మీడియా అంటే స్టూడియోలో కూర్చొని నోటికొచ్చింది వాగడం అనుకునే అర్ణబ్ గోస్వామి అరిచి గీపెడుతున్నారని, ప్రతి దానికీ ప్రత్రికా స్వేచ్చకీ ముడిపెట్టే వేమూరి రాధాకృష్ణ గొంతు చించుకుంటున్నారని కాదుగానీ, టీవీ 9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ మీద ఇకనైనా నిషేధం ఎత్తివేయడం తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి మంచిది. తెగేదాకా లాగడం సభ్యత కాదని తెలుగు మీడియా కబుర్లు భావిస్తోంది.
ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం. ఆ మాటకొస్తే...ఏ ఛానెల్ ను, పత్రికను మూసినా జనంలో విప్లవం వస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, జనం జర్నలిజాన్ని అసహ్యించుకుంటున్నారు. జనమే కాదు... నికార్సైన జర్నలిస్టులూ ఛీ కొడుతున్నారు. ఏ సామాజిక వర్గమైతే.... తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి, మీడియా పవర్ ను జనాలకు రుచి చూపిందో... అదే సామాజిక వర్గం కుల-రాజకీయ-వ్యాపార విస్తరణ కోసం మరీ హద్దుమీరి బరితెగించి విష సంస్కృతిని (ఒక ఫ్రెండ్ అన్నట్లు డిజిటల్ టెర్రరిజాన్ని) ప్రేరేపించి... జర్నలిజం అంటే జనాల్లో అసహ్య భావన కలిగేలా చేసింది. జర్నలిస్టులను రాళ్ళతో కొట్టే రోజు వచ్చింది.... ఈ మహానుభావుల పుణ్యాన. నిర్దయతో యాజమాన్యాలు జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతుంటే... పట్టని గోస్వాములు, వేరాలకు పత్రికా స్వేఛ్చ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? పత్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు సార్. ఇవి ఇప్పుడు ఎవ్వడికీ పట్టని అంశాలు.
తెలంగాణా ఉద్యమం స్వరూప స్వభావాలు, కష్టనష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు... మీడియా నిర్వర్తించిన భూమిక ఏమిటో.
రెండు ఛానెల్స్ మీద కేబుల్ ఆపరేటర్ల సహాయంతో నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదు. ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగింది. ఈ నిషేధం తర్వాత న్యూస్ రూం లలో తెపరితనం గణనీయంగా తగ్గింది. సెటైర్ పేరు మీద చౌకబారు చెత్త ప్రోగ్రాంలు చేసే జర్నలిస్టులు పదాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొన్ని ఛానెల్స్ వాళ్ళు (అప)హాస్యపు ప్రోగ్రాం లకు బ్రేక్ ఇచ్చారు. తెలుగు ఛానెల్స్ వాళ్లకి ఇలా ముకుతాడు పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామం.
ముఖ్యమంత్రి గారూ...ఇక ఇది చాలు. వందల మంది జర్నలిస్టుల జీవితాలతో ముడి పడి ఉన్న సమస్య ఇది. ఇంకా కొనసాగించడం భావ్యం కాదు. ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. పోయిపోయి రొచ్చులో దూకినట్లుంది. కచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు.
తెలంగాణలో పుట్టిన పాపానికి అనేక మంది ప్రతిభావంతులైన జర్నలిస్టుల జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళను ఎదగనివ్వలేదు. ఆ లెక్కకొస్తే... ఇప్పుడు వీధిన పడిన జర్నలిస్టులలో అధిక శాతం ఈ ప్రాంతం వాళ్ళే. మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు. సాల్యూట్ కొట్టాలని అనడం అభ్యంతరకరంగా ఉంది. ఇక్కడి జర్నలిస్టుల కోసమైనా....ఇక నిషేధాలు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు తాను ఏకైక పెద్ద ప్రతినిధినని చేరా విశ్వవ్యాప్తంగా చాటుకోవడాన్ని అర్జెంటుగా అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి అవసరం.
కేబుల్ ఆపరేటర్లతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి... తమ నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా ఉంది కాబట్టి ఈ ఛానెల్స్ కార్యక్రమాలు పునరుద్ధరిస్తున్నామని ప్రకటింపజేయాలి. అదే సమయంలో ఒక నిపుణుల కమిటీ (మళ్ళీ అదే అన్ ప్రొఫెషనల్ గ్యాంగ్ కాకుండా) వేసి..... మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలి. జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి.
నోట్: నోట్: ముందుగా పెట్టిన "సీఎం కే సీ ఆర్ గారూ.... ఇంక చాలు నిషేధం ఎత్తేయరూ..." అన్న నాసిరకం శీర్షికను మిత్రుల అమూల్య అభిప్రాయం మేరకు మార్చాం. వారి సూచనే కరెక్టు. వారికి థాంక్స్.