తెలుగు సినిమా సృజనాత్మకత ఎక్కువగా లేని 'గొర్రె దాటు' వ్యవహారం. ఎవడో ఒక మహానుభావుడు కాస్త బుర్ర పెట్టి వినూత్నంగా రాయలసీమ రక్తపాతం మీద సినిమా తీస్తాడు. కనీసం ఒక ఏడాది పాటు అదే వస్తువుతో కథ కొంచెంగా మారి పలు సినిమాలు వస్తాయి. మరెవడో...కాలేజ్ లలో ప్రేమ మీద సినిమా తీస్తాడు. దాదాపు అదే లైన్ లో మరింత వినూత్నంగా స్కూల్ లెవెల్ లో గర్భవతి కావడం మీద ఒక సినిమా వస్తుంది. ఆ ట్రెండ్ కొంత కాలం కొనసాగుతుంది. కొత్త యాంగిల్ దొరికే వరకూ మూస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నమాట.
ఒక గొర్రె వెళుతున్నప్పుడు దారికి అడ్డంగా కర్ర పెట్టండి. కొన్ని గొర్రెలు దూకుతూ దాటిన తర్వాత కర్ర తీయండి. కర్రలేకపోయినా సరే...ఇతర గొర్రెలు సైతం దూకుతూనే ఆ దారిన పోతాయి తప్ప...కర్ర లేదు కదా...దూకడం ఎందుకు...అని అనుకోవు. సృజనాత్మకత ముసుగులో మితిమీరిన అశ్లీలం, హింస ఎక్కువ చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్న దర్శక నిర్మాతలు ప్రేక్షకుడిలో సున్నితత్వాన్ని చంపి పారేశారు.
ఈ రోజుల్లో సినిమా తీయడం అంటే ఏముంది చెప్పండి! ఒక సన్నటి ముంబై భామను పిలిపించి...సముద్రం ఒడ్డున నడుము సాధ్యమైనన్ని వంకర్లు తిప్పమనాలి. ఆమెది 'జీరో సైజు' (ఎంత అసహ్యకరమైన మాట?) అయివుంటుంది కాబట్టి...కాస్త పెద్ద సైజు వున్న ముమైత్ ను పిలిచి ఊరిబైట దాబాలో ఒక కిక్ ఇచ్చే పాట వేసుకోవాలి. అలా బ్యాలన్సు చేయాలి.
బ్రహ్మానందం, సునీల్ లలో ఒకరిని పిలిచి మాస్టారి పోర్షన్ ఇవ్వాలి. క్లాసు రూం లో వారిని ఇతర విద్యార్థులచేత అమ్మనా బూతులు తిట్టించాలి. లేదా, సార్ ను తెలివితక్కువ వెధవగా చూపే డైలాగులు అనిపించాలి. ఈ చెత్త పనులకు వేణు మాధవ్ ఉండనే వున్నాడు. అప్పుడు ఏ హీరో కొడుకో అయిన మన సినిమా హీరో రంగ ప్రవేశం చేస్తాడు. సన్న నడుము సుందరిని చూసి మనసు పారేసుకుని...పోరంబోకులైన తన స్నేహితులకు అమ్మాయి గురించి చెప్తాడు.
వీరంతా ఇంకా ఏమీ పని లేనట్టు వాడిని రెచ్చగొట్టి పారేస్తారు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయిని పటాయించడానికి, దానితో వీడు ఒకటి రెండు పాటలు వేసుకోడానికి ఈ ఎదవలు సహకరిస్తారు. హీరో కండలు చూపాలి కాబట్టి...ఒక విలన్ ను ప్రవేశపెట్టాలి. కనీసం యాభై మందిని ఒక్కసారే హీరో చేత కొట్టించాలి. హీరో ఫైట్ అయ్యాక పోతూ పోతూ లావుపాటి నీళ్ళ పైపును ఒక్క గుద్దు గుద్దు తాడు. నీళ్ళు చిమ్ముతున్న బ్యాక్ గ్రౌండ్ లో పొదల పక్కనుంచి హీరోయిన్ హీరో హీరోఇజాన్ని సంబ్రమాశ్చర్యాలతో చూస్తున్న సీన్ ఒకటి వుండాలి.
చివర్లో ఆ అమ్మాయి తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు. హీరో నానా తంటాలు పడి..అంటే బెదిరించి బామాలి పెళ్లి చేసుకుంటాడు. ఎవ్వరు చూడకుండా హీరోయిన్ బొడ్డు మీద లేదా నడుము మీద హీరో గిల్లడంతో శుభం కార్డు పడుతుంది.
విదేశాల్లో చిత్రీకరించిన రెండు పాటలు, కొత్త టెక్నాలజీ తో చేయించిన గ్రాఫిక్ లు, వెరైటీ ఫైట్లు అదనపు ఎట్రాక్షన్. యేవో...కమల హాసన్ లాంటి వాళ్ళు నటించిన..విశ్వనాథ్ గారు తీసిన లాంటి కొన్ని సినిమాలు తప్ప అన్ని తెలుగు సినిమాలు ఇలానే వచ్చాయి...గత దశాబ్ద కాలంలో.
తెలుగులో మూస సినిమాలు ఎందుకు వస్తున్నాయో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మొన్న సూటిగా చెప్పారు. 'తారే జమీన్ పర్' లాంటి సినిమాలు తీసే దమ్ము మనోళ్ళకు లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవ్వరూ దీనికి బాధ పడకూడదు. ఎందుకంటే...అది పరమ చేదు సత్యం.
“The mindset of our heroes is very bad. They don’t watch international cinema and know nothing about movies. Their parents are actors and so they have become actors too. They don’t have passion for cinema. They don’t experiment at all” అని భరద్వాజ చేసిన ప్రకటనలోనే కిటుకు అంతా వుందని అనిపిస్తున్నది.
మన చిత్ర సీమలో ఒక దరిద్రపు తంతు నడుస్తున్నది. హీరో అయిన తండ్రి కొడుకు కండలు పెంచిపిచ్చి హీరోను చేస్తాడు. కొడుకు చింపాంజీ అయినా, బుద్ధిహీనుడైనా పర్వాలేదు. తండ్రి హీరో అయి వుండి...సిక్స్ పాక్స్ ఉంటే చాలు..ఏ గొట్టం గాడైనా హీరో కావచ్చు మన దగ్గర. ఎన్ని ఉదాహరణలైనా కనిపిస్తాయి తరచి చూస్తే. సినిమా సంబంధ ఫంక్షన్లు కుటుంబ వ్యవహారాల మాదిరిగా కనిపిస్తాయి. ఒకొక్క సారి ఈ దారుణం చూస్తే కడుపు రగులుతుంది.
తండ్రికి ఒక కులం, ఒక సర్కిల్ వుంటాయి కాబట్టి...వాటిని అండగా చేసుకుని పిల్ల హీరో రెచ్చిపోతాడు. దర్శకులు, హీరోలు తమ కొడుకులను మాత్రమే దగ్గర వుండి హీరోలుగా మలిచి, కూతుళ్ళను ఈ రొంపిలోకి దింపకుండా ముంబై భామలపై ఆధారపడతారు...అది వేరే విషయం.
నోట్లో బంగారు చెంచాతో పుట్టినోడికి...జీవితం మీద పూర్తి భరోసా ఉన్నవాడికి...సృజనాత్మకత, వినూత్నత్వం ఎలా అబ్బుతాయి చెప్పండి? కానిస్టేబుల్ గారి అబ్బాయి చిరంజీవి చెన్నై వెళ్లి నానా ఇబ్బందులు పడి హీరో అయ్యాడు. తనను తాను నిరూపించుకునేందుకు, మంచి అవకాశాలు పొందేందుకు ఆయనకు వుండే తపన, ఆరాటం...అదే స్థాయిలో ఆయన కొడుక్కి ఉంటాయని చెప్పలేం. అలాగని హీరోల కొడుకులు అంతా చెత్త యాక్టర్లు అని ముద్ర వేయడమూ తప్పే కానీ బైటి వాళ్లకు అవకాశం ఇస్తే...ఇంతకన్నా రాణించే అవకాశం ఉందనిపిస్తున్నది.
"ఒక్క అవకాశం ప్లీజ్," అని బైట లైన్ లో ఎదురు చూస్తున్న జనం సవా లక్ష మంది వున్నారు కానీ పట్టించుకునే వాళ్ళు ఏరీ? తమ కొడుకులు ఎస్టాబ్లిష్ అయ్యేదాకా వేరే వాడికి ఎవడు అవకాశం ఇస్తాడు చెప్పండి? నిజంగా కళా పోషణ చేయాలి, లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలన్న పెద్ద మనసు ఎంతమందికి ఉంది? ఈ సమస్యకు పరిష్కారం లేక పోలేదు.
కొన్ని రోజుల పాటు ముంబై భామల దిగుమతి ఆపి...తండ్రులు హీరోలైన నవ తరం హీరోలకు విశ్రాంతి ఇచ్చి...కొత్త వారికి అవకాశం ఇస్తే...భరద్వాజ గారు బాధ పడాల్సిన పరిస్థితి వుండదు.
అయ్య అడుగు జాడల్లో మీడియా నిర్వహణ బాధ్యతలు కొడుకులు తీసుకోవడం కూడా తెలుగులో మొదలయ్యింది. ఇది చాలా చోట్ల వినాశానికి దారి తీసింది. రామోజీ రావు గారిలో వుండే ఫైరు ఇప్పుడు 'ఈనాడు'ను నడుపుతున్న కిరణ్ గారికి ఉంటుందని ఎలా అనుకోగలం? టాలెంట్ ను వాడుకోవడం రావు గారికి తెలిస్తే...ఎవడో ఇచ్చిన పిచ్చి రిపోర్ట్ ఆధారంగా మంచి జర్నలిస్టులను ఇంటర్నెట్ డెస్క్ లాంటి సృజనాత్మకత పెద్దగా లేని చోట్ల వేయడం ఇప్పుడు జరుగుతున్నది. అలాగని...కొడుకు ఎందుకూ పనికి రాని వాడని అనలేము. ఆయన బలం ఆయనకు వుంటుంది. నిజంగా జర్నలిజాన్ని నమ్ముకున్న నికార్సైన వ్యక్తిని 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ గా నియమిస్తే...ఆ పత్రిక దూసుకోపోదూ? టాలంట్ ను ప్రోత్సహించి వృత్తిలో ప్రమాణాలు పెంచాలన్న ఉత్సాహం, ఉత్సుకత ఇక్కడ ఎవ్వడికీ లేవు. విశాల దృక్పథం కొరవడి, సంకుచితత్వం పెరగడం వల్లనే...నాణ్యత, ప్రమాణాలు దిగజారుతున్నాయి అటు సినిమాలలో, ఇటు మీడియా ప్రపంచంలో.
స్వశక్తినే నమ్ముకుని ఎదిగిన తండ్రి నుంచి పగ్గాలు తీసుకున్న పిల్ల హీరోలు వినూత్నత్వం కోసం శ్రమించడం తక్కువ. తండ్రి వెలుగులో వారు కాలక్షేపం చేసేస్తున్నారు...సిగ్గూ ఎగ్గూ లేకుండా. మీడియా హౌస్ లలోనూ ఇంతే. పిల్ల యజమానులు ఒక కోటరీ ని నమ్ముకొని వ్యవస్థను బ్రష్టుపట్టించడం చాలా చోట్ల కనిపిస్తున్నది. మరీ పరిణామాన్ని ఎవడు అడ్డుకోగలడు?
భరద్వాజ గారు ఆవేదంతోనో, ఆవేశంతోనో ఆ ప్రకటన చేసివుండవచ్చు. కానీ..అది అర్థవంతమైనది.విశాల హితం కోసం మనం అంతా ఆలోచించాల్సిన పాయింట్ ఇది.