Sunday, January 1, 2012

మిత్రులారా....మీకు...నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కాలచక్రం వేగం బాగా ఎక్కువయ్యింది. జీవితం మూడు ఆనందాలు, ఆరు విషాదాలు అనుభవించేసరికి...మీకిది చాలు...అని కొత్త ఏడాది దూకుతూ వస్తుంది. ఆశాజీవులం కాబట్టి...గతంగతః అనుకుని కొత్త తెల్ల పేజీ తిప్పి కొత్త ఏడాది ఆరంభిస్తాం. కొత్త తీర్మానాలు మహా అయితే ఒక వారం పది రోజులు ఆచరణకు నోచుకుంటాయి. పుటకతో వచ్చి పుటుక్కుమన్నాక గానీ పోని కొన్ని బుద్ధులు మళ్ళీ ముందుకు వస్తాయి. ఈ సారీ...అందరిలా నేనూ కొత్త సంవత్సరం జరుపుకున్నాను. ఈ ఫస్టు తారీఖు బోనస్ గా నా బర్త్ డే కూడా తెస్తుంది కాబట్టి...ఇదొక స్పెషల్ డే అవుతుంది. 




పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గరి నుంచి...నిన్నటి వరకూ పాత ఏడాది లాస్టు రోజున  సింహావలోకనం చేసుకోవడం, కొత్త తీర్మానాలు రాసుకోవడం మనసుకు అలవాటయ్యింది. ప్రతి సారి తీర్మానాల జాబితాలో రెండు తీర్మానాలు కచ్చితంగా ఉంటాయి. చచ్చినా అబద్ధం చెప్పకపోవడం అందులో మొదటిది. ది హిందూ పేపర్ రోజూ ఆసాంతం చదవడం రెండోది. కిందటి ఏడాది మొదటి పని నూటికి 98 శాతం చేయగలిగాను కానీ...రెండో పని పావు సగమైనా చేయలేక పోయాను. అనుభవ పూర్వకంగా అర్థమయిన దాన్ని బట్టి...నిజాలు చెప్పడాన్ని తగ్గించి, ది హిందూ చదవడం పెంచితే మంచిదని అనిపిస్తుంది. చూద్దాం. 


ఏ మాటకు ఆ మాటే. గడిచిన ఏడాది ఒక మధురమైన అనుభూతి మిగిల్చింది. అనుకున్న పనులన్నీ చేయగలిగాం. పిల్లల కోసం పెట్టిన టేబుల్ టెన్నిస్ అకాడమీ ఏడాదిలో మంచి ఫలితాలు అందించింది. అందుకు కోచ్ సోమనాథ్ (కింది ఫోటో) కృషిని అభినందించాలి. ఫిదేల్ బాగా కృషి చేసి క్యాడెట్ కాటగిరీ లో ఇండియా నంబర్-4 అయ్యాడు. అది మా అందరికీ ఘన విజయం. అకాడమీ లో ఇంకో అమ్మాయి శ్రీజ కూడా ఇండియా టాప్ ఫైవ్ లో ఉంది. కొత్త ఏడాది ఇంకా క్రమశిక్షణతో కృషి చేస్తే ఇంకా బాగా చేయవచ్చు. ఈ ఏడాది హై లైట్ ఒకటి ఉంది. టీ.టీ. ఆడడం ఆరంభించిన మూడు నెలల్లోనే నా కూతురు మైత్రేయి మూడు ప్రైజులు పొందింది. జనవరి రెండో వారంలో గుజరాత్ లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొన బోతున్నది. ఇది ఒక గర్వకారణమైన విషయం. 


నిన్న అర్థ రాత్రి సోమ్నాథ్ ఆధ్వర్యంలో పిల్లలు కేక్ తెచ్చి బర్త్ డే జరపడం ఒక అనుభూతిని ఇచ్చింది. అర్థ రాత్రి తీసిన ఫోటో పైన చూడవచ్చు. నా డిగ్రీ క్లాస్ మేట్ మనోరంజిత ఫోన్ కాల్ తో రోజు ఆరంభమయ్యింది. హేమ చేసిన పులిహోర, దద్దోజనం, బియ్యపు పరవన్నం ఎంతో రుచికరంగా అనిపించాయి. నా దగ్గర జర్నలిజం చదువుకున్న పిల్లలు అనేక మంది మెసేజులు పంపారు, ఫోన్ చేసారు. నేను అప్పట్లో కెమరామ్యాన్ గా నియమించిన ఒకతను ఫోన్ చేసి...తన కొడుక్కి నా పేరు పెట్టుకున్నానని చెబితే ఎబ్బెట్టుగా అనిపించింది. 'మీ లాగా బాగా చదవాలని మీ పేరు పెట్టాను సార్...' అని చెబితే...నా కూతురు...ఒక జోకు పేల్చింది. 'నీ లాగా పీ.హెచ్.డీ. ఏళ్ళ తరబడి చేస్తాడేమో వాడు కూడా....' అని. అది గుండెకు తెగిలింది. ఇంకో పది రోజుల్లో థీసిస్ సమర్పణ అయిపోతే గానీ...ఈ విమర్శలకు తెరపడదు, మనకు తీరిక దొరకదు. అపుడు చూస్తాం అసలు కథ. 


ఈ రోజు జర్నలిస్టు మిత్రులు పలువురు ఫోన్ చేసారు. బ్లాగ్ రోజూ అప్డేట్ చేయమని అడిగారు. పీ.హెచ్.డీ.పని ముగిసింది కాబట్టి రోజూ అప్డేట్స్ త్వరలోనే ఆరంభిస్తానని మనవి చేసుకుంటూ...మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.  

5 comments:

Unknown said...

మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Sasidhar said...

Ramu garu

Wish You & Your
Family A Very Happy & Prosperous
New Year

~Sasidhar
www.sasidharsangaraju.blogspot.com

Raja said...

Wish you many more happy returns ramu garu..

wish this 2012 be a very fruitful for Fidel and Maitreyi..

Raja

Ravi said...

WISH YOU VERY HAPPY NEW YEAR RAMU Gaaru....

Sasidhar said...

Ramu garu,

Belated Happy Birthday

~Sasidhar

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి