వడం ముదావహం. కాళ్ళు అడ్డం పెట్టకుండా, స్టార్ల కుటుంబాల సేవతో పాటు నవీన్ లాంటి నటులను, గెటప్ శీను లాంటి ఆర్టిస్టులను కూడా పెద్ద నిర్మాతలు, దర్శకులు నమ్మకంతో పరిగణనలోకి తీసుకుని అవకాశాలు ఇవ్వడం మంచిది. ఎందుకంటే... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము కదా!
తీన్మార్ మల్లన్న గా తెలుగు లోకానికి పరిచితమైన చింతపండు నవీన్ కుమార్ తెలంగాణా ముద్దుబిడ్డ. కారణాలు ఏవైనా... సాఫ్ట్ జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులకు భిన్నంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక కీలక అంశాలపై నవీన్ గళం ఎత్తాడు, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తనదైన ముద్రవేసాడు. పత్రికల, టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు ప్రభుత్వాలకు జీ హుజూర్ అనేక తప్పని పరిస్థితుల్లో మల్లన్న యూ ట్యూబ్ ఛానెల్ లో తనదైన ముద్ర వేసాడు. ఇది ప్రాణాలకు తెగించి చేస్తున్న సాహసం. మరొక పింగళి దశరథ రామ్ కనిపించాడన్న మన్నన మల్లన్నకు దక్కింది. శిక్షణ పొందిన జర్నలిస్టుగా, వృత్తిలో నలిగిన ప్రొఫెషనల్ గా తెలంగాణా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద తను వేస్తున్న విసుర్లలో భాష పట్ల కొందరికి అభ్యంతరం ఉండవచ్చు. కానీ ఆ పదాలే, ఆ వ్యంగ్యాస్త్రాలే జనాలలోకి పోతున్నాయని భావిస్తున్న మల్లన్న అంచనా సత్యం. నిజం చెప్పాలంటే... మల్లన్న కే సీ ఆర్ ఫార్ములాను కాపీ చేస్తున్నారు. ఆంధ్ర పాలకులంటూ అప్పటి నాయకులపై మాటల మాంత్రికుడిగా పేరుపొందిన ఆయన వాడిన భాష ఇప్పటి మల్లన్న భాషకు భిన్నంగా ఉండేది కాదు. అంటే... తెలంగాణా ప్రజలను... ముల్లుతో పొడిచినట్లు ఉండే భాష ఆకట్టుకుంటుందన్న నిరూపితమైన సూత్రాన్ని మల్లన్న వాడుకోకూడదని అనడం భావ్యమా? మహామహులు నిలిచిన బరిలో మల్లన్న అధికార పార్టీ అభ్యర్థికి దీటైన పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు. తన ఒకప్పటి గురుతుల్యుడు ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని మించి మల్లన్నకు ఓట్లు పోలయ్యాయి. నిజానికి నైతిక విజయం సాధించాడు ఈ సామాన్యుడు.
జీవితాలను ఫణంగా పెట్టి ఇద్దరు నవీన్లు చేస్తున్న పోరాటం అల్లాటప్పా పోరాటం కాదు. అది వారి లాంటి ఆర్ధిక, సామాజిక నేపథ్యం కలిగిన కోట్లమందిలో ఉత్తేజం నింపుతుంది. మనవల్ల కాదులే అనుకున్న నిరాశావాదులను మేల్కొల్పి కార్యోర్ముఖులను చేస్తుంది. అయ్య చాటు నేతలు, నటులు ఇలాంటి నవీన్ లను ఆదరించి అక్కున చేర్చుకోవడం సభ్యత, సంస్కారం. మన వల్ల కాదులే... అక్కడ సొరచేపలు ఉన్నాయని మిన్నకున్న వారిలో ఉత్తేజం నింపాలంటే...అయ్య చాటు నేతలు, నటులు ఇద్దరు నవీన్ లు ఇప్పుడు సాధించిన విజయాలను అభినందిస్తూ పత్రికా ప్రకటనలు చేయాలి. వారిని చూసి కుళ్ళి పోకుండా సామాజిక మాధ్యమాల్లో వారిని బహిరంగంగా పొగడాలి. అది తక్షణావసరం. "వెల్ డన్ మల్లన్నా...." అని కే టీ ఆర్, "సూపర్ ఫిల్మ్" అని రామ్ చరణ్ తేజో, జూ ఎంటీయారో అనడం తప్పు కాదు. ఏమంటారు!
1 comments:
You should not ever compare Cinema Actors/
Actresses with people who dedicate their life for Common People. Most of the movie Actors and Actresses do it purely for money, and most of them do not have any ethics. Most of these cinema Actors and Actresses do not spend even a minute for Common People. You disrespected Mallanna by comparing with Cinema Actor Naveen. You should delete this post. Mallanna dedicate his life for common people. Do not ever compare Movie personalities with people like Mallanna.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి