Sunday, March 31, 2013

తెలుగు ఛానళ్ళు: 3 Cs, 1 D

తెలుగు టెలివిజన్ ఛానళ్ళు చూడాలంటే ఈ మధ్యన ఇబ్బందిగా ఉంది నాకు. ఛానెళ్ళ యజమానులు భావదారిద్ర్యం తో సతమతమవుతున్నట్లు స్పష్టమవుతున్నది. మంచి ప్రోగ్రాం కోసం రిమోట్ బటన్స్ నొక్కలేక నేనైతే తంటాలు పడుతున్నాను. అందుకే BBC, CNN లతో సెటిల్ అవుతున్నాను. 

అర్జంటుగా చంద్రబాబు అధికారంలోకి రావాలని కొన్ని టీ వీ చానెల్స్ ఉవ్విళ్ళూరుతుండగా, ఒకటి జగన్ బాబు భజన, ఒకటి రెండు చానెల్స్ కిరణ్ స్తోత్రం, ఇంకొకటి సత్తిబాబు పొగడ్త నిస్సిగ్గుగా చేస్తున్నాయి. తెలుగు జర్నలిజపు చేగు'వేరా' ఛానెల్ అయితే 'చంద్రయాన్' అనే పేరుతో బాబు గారి బాకా ఊదుతున్నది వీలున్నప్పుడల్లా. స్టూడియో ఎన్, ఈ టీవీ కుడి ఎడమగా అదే పని చేస్తున్నాయి. 'గోపీ' చానెల్స్ బాబు అనుకూల, వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ జర్నలిజాన్ని బతికిస్తున్నాయి. 

ఈ ఛానెల్స్ ఫార్ములా సింపుల్. రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పిన మూడు 'సీ' లే వాటి గాలీ నీరూ ఆహారం. సినిమా క్లిప్పింగ్స్, క్రైం హడావుడి, క్రికెట్ హంగామా లేకుండా వీటికి బతుకు లేదు. అందమైన ముద్దు గుమ్మలతో వాళ్ళ లేటెస్టు సినిమా గురించి స్టూడియోలలో చర్చ ఇప్పుడు నిత్యకర్మ. మీకు అవకాశం ఎలా వచ్చింది? హీరో బాగా చూసుకున్నాడా? మీ మధ్యన కెమిస్ట్రీ కుదిరిందా? డైరెక్టర్ తో మీ అనుభవాలు ఏమిటి? వంటి ప్రశ్నలు వేయడం... తెలుగు వచ్చినా బోడి ఇంగ్లీషులో ఆ భామలు ఒళ్ళు, పళ్ళు కనిపించేలా నవ్వుతూ తుళ్ళుతూ సమాధానాలివ్వడం. మధ్య మధ్యలో కైపు ఎక్కించే క్లిప్పింగ్లు చూపించడం. ఇలా స్టూడియో లో డ్రామా చేసినందుకు చానెల్స్ కు ఆదాయం వస్తున్నది. ఇది ఫస్టు సీ.    

క్రైమ్ స్టోరీలను కొందరు భీకరాకృతులతో చెప్పించడం, భయంకరమైన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దడదడ లాడించడం బుల్లి తెర మీద కామన్. "మీరు చచ్చి పోయాక..." అని తాటికాయంత అక్షరాలతో ఒక స్టోరీ వచ్చింది ఒక చానెల్లో. ఇది రెండో సీ. 

ఇక మూడో సీ...క్రికెట్. మ్యాచుల విశ్లేషణలు, ధోనీ సచిన్ ఆదాయాలు వంటివి ఏవైనా స్టోరీ లే. ఇవి కాక ఇంకొక 'డీ' ఉంది. అదే డిస్కషన్. పరిశోధన, లోతైన విశ్లేషణ లేని లౌడ్ స్పీకర్ గాళ్ళు, ఒక ఐదారుగురు బతక నేర్చిన జర్నలిస్టులు కం యూనియన్ నేతలు, ప్రొఫెసర్ హరగోపాల్ లతో చర్చ. చర్చ పేరుతొ జరిగే రచ్చ జనానికి తాత్కాలికంగా కనువిందు కలిగించడం నిజమే అయినా ఏతావాతా వాటి వల్ల సమాజానికి జరిగే ప్రయోజనం దాదాపు శూన్యం. ఒక మోస్తరు సంసార పక్షంగా చర్చ జరిగేది... ఈ టీవీ లో వచ్చే ప్రతిధ్వని, సాక్షిలో వచ్చే లా పాయింట్. మిగిలిన దాదాపు అన్ని చర్చలూ బోరింగు దగ్గర పంచాయితీలే.  

ఇవి కాక చానెల్స్ దినాలు కూడా పెడతాయి. అంతర్జాతీయ జల దినం, ఎయిడ్స్ దినం, లవర్స్ దినం....ఇలా దినం ఏదైనా మనోళ్ళు ఒకటి రెండు స్టోరీలు వదలరు. ఇది ఆటలో అరిటిపండు లాగా అన్నమాట. ఎక్కడ చూసినా ఈ సొల్లు వార్తలే ఉండడంతో బ్లాగును అప్ డేట్ కూడా చేయబుద్ధి కాలేదు. అయినా విచిత్రం. మన చానెల్స్ కు జాతీయ స్థాయి లో అవార్డుల పంట పండుతున్నది. టీవీ నైన్ కు ఎనిమిది అవార్డులు వచ్చాయట. 

అలాగని అంతా బ్యాడ్ అనుకోవడం కూడా తప్పే. మొన్న 'లవ కుశ' సినిమా మీద దాదాపు అన్ని చానెల్స్ మంచి కథనాలు ప్రసారం చేసాయి. కొన్ని చానెల్స్ కాపీలు మనసుకు హత్తుకున్నాయి. అన్నింటికన్నా 10 టీవీ వాళ్ళు అప్పటి లవుడు, కుశుడు ఏమి చేస్తున్నారో వారిని స్టూడియోకి పిలిపించి ఒక కథనం ప్రసారం చేసారు. అది బాగుంది. జీ టీవీ లో పనిచేసి వచ్చిన యాంకర్ (పేరు గుర్తు లేదు) వారిని ఇంటర్వ్యూ చేసారు.   

ఇవ్వాళ ఆదివారం నాడు మరి కాస్త తీరిక దొరికి మార్చి మార్చి టీవీ చానెల్స్ చూస్తె ఒక రెండు కథనాలు నాకు ముడి సరుకు అందించాయి. టీవీ నైన్ లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కుమారుడి మీద ఒక కథనం వచ్చింది. ఇందులో పరిశోధన లేదు, పాడు లేదు. నాలుగు లోకల్  బైట్స్ పెట్టి దంచికొట్టారు. అలా అడ్డంగా రాయడానికీ దమ్ములు ఉండాలి. పొన్నాల మనకొక పది, ఇరవై లక్షలు ఇస్తే... కేవలం ఈ కథనం ఆధారంగా రవి తో సహా ముగ్గురు నలుగురు జర్నలిస్టులను శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపవచ్చు..అని లా లో కొద్దిగా ప్రవేశం ఉన్న 'అబ్రకదబ్ర' అన్నాడు. అయినా... అన్ని వార్తలకు సాక్ష్యాలు కావాలంటే తెలుగు మీడియా ఎట్లా బతకాల?

ఇక ఈ రోజున... 10 టీవీ లో "డాక్టర్ ఫ్రెండ్" అనే ప్రోగ్రాం చూసి నా మతి పోయింది. ఇది శృతి లయ తప్పిన క్రియేటివిటీ కి ఉత్తమమైన ఉదాహరణ.   'ఈగ' ల వల్ల కలిగే నష్టాలు చెప్పడం ఆ డాక్టర్ గారి ఉద్దేశం. దొరికిందిరా సందు... అని...ఎస్ ఎస్ రాజమౌళి గారి 'ఈగ' చిత్రం లో క్లిప్పింగ్ లతో స్టోరీ ఆరంభించారు. డాక్టర్ గారు కూడా సినిమా గురించి వివరిస్తూ స్టోరీ లోకి తీసుకెళ్తారు. రాజమౌళి గారు తొక్కలో ఈగతో చిరులా, జూ. ఎన్టీఆర్ లా, మహేష్ బాబు లా ఎలా డాన్స్ చేయించిందీ ఈ వైద్య కార్యక్రమం లో చూపించారు.  దొరికిన సినెమా క్లిప్స్ ను బట్టి కాపీ ని సాగతీసి నానా గందరగోళం సృష్టించారు.  

"డాక్టర్ ఫ్రెండ్" ప్రోగ్రాంలో 'ఈగ' సినిమా గోల ఏల? అన్నిది నాకు అంతు చిక్కలేదు. ఇకపోతే... మొన్నీ మధ్యనే ఆరంభమైన ఈ 10 టీవీ ఛానెల్ మొదటి వారం లోనే టాం రేటింగ్ లో ABN, HM-TV వంటి ఛానెల్స్ తలదన్ని ఏడో  స్థానం పొందడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పైన చెప్పుకున్న 3 Cs, 1 D లను తగ్గించి మూసలో కొట్టుకుపోకుండా ఈ ఛానెల్ నిజమైన ప్రత్యామ్నాయం అందించాలని, వచ్చే వారం అన్ని ఛానెల్స్ మెరుగైన కార్యక్రమాలు ప్రసారం చేయాలని అభిలషిస్తూ... ఉంటా. 

Monday, March 25, 2013

ఘనంగా జీ టీ టీ ఏ రెండో వార్షికోత్సవం

దాదాపు రెండున్నరేళ్ళ కిందట మేము స్థాపించిన గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీ టీ టీ ఏ) రెండో వార్షికోత్సవం కాస్త ఆలస్యంగా నిన్న (ఆదివారం) రాత్రి ఖైరతాబాద్ లోని NKM's Grand హోటల్ లో ఘనంగా నిర్వహించాము. ఒక గంట పాటు మీటింగు, మరొక గంట పాటు డిన్నర్ బాగా సాగాయి. 

ఈ సందర్భంగా... గత ఏడాది రాష్ట్రానికి ఏడు పతకాలు సాధించి పెట్టిన మా అకాడమీ అమ్మాయి ఆకుల శ్రీజ తో పాటు, CBSE nationals లో సిల్వర్ మెడల్ తెచ్చిన స్నేహిత్ ను ఇతర క్రీడాకారులను నగదు బహుమతితో మేము సత్కరించాము.  
సోం నాథ్ ను సత్కరిస్తున్న రేఖా మేడం, తులసి గారు, హేమ 
అకాడమీకి జీవితాన్ని అంకితం ఇచ్చిన మా కోచ్ సోంనాథ్ ఘోష్ ను పూలగుత్తి, శాలువా, మొమెంటో తో పాటు నగదు బహుమతి తో మేము సన్మానించాము. ఇప్పుడు ఇండియా నంబర్ త్రీ గా ఉన్న శ్రీజ పేరెంట్స్ (శ్రీమతి సుధ, శ్రీ ప్రవీణ్) లను కూడా ఉచిత రీతిన సత్కరించాం. GTTA కోసం మేము బాగా పనిచేస్తున్నానని చెప్పి  కోచ్, ఇతర పేరెంట్స్ నన్ను, హేమను కాస్త ఇబ్బంది పెట్టారు. అదీ ఆదివారం సంగతి. ఇక ఈ ఫోటోలు వీలుంటే చూడండి. 
కోచ్ సోం నాథ్ ను సత్కరిస్తున్న శ్రీజ పేరెంట్స్ ప్రవీణ్, సుధా మేడం  

 శ్రీజ పేరెంట్స్ ప్రవీణ్, సుధా మేడం లను సత్కరిస్తున్న GTTA అధ్యక్షుడు రావు, వారి భార్య తులసి గారు 
శ్రీజ, స్నేహిత్ లకు నగదు బహుమతి ఇస్తున్న HDFC sr.vice-president రాం దాస్ భరతన్  


 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇకిలిస్తున్న డాక్టర్ రాము :) 

 కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న స్నేహిత్ 

రాము, హేమలకు అనవసర సత్కారం 

Monday, March 11, 2013

కూడబలుక్కుని మాట్లాడుతున్న పెసింగి భాస్కర్

మిత్రులారా... మీతో ఒక మంచి వార్తను పంచుకోవడానికి ఈ పోస్టు రాస్తున్నాను. ఈనాడు, ఈ-టీ వీ, టీ వీ -ఫైవ్, జెమిని టీ వీ లలో పదిహేను ఏళ్ళకు పైగా పనిచేసి చివరకు డెక్కన్ క్రానికల్ విజయవాడ రిపోర్టర్ ఉండగా 2009 జులై లో పెరాలిసిస్ స్ట్రోక్ తో జీవన నావ తలకిందులైన సీనియర్ జర్నలిస్టు పెసింగి భాస్కర్ క్రమంగా బాగా కోలుకుంటున్నారు. కుడి చెయ్యి, కాలూ స్వాధీనం లోకి రాకపోయినా... ఆయన కూడబలుక్కుని మాట్లాడుతున్నారు. స్ట్రోక్ వల్ల జ్ఞాపకశక్తి పోయిన ఆయన ఇప్పుడిప్పుడే మేధో పరంగా కోలుకుంటున్నారు.  కొందరు మిత్రులు, కొన్ని సంఘటనలు ఆయనకు గుర్తుకు వస్తున్నాయి.

విధి వక్రించిన ఆ రోజున ఆయన డీ సీ కోర్టు కేసు కోసం చెన్నై వెళ్లారు. అక్కడ పని చూసుకుని రైల్వే స్టేషన్ కు వచ్చారు. అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉండగా రైల్వే పోలీసులు గమనించారు. "అక్కడ అన్నం తిన్నాను. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. ఒక నెలపాటు ఏమి జరిగాయో నాకు తెలియదు," అని ఒక గంట క్రితం నాతో మాట్లాడుతూ భాస్కర్ చెప్పారు. సంభాషణలో సరైన పదాలు వాడడం కోసం ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లిష్ పేపర్లు బాగా కూడబలుక్కుని చదువుతున్నారు. కుడి చేయి దెబ్బ తినడం తో ఎడమ చేత్తో రాత ప్రాక్టిస్ చేస్తున్నారు. అక్షరాలు  ముత్యాల్లా  ఉన్నాయి. దటీజ్ భాస్కర్ సార్. 

నా లెక్క ప్రకారం మరొక పది, పన్నెండు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారు. "నాకు ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం ఉంది. ఆరాటం గా ఉంది," అని భాస్కర్ గారు అన్నారు. కొందరు మిత్రులు ఆయనకు బాగా గుర్తున్నారు. ఇద్దరం కలిసి సినిమా కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 
గల గలా మాట్లాడే భాస్కర్ గారిని అలా చూడడం బాధగా ఉన్నా ఆయన మనో నిబ్బరం, మేడం గారి ధైర్యం నాకు స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. 

జర్నలిజంలో శిక్షణ పొంది ఈనాడు లో కొన్నేళ్ళు పనిచేసిన మేడం గారు ఇప్పుడు టీచర్ గా పనిచేస్తున్నారు. భాస్కర్ గారికి ఇలా కావడంతో వారి కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మేయాల్సివచ్చింది. జర్నలిస్టు కాలనీ స్థలం కూడా ఖర్చుల ముందు నిలవ లేదు. మేడం గారి రెక్కల కష్టం మీద కుటుంబం నడుస్తున్నది. "చాలా మంది కన్నా మేము అదృష్టవంతులం సార్. మందులు, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల తొందరగా కోలుకుంటున్నారు," అని మేడం చెప్పారు. ఆమె గుండె ధైర్యానికి జోహార్లు. 

'మరి డీ సీ సహకరించలేదా?,' అని నేను భాస్కర్ గారిని అడిగాను. 'వాళ్ళు ఒక ఏడాది పాటు జీతం ఇచ్చారు. ఉద్యోగులతో పాటు ఫస్టున జీతం ఇచ్చారు' అని ఆయన చెప్పారు. ఆ తర్వాత రాజీనామా చేయమని చెప్పినట్లు మేడం తెలిపారు. తనను 'ఆంధ్రభూమి'లో  అప్లై చేయమని పరీక్ష కూడా పెట్టారట. పరీక్ష బాగా రాసారని చెబుతూనే... ఖాళీలు ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పి పంపారట. అక్కడున్న శాస్త్రి గారు, బ్యూరో చీఫ్ కృష్ణారావు గారు పట్టించుకుంటారా?

ఇవ్వాళ భాస్కర్ గారిని కలవడం గమ్మత్తు గా జరిగింది. నిన్న నా మౌనవ్రతం. కొందరు ముఖ్యులతో సహా ఏ నర మానవుడు ఫోన్ చేసినా ఎత్తలేదు. కానీ భాస్కర్ గారి నంబర్ నుంచి రావడం తో వ్రతాన్ని గట్టున పెట్టి వెంటనే కాల్ తీసుకున్నాను. సార్ కాస్త స్పష్టంగా మాట్లాడే సరికి చాలా ఆనందమేసింది. రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను... అని చెప్పాను. ఆ ప్రకారం ఇవ్వాళ వెళ్లి కలిశాను. ఈ కుటుంబానికి శుభం కలుగు గాక! 

ఆయనతో కలిసి పని చేసిన సీనియర్ మిత్రులు ఇప్పుడు టీ వీ నైన్, సాక్షి, ఈ టీ వీ లలో పెద్ద హోదాల్లో ఉన్నారు. వీరు బిజీ బీస్, బిగ్ పే పాక్స్. మనిషి బాగున్నప్పుడు హడావుడి చేయడం కాదు బ్రదర్స్... ఇలాంటి సమయంలో భాస్కర్ గారిని కలిసి మనోధైర్యం ఇవ్వండి. ఒట్టు... ఆయన మిమ్మల్ని జాబ్ అడగరు, డబ్బులు అడగరు. 
  
భాస్కర్ గారి గురించి నేను గతంలో రాసిన పోస్టు లింకు కోసం ఇక్కడ ప్రెస్ చేయండి. 

Friday, March 8, 2013

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

పైశాచిక ఆనందం కోసమో, పైత్యం ప్రకోపించో, పిచ్చి ముదిరో, బీ పీ పెరిగో, అదే గొప్పనుకొనో భర్తలు పెట్టే హింసలను కుటుంబ వ్యవస్థ కోసం మౌనంగా నెగ్గుకొస్తున్న గృహిణులకు... 

కల్చర్ లేని పంది కొక్కుల్లాంటి బాసుల చేతిలో వివిధ రకాలైన సెక్సువల్ హింసకు గురవుతూ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తపిస్తోన్న ఉద్యోగినులకు....

ప్రేమ పేరుతో రిలేషన్ లోకి దింపబడి  మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నా పరువు కోసం, ప్రతిష్ట కోసం బాధలు దిగమింగుకుని బతుకుతున్న యువతులకు...  

'మగ' అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తో స్కూళ్ళలో, కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లో చెలరేగి చులకన చేసే పిచ్చి కుక్కలను భరిస్తూ చదువుల తల్లుల్లా వెలిగిపోతున్న విద్యార్థినులకు...

వెకిలి చూపులను, నీచ కామెంట్లను, తడిమి కుతి తీర్చుకోవాలానుకునే జులాయి వెధవలను వీధుల్లో, బస్సుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో కామ్ గా భరిస్తూ బతుకు సమరం సాగిస్తున్న విద్యార్థినులకు, యువతులకు, ఉద్యోగినులకు, గృహిణులకు... 

అడుగడుగునా లింగ వివక్ష, ఇతరేతర అవాంతరాలు ఎన్ని ఉన్నా...అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్న అక్క చెల్లెళ్ళకు....

పరిస్థితుల ప్రభావం వల్ల... సెక్స్ వర్కర్లుగా, ఫ్యాక్టరీ లలో కార్మికులుగా,  పని మనుషులుగా బతుకు బండి లాగిస్తూ నిత్య సమరం చేస్తున్న స్త్రీ మూర్తులకు....       

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
(ఇదే రోజు పుట్టిన మా కూతురు మైత్రేయికి ఈ పోస్టు అంకితం)

Tuesday, March 5, 2013

మీడియాపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారి వ్యాసం

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ గారి బ్లాగు (సంభాషణ) నుంచి సంగ్రహించి ఎడిట్ చేసిన వ్యాసం ఇది. వారికి థాంక్స్.... రాము
--------

 సమాజ సంక్షేమానికి కానీ, దురన్యాయాలకి కానీ ప్రజాజీవితంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే. ఇటీవలి కాలంలో, రాజకీయ నేతలను, అధికారులను నిలదీసి ప్రశ్నించే ధోరణి పెరుగుతున్నట్టే, మీడియా పాత్ర గురించిన ప్రశ్నలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తి విస్తరిస్తున్నదనడానికి ఇది ఒక సంకేతం కూడా కావచ్చు.

'నిర్భయ' సంఘటనగా ప్రసిద్ధమయిన ఢిల్లీ సామూహిక అత్యాచారానికి ప్రజల్లో అంతటి స్పందన ఎందుకు వచ్చిందో, మీడియా కూడా దానికి విశేష ప్రాధాన్యం ఎందుకు ఇచ్చిందో - అంత సులువుగా అంతుబట్టే విషయం కాదు. నిత్యం అటువంటివో, అంతకు ఎక్కువవో, తక్కువవో అనేకం జరుగుతున్నా రాని స్పందన ఆ సంఘటనకు ఎందుకు లభించిందన్నది పాత్రికేయులకు కూడా కలిగిన ప్రశ్నే. ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయో,
అగ్రకులానికి చెందిన అమ్మాయో అయి ఉంటే, వెంటనే సులువైన నిర్ధారణలు చేయడానికి ఆస్కారం ఉండేది. ఆ అమ్మాయి పేదకుటుంబానికి చెందినదీ, వెనుకబడిన కులానికి చెందినదీ. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత చదువుల కోసం దేశరాజధానికి వచ్చిన ఒక సాధారణ యువతికి ఎదురయిన దుర్మార్గం- ఎందుకు పట్టణ ప్రాంతాల మధ్యతరగతి, ఉన్నత తరగతుల బాలికలను, యువతులను, మగపిల్లలను కూడా బాగా కదిలించింది. ఆగమేఘాల మీద ఒక చట్టం రూపొందించి, స్వయంగా సోనియాగాంధీ బాధితురాలి ఇంటికి వెళ్లి నివేదించే దాకా ఆ కదలిక పనిచేసింది. పట్టణప్రాంతంలో నివసిస్తున్న యువతి కావడం, అత్యాచారం, హింస జరిగిన పద్ధతుల్లోని అమానుషత్వం - ఒక వర్గం యువతీయువకులను తీవ్రంగా కలవరపరచి ఉండాలి, అటువంటి హింస తమకు కూడా తారసపడే ప్రమాదం ఉన్నదని వారు భావించి ఉండాలి. అటువంటి మమత్వాన్ని ఆపాదించుకోలేరు కాబట్టే, ఆ యువజనం గ్రామీణ అత్యాచారాల గురించి ఉదాసీనంగా ఉంటారనుకోవాలి.

మరి మీడియా కూడా అట్లా ఎందుకుంది? మీడియాలో కూడా పట్టణ మధ్యతరగతి లక్షణాలుంటాయి కాబట్టి అట్లా ఉన్నదా? ఆంగ్ల మీడియా పాఠకులు, పాత్రికేయులు అందరూ అటువంటి తరగతుల వారు కాబట్టి వారి స్పందన అట్లా ఉన్నదనుకున్నా, గ్రామీణ విలేఖనంలో ఆరితేరి, మారుమూల గ్రామాల వార్తలను కూడా విశేషంగా ఆదరిస్తున్న భాషాపాత్రికేయుల తీరు భిన్నంగా ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు మీడియా పరిధిలో మాత్రమే సమాధానాలు వెదికితే ప్రయోజనం లేదు. మీడియా మీద ఉన్న అపోహలు, అత్యాశలు, అజ్ఞానాలు అన్నీ పక్కనబెట్టి వాస్తవికమైన ఆలోచన చేయాలి. మీడియా వల్ల ఉద్యమాల సృష్టి జరుగుతుందా? ఉద్యమాలు జరుగుతుంటే వాటిని మీడియా రిపోర్టు చేస్తుందా? ఒక వార్తనుగానీ, అభిప్రాయధోరణిని కానీ వ్యాపింపజేయడంలో వాహికగా మీడియా శక్తిశాలిగా పనిచేసే మాట నిజమే కానీ, దానంతట అదే వార్తను సృష్టించలేదు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి పట్టణ యువజనంలో కదలిక వచ్చిన తరువాత మీడియా దాన్ని ప్రముఖంగా ప్రచారం చేసింది. ప్రజల్లో వచ్చే అన్ని కదలికలనూ మీడియా అంతే తీవ్రతతో ప్రచారం చేస్తుందా?- అంటే, ఆయా కదలికల విషయంలో సమాజం స్పందించడానికి కీలకంగా పనిచేసే ప్రేరకాలకు, వాటికి ఉన్న ఆమోదానికి లోబడి చేస్తుంది అని చెప్పాలి.

ఒక సమాజం ప్రధాన విలువల సంపుటి ఆ సమాజంలోని ప్రాబల్యవర్గాలకు అనుకూలమైన, యథాతథస్థితిని కొనసాగించే విలువలతోనే అధికంగా నిండి ఉంటుంది. ఆ విలువలను మార్చే ప్రయత్నాల విషయంలో ఎంత సహనం, అనుమతి ఉంటాయి అన్నది అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మీడియా కూడా సమాజంలోని ప్రధాన విలువల సంపుటినే అధికార విలువలుగా స్వీకరిస్తుంది. కాకపోతే, దానికి ఉన్న ప్రజాస్వామికమయిన హోదా కారణంగా- భిన్నమయిన విలువల విషయంలో, విలువల మార్పు కోసం జరిగే ప్రయత్నాల విషయంలో అధికమయిన సహనం ప్రదర్శించగలుగుతుంది, స్థలం ఇవ్వగలుగుతుంది. అంతే తప్ప, మీడియా తనంతట తానే ఒక ప్రత్యామ్నాయవేదిక కాదు. సమాజంలో ప్రగతిశీల శక్తులకు వ్యాప్తి, బలం పెరుగుతున్న కొద్దీ మీడియాలో కూడా ప్రజాస్వామికభావాల ప్రాబల్యం పెరుగుతుంది. అంతేకాదు, సమాజాన్ని మీడియా సంస్కరించడం ఒక ఆదర్శమయితే కావచ్చును కానీ, సామాజిక, ప్రగతిశీల ఉద్యమాల నుంచి మీడియా మెరుగైన సంస్కారాన్ని పొందడం ఒక వాస్తవం. గత మూడు నాలుగు దశాబ్దాలలో వివిధ ఉద్యమాలు తీసుకువచ్చిన కొత్త విలువలను, సున్నితత్వాలను మీడియా ఎంతో కొంత స్వీకరించి, తనను తాను ఉన్నతీకరించుకున్నది.

మైనారిటీల హక్కుల కోసం ప్రధానంగా కృషిచేసే సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ మహమ్మద్ లతీఫ్ ఖాన్ ఇటీవలి బాంబు పేలుళ్ల అనంతరం మీడియాలో వ్యక్తమవుతున్న దర్యాప్తు, తీర్పుల ధోరణిపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. పేలుళ్ల టెర్రరిజంతో పాటు మీడియా టెర్రరిజం కూడా మైనారిటీలను బాధిస్తున్నదని ఆయన ఆవేదన. ఒక వర్గం వారే దోషులన్న పద్ధతిలో వ్యవహరించడం కానీ, ఏ ఆధారాలూ లేకుండానే వారి పేర్లను అనుమానితులుగా పదే పదే పేర్కొనడం కానీ న్యాయమని ఎవరూ అంగీకరించరు. పేలుళ్ల వల్ల జరిగే నష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కానీ, ఇటువంటి మూస ఆలోచనలను పరిపుష్టం చేయడం వల్ల దీర్ఘకాలికమయిన విభజన ప్రజల్లో ఏర్పడుతుంది. దోషులు ఏదో ఒక మతానికి చెందినంత మాత్రాన, ఆ మతం వారందరినీ అనుమానించే మూస మనస్తత్వం మీడియాకు ఉండకూడదు. కానీ, సంక్షోభ, కల్లోల సమయాల్లో మీడియా తన ప్రజాస్వామిక ఆదర్శాలను విస్మరించే ఒత్తిడికి లోనవుతుందని తెలుసుకోవాలి. తెలుసుకుని, అర్థం చేసుకుని, క్షమించాలని ఇక్కడ ఉద్దేశం కాదు. సమాజంలో బలంగా వ్యాపించిన భావోన్మాదానికి, గొర్రెదాటు తత్వానికి మీడియా ఆ క్షణంలో ఎదురువెళ్లే సాహసం చేయకపోగా, అడపాదడపా ఉలిపికట్టెగా వ్యవహరించిన పాపాన్ని కడిగివేసుకునేందుకు వీలయినంత తీవ్రంగా సమాజ భక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పని మీడియా చేస్తుందని అంటారు కానీ, ఆ పనికి కూడా మీడియా వాహిక మాత్రమే. జనాభిప్రాయాన్ని నిర్మించడానికి రకరకాల సంఘటనలను, పరిణామాలను కల్పించడం, రకరకాల అభిప్రాయాలను గుప్పించడం, వాస్తవాలను నిర్ధారించుకునేంత తెరపిలేకుండా సమాచారాన్ని వెదజల్లడం, ఇతర భావప్రసార మాధ్యమాల ద్వారా జనమనోభావాలను ఎప్పటికప్పుడు ఉద్రిక్తం చేస్తూ ఉండడం- ఇటువంటివే అనేక మార్గాలను వ్యవస్థను నడిపించే శక్తులు ఆశ్రయిస్తూ ఉంటాయి. మీడియా చేసేదల్లా ఆ ప్రయత్నాలకు విధేయమైన ప్రతిధ్వనులను అందించడమే. సంక్షోభాల్లో, కల్లోలాల్లో భిన్నమయిన గొంతును, బలహీనమైన గొంతును వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, అందువల్ల పలకడానికీ ఎవరూ సిద్ధంగా ఉండరు.

మీడియా ఒక వ్యవస్థగా అగ్రవర్ణ స్వభావాన్నో, మైనారిటీ వ్యతిరేకతనో కలిగి ఉండదని ఎవరూ అనరు. వ్యవస్థలోని సమస్త అవలక్షణాలూ, ప్రయోజనాలూ మీడియాలోనూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. అయితే, ప్రత్యామ్నాయాలను నిర్మించేవారు, తమ గొంతును బలంగా వినిపిస్తే, మీడియాలోని ప్రగతిశక్తులు కూడా ఆ గొంతును ప్రతిధ్వనింపజేస్తారు. దళిత ఉద్యమం తన క్రియాశీల ఆచరణతో నేడు విస్మరించలేని స్థాయికి చేరుకున్నది. ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అనేక విలువలను మీడియా విధిగా గౌరవిస్తున్నది. మరి ఆ ఉద్యమం ప్రాధాన్యాలలో దళితబాధిత స్త్రీల అంశం మొదటివరుసలో చేరి ఉంటే, 'దళిత స్త్రీ శక్తి' ప్రశ్నిస్తున్న అంశాలపై మీడియా కూడా నేడున్న స్థితి కంటె మెరుగైన స్పందనశీలత కలిగి ఉండేదేమో? మత పరమైన అంశాల రిపోర్టింగ్‌లో కానీ, చిత్రణలో కానీ చిన్న పొరపాట్లు జరిగినా వెంటనే అభ్యంతరం చెప్పి ఉద్యమించే మైనారిటీ సోదరులను, మీడియాలో, సినిమాలలో తమను మూసగా చిత్రిస్తున్న ధోరణులను తీవ్రంగా నిరసించేటట్టు చైతన్యపరిచి ఉంటే, వారి కృషి నుంచి మీడియా కూడా నేటి కంటె మెరుగైన సున్నితత్వాన్ని అలవరచుకునేదేమో?

అధికార వ్యవస్థలకు చేసినంత కాకపోయినా, ప్రజా ఉద్యమాలకు కూడా మీడియా వేదికగా పనిచేస్తుంది. తమంతట తాము మీడియాను మరింతగా ఆవలిపక్షానికి నెట్టివేయకుండా ఉద్యమశక్తులు జాగ్రత్త పడాలి. క్షేత్రస్థాయిలో మనఃస్థితులను, వాస్తవికతలను మార్చేందుకు జరిగే ప్రయత్నాలు మీడియాను కూడా మారుస్తాయి.

సచిన్...సచిన్... సచిన్...

'క్రికెట్ మ్యాచ్ చూస్తావా'...అంటూ ఒక జర్నలిస్టు మిత్రుడు మొన్న రెండు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇచ్చాడు. భారత్- ఆస్ట్రేలియా టెస్టు మ్యాచుకు మనం పొయ్యేది లేదని వాటిని వేరే మిత్రుడికి ఇచ్చాను. కానీ నిన్న రాత్రి ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ లో ఆడతాడో లేదో? దేవదేవుడిగా భవిష్యత్తులో జనం చెప్పుకునే ఆటగాడిని దగ్గరి నుంచి చూసే భాగ్యాన్ని వదులుకోవడం తెలివితక్కువ తనం కాదా? అన్న సందేహాలు తెలెత్తాయి.  

టెస్టు మూడో రోజున కచ్చితంగా సచిన్ బాటింగ్ చేస్తాడన్నా గట్ ఫీలింగ్ కలిగింది క్రీడాభిమానులమయిన నాకు, నాపుత్ర రత్నానికి. ఇంకేం...మేము టికెట్లు సమర్పించిన మిత్రుడికి ఫోన్ చేశాను ఉన్నపళంగా. 'బాసూ నువ్వు వెళుతున్నావా?' అని అడిగాను. 'సెలవు లేదు...ఎవరికైనా సమర్పించి మంచి పేరు కొట్టెస్తాను..' అని చెబితే... 'బాబ్బాబు... ఆ పని మాత్రం చేయకు...చివరకు నేను, ఫిదెల్  వెళుతున్నాము..' అని వెళ్లి టికెట్స్ తెచ్చాను. 

ఈ మ్యాచు కవరేజ్ కోసం హేమ రోజూ వెళుతున్నది. నా రెండు దశాబ్దాల జర్నలిజం జీవితంలో ఒక్క ఇంటర్ నేషనల్ మ్యాచ్ అయినా కవర్ చేయాలన్న కల నెరవేరలేదు. ఇలా మ్యాచులు చూడడం తప్ప. నేను, మా వాడు పొద్దున్నే ఎనిమిది కల్లా పొట్ట నిండా తిని (అక్కడ పిజాలు, సమోసాలు, పఫ్ఫులు తప్ప ఏమీ దొరకవని తెలిసి) తొమ్మిదిన్నర కల్లా ఉప్పల్ స్టేడియం చేరుకున్నాం. 

ముందస్తుగా హేమ ఇచ్చిన సమాచారం మేరకు సెల్ ఫోన్లు ఇంట్లోనే పడేసి పోతూ పోతూ... కూర్చొని హాయిగా తినడానికని మాకు ఇష్టమైన చాక్లెట్లు కొనుక్కుని వెళ్లాం. చెకింగ్ పాయింట్లో వాళ్ళు ఆపారు. 'చాక్లెట్లు తిని లోపలకు రండి... ఏమీ తీసుకు పోనివ్వం' అని చెప్పారు మొహమాటం లేకుండా. 'పిల్లవాడి నైనా చాక్లెట్ తీసుకు రానివ్వండి...' అని మొత్తుకున్నా లాభం లేకపోయింది. మా చాక్లెట్లను విమానాశ్రయం లో బరువు ఎక్కువైతే విధి లేక పక్కన పారేసినట్లు పారేయడం ఇష్టం లేక..అక్కడే డ్యూటీ లో ఉన్న పోలీసు కు ప్రేమగా ఇచ్చాను. 

స్టేడియంలోకి ఏమీ తీసుకుపోనివ్వకపోవడం ఒక వ్యాపారపు ఎత్తుగడ. మన చాక్లెట్ మనలను చీకనివ్వకుండా...వాడు నియంత్రించేవి మాత్రమే మనం తినాలి... తూడ్త్. స్టేడియం బైట మన బట్టలు (లోదుస్తులు సహా) విప్పి.... వాడిచ్చే బట్టలతో లోపలికి  వెళ్లి మ్యాచ్ చూడాలన్న రూలు అతి త్వరలో వస్తుందన్న  అనుమానం పెనుభూతం అయ్యేలోపు పుజారా డబుల్ సెంచరీ చేశాడు. నేనూ ఆటలో నిమగ్నమయ్యాను.  

బాధ కలిగించిన విషయం ఏమిటంటే... సచిన్ ఆట చూడడం కోసం... మురళీ విజయ్ తొందరగా అవుట్ కావాలని స్టేడియం లో అంతా భావించడం. ఇదేమి ముదనస్టపు ఆలోచనో నాకు అర్థం కాలేదు. అప్పటికే 'సచిన్...సచిన్..' అని అరవడం ఆరంభించారు. మురళీ విజయ్ కి వ్యతిరేకంగా కంగారూలు ఎల్.బీ. కోసం అరిస్తే... మన క్రీడాభిమానులు 'హౌ ఈజ్ ఇట్ అంపైర్' అని ఆస్త్రేలియన్లతో గళం కలిపారు. వీళ్ళ హంగామా చూసి మా వాడు తలకాయ కొట్టుకున్నాడు. మధ్యలో ఒక 180 పెట్టి అదేదో డామినోస్ పిజా తిన్నాడు. నేనూ ఇలాగే ఆ చాక్లెట్ తినాలనుకున్నాను. లోపల చాక్లెట్స్ అమ్మరు.   సచిన్ కానీ, ధోనీ కానీ భారీ సిక్సర్ కొట్టాలనీ, అది నేరుగా తన వైపు వస్తే...తాను దాన్ని కాచ్ పట్టాలని ఉందని మా వాడు రెండు సార్లు చెప్పాడు. చిన్నప్పుడు నాకూ అదే ఆలోచన ఉండేది.  

వీళ్ళ ఏడుపు కొట్టి...ఒక రాంగ్  షాట్ కొట్టి మురళీ విజయ్ అవుట్ అయ్యాడు. జనం ఆనందించారు, వారి ఆరాధ్య దైవం సచిన్ వచ్చాడు. స్టేడియం హర్షాతిరేకాలతో దద్దరిల్లింది. జనం ఆనందానికి అవధులు లేవు. మాబ్ సైకాలజీ లో చిక్కుకున్న నాకూ సంతోషమేసింది...పొట్టి సచిన్ ను చూడగానే. భలే బాగున్నాడు. చక్కని ఆటగాడు. అంతకన్నా ముఖ్యంగా పొగరూ అహంకారం లేని మనిషని అంటారు. 

సచిన్ మోర ఎత్తగానే...అటువైపు స్టాండ్ లో ఉన్నవాళ్ళు ఆనందం తో కేకలు వేసారు. ఇటు చూడగానే... ఇటు వైపు కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి కేరింతలు కొట్టారు. ఎటు చూసినా సచిన్ నామస్మరణే. ఇంత చేస్తే... మొత్తం మీద అర్థగంటలో ఒకే ఒక్క ఫోర్ కొట్టి సచిన్ అవుటై వెళ్ళిపోయాడు. జనం ఉస్సూరుమన్నారు. సచిన్ వీలు దొరికినప్పుడల్లా ఈ పై ఫోటో లో మాదిరిగా నిలబడడం... తోటి బ్యాట్స్ మెన్  భుజం తట్టి ప్రోత్సహించడం గమనించాను. 

మన జనం క్రికెట్ పిచ్చను చూసి నా మతి పోయింది. లంచ్ బ్రేక్ సమయంలో ఆస్ట్రేలియా కోచ్ లు రిజర్వ్ ఆటగాళ్లకు క్యాచ్ ల ప్రాక్టిస్ చేయించారు. వాళ్ళు బౌండరీ లైన్ దగ్గర చక్కని క్యాచ్ పట్టినా... అక్కడ ప్రాక్టిస్ లో భాగంగా ఉంచిన రబ్బర్ స్టంపును వాళ్ళు గురితప్పకుండా కొట్టినా.... సీరియస్ మ్యాచులో కొట్టినట్లు డబ్బిడి దిబ్బిడి చప్పట్లు కొట్టారు మన వాళ్ళు.

క్రికెట్ బాగుంటుందా... నువ్వు ఆడుతున్న టేబుల్ టెన్నిస్ బాగుంటుందా... అని మధ్యలో అడిగాను మా వాడిని. "టీ టీ నాకు ఇష్టం... క్రికెట్ కూడా ఇష్టమే..." అని ఆగాడు. మళ్ళీ తానే చెప్పాడు... "... క్రికెట్ లో అయితే మనీ ఎక్కువ ఉంటుంది..." అని. పన్నెండేళ్ళ ప్రాయంలో ఎంత జ్ఞానం అబ్బిందో! అని నవ్వాలో...మైదానంలో కన్నా డ్రాయింగ్ రూంలో బహు సుందరంగా క్రికెట్ మ్యాచులను, విశ్లేషణలను తెస్తూ ప్రజల పరిజ్ఞానాన్ని ఇంతలా పెంచుతున్న ఇడియట్ బాక్సు ను చూసి ఏడవాలో తెలియలేదు.  
Photo courtesy: Nareshsiva, Flickr

Friday, March 1, 2013

నిర్లక్ష్యంలో సమన్వయం: పేలుళ్ళ పై సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయలు

దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళ నేపథ్యంలో టెలివిజన్ ఛానెల్స్ లో మంచి చర్చలు జరుగుతున్నాయి. వివిధ ఛానెల్స్ జరిపిన చర్చల్లో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలతో సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు గారు ఒక పోస్టు నాకు మెయిల్ చేశారు. అది యథాతథం గా ఇక్కడ ఇస్తున్నాను. రావు గారికి థాంక్స్... రాము
-------------------
హైదరాబాదులో గత గురువారం సాయంత్రం జరిగిన ఘోర కలి గురించి రెండు మూడు రోజులుగా అనేక టీవీ ఛానళ్ళు వరసగా పలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసాయి. వాటిల్లో పాల్గొన్న సందర్భాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇది అక్షర రూపం.

“ఉగ్రవాద ఘాతుకాలను శత్రు దేశం సాగించే యుద్ధంతో సమానంగా పరిగణించాలి. ఈ చర్యలకు బలై పోయినవారినీ, అంగవైకల్యం పొందినవారినీ ప్రభుత్వం ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆదుకోవాలి. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలు అనే షరా మామూలు ప్రకటనలతో సరిపుచ్చకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి లేదా గాయపడిన వీర సైనికులకు అందచేస్తున్న తరహాలో వారికీ, వారి కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన సాయం అందించాలి.


 ‘గాయపడిన వారికి మెరుగయిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించాం’ అంటూ చేస్తున్న ప్రకటనలను టీవీల్లో చూస్తూ, గతంలో జరిగిన సంఘటనల్లో అంగవైకల్యం పొంది ఇప్పటిదాకా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు ఎంతగా రగిలిపోతుంటారో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక బాధ్యతగా టీవీ ఛానళ్ళు అలనాటి దురదృష్టవంతుల దీన గాధలను మరోమారు ప్రసారం చేసి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి.” 

“ దిల్ సుఖ్ నగర్ ఘాతుకానికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ. నిఘావిభాగం ముందస్తుగా చేసిన హెచ్చరికలు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటవెంటనే తెలియచేసామని చెప్పి ఆయన చేతులు కడిగేసుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థల బృందాలను హైదరాబాదు పంపుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మొత్తం దేశానికి హోం మంత్రి అయిన ఆయన తనకు అందిన సమాచారాన్ని బట్వాడా చేసి వూరుకోకుండా మరికొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుని వుంటే కొంత ప్రయోజనం వుండేది. అలా కాకుండా సంఘటన జరిగిన తరువాత హైదరాబాదు వచ్చివెళ్లడం కేవలం కంటితుడుపు చర్యగా జనం భావిస్తే తప్పుపట్టాల్సింది వుండదు.”

“కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలను రొటీన్ వ్యవహారంగా భావించామని, ఇంత ఘోరం జరుగుతుందని వూహించ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి అన్నట్టు ఈ ఉదయం పత్రికల్లో, మీడియా స్క్రోలింగు లలో వచ్చింది. ఇదే నిజమయితే, బాధ్యతారాహిత్యానికి అసలు సిసలు పరాకాష్ట అనే చెప్పాలి.”


“ఈ దుర్ఘటనకు నిరసనగా భారత్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం సహేతుకంగా లేదు. ప్రజలు ఆందోళనలో వున్నప్పుడు వారికి బాసటగా నిలవాలే కాని, బంద్ లు, రాస్తా రోఖోలు వంటి కార్యక్రమాలద్వారా వారి ఇబ్బందులను మరింత పెంచకూడదు. ప్రతిపాదిత సడక్ బంద్ ను వాయిదా వేసుకుంటున్నట్టు టీ.ఆర్.ఎస్. ప్రకటించడం హర్షణీయం.”


“షిండే వచ్చివెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ వస్తున్నారు. పాదయాత్రకు విరామం ఇచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాదు వస్తున్నట్టు ఇప్పుడే టీవీ స్క్రోలింగు లలో వస్తోంది. రేపో మాపో ప్రధానమంత్రి రావచ్చు. ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా వెనుకబడే ప్రసక్తి వుండదు. ఇంతమంది వచ్చి చేసేదేమీ వుండదు. కానీ రాజకీయంగా వారికిది తప్పనిసరి. వస్తే, వీరు వచ్చి చేసిందేమిటి అంటారు.రాకపోతే వీళ్ళకు జనం ప్రాణాలు అంటే పూచికపుల్లలతో సమానం అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. అందువల్ల రాకతప్పదు. ఆలాంటప్పుడు అనుచరగణంతో హడావిడి చేయడం కాకుండా, విధి నిర్వహణలో వున్న పోలీసులను ఇబ్బంది పెట్టకుండా బాధితులను పరామర్శించి వెళ్ళే పద్ధతికి స్వీకారం చుట్టాలి. వూరికే వచ్చాం,చూసాం,వెళ్ళాం అని కాకుండా తమ పార్టీల తరపున బాధితులకు ఎంతో కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.”


“పేలుడు సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రధాన పత్రికల్లో ప్రచురించిన ఫోటోలు చూడండి. శరీరాలు చిద్రమై రోడ్డున పడివున్నవారి దాపుల్లో అక్కడక్కడా మంటలు చెలరేగుతూనే వున్నాయి. అంటే పేలుడు జరిగిన కొద్ది సేపటిలోనే మీడియా వారు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగలిగారు. ఆ ఫోటోలను పరికించి చూస్తే ఒక్క పోలీసు జవాను కూడా కనబడడు. పేలుడు జరిగిన తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. అప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే. రోప్ పార్టీలతో కూడిన రక్షణ వలయాలే.”


“దుర్ఘటన జరిగిన దరిమిలా పోలీసులు రెచ్చిపోయి సోదాలు , తనిఖీలు చేస్తూ జనాలకు నరకం చూపించడం పరిపాటిగా మారింది. నివారణ కన్నా పోస్ట్ మార్టం చర్యలపట్ల వాళ్లకు ఆసక్తి మెండు అని వచ్చే విమర్శలకు కారణం ఇదే. 


“ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం అమెరికాకే సాధ్యం కాలేదు. కాని జరిగిన తరువాత ఏం చేయాలి అన్న విషయంలో మన దగ్గర ఇంకా అయోమయమే. సమన్వయ లోపం కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. పోనీ ఇది మొదటిసారా అంటే కాదు. గతంలో కూడా జరిగాయి. కానీ వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకున్న దాఖలా కనబడడం లేదు. ఉగ్రవాదులకు హైదరాబాదు అడ్డాగా మారిందని అంతా అంటూ వుంటారు. కానీ చేతల్లో పూజ్యం.”


“ఇలాటి సంఘటనలు పునరావృతం కానివ్వమన్న ప్రకటనలే పునరావృతం అవుతుంటాయి. పేలుళ్లు సరేసరి. అసమర్ధ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రత్యర్ధులు అంటుంటారు. వారు అధికారంలో వున్న రోజుల్లో కూడా ఇలాటి ఉగ్రవాద దాడులు జరిగిన సంఘటనలు మాత్రం మరచిపోతుంటారు. రాజకీయ జోక్యం లేకపోతే వీటిని అరికట్టడం సాధ్యమని రాజకీయ నాయకులే చెబుతూ వుండడం విడ్డూరం.”


“సీ.సీ. కెమెరాల సాయంతో మొన్నటికి మొన్న సైబరాబాదు పోలీసులు ఒక మహిళపై అత్యాచారం చేయబోయిన దుండగులను ఇరవై నాలుగు గంటలు గడవకముందే అరెస్టు చేశారు. మరి, దిల్ సుఖ్ నగర్ లో సీ.సీ. కెమెరాల వైర్లు ఎవరో రెండు రోజులక్రితమే కత్తిరించారని అంటున్నారు. తీగెలు కత్తిరిస్తే, ఆ ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడాల్సిన సిబ్బంది ఏమి చేస్తున్నట్టు. పలానా ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా ఒక్క దృశ్యము రికార్డు కాలేదని యెందుకు తెలుసుకోలేకపోయారు? అలాగే పోలీసు కమీషనర్ సాయిబాబాబా గుడికి వెళ్లడం వల్ల అక్కడ పోలీసుల హడావిడి గమనించి ఉగ్రవాదులు తమ టార్గెట్ ప్రాంతాన్ని మార్చుకున్నారని అంటున్నారు. అంటే ఏమిటి, పోలీసుల నిఘా వుంటే ఉగ్రవాదుల ఆటలు సాగవనే కదా. ఉగ్రవాద దాడిని గురించి ముందస్తు సమాచారం వున్నప్పుడు దాన్నేదో అతి రహస్యం కింద దాచిపెట్ట కుండా అమెరికా వాళ్లు తమ పౌరులను హెచ్చరించినట్టు నగరంలో రద్దీగా వుండే ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసి వుండాల్సింది. పోలీసులను మోహరించి, పోలీసు జాగిలాలను ఆయా ప్రాంతాలలో తిప్పి వుండాల్సింది.” 

(24-02-2013)
(సాక్షి, దూరదర్శన్ సప్తగిరి, హెచ్.ఎం.టీ.వీ., టీవీ -5, స్టూడియో ఎన్, వీ 6 న్యూస్, మహా టీవీల సౌజన్యంతో)

--