Wednesday, June 29, 2011

"U-TV యాక్షన్ తెలుగు" ప్రారంభం

 యూ టీవీ సాఫ్ట్ వేర్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే సంస్థ "U-TV  యాక్షన్ తెలుగు" ను ప్రారంభించింది. మెగాస్టార్ చిరంజీవి దీన్ని ప్రారంభించారు. అక్కడే పనిలోపనిగా...తాను రీల్ సీఎం గా కాకుండా రియల్ సీఎంగా కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన ప్రకటించుకుని కిరణ్ కుమార్ కు గుండె దడను, మీడియా వాళ్లకు మంచి మేతను ఇచ్చారు. దీనికి సంబంధించిన బిజినెస్ స్టాండర్డ్ లో వచ్చిన వార్తను ఇక్కడ ఇస్తున్నాను. చదువుకోండి..
********************************************************

UTV launches 'Action' channel in Telugu

Movie buffs in Andhra Pradesh will no longer have to wait to watch their favourite action-packed Hollywood blockbusters on the small screen, in their very own language (Telugu).

UTV Software Communications Limited, the country’s first integrated media and entertainment conglomerate, on Tuesday launched ‘UTV Action Telugu’. The high-octane channel, unveiled by actor-turned-politician Chiranjeevi, will showcase fast-paced action content from Hollywood. UTV Action Telugu joins UTV’s existing channel bouquet of Bindass, UTV World Movies, UTV Movies and UTV Action Hindi.

“With the genre-specific movie platform gaining momentum and the popularity of action titles growing, there is an opportunity to expand in new markets. UTV Action Telugu is born from that insight that action content permeates across languages,” MK Anand, chief executive (broadcasting), UTV, told mediapersons here.

Andhra yields the highest returns for dubbed Hollywood films in Telugu with Avatar and 2012 grossing over Rs 30 crore in Telugu alone. UTV Action Telugu will showcase blockbuster titles like Hellboy, Book of Eli, Angels and Demons, The Bounty Hunter, Bad Boys and Karate Kid.

On the first day of the launch, the channel will telecast back-to-back Hollywood titles like Spiderman, Kung Fu Hustle, XXX, Men in Black, Hancock and The One. In a bid to bring the best of action content, the channel will also showcase Telugu premieres of popular titles released last year within three months of their Indian television premiere.

Anand said the launch of Action Telugu was supported by a marketing campaign designed around the thought – Action Invades Andhra – to ensure visibility across platforms including TV, print, outdoor and on-the-ground activities.

“We are also associating with single-screen theatres in over 25 cities and multiplexes across key markets like Hyderabad, Visakhapatnam and Vijayawada to promote its launch,” he added.

Saturday, June 25, 2011

తెలంగాణా సిద్ధాంతకర్త జయశంకర్ గారికి నా నివాళి--రామ్ బాణమ్


Sunday, June 19, 2011

నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం (ఫాదర్స్ డే ప్రత్యేకం)

డియర్ ఫ్రెండ్స్,
మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
"వాలెంటైన్స్ డే"ను జనాలకు పరిచయం చేసినవాడికన్నా..."ఫాదర్స్ డే" ను ప్రవేశపెట్టిన వాడంటే నాకు గౌరవం. ఎందుకంటే...కుటుంబం కోసం అష్టకష్టాలు పడే తండ్రి మన సమాజంలో ఎక్కువగా అపార్థానికి గురవుతున్నాడని నా నమ్మకం. జీవితంలో అమ్మ పాత్ర అమ్మదే, నాన్న పాత్ర నాన్నదే. తన నిర్ణయాలు కొన్ని నాకు నచ్చకపోయినా...ఇట్లా కాకుండే ఆయన అట్లా చేసి ఉంటే బాగుండేది అనిపించినా... మా నాన్నంటే నాకు చాలా ప్రేమ. ఇంత దయార్ధ్ర హృదయుడైన గొప్ప వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక గమ్మత్తు జరిగింది. 

నేను...నా కూతురు మైత్రేయితో కలిసి ఒక ఆదివారం నాడు నారాయణ సేవ (అన్నార్తులకు భోజనం ప్యాకెట్లు పంచడం) చేస్తుండగా...చాలా ఏళ్ల తర్వాత ఒక మిత్రుడు రోడ్డు మీద కలిశాడు. ఈ మిత్రుడు మర్నాడు నాకు ఒక మెయిల్ పంపాడు..."నీ లోని మనిషికి నమస్తే...." అంటూ. ఆ మెయిల్ చూస్తే నాకు మా నాన్న జీవితం అంతా మరొక సారి గుర్తుకు వచ్చింది. మా నాన్న చిన్నతనంలో పేదరికం కారణంగా భోజనం కోసం పడిన బాధ...దాని గురించి ఆయన నాకు చెప్పిన విషయాలు...కొన్ని రోజులైనా కొందరైనా క్షుద్బాధ అనుభవించకుండా ఉండటానికి మన వంతు కృషిచేయాలని నేను, నా కుటుంబం గట్టిగా సంకల్పించుకోవడానికి ఆయన చెప్పిన మాటల ప్రభావం...గుర్తుకు వచ్చాయి. 
మా నాన్న గారి గురించి...నేను గత ఏడాది పోస్టు చేసిన వ్యాసాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. చదవి మీ అభిప్రాయం రాయండి. ఈ రోజున మీ తండ్రి గారిని గుర్తుకు తెచ్చుకుని...ఆయనకు  తప్పకుండా మీ ప్రేమను తెలియజేయండి. మీ అందరికీ మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు...రాము
********************************************************* 

పెద్ద పేద కుటుంబంలో పుట్టి...బాల్యంలో అష్టకష్టాలు పడి పదేళ్ళ లోపు వయసులో తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా విద్యార్జన కోసం పట్నానికి పయనమైన బాలుడు. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవన సమరం ఎలా చేయాలో నాకు నేర్పాడు.

*     *     *     *     *     *     *     *     *     *
ఆ పట్నంలో ఆర్థిక ఇబ్బందులతో..ఆ ఇంట్లో ఈ ఇంట్లో వారాలు చేసుకుని తింటూ...సంస్కృతం నేర్చుకుని, ఈ చదువుతో భవిష్యత్తులో లాభం లేదని ఎవరో చెబితే...ఒక పంతులు గారికి శుశ్రూష చేసి ABCD లు నేర్చుకుని, ఆ మరుసటి సంవత్సరమే...మెట్రిక్యులేషన్ పరీక్ష రాసిన విద్యార్థి. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...ఏ పనైనా చిత్తశుద్ధితో చేస్తే సాధించ వచ్చని నాకు అమూల్యమైన పాఠం నేర్పాడు.
*     *     *     *     *      *     *     *     *     *
వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో...మూగ జీవాలకు సేవ చేసుకుంటూ...ఎంతో సంతృప్తి పొందిన ఉద్యోగి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విధినిర్వహణలో బద్ధకం పనికిరాదని, చిత్తశుద్ధితో విధి నిర్వర్తించాలని నేర్పారాయన. 
*     *     *     *     *      *     *     *     *     *
వృత్తికి దగ్గరి వ్యాపారం కదా అని...కోళ్ళఫారం పెట్టి లక్షల్లో చేతులు కాల్చుకుని ఆర్థికంగా బాగా నలిగిపోయిన వ్యక్తి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవితంలో ఓటమిని ఎలా స్వీకరించాలో చెప్పకనే చెప్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
వూర్లో ఆరో తరగతిలో ఉన్న కొడుకు ఒక స్నేహితుడితో కలిసి బీడీలు, సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి...కొట్టకుండా, తిట్టకుండా...వేరే ఊరికి తీసుకెళ్ళి ఏకాంతంలో రోడ్డు పక్క నడుస్తూ కౌన్సిలింగ్ ఇచ్చిన తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...పిల్లల్లో  పరివర్తనకు మార్గం దండన కాదని రుజువు చేసారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ఇంటర్మీడియేట్ చదువుతున్న కొడుకు ఇంటి ఓనర్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నాని....చెబితే...."ఒకే...ముందు చదువు సంగతి చూడు...తర్వాత పెళ్లి సంగతి...." అని మళ్ళీ కౌన్సిలింగ్, మనోస్థైర్యం ఇచ్చి...కొడుకు స్థిరపడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం...ఎలాంటి కొర్రి పెట్టకుండా, రాద్ధాంతం చేయకుండా, ఆ అమ్మాయితోనే కొడుకు పెళ్లి అయ్యేలా చూసి పెద్దరికం నిలుపుకున్న తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....జీవితంలో ఎంతో కీలకమైన విషయాలను ఓపికతో, ప్రాక్టికల్ గా పరిష్కరించడం నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
కట్నం తీసుకోవడం ఇష్టం లేదని కొడుకు స్పష్టం చేస్తే...అప్పుచేసి మరీ...తన సొంత వూర్లో కొడుకు పెళ్లి చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....ఇతరులు పెట్టుకున్న సిద్ధాంతాన్ని, నిబంధనలను గౌరవించడం ఎలానో ఆచరించి చూపారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
సొంత తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే...తాను కష్టపడి కూడగట్టి...ఆదుకున్న మంచి అన్న. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...అనుబంధం, ఆప్యాయతల ముందు డబ్బు గడ్డిపోచతో సమానమని నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ముగ్గురు కొడుకులను చదివించి....ఇన్నాళ్ళూ...పెద్దగా సంపాదించింది ఏమీ లేకపోయినా...తృప్తిగా ఉద్యోగ విరమణ చేసి ఆరోగ్యం కోసం వ్యవసాయం, ఆత్మానందం కోసం భక్తి పుస్తక రచన చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...గడిచిన దాని గురించి వగచకుండా...శేషజీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నేర్పుతున్నారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
అరవై ఆరేళ్ళ వయస్సులో...మొన్ననే...'మన వూర్లో ఒక వృద్ధాశ్రమం పెడితే ఎలా వుంటుంది?' అని ప్రశ్నించిన ఆ మనీషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విపరిణామాలకు బెదరకుండా....సేవా తత్పరత ఎలా కొనసాగించాలో చెబుతున్నారాయన.


---ఆ బాలుడు, ఆ విద్యార్ధి, ఆ ఉద్యోగి, ఆ పెద్ద మనిషి, ఆ తండ్రి, ఆ అన్న, ఆ మనీషి....ఆయనే మా నాన్న..వెంకటేశ్వర్లు గారు. ఆయన నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఏ తండ్రి జీవితం అయినా...కొడుకులు, కూతుళ్ళకు ఒక పెద్ద సందేశం. తల్లి ప్రేమను, ఫుడ్ ను పంచి పెంచితే...నాన్న మౌనంగా జీవన పోరాటం, ఒడిదొడుకులను ఎదుర్కునే...శక్తి సామర్ధ్యం ఇస్తాడు. మా నాన్న కూడా అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువే. అన్యాయం, దారుణంపై నిర్మొహమాటంగా గొంతెత్తడం, నిష్టురమైనా, ఎందరు నొచ్చుకున్నా...నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం...ఆయన నుంచి అబ్బిన లక్షణాలు. ఈ కింది ఫోటోలో ఎడమ వైపున ఉన్నది మా నాన్న, కుడి వైపున ఉన్నది హేమ నాన్న, మధ్యలో ఉన్నది నా పుత్రరత్నం ఫిదెల్.

రెక్కలు వచ్చి గూడు వదిలి రావడానికి ముందు నేను, తమ్ముడు, అన్నయ్య, నాన్న...కొన్నేళ్ళ పాటు ఇంటి ముందో, పక్కనో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఆ రోజులు తడి ఆరని తీపి గుర్తులు. జీవితం లో నాకు ఒక దాని వెంట ఒకటి విజయాలు లభించినప్పుడు...ఆ సమాచారం తెలుసుకునేటప్పుడు మా నాన్న కళ్ళలో వెలుగు, పెదాలపై నవ్వు కోట్ల పెట్టు. అలాగే...వివిధ గ్రంథాల సారాన్ని, తన అనుభవాలను కలిపి తాను రూపొందించిన "ఆత్మ శోధన--యోగ సాధన" పుస్తకాన్ని నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లో పండితుల చేతుల మీదుగా ఆవిష్కరించినప్పుడు కూడా ఆయన పడిన ఆనందం ఎంతో తృప్తినిచ్చేది. నేను, నాన్న, ఫిదెల్, తమ్ముడు కలిసి కూచొని క్రికెట్ లేదా ఫుట్ బాల్ మ్యాచ్ టీ.వీ.లో చూడడం నాకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి.

తల్లులను తక్కువ చేయడం కాదు కానీ...జీవితం లో తండ్రి పంచే వాత్సల్యం, నేర్పే జీవిత పాఠాలు అమూల్యం, అద్భుతం. తల్లి ప్రేమకు గానీ తండ్రి వాత్సల్యానికి గానీ సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. మన తల్లిదండ్రులు నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని, వారికి దగ్గరుండి సేవ చేసుకునే బుద్ధి, శక్తి సామర్ధ్యాలు పుత్రులలో పెరగాలని ఆశిస్తూ..... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

Tuesday, June 14, 2011

"హెడ్ లైన్స్ టుడే" ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా SNV సుధీర్

ఇంగ్లిషు ఛానల్స్  వారు తెలుగు, ఆంగ్లం రెండూ వచ్చిన వారిని కాకుండా ఇంగ్లిషు మాత్రమే వచ్చిన తమిళులనో, మలయాళీలనో హైదరాబాదులో పోస్ట్ చేయడం చాలా రోజులుగా జరుగుతోంది. దీనివల్ల కనిపించని నష్టం జరుగుతుందనేది ఎవ్వడూ పట్టించుకోడు. విశాఖ మన్యంలో గిరిజనుల సమస్యలు, నల్గొండలో ఫోరైడ్ బాధ...వంటి అంశాల పట్ల ఇక్కడ పుట్టి, ఇక్కడ చదువుకున్న జర్నలిస్టుకు ఉన్న అవగాహన వేరే ప్రాంతం వాడికేమి ఉంటుంది చెప్పండి. ND-TV కి చాలా ఏళ్లుగా పనిచేస్తున్న సుధీర్, ఉమ దంపతులు పొరుగు రాష్ట్రం వారే అయినా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారు కొందరు నేతల పేర్లు పలుకుతుంటే మాత్రం వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. 
చెప్పొచ్చేదేమిటంటే...ఇంగ్లిషు పేపర్లో పనిచేసి, తెలుగు ఛానల్ కు దేశ రాజధానిలో సేవలందించిన సోము నాగ వెంకట సుధీర్ అనే యువకుడు "ఇండియా టుడే" వారి "హెడ్ లైన్స్ టుడే" ఇంగ్లిష్ ఛానల్ కు ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా హైదరాబాద్ లో చేరారు ఒక మూడు రోజుల కిందట. ఈ ఫొటోలో ఉన్నది ఆయనే. 
 ఆంధ్రా యూనివర్శిటీలో జర్నలిజం కోర్సు చేసిన సుధీర్...విశాఖపట్నంలో డెక్కన్ క్రానికల్ రిపోర్టర్ గా ఉండేవారు. నేను "ది హిందూ" విలేకరిగా అప్పట్లో విశాఖలో "టైమ్స్ ఆఫ్ ఇండియా" విలేకరి పత్రి వాసుదేవన్ గారి దగ్గరకు వచ్చినప్పడు సుధీర్ ను నేను చూశాను...ఒక ఐదేళ్ల కిందట. బాగా పైకి వచ్చే కుర్రవాడిగా అనిపించాడు. 
తర్వాత కొన్నాళ్లకు...అంటే సాక్షి పురుడుపోసుకుంటున్న దశలో...వాసుదేవన్ గారు ఆ ఛానల్ ఢిల్లీ బ్యూరో చీఫ్ గా వెళ్లారు. తనతో పాటు సుధీర్ సీనియర్ కరస్పాండెంట్ గా దేశ రాజధానిలో జాయిన్ అయ్యారు. తెలుగు ఛానల్ లో ఎక్కువ ఇంగ్లిషు పదాలు మాట్లాడుతూ కనిపించిన సుధీర్ ను చూస్తే...తను ఇంగ్లిష్ ఛానల్ లో చేరితే బాగుంటుందని చాలా సార్లు అనిపించింది. ఒకసారి ఆ సలహా కూడా ఇచ్చిన గుర్తు.
మొత్తానికి సుధీర్...ప్రిన్సిపల్ కరస్పాండెంట్ హోదాలో ఆ సంచలనాత్మక ఛానల్ లో చేరాడు. ఇప్పటివరకూ..."ఆజ్ తక్" హిందీ ఛానల్ రిపోర్టర్ గా ఉన్న మృదుల "హెడ్ లైన్స్ టుడే" కు కూడా రిపోర్ట్ చేస్తున్నది. ఈ తెలుగు అమ్మాయి తల్లిగారు తెలుగు యూనివర్శిటీలో పనిచేసే మృణాళిని గారు. మృదుల నాకు మాదిరిగానే ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఏ.సీ.జె.)లో చదువుకుని తర్వాత ఇండియా టుడే గ్రూపు వారి "మెయిల్ టుడే" అనే ఇంగ్లిష్ టాబ్లాయిడ్లో పనిచేసి మానేసింది. నేను "ది హిందూ" వదిలేశాక..."అవుట్ లుక్" మ్యాగజీన్లో మంచి ఉద్యోగం వచ్చినా డబ్బు పిచ్చిలో పడి "మెయిల్ టుడే" లో స్పెషల్ కరస్పాండెంట్ గా చేరి...ఇన్నాళ్లూ సంసార పక్షంగా బతికిన మనకు ఈ తరహా జర్నలిజం పడదు బాబో....అని వదిలేసి అమెరికా పోయాను...చిన్న ఫెలోషిప్ మీద. సొంత కథ ఎందుకుగానీ...సుధీర్ ఈ వృత్తిలో మరింత రాణించి ఎన్ డీ టీవీ సుధీర్ ను తలదన్నే జర్నలిస్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Wish you good luck, brother.

Sunday, June 5, 2011

అవినీతిపై జనాలు చేస్తున్నది....పెద్ద బూటకపు డ్రామా

ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాన్ని పీల్చిపిప్పిచేస్తున్న అవినీతిపై యోగా గురు రామ్ దేవ్ బాబా తలపెట్టిన సత్యాగ్రహాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో అణచివేయడం దారుణం. అర్ధరాత్రి వందల మంది పోలీసులు రామ్ లీలా మైదానంలో భయోత్పాతం సృష్టించి బాబాను హరిద్వార్ తరలించడాన్ని సంఘ్ పరివార్ మాత్రమే కాకుండా అంతా ముక్తకంఠంతో ఖండించి తీరాలి. ఇది ప్రజాస్వామ్యమా? లేక...నియంతృత్వమా?

నిజానికి అవినీతిపై ఎంత ఎక్కువ ప్రజా చైతన్యం వస్తే ఈ దేశానికి అంత మంచిది. అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. లేకపోతే...మన భావి తరాలు అవినీతి బారిన పడి కుక్కచావు చావబోతున్నాయి. భారత్ కూడా కుక్కలు చింపిన విస్తరిలా ఏదో ఒక ఆఫ్రికా దేశంలా కాబోతున్నది. ఇప్పటికే అవినీతిపరులు జనం నుంచి మంగళహారతులు అందుకుంటూ...తరాలకు సరిపడా సంపాయిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి దేశాన్ని కుదవపెట్టడానికైనా వెనుకాడని దేశద్రోహుల గురించి చర్చ జరగడానికి, బాధ్యతారహితమైన జనం ఎన్నటికైనా వారి భరతం పట్టడానికి ఇలాంటి నిరశనలు ఎంతో ఉపకరిస్తాయి. 

అయితే...మొన్నామధ్యన అన్నా హజారే అవినీతిపై సమరంపై చేసిన శంఖారావం తాలూకు ప్రకంపనలు సద్దుమణగకముందే...విశేష జనాదరణ ఉన్న యోగా గురు నిరశనకు కూర్చోవడంతో చవట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి చమటలు పట్టాయి. బాగా చదువుకున్నాడు...కదాని అనుకుంటుంటే...ఈ దద్దమ్మ ప్రధానికి అవినీతి ఒక సమస్యగా కనిపించకపోవడం, దానిపై పోరాడే వారు విలన్లుగా అనిపించడం మన దురదృష్టం. Mr.Prime Minister, its shame on you. కుంభకోణాల మీద కుంభకోణాలు బద్దలవుతున్నా సిగ్గూ ఎగ్గూ లేకుండా పదవిని అంటిపెట్టుకుని దేశాన్ని నగుబాటు చేస్తున్న మన్మోహన్...ఆయన్ను సన్నాసిని చేసి ఆడిస్తున్న సోనియాగాంధీలను క్షమించకూడదు. 
 అప్పుడు హజారే దీక్ష అపుడుగానీ, ఇప్పుడు రామ్ దేవ్ నిరశన అప్పడుగానీ జనసామాన్యం స్పందన చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్ధంకావడంలేదు. దేశంలో అవినీతి, అరాచకం పెరగడానికి తెలివితక్కువగా కారణమైన వారే ఇలాంటి ధర్నాలకు ఇమోషనల్ గా తెగ స్పందిస్తారు. ఎన్నికలను ఒక పనికిరాని కసరత్తుగా భావిస్తున్న విద్యావంతులు, మన బొజ్జనిండితే చాలు...కూచొని దొరికిన ప్రతి చెత్త పుస్తకమూ చదువుకుంటూ అదను దొరికినప్పుడల్లా లెక్చర్లు దంచుదామని అనుకునే సో కాల్డ్ మేధావులు, తమ జీతాలు బత్తేలు పెరిగితే చాలు...బల్లకింద దొరికే బోనసు నోట్లతో బతుకీడ్చవచ్చని తీర్మానించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, యజమానికి లాభాలు తేవడానికి...తద్వారా ప్రమోషన్లు కొట్టడానికి మాత్రమే పుట్టినట్లు ప్రవర్తిస్తున్న ప్రైవేటు ఎంప్లాయీస్--వీరు కాదా ప్రస్తుత దుస్థికి ప్రధాన కారణం? దేశభక్తిలేని ఈ తుక్కుబ్యాచు...ఎవడైనా అవినీతిపై గళమెత్తితే చాలు...మనస్ఫూర్తిగా స్పందిస్తారు, నానా హడావుడి చేస్తారు.అయ్యో...అయ్యో..కొంపలారుతున్నాయని మొత్తుకుంటారు. కులం, ప్రాంతం వంటి తీటలను వీరు వదిలి నీతిగా బతికితే, దేశం కోసం ఆలోచిస్తే సమస్య ఇంతదాకా ఎందుకు వస్తుంది?

సారా పాకెట్టుకు, బిర్యానీకి అమ్ముడుపోతున్న జనం మన దేశాన్ని శాసిస్తున్నారు. మురికి కాల్వల వెంట ఓటు బ్యాంకును పంటలా వేసి కాపాడుకుంటూ....కులమనే యూరియాతో కలుపుమొక్కలను పెంచుతూ...ఒకపక్క రాజకీయ నేత ఎదుగుతున్నాడు. వాడు విశ్వరూపం చూపిస్తూ...మనలను అపహాస్యం చేస్తుంటే....ఈ పైన పేర్కొన్న నాలుగు రకాల జనం ఇళ్లలో సుఖంగా తినితొంగుంటున్నారు. మనదాకా వస్తే దాకా స్పందించబోమన్న తిక్క లెక్క వల్ల సమస్య వస్తున్నది. ఈ జనం తమ పనుల కోసం డబ్బు పెట్టడానికి వెనకాడరు, వీలున్నప్పుడు డబ్బునొక్కడానికి సిద్ధంగానే ఉంటారు. ఎన్నికలప్పుడు స్పందించకుండా, మంచి అభ్యర్థులకు మద్దతివ్వకుండా రోజూ అవినీతి గురించి మాట్లాడుతుంటారు. లంచం బాధితులను ఆదుకోవడానికి, వారికి అండగా నిలవడానికి ఈ జనాలకు తీరిక, ఓపిక లేవు. నాలుగు డబ్బులతో వీళ్ల నోళ్లు మూయించడం చాలా సులభం.  ప్రస్తుతం దేశానికి పట్టిన దౌర్భాగ్యానికి నకలు, నమూనా, ప్రత్యక్ష సాక్ష్యం...మన్మోహన్ సింగ్. ఇదే conspiracy of silence అంటే. ఇదే నయవంచకత్వం అంటే.

సదాలోచనపరులు స్పందించకుండా...చోద్యం చూస్తూ ఉన్నంతకాలం...తమాషాను ఆస్వాదిస్తున్నంత కాలం...హజార్ మంది హజారేలు వచ్చినా...రామ్ దేవ్ లు వచ్చినా అవినీతి రక్కసిని ఏమీ పీకలేరు. జనం నిజానిజాలను, పొంచివున్న ప్రమాదాలను గుర్తెరిగి బూటకపు డ్రామాను ఆపనంతకాలం...దేశభక్తితో మెలగనంతకాలం ఆ రాక్షసి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంటుంది.

Wednesday, June 1, 2011

ఫ్లోరోసిస్ పైన HM-TV యుద్ధం

నల్గొండ తదితర జిల్లాలలో లక్షల మంది వెన్నువిరిచి జీవచ్ఛవాలను చేసిన ఫ్లోరోసిస్ పైన HM-TV యుద్ధం ప్రకటించింది. గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం లో భాగంగా ఈ చానెల్ పలు కార్యక్రమాలు రూపొందించింది. గడిచిన శుక్రవారం నాడు...నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి లో జరిగిన కార్యక్రమంలో గద్దర్, డాక్టర్ రాజిరెడ్డి, దుస్చర్ల సత్యనారాయణ, చానెల్ చీఫ్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గార్లతో కలిసి నేను కూడా పాల్గొన్నాను. ఇది ఒక చారిత్రిక ఘటనగా నాకు అనిపించింది. చానెల్ వారి ఈ ఇనీషియేటివ్ మీద త్వరలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ రాస్తాను.

ఈ సమస్యపైన నాకు కొంత అవగాహన ఉండబట్టి, సమస్య పరిష్కారంలో ప్రజా ప్రతినిదుల, ప్రభుత్వాల పాత్రపైన నాకు అసహ్యం వుంది కాబట్టి...నేను కూడా రాజా రెడ్డి, మూర్తి గారితో పాటు వెళ్లాను. అక్కడ ప్రదర్శనలో పాల్గొని గద్దరన్న అప్పటికప్పుడు కట్టిన పాటకు తాళం వేసాను. దాని తాలూకు రెండు ఫోటోలు ఇవి. గద్దర్ మాట్లాడుతున్న వ్యక్తి...సత్యనారాయణ గారు. ఒకప్పటి బ్యాంకు అధికారి అయిన ఆయన లేకపోతె...ఇప్పుడు నల్గొండ కు కృష్ణ నీళ్ళు వచ్చేవి కావు. ఈ సందర్భంగా ఈ సమస్య గురించి, ప్రజా సమస్యలు-మీడియా పాత్రపై మూర్తిగారి ప్రసంగం వింటే...మనం ఇంకొన్ని ఏళ్ళు యాక్టివ్ జర్నలిజం లో వుంది వుంటే బాగుండేది...ఇలాంటి జర్నలిజం చేయడానికి వీలు వుండేది అని పలుమార్లు అనిపించింది.
ఇక్కడ వున్నవి...నేను ఒక అమెరికన్ వెబ్ సైట్ కు రాసిన స్టోరీలు.

నోట్: నా మొబైల్ ఫోన్ లో తీసినందున ఫోటోల నాణ్యత బాగోలేదు. క్షమించాలి.