Saturday, February 26, 2011

రాంగోపాల్ వర్మపై TV-9 తీరు అభ్యంతరకరం

ప్రేక్షకులు దేవుళ్ళని అన్న ఎన్టీర్ అనుకుంటే...ప్రేక్షకులు వెర్రి వెధవలు, దద్దమ్మలు, చవటలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారన్న ఓపెనింగ్ వ్యాఖ్యలతో చెత్త కథనాన్ని బుధవారం ప్రసారం చేసిన TV-9 ఆ దర్శకుడిని స్టూడియోలో మరింతగా అవమానించింది శుక్రవారం. దర్శకుడిగా కాకపోయినా...ఒక వ్యక్తిగా అయినా వర్మకు విలువ ఇవ్వకుండా...నోటికొచ్చిన ప్రశ్నలు అడిగి యాంకర్ రజనీకాంత్ ఆయనను అవమానించారు. ఇదొక వైపరీత్యం, అన్యాయం, ఆటవిక జర్నలిజం. 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు...పైత్యం ముదిరి రాంగోపాల్ వర్మ అయ్యారనీ, వర్మ తీసిన సినిమా చూడడం ఏ జన్మలోనో చేసుకున్న పాపమనీ, వర్మకు ఇప్పుడు వాయిస్ ఓవర్ల పిచ్చి పట్టిందని, ఆయన డ్రాం గోపాల్ వర్మ అనీ ....విపరీత వ్యాఖ్యలు చేసిన ఆ చానెల్ పిలిస్తే...స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు. కామ్ గా కేసువేసి మంచి లాయర్ను పెట్టుకోక...వర్మ ఆ స్టూడియోకి వెళ్ళారు. హద్దులు మీరి అతితెలివి ప్రశ్నలు వేయబోయిన రజనీకాంత్ ను ఆడుకొని రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు కనువిందు కలిగించడం బాగుంది కానీ...టీ.ఆర్.పీ.రేటింగ్ కోసం TV-9 ఇలా వివాదం సృష్టించి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం బాగోలేదు. ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు. తన తీరును అటు రవి, ఇటు రజని పునఃసమీక్షించుకోవాలి.    

ఏ దర్శకుడి కెరీర్లోనైనా...ఏ మనిషి జీవితంలోనైనా ఎగుడు దిగుళ్ళు సాధారణమే. వరస ఫ్లాప్స్ అనేది ఒక మహా పాపమయినట్లు, ఒక నెగిటివ్ స్టొరీ ప్రసారం చేసి సుద్దులు చెబితే...ఆయన ఆస్కార్ కొట్టేంత ఎదిగిపోతారనట్లు బిల్డప్ ఇవ్వడం బుల్లి తెర వీక్షకులను వెర్రి వెధవలను, దద్దమ్మలను, చవటలను చేసే ఒక విన్యాసం మాత్రమే!

Friday, February 25, 2011

'రామ్ ఢమాల్ వర్మ' పై కథనం: TV-9 కు లీగల్ నోటీస్!

ఎవరిమీదనైనా...ఎలాంటి కార్యక్రమమైనా... ప్రసారం చేస్తానని విర్రవీగుతున్న TV-9 ఛానల్ తిక్కకుదిర్చే పని ఎట్టకేలకు ఒక వ్యక్తి  చేసాడు.  ఆయన...ఎప్పుడేమి చేస్తాడో, ఎప్పుడేమి చెబుతాడో తెలీని వ్యక్తే అయినా...ఆయన చర్య ఈ తలతిక్కల చానెల్స్ కు ఒక గుణపాఠం అవుతుందన్న ఆశాభావం నాకుంది. ఆ వ్యక్తే...స్టార్ దర్శకుడు....రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసినట్లు చెబుతున్న ప్రకటన ఇలా ఉంది.
"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

ఈ గొడవకు కారణమైన కార్యక్రమం "రామ్ ఢమాల్ వర్మ" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని TV-9 ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ప్రసారం చేసింది. జర్నలిజం ప్రమాణాల పరంగా చూస్తే ఈ కార్యక్రమం నిజంగా ఒక చెత్త. వర్మపై వ్యక్తిగతంగా కసితో చేసిన పరుషమైన మాటల దాడి. శాస్త్రీయ విశ్లేషణలేని  ఎల్లో జర్నలిజం. వర్మే కాక ఎవరిపైనైనా ఇంత దారుణమైన దాడి చేయడం తగని పని. 

I-News లో కనిపించిన చల్లా శ్రీనివాస్, HM-TV లో పనిచేసిన ప్రభు అనే 'సినీ విశ్లేషకులను' స్టూడియోలో కూర్చోబెట్టి భద్రి అనే యాంకర్ యమ కసితో ఈ ప్రోగ్రాం చేసారు. వర్మ కెరీర్ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోయింది...ఆయన తీసిన లేటెస్ట్ సినిమా అప్పలరాజ్ ది మోస్ట్ వరస్ట్ ఫిలిం అనుకుంటున్నారు...వంటి కామెంట్స్ భద్రి చేసారు. 
ఆ చల్లా శ్రీనివాస్ అయితే వర్మ..."ఇష్టమొచ్చిన సొల్లు వాగుతున్నాడు...", "గారడీ చేస్తున్నాడు", "చేతగాని...చేవలేని డైరెక్టర్", "ఇంట్రావర్ట్" వంటి కామెంట్స్ తేలిగ్గా చేసారు. "ఆయన క్రియేటివిటీని రీ చార్జ్ చేసుకోవాలి," అని కూడా అయన సలహా ఇచ్చారు. "రామ్ గోపాల్ వర్మ అంటే భయపడే స్థితిలో జనం వున్నారు," అని ప్రభు చెప్పారు. మధ్యలో...యండమూరి కూడా ఏదో మాట్లాడినట్లు వున్నారు...నేను అది మిస్ అయ్యాను. 

ఇక ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నప్పుడు ఆ చానెల్ తెర మీద కనిపించిన వాక్యాలు ఇవి: 
--వర్మకు మతి భ్రమించిందని కామెంట్లు
--రోజు రోజుకీ పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయి
--అతని సినిమాలు చూస్తే ప్రేక్షకులకు తిప్పలే
--ఇప్పుడు తీస్తున్నవన్నీ పరమసోది సినిమాలే
--సినిమా మేకింగ్ పై వర్మ శ్రద్ధ తగ్గింది

ఇలా సాగిన ప్రోగ్రాం ఎవరోచెప్పి చేయిస్తే...ఈ చానెల్ చేసిందన్న అనుమానం కలగకమానదు. 'వర్మ కెరీర్ గ్రాఫ్' అంటూ ఒక ప్రోగ్రాం ను కూడా ఇందులో ప్రసారం చేసారు. అందులో...చానెల్ కున్న కక్కుర్తి రోగం ప్రకారం నడుము తిప్పే భామల, సొగసులు చూపే సుందరాంగుల ఫిలిం క్లిప్స్ చూపించి కుతి తీర్చుకున్నారు. 

ఈ ప్రోగ్రాంతో వర్మకు మండిందట. అలా మండడం నిజానికి మంచి పరిణామం. ఇది కోర్టులో నలిగి...ఈ ప్రోగ్రాం చేసిన వారి నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయడమో, వ్యక్తిగత దాడి చేసినందుకు సంబంధీకులకు అరదండాలు వేయడమో చేస్తే బాగుంటుంది. మిగిలిన చానెల్ ఎజమానులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 

వర్మ ఒక ఐదు కోట్లు ఇస్తే....రవి ప్రకాష్ నుంచి ఈ కార్యక్రమం ఆధారంగా ఒక యాభై కోట్లు నష్టపరిహారం పొందే మార్గం చెప్పడానికి మా అబ్రకదబ్ర సిద్ధంగా ఉన్నాడు. వర్మా....ఆర్ యూ రెడీ?

'ది హిందూ' విజయవాడ బ్యూరో చీఫ్ గా సుసర్ల రమేష్

'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక విజయవాడ బ్యూరో చీఫ్ గా సీనియర్ జర్నలిస్టు, ఆ పత్రికలో ఇప్పటికే అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న సుసర్ల రమేష్  నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్న కె.శ్రీమాలికి  అమెరికన్ కాన్సులేట్ లో ఉన్నత పదవిలో చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. 
ఈ మధ్య కాలం వరకూ గుంటూరులో పనిచేసిన రమేష్ గారు ఇటీవలనే విశాఖపట్నం బదిలీ అయ్యారు. ఆయన మార్చ్ 24 న ఆ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. "ఫ్రెండ్స్ టు సపోర్ట్" అనే సంస్థ నిర్వహించిన రక్త సేకరణ, రక్తదాతల సమాచార సేకరణలో సుసర్ల రమేష్ కీలక భూమిక పోషించారు. 
మాజీ బ్యూరో చీఫ్ శ్రీమాలి సొంత అన్నయ్య చక్రపాణి HM-TV లో అసిస్టెంట్ ఎడిటర్ కాగా, సుసర్ల రమేష్ కజిన్ సుసర్ల నగేష్ కుమార్ 'ది హిందూ' ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సంబంధాలతో సంబంధంలేకుండా...అటు శ్రీమాలి, ఇటు రమేష్ ఎంతో కష్టపడి జర్నలిజం లో కెరీర్ ఏర్పరుచుకున్నారు. శ్రీమాలి 'టైమ్స్ అఫ్ ఇండియా' నుంచి, రమేష్ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' నుంచి 'ది హిందూ' లో చేరి ఉన్నత పదవులను అందుకున్నారు. ఈ పై ఫోటోలో ఉన్నది సుసర్ల రమేష్ గారు...అయన ఒక సెమినార్ లో పాల్గొన్నప్పటి దృశ్యం.
అంతకుముందు అదే గుంటూరులో పనిచేసిన సాయ శేఖర్ గారు కూడా ఆనతికాలంలోనే విజయవాడ బ్యూరో చీఫ్ గా పదోన్నతి పొందారు.  

Tuesday, February 22, 2011

'కాకి లెక్కలు' సామెత-'ఈనాడు' లో శ్రీధర్ గారి కార్టూన్

'ఈనాడు' లో ఇవ్వాళ ఈ పక్కన ఉన్న కార్టూన్ ప్రచురితమయ్యింది. "కావ్...కావ్...నేను బడ్జెట్ తయారీకి వెళుతున్నా...రెండు రోజుల్లో తిరిగి వస్తాలే. బై బై.." అని ఒక కాకి... తొర్రలో ఉన్న ఇంకొక కాకితో అంటున్నది ఇక్కడ. 
శ్రీధర్ గారు వేసే ఈ కార్టూన్ (పాకెట్ కార్టూన్ అంటారు) పైన ఒక లుక్ వేయకుండా ఉండడం తెలుగు రీడర్స్ కు చాలా కష్టం. పొద్దున్నే దీన్ని చూసి...'ఇందేంటిరా...కాకి బడ్జెట్ తయారీకి వెళతా అంటోది....మన మట్టి బుర్రకు ఇది అర్థం కాలేదేమోలే. తర్వాత తీరిగ్గా చూద్దాం...' అని వదిలేసాను. ఆఫీసుకు వచ్చాక ఒక 'ఈనాడు' సోదరుడు ఫోన్ చేసి...కోపంగా 'కార్టూన్ చూసావా?' అని అడిగితే...మరొక లుక్ వేస్తేగానీ అర్థం కాలేదు....'కాకిలెక్కలు' అనే సామెత ఆధారంగా శ్రీధర్ ఆ కార్టూన్ వేసారని. అంటే...బడ్జెట్ లెక్కలు కాకి లెక్కల్లా వుంటాయనే అర్థంలో ...సింబాలిక్ గా ఆ కార్టూన్ వేసి ఉంటారు ఆయన. 
'కాకిలెక్కలు' అనే సామెతకు అసలు అర్థం గురువు గారు బూదరాజు గారు ఒకసారి చెప్పిన విషయాన్ని మన సోదరుడు గుర్తుచేసాడు. కాకులు ఒక చోట గుంపుగా వాలాయనుకోండి. వాటిని లెక్కించమని ఎవరైనా చెబితే...మనం ఆ పనిచేయలేము. ఎందుకంటే...కాకులు ఒకేచోట ఉండకుండా....అటూ ఇటూ పోతుంటాయి. ఇలా లెక్కతేలని వ్యవహారాన్ని చెప్పుకోడానికి పుట్టుకొచ్చిందట ఆ సామెత. 'తప్పుడు లెక్కలకు' కాకి లెక్కలు అనే అర్థంలో మనం వాడుతున్నాం. ఈ విషయం తెలీకుండా కార్టూన్ వేసే కార్టూనిస్టు కాదు...శ్రీధర్ గారు. 
(Cartoon courtesy: Eenadu Telugu Daily)

యాంకర్ కిరణ్ పై లైవ్ షోలో జర్నలిస్టు పాశం యాదగిరి ఆగ్రహం

ఆంధ్రా ప్రాంతానికి చెందిన యాంకర్లపై ఉన్న కోపాన్ని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణా ఉద్యమ నేత పాశం యాదగిరి గారు నిన్న రాత్రి HM-TV లైవ్ షో లో సీనియర్ యాంకర్ కిరణ్ పైన వెళ్ళగక్కారు. "తెలంగాణాకు వ్యతిరేకంగా పనిగట్టుకుని పనిజేస్తున్న చానెల్స్" ను బహిష్కరించాలని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించడంపై 'కేబుల్ ట్రబుల్' పేరిట  హెచ్-ఎం.టీవీ చర్చ నిర్వహించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటి నంది అవార్డును గెలుచుకున్న కిరణ్ దీనికి యాంకర్ గా వ్యవహరించారు. 

ఇద్దరు తెలంగాణా కేబుల్ ఆపరేటర్స్, యాదగిరి గారు సహా ఆరుగురు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి సరైన అవకాశం ఇవ్వలేదని యాదగిరి గారికి ఆగ్రహం వచ్చింది. చర్చ చివర్లో...చర్చ నుంచి వైదొలగబోయిన యాదగిరి గారికి కిరణ్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. అప్పుడు...కిరణ్ ఆంధ్రా ప్రాంత యాంకర్ కాబట్టే తనకు అవకాశం ఇవ్వలేదని, అన్ని చానెల్స్ లో ఇదే పరిస్థితి వుందని యాదగిరి గారు ఆగ్రహంగా విమర్శలు చేసారు. తనకు గానీ, చానెల్ కు గానీ అలాంటి ఉద్దేశం లేదని కిరణ్ చెప్పినా యాదగిరి గారి కోపం చల్లారలేదు. ఆంధ్రా యాంకర్లు తెలంగాణా గళం వినిపించకుండా చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళను నియమించుకోకూడదని తర్వాత కూడా ఆ ఛానల్ చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తితో కూడా అన్నారని సమాచారం.

చురుకైన భావాలు, మంచి రచనా శక్తి, అద్భుతమైన అవగాహనా శక్తి ఉన్న యాదగిరి అన్న కిరణ్ ను అలా అనకుండా వుండాల్సిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కిరణ్ పై ఆగ్రహంతో ఊగిపోవడాన్ని, లైవ్ లో రూడ్ గా వ్యవహరిస్తూ అలాంటి మాటలు అనడాన్ని నేను ఖండిస్తున్నాను. యాదగిరి అన్నది ధర్మాగ్రహమే అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కొన్ని చానెల్స్ లో ఉన్న (ఉదాహరణకు....TV-9 యాంకర్  రజనీకాంత్)  యాంకర్స్, మోడరేటర్స్ పక్షపాతంతో చర్చలు జరుపుతారని ససాక్ష్యంగా ఇదే బ్లాగ్ లో నేనూ పోస్టులు రాసాను. అంటే...అలాంటి వాళ్ళను అనాలి గానీ...కిరణ్ ను అవమానించాలని చూడడం ఏ మాత్రం పధ్ధతి కాదు. 

కిరణ్ ఏదో HM-TV లో చేస్తున్నారు కాబట్టి నేను ఇది రాయడం లేదు. తనను నేను 'ఈ-టీవీ' రోజుల నుంచీ చూస్తున్నాను. తను నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నెల్లూరులోనో, ఏలూరులోనో సిటీ కేబుల్ లో న్యూస్ రీడర్ గా చేరి...తన ప్రతిభకు మెరుగుపెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన యాంకర్ కిరణ్. ఈనాడు మీడియాను శాసిస్తున్న ఏ అగ్రకులానికీ చెందకపోయినా, గాడ్ ఫాదర్స్ లేకపోయినా....కేవలం స్వయంకృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపనతో యాంకరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కిరణ్ ను నొప్పించడం దారుణం. 

యాదగిరన్నా...HM-TV అన్ని జిల్లాల నుంచి లైవ్ ద్వారా ప్రసారం చేసిన...'దశ-దిశ' కు ప్రధాన యాంకర్ కిరణ్. ఏనాడూ...తొణక్కుండా బెణక్కుండా కేవలం యాంకర్ గా తన విధి తాను నిర్వర్తించిన ప్రొఫెషనల్ కిరణ్ అని మీకు బహుశా ఎవరూ చెప్పి వుండరు. మీరు ఈ పోస్ట్ చదివితే....ఒక్కసారి కిరణ్ తో మాట్లాడి సారీ చెబితే బాగుంటుంది.

Sunday, February 20, 2011

ఆంధ్రా బిర్యానీ--పెండ--కేసీఆర్: రామ్ బాణం-4

లోక్ సత్తా అధినేత జే.పీ.గారి మీద అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద భౌతిక దాడి జరగడం నాకు తీవ్ర ఆవేదన కలిగించింది. అవినీతిరహిత సమాజం, ప్రజాస్వామ్య విలువలు... వంటి వాటి కోసం బాధపడుతూ,  ఆ దిశగా ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసేవారు కరువైన ఈ రోజుల్లో జే.పీ.గారు చేపట్టిన ఉద్యమానికి సాల్యూట్ చేసే వారిలో నేనూ ఒకడ్ని. 'ఈనాడు'లో సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డ్ లో ఉన్నప్పుడు ఆయన కాలమ్ 'భవిష్యత్ భారతం' కాపీలను చాలా సార్లు ఎడిట్ చేసి ఆయనకు ఫ్యాన్ గా మారాను. లోక్ సత్తాలో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయాలనుకున్నా....'ది హిందూ' ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక ఆ పని చేయలేదు. కూకట్ పల్లిలో జే.పీ.గారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరాన్ని విశ్లేషిస్తూ 'ఈనాడు' ఎన్నికల పేజీకి ఒక వ్యాసం కూడా పంపాను-అప్పట్లో. 'ఈనాడు' నుంచి బైటికి వెళ్ళిన వాడిని దేశద్రోహిగా చూసే 'ఈనాడు' వారు అది ప్రచురించలేదనేది వేరే విషయం.  ఆ తర్వాత సునిశితంగా పరిశీలిస్తే....జే.పీ. గారికి కొన్ని పక్షపాతాలు వున్నాయేమో అన్న అభిప్రాయం నాకూ కలిగింది. తెలంగాణా ప్రజల మనోభావాలను, విద్యార్థుల పోరాటాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు నాకు అనిపించలేదు. ఇక్కడి నాయకులను చూసి జనం మనోభావాలను తప్పుగా అర్థంచేసుకుంటే ఎలా? కులాలకు, ప్రాంతాలకు అతీతంగా తమ నిర్ణయాలు ఉంటాయని ఇలాంటి దేశభక్తులు నిరూపించుకోవాలి కదా!. ఒక వర్గానికి దగ్గరై , ఒక ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం జనంలో కలగకుండా జాగ్రత్త వహించాలి.

సరే...ఇతరులను ఇబ్బందిపెట్టనంత వరకు ఎవడి ఏడుపు వాడు ఏడవవచ్చు. కానీ ఇతరులపై మాటల, చేతల (భౌతిక) దాడి చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.  ఆ పని జే.పీ. చేసినా, కే.సీ.ఆర్. చేసినా మంచిది కాదు. ఈ మధ్యన కే.సీ.ఆర్. గారు ఆంధ్రా ప్రాంత ప్రజలను, అక్కడి బిర్యానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు శృతిమించినట్లు నాకు అనిపించింది. మనవాడు చేసినా, ఎదుటివాడు చేసినా తప్పు తప్పే, అది ఎత్తిచూపడం జర్నలిస్టు విధి అని నమ్మి ఈ సారి 'రామ్ బాణం' ఈ వ్యాఖ్యల మీద రాసాను. ఇందులో చివర్లో 'ఆక్షేపణీయం' స్పెలింగ్ దోషం వుంది. థాంక్స్. 

Tuesday, February 15, 2011

విజయవాడ కేంద్రం గా కొత్త న్యూస్ ఛానల్!

ఏ టెలివిజన్ ఛానెల్ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. మాజీ జర్నలిస్టు అంకబాబు అనే ఆయన చొరవ తీసుకుని, డబ్బు పోగేసి విజయవాడ కేంద్రంగా త్వరలో ఒక కొత్త న్యూస్ ఛానెల్ తేవాలని భాస్తున్నట్లు సమాచారం. 
సీనియర్ జర్నలిస్టు అయిన అంకబాబు 'ఈనాడు' 'ఉదయం' లలో పనిచేసారు. ఆ తర్వాత మాగుంట సుబ్బిరామి రెడ్డి దగ్గర ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసారు. ఆ సమయంలో జీవన సత్యాలు తెలుసుకుని ఆయన జీవితంలో పైకి ఎదిగారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఎనభై నుంచి వంద కోట్ల వ్యయమయ్యే...ఈ ఛానెల్ లాంచింగ్ కోసం ఆయన సీనియర్ జర్నలిస్టులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఛానెల్ పేరు ఇంకా ఖరారు కాలేదు. 
----------------------------------------------
ఈ పై పోస్టుకు అంకబాబు గారు బుధవారం నాడు స్పందించారు. ఆయన పంపిన మెయిల్లో నాకు సంబంధించి ఉన్న ఒకటి రెండు లైన్స్ తొలగించి   ఇక్కడ ఇస్తున్నాను. థాంక్స్ అంకబాబు గారు. విష్ యు గుడ్ లక్.
ramu garu,
thank you for your posting.
I want to clarify few things to my journalist brothers.
the channel which is proposed to start Vijayawada is only an idea. it didn't take a shape so far.
As for funds to start the proposed channel are not procured from any body.

A friend who has faith in me has requested me whether i can start a channel with his funds.
I have no capacity to invest.but has inclination and zeal.
I was never a PRO to late sri.magunta subbaramireddy.
when he was running Udayam daily; i was closely associated with him and his family until his death and after that also.
I never took any kind of help from him or from his family except when he has forcefully given me 2000 dollars when I was invited by us information service to participate in American presidential inauguration in 1993 in Washington.

Mr.Ramu, you  might have forgotten that I am presently working with HM-TV as its resident editor from Vijayawada for which I have submitted my resignation from 1st march; as I am leaving to USA to join my family there.

It is my intention to have a channel from Vijayawada to encourage local talent; and encourage others to start channels fro vizag; warangal and thirupathi also.
I didn't start my work so far; and I will definitely share my feelings with you when something takes place.
thanking you;

ankababu kollu