Saturday, July 27, 2019

రెబ్బవరం స్కూలూ...మరిచిపోలేని అనుభవాలూ...

(ఎస్. రాము)
అభం-శుభం, కల్లా-కపటం, పాపం-పుణ్యం తెలియని బాల్యం ఎవరికైనా మధుర స్మృతే! స్కూల్ రోజులు, అప్పటి మిత్రులు, వారితో అనుభవాలు, అనుబంధాలు మన స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే గ్రామంలో ఏడో తరగతి దాకా నేను చదివిన జిల్లా పరిషత్ హై స్కూల్ రోజులు ఇప్పుడు 50 ఏళ్ళు మీదపడినా మనసు పొరల్లో తీపి గుర్తుల్లా ఉండిపోయాయి. పేస్ బుక్, వాట్సప్ పుణ్యాన బాల్య మిత్రుల గురించి తెలుసుకుని వారిలో కొందరితో మాట్లాడే సుమధుర అవకాశం ఈ వారం దక్కింది.

వృత్తిరీత్యా మా నాన్న గారికి రెబ్బవరం బదిలీ అయ్యింది తిరుమలాయపాలెం అనే మరొక చోటు నుంచి. రెబ్బవరానికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి మా పుట్టినూరు. స్కూల్ పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిలో మా నాన్న పనిచేసేవారు. దానికి కుడి వైపున రోడ్డు దాటగానే ఉండే ఇంట్లో బిక్కసాని కుసుమ అనే వారు ట్యూషన్ చెప్పేవారు. మొదట్లో కుసుమ టీచర్ దగ్గరా.. తర్వాత వెంకటేశ్వర రావు గారు అనే సార్ దగ్గర ట్యూషన్ చదివాను.

రెబ్బవరానికి ఆరేడు కిలోమీటర్ల  దూరంలో ఉండే ఖానాపురం, కొండకుడిమ తదితర గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు. వారిలో చాలా మంది పొలాల మీదుగా నడుచుకుంటూ వచ్చి వెళ్లేవారు. ఇప్పటి పిల్లలకు ఇది ఊహకైనా అందని విషయం. మూడు నుంచి ఏడో తరగతి దాకా రెబ్బవరం స్కూల్లో చదివినా అక్కడి అనుభవాలు భలేవి. బాగానే చదువుతాడని పేరున్న నాకు అక్కడి విషయాలు చాలా గుర్తున్నాయి. ఎనిమిది నుంచి ఇంటర్ వరకూ వైరాలో, డిగ్రీ కొత్తగూడెం లో, జర్నలిజం కోర్సులు-డాక్టరేట్ హైదరాబాద్లో చేసినా రెబ్బవరం అనగానే మనసు ఉప్పొంగుతుంది.

పాలబుగ్గల పసివాడినైన నాకు... కల్లు గీసే వృత్తిలో ఉన్న క్లాస్ మెట్ కొండయ్య సహవాసం వల్ల సిగిరెట్లు, బీడీలు తాగే అలవాటయ్యింది--ఆరో తరగతిలో.  స్కూల్ విడిచి పెట్టాక దాదాపు ఆరు నెలల పాటు కొండయ్య తో పాటు పొగ ఊదాను. మదార్ సాహెబ్ అనే పహిల్వాన్ లాగా ఉండే అబ్బాయి ఈ విషయాన్ని అమ్మ చెవిలో వేయడం, జీవితంలో మొదటి-ఆఖరి సారి  అమ్మ నన్ను పిచ్చి కొట్టుడు కొట్టడం, మనం ధూమపాన అధ్యాయానికితెర దించడం జరిగాయి. పాపం... కొండయ్య కాలం చేశారని ఎవరో చెబితే బాధేసింది. మరొక సారి... బట్టతలతో ఉండే కృష్ణయ్య గారనే తెలుగు మాస్టారు టేకు చెట్టు కింద పాఠం చెబుతుంటే ఆయన వెనుక వెళ్లి వేళాకోళంగా డాన్స్ చేస్తూ పక్కనే పశువుల ఆసుపత్రిలో ఉన్న మా నాన్న కంట పడ్డాను. ఆ రోజు మాంఛి బడిత పూజ జరిగింది.

కుసుమ టీచర్ గారి అన్నగారి అమ్మాయి బిక్కసాని కల్యాణి ఆరో తరగతిలో ఎందుకో అక్కడ చేరింది. అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టు వచ్చి ఆమె నాకు దుఃఖాన్ని మిగిల్చేది. అలాంటి చదువరులు క్లాసులో ఉంటే పోటీ తత్వంతో మనమూ రాణిస్తాం. స్కూల్ గ్రౌండ్ లో తాను నీళ్లు తాగుతుంటే బోరింగ్ కొడుతూ బొటన వేలుకు నేను చేసుకున్న గాయం తాలూకు మచ్చ ఇంకా ఉంది. తానూ, హరిప్రసాద రెడ్డి అనే మరో మంచి మిత్రుడు ఒక ఏడాది మాత్రమే చదివి వెళ్లిపోయారు. ఒక ఏడేళ్ల కిందట కల్యాణి గారు నుంచి నాకు వచ్చిన ఫోన్ ఒక మరిచిపోలేని ఘట్టం. ఉస్మానియాలో ఎం బీ బీ ఎస్ చదివి ఆమె డాక్టర్ కల్యాణి అయ్యారు. ఈ బ్లాగ్ వల్ల ఆమెకు నా ఫోన్ నంబర్ దొరికింది. ఆ తర్వాత కొన్ని సార్లు వారిని కలిసాను. వారి జీవిత భాగస్వామి (తానూ డాక్టరే) ని కూడా కలిశాను. ఇద్దరూ సాత్వికులు, మృదు భాషణ చేస్తారు. ఒక్క ఏడాది మాత్రమే కలిసి చదివినా... తన ఆచూకీ కోసం నేను ఎంత ప్రయత్నం చేసిందీ డాక్టర్ కల్యాణికి వివరించాను.

బాబూ రావు, తన్నీరు వేంకటేశ్వర్లు, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పద్మ, లక్ష్మి, జ్యోతి, రాఘవమ్మ నాకు బాగా గుర్తున్నా... ఖానాపురం నుంచి వచ్చే రాజశేఖర్, కృష్ణా రావు, వెంకటేశ్వర్లు పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకో గానీ కొండకుడిమ రాంబాబు చేతి రాత నాకు బాగా గుర్తుంది. తాను కుదిరించి రాసేవాడిని నాకు గుర్తు. ఒకసారి రాంబాబు తో నాకు గొడవై క్లాసులో బాహాబాహీకి దిగాం. ఆ భీకర పోరాటంలో... రాంబాబు కాలు మీద వచ్చిన సెగడ్డను నేను కావాలనో, చూసుకోకనో నొక్కాను. తాను విలవిలలాడుతూ ఏడిస్తే.. నేను చాలా రోజులు పశ్చాతాపం తో కుమిలిపోయాను.

ఖానాపురం నుంచి వచ్చే వారిలో ఉంగరాల జుట్టు తో, మెరిసే కళ్ళతో ఉండే రాజశేఖర్  ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేసాను. రాజశేఖర్ అనే పేరు ఉన్న వాళ్లకు ఎఫ్బీ లో మెసేజ్ లు పెట్టినా లాభం లేకపోయింది. ఈ రెబ్బవరం గ్రూప్ పుణ్యాన... నిన్న రాత్రి.. దుబాయ్ లో స్థిరపడిన రాజా తో చాలా సేపు మాట్లాడాను. చిన్నప్పటి విషయాలు గుర్తుకు చేసుకుని మేమిద్దరం గతంలోకి వెళ్లిపోయాం. ఇట్లా రాస్తూ పొతే అప్పటి అనుభూతులు బోలెడు.
గన్నుతో పిట్టలు కొట్టే లెక్కల మాస్టర్ సోమనర్సయ్య గారు, క్లాస్ ఎగొట్టి గిన్నెకాయలు కోసుకోవడానికి వెళ్లినా పట్టించుకోని హిందీ టీచర్ అచ్చమాంబ  గారు, అమితాబ్ బచ్చన్ లా ఉండే ఇంగ్లిష్ సార్ రవీంద్రనాథ్ గారు, రాగయుక్తంగా పద్యాలు చెప్పే వెంకటప్పయ్య గారు, మా క్లాసుకొచ్చి మా అన్నయ్యను తిట్టే అబ్బూరి కోటేశ్వర రావు గారు, నా క్రీడా జీవితానికి పునాది వేసిన స్కూల్ మైదానం, స్కూల్ బైట అమ్మే సేమియా ఐసు... అన్నీ తీపి గుర్తులే!

మునుపటి తరంలో మా అమ్మకు కూడా అదే స్కూల్లో పాఠం చెప్పిన వెంకటప్పయ్య గారు నా మదిలోచెరిగిపోని ముద్రలా వేసి, నాకు జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన ఒక పద్యంతో ఇది ముగిస్తా.

కొంపగాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందుచూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల! తెలుగుబాల!!


0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి