Monday, September 5, 2011

మా మంచి గురువర్యా...అయ్యా బూద...రాజా...

September 5, 2011
సోమవారం
డియర్ సర్...నమస్తే...  
అంతా టీచర్స్ డే జరుపుకుంటుంటే...మీరు గుర్తుకు వస్తున్నారు...పొద్దటి నుంచీ. సొర్గంలో ఒక చీమచెట్టు కింద ఒక బల్ల ముందు కుర్చీ వేసుకుని...భూతద్దాల కళ్ళజోడు సాయంతో ఏదో పదకోశమో, మీ సమకాలీనులు ఎవ్వరూ సాహసం చేయని ఏదో ప్రాజెక్టుతో బిజీ గా వున్నారని భావిస్తున్నాను. మధ్య మధ్యలో ఎవడ్నో బూతులు దోకుతున్నా...ఆపి ఇది కాస్త చదవండి సార్. ఇంకా పొద్దు పోలేదు కాదు కాబట్టి, నేను పెద్ద పండితుణ్ణి గానీ, భాషా సామర్ధ్యం ఉన్నవాడిని గానీ కాదు కాబట్టి పోనీలే  వెధవ అని వదిలేస్తారని అనుకుని తెలిసిన తెలుగులో నాలుగు ముక్కలు రాస్తున్నా. బుర్ర తక్కువ 'కంత్రిబ్యూటార్ గాళ్ళ'లో నేనూ ఒకడ్ని. తప్పులుంటే క్షమించండి. 

  ఒక తొమ్మిది నెలల పాటు మీ శిష్యరికం చేసినందుకు...కాస్త లోకజ్ఞానం అబ్బడం సంగతి అలా ఉంచితే...మీ దగ్గర చదువుకున్నందుకు...' మీరు అదృష్టవంతులు' అని నేను మంచి ఎథికల్ ఎడిటర్ గా మొన్నీ మధ్య దాకా అనుకున్న ఒకాయన అంటే...మనసు ఉప్పొంగింది. అబద్ధాల ఇటుకలు పేర్చి, కుళ్ళు-రాజకీయం రంగరించి కెరీర్ బిల్డింగులు కట్టుకుంటున్న తుక్కు జర్నలిస్టులు కూడా మీ పేరు చెప్పగానీ...కొద్దిగా భక్తి తో మాట్లాడతారు. అది మరి మీ స్పెషాలిటీ. గురూజీ...మీరు దాన్ని ఒక సిలబస్ గా పెట్టలేదు కానీ....ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మా అందరికీ నేర్పారు. శిష్యుల దగ్గర ఏదీ దాయకుండా...జీవితపు సారాన్ని రంగరించి భలే చెప్పేవారు. మీ మాటల విరుపులు, కళ్ళల్లో ఆ మెరుపులు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తాయి. దగ్గరుండి మీరు చెప్పిన అనువాదపు పాఠాలు...మధ్యాన్నపు అన్నపు బడలికను భలే పారదోలేవి. 

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు," అని జర్నలిజం స్కూలు ఆవరణలో సిగరెట్ కాలుస్తూ మీరు ఆలవోకగా అన్నమాట మాకు షాకిచ్చింది. మీరు ఏ మాటకు ఆ మాటే.    సినారె ను తిట్టకుండా మీకు రోజు వెళ్ళేది కాదు గదా. తర్కం అనే కత్తితో, వ్యంగ్యం అనే రంపంతో ఆయన్ను మీరు ఛీల్చినా అది మాకు తిట్టినట్లు మొట్టినట్లు అనిపించేది కాదు.  నోటి దురుసుతనం వల్ల మీకు అవార్డులు, పెద్ద పదవులు రాలేదని అంటున్నారు. బైటికి మంచిగా కనిపిస్తూ...లోకానికి నీతిమంతులని కలరిస్తూ...లోపల విషపు కుట్రలు చేసే సంపాదకుల కన్నా...ఏ అవార్డు రాకపోయినా మీరే బంగారం.
ఉద్యోగంలో చేరిన తర్వాత...కొందరు సీనియర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు డెస్క్ కు వచ్చి...పక్కకు తీసుకుపోయి మీరు నాకు చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికీ గుర్తే సార్. మీ సహృదయత నాకు నేర్పిన పాఠం ఇప్పుడు సెంట్రల్ యూనివెర్సిటీ లో ఎందరో నా శిష్యులకు మేలు చేస్తోంది. ఈ విషయంలో మీ నుంచి నేర్చుకున్న లక్షణం వల్ల ఇప్పుడు నా స్టూడెంట్స్ సెటిల్ అయ్యే దాకా నేను సహకరించకుండా ఉండలేక పోతున్నా. నా శిక్షణలో రాటు దేలి ఉద్యోగం పొందాక...వారు చేసే మొదటి ఫోను అందుకున్నప్పుడు మీరు అప్రయత్నంగా నాకు గుర్తుకు వస్తారు.

కంట్రిబ్యూటర్లు అంటే మీకున్న కోపం వల్ల నేను మిగిలిన కొందరిలా మీకు దగ్గర కాలేక పోయాను. మూడు నెల్ల పరీక్షలో నా ఆన్సర్ షీట్ మీద 'ప్రాణం లేచి వచ్చింది...తెలుగంటే ఇలా ఉండాలి...' అని మీరు చేసిన రిమార్కు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ వ్యాఖ్య ఇచ్చిన కిక్కు అలాంటి ఇలాంటిది కాదు సార్. మీరు నేర్పిన ముక్కుసూటి తనం వల్ల కావచ్చు సార్...మిత్రులు చాలా మంది పెద్దగా ఎదగలేక పోయారు. మీ శిష్యులని ముద్ర పడిన పాపానికి కొదరికి శిక్ష పడింది. ఏంటో సార్...ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్. 

పట్టాల ప్రధానోత్సవం రోజు..."నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి ' అని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి గురజాడ ను ఉటంకించి ప్రసంగం ముగించారు. మీ పేరు తలవకుండా మేము ఎప్పుడూ ఉండలేము సార్..ఇక ఉంటా... మీకు టీచర్స్ డే గ్రీటింగ్స్. 

అన్నట్టు మరిచి పోయాను సార్. మీరు క్షమించాలి. మీ గుర్తుగా యేవో ప్రోగ్రామ్స్ చేయాలని మీ శిష్యులందరం చాలా సార్లు అనుకున్నాం. నేనూ చాలా అనుకున్నా. మీటింగ్ లో చాలా కోతలు కోసాం. మీ చితి సాక్షిగా మేము వాయు వేగంతో ఒక పత్రిక తెచ్చాం. అది చూసి మేము మీ కోసం ఇంకా ఏదో అద్భుతం చేస్తామని పిచ్చి జనం భావించారు. సారీ సార్...మేము వృత్తిలో బిజీ. సంసార సాగరంలో, డబ్బు సంపాదనలో చాలాబిజీగా వున్నాం...మాకు తీరిక దొరికినప్పుడు...అవి చేస్తే చేస్తాం. మీరు మాత్రం మరోలా అనుకోకండి. 

మీ శిష్య పరమాణువు
రాము

4 comments:

Sasidhar said...

రామూ గారు,
"గురుపూజోత్సవ" శుభ సంధర్భంలో బూదరాజుగారి మీద మీరు రాసిన పోస్ట్ చాలా బాగుంది. నా చదువంతా ఒక ఎత్తు, బూదరాజు గారి దగ్గర జర్నలిజంలో 6 నెలలపాటు దిద్దుకున్న అక్షరాలు ఒక ఎత్తు. నిజంగా ఆయన ప్ర్రాత: స్మరణీయుడు.
పెద్దాయనకు మరోసారి తలవంచి నమస్కరిస్తూ,
"సర్ , మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు."

అలాగే, రామూగారు - మీకు కూడా Happy Teachers Day!

~శశిధర్ సంగరాజు

www.sasidharsangaraju.blogspot.com

durgeswara said...

మీ గురు భక్తికి జోహారులు.
చాలా బాగా వ్రాశారు వారిగూర్చి .

jeevani said...

అన్నయ్యా బూదరాజు గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ మహానుభావుడి పాఠాలు విన్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని.

Rajendra Devarapalli said...

మాష్టారిది మంచి డెప్తు,క్లారిటీ ఉన్న ఫొటో సంపాదించండి.నా దగ్గర గ్రూపుఫోటో తప్ప ఆయంది సింగిల్ ఫొటో లేదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి