హైదరాబాద్ లో ఖైరతాబాద్ చౌరస్తా దాటగానే విద్యుత్ సౌధ పక్కన కొలువై ఒక సెక్షన్ రాజకీయ నేతలకు, అక్రమార్కులకు షాక్ ల మీద షాకిచ్చే 'ఈనాడు' పత్రిక ప్రధాన కార్యాలయం... ఊరి బైట ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ కి తరలనున్నట్లు సమాచారం. ఇన్ చార్జ్ ల స్థాయిలో ఉన్న వ్యక్తులు యాజమాన్యపు ఈ నిర్ణయాన్ని కింది స్థాయి ఉద్యోగులకు చెప్పడం, ఇది ఆ సంస్థలో మౌన గగ్గోలు కు, వారి కుటుంబాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
"ఇదొక షాకింగ్ న్యూస్. నెలల్లో కాదు... రోజుల్లోనే మనం ఆర్ ఎఫ్ సీ కి వెళ్ళబోతున్నామని బాసు చెబితే గుండె గుబెల్ మంది. రోజూ ఒక మూడు, నాలుగు గంటలు ప్రయాణానికి వెచ్చించి.. బతకడం ఎలా?," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఇప్పటికే వందకు పైగా జర్నలిస్టులను అడ్డదిడ్డంగా బదిలీ చేసి... కుటుంబాల్లో అశాంతి కలిగించిన 'ఈనాడు' యాజమాన్యం ఇప్పుడు ఆఫీసు బదిలీ నిర్ణయంతో మరింత సంచలనం కలిగించింది. ఇప్పుడున్న ఆఫీసు ను రిలయెన్స్ వారికి ఇస్తారని చెబుతున్నారు.
ఆఫీసు ను ఎక్కడికంటే అక్కడికి మార్చే హక్కు యాజమాన్యానికి ఉంది కానీ... ఈ తాజా నిర్ణయం వెనుక కొందరు ఉద్యోగులు ఒక పెద్ద వ్యూహం ఉందని అనుకుంటున్నారు. "దాదాపు ఒక గ్రామంలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ కి ఆఫీసు మారిస్తే.... కొత్త వేజ్ బోర్డ్ కింద భారీగా చెల్లించాల్సిన హెచ్ ఆర్ ఏ (హౌస్ రెంట్ అలవెన్స్), సీ సీ ఏ (సిటీ కాంపెంసేట్రీ అలవెన్స్) ల ఖర్చు భారీగా ఆదా చేసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు ఉంది. ఇది మా ప్రాణాల మీదికి తెచ్చింది. ఇప్పుడేమి చేయాలో తెలియడం లేదు," అని ఒక జర్నలిస్టు అన్నారు.
ఆర్ ఎఫ్ సీ కి వెళ్లేందుకు యాజమాన్యం బస్సులు నడుపుతుంది. ఆ బస్సులు ఇప్పుడు ఖైరతాబాద్ ఆఫీసు నుంచి నడుస్తున్నాయి. ఆఫీసు మారితే.... ఆ బస్సుల షటిల్ సర్వీసులు దిల్ సుఖ్ నగర్ నుంచి మొదలవుతాయన్న టాక్ మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడకున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడకపోయినా... మా బతుకులు బాగుండేవని ఇద్దరు ముగ్గురు సీనియర్లు మా బృందం తో అన్నారు. పాపం... జర్నలిస్టులకు, ఇతర ఉద్యోగులకు ఎంత కష్టకాలం వచ్చింది!
Photo courtesy: http://www.panoramio.com