Friday, June 7, 2019

నాటి 'ఈనాడు' కలం వీరుడు... నేడు ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు

ప్రముఖ దినపత్రికలు 'ఈనాడు', 'సాక్షి' పాఠకులకు సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్టు జీవీడీ కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా నియమితులయ్యారు. మృదు స్వభావి, ఆలోచనాపరుడు, వ్యూహకర్త, పదునైన వాక్యాలు, ఉత్తేజభరితమైన ప్రసంగాలు రాయడంలో దిట్ట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 'కృష్ణా' అని ప్రేమగా పిలిచే కేఎం కు 'తెలుగు మీడియా కబుర్లు' శుభాకాంక్షలు.   

1994-95లో 'ఈనాడు జర్నలిజం  స్కూల్' లో భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ గారి దగ్గర జర్నలిజం ఓనమాలు దిద్దుకున్న కృష్ణమోహన్ నేరుగా ఎంతో కీలకమైన సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో చేరి వేలాది వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్-అమెరికా సంబంధాలపై, ఆర్ధిక విషయాలపై తాను రాసిన వ్యాసాలూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఎడిటోరియల్స్ రాసే సామర్ధ్యంసాధించుకున్న కేఎం  కులజాడ్యం, కుహానా మేధావుల కుళ్ళు వల్ల 'ఈనాడు' కోల్పోయిన మంచి జర్నలిస్టు. 
దాదాపు ఒకదశాబ్దం పాటు 'ఈనాడు' సీఈబీ లో పనిచేసిన ఆయన 'సాక్షి' లో చేరి తెలుగు జర్నలిజం లో ఒక కొత్త కౌంటర్ జర్నలిజానికి ఆద్యుడు అయ్యారు. తమకు అనుకూలమైన పార్టీకి అనుకూలంగా ప్రత్యర్దులపై బురదజల్లే 'ఈనాడు' కథనాలకు పదునైన జవాబుగా కృష్ణమోహన్ 'సాక్షి' లో "ఏది నిజం?" పేరిట రాసిన సుదీర్ఘ వ్యాసాలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై అక్టోబర్ 2009 లో 'కౌంటర్ జర్నలిజం: మీడియాకు మీడియా చెక్' అని మేము ప్రచురించిన వ్యాసం చదవండి. 'ఈనాడు' తరహా ఎటాకింగ్ జర్నలిజాన్ని దగ్గరి నుంచి చూసిన అనుభవం, లా చదవడంతో వచ్చిన పరిజ్ఞానం, అద్భుతమైన రచనా పటుత్వంతో ఆయన "ఏది నిజం?" ద్వారా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరు నేతల మన్ననలు పొందారు. 
కృష్ణమోహన్ గురించి పాలకపార్టీసమాచార మాధ్యమాల్లో వచ్చిన మాటలివి: 
"శ్రీ జీవీడి కృష్ణ మోహన్ గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుక అయ్యారు. సాక్షి ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరి.. అనతి కాలంలోనే ఏది నిజం.. ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని చీల్చి చెండాడిన ఏకైక జర్నలిస్టు ఈయన. అప్పటి నుంచే  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారికి,  ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి దగ్గరై.. అప్పటి నుంచి నేటి వరకూ ప్రతి కష్టంలో.. నష్టంలో వైయస్ఆర్ గారి కుటుంబం వెంట నడిచిన వ్యక్తి, జర్నలిస్టు శ్రీ జీవీడీ. 
2011 మార్చి 12న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే.. ఈ పార్టీతో, వైయస్ఆర్ కుటుంబంలో ఒకరిగా శ్రీ జీవీడి మమేకమై.. పార్టీకి గొంతుకగా పార్టీని నడిపించారు. మీడియాలో పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించేందుకు ఎందరికో తర్ఫీదు ఇచ్చి ఎన్నో గొంతుకలను పార్టీ కోసం తయారు చేసిన  పొలిటికల్ మాస్టారు శ్రీ జీవీడి. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిగారి రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతి కష్టంలో.. ప్రతి బాధలో.. జీవీడీ ఆయనకు తోడుగా నిలబడ్డారు.  అందుకే జగన్ గారి గెలుపుతో.. జీవీడీ గారికి ఈ విధంగా విజయం సిద్ధించింది."

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి