Friday, January 1, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలతో... హీరోలు, నీరోలు, జీరోలు

ప్రియమైన మిత్రులారా... మా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
బ్లాగులో రెగ్యులర్ అప్ డేట్స్ గురించి మిత్రులు మెయిల్స్ రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అయినా... మీడియా లో పరిణామాలను తాజాగా అందించడంలో మేము ముందే ఉన్నామండీ. 
కొత్త సంవత్సరం సందర్భంగా వారంలో కనీసం నాలుగైదు పోస్టులు పెట్టాలని మా బృందం కృతనిశ్చయంతో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థాంక్స్. 
-----------------------------------------------------
 ప్రతి ఏడాది మాదిరిగానే 2015 కూడా గిర్రున తిరిగి ముగిసి పోయింది. ఈ రోజు పేపర్లో 'ఈనాడు'దీని మీద ఒక భయంకరమైన కవిత రాసింది. అది ఇదీ...

కాలచక్ర భ్రమణంలో.. కరిగింది మరో వసంతం 
కుడ్యంపై చేరాతల డైరీ.. నేడు జ్ఞాపకాల శిలాక్షరం 
కేర్ మన్న సవ్వడి.. వసంతోత్సవ అలికిడి
నడిరాత్రి కేరింత.. కొంగొత్త ఆకాంక్షల గీతిక 
ఆ స్వర గీతికను ఆస్వాదిద్దాం 
నవ ఉషస్సును స్వాగతిద్దాం

కొత్త సంవత్సరం మొదటి రోజు... కుడ్యం ఏమిటో... శిలాక్షరం ఏమిటో... సవ్వడి కేర్ మనడం ఏమిటో.. వసంతోత్సవం అలికిడి ఏమిటో!!! ఈ నవ కవికి... నవ కవనానికి.. థాంక్స్, ఆల్ ది బెస్ట్ లు చెబుతూ... 2015 లో మీడియా లో మెరపులు, మరకల సమాహారమైన వ్యక్తుల కు మేము సరదాగా ఇస్తున్న అవార్డులివీ.

'బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్' విన్నర్:  ప్రొఫెసర్ కే నాగేశ్వర్. జర్నలిజం బోధకుడి స్థానం నుంచి టీవీల్లో వీర విశ్లేషకుడిగా పేరు తెచ్చుకుని జనాభిమానంతో ఎం ఎల్ సీ అయి... 10 టీవీ చైర్మన్ గా చేరి ఇటీవలనే 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ గా పగ్గాలు స్వీకరించి.. పలు పరిమితులతో అయినా వినూత్న ఆలోచనలతో పత్రికను త్వరిగతిన గాడిలో పెట్టి బహుముఖ ప్రజ్ఞతో మల్టీ టాస్కింగ్ తో స్ఫూర్తి ని పంచుతున్నందుకు. 

'ఓపెన్-షట్-ఓపెన్ అవార్డ్' విన్నర్:  మెట్రో ఇండియా ఓనర్ సీ. లక్ష్మీ రాజం.
'మెట్రో ఇండియా' అనే ఇంగ్లిష్ పేపర్ పెట్టి... మూడ్రోజులు మూసేసి... మళ్ళీ తెరిచి...మళ్ళీ మూస్తారేమో అనిపిస్తున్నందుకు. ఈ ఏడాది మూతపడిన 'ఇండియా టుడే' తెలుగు పత్రిక ఈ అవార్డు కోసం పోటీ పడినా... రాజం గారి సూపర్ ప్లానింగ్ ముందు ఓడిపోయింది.
నోట్:  గతంలో 'బెస్ట్ కమెడియన్' అని ఉన్న ఈ అవార్డు పేరు మార్చామని గమనించగలరు.

'పాపం...పూర్ రిచ్ ఫెలో అవార్డ్ ' విన్నర్: హెచ్ ఎం టీవీ-హన్స్ ఇండియా ఓనర్ వామన రావు. పొందిగ్గా చిట్స్ వ్యాపారం చేసుకోకుండా... మీడియా లో వేలు పెట్టి...కోట్లువెచ్చించి ఛానెల్ పెట్టి, హంసలు ఏవో కాకులు ఏవో తెలియకపోయినా ఆనక ఒక ఇంగ్లిష్ పత్రికఆరంభించి... ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియక ఏమిచేయాలో ఎరగక అలాగే డబ్బు వెదజల్లుతూ ముందుకు పోతున్నందుకు.
నోట్:  గతంలో 'బెస్ట్ బకరా' అని ఉన్న ఈ అవార్డు ను 'పాపం... పూర్ రిచ్ ఫెలో' గా మార్చామని గమనించగలరు.

'పుణ్యం.. పురుషార్ధం అవార్డ్ ' విన్నర్: ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి. జూబ్లీ కొండల సాక్షిగా ఆరుగాలం శ్రమ పడి... కొంగొత్త ఆలోచనలతో.. ఒక మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించి... భక్తి శ్రద్ధలతో రెండోయేడాది కూడా 'కోటి దీపోత్సవం' చేసి ముక్కోటి దేవుళ్ళను, వారి నిత్య ఆరాధకులైన స్వామీజీలను, పీఠాధిపతులను అందులో భాగస్వాములను చేసి, సామాన్య జనాలకే కాకుండా...కావలసిన రాజకీయ నాయకులకు సైతం ఇతోధికంగా ముక్తి ప్రసాదిస్తున్నందుకు. 

'యుధ్ వీర్ అవార్డ్ ' విన్నర్:  ఆంధ్రజ్యోతి గ్రూపు యజమాని వేమూరి రాధాకృష్ణ.  పోట్ల గిత్త లాగా మంచి ఊపు మీద ఉన్న టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో, రాజకీయ ఉద్దండుడు కే సీ ఆర్ తో డైరెక్ట్ గా తలపడి... ఒక్క జర్నలిస్టు సంఘం సహాయం లేకపోయినా కిందపడుతున్నా తలవంచకుండా పోరాడి ఛానెల్ ప్రసారాలు మళ్ళీ ఆరంభించినందుకు... దమ్మున్న మనిషని నిరూపించుకున్నందుకు.

'దొరిపోరా బై దూరిపో... అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్. నెట్ జర్నలిజం గురించి ఎవ్వరికీ తెలియకముందే... వెబ్ సైట్ లో పనిచేసి... ఆ తర్వాత పలు ఛానల్స్ అవలీలగా ఆలవోకగా మారి...తెలుగు దేశం ప్రభుత్వం వచ్చాక... ఎంచక్కా... 'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కుదురుకున్నందుకు.

'కేరాఫ్ ఎర్రగడ్డ... అవార్డ్ ' విన్నర్:  భారత దేశం లో రెండు అత్యంత ప్రముఖమైన పత్రికలు-- ఈనాడు, ది హిందూ-- ఈ అవార్డ్ కోసం గట్టిగా పోటీ పడినా... ఈ ఏడాది ది హిందూ పత్రికనే అది వరించింది. మార్కెట్ ఫిగర్స్ ఇచ్చిన ఉన్మాదంతో పిచ్చిపట్టినట్లు... జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతూ..థూ.. జర్నలిజం... అనిపిస్తున్నందుకు.

'సూపర్ టైం పాస్ అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్. అనుకోని పరిస్థితుల్లో 'ది హిందూ' వదిలిన తర్వాత.. తన సేవలు జర్నలిజానికి అవసరమని మనసా వాచా కర్మణా భావిస్తూ... పిలిచిన పలు తెలుగు ఛానల్స్ లో తన అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ... విశ్లేషణలు చేయడమే కాకుండా... తనకంటూ ఒక బ్లాగ్ ఏర్పరుచుకుని అడపా దడపా అద్భుతంగా రాస్తూ కాలక్షేపం చేస్తున్నందుకు.    

'కామన్ మాన్ అవార్డ్ ' విన్నర్:  రాసిపురం కృష్ణస్వామి (ఆర్కే) లక్ష్మణ్. సగటు జీవి కేంద్రంగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు చురుకైన కార్టూన్లు వేసి 94 ఏళ్ళ వయసు లో గత జనవరి లో కన్ను మూసారాయన.

ఉద్యోగాలు పీకే స్థాయిలోఉన్న దశలో... ఒక్కసారిగా ఉద్యోగం ఊడగొట్టుకున్నఒకసెల్ఫ్ మేడ్ సీనియర్, నమ్మిన వామనుడి తల మీద కాలేసి తొక్కేసి తాపీగా వేర్వేరు చానెల్స్ లో చేరిన పెద్దమనుషులు, యాడ్ ఏజంట్లుగా మారిన ముదురు ఎడిటర్లు, వాక్యం సరిగా రాయరాక పోయినా బకరా గాళ్ళతో ఒక పత్రిక పెట్టించి.. ఎడిటర్ కావాలని కలలు కన్న ఒక మహానుభావుడు, అంతే వాసులు పలు అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడినా...వారి ఎంట్రీలను వచ్చే ఏడాదికి పరిశీలిస్తామని మనవి చేస్తూ ముగిస్తున్నాం.
Happy New Year-2016

2 comments:

GKK said...

EENADU 'POEM' IS HILARIOUS. A CLASSIC 'తవిక'

Unknown said...

chala manchi infermation sir

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి