Sunday, January 29, 2012

...ఓ ఐదేళ్లు క్రికెట్ ను భారత్ లో నిషేధిస్తే సరి...

గత రెండు రోజులుగా పత్రికలు, టెలివిజన్ ఛానల్స్ చూస్తే...ఏదో సునామీ వచ్చి దేశాన్ని ముంచెత్తినట్లు, జరగరాని పరమఘోరమేదో జరిగినట్లు అనిపిస్తున్నది. జాతి యావత్తూ కోల్పోకూడనిదేదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. కొందరికి నిజంగానే ఆ ఫీలింగ్ ఉంటే....మీడియా వాళ్ల అత్యుత్సాహం వల్ల ఇంకొందరికి ఆ జబ్బు సోకుతున్నది. ఇవ్వాళ దేశం మొత్తం విషాద సాగరంలో మునిగి ఉంది.

క్రీడాభిమానులు ఇదేదో జాతీయ సమస్య అయినట్టు చర్చించుకుంటున్నారు. పరిస్థితిని బాగుచేయడానికి ఏమి చేయాలన్నదానిపై ఎవడికి తోచింది వాడు సలహాగా ఇచ్చి పారేస్తున్నాడు. చిన్న పిల్లల నుంచి తాతయ్యల వరకూ అంతా విశ్లేషణలతో బిజీగా ఉన్నారు. ఆడ స్త్రీలు, మగ పురుషులు, పిల్లాపాపా, గొడ్డూగోదా అంతా ఈ విషాదంతో ఉన్నారు. గుంపులో గోవిందా మాదిరిగా ఈ విషాదంలో పాలుపంచుకోని వాడు అసలు భారతీయుడిగా చెలామణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 

ఛీ...ఛీ...ఇలా జరగడానికి వీల్లేదు...దరిద్రులు దేశం పరువు తీశారు...వాణిజ్య ప్రకటనల పిచ్చిలో పడి చెడ దొబ్బారు...వంటి వ్యాఖ్యలు జోరుగా వినవస్తున్నాయి. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ వీరులు కుదేలై వైట్ వాష్ కు గురికావడం ఇంత చర్చకు కారణం.

దేశాన్ని పతనం చేస్తున్న ఏ అంశాల గురించీ, అవినీతి గురించి అస్సలే పట్టని వారంతా క్రికెట్ దగ్గరకు వచ్చేసరికి పరమ వీర దేశభక్తులై పోతున్నారు. సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం కళ్లు, పళ్లు, ఒళ్లు కాయలుకాచేలా చూసే జనం ఎంతమంది లేరు? నా పీహెచ్ డీ, సచిన్ టెండూల్కర్ ఒకేలా ఉన్నాయి. అవి ఎంతకూ తెగని ముడిపడని వ్యవహారాలు. అసలు క్రికెట్ తోనే ఛస్తుంటే...తగదునమ్మా...అని సినీస్టార్లు వారితో పాటు హీరోయిన్లు ఊపుకుంటూ క్రికెట్ మైదానంలోకి దూకుతున్నారు. వారిని చూడటానికి కూడా వెర్రిజనం ఎగబడుతున్నారు. ఛానళ్ల వారు, ముఖ్యంగా టీవీ నైన్ వాడు, గత కొన్ని రోజులుగా ఈ తెలుగు వారియర్స్ ను ఎత్తడంతోనే కాలక్షేపం చేస్తున్నాడు.

అసలు...ఆటలన్న తర్వాత ఓడిపోరా? అయినా...భారత క్రికెటర్లకు ఓటమి ఇదేమైనా మొదటి సారా? దీని మీద అటు జనం, ఇటు మీడియా గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఉందా? ఏమో నామటుకునైతే...ఇదొక వ్యర్ధ వ్యవహారం అనిపిస్తున్నది. దీని బదులు...జనం క్రికెట్ పిచ్చిని వదులుకుని అన్ని ఆటల పట్లా ఆసక్తి కనబరిస్తే బాగుంటుంది. మనం, అంటే క్రీడాభిమానులం, ఎక్కువగా క్రికెట్ కు ప్రాధాన్యమివ్వడం వల్ల...మీడియా కూడా దానికే పెద్దపీట వేస్తున్నది. ఈ క్రికెట్ పిచ్చిలో పడి మిగిలిన ఆటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే...అన్ని అంతర్జాతీయ పోటీలలో పతకాల పట్టికలలో మనం వెనుకబడి ఉంటున్నాం. 

మన క్రికెటర్లు క్రమం తప్పకుండా దేశాన్ని విషాదసాగరంలో ముంచుతున్నారు. ఆ మాటకొస్తే ఏ క్రికెట్ జట్టూ ఎప్పుడూ విజయాలను నమోదు చేయలేదు. క్రికెట్ జట్టు ఓడిపోతే...ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ తదితర దేశాల్లో జనం కూడా మనలాగానే కుళ్లి కుళ్లి ఏడిచ్చస్తున్నారా అన్నది పరిశోధించాల్సిన అంశం. ఈ ఏడుపులు పెడబొబ్బలు మాని ఒక ఐదేళ్ల పాటు క్రికెట్ ను నిషేధిస్తే భారత దేశానికి పలు రకాలుగా ఎంతో మేలు జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తున్నది. ఇంతకన్నా ఉత్తమమైన ఆలోచన వస్తే నాతో పంచుకోండి.

16 comments:

Anonymous said...

" చిన్న పిల్లల నుంచి తాతయ్యల వరకూ అంతా విశ్లేషణలతో బిజీగా ఉన్నారు"-- ఇప్పుడు, మరి వాటికి తోడుగా ఈ " టపా " ఎందుకో....?

Ramu S said...

ఈ టపా మీకు విశ్లేషణగా అనిపిస్తున్నదా...బాబాయ్ గారూ...
ఇక ఈ దేశాన్ని బాగుచేయడం నా వల్ల కాదు బాబోయ్
రాము

Saahitya Abhimaani said...

There is one positive solution.

We should start playing Cricket only with Bhutan, Nepal, Kenya, Holland.

We should also start teaching this game to some other countries like Spain, Portugal, Brazil, Argentina etc. and play with them only till we stop winning. Then again start teaching the game to new countries like Greenland, Monaco, Vatican City, Macao, Mauritius, Maldives etc. And, the game goes on forever like that.

When countries do not have India to defeat, they too lose interest in Cricket and stop maintaining a team. Then we can pounce upon them and challenge for a match and defeat them.

Saahitya Abhimaani said...

బాబాయ్----బాబోయ్ Good rhyme, just like Eenadu Headline.

Anonymous said...

దేశాన్ని బాగుచేయడం మన చేతుల్లో ఎలాగూ లేదు. అందుకే అప్పుడప్పుడు " బాబాయిలు", బాధ భరించలేక వ్రాస్తూంటారు..
శివ గారూ.. ఎంతైనా రామూ జర్నలిస్టే కదా! అందుకే మరి ఆ "పంచ్" లు...

Ramu S said...

నన్ను జర్నలిస్టు అని మీరన్నారంటే...మీకు నా మీద ఎంత కోపం ఉందో అర్ధమైంది. పై వ్యాసంలో జర్నలిస్టుకు నేనిచ్చిన నిర్వచనం నేపథ్యంలోనే కదా ఇలా అంటున్నారు. కానివ్వండి బాబాయ్ గారూ....పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. అయినా మీ లాంటి పెద్దవాళ్లు తిట్టినా దీవెనల కిందే లెక్క.
రాము

చాణక్య said...

జనం ఏది చూస్తారో మీడియా అదే చూపిస్తుంది. మీకు చిరాకు కలిగినంత మాత్రాన క్రికెట్‌ని నిషేధించాలి, సినిమా దియేటర్లు మూసెయ్యాలి, ప్రభుత్వాన్ని రద్దు చెయ్యాలి అని స్టేట్‌మెంట్లు ఇవ్వడం మీలాంటి సీనియర్ పాత్రికేయులకి సరికాదేమో అని నా అభిప్రాయం. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. క్రికెట్ చూసేవాళ్లున్నప్పుడు చూపించి సొమ్ము చేసుకోవడమే వ్యాపారసూత్రం. ఏదో బ్యాడ్ మూడ్‌లో ఈ పోస్ట్ రాశారేమో అని నా సందేహం.

Ramu S said...

జనం చూసేదే మీడియా చూపిస్తున్నది కరెక్టు కాదు సార్. ఒకవేళ నా అభిప్రాయం తప్పనుకున్నా...మనోళ్లు ఓడిపోతే గుండెలు పగిలేలా ఏడిచ్చావటం నాకు నచ్చడం లేదు. జాతి మొత్తం విషాదంలో మునిగిపోవడమేమిటి?
రాము

Saahitya Abhimaani said...

@CHAAnAKYA

ప్రజలు పోర్నోగ్రఫీ కావాలన్నా చూపిస్తారన్న మాట మీ "మీడియాలో". బాగు! బాగు!!

katta jayaprakash said...

It is true that the media has been treating the humiliatingng defeat of Indian cricket in the hands England and Australia as a national disaster.It looks the corporate sector is in big loss as the people might not accept the ads of the cricket players.
JP.

evadaite enti said...

you r right mr.ram..Cricket is afteral a game..wining and losing is a part of game..no need of this much of hadavudi..but media is en cashing the things..I dont agree that media is focusing what people want..people are forced to watch what the media is showing.. that's Al..It is in the helusination that people r always show interest on some issues.and if they broadcost them TRPS will rise..but they dont know that TRPS are rised for some other reason, not just because of their manipulated programs

I, me, myself said...

i atleast have respect for cricket & to some extent Tennis as the respective boards and players are not living on others money (tax payers). You asked for a sollution here it is:
Privatise all the sports bodies let them market their sports and you will see the results.

and as far as cricket goes(other sports as well) with more than 1 billion population we should market domestic cricket/sports like in the USA.

చాణక్య said...

శివరామప్రసాదు గారు,

మా 'మీడియాలో' కాదు. నాకు, మీడియాకు సంబంధం లేదు. మన్నించండి.

♛ ప్రిన్స్ ♛ said...

గురువు గారు మీ పోస్ట్ కి దీనికి సంబధం ఉందో లేదో తెలియదు నా అభిప్రాయం చెప్పుతున్నాను నాకు తెలిసి క్రికెట్ కన్నా ఈ న్యూ చానెల్స్ స్టాప్ చేస్తే బాగుంటది.. వాళ్ళకి న్యూస్ కావాలి మీరు ఒక మంచి పని చేస్తా అని చెప్పండి ఒక్క మీడియా రాదు కానీ అదే ఎవరినో తిట్టండి Q కడుతారు ఇవాల దేశంలో జరుగుతున్నా ప్రతి గొడవలో ఈ మీడియా వల్ల బాగా పెరిగిపోతున్నాయి..
ఈ న్యూస్ చానల్స్ రేటిగ్స్ కోసం కాకుంట దేశం కోసం పని చేయని రోజులు ఇలానే ఉంటది.. ఎవరో రాజకీయ నాయకులు ఎవరినో తిడితే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా!
ఆ విషయాన్ని రోజుకు వందసార్లు చూపించటం.. ఏది ఎంత వరకు న్యాయం.. ఒక చానల్స్ ఒక ఆడ్ రోజు వస్తుంటది.. జనాలు చూసి నిజమే అనుకోని అందులో చేరుతారు.. అల
జరుగుతుండ్డగా అదే చానల్స్ అది బోగస్ కంపెని అని వాళ్ళే ప్రచారం చేస్తారు.. ఆ కంపెని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళింది వీళ్ళే కదా.. అల మోసపోయిన వాళ్ళ అందరికి
ఈ మీడియా బాద్యత వహించాలి.. వాళ్ళకు మని వస్తే చాలు పక్క వాడు ఏమైనా వాళ్ళకు అనవసరం.. ఆంద్ర ప్రదేశ్ ఇవాల ఇంత రగులుతుంది అంటే దానికి మొదటికారణం ఈ మీడియా నే..
ఎవడో రోడ్ ఉన్న టవర్ ఎక్కి దూకుత అంటే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు.. ఈ మీడియాకు ఏమి పని అంత జరిగిన తరువాత ఇలా జరిగింది అని తెలియా పరిస్తే
చాలు వీళ్ళు అక్కడ వెళ్లి లైవ్ ప్రచారం చేస్తారు.. అతనిని దించటానికి ట్రై చేయరు.. మొన్న ఎవరో కోటి లో టవర్ ఎక్కారు అని ఎంత నరకం చూపించారో..
కోటి కి రావటానికి ఎన్ని వేలమందికి ఇబ్బంది కలిగిందో తెలియదా.. ఇలా చెప్పుకు పొతే చాల ఉన్నాయి.. నాకు తెలిసి ఫస్ట్ ఈ మీడియా బాగుపడితే దేశం బాగుపడుతుంది..
మనం చేశే పని వల్ల ప్రజకు మేలు జరుగుతుందా అని మీడియా ఆలోచించని రోజులు ఇలా ప్రజలు నరకం చూడవలసిందే.. మీడియా వల్ల మంచికి కన్నా చెడు నే ఎక్కువగా ఉంట్టుంది

(తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించండి )

Saahitya Abhimaani said...

@తెలుగు పాటలు

బాగా చెప్పారు. ఈ రోజున దాదాపు ప్రజలందరూ అనుకునే మాటలు చెప్పారు. ధన్యవాదాలు.

@చాణక్య

సరే ,మీరు మీడియా కాదు. నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఏది?

చాణక్య said...

జవాబులు చెప్పడానికి, ప్రశ్నలు వెయ్యడానికి నేను రాలేదు. నా అభిప్రాయం చెప్పాను అంతే. మీకు నచ్చింది స్వీకరించండి, నచ్చనిది విస్మరించండి. :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి