Tuesday, June 4, 2019

రవిప్రకాశ్ మీద మీడియాలో సానుభూతి లేకపోవడానికి కారణాలు!?

ఫోర్జరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పట్ల మీడియాలో సానుభూతిలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తెలుగులో టీవీ జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన అయన జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ జర్నలిస్టు, సీఈఓ. ఇలాంటిది... తనను వేధిస్తున్నారని ఆయన మొత్తుకుంటున్నా... ఎడిటర్స్ గిల్డ్ గానే,  జర్నలిస్టు సంఘాలు గానీ ఒక్క అనుకూలమైన ప్రకటన చేసినట్లు మా దృష్టికి రాలేదు. 

విజయం-ధనం ఇచ్చిన కిక్కు తలకెక్కి విచ్చలవిడిగా వ్యవహరించడం, తాను మాత్రమే పత్తిత్తు... మిగిలిన జర్నలిస్టులు తనకు సాటిరానివారని భ్రమించడం, జర్నలిజం ముసుగులో తాను ఏదైనా చేయవచ్చని భావించడం వల్ల రవిప్రకాశ్ కు ఈ దుస్థితి కలిగినట్లు ఆయన మాజీ సహచరులు భావిస్తున్నారు. 


రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై  సానుకూలంగా స్పందించని సుప్రీంకోర్టు విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సిందేనని సూచించింది. ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని  స్పష్టం చేసింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 72 గంటల గడువివ్వాలన్న రవిప్రకాశ్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. తప్పించుకు తిరుగుతూ... ఇప్పటికే వీడియా విడుదలచేసిన ఆయనను అరెస్టు చేసి సత్తా చాటుకోవాలని పోలీసులు కచ్చితంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో... రవి గురించి మీడియాలో ఎందుకు సానుకూల స్పందన లేదన్న దానిపై 'తెలుగు మీడియా కబుర్లు' వాకబు చేసింది. 


"వృత్తిలో గుత్తాధిపత్య ధోరణితో రవి వ్యవహరించారు. ఇతర జర్నలిస్టులతో కలవకుండా... తానే గొప్ప అన్నట్లు మెలగడం వల్లనే.. 'భలే గా దొరికాడ్రా' అని ఇతరులు అనుకుంటున్నారు," అని తెలుగు ఛానెల్స్ లో విశ్లేషకుడైన ఒకరు చెప్పారు. ఈ సోర్స్ ప్రకారం... రవి లైవ్ లోకి వచ్చి మీడియా లో విశ్వసనీయత లోపించిందని క్లాస్ పీకడం కూడా ఆయన పట్ల అననుకూలత సృష్టించింది. "మన ఎదుగుదల, మన ధోరణి, కండకావరం జనం గమనిస్తారు. ఇది పట్టించుని మెలగాలి," ఈ విశ్లేషకుడి సూత్రీకరణ. 

తెలుగు గడ్డ మీద ఉన్న జర్నలిస్టు సంఘాలు ఈర్ష్యాద్వేషాల కారణంగా కిమ్మనలేదని అనుకున్నా... కనీసం దేశ రాజధాని లోని సీనియర్ ఎడిటర్లు స్పందిస్తారని అనుకున్నాం. కానీ అదీ జరగలేదు. రవి టీమ్ లో పనిచేసి తర్వాత తనకంటూ ఒక పేరుతెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు దీని మీద ఇలా స్పందించారు: "ఢిల్లీ జర్నలిస్టులు కూడా కార్పొరేట్ వాతావరణంలో పనిచేస్తున్నారు. రవి చేసిన అభియోగాలలో ఏ మాత్రం పసలేదని వారికి తేలిగ్గా అర్థమైంది. వర్కింగ్ పార్ట్నర్ కు ఉండే పరిమితులు ఏమిటో వారికి తెలుసు. యజమాని ఎవరుండాలో ఉద్యోగి నిర్ణయిస్తానంటే ఎలా?"

లైవ్ లో కి వచ్చి తానే సీఈవో అని చెప్పుకోవడం, రహస్య ప్రదేశం నుంచి వీడియో పంపించడం, అందులో అనాలోచితంగా మాట్లాడడం... వంటి వాటివల్ల రవి దెబ్బతిన్నారని సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు. మొత్తమీద రవిప్రకాశ్ లాంటి జర్నలిస్టులకు ఎదురుకాకూడని   విచిత్ర పరిస్థితులు ఎదురుకావడం పట్ల మేము బాధపడుతున్నాం. 
ఈ పోస్టులో పెట్టిన ఫోటో--రవిప్రకాశ్ గురించి తాను కనిపెంచిన టీవీ-9 లో ఫొటోతో సహా వచ్చిన వార్త స్క్రీన్ షాట్. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి